రక్షకుని పట్ల నాకున్న ప్రేమే నా “ఎందుకు”
నేను మన రక్షకుడిని ప్రేమిస్తున్నాను. నేను చేసే పనిని చేయడానికి ఇదే నిజమైన మరియు అత్యంత శక్తివంతమైన కారణం.
మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు మనకు నిరంతరం ఆహ్వానాలు అందిస్తున్నారని మీరు ఎప్పుడైనా గమనించారా? ఆశ్చర్యపోనవసరం లేదు, గత రెండు సమావేశాలలో పంచుకున్న సందేశాలను అధ్యయనం చేసి ధ్యానించమని ఆయన మనల్ని ఆహ్వానించారు. 2024 ఏప్రిల్‌లో, ఆయన ఇలా అన్నారు, “రాబోయే నెలల్లో మీరు ఈ సమావేశ సందేశాలను పదేపదే చదువుతారని నేనాశిస్తున్నాను.” తరువాత, 2024 అక్టోబరులో, ఆయన ఇలా అన్నారు: “[ప్రసంగీకుల] సందేశాలు చదవమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. వచ్చే ఆరు నెలల్లో ఏది నిజము, ఏది కాదు అని తెలుసుకోవడానికి వాటిని లిట్మస్ పరీక్షలా ఉపయోగించండి.”
ఈ ఆహ్వానాలను మన జీవితకాలంలో మనం పొందిన ప్రవచనాత్మక ఆహ్వానాలకు జోడించవచ్చు, ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో మనం పొందిన వాటితో సహా. మనం ఆహ్వానించబడినందున లేదా అలా చేయమని మనల్ని కోరినందున, ఈ ఆహ్వానాలు, చేయవలసిన-మన పనుల జాబితాలకు జోడించాల్సిన మరో విషయం అని మనం భావించవచ్చు లేదా అనుకోవచ్చు. అయితే ఇందులో ఇంకేమైనా ఉండవచ్చా?
దీని గురించి మరియు మనకు వచ్చిన అన్ని ఆహ్వానాల గురించి ఆలోచించినప్పుడు, నేను చాలా కాలం క్రితం నేర్చుకున్న మరియు నిర్ణయించుకున్న ఒక విషయాన్ని గుర్తుచేసుకున్నాను. నేను ఆయనను ప్రేమిస్తున్నందున నాకు ముఖ్యమైన ఈ పనులను చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను; నేను మన రక్షకుడిని ప్రేమిస్తున్నాను. నేను చేసే పనిని చేయడానికి ఇదే నిజమైన మరియు అత్యంత శక్తివంతమైన కారణం, ఆపై, నా తోటి సహోదర సహోదరీలారా, మీ పట్ల నాకున్న ప్రేమ దీనితో ముడిపడి ఉంది.
రక్షకుని పట్ల మనకున్న ప్రేమతో మనం చేసే ప్రతిదానిని అనుసంధానించే అవకాశాన్ని అర్థం చేసుకోవడానికి నా మాటలను హృదయపూర్వక ఆహ్వానంగా మీరు భావిస్తారని మీ సహోదరుడిగా నేను ఆశిస్తున్నాను.
ఇలా చేయడం రక్షకుని శిష్యులుగా మనం చేసే ప్రతిదాని వెనుక ఉన్న నిజమైన “ఎందుకు”ను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. ఇది దేవునితో మన నిబంధన సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, ఆయన దైవిక మరియు నిత్య సత్యాలను—ఎప్పటికీ మారని ఆయన నిత్యమైన మరియు సంపూర్ణమైన సత్యాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అవి “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అనే నిత్య సత్యాలు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మనం ఏకరీతిగా చేసే పనులు సంప్రదాయాలుగా మారడం వల్ల, యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించే మన ప్రయత్నాలను నిర్దేశించడానికి మనం ఈ సంప్రదాయాలను లేదా కార్యకలాపాలను అనుమతిస్తాము. రక్షకునితో మనకున్ననిబంధన సంబంధంపై వాటి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, మనం చాలా సంవత్సరాలుగా వీటిని చేస్తున్నందున మనం ఈ పనులు చేస్తున్నట్లు అనిపిస్తుంది.
మన ప్రపంచంలో, సాధారణంగా మనం చేసే పనులపై మరియు ఆ పనులను, లక్ష్యాలను స్థిరంగా సాధించడంపై మనం దృష్టి పెడతాము. ఈ ఆధ్యాత్మిక వలయంలో, మనం వాటిని ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకోవడం ద్వారా కేవలం పనులు చేయడం లేదా లక్ష్యాలను సాధించడం కంటే ఎక్కువగా ముందుకు సాగే అవకాశం మనకు ఉంది. మన చర్యల వెనుక ఉన్న కారణం రక్షకుని పట్ల మరియు మన పరలోక తండ్రి పట్ల మనకున్న ప్రేమకు సంబంధించినదని మనం అర్థం చేసుకోగలిగి అనుసంధానించగలిగితే, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, సంఘ కార్యకలాపాలు లేదా సంప్రదాయాలు వంటి నీతియుక్తమైన పనులు చేయడం మరియు వాటిని సముచితంగా చేయడం మంచి విషయమే అయినప్పటికీ, వాటిని “ఎందుకు” అనే దానితో అనుసంధానించినప్పుడు, ఆ కారణాన్ని అర్థం చేసుకోవడానికి మనం దీవించబడతాము. కేవలం మంచి పనులు చేయడం లేదా సరిగ్గా చేయడం మాత్రమే కాదు; మనం వాటిని సరైన కారణం కోసం చేస్తాము.
ఉదాహరణకు, మీరు లేఖనాలను చదవడం, హృదయపూర్వక ప్రార్థనలు చేయడం లేదా మీ కుటుంబం లేదా వార్డు కోసం ఒక ప్రోత్సాహ కార్యక్రమాన్ని సిద్ధం చేయడం అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు, ఈ పనులను పూర్తి చేయడమే నిజమైన లక్ష్యమా? లేదా ఈ చర్యలు, నిజమైన లక్ష్యాన్ని సాధించడానికి మీ ఆధీనములోనున్న సాధనాలని అర్థమా? మనం చాలా సంవత్సరాలుగా చేస్తున్నాము కాబట్టి ఒక ప్రోత్సాహ కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ తర్వాత దాన్ని పూర్తి చేశామని గుర్తుపెట్టడమే దీని ఉద్దేశమా? లేదా, మరోసారి, ఇవి మనం నేర్చుకోవడానికి, అనుభూతిచెందడానికి మరియు రక్షకునితో జతచేరడానికి ఉపయోగించే మార్గాలా?
ప్రోత్సాహ కార్యక్రమాలు, సంప్రదాయాలు కలిగియుండడం లేదా లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు వాటిని సాధించడానికి కష్టపడి పనిచేయడం గురించి నా అభిప్రాయాన్ని దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి; ఇందులో ఏమీ తప్పు లేదు. అయితే, మనం ఈ పనులు ఎందుకు చేస్తామో మరియు మన మతాన్ని ఎలా ఆచరిస్తామో అర్థం చేసుకునే అవకాశం మరియు ఆశీర్వాదాల కొరకు మీ హృదయాలను మరియు మనస్సులను తెరువమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
అధ్యక్షుడు డాలిన్ హెచ్. ఓక్స్ ప్రథమ అధ్యక్షత్వం తరఫున మనందరికీ అందించిన సవాలు, క్రీస్తు కేంద్రీకృత సంప్రదాయాలకు ఒక ప్రధాన ఉదాహరణ. అధ్యక్షులు ఓక్స్ ఇలా అన్నారు: “మనం ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పుడు, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్త త్యాగం యొక్క ఈస్టరు వేడుకకు మనం సిద్ధమవుదాం. … ఇతరులు ఏమి నమ్మినా, ఏమి చేసినా, ఆయన బోధనలను అధ్యయనం చేయడం ద్వారా మరియు మన సమాజంలో, ముఖ్యంగా మన స్వంత కుటుంబాలలో ఈస్టరు సంప్రదాయాలను స్థాపించడంలో సహాయపడడం ద్వారా జీవముతోనున్న మన రక్షకుని యొక్క పునరుత్థానమును మనం జరుపుకోవాలి.” మీరు గమనిస్తే, ఇది కేవలం సంప్రదాయాలను కలిగి ఉండడానికి ఒక ఆహ్వానం కాదు. బదులుగా, రక్షకుని గురించి మరింత తెలుసుకోవడానికి మరియు ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఈ సంప్రదాయాలను ఒక సాధనముగా ఉపయోగిస్తాము.
కారణాన్ని మనం రక్షకుని పట్ల మనకున్న ప్రేమతో ఎంత ఎక్కువగా అనుసంధానించగలిగితే, అంత ఎక్కువగా మనకు అవసరమైన వాటిని లేదా మనం వెదుకుతున్న వాటిని మనం పొందగలుగుతాము. అధ్యక్షులు నెల్సన్ ఇలా అన్నారు, “మీకు ఎటువంటి ప్రశ్నలు లేదా సమస్యలున్నా, జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తు యొక్క జీవితం మరియు బోధనలలో కనుగొనబడుతుంది.” మరియు ఆపై ఆయన ఈ ఆహ్వానాన్ని అందించారు: “ఆయన ప్రాయశ్చిత్తము, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన సిద్ధాంతము మరియు స్వస్థత, పురోగతి యొక్క పునఃస్థాపించబడిన ఆయన సువార్త గురించి మరింత నేర్చుకోండి. ఆయన వైపు తిరగండి! ఆయనను అనుసరించండి!”
మీ హృదయములలో మరియు మనస్సులలో దీని గురించి ధ్యానించండి: అధ్యక్షులు నెల్సన్ గారి ఆహ్వానం, మనం మరింత జ్ఞానాన్ని కూడబెట్టి, చేయవలసిన మన పనుల జాబితాలో ఆయన ఆహ్వానానికి గురుతు పెట్టగలిగేలా పనులను పూర్తి చేసే తనిఖీ జాబితాను సిద్ధం చేయడంలో సహాయపడే ఉద్దేశ్యాన్ని కలిగి ఉందని మీరు నమ్ముతున్నారా? లేదా ఈ నిత్య సత్యాలు మరియు సూత్రాల యొక్క అంశాలను “ఎందుకు” అని అర్థం చేసుకోవడానికి మరియు మన కోసం రక్షకుని యొక్క నిబంధన ప్రేమను మన జీవితకాల శిష్యత్వ ప్రయాణంతో అనుసంధానించడానికి ఒక అవకాశంగా పరిగణించమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారా?
నేను చెప్పదలుచుకున్న సూత్రాన్ని ఉదహరిస్తాను. ఒక ఎంపిక, బహుశా విపరీతమైనది కావచ్చు, సర్వసభ్య సమావేశము నుండి అన్ని సందేశాలను ఒకేసారి చదవడం; అప్పుడు, నేను చదవడం పూర్తి చేసిన తర్వాత, నేను చదివిన వాటితో మరేమీ చేయకుండా, చేయవలసిన నా పనుల జాబితాలో ఈ ఆహ్వానాన్ని పూర్తిచేసినట్లుగా గుర్తుపెడతాను. ఇది ఒక తీవ్రమైన విషయం అని నాకు అర్థమైంది, కానీ ఇది అవాస్తవం కాదు. బహుశా, చాలామంది దీనికి మరియు ఆదర్శానికి మధ్య ఏదో ఒక దశలో ఉండవచ్చు.
ఇది సర్వసభ్య సమావేశం నుండి వచ్చిన సందేశాలను అధ్యయనం చేసి, ధ్యానించమని మరియు మెరుగుపరుచుకోవడానికి మనలో ప్రతి ఒక్కరూ ఏమి చేయగలరో నిర్ణయించుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి వాటిని ఉపయోగించమని ఆహ్వానం.
మనం ఆ ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు, దాని వెనుక ఉన్న కారణాన్ని “ఎందుకు” అని అర్థం చేసుకున్నప్పుడు, రక్షకుడికి దగ్గరవడానికి మనకు మరిన్ని అవకాశాలు ఉంటాయి. నేను రక్షకుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి, సజీవ ప్రవక్తల మాటలను అధ్యయనం చేయడం ద్వారా ఆయన గురించి నేను మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను అని మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము. నేను నా తోటివారిని ప్రేమిస్తున్నాను కాబట్టి, నాకు ప్రియమైనవారితో ప్రారంభించి, ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారుల బోధనలను ఇతరులతో పంచుకుంటాను అని మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము.
రెండు ఉదాహరణలలో, మీరు నీతివంతమైన పని చేస్తున్నారు. ఒకదానిలో, పరలోక తండ్రి మరియు రక్షకుడు మనకు ఇచ్చిన సాధనములు, అనగా సర్వసభ్య సమావేశములో పంచుకున్న సందేశాలను ఉపయోగించడం లక్ష్యంగా అనిపిస్తుంది. రెండవ సంస్కరణ, మూలాధారమైన కారణాలపై అంతర్దృష్టిని పొందడం, నిత్య సత్యాలను అర్థం చేసుకోవడానికి ఒక మార్గాన్ని అందించడం మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క బోధనలను, జీవితాన్ని వారి జీవితాలకు కేంద్ర బిందువుగా చేసుకోనే వారందరికీ వాగ్దానం చేయబడిన దీవెనలను అందించడం అనే ఘనమైన దీవెనలను స్వీకరిస్తుంది.
ప్రియమైన సహోదర సహోదరీలారా, మన చర్యలను రక్షకుని పట్ల మనకున్న ప్రేమతో అనుసంధానించడం యొక్క ప్రాముఖ్యతను మీరు గ్రహించి చూడగలరని నేను ఆశిస్తున్నాను. ప్రాపంచీకరణ చెందిన లోకములో, అనేక స్వరాలు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాయి మరియు వీలైతే, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క కొన్ని ప్రాథమిక సత్యాలు అనవసరమని మీరు నమ్మేలా చేస్తాయి. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము ద్వారా ప్రాతినిధ్యం వహించబడే దేవుని యొక్క రాజ్యం భూమిపై ఉండవలసిన అవసరతతో పాటు, ఈ కడవరి దినాలలో పునఃస్థాపన అవసరం అనే ముఖ్యమైన సత్యంతో ఈ స్వరాలు ప్రారంభమవుతాయి.
రక్షకునితో వ్యక్తిగత సంబంధం లేదా అవగాహన మాత్రమే సరిపోతుందని మరియు మతం లేదా పునఃస్థాపించబడిన సంఘము అనవసరమని లేదా అవసరం లేదని పట్టుబట్టే స్వరాలను మీరు వినవచ్చు. ఈ తప్పుదారి పట్టించే ఆలోచనల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తగా ఉండమని మరియు ప్రాచీన కాలం నుండి రక్షకుడు మనకు ఏమి చెబుతున్నారో మరియు బోధిస్తున్నారో గుర్తుచేసుకోవడానికి వేగంగా ఉండమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను—పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తుకు మన పట్ల ఉన్న ప్రేమతో ప్రారంభించి, వారిని అనుసరించడానికి వారి పట్ల మనకున్న ప్రేమను ఒక కారణంగా అనుసంధానించండి.
తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడు వచ్చి జోసెఫ్ స్మిత్‌తో మాట్లాడుతూ యేసు క్రీస్తు యొక్క సంఘమును పునఃస్థాపించమని మరియు భూమిపై ఆయన రాజ్యమైన కాలముల సంపూర్ణ యుగమును ప్రారంభించమని చెప్పారు. కాబట్టి, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము అనేది మనం ఇంటికి తిరిగి వెళ్ళడానికి వీలు కల్పించే నిబంధనలను పొందడానికి పరలోక తండ్రి ఏర్పాటుచేసిన ఒక సాధనం. ఆలాగున, మనకు పరలోక తండ్రితో మరియు ఆయన కుమారునితో ఉన్న వ్యక్తిగత సంబంధం కంటే ఎక్కువ అవసరం; ముఖ్యమైన యాజకత్వ విధులు మనకు అవసరం, వాటి ద్వారా మనం వారితో నిబంధనలు చేస్తాము. ఇది వారితో ఒక నిబంధన సంబంధాన్ని అందిస్తుంది మరియు వారి నిబంధన ప్రేమను పొందేందుకు మనకు అనుమతి కల్పిస్తుంది, తమ నిబంధనల పట్ల యథార్థంగా మరియు విశ్వాసపాత్రంగా ఉన్న వారందరికీ సిద్ధం చేయబడిన అత్యున్నత మహిమ రాజ్యాన్ని పొందడాన్ని సాధ్యపరుస్తుంది.
నా ఆత్మ యొక్క శక్తి అంతటితో, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క వాస్తవికతకు మరియు దైవత్వానికి నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ జీవితంలో ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు. ఆయన బాహువులు విస్తారముగా చాపబడి, “నా యొద్దకు రండి … నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అని ఆహ్వానం పలుకుతున్నాయి.
నేను రక్షకుడిని ప్రేమిస్తున్నాను మరియు రక్షకుని పట్ల నాకున్న ప్రేమే నా “ఎందుకు”. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.