లేఖన కథలు
మంచి సమరయుని ఉపమానం—మనల్ని మనం ప్రేమించుకున్నట్లే మన పొరుగువారిని ప్రేమించడం


లూకా 10:25–37

మంచి సమరయుని ఉపమానం

మనల్ని మనం ప్రేమించుకున్నట్లే మన పొరుగువారిని ప్రేమించడం

ఒక వ్యక్తి యేసును ఒక ప్రశ్న అడుగుతాడు.

ఒక న్యాయవాది, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అని అడిగెను. లేఖనాల్లో ఏమి వ్రాయబడి ఉందని యేసు అతనిని అడిగారు. దేవుడిని ప్రేమించమని, పొరుగువారిని ప్రేమించమని లేఖనాలు చెబుతున్నాయని న్యాయవాది జవాబిచ్చాడు. తాను చెప్పింది నిజమే అని యేసు అన్నారు. అప్పుడు న్యాయవాది, “నా పొరుగువాడెవడు?” అని అడిగాడు. యేసు ఒక ఉపమానం లేదా కథ చెప్పడం ద్వారా సమాధానమిచ్చారు.

లూకా 10:25–29

ఒక యూదుడు దొంగల చేతిలో గాయపడ్డాడు.

ఆ ఉపమానంలో, ఒక యూదుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా, కొంతమంది దొంగలు వచ్చారు. వాళ్ళు అతని బట్టలు దొంగిలించి, అతన్ని తీవ్రంగా గాయపరిచి, అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు.

లూకా 10:30

ఒక యాజకుడు గాయపడిన వ్యక్తిని పట్టించుకోలేదు.

కొద్దిసేపటికే, ఒక యాజకుడు ఆ దారిలోకి వచ్చాడు. యాజకుడు అంటే దేవాలయంలో సేవ చేసే వ్యక్తి. అతను ఆ వ్యక్తిని రోడ్డు మీద చూశాడు కానీ తప్పుకొని రోడ్డు అవతలి వైపుకు వెళ్ళిపోయాడు.

లూకా 10:31

ఒక లేవీయుడు గాయపడిన వ్యక్తిని పట్టించుకోలేదు.

తరువాత దేవాలయంలో సేవ చేసే లేవీయుడు అని పిలువబడే మరొక వ్యక్తి వచ్చాడు. అతను గాయపడిన వ్యక్తిని చూశాడు, కానీ అతను కూడా తప్పుకొని రోడ్డు అవతలి వైపుకు వెళ్ళిపోయాడు.

లూకా 10:32

ఒక సమరయుడు ఆ యూదుడిని గమనించాడు.

తరువాత ఒక సమరయుడు ఆ దారిన వచ్చెను. రోడ్డు మీద వ్యక్తి చాలా తీవ్రమైన గాయాలతో పడియుండటం అతను చూశాడు. సమరయులు మరియు యూదులు సాధారణంగా అంతగా కలిసిపోయేవారు కాదు. కానీ ఈ సమరయుడు ఆ వ్యక్తికి ఎలాగైనా సహాయం చేయాలనుకున్నాడు.

లూకా 10:33

ఆ సమరయుడు ఆ యూదుని పట్ల శ్రద్ధ వహిస్తాడు.

ఆ సమరయుడు ఆ వ్యక్తి గాయాలకు నూనె, ద్రాక్షారసం పూసి ఆ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ మనిషిని తన గాడిద మీద ఎక్కించుకున్నాడు.

లూకా 10:34

సమరయుడు ఆ యూదుడిని ఒక సత్రానికి తీసుకుని వెళ్తాడు.

అప్పుడు సమరయుడు ఆ వ్యక్తిని ఒక సత్రానికి తీసుకువచ్చాడు, అక్కడ ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకొని కోలుకున్నాడు. మరుసటి రోజు సమరయుడు వెళ్ళే ముందు, సత్రం యజమానికి డబ్బులిచ్చి, “అతన్ని జాగ్రత్తగా చూసుకో” అని అన్నాడు. మరికొన్ని రోజుల్లో మరిన్ని డబ్బులతో తిరిగి వస్తానని ఆ సమరయుడు చెప్పాడు.

లూకా 10:34–35

యేసు ఆ న్యాయవాదిని సమరయునిలా ఉండమని చెప్పారు.

కథ చివరలో, యేసు ఆ న్యాయవాదిని ఒక ప్రశ్న అడిగారు. గాయపడిన వ్యక్తికి పొరుగువాడు ఎవరు? యాజకుడా, లేవీయుడా, లేక సమరయుడా? ఆ న్యాయవాది ఆ వ్యక్తి పట్ల ప్రేమ చూపించిన వ్యక్తి—ఆ సమరయుడు అని చెప్పాడు. యేసు ఆ న్యాయవాదిని వెళ్ళి సమరయునిలా ఉండమని చెప్పారు.

లూకా 10:36–37