లేఖన కథలు
పౌలు యొక్క రోమ్‌ ప్రయాణంలో జరిగిన అద్భుతాలు—ప్రభువు తన సేవకుడిని ఆశీర్వదిస్తారు


అపొస్తలుల కార్యములు 21–22; 26–28

పౌలు యొక్క రోమ్‌ ప్రయాణంలో జరిగిన అద్భుతాలు

ప్రభువు తన సేవకుడిని ఆశీర్వదిస్తారు

పౌలు యెరూషలేములో ఖైదు చేయబడ్డాడు.

పరిశుద్ధాత్మ పౌలును యెరూషలేముకు వెళ్ళమని చెప్పాడు. పౌలు యేసు క్రీస్తు గురించి బోధించిన విషయాలు అక్కడ చాలామందికి నచ్చలేదు. వారు అతనిని ఖైదుచేసి గొలుసులతో బంధించారు. పౌలు తాను పరలోకం నుండి వెలుగును చూసిన సమయం, యేసు స్వరం విన్న సమయం మరియు బాప్తిస్మము తీసుకున్న సమయం గురించి అందరికీ చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 21:4, 12–13, 27–40; 22:1–16

చెరసాలలో పౌలుకు ప్రత్యక్షమైన యేసు.

పౌలును చెరశాలలో వేశారు. అతను అక్కడ ఉండగా, యేసు పౌలుకు ప్రత్యక్షమై, “పౌలు, ధైర్యముగా ఉండుము” అని అన్నారు. పౌలు రోమ్‌లో తన గురించి సాక్ష్యం చెబుతాడని ఆయన అన్నారు

అపొస్తలుల కార్యములు 23:10–11

పౌలు యేసు క్రీస్తును గురించి సాక్ష్యమిస్తున్నాడు.

పౌలును అధిపతుల ముందుకు, రాజు ముందుకు తీసుకువెళ్లారు. ఆయన ఈ శక్తివంతమైన పాలకుల ఎదుట యేసు క్రీస్తు గురించి ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు. అందరూ యేసుయందు నమ్మకముంచాలని ఆయన కోరాడు.

అపొస్తలుల కార్యములు 24:10–27; 25:6–8, 17–19; 26:1–29

వాతావరణం మెరుగుపడే వరకు వేచి ఉండమని పౌలు ఓడ సిబ్బందికి చెప్పాడు.

చక్రవర్తి సీజరు ముందు తీర్పు పొందడానికి, రాజు పౌలను రోమ్‌కు పంపించాడు. పౌలు ఇతర ఖైదీలతో కలిసి ఓడలో ప్రయాణించాడు మార్గమధ్యంలో కొన్ని చోట్ల ఆగారు. ఒక చోట పౌలు త్వరలో శీతాకాలం వస్తుందని తెలుసుకున్నాడు. వారు ప్రయాణం కొనసాగిస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్పాడు. వాతావరణం మెరుగుపడే వరకు వేచి ఉండమని పౌలు ఓడ సిబ్బందికి చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 27:1–10

ఓడ తుఫానులో చిక్కుకుంది.

ఎవరూ పౌలు మాట వినలేదు, వారు ప్రయాణం కొనసాగించారు. ఒక పెద్ద తుఫాను వచ్చింది అనేక రోజుల పాటు అలలు ఓడను అటు ఇటు కొట్టాయి. వారికి సూర్యుడు గాని నక్షత్రాలు గాని కనిపించలేదు. తుఫానులో తాము చనిపోతామని వారు అనుకున్నారు.

అపొస్తలుల కార్యములు 27:11–20

ఓడలో పౌలుకు ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు.

ఒక రాత్రి, దేవుని దూత పౌలును సందర్శించి, “పౌలా, భయపడకుము” అని అన్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం, పౌలు రోమ్‌కు చేరుకుంటాడని దేవదూత చెప్పాడు. దేవుడు ఓడలో ఉన్న అందరినీ రక్షిస్తారు—వారిలో ఎవ్వరూ చనిపోరు అని ఆయన చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 27:23–24

పౌలు ఓడలో ఉన్న ప్రజలకు దేవదూత గురించి చెబుతాడు.

పౌలు దేవదూత చెప్పిన మాటలను అందరికీ చెప్పాడు. “ధైర్యము తెచ్చుకొనుడి, నేను దేవుని నమ్ముచున్నాను,” అని పౌలు అన్నాడు

అపొస్తలుల కార్యములు 27:21–25

పౌలు మరియు ఇతరులు మెలితే అనే దీవిలో ఉన్నారు.

కొన్ని రోజుల తర్వాత, ఓడ ఢీకొని మునిగిపోయింది. కానీ దేవదూత వాగ్దానం చేసినట్లే, ఓడలో ఉన్న వారిలో ఎవ్వరూ చనిపోలేదు. వారు అందరూ ఈదుకుంటూ మెలితే అనే దీవికి చేరుకున్నారు.

అపొస్తలుల కార్యములు 27:40–44; 28:1

మెలితే దీవిలోని ప్రజలు పౌలు మరియు ఇతరులకు సహాయం చేశారు.

మెలితే దీవిలో నివసించే ప్రజలు పౌలు మరియు ఓడ నుండి వచ్చిన ఇతరుల పట్ల దయగా ప్రవర్తించారు. అందరూ వెచ్చగా ఉండేందుకు వారు ఒక మంట వెలిగించారు.

అపొస్తలుల కార్యములు 28:2

ఒక పాము పౌలును కాటేసింది, కానీ ఆయనకు ఏమాత్రం హాని జరగలేదు.

అకస్మాత్తుగా మంటలలో నుంచి ఒక పాము బయటికి వచ్చి పౌలు చేతిపై కాటేసింది. కానీ పౌలుకు ఏమాత్రం హాని జరగలేదు. అతను పామును సులభంగా తోసి పడేశాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు!

అపొస్తలుల కార్యములు 28:3–6

పౌలు పొప్లియొక్క తండ్రికి ఆశీర్వాదం ఇచ్చాడు.

పొప్లి అనే ఒక వ్యక్తి పౌలును తన ఇంటిలో ఉండనిచ్చాడు. పొప్లియొక్క తండ్రి చాలా అనారోగ్యంతో ఉన్నాడు. పౌలు అతనిపై తన చేతులను ఉంచి, దేవుని శక్తితో అతనిని స్వస్థపరిచాడు.

అపొస్తలుల కార్యములు 28:7–8

పౌలు రోమ్‌కు చేరుకున్నాడు.

మెలితే దీవిలో పౌలు మూడు నెలలు గడిపాడు. ప్రభువు ఆయనకు సహాయం చేసి అనేక అద్భుతాలు చేయించాడు; అనారోగ్యంతో ఉన్న ప్రజలను ఆశీర్వదించి స్వస్థపరిచాడు. ఆ తరువాత, ప్రభువు వాగ్దానం చేసినట్లే పౌలు రోమ్‌కు ప్రయాణించాడు.

అపొస్తలుల కార్యములు 28:9–16

ఖైదీగా ఉన్నప్పటికీ పౌలు సువార్త గురించి బోధించాడు.

పౌలు రోమ్‌లో ఉన్నప్పటికీ ఆయన ఇంకా ఖైదీగానే ఉన్నాడు. కానీ అతని కాపలాదారులు ప్రజలు అతనిని సందర్శించడానికి అనుమతించారు. వినడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికీ పౌలు యేసు క్రీస్తు గురించి బోధించాడు. అతను అనేక ప్రాంతాలలో ఉన్న సంఘ సభ్యులకు కూడా లేఖలు రాశాడు. ఈ లేఖలలో లేదా లేఖనాలలో కొన్ని క్రొత్త నిబంధనలో ఉన్నాయి.

అపొస్తలుల కార్యములు 28:16–31