లేఖన కథలు
యేసు అపొస్తలులు ఆయన సంఘాన్ని నడిపించారు—బోధిస్తూ, బాప్తిస్మము ఇస్తూ, స్వస్థపరుస్తూ, అన్నింటిని పంచుకుంటూ.


అపొస్తలుల కార్యములు 1–4

యేసు అపొస్తలులు ఆయన సంఘాన్ని నడిపించారు

బోధిస్తూ, బాప్తిస్మము ఇస్తూ, స్వస్థపరుస్తూ, అన్నింటిని పంచుకుంటూ

అపొస్తలులు సువార్తను బోధిస్తారు.

యేసు పరలోకంలోని తన తండ్రి దగ్గరకు తిరిగి వెళ్లిన తరువాత, అపొస్తలులు ఆయన సంఘానికి నాయకులయ్యారు. వారు రక్షకుని సువార్తను బోధించారు, ప్రజలను ఆయన సంఘంలో చేరమని ఆహ్వానించారు, మరియు దేవుని శక్తితో అనేక అద్భుతాలు చేశారు. పరిశుద్ధాత్మను పంపించి వారికి సహాయం చేస్తానని యేసు వాగ్దానం చేశారు.

అపొస్తలుల కార్యములు 1:8–13; 2:41–47

మత్తీయను నియమించుచున్న అపొస్తలులు

యూదా మరణించినందున, పదకొండు మంది అపొస్తలులు మాత్రమే ఉన్నారు. యూదా స్థానంలో దేవుడు ఎవరిని నియమించాలని కోరుకుంటున్నారో మరియు ఎవరిని యేసు క్రీస్తుకు ప్రత్యేక సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి అపొస్తలులు ప్రార్థించారు. దేవుడు మత్తీయ అనే మనిషిని ఎంచుకున్నారు. అతను పన్నెండు అపొస్తలులలో ఒకడయ్యాడు.

అపొస్తలుల కార్యములు 1:15–26

అపొస్తలులు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు.

ఒక ప్రత్యేక యూదుల పండుగ సందర్భంగా శిష్యులు యెరూషలేములో కలిసి ఉన్నారు. అకస్మాత్తుగా పరలోకంనుంచి వచ్చిన గాలి లాగా అనిపించి ఆ ఇల్లు అంతా నిండిపోయింది. వారు అగ్నిలాంటి వెలుగు తమపై నిలిచినట్లు చూశారు, మరియు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ వలన వారు ఇతర భాషలలో మాట్లాడగలిగారు.

అపొస్తలుల కార్యములు 2:1–4

అపొస్తలులు మాట్లాడునది వినడానికి ప్రజలు గుమిగూడారు.

యెరూషలేములోని ప్రజలు దీని గురించి విన్నప్పుడు, ఒక పెద్ద జనసమూహం అక్కడ గుమిగూడింది. జనసమూహంలోని వారు అనేక దేశాల నుండి వచ్చి భిన్నమైన భాషలు మాట్లాడినా, అపొస్తలులు చెప్పిన మాటలను ప్రతి ఒక్కరు తమ తమ భాషలో విన్నారు. ప్రజలు ఆశ్చర్యపోయారు!

అపొస్తలుల కార్యములు 2:5–13

పేతురు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు.

పేతురు నిలబడి జనసమూహంతో మాట్లాడాడు. అతను వారికి యేసు క్రీస్తును గురించి చెప్పెను. యేసు రక్షకుడని మరియు ఆయన మృతులలోనుండి పునరుత్థానమయ్యాడని అతను తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 2:14–36

తమ జీవితాలను ఎలా మార్చుకోవాలి అని ప్రజలు అపొస్తలులను అడిగారు.

ఇది విన్నప్పుడు, వారు మారాల్సిన అవసరం ఉందని ప్రజలు భావించారు. వారు ఏమి చేయాలి అని అపొస్తలులను అడిగారు.

అపొస్తలుల కార్యములు 2:37

బాప్తిస్మము పొందుతున్న జనులు

“మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి”, అని పేతురు చెప్పెను. ఆ రోజున సుమారు 3,000 మంది బాప్తిస్మము పొంది, సంఘములో చేరారు.

అపొస్తలుల కార్యములు 2:38–43

దేవాలయము ముందు నడవలేని ఒక వ్యక్తి.

తరువాత, పేతురు మరియు యోహాను దేవాలయానికి వెళ్ళారు. వారు నడవలేని ఒక వ్యక్తిని చూశారు. అతను ప్రతిరోజూ అక్కడ కూర్చుని ప్రజలను డబ్బులు అడుగుతూ ఉండేవాడు.

అపొస్తలుల కార్యములు 3:1–2

పేతురు మరియు యోహాను ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారు.

ఆ వ్యక్తి పేతురు మరియు యోహానులను డబ్బు అడిగాడు. వారు ఆగి అతని వైపు చూశారు. పేతురు, “మాతట్టు చూడుమని” అన్నాడు.

అపొస్తలుల కార్యములు 3:3–4

ఆ మనిషి దేవుని శక్తి ద్వారా స్వస్థత పొందాడు మరియు లేచి నిలబడగలిగాడు.

వెండి లేదా బంగారం వారి దగ్గర లేదని పేతురు చెప్పాడు. కానీ వారి వద్ద ఇంకా మంచిది ఉంది. “నజరేయుడైన యేసు క్రీస్తు నామమున, లేచి నడువుము” అని పేతురు చెప్పాడు. పేతురు అతనికి నిలబడటానికి సహాయం చేశాడు. తన జీవితంలో మొదటిసారిగా, అతను నడవగలిగాడు! అతను చాలా ఆనందంతో ఎగిరి, పేతురు మరియు యోహానుతో కలిసి దేవాలయంలోకి నడుచుకుంటూ వెళ్లాడు.

అపొస్తలుల కార్యములు 3:6–8

పశ్చాత్తాపపడుతూ యేసును నమ్మమని పేతురు ప్రజలకు చెప్పాడు.

ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ మనిషిని స్వస్థతపరిచింది తన శక్తి గానీ యోహాను శక్తి గానీ కాదని పేతురు వారికి చెప్పాడు. అతను యేసు క్రీస్తు యొక్క శక్తిచేత మరియు ఆయనపై విశ్వాసం ద్వారా స్వస్థత పొందాడు. పశ్చాత్తాపపడి యేసును నమ్మమని పేతురు వారికి చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 3:9–26

యేసు గురించి బోధించకూడదని కొంతమంది నాయకులు పేతురు మరియు యోహానుకు చెప్పారు.

యూదులలో కొంతమంది నాయకులు పేతురు మరియు యోహాను బోధిస్తున్న విషయాలను ఇష్టపడలేదు. యేసు గురించి ఎవరూ బోధించకూడదని వారు చెప్పారు.

అపొస్తలుల కార్యములు 4:1–18

ప్రజలు యేసు గురించి తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నారని పేతురు మరియు యోహాను నాయకులకు చెప్పారు.

తాము దేవునికి లోబడతామని, యేసు క్రీస్తు గురించి తెలుసుకున్న విషయాలను ప్రజలకు చెప్పాలని దేవుడు కోరుతున్నారని పేతురు మరియు యోహాను చెప్పారు.

అపొస్తలుల కార్యములు 4:19–20

పేతురు ఒక స్త్రీకి బాప్తిస్మము ఇస్తుండగా ప్రజలు చుట్టూ చేరారు.

అపొస్తలులు రక్షకుని సువార్తను గొప్ప శక్తితో బోధించడం కొనసాగించారు. మరింత ఎక్కువ మంది ఆయన సంఘంలో చేరారు వారు ఆత్మతో నింపబడ్డారు. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు మరియు ప్రతిదీ పంచుకున్నారు. వారు తమ దగ్గర ఉన్నవన్నీ అమ్మి, ఆ డబ్బును పేదలకు ఇవ్వమని అపొస్తలులకు ఇచ్చారు.

అపొస్తలుల కార్యములు 4:31–37