సర్వసభ్య సమావేశము
అన్నిటికి కుదురుబాటు కాలములు
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


15:21

అన్నిటికి కుదురుబాటు కాలములు

(అపొస్తలుల కార్యములు 3:21)

అతి ముఖ్యమైన మరియు మహిమాన్వితమైన “శుభవార్త” ఏమిటంటే, ప్రభువైన యేసు క్రీస్తు కడవరి దినాల్లో తన సువార్తను మరియు సంఘాన్ని పునఃస్థాపించారనే సందేశం.

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము 195 సంవత్సరాల క్రితం నేడు అనగా 1830, ఏప్రిల్ 6న ఏర్పాటు చేయబడింది.

ఈ మహత్తరమైన, ఆనందకరమైన సందర్భం కోసం విశ్వాసులు మరియు స్నేహితుల చిన్న సమూహం సమకూడింది. సంస్కార విధి జరుపబడి, పరిశుద్ధాత్మ వరము అనుగ్రహించబడి, యాజకత్వ నియామకాలు నిర్వహించబడి, యేసు క్రీస్తు యొక్క సువార్త సత్యాలు ప్రకటించబడినప్పుడు, అక్కడ హాజరైన వారందరినీ ఆత్మ యొక్క గొప్ప కుమ్మరింపు దీవించింది.

తన సంఘాన్ని తిరిగి స్థాపించడంలో, ప్రభువు బయల్పాటు ద్వారా 24 ఏళ్ల జోసెఫ్ స్మిత్‌ను దాని భూసంబంధమైన నాయకుడిగా నియమించారు: “తండ్రియైన దేవుని చిత్తం మరియు మీ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా ఒక దీర్ఘదర్శిగా, అనువాదకునిగా, ప్రవక్తగా, యేసు క్రీస్తు యొక్క అపొస్తలునిగా, సంఘ పెద్దగా” నియమించారు.

ప్రపంచ చరిత్రలో ఈ అద్వితీయ సంఘటన యొక్క ప్రాముఖ్యతను మరియు కొనసాగుతున్న ప్రభావాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కోసం నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

మొదటి దర్శనము

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధికారిక ఏర్పాటు అద్భుతమైన అనుభవాల శ్రేణికి పరాకాష్ట. ఈ అనుభవాలలో మొదటిది 10 సంవత్సరాలకు ముందు ఉత్తర న్యూయార్క్‌లో జరిగింది.

1820 వసంతకాలంలో, జోసెఫ్ స్మిత్ అనే యువకుడు తన ఇంటికి సమీపంలోని అడవిలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. తన ఆత్మ యొక్క రక్షణ గురించి అతనికి ప్రశ్నలున్నాయి మరియు “అన్ని [సంఘాలలో] ఏది సరైనదో, దేనిలో చేరాలో [అతను] తెలుసుకోవాలని” ఆరాటపడ్డాడు. దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చి తనను నడిపిస్తారని జోసెఫ్ నమ్మాడు.

కేవలం ఏది సరైనదో తెలుసుకోవడానికి జోసెఫ్ ప్రార్థించలేదని దయచేసి గమనించండి. బదులుగా, ఏది సరైనదో తెలుసుకొని, దానిని చేయాలని ప్రార్థించాడు. జోసెఫ్ విశ్వాసంతో అడిగాడు మరియు అతను అందుకున్న సమాధానాల ప్రకారం చర్య తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు.

“అతని ప్రార్థనకు [సమాధానంగా], తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు జోసెఫ్‌కు ప్రత్యక్షమయ్యారు మరియు బైబిలులో ముందే చెప్పబడినట్లుగా ‘అన్నిటికి కుదురుబాటు కాలము’లను (అపొస్తలుల కార్యములు 3:21) ప్రారంభించారు. ఈ దర్శనములో, మొదటి అపొస్తలుల మరణం తరువాత, క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన సంఘము భూమిపై నుండి కోల్పోబడిందని అతను తెలుసుకున్నాడు.” రక్షకుని యొక్క ప్రాచీన సంఘము యొక్క సిద్ధాంతం, అధికారం, నిబంధనలు మరియు విధులను మరోసారి పునఃస్థాపించడంలో జోసెఫ్ స్మిత్ కీలక పాత్ర పోషిస్తాడు.

మొదటి దర్శనము.

జోసెఫ్ ఇలా ధృవీకరించాడు: “గాలిలో నా పైన నిలువబడిన ఇద్దరు వ్యక్తులను నేను చూచితిని, వారి తేజస్సు, మహిమ వర్ణనాతీతముగా నుండెను. వారిలో ఒకరు నన్ను పేరుపెట్టి పిలిచి మరొకరిని చూపించుచు—ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినుము! అనిరి.

ఈ దర్శనం మరియు తరువాత కలిగిన దైవిక అనుభవాల ద్వారా, దేవుడు మరియు యేసు క్రీస్తు అతన్ని ఒక వ్యక్తిగా తెలుసుకున్నారని, అతని నిత్య రక్షణ గురించి శ్రద్ధ వహించారని మరియు అతను చేయవలసిన నియమితకార్యమును కలిగి ఉన్నారని జోసెఫ్ స్మిత్ అర్థం చేసుకున్నాడు. దైవసమూహం యొక్క లక్షణాలు, స్వభావం మరియు పరిపూర్ణతల గురించి—తండ్రి మరియు కుమారుడు వేరని, భిన్నమైన వ్యక్తులని కూడా అతను ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాడు. యేసు క్రీస్తు ఆత్మయందు మరియు శరీరమందు నిజంగా దేవుని కుమారుడు.

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు శరీరముగల జీవులని జోసెఫ్ స్మిత్ ప్రకటించాడు. అతనిలా అన్నాడు, “స్పర్శించగలుగు మనుష్య శరీరమువలె మాంసము, ఎముకలు గల శరీరమును తండ్రి, కుమారుడు కలిగియుండెను; కానీ పరిశుద్ధాత్మ మాంసము, ఎముకలు గల శరీరమును కలిగిలేడు, కానీ అతడు ఆత్మశరీరుడు.”

తండ్రి మరియు కుమారుడు జోసెఫ్ స్మిత్‌ను సందర్శించడమనేది “లోకము ప్రారంభమైనప్పటి నుండి పరిశుద్ధ ప్రవక్తలందరి నోటిచేత చెప్పబడిన అన్ని విషయముల యొక్క ఘనమైన పునఃస్థాపన”లో ప్రారంభ సంఘటన అని నేను సాక్ష్యమిస్తున్నాను.

మోర్మన్ గ్రంథము

రక్షకుని యొక్క పునఃస్థాపించబడిన సంఘము యొక్క అధికారిక ఏర్పాటుకు దారితీసిన అద్భుతమైన అనుభవాల క్రమంలో రెండవది మోర్మన్ గ్రంథము యొక్క అనువాదం మరియు రాకడ.

మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన.

“జోసెఫ్ స్మిత్‌కు ఒక ప్రాచీన గ్రంథమైన మోర్మన్ గ్రంథము—యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధనను అనువదించడానికి దేవుని వరము మరియు శక్తి ఇవ్వబడింది. … ఈ పవిత్ర గ్రంథము యొక్క పుటలు, యేసు క్రీస్తు పునరుత్థానము తరువాత పశ్చిమ అర్థగోళములోని ప్రజల మధ్య ఆయన చేసిన వ్యక్తిగత పరిచర్య యొక్క వృత్తాంతమును కలిగియున్నాయి. [మోర్మన్ గ్రంథము] జీవితము యొక్క ఉద్దేశము గురించి బోధిస్తుంది, ఆ ఉద్దేశమునకు కేంద్రమైన క్రీస్తు సిద్ధాంతాన్ని వివరిస్తుంది. మానవులందరూ పరలోకమందున్న ప్రేమగల తండ్రి యొక్క కుమారులు, కుమార్తెలని, మన జీవితముల కొరకు ఆయన ఒక దైవిక ప్రణాళికను కలిగియున్నారని, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రాచీన దినములలో వలే నేడు కూడా మాట్లాడుచున్నారని బైబిలుకు సహలేఖనముగా మోర్మన్ గ్రంథము సాక్ష్యమిచ్చును.”

రక్షకుని యొక్క పునఃస్థాపించబడిన సంఘ సభ్యులుగా, “తప్పులులేకుండా అనువదించబడినంత వరకు బైబిలు దేవుని వాక్యమని మేము నమ్ముచున్నాము; మోర్మన్ గ్రంథము కూడా దేవుని వాక్యమని మేము నమ్ముచున్నాము.” మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన, ఇది బైబిలు యొక్క సత్యమును నిర్ధారిస్తుంది మరియు బైబిలు నుండి తీసివేయబడిన స్పష్టమైన ప్రశస్థమైన వాక్యములను పునఃస్థాపిస్తుంది.

యాజకత్వము పునఃస్థాపించబడింది

రక్షకునిచేత స్థాపించబడిన మొదటి సంఘము, దాని దైవిక అధికారం, సిద్ధాంతం, నిబంధనలు మరియు విధులతో సహా భూమిపై నుండి కోల్పోబడిందని యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము బోధిస్తుంది. కడవరి దినాలలో అన్ని విషయాల యొక్క ప్రవచనాత్మక పునఃస్థాపనలో భాగంగా, ప్రాచీన ప్రవక్తలు మరియు అపొస్తలులు వ్యక్తిగతంగా జోసెఫ్ స్మిత్‌కు యాజకత్వ అధికారాన్ని అనుగ్రహించి, యాజకత్వ తాళపుచెవులను అప్పగించారు. రక్షకుని యొక్క పునఃస్థాపించబడిన సంఘము యొక్క అధికారిక ఏర్పాటుకు దారితీసిన అద్భుతమైన అనుభవాల క్రమంలో ఇది మూడవది.

యాజకత్వ అధికారం “[ఆయనకు] ప్రాతినిధ్యం వహించడానికి మరియు ఆయన నామములో పనిచేయడానికి” దేవుని సేవకులను అనుమతిస్తుంది. “యాజకత్వ తాళపుచెవులు అనగా దేవుని పిల్లల తరఫున యాజకత్వ ఉపయోగాన్ని నడిపించే అధికారము.”

యాజకత్వము యొక్క పునఃస్థాపన.

తండ్రి మరియు కుమారుని మార్గదర్శకత్వం క్రింద, పునరుత్థానం చెందిన బాప్తిస్మమిచ్చు యోహాను, 1829లో, పాప విమోచన కొరకు ముంచడం ద్వారా బాప్తిస్మం ఇచ్చే అధికారాన్ని పునఃస్థాపించాడు. అదే సంవత్సరంలో, మొదటి పన్నెండుమంది అపొస్తలులలో ముగ్గురైన—పేతురు, యాకోబు, యోహాను—అపొస్తలత్వమును మరియు అదనపు యాజకత్వ అధికారమును, తాళపుచెవులను పునఃస్థాపించారు.

సంఘము యొక్క అధికారిక ఏర్పాటు తర్వాత ఆరు సంవత్సరాలకు, కర్ట్‌లాండ్ దేవాలయంలో మోషే, ఎలియాసు మరియు ఏలీయా కడవరి దినాల్లో దేవుని పనిని సాధించడానికి అవసరమైన అదనపు అధికారాన్ని జోసెఫ్‌కు అప్పగించారు.

ఇశ్రాయేలు సమకూర్పు యొక్క తాళపుచెవులను మోషే అప్పగించాడు.

అబ్రాహాము నిబంధన యొక్క పునఃస్థాపనతో సహా, అబ్రాహాము సువార్త యొక్క యుగమును ఎలియాసు అప్పగించాడు.

ఏలీయా ముద్రవేయు శక్తి యొక్క తాళపుచెవులను అప్పగించాడు, భూమిపై నిర్వహించబడే విధులు నిత్యత్వంలో బంధించబడేలా అనుమతించే అధికారాన్ని అప్పగించాడు, అంటే మరణాన్ని అధిగమించే నిత్య సంబంధాలలో కుటుంబాలను కలపడం వంటివి.

యేసు క్రీస్తు యొక్క సంఘము ఏర్పాటు చేయబడింది

జోసెఫ్ స్మిత్ మోర్మన్ గ్రంథాన్ని అనువదించినప్పుడు, యేసు క్రీస్తు యొక్క సంఘము తిరిగి స్థాపించబడుతుందని సూచించే బయల్పాటులను అతను అందుకున్నాడు. కానీ తన సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయవద్దని ప్రభువు జోసెఫ్‌కు ఉపదేశించారు. బదులుగా, “ప్రవచనము మరియు బయల్పాటు ఆత్మ ద్వారా” ప్రభువు “ఒక నిర్ణీత దినమున [మరియొకసారి] ఈ భూమిపై ఆయన సంఘాన్ని ఏర్పాటు చేయుటలో [అతను] ఏవిధముగా ముందుకు సాగాలో” జోసెఫ్‌కు బయల్పరిచారు.

యాజకత్వం పునఃస్థాపించబడి, మోర్మన్ గ్రంథము ప్రచురించబడిన తర్వాతే సంఘము సరైన క్రమంలో ఏర్పాటు చేయబడింది. మోర్మన్ గ్రంథము యొక్క మొదటి కాపీలు 1830, మార్చి 26న అందుబాటులోకి వచ్చాయి మరియు సంఘము అధికారికంగా ఏప్రిల్ 6న ఏర్పాటు చేయబడింది.

రక్షకుడైన యేసు క్రీస్తు.

“యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము … క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన క్రొత్త నిబంధన సంఘము. ఈ సంఘము దాని ప్రధాన మూలరాయియైన యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ జీవితముతో, ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తము మరియు యథార్థమైన పునరుత్థానముతో స్థిరంగా అనుసంధానించబడింది. యేసు క్రీస్తు మరొకసారి అపొస్తలులను పిలిచి, వారికి యాజకత్వ అధికారమును అనుగ్రహించారు. ఆయన మనందరినీ తన యొద్దకు, ఆయన సంఘము యొద్దకు రమ్మని, పరిశుద్ధాత్మను, రక్షణ విధులను, శాశ్వతమైన ఆనందమును పొందమని ఆహ్వానిస్తున్నారు.”

కాలముల సంపూర్ణ యుగము

తండ్రి మరియు కుమారుడు జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమవడం, మోర్మన్ గ్రంథ అనువాదం మరియు రాకడ, యాజకత్వ అధికారం మరియు తాళపుచెవుల పునఃస్థాపన అనేవి 195 సంవత్సరాల క్రితం ఇదే రోజు ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘం ఏర్పాటుకు కావలసిన ముందస్తు అవసరాలు.

పాత నిబంధనలో, ప్రవక్త అయిన దానియేలు, చేతి సహాయము లేకుండా పర్వతమునుండి తీయబడిన రాయి భూమియంతటిని నింపే కలను వివరించాడు. సంఘము ఏర్పాటు చేయబడిన ఒక సంవత్సరం తర్వాత, దేవుని రాజ్యపు తాళపుచెవులు మరలా “భూమి మీద మనుష్యునికి ఇవ్వబడినవి” మరియు “చేతి సహాయము లేకుండా పర్వతమునుండి తీయబడిన రాయి వలె [యేసు క్రీస్తు యొక్క] సువార్త భూదిగంతముల వరకు బయలువెళ్ళును” అని ప్రభువు జోసెఫ్ స్మిత్‌కు నిర్దేశించారు.

ప్రభువు తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. రక్షకుని యొక్క పునఃస్థాపించబడిన సంఘము ప్రపంచమంతటా ఏర్పాటు చేయబడింది మరియు అది, “పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవే గాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చడానికి” దేవుడు ఉపయోగించే సాధనం.

ప్రభువు యొక్క కడవరి-దిన కార్యము “అన్ని కాలాల్లో దేవుని జనులను ఆకర్షించిన ఒక కారణం; ఈ విషయంపై ప్రవక్తలు, యాజకులు, రాజులు ప్రత్యేక ఆనందంతో నివసించారు; మనం జీవించే రోజు కోసం వారు ఆనందకరమైన నిరీక్షణతో ఎదురుచూసారు; పరలోకపు ఆనందకరమైన నిరీక్షణలతో వెలిగింపబడి, వారు మన రోజు గురించి పాడారు, వ్రాసారు మరియు ప్రవచించారు.”

సువార్త యుగాలన్నిటిలో ఈ గొప్ప మరియు చివరి దానిలో, “మొత్తము అంతయు పరిపూర్ణముగా ఐక్యమై, యుగములు, తాళపుచెవులు, అధికారములు, మహిమలు జతచేయబడి, ఆదాము దినముల నుండి నేటివరకు బయలుపరచబడును. ఇదియేకాక, లోకము పునాది వేయబడినప్పటి నుండి ఎన్నడూ బయలుపరచబడని విషయాలు … కాలముల సంపూర్ణ యుగములో బయలుపరచబడును.”

ప్రవక్తయైన జోసెఫ్ ఇంకా ఇలా వివరించారు, “ఏ యుగాలలోనైనా సర్వశక్తిమంతుడి ఆదేశాలు మరియు ఆజ్ఞల ప్రకారం, యాజకత్వానికి అవసరమైన అన్ని విధులు మరియు బాధ్యతలు చివరి యుగంలో ఉంటాయి … పరిశుద్ధ ప్రవక్తలందరి నోటి ద్వారా చెప్పబడిన పునఃస్థాపనను నెరవేరుస్తాయి.”

వాగ్దానాలు మరియు సాక్ష్యము

ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా పొందగలిగే అతి ముఖ్యమైన మరియు మహిమాన్వితమైన “సువార్త”—అనగా ప్రభువైన యేసు క్రీస్తు కడవరి దినాల్లో తన సువార్తను మరియు సంఘాన్ని పునఃస్థాపించారనే సందేశం యొక్క ప్రాథమిక అంశాలను సంగ్రహించడానికి నేను ప్రయత్నించాను.

ఈ సందేశం గురించి తెలుసుకోమని, నిరూపించమని నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. “పునఃస్థాపన సందేశమును ప్రార్థనాపూర్వకముగా అధ్యయనము చేసి, విశ్వాసముతో వ్యవహరించే వారు [పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత] స్వంతముగా దాని దైవత్వము యొక్క సాక్ష్యమును మరియు మన ప్రభువు, రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క వాగ్దానము చేయబడిన రెండవ రాకడ కొరకు ప్రపంచమును సిద్ధము చేయవలెననే దాని ఉద్దేశము యొక్క సాక్ష్యమును పొందుటకు ఆశీర్వదింపబడెదరని” నేను వాగ్దానమిస్తున్నాను. యువ జోసెఫ్ స్మిత్ చేసినట్లుగా, దేవుని నుండి సమాధానం పొందాలని, దాని ప్రకారం చర్య తీసుకోవాలనే ఆశతో మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు, ఆ దైవిక సాక్ష్యాన్ని గుర్తించి, ప్రతిస్పందించే మీ సామర్థ్యం పెరుగుతుంది.

నిత్యుడైన తండ్రి మన తండ్రియని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు తండ్రి యొక్క ప్రియమైన కుమారుడని మరియు శరీరమందు ఆయన అద్వితీయుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మన రక్షకుడు మరియు విమోచకుడు.

తండ్రి మరియు కుమారుడు బాలుడైన జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమయ్యారని, ఆవిధంగా కడవరి దినములలో యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన ప్రారంభించబడిందని నేను ఆనందంగా సాక్ష్యమిస్తున్నాను. మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన మరియు దేవుని వాక్యాన్ని కలిగియుంది. రక్షకునికి ప్రాతినిధ్యం వహించడానికి మరియు ఆయన నామములో పనిచేయడానికి యాజకత్వ అధికారము మరలా భూమి మీద లభ్యమైంది. మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము, క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన క్రొత్త నిబంధన సంఘము. ఈ విషయాలన్నీ సత్యమని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నిశ్చయంగా నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.