లూకా 4:16–31
యేసు తన మిషను గురించి సాక్ష్యమిచ్చారు
నజరేతులో తిరస్కరించబడ్డారు
యేసు తన కుటుంబం మరియు స్నేహితులు నివసించే నజరేతుకు వెళ్ళారు. అది ఆయన పెరిగిన ప్రదేశం. విశ్రాంతిదినమున, ఆయన సమాజమందిరమునకు వెళ్ళారు, అక్కడ ప్రజలు లేఖనాలను అధ్యయనం చేయడానికి మరియు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారు.
లూకా 4:16–17
యేసు సమాజమందిరంలో నిలబడి యెషయా ప్రవక్త రాసిన ఒక లేఖనాన్ని చదివారు. ఒకరోజు రక్షకుడు వస్తాడని లేఖనంలో వ్రాయబడియున్నది. ఆయన పేదలకు సువార్తను ప్రకటించి, విరిగిన హృదయాలను స్వస్థపరుస్తారు. ఆయన గ్రుడ్డివారికి, గాయపడిన వారికి సహాయం చేస్తారు.
యెషయా 61:1–2; లూకా 4:17–19
యేసు చదవడం ముగించి కూర్చున్నారు. అందరూ ఆయన వైపు చూస్తున్నారు. ఆ రోజే, తాను చదివిన లేఖనం నెరవేరుతోందని ఆయన వారితో చెప్పారు. ఆయనే రక్షకుడు.
లూకా 4:21
యేసు చెప్పిన దానికి నజరేతు ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. యేసు రక్షకుడు ఎలా కాగలరు? ఆయన మరియ మరియు యోసేపుల కుమారుడని, దేవుని కుమారుడుకాదు అని వారు భావించారు. వారికి, ఆయన ఒక సాధారణ వ్యక్తిలా కనిపించాడు.
లూకా 4:22
తాను రక్షకుడని నిరూపించుకోవడానికి ప్రజలు తనను ఒక అద్భుతం చేయాలని కోరుకుంటున్నారని యేసుకు తెలుసు. అద్భుతాలు నమ్మేవారి కోసమే అని మరియు కొన్నిసార్లు ఇశ్రాయేలు కాని వారికి ఎక్కువ విశ్వాసం ఉన్నందున దేవుడు వారి కొరకు అద్భుతాలు చేశారు అని ఆయన బోధించారు. సమాజమందిరంలో ఉన్న కొంతమందికి యేసు మీద కోపం వచ్చింది.
లూకా 4:23–28
వారు ఆయనను పట్టణము నుండి బయటకు తీసుకొనిపోయి కొండ పైకి తీసుకెళ్లారు. వారు ఆయనను కొండ మీద నుండి పడద్రోయాలనుకున్నారు.
లూకా 4:28–29
అయితే యేసు కోపంగా ఉన్న ప్రజల మధ్యనుండి దాటి వెళ్లిపోయెను.
లూకా 4:30
వారు ఆయనను నజరేతులో ఉండనివ్వకపోవడంతో, యేసు బోధించడానికి వేరే పట్టణానికి వెళ్లిపోయెను.
లూకా 4:31–32