సర్వసభ్య సమావేశము
దేవుని సముఖమందు ఆత్మస్థైర్యము
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


11:59

దేవుని సముఖమందు ఆత్మస్థైర్యము

దాతృత్వం మరియు సుగుణం మన జీవితాలను నింపాలని మనం శ్రద్ధగా కోరుకున్నప్పుడు, దేవుణ్ణి సమీపించడంలో మన నమ్మకం పెరుగుతుంది.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ముఖ్యమైన సర్వసభ్య సమావేశంలో మీతో మాట్లాడుతున్నందుకు నేను కృతజ్ఞుడిని. నా చూపు మందగిస్తోంది. నా సందేశాన్ని పంచుకుంటున్నప్పుడు అర్థం చేసుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు.

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో గొప్ప వేగము గల దినములో మనం జీవిస్తున్నాము. అనేక రంగాలలో పురోగతిని చూసి నేను చాలా ఆనందంగా ఉన్నాను.

మన యువత చేత నేను ప్రత్యేకంగా ప్రేరేపించబడ్డాను. వారు పెద్ద సంఖ్యలో సేవ చేస్తున్నారు. వారు తమ పూర్వీకులను వెదుకుతూ దేవాలయంలో విధులను నిర్వర్తిస్తున్నారు. అధిక సంఖ్యలో మన యువతీ యువకులు సువార్త సేవ చేయడానికి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. యేసు క్రీస్తు యొక్క దృఢమైన అనుచరులుగా భావితరం ఎదుగుతోంది.

ముని మనవరాలితో అధ్యక్షులు నెల్సన్.

ఇటీవల నేను ఒక కొత్త ముని-మనవరాలిని కలిసాను. ఆమె జీవితంలో ఆమె ఎదుర్కొనే సవాళ్ల గురించి నేను ఆలోచించినప్పుడు, యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంచుకోవడంలో ఆమెకు సహాయం చేయాలనే గొప్ప కోరిక నాకు కలుగుతుంది. ఆమె భవిష్యత్ సంతోషానికి ఆయన సువార్తను జీవించడం చాలా అవసరం.

ఆమె, మనలో ప్రతి ఒక్కరిలాగే, సవాళ్లను ఎదుర్కొంటుంది. మనమందరం అనారోగ్యం, నిరాశ, శోధన మరియు నష్టాన్ని అనుభవిస్తాము. ఈ సవాళ్లు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అయితే, యేసు క్రీస్తు యొక్క శిష్యులు వేరే రకమైన ఆత్మస్థైర్యాన్ని పొందుతారు.

మనం దేవునితో నిబంధనలు చేసి వాటిని పాటించినప్పుడు, ఆత్మ ద్వారా పుట్టిన నమ్మకాన్ని మనం కలిగి ఉండగలము. మన ఆత్మస్థైర్యము “దేవుని సముఖములో బలమైనదిగా ఎదగగలదు” అని ప్రభువు ప్రవక్త జోసెఫ్ స్మిత్‌తో చెప్పారు. దేవుని సముఖములో ఆత్మస్థైర్యము కలిగి ఉండడం వల్ల వచ్చే ఓదార్పును ఊహించుకోండి!

దేవుని సముఖములో ఆత్మస్థైర్యము కలిగి ఉండడం గురించి నేను మాట్లాడేటప్పుడు, ఇప్పుడే దేవుణ్ణి సమీపించడంలో నమ్మకంగా ఉండడం గురించి నేను మాట్లాడుతున్నాను! పరలోక తండ్రి మనల్ని వింటారు, మన అవసరాలను మనకంటే బాగా ఆయన అర్థం చేసుకుంటారు అనే నమ్మకంతో ప్రార్థించడం గురించి నేను మాట్లాడుతున్నాను. మనం అర్థం చేసుకోగల దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తారు, మనతో మరియు మనం ప్రేమించే వారితో ఉండడానికి ఆయన దేవదూతలను పంపుతారు అనే నమ్మకం కలిగియుండడం గురించి నేను మాట్లాడుతున్నాను. మనలో ప్రతి ఒక్కరూ మన అత్యున్నత సామర్థ్యాన్ని చేరుకోవడానికి సహాయం చేయాలని ఆయన కోరుకుంటున్నారనే నమ్మకం గురించి నేను మాట్లాడుతున్నాను.

ఇప్పుడు, మనం అలాంటి నమ్మకాన్ని ఎలా పొందగలం? ఈ ప్రశ్నకు ప్రభువు ఈ మాటలతో సమాధానం ఇస్తున్నారు: “నీ హృదయాంతరములు మనుష్యులందరి యెడల, … దాతృత్వముతో నిండనీయుము, నీ ఆలోచనలు నిరంతరము సుగుణముతో అలంకరింపబడనీయము; అప్పుడు నీ ఆత్మస్థైర్యము దేవుని సముఖమందు బలమైనదిగా ఎదుగును.”

అదే కీలకం! ప్రభువు యొక్క స్వంత మాటల్లో, దాతృత్వము మరియు సుగుణము దేవుని యెదుట నమ్మకంగా ఉండడానికి మార్గాన్ని తెరుస్తాయి! సహోదర సహోదరీలారా, మనం దాన్ని చేయగలం! మన ఆత్మస్థైర్యము దేవుని సముఖమందు బలమైనదిగా ఎదగగలదు, ఇప్పుడే!

దాతృత్వము మరియు సుగుణము రెండింటినీ పరిగణిద్దాం.

ముందుగా, దాతృత్వము గురించి మాట్లాడదాం. రెండు సంవత్సరాల క్రితం, యేసు క్రీస్తు యొక్క నిబంధన అనుచరులుగా, మనం సమాధానపరచువారిగా ఉండాలని నేను పిలుపునిచ్చాను. నేను అప్పుడు చెప్పిన దాన్ని మళ్ళీ చెబుతున్నాను: “కోపం ఎప్పుడూ ఒప్పించదు. శత్రుత్వం ఎవరినీ నిర్మించదు. వివాదం ఎన్నడూ ప్రేరేపిత పరిష్కారాలకు దారితీయదు.”

మనుష్యులందరి పట్ల నిజమైన దాతృత్వం సమాధానపరచువారి లక్షణం! బహిరంగంగా మరియు వ్యక్తిగతంగా, మన సంభాషణలలో దాతృత్వాన్ని కలిగి ఉండడం తప్పనిసరి. నా మునుపటి సలహాను హృదయపూర్వకంగా తీసుకున్న మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ మనం ఇంకా బాగా చేయగలం.

బహిరంగ సంభాషణలలో మరియు సామాజిక మాధ్యమంలో ప్రస్తుతం ఉన్న శత్రుత్వం ఆందోళనకరంగా ఉంది. ద్వేషపూరిత పదాలు ప్రాణాంతక ఆయుధాలు. వివాదం పరిశుద్ధాత్మను మన స్థిర సహచరునిగా ఉండకుండా నిరోధిస్తుంది.

యేసు క్రీస్తు యొక్క అనుచరులుగా, మనం సమాధానపరచేవారిగా ముందుకు సాగాలి. దాతృత్వము మన స్వభావంలో భాగమైనప్పుడు, ఇతరులను కించపరిచే ప్రేరణను మనం కోల్పోతాము. మనం ఇతరులను తీర్పు తీర్చడం మానేస్తాము. మనం అన్ని వర్గాల వారిపట్ల దాతృత్వం కలిగియుంటాము. మనుష్యులందరి పట్ల దాతృత్వం మన పురోగతికి చాలా అవసరం. దాతృత్వం దైవిక స్వభావానికి పునాది వంటిది.

మన హృదయాలను దాతృత్వంతో—ముఖ్యంగా ప్రేమించడానికి కష్టతరమైన వారి పట్ల గొప్ప దాతృత్వంతో నింపమని మన పరలోక తండ్రిని వేడుకుందాం.—ఎందుకంటే దాతృత్వం అనేది యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులకు మన పరలోక తండ్రి ఇచ్చిన బహుమతి. రక్షకుడు సమాధానకర్తయగు అధిపతి. శాంతి కొరకు మనం ఆయన సాధనాలుగా ఉండాలి.

ఇప్పుడు, సుగుణం గురించి మాట్లాడుకుందాం. మన ఆలోచనలను నిరంతరం సుగుణముతో అలంకరింపబడనివ్వమని ప్రభువు మనకు చెబుతున్నారు. ఏదైనా సానుకూల ఆలోచనను సుగుణంతో పెంచినప్పుడు, దానికి మీరు పొందే ప్రోత్సాహాన్ని ఊహించుకోండి. సుగుణం ప్రతిదానిని మెరుగుపరుస్తుంది మరియు సంతోషకరంగా చేస్తుంది! మరోవైపు, మీరు అపవిత్రమైన ఆలోచనకు, క్రూరమైన ఆలోచనకు లేదా నిరాశపరిచే ఆలోచనకు సుగుణాన్ని జోడించినప్పుడు ఏమి జరుగుతుందో ఊహించుకోండి. సుగుణం ఆలోచనలను తరిమివేస్తుంది. సుగుణం మిమ్మల్ని ఆందోళనకరమైన, ఇబ్బందికరమైన ఆలోచనల నుండి విముక్తులను చేస్తుంది.

సహోదర సహోదరీలారా, లోకం మరింత దుష్టంగా మారుతున్న కొద్దీ, మనం మరింత స్వచ్ఛంగా ఎదగాలి. మన ఆలోచనలు, మాటలు మరియు చర్యలు తప్పకుండా సద్గుణవంతంగా ఉండాలి మరియు మనుష్యులందరి యెడల యేసు క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమతో నింపబడి ఉండాలి. మన ముందున్న గొప్ప అవకాశం ఏమిటంటే, మనం ఎలా కావాలని దేవుడు కోరుతున్నారో అలా మారడం.

ప్రభువు యొక్క మందిరంలో క్రమం తప్పకుండా ఆరాధించడం వల్ల దాతృత్వం మరియు సుగుణం రెండింటి కొరకు మన సామర్థ్యం పెరుగుతుంది. ఆ విధంగా, దేవాలయంలో గడిపే సమయం ప్రభువు యెదుట మన నమ్మకాన్ని పెంచుతుంది. దేవాలయంలో అధిక సమయాన్ని గడపడం మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధం కావడానికి మనకు సహాయపడుతుంది. ఆయన వచ్చే రోజు లేదా గడియ మనకు తెలియదు. కానీ “భయంకరమైన ఆ మహాదినము” కోసం సిద్ధంగా ఉండమని మనల్ని పురిగొల్పడానికి ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నారని నాకు తెలుసు.

దాతృత్వం మరియు సుగుణం మన జీవితాలను నింపాలని మనం శ్రద్ధగా కోరుకున్నప్పుడు, దేవుణ్ణి సమీపించడంలో మన నమ్మకం పెరుగుతుంది. ప్రభువు యెదుట మీ నమ్మకంలో వృద్ధి చెందడానికి ఉద్దేశపూర్వక చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అప్పుడు, మనం పెరుగుతున్న నమ్మకంతో మన పరలోక తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు, మనం మరింత ఆనందంతో నింపబడతాము మరియు యేసు క్రీస్తుపై మన విశ్వాసం పెరుగుతుంది. మన గొప్ప నిరీక్షణలను మించిన ఆధ్యాత్మిక శక్తిని మనం అనుభవించడం ప్రారంభిస్తాము.

ఇటీవలి సంవత్సరాలలో దేవాలయ నిర్మాణం వేగవంతం అయినందుకు మేము ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఆయన నిర్దేశంలో, ఈ రోజు, ఈ క్రింది 15 ప్రదేశాలలో ప్రతిదానిలో ఒక దేవాలయాన్ని నిర్మించే ప్రణాళికలను మేము ప్రకటిస్తున్నాము:

  • రెనోసా, మెక్సికో

  • చోరియోస్, పెరూ

  • రివేరా, ఉరుగ్వే

  • కాంపో గ్రాండే, బ్రెజిల్

  • పోర్టో, పోర్చుగల్

  • ఉయో, నైజీరియా

  • శాన్ హోసె డెల్ మోంటె, ఫిలిప్పీన్స్

  • నుమేయా, న్యూ కాలెడోనియా

  • లివర్‌పూల్, ఆస్ట్రేలియా

  • కాల్డ్‌వెల్, ఐడహో

  • ఫ్లాగ్‌స్టాఫ్, అరిజోనా

  • రాపిడ్ సిటీ, సౌత్ డకోటా

  • గ్రీన్‌విల్, సౌత్ కారోలైనా

  • నోర్ఫోక్, వర్జీనియా

  • స్పానిష్ ఫోర్క్, యూటా

ఇశ్రాయేలు విమోచకుడైన యేసు క్రీస్తు ఈ సంఘాన్ని నడిపిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మళ్ళీ రావడానికి సిద్ధమవుతున్నారు. మనం కూడా ఆయనను స్వీకరించడానికి అలాగే సిద్ధమవుదాం. దీని గురించి యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. కడవరి దినాల గురించి తన కలలో దానియేలు ప్రవక్త చూసిన చిన్న రాయి భూమియంతటిని నింపువరకు బయలువెళ్ళును (దానియేలు 2:31–45; సిద్ధాంతము మరియు నిబంధనలు 65:2 చూడండి).

  2. సిద్ధాంతము మరియు నిబంధనలు 121:45.

  3. “ఏలయనగా నేను మీ యెదుట వెళ్ళెదను. నేను మీ కుడివైపున, మీ ఎడమవైపున ఉందును, నా ఆత్మ మీ హృదయములందుండును, మిమ్ములను ఎత్తుకొనుటకు మీ చుట్టూ నా దేవదూతలు కావలియుందురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:88).

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 121:45, వివరణ చేర్చబడింది; 46వ వచనము కూడా చూడండి.

  5. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సమాధానపరచువారు కావాలి,” లియహోనా, మే 2023, 98.

  6. ఇతరులతో వాదించడానికి ఎంచుకోవడం అంటే పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం లేకుండా జీవించడానికి ఎంచుకోవడం.

  7. మనము “మనుష్యులందరి యెడల, విశ్వాస గృహము యెడల దాతృత్వము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:45 చూడండి) కలిగియుండవలెను.

  8. “హృదయము యొక్క పూర్ణ శక్తితో” (మొరోనై 7:48) ప్రార్థించడమని దానర్థము.

  9. మొరోనై 7:48 చూడండి.

  10. యెషయా 9:6 చూడండి.

  11. జోసెఫ్ స్మిత్ బోధించినట్లుగా, “[మనం] దేవుడు ఉన్న చోటికి వెళ్లాలనుకుంటే, [మనం] తప్పకుండా దేవుడిలా ఉండాలి లేదా దేవుడు కలిగి ఉన్న సూత్రాలను కలిగి ఉండాలి” (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 72). అదేవిధంగా, “మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరవలెనని” (హెబ్రీయులకు 4:16) అపొస్తలుడైన పౌలు ఉపదేశించాడు.

  12. మత్తయి 24:36–37 చూడండి.

  13. మలాకీ 4:5; జెఫన్యా 1:14–18 కూడా చూడండి.

  14. “విశ్వాసము, సుగుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, సహోదర ప్రేమ, దైవభక్తి, దాతృత్వము, వినయము, [మరియు] శ్రద్ధను జ్ఞాపకముంచుకొనుము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 4:6) అని ప్రభువు మనకు చెప్పారు. మనం అలా చేసినప్పుడు, మన నమ్మకం పెరుగుతుంది, ఆపై, ఆయన మాటల్లోనే, మనం అడిగినప్పుడు, మనకది ఇవ్వబడుతుంది. మరియు మనం తట్టినప్పుడు, అది మనకు తెరువబడుతుంది. (సిద్ధాంతము మరియు నిబంధనలు 4:7 చూడండి.)

  15. రాజైన బెంజమిన్ జనులు చేసినదానిని మనం అనుభవించవచ్చు: “యేసు క్రీస్తు నందు వారు కలిగియున్న అత్యధిక విశ్వాసమును బట్టి వారి పాపక్షమాపణను పొందియుండి, మనస్సాక్షి యొక్క సమాధానమును కలిగియుండి వారు ఆనందముతో నింపబడిరి” (మోషైయ 4:3).