జీవితాన్ని గౌరవించడం
మన తండ్రి యొక్క పరిపూర్ణ ప్రణాళికలో జీవితం అత్యంత విలువైన భాగం మరియు ఆయన ఆజ్ఞ ద్వారా మనం జీవితాన్ని గౌరవిస్తాము; జీవితాన్ని కాపాడుకుంటాము.
“మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు,” అని మన రక్షకుడైన యేసు క్రీస్తు మనకు బోధించారు.
ఇటీవల యూటాలోని ఒక బిషప్పు తన వార్డులో ఒక యువతి మరియు ఆమె కుటుంబం పట్ల ప్రేమ కుమ్మరించబడడం గురించి నాతో పంచుకున్నారు. అందమైన వరుస సంఘటనల ద్వారా, తల్లిదండ్రులు రక్షకుని యొద్దకు మరియు ఆయన సంఘానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వారు సంఘం నుండి దూరంగా ఉన్న సమయంలో, యౌవనురాలైన వారి కుమార్తె ఒక యువకుడితో సంబంధం కలిగి ఉంది. తిరిగి వచ్చినప్పుడు, యువతుల సాక్ష్యపు సమావేశంలో ఈ అమూల్యమైన కుమార్తె తన పరలోక తండ్రి నుండి అపారమైన ప్రేమను అనుభవించింది. ఆజ్ఞలను మరింత పూర్తిగా జీవించాలని ఆమె నిశ్చయించుకుంది. “నేను నా బిషప్పుతో పశ్చాత్తాప ప్రక్రియను ప్రారంభించాను,” అని ఆమె వ్రాసింది.
కొంతకాలానికే, ఆమె అనారోగ్యానికి గురైంది. ఆమె మాటల్లో: “[ఒక] పరీక్షలో … నేను గర్భవతి అని తేలింది. నేను … ఏడవడం మొదలుపెట్టాను. … నాన్న నన్ను తన చేతుల్లో చుట్టి, అంతా బాగానే ఉంటుందని హామీ ఇచ్చారు. … నా ప్రియుడు … బిడ్డను వదిలించుకోమని అడిగాడు. … నేను ఒప్పుకోలేదు.”
అవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపుట
ఆమె ఇలా కొనసాగించింది: “మా వార్డు కుటుంబం నుండి నాకు చాలా ప్రేమ మరియు మద్దతు లభించింది. అది చాలా అధికమైనది. [నా] బిషప్పు మరియు యువతుల అధ్యక్షురాలు వారి ప్రేమను, మద్దతును చూపించడానికి ఆశించిన దానికంటే ఎక్కువ చేసారు. … నన్ను, నా కుటుంబాన్ని నడిపిస్తున్న … ప్రభువు హస్తాన్ని నేను చూసాను. … నా వార్డు లాంటి వార్డు ప్రతిఒక్కరికీ, ముఖ్యంగా నా స్థానంలో ఉన్న యువతికి అవసరమైన కుటుంబం లాంటిది.”
ఆమె, ఆమె కుటుంబం మరియు ఆమె వార్డు కుటుంబం గత ఫిబ్రవరిలో ఆమె మగబిడ్డను ప్రేమగా స్వాగతించారు.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు, “ప్రభువు యొక్క నిజమైన మరియు జీవిస్తున్న సంఘము యొక్క ప్రమాణ చిహ్నము దేవుని యొక్క పిల్లలకు ఆయన చేసినట్లుగానే [ప్రేమపూర్వక దయతో పరిచర్య చేయడం] … పరిచర్య చేయుటకు … ఏర్పాటు చేయబడి, నడిపించబడేదిగా ఎల్లప్పుడు ఉండును.”
నీతివంతమైన ఎంపికలకు సహాయపడుట
అనుకోకుండా తనకు బిడ్డ పుట్టబోతోందని తెలుసుకున్నప్పుడు, ఆరోగ్య సమస్యలు, ఆధ్యాత్మిక సంక్షోభం, ఇబ్బంది, ఆర్థిక చింతలు, విద్యాపరమైన ప్రశ్నలు, వివాహ అనిశ్చితి మరియు చెదిరిపోయిన కలల విచారంతో, బాధ మరియు దిగ్భ్రాంతికి గురైన క్షణంలో, ఒక ఒంటరి స్త్రీ మామూలు కంటే భిన్నమైన నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత అది తీవ్రమైన బాధ మరియు విచారం కలిగిస్తుంది.
గర్భస్రావం చేయించుకున్నందుకు లేదా దానిలో పాల్గొన్నందుకు తీవ్రమైన బాధ మరియు విచారం అనుభవించిన వారెవరైనా, దయచేసి గుర్తుంచుకోండి: మనం గతాన్ని మార్చలేకపోయినా, దేవుడు గతాన్ని స్వస్థపరచగలరు. మీరు పశ్చాత్తాపంతో మరియు వినయపూర్వకమైన హృదయంతో ఆయన వైపు తిరిగితే, ఆయన ప్రాయశ్చిత్త కృప యొక్క అద్భుతం ద్వారా క్షమాపణ రాగలదు.
మర్త్య జననం యొక్క పవిత్రతకు తరచుగా రెండు పదాలు జతచేయబడతాయి: జీవితం మరియు ఎంపిక. మన తండ్రి యొక్క పరిపూర్ణ ప్రణాళికలో జీవితం అత్యంత విలువైన భాగం మరియు ఆయన ఆజ్ఞ ద్వారా మనం జీవితాన్ని గౌరవిస్తాము; జీవితాన్ని కాపాడుకుంటాము; మరియు ఒకసారి గర్భం దాల్చిన తర్వాత మనం జీవితం యొక్క కొనసాగింపును ఎంచుకుంటాము. నిత్య సంతోషాన్ని తెచ్చే ఎంపికలను, దేవునిచేత ఆమోదించబడిన నీతివంతమైన ఎంపికలను బలపరచడానికి సహాయపడుతూ—నైతిక కర్తృత్వాన్ని, ఎంపిక చేసుకునే బహుమతిని కూడా మనం విలువైనదిగా భావిస్తాము.
ఒక స్త్రీ మరియు పురుషుడు అటువంటి క్లిష్టమైన ఎంపికను ఎదుర్కొన్నప్పుడు, మన మాటలు, మన చేతులు, మన హృదయాలు—ఆధ్యాత్మికంగా, భావోద్వేగపరంగా మరియు ఆర్థికంగా—రక్షకుని ప్రేమను అనుభవించడానికి వారిని దీవించగలవు మరియు అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ చెప్పినట్లుగా, “వారు చూస్తున్నారని అనుకుంటున్న దాని” నుండి “వారు ఇంకా చూడలేని దాని” వరకు వారికి ఆధ్యాత్మిక గ్రహింపును తీసుకురాగలవు.
మర్త్య జీవితము యొక్క సిద్ధాంతము
అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇలా అన్నారు: “గర్భస్రావం పట్ల మన వైఖరి మర్త్య జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందో బయల్పరచిన జ్ఞానంపై ఆధారపడి ఉండదు. … దేవుని ఆత్మీయ పిల్లలందరూ ఒక మహిమాన్వితమైన ఉద్దేశ్యం కోసం ఈ భూమిపైకి రావాలని, వ్యక్తిగత గుర్తింపు గర్భధారణకు చాలాకాలం ముందే ప్రారంభమైందని మరియు రాబోయే నిత్యత్వమంతటా కొనసాగుతుందని … మన జ్ఞానం ద్వారా నిర్ణయించబడింది.”
ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము చేత చెప్పబడినట్లుగా, పుట్టబోయే బిడ్డ గురించి ప్రభువు వాక్యము ఎన్నడూ మారలేదు మరియు ప్రభువు మన నుండి కోరిన దానికి దైవిక స్పష్టతనిస్తూ, యుగయుగాలుగా ప్రవక్తల మాటలను ప్రతిధ్వనిస్తుంది.
“మానవజాతి యొక్క పవిత్రతయందు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము విశ్వసిస్తుంది. కావున, వ్యక్తిగత లేదా సామాజిక సౌలభ్యం కోసం ఎన్నుకోబడిన గర్భస్రావమును సంఘము వ్యతిరేకిస్తుంది మరియు సభ్యులు గర్భస్రావానికి లోబడకూడదు, నిర్వహించకూడదు, ప్రోత్సహించకూడదు, చెల్లించకూడదు లేదా దానికి ఏర్పాట్లు చేయకూడదు.
“[ప్రభువు] అనుమతించిన సాధ్యమైన మినహాయింపులు ఇవి మాత్రమే:
-
మానభంగము లేదా వావివరుసలు తప్పడం మూలంగా గర్భధారణ జరిగినప్పుడు, లేదా
-
దానిని కొనసాగించడం వలన తల్లి ఆరోగ్యానికి లేదా ప్రాణానికి ముప్పు రాగలదని సమర్థుడైన వైద్యుడు నిర్థారించినప్పుడు, లేదా
-
“పుట్టిన తర్వాత బిడ్డ బ్రతకలేనంతగా పిండానికి తీవ్రమైన లోపాలున్నాయని సమర్థుడైన వైద్యుడు నిర్థారించినప్పుడు.
ప్రథమ అధ్యక్షత్వము ఇలా కొనసాగించారు: “గర్భస్రావం అనేది అత్యంత తీవ్రమైన విషయం. [ఈ అరుదైన పరిస్థితులలో కూడా] బాధ్యులైన వ్యక్తులు ప్రార్థన ద్వారా నిర్ధారణ పొంది,” ఇతరులతో చర్చించిన తర్వాత మాత్రమే దానిని పరిగణించాలి.
ముప్పై సంవత్సరాల క్రితం, ప్రభువు యొక్క ప్రవక్తలు ప్రపంచానికి ఒక ప్రకటన జారీ చేశారు. అందులో ఈ మాటలు ఉన్నాయి:
“పిల్లలను పుట్టించు పవిత్ర శక్తులు చట్టబద్ధముగా భార్యాభర్తలుగా వివాహము చేసుకొనిన స్త్రీ పురుషుల మధ్య మాత్రమే వినియోగింపబడవలెనను ప్రభువు ఆజ్ఞను కూడా మేము ప్రకటించుచున్నాము.
“మర్త్య జీవితమును సృష్టించుటకు ఏర్పరచిన సాధనములు దైవికముగా ఏర్పరచబడినవని మేము ప్రకటించుచున్నాము. జీవితము యొక్క పవిత్రతను మరియు దేవుని నిత్య ప్రణాళికలో దాని ప్రాధాన్యతను మేము రూఢిపరచుచున్నాము.”
ఇంకా పుట్టని బిడ్డను పోషించి, రక్షించాలనే ఆజ్ఞ రాజకీయ దృక్పథంలో ఇచ్చినది కాదు. అది ప్రభువు తన ప్రవక్తల ద్వారా ధృవీకరించిన నైతిక చట్టం.
మరింత సూటిగా మాట్లాడడం
ప్రథమ అధ్యక్షత్వంలో సేవచేసిన అధ్యక్షులు జె. రూబెన్ క్లార్క్ జూనియర్ చేసిన వ్యాఖ్యానం నేటి మన యువతను అందంగా వర్ణిస్తుంది: “సంఘ యువత ఆధ్యాత్మిక విషయాల పట్ల బలమైన కోరికతో ఉన్నారు; వారు సువార్తను నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారు మరియు వారు దానిని నేరుగా, స్వచ్ఛంగా కోరుకుంటారు. వారు … మన నమ్మకాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు; వారు సత్యం గురించి సాక్ష్యాలను పొందాలనుకుంటున్నారు. వారు … ప్రశ్నించేవారు, సత్యాన్ని అన్వేషించేవారు.” మన కుటుంబాలలో, మన ఇళ్లలో, మన యువతతో, మన ఉపశమన సమాజం మరియు పెద్దల సమూహ సమావేశాలలో ప్రభువు యొక్క పవిత్రత యొక్క చట్టము, జీవితం యొక్క పవిత్రత, పుట్టబోయే బిడ్డలు మరియు వారి తల్లుల సంరక్షణ గురించి కనికరముతో, అవగాహనతో మనం తరచుగా మాట్లాడదాం.
ఒక ప్రియమైన సహోదరి దశాబ్దాల క్రితం తనకు ఎదురైన ఒక అనుభవాన్ని నాకు వ్రాసింది: “17 ఏళ్ళ వయస్సున్న … , నేను గర్భవతినని నాకు తెలిసింది, కానీ నా ప్రియుడి నుండి నాకు ఎలాంటి మద్దతు లేదు. నేను అవమాన భారంతో ఒంటరిగా భావించాను, [కానీ నేను] ఎన్నడూ [గర్భస్రావం] గురించి ఆలోచించలేదు. … నాకు ప్రేమగల నా కుటుంబం మరియు నా బిషప్పు ఉన్నారు, నేను మార్గనిర్దేశం కోసం వారిని క్రమం తప్పకుండా కలుసుకున్నాను. … నేను దేవుని వైపు తిరిగాను. నేను లేఖనాలను అధ్యయనం చేసాను … ప్రార్థించాను [మరియు] నా రక్షకుని ద్వారా, పశ్చాత్తాప ప్రక్రియ ద్వారా బలాన్ని పొందాను. … నేను [నా ప్రార్థనలకు] తిరస్కరించలేని సమాధానం పొందాను. … అది హృదయ విదారకంగా ఉంది, కానీ నా కూతురిని దత్తత ఇవ్వాలని నాకు తెలుసు. … నేను ధైర్యం కోసం ప్రార్థించాను [మరియు] పశ్చాత్తాపం ద్వారా రక్షకుని ప్రేమను చాలా స్పష్టంగా అనుభవించాను, దేవుడు … ప్రార్థనలకు సమాధానం ఇస్తారని, మనల్ని బలపరుస్తారని నాకు తెలుసు.”
ఒక ప్రియమైన జంట అమూల్యమైన ఆ బిడ్డను దత్తత తీసుకుని, ఆమెకు సువార్తను బోధించారు. ఆమె ఇప్పుడు పెళ్ళి చేసుకొని, అందమైన స్వంత కుటుంబాన్ని కలిగి ఉంది.
కొన్నిసార్లు జీవితాన్ని కాపాడడంలో తీవ్రమైన కష్టం మరియు బాధాకరమైన అనిశ్చితి కూడా ఉండవచ్చు.
నేను, కాథీ ఇష్టపడే ఒక యువ జంట వారికి పుట్టబోతున్న అమూల్యమైన బిడ్డ గురించి నాకు వ్రాసారు.
తండ్రి ఇలా వ్రాసాడు: “[నా భార్య] 10 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు, మా అద్భుత శిశువుకు డౌన్ సిండ్రోమ్ అని పిలువబడే ట్రిసోమి 21 అనే జన్యుపరమైన సమస్య ఉందని మాకు తెలిసింది. బిడ్డను తొలగించుకోమని … మేము వైద్యుల నుండి ఒత్తిడిని అనుభవించాము. కొన్ని వారాల తర్వాత … పుట్టబోయే మా బిడ్డకు… ఆమె జీవితంలో మొదటి సంవత్సరంలోనే అనేక గుండె శస్త్రచికిత్సలు అవసరమవుతాయని మేము తెలుసుకున్నాము. ఈ ప్రక్రియ అంతటా మేము దైవిక సహాయం కోసం తీవ్రంగా ప్రార్థించినప్పుడు,… ఆత్మ మాకు ఓదార్పునివ్వడాన్ని మేము అనుభవించాము. మా పాప పరలోక తండ్రి యొక్క ఉన్నతమైన బిడ్డ అని, మా కుటుంబంలో ఉండడానికి మరియు భూమిపైకి రావడానికి ఆమెకు అపారమైన కోరిక ఉందని మేము బయల్పాటును, అవగాహనను పొందాము.”
ఆ బిడ్డ తల్లి ఇలా వ్రాసింది: “[మేము] ఆ వార్త విని పూర్తిగా దిగ్భ్రాంతికి, అయోమయానికి గురయ్యాము, నిజంగా నిరాశపడ్డాము. … నేను 14 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు, మా బిడ్డకు పుట్టుకతో వచ్చే గుండె లోపాలు చాలా ఉన్నాయని, అవి ప్రాణాంతకం కావచ్చని మాకు తెలిసింది. 10–18 వారాల గర్భధారణ సమయంలో లెక్కలేనంత మంది వైద్యులను, నిపుణులను మేము కలిసాము. … మేము కలిసిన ప్రతీఒక్కరు, మేము గర్భాన్ని కొనసాగించాలనుకుంటున్నామా లేదా తొలగించుకోవాలనుకుంటున్నామా అని మమ్మల్ని అడిగేవారు. … రక్షకుడు నా హృదయాన్ని స్వస్థపరిచారు మరియు మా పాప గురించి నాకు శాంతిని, ఉత్సాహాన్ని ఇచ్చారు. … [పరలోక తండ్రి] నా కోసం ఒక పరిపూర్ణ ప్రణాళికను కలిగి ఉన్నారని నాకు పదే పదే చూపించారు [మరియు] నేను ఆయనను నమ్ముతున్నాను.”
వారం క్రితం సరిగ్గా ఇదేరోజు వారు ఉత్సాహంతో వారి బిడ్డను స్వాగతించారు. శాశ్వతంగా ఆమె వారికి చెందినది మరియు వారు ఆమెకు చెందినవారు.
చెదరని విశ్వాసం మరియు అసాధారణ ధైర్యం యేసు క్రీస్తు శిష్యుల యొక్క లక్షణాలు.
విశ్వాసం యొక్క విశేషమైన మాదిరి
సంవత్సరాలుగా, సభ్యత్వం కోల్పోయిన చాలా సంవత్సరాల తర్వాత నిబంధన మార్గానికి మరియు వారి యాజకత్వానికి, దేవాలయ ఆశీర్వాదాలకు తిరిగి రావాలని వినయంగా కోరిన స్త్రీ పురుషులను కలిసే భాగ్యం నాకు లభించింది.
ఒక సందర్భంలో, ఒక వ్యక్తి యొక్క యాజకత్వం మరియు దేవాలయ ఆశీర్వాదాల పునరుద్ధరణ కోసం నేను ప్రథమ అధ్యక్షత్వం తరఫున అతన్ని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది.
పరిశుద్ధ దేవాలయంలో వివాహం చేసుకున్న తర్వాత, ముగ్గురు అద్భుతమైన పిల్లలను కన్న తర్వాత, ఆ వ్యక్తి తన భార్యకు మరియు తన పవిత్ర నిబంధనలకు నమ్మకద్రోహం చేశాడు. ఒక అవివాహిత స్త్రీ గర్భవతి అయి, గర్భస్రావం కావాలని కోరుకుంది.
భర్త యొక్క గుణవంతురాలైన భార్య, బిడ్డను కనమని ఆ స్త్రీని వేడుకుంది మరియు బిడ్డ పుట్టిన తర్వాత అతన్ని తన పిల్లలతో పాటు పెంచుతానని వాగ్దానం చేసింది.
అవివాహిత స్త్రీ గర్భాన్ని తొలగించకూడదని ఆలోచించి ఒప్పుకుంది.
ఇప్పటికి పదేళ్ళు గడిచింది. నా ముందు కూర్చున్న వినయపూర్వకమైన సహోదరి ఆ అబ్బాయిని తన స్వంత కొడుకులా ప్రేమించింది మరియు ఆమె భర్త తన తప్పును సరిదిద్దుకోవడానికి, ఆమెను మరియు కుటుంబాన్ని ప్రేమించడానికి, శ్రద్ధ వహించడానికి చేసిన ప్రయత్నాల గురించి నాకు చెప్పింది. ఆమె మాట్లాడుతుండగా ఆ తండ్రి ఏడ్చాడు.
తన భర్త నమ్మకద్రోహాన్ని ప్రతిరోజూ గుర్తుచేసే బిడ్డను ఈ గొప్ప స్త్రీ ఎలా తన స్వంత బిడ్డలా చూసుకోగలిగింది? ఎలా? ఎందుకంటే ఆమె యేసు క్రీస్తు ద్వారా బలాన్ని పొందింది మరియు జీవితం యొక్క పవిత్రతను, పరిశుద్ధతను ఆమె విశ్వసించింది. పుట్టబోయే బిడ్డ దేవుని బిడ్డ అని, అమాయకమైన, స్వచ్ఛమైన వాడని ఆమెకు తెలుసు.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, పుట్టబోయే పిల్లల పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేమ తగ్గుతుండడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. దేవుడు జీవితాన్ని గౌరవిస్తారు. ఆయన పిల్లలకు అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే ఆయన కార్యమును మహిమయైయున్నది. యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా, మనం జీవితాన్ని గౌరవిస్తాము. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” మన అవసరం ఎంతగానో ఉన్నవారితో మన ప్రేమను మరింత సమృద్ధిగా పంచుకుందాం. మీ పట్ల నా ప్రేమను మరియు భూమిపైకి వస్తున్న ఆయన పిల్లల పట్ల మన పరలోక తండ్రికి ఉన్న ప్రేమను నేను వ్యక్తపరుస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.