సర్వసభ్య సమావేశము
ఆయనలో ఆధ్యాత్మికంగా పరిపూర్ణులగుట
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


11:29

ఆయనలో ఆధ్యాత్మికంగా పరిపూర్ణులగుట

పరిపూర్ణత అంటే అర్థం ఈ జీవితంలో శారీరక మరియు భావోద్వేగ పునరుద్ధరణ అని మాత్రమే కాదు. పరిపూర్ణత అనేది యేసు క్రీస్తుపై విశ్వాసం నుండి, పరివర్తన నుండి పుడుతుంది.

పదిమంది కుష్ఠురోగులు “మమ్ము కరుణించుము” అని రక్షకునికి మొరపెట్టారు. యేసు క్రీస్తు కరుణించారు. మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని ఆయన వారితో చెప్పారు. వారు వెళ్లుచుండగా, శుద్ధులయ్యారు.

వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుడిని మహిమపరిచాడు. రక్షకుని వద్దకు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన పాదాలవద్ద సాగిలపడ్డాడు.

కృతజ్ఞత గలవానితో రక్షకుడు– “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను” అని చెప్పారు.

యేసు పదిమంది కుష్ఠురోగులను స్వస్థపరిచారు. కానీ ఒకడు రక్షకుని వద్దకు తిరిగివచ్చి, కొంత అదనంగా పొందాడు. అతడు పరిపూర్ణంగా చేయబడ్డాడు.

తొమ్మిదిమంది కుష్ఠురోగులు శారీరకంగా స్వస్థపరచబడ్డారు.

ఒకడు శారీరకంగా స్వస్థపరచబడ్డాడు మరియు ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా చేయబడ్డాడు.

ఈ కథను ధ్యానిస్తూ నేను, పరివర్తన నిజమైనదేనా అని ఆశ్చర్యపడ్డాను. స్వస్థత మరియు పరిపూర్ణత ఒకటి కాకపోతే, ఒకడు ఆయనచేత ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా చేయబడినప్పటికీ శరీరపరంగా మరియు భావోద్వేగపరంగా ఇంకా స్వస్థపడకుండా ఉండగలడా?

గొప్ప వైద్యుడు మన—శారీరక మరియు భావోద్వేగ— బాధలన్నిటినీ ఆయన యుక్తకాలములో స్వస్థపరుస్తారు. కానీ స్వస్థపడడానికి వేచియున్నప్పుడు, ఒకరు పరిపూర్ణంగా చేయబడగలరా?

ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా ఉండడమంటే అర్థమేమైయుండవచ్చు?

యేసు క్రీస్తును విశ్వాసంతో అనుసరించడానికి మనం మన కర్తృత్వాన్ని సాధన చేసినప్పుడు, ఆయన మన హృదయాలను మార్చగలిగేలా వాటిని ఆయనకు సమర్పించినప్పుడు, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు మరియు మనం ఆయన సన్నిధికి తిరిగివెళ్ళి, అన్ని విధాలుగా స్వస్థపరచబడేవరకు ఈ మర్త్య జీవితపు సవాళ్లను సాత్వికంగా సహిస్తూ, వాటి నుండి నేర్చుకుంటూ ఆయనతో నిబంధన సంబంధంలోకి ప్రవేశించినప్పుడు మనం ఆయనలో పరిపూర్ణులవుతాము. ఆయనతో నా సంబంధంలో నేను మనస్ఫూర్తిగా ఉంటే, స్వస్థత కోసం నేను వేచియున్నప్పుడు, నేను పరిపూర్ణం కాగలను.

యేసు క్రీస్తునందు విశ్వాసము నిరీక్షణనిస్తుంది. పరిపూర్ణంగా ఉండడంలో—యేసు క్రీస్తునందు విశ్వాసము నుండి పుట్టిన పరిపూర్ణత కోసం కృషి చేయడంలో నేను నిరీక్షణను కనుగొంటాను. ఆయన యందు విశ్వాసం స్వస్థత పట్ల నా నిరీక్షణను పెంచుతుంది మరియు ఆ నిరీక్షణ యేసు క్రీస్తునందు నా విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇది ఒక శక్తివంతమైన చక్రం.

అతని విశ్వాసము అతన్ని “స్వస్థపరిచెను” అని ప్రభువు ఈనస్‌తో చెప్పారు. బలమైన ప్రార్థన యందు ఈనస్ దేవునికి మొరపెడుతూ, నిత్య జీవము కొరకైన అవకాశాన్ని అర్థం చేసుకోవడానికి బలమైన కోరిక కలిగియుండి, అతని తండ్రి-ప్రవక్తయైన జేకబ్ మాటలపై ధ్యానించినప్పుడు అతనికి పరిపూర్ణత వచ్చింది. ఆ కోరిక మరియు వినయం యొక్క స్థితిలో, అతని పాపాలు క్షమించబడ్డాయని ప్రకటిస్తూ ప్రభువు యొక్క స్వరం అతనికి వినిపించింది. ప్రభువా, “ఇది ఎట్లు చేయబడెను?” అని ఈనస్ అడిగాడు. “క్రీస్తు యందు నీ విశ్వాసము కారణంగా, … నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను” అని ప్రభువు జవాబిచ్చారు.

యేసు క్రీస్తుపై మనకున్న విశ్వాసం ద్వారా, మనం వేచియుండి, శరీరపరంగా మరియు భావోద్వేగపరంగా స్వస్థత కోసం నిరీక్షిస్తూ ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా ఉండడానికి ప్రయత్నించవచ్చు.

ఆయన ప్రాయశ్చిత్త త్యాగం యొక్క సుగుణం ద్వారా మరియు మనం మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడినప్పుడు, రక్షకుడు ఈనస్‌కు చేసినట్లుగా పాపం నుండి మనల్ని స్వస్థపరుస్తారు. ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తం మన బాధలను మరియు దుఃఖాలను కూడా చేరుకుంటుంది.

కానీ ఆయన అనారోగ్యం మరియు వ్యాధి నుండి—దీర్ఘకాలిక నొప్పి, మల్టిపుల్ స్క్లెరోసిస్, క్యాన్సరు, ఆందోళన, నిరాశ మరియు అలాంటి స్వయం ప్రతిరక్షక రుగ్మతల నుండి స్వస్థతను అందించకపోవచ్చు. ఆ రకమైన స్వస్థత ప్రభువు యొక్క యుక్తకాలములో కలుగుతుంది. మరియు ఈలోగా, ఆయనపై మన విశ్వాసాన్ని అభ్యసించడం ద్వారా మనం పరిపూర్ణంగా ఉండడానికి ఎంచుకోవచ్చు!

పరిపూర్ణంగా ఉండడం అంటే పూర్తిగా మరియు సంపూర్ణంగా ఉండడం అని అర్థం. పెండ్లికుమారుడు వచ్చినప్పుడు తమ దీపాలను నూనెతో నింపిన ఐదుగురు బుద్ధిగల కన్యకల మాదిరిగానే, మనం మన దీపాలను యేసు క్రీస్తుకు పరివర్తన చెందడమనే పోషకమైన నూనెతో నింపినప్పుడు మనం ఆయనలో పరిపూర్ణంగా ఉండగలము. ఆ విధంగా, మనం సూచనార్థక వివాహ విందు అయిన ఆయన రెండవ రాకడకు సిద్ధంగా ఉన్నాము.

ఉపమానంలో, పదిమంది కన్యకలు సరైన స్థానంలో ఉండి, పెండ్లికుమారుని కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ ఒక దీపంతో వచ్చారు.

కానీ ఆయన ఊహించని అర్థరాత్రి సమయంలో వచ్చినప్పుడు, బుద్ధిలేని ఐదుగురి వద్ద వారి దీపాలకు సరిపడా నూనె లేదు. వారు దుష్టులుగా వర్ణించబడలేదు, కానీ బుద్ధిలేని వారిగా వర్ణించబడ్డారు. బుద్ధిలేని వారు తమ దీపాలను పరివర్తన తైలంతో వెలిగించడానికి తగినంతగా సిద్ధం చేసుకోలేకపోయారు.

కాబట్టి, వివాహ విందులోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వమని వారు చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, పెండ్లికుమారుడు, “మీరు నన్ను ఎరుగరు” అని జవాబిచ్చాడు.

అది, ఐదుగురు బుద్ధిగల కన్యకలు ఆయనను ఎరుగుదురని సూచిస్తుంది. వారు ఆయనలో పరిపూర్ణంగా ఉన్నారు.

వారి దీపాలు విలువైన పరివర్తన తైలంతో నిండి ఉన్నాయి, అది బుద్ధిగల కన్యకలు పెండ్లికుమారుని కుడి వైపున వివాహ విందులోకి ప్రవేశించడానికి వీలు కల్పించింది.

రక్షకుని చేత వ్యక్తపరచబడినట్లుగా, “ఎల్లప్పుడు ప్రార్థించుచు విశ్వాసముగా నుండుము, మీ దివిటీలను సరిచేసి, మండించుచు మీతో నూనెను తీసుకొనిపొమ్ము, తద్వారా పెండ్లికుమారుని రాకడకు మీరు సిద్ధపడియుండవచ్చును.”

ఐదుగురు బుద్ధిగల కన్యకలు, బెన్ హామండ్ చేత

ఐదుగురు బుద్ధిగల కన్యకలు, బెన్ హామండ్ చేత

ఐదుగురు బుద్ధిగల కన్యకలను వర్ణించే అద్భుతమైన శిల్పం ఇటీవల టెంపుల్ స్క్వేర్‌లో ఉపశమన సమాజ భవనం యొక్క ద్వారం వెలుపల మరియు సాల్ట్ లేక్ దేవాలయం దగ్గర ఉంచబడింది.

ఇది ఉపమానాన్ని వివరించడానికి తగిన ప్రదేశం. ఎందుకంటే మనం నిబంధనలు చేసి పాటించినప్పుడు, ముఖ్యంగా ప్రభువు యొక్క మందిరంలో లభ్యమయ్యే వాటిని పాటించినప్పుడు, మనం మన దీపాలను పరివర్తన తైలంతో నింపుతాము.

తమ వెలుగును పంచుకుంటున్న ఐదుగురు బుద్ధిగల కన్యకలు.
ఒకరికొకరు మద్దతిచ్చుకుంటున్న ఐదుగురు బుద్ధిగల కన్యకలు.

ఐదుగురు బుద్ధిగల కన్యకలుగా సూచించబడిన స్త్రీలు తమ పరివర్తన తైలాన్ని పంచుకోకపోయినా, నూనెతో నిండిన మరియు ప్రకాశవంతంగా మండుతున్న తమ దీపాలను పైకెత్తి పట్టుకుని తమ వెలుగును పంచుకుంటున్నారు. విశేషమేమిటంటే, వారు ఒకరికొకరు మద్దతిచ్చుకుంటూ—ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసి, కళ్ళలోకి చూస్తూ, ఇతరులను ఆ వెలుగు వద్దకు రమ్మని సైగ చేస్తున్నట్లు చిత్రీకరించబడ్డారు.

నిజానికి, “[మనము] లోకమునకు వెలుగైయున్నాము.” రక్షకుడు ఇలా ప్రకటించారు:

“మీరు ఈ జనులకు వెలుగైయుండవలెనని నేను మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను. కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు.

“… [మనము] దీపము వెలిగించి, దానిని కుంచము క్రింద పెడతామా? లేదు, కానీ అది ఇంటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంబము మీదనే పెడతాము.

“కావున, ఈ జనులు మీ సత్‌క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.”

ఆయన వెలుగును పంచుకోవాలని మనం ఆజ్ఞాపించబడ్డాము. కాబట్టి మీ దీపాన్ని యేసు క్రీస్తుకు పరివర్తన చెందడమనే నూనెతో నింపండి మరియు మీ దీపాన్ని చక్కపరచి, ప్రకాశవంతంగా మండించడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు ఆ వెలుగును ప్రకాశింపజేయండి. మనం మన వెలుగును పంచుకున్నప్పుడు, మనం యేసు క్రీస్తు యొక్క ఉపశమనాన్ని ఇతరులకు కలిగిస్తాము, ఆయన పట్ల మన పరివర్తన మరింత అధికమవుతుంది మరియు మనం స్వస్థత కోసం వేచి ఉన్నప్పుడు కూడా మనం పరిపూర్ణంగా ఉండగలము. మనం మన వెలుగును ప్రకాశవంతంగా ప్రకాశింపజేసినప్పుడు, మనం వేచి ఉన్నప్పటికీ ఆనందంగా ఉండగలము.

స్వస్థత కోసం మనం వేచి ఉన్నప్పటికీ, యేసు క్రీస్తుకు పరివర్తన చెంది, ఆయన నుండి బలాన్ని పొందినప్పుడు మనం పరిపూర్ణంగా ఉండగలమనే సూత్రాన్ని బలోపేతం చేయడంలో ఒక లేఖన ఉదాహరణ ఉపయోగపడుతుంది.

అపొస్తలుడైన పౌలుకు ఏదో బాధ ఉంది—దానిని అతను “శరీరంలో ఒక ముల్లు” అని వర్ణించాడు, దానిని తొలగించమని అతను మూడుసార్లు ప్రభువును అడిగాడు. “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది” అని ప్రభువు పౌలుతో చెప్పారు. దానికి పౌలు ఇలా ప్రకటించాడు:

“కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.

“నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, … ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.”

మన బలహీనతలో కూడా, యేసు క్రీస్తు నందు మన బలము పరిపూర్ణం చేయబడగలదని—అంటే, పూర్తిగా మరియు సంపూర్ణంగా చేయబడగలదని పౌలు ఉదాహరణ సూచిస్తుంది. మర్త్య బాధలతో పోరాడుతూ, పౌలు లాగా విశ్వాసంతో దేవుని వైపు తిరిగేవారు, దేవుడిని తెలుసుకోవడం ద్వారా ఆశీర్వాదాలను పొందగలరు.

పౌలు తన బాధ నుండి స్వస్థత పొందలేదు, కానీ అతను యేసు క్రీస్తులో ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా ఉన్నాడు. అతని కష్టకాలంలో కూడా, అతని పరివర్తన మూలంగా వచ్చిన ప్రభావం మరియు యేసు క్రీస్తు నుండి వచ్చే బలం ప్రకాశిస్తోంది మరియు అతను ఆనందంగా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన తన లేఖలో అతనిలా బిగ్గరగా చెప్పాడు, “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.”

సహోదరీ సహోదరులారా, జవాబు అవును, మనం శరీరపరంగా మరియు భావోద్వేగపరంగా స్వస్థత కోసం వేచి ఉన్నప్పటికీ, మనం ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా ఉండగలం. పరిపూర్ణత అంటే అర్థం ఈ జీవితంలో శారీరక మరియు భావోద్వేగ పునరుద్ధరణ అని మాత్రమే కాదు. పరిపూర్ణత అనేది యేసు క్రీస్తుపై విశ్వాసం నుండి, పరివర్తన నుండి మరియు ఆ పరివర్తన యొక్క వెలుగును ప్రకాశింపజేయడం నుండి వస్తుంది.

“కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడడానికి [ఎన్నుకొనువారు] కొందరే.”

పునరుత్థానములో అందరూ శరీరపరంగా మరియు భావోద్వేగపరంగా స్వస్థత పొందుతారు. కానీ మీరు ఆయనలో పరిపూర్ణంగా ఉండడానికి ఇప్పుడు ఎంచుకుంటారా?

నేను ప్రభువైన యేసు క్రీస్తుకు పరివర్తన చెందానని ఆనందంగా ప్రకటిస్తున్నాను. నేను ఆయనలో పరిపూర్ణంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఆయన యుక్తకాలములో అన్ని విషయాలు పునరుద్ధరించబడతాయని మరియు స్వస్థత కలుగుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే ఆయన జీవిస్తున్నారు.

మగ్దలేనే మరియ యేసు క్రీస్తు ద్వారా స్వస్థత పొందిన స్త్రీ. ఆమె యేసు క్రీస్తులో పరిపూర్ణ స్త్రీ. ఆయన శిష్యురాలిగా, ఆమె గలిలయ అంతటా రక్షకుడిని అనుసరించి ఆయనకు పరిచర్య చేసింది.

శిలువ వద్ద ఆమె ఆయన మరణానికి సాక్షిగా ఉంది.

సమాధి ఏర్పాట్లు పూర్తి చేయడానికి ఆమె సమాధికి వెళ్ళింది మరియు రాయి తొలగించబడిందని, ప్రభువు యొక్క శరీరం అక్కడ లేదని కనుగొంది. మరియ సమాధి వద్ద ఏడుస్తూ ఉండగా, మొదట దేవదూతలు మరియు తరువాత రక్షకుడు వచ్చి, “అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదకుచున్నావు?” అని ఆమెను అడిగారు.

“నా ప్రభువును ఎవరో యెత్తికొనిపోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదు” అని మరియ ఏడ్చింది.

యేసు ఆమెను ఆప్యాయంగా “మరియ” అని పిలిచారు. ఆమె ఆయనను గుర్తించి భక్తితో, “రబ్బూనీ … బోధకుడా” అని జవాబిచ్చింది.

రక్షకుని గురించి ప్రవచిస్తూ యెషయా ఇలా అన్నాడు, “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును.”

ఆయన పునరుత్థానం మరియ కన్నీళ్లను తుడిచివేయడానికి అనుమతించింది. నిశ్చయంగా ఆయన మీ కన్నీళ్లను కూడా తుడిచివేస్తారు.

పునరుత్థానుడైన రక్షకునికి మొదటి సాక్షి మరియ. తాను చూసిన దాని గురించి ఆమె ఇతరులకు మొదట సాక్ష్యమిచ్చింది.

నేను వినయంగా నా సాక్ష్యాన్ని మరియ సాక్ష్యానికి జోడిస్తున్నాను. ఆయన లేచియున్నాడు. యేసు క్రీస్తు జీవిస్తున్నారు. చివరికి, అందరూ ఆయనలో శరీరపరంగా మరియు భావోద్వేగపరంగా స్వస్థత పొందుతారు. ఆ స్వస్థత కోసం వేచియుండడంలో, గొప్ప వైద్యుని‌పై విశ్వాసం మనల్ని ఆధ్యాత్మికంగా పరిపూర్ణం చేస్తుంది. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. లూకా 17:11–19 చూడండి. “పరిపూర్ణులుగా చేయుట” అనే పదం గ్రీకు పదం నుండి అనువదించబడింది, దీని అర్థం రక్షించడం, కాపాడడం, విడుదల చేయడం లేదా స్వస్థపరచడం. యేసు క్రీస్తు మనల్ని శారీరకంగా స్వస్థపరచగలరు మరియు ఆయన మనల్ని ఇతర విధాలుగా కూడా విడిపించగలరు, రక్షించగలరు, కాపాడగలరు మరియు స్వస్థపరచగలరు అనే ముఖ్యమైన సత్యాన్ని అది నొక్కి చెబుతుంది.

  2. ఆల్మా 40:23 చూడండి: “ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకు పునఃస్థాపించబడును; ప్రతి అవయవము మరియు కీలు దాని శరీరమునకు పునఃస్థాపించబడును; కనీసము ఒక్క తల వెంట్రుక కూడా నశించిపోదు, కానీ సమస్తము వాటి సరియైన, పరిపూర్ణ రూపమునకు పునఃస్థాపించబడును.” See also Russell M. Nelson, “Jesus Christ—the Master Healer,” Liahona, Nov. 2005, 87: “పునరుత్థాన వరము ప్రభువు యొక్క సంపూర్ణ స్వస్థత చర్య.”

  3. మొరోనై 7:40–42 చూడండి.

  4. ఈనస్ 1:8.

  5. ఈనస్ 1:7.

  6. ఈనస్ 1:8.

  7. మత్తయి 25:1–13 చూడండి.

  8. అదనపు నూనె కలిగియుండడం ముఖ్యం లేదా అవసరం అని వారు భావించలేదు, కాబట్టి అది మూర్ఖత్వం.

  9. జోసెఫ్ స్మిత్ అనువాదము, మత్తయి 25:12 (మత్తయి 25:12 లో, footnote a).

  10. పదిమంది కన్యకల ఉపమానం గురించి ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు:

    “దయచేసి కన్యకల చేత ఉపయోగించబడిన దీపాలను సాక్ష్యపు దీపాలుగా అనుకోండి. బుద్ధిలేని కన్యకలు తమ సాక్ష్యపు దీపాలను తీసుకున్నారు, కానీ వారితోపాటు నూనె తీసుకోలేదు. ఆ నూనెను పరివర్తన తైలంగా పరిగణించండి.

    “ఐదుగురు బుద్ధిగల కన్యకలు స్వార్థపరులా మరియు పంచుకోవడానికి ఇష్టపడలేదా లేక వారు పరివర్తన తైలాన్ని అరువుగా తీసుకోలేమని సరిగ్గా సూచిస్తున్నారా? ఆజ్ఞలకు స్థిరమైన విధేయత చూపడం నుండి వచ్చే ఆధ్యాత్మిక బలాన్ని మరొక వ్యక్తికి ఇవ్వగలమా? శ్రద్ధగా అధ్యయనం చేయడం మరియు లేఖనాలను ధ్యానించడం ద్వారా పొందిన జ్ఞానాన్ని అవసరంలో ఉన్నవారికి అందించగలమా? విశ్వాసపాత్రుడైన కడవరి-దిన పరిశుద్ధుడికి సువార్త తీసుకువచ్చే శాంతిని ప్రతికూలత లేదా గొప్ప సవాలును ఎదుర్కొంటున్న వ్యక్తికి బదిలీ చేయగలమా? లేదు అనేది ఈ ప్రశ్నలలో ప్రతిదానికీ స్పష్టమైన సమాధానం.”

    ఆయన ఇంకా వివరిస్తూ, “మన సాక్ష్యపు దీపాన్ని వెలిగిస్తూ, పరివర్తన యొక్క నూనెను తగినంతగా పొందే వ్యక్తిగత బాధ్యత మనపై ఉంది. ఈ విలువైన నూనె ఒక్కొక్క చుక్క చొప్పున—‘ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ [మరియు] సూత్రము వెంబడి సూత్రము’గా (2 నీఫై 28:30), ఓపికతో మరియు పట్టుదలతో పొందబడుతుంది. అడ్డదారి ఏదీ లేదు; చివరి నిమిషంలో త్వరత్వరగా సిద్ధపడడం సాధ్యం కాదు” (“Converted unto the Lord,” Liahona, Nov. 2012, 109).

  11. సిద్ధాంతము మరియు నిబంధనలు 33:17. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు ఇలా ఉపదేశించారు: “మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడేందుకు మీకు మరియు నాకు సమయమిదే. మన శిష్యత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఇదే” (“ప్రభువైన యేసు క్రీస్తు మరలా వస్తారు,” లియహోనా, నవ. 2024, 121).

  12. The Five Wise Virgins [ఐదుగురు బుద్ధిగల కన్యకలు] యొక్క శిల్పి కళాకారుడైన బెన్ హామండ్, యేసు క్రీస్తు యొక్క పరివర్తన చెందిన శిష్యులైన మహిళల వైవిధ్యాన్ని సూచిస్తూ, ఐదుగురు బుద్ధిగల కన్యకలను వివిధ వయస్సులు మరియు జాతి నేపథ్యాలు గల మహిళలుగా చిత్రీకరించాడు.

  13. మనం సంస్కారంలో పాలుపంచుకున్నప్పుడు, మనం దేవునితో చేసిన మన నిబంధనలన్నిటిని నూతనపరుస్తాము మరియు మనపై యేసు క్రీస్తు యొక్క నామమును తీసుకోవడానికి మరియు ఆయన ఆజ్ఞలకు విధేయులైయుండడానికి సమ్మతిస్తున్నామని ఒక కొత్త నిబంధన చేస్తాము. యాజకత్వ విధులలో యోగ్యులుగా పాల్గొనడం మరియు నిబంధనలను చేసి, పాటించడం మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. “Bread of Life, Living Water [జీవాహారము, జీవజలము]” అనే సంస్కార కీర్తనలో ఈ సూత్రము అందంగా వ్యక్తపరచబడింది:

    జీవాహారము, జీవజలము,

    నా ఆత్మకు ఆహారమిచ్చును, నా హృదయమును నింపును.

    ప్రభువా, నీలో నాకు కొత్త జీవమిమ్ము

    నన్ను పరిపూర్ణంగా—సంపూర్ణంగా మరియు పరిశుద్ధంగా చేయుము—

    నిత్యము నీతో బంధింపబడేలా.

    (Hymns—For Home and Church, Gospel Library; emphasis added.)

  14. మత్తయి 5:14.

  15. 3 నీఫై 12:14–16.

  16. ఆ కీర్తనలోని మాటలలో:

    This little light of mine, I’m gonna let it shine [నా ఈ చిన్న వెలుగును, నేను ప్రకాశింపజేస్తాను]. …

    నేను ఎక్కడికి వెళ్ళినా, దానిని ప్రకాశింపజేస్తాను. …

    Jesus gave it to me [యేసు దానిని నాకిచ్చారు]; నేను దానిని ప్రకాశింపజేస్తాను.

    దానిని ప్రకాశింపజేస్తాను, ప్రకాశింపజేస్తాను, ప్రకాశింపజేస్తాను.

    (“This Little Light of Mine,” Hymns—For Home and Church, Gospel Library.)

  17. 2 కొరింథీయులకు 12:7.

  18. 2 కొరింథీయులకు 12:8 చూడండి.

  19. 2 కొరింథీయులకు 12:9.

  20. 2 కొరింథీయులకు 12:9–10.

  21. ఫిలిప్పీయులకు 4:4; 2 కొరింథీయులకు 1:3–4 కూడా చూడండి: “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక; దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.”

  22. డేవిడ్ ఎ. బెడ్నార్, “ఓ సీయోనూ, నీ బలము ధరించుకొనుము,” లియహోనా, నవ. 2022, 94.

  23. మత్తయి 22:14; సిద్ధాంతము మరియు నిబంధనలు 121:34–35 కూడా చూడండి.

  24. లూకా 8:2–3 చూడండి.

  25. యోహాను 19:25 చూడండి.

  26. యోహాను 20:15; 13వ వచనము కూడా చూడండి.

  27. యోహాను 20:13.

  28. యోహాను 20:16.

  29. యెషయా 25:8.