మార్కు 5:21–43
యేసు ఒక స్త్రీని స్వస్థపరిచారు మరియు యాయీరు కుమార్తెను లేపారు
“భయపడకుము, నమ్మిక మాత్రముంచుము”
గలిలయ సముద్రం దగ్గర ఉన్న ఒక పట్టణంలో యాయీరు అనే పేరుగల ఒక వ్యక్తి తన భార్యా మరియు కుమార్తెతో నివసించేవాడు. యూదులు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళే సమాజమందిరంలో యాయీరు ఒక నాయకుడు.
మార్కు 5:22
యాయీరు యొక్క కుమార్తె కేవలం 12 సంవత్సరాల వయసులోనే చాలా జబ్బుపడింది. ఆమె చనిపోయే పరిస్థితిలో ఉంది. ఆమెకు సహాయం అవసరమని యాయీరుకు తెలుసు. యేసు వారి పట్టణంలోనే ఉన్నారని కూడా అతనికి తెలుసు,
మార్కు 5:22–23
యాయీరు తన ఇంటిని విడిచి వెళ్ళి యేసును కనుగొన్నాడు. అతను యేసు పాదాల వద్ద మోకరిల్లి, తన కుమార్తెను స్వస్థపరచడానికి రావాలని ఆయనను అడిగాడు. యేసు తన కుమార్తెను ఆశీర్వదిస్తే, ఆమె బ్రతుకుతుందని యాయీరుకు తెలుసు. యేసు యాయీరును అనుసరించి అతని ఇంటికి వెళ్ళారు. జనసమూహములు ఆయనను వెంబడించాయి.
మార్కు 5:23–24
అదే పట్టణంలోని ఒక స్త్రీకి కూడా యేసు యొక్క సహాయం అవసరం. ఆమె 12 సంవత్సరాలుగా చాలా అనారోగ్యంతో ఉంది. ఆమె తన వద్ద ఉన్న డబ్బంతా వైద్యుల కోసం ఖర్చు చేసింది, కానీ ఎవరూ ఆమెను స్వస్థపరచలేకపోయారు—ఆమె పరిస్థితి మరింత బాధాకరముగా మారింది. యేసు తనను స్వస్థపరచగలరని ఆమెకు తెలుసు. కానీ జనసమూహంలోనుంచి ఆయన దగ్గరకు ఆమె ఎలా వెళ్ళగలదు?
మార్కు 5:25–27
యేసు వస్త్రాలను తాకితే చాలు, తనకు స్వస్థత కలుగుతుందని ఆ స్త్రీ నమ్మింది. యేసు నడుచుకుంటూ వెళుతుండగా ఆమె ఆయన కోసం చేయి చాపింది. ఆమె ఆయన వస్త్రాల అంచును తాకగానే, ఆమె వ్యాధి నయమైంది.
మత్తయి 9:20; మార్కు 5:27–29; లూకా 8:44.
వెంటనే, యేసు నడవడం ఆపారు. ఆయనలో నుండి శక్తి బయటకు వెళ్ళినట్లు ఆయనకు అనిపించింది. “నన్ను ముట్టినది ఎవరు?” అని ఆయన అడిగెను. శిష్యులు అయోమయంలో పడ్డారు. చాలా మంది ఆయనను ముట్టుకున్నారు—వారి చుట్టూ జనం ఉన్నారు. తనను ఎవరు ముట్టుకున్నారో తెలుసుకోవడానికి యేసు చుట్టూ చూశారు.
మార్కు 5:30–32; లూకా 8:45
యేసు తన వస్త్రాలను తాకిన స్త్రీని చూశారు. ఆమె తన అనారోగ్యం గురించి మరియు యేసు తనను స్వస్థపరిచారని యేసుకు చెప్పింది. ఆదరణ కలిగి ఉండమని యేసు ఆమెతో చెప్పెను. ఆయనయందు ఆమెకున్న విశ్వాసం వల్ల ఆమె స్వస్థత పొందింది. “సమాధానము గలదానవై పొమ్ము,” అని ఆయన ఆమెతో చెప్పెను.
మార్కు 5:33–34; లూకా 8:47–48
అప్పుడు యాయీరు ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా ఆలస్యమైందని చెప్పాడు: యాయీరు కుమార్తె అప్పటికే చనిపోయింది. యాయీరు ఇక యేసును ఇబ్బంది పెట్టకూడదు.
మార్కు 5:35
యేసు ఇది విన్న వెంటనే, యాయీరుతో, “భయపడకుము, నమ్మిక మాత్రముంచుము” అని చెప్పారు. తరువాత వారు యాయీరు ఇంటికి వెళ్ళారు.
మార్కు5:36–38
యాయీరు మరియు అతని భార్య యేసును తమ కుమార్తె పడుకున్న చోటికి తీసుకెళ్లారు. యేసు ఆ అమ్మాయి చేయి పట్టుకుని, “లెమ్ము” అని చెప్పారు.
మార్కు 5:41
వెంటనే, యాయీరు కుమార్తె తన మంచం మీద నుండి లేచి నిలబడింది. ఆమె ఇక మరణించిన వ్యక్తి కాదు! యేసు యాయీరును, అతని భార్యను, వారి కుమార్తె కొరకు తినడానికి ఏదైనా తెచ్చిపెట్టమని అడిగారు. యేసు తమ కుమార్తెకు చేసిన దానిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ అద్భుతం గురించి ఇతరులకు చెప్పవద్దని ఆయన వారిని కోరారు.
మార్కు 5:42–43