ఆరాధన
దేవుడిని ఆరాధించడం అంటే మీకు మరియు నాకు గల అర్థం ఏమిటి?
“రాజైన హేరోదు దినములయందు యూదయదేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి,
“యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.”
కొన్నిసార్లు మాగీ అని పిలువబడిన వీరు, మెస్సీయను కనుగొని ఆరాధించడంలో జ్ఞానులు. వారి దృష్టిలో, ఆరాధించడం అంటే ఆయన ముందు మోకరించడం, బంగారం మరియు విలువైన సుగంధ ద్రవ్యాలను ఆయనకు బహుమతులుగా అర్పించడం.
దేవుడిని ఆరాధించడం అంటే మీకు మరియు నాకు గల అర్థం ఏమిటి?
ఆరాధన గురించి ఆలోచించినప్పుడు, మన ఆలోచనలు సాధారణంగా మనం వ్యక్తిగతంగా మరియు సంఘ సేవలలో మతపరమైన భక్తిని చూపించే మార్గాల వైపు మళ్ళుతాయి. మన పరలోక తండ్రిని మరియు ఆయన ప్రియ కుమారుడైన మన రక్షకుడిని ఆరాధించే విషయాన్ని నేను పరిగణించినప్పుడు, నాలుగు అంశాలు గుర్తుకు వచ్చాయి: మొదటిది, మన ఆరాధనను రూపొందించే చర్యలు; రెండవది, మన ఆరాధనలో కనిపించే వైఖరులు మరియు భావాలు; మూడవది, మన ఆరాధన యొక్క ప్రత్యేకత; మరియు నాల్గవది, మనం ఆరాధించే పరిశుద్ధ జీవులను అనుకరించాల్సిన అవసరం.
మొదటిది, మన ఆరాధనను రూపొందించే చర్యలు
ఆరాధన యొక్క అత్యంత సాధారణమైన మరియు ముఖ్యమైన రూపాలలో ఒకటి, ఆరాధనా కార్యక్రమాలు చేయడానికి పవిత్రమైన స్థలంలో సమకూడడం. “ఇహలోక మాలిన్యము అంటకుండా నిన్ను నీవు బహుమిక్కిలిగా కాపాడుకొనుటకు, నా పరిశుద్ధ దినమున నీవు నా ప్రార్థనా మందిరమునకు వెళ్ళి, నీ సంస్కారములను అర్పించవలెను,” అని ప్రభువు చెప్పారు. ప్రార్థనా మందిరాలను నిర్మించడంలో ఇదే మన ప్రాథమిక ప్రేరణ అయ్యున్నది. కానీ, అవసరమైతే, మనం దానిని కొంత పవిత్రంగా ఉంచగలిగితే, ప్రతిష్ఠించబడని స్థలమైనా సరిపోతుంది.
ప్రభువు దినమున మనం సమకూడినప్పుడు మనం ఏమి చేస్తామనేదే అతి ముఖ్యమైనది. మన ఆర్థిక స్థితికి అనుగుణంగా మనం సాధ్యమైనంత ఉత్తమంగా దుస్తులు ధరిస్తాము—మితిమీరినట్లుగా కాదు, కానీ దేవుని పట్ల మనకున్న గౌరవాన్ని, భక్తిని సూచించే విధంగా నిరాడంబరంగా. మన ప్రవర్తన కూడా అదేవిధంగా భక్తిపూర్వకంగా, గౌరవంగా ఉంటుంది. మనం ప్రార్థనలో పాల్గొనడం ద్వారా ఆరాధిస్తాము; కీర్తనలు పాడడం (కేవలం వినడం కాదు, కీర్తనలు పాడడం) ద్వారా ఆరాధిస్తాము; బోధించడం మరియు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం ద్వారా ఆరాధిస్తాము. “ప్రభువు దినమైన ఈ దినమున నీ పాపములను నీ సహోదరుల యెదుట, ప్రభువు యెదుట ఒప్పుకొనుచు నీ అర్పణలను, [అనగా దేవుని సేవలో, తోటివారి సేవలో నీ ‘సమయం, ప్రతిభలు లేదా సాధనాల అర్పణలు’] నీ సంస్కారములను మహోన్నతునికి అర్పించవలెనని గుర్తుంచుకొనుము,” అని యేసు చెప్పారు. మనం వినోదం అందించడానికి లేదా వినోదం పొందడానికి రాము—ఉదాహరణకు, ఒక వాద్యబృందంతో చేసినట్లుగా—కానీ ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి మరియు ఆయన సువార్తలో “మరింత పరిపూర్ణంగా ఉపదేశం పొందడానికి” కలిసి సమకూడుతాము.
ఇటీవలి సర్వసభ్య సమావేశంలో, ఎల్డర్ ప్యాట్రిక్ కీరన్ మనకిలా గుర్తు చేసారు, “మనము కేవలం సంస్కార సమావేశానికి హాజరయ్యేందుకు మరియు పనుల జాబితాలో ఉన్న దానిని పూర్తి చేయడానికి ఆదివారం నాడు సమకూడము. మనము కలిసి ఆరాధించడానికి సమకూడుతాము. రెండింటి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. హాజరు కావడం అంటే అక్కడ ఉండడం అని అర్థం. కానీ ఆరాధించడం అంటే మనల్ని మార్చే విధంగా మన దేవుడిని ఉద్దేశపూర్వకంగా స్తుతించడం మరియు ఆరాధించడం!”
మన విశ్రాంతిదినాలను ప్రభువుకు మరియు ఆయన ఉద్దేశాలకు అంకితం చేయడం కూడా ఒక ఆరాధనే. కొన్ని సంవత్సరాల క్రితం, అప్పటి ఎల్డర్ రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా గమనించారు: “మనం విశ్రాంతిదినమును పవిత్రముగా ఎలా ఆచరిస్తాము? నేను అతిచిన్న వయస్సులో ఉన్నప్పుడు, విశ్రాంతిదినమున చేయవలసిన మరియు చేయకూడని పనుల జాబితాలను సంకలనం చేసిన ఇతరుల పనిని నేను అధ్యయనం చేసాను. చాలాకాలం తర్వాత, నా ప్రవర్తన మరియు విశ్రాంతిదినమును గూర్చిన నా వైఖరి నాకు, నా పరలోక తండ్రికి మధ్య ఒక సంకేతాన్ని కలిగియుందని నేను లేఖనాల నుండి తెలుసుకున్నాను [నిర్గమకాండము 31:13; యెహెజ్కేలు 20:12, 20 చూడండి]. ఆ అవగాహనతో, చేయవలసిన మరియు చేయకూడని పనుల జాబితాల అవసరం ఇకపై నాకు రాలేదు. ఒక కార్యక్రమం విశ్రాంతిదినమునకు తగినదా కాదా అనే నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు, ‘నేను దేవునికి ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నాను’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.”
ప్రభువు దినమున ఆరాధన యేసు క్రీస్తు యొక్క గొప్ప ప్రాయశ్చిత్త త్యాగంపై ప్రత్యేక దృష్టితో గుర్తించబడింది. మనం ఈస్టరు రోజున ఆయన పునరుత్థానాన్ని సముచితంగా మరియు ప్రత్యేకంగా జరుపుకుంటాము, అలాగే ప్రతీ వారం ఆయన పునరుత్థానంతో పాటు ఆయన ప్రాయశ్చిత్తం యొక్క సంస్కార చిహ్నాలలో పాలుపంచుకున్నప్పుడు కూడా జరుపుకుంటాము. పశ్చాత్తాపపడేవారికి, సంస్కారంలో పాల్గొనడం విశ్రాంతిదిన ఆరాధన యొక్క ముఖ్యాంశం.
“క్రీస్తు యొక్క శరీరం”గా కలిసి ఆరాధించడం ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది మరియు మనం ఒకరికొకరం బోధించుకొని, సేవ చేసి, మద్దతిచ్చినప్పుడు ప్రయోజనాలను అందిస్తుంది. ఆసక్తికరంగా, ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం, వారి ఆధ్యాత్మిక జీవితాలను పూర్తిగా వ్యక్తిగతంగా భావించేవారు ఆధ్యాత్మిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం లేదా వారి విశ్వాసం చాలా ముఖ్యమైనదని చెప్పడం లేదా దేవుని ఆరాధనలో క్రమం తప్పకుండా సమయాన్ని గడపడం చాలా తక్కువ. పరిశుద్ధుల సమాజంగా, మనం ఆరాధనలో మరియు విశ్వాసంలో ఒకరినొకరం బలపరచుకుంటాము.
అయినా, వ్యక్తిగతంగా మరియు ఇంట్లో చేసే రోజువారీ ఆరాధనలను మనం మరచిపోలేము. “అయినప్పటికీ, అన్ని దినములలోను, అన్ని సమయములలోను, నీతితో నీ మ్రొక్కుబడులను అర్పించవలెను,” అని రక్షకుడు మనకు గుర్తు చేస్తున్నారు. ఒక సహోదరి తెలివిగా, “ఆయన చిన్న పిల్లలను మన జీవితాల్లోకి ఆహ్వానించడం, వారి పట్ల శ్రద్ధ వహించడం మరియు వారి కొరకైన ఆయన ప్రణాళికను వారికి బోధించడం కంటే దేవుడిని ఆరాధించడానికి మరింత గొప్ప మార్గం గురించి నేను ఆలోచించలేను” అని గమనించారు.
తమ సమాజ మందిరాల నుండి నిషేధించబడిన జోరమీయులకు వారానికి ఒకసారి మాత్రమే కాకుండా, ఎల్లప్పుడూ మరియు “మీరే స్థలములో ఉన్నను” దేవుణ్ణి ఆరాధించమని ఆల్మా మరియు అమ్యులెక్ బోధించారు. వారు ప్రార్థనను ఆరాధనగా చెప్పారు:
“మీరు మీ గదులయందు, మీ రహస్య స్థలములందు మరియు మీ అరణ్యములందు తప్పక మీ ఆత్మలను క్రుమ్మరించుడి.
“మీరు ప్రభువుకు మొరపెట్టనప్పుడు, నిరంతరము ప్రార్థనయందు మీ హృదయములలో ఆయన పట్ల కృతజ్ఞత కలిగియుండుడి.”
వారు లేఖనాలను శోధించడం, క్రీస్తు గురించి సాక్ష్యమివ్వడం, దాతృత్వపు చర్యలు మరియు సేవ, పరిశుద్ధాత్మను పొందడం మరియు ప్రతిరోజూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించడం గురించి కూడా మాట్లాడారు. ఆ ఆలోచనను పరిగణించండి: “ప్రతిరోజూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించడం.” ఇది నా రెండవ భావన గురించి మాట్లాడుతుంది:
ఆరాధనలో అంతర్లీనంగా ఉండే వైఖరులు మరియు భావాలు
నిజానికి, దేవుని పట్ల కృతజ్ఞతను భావించడం, వ్యక్తపరచడం అనేవి ఆరాధనను మరో పనిగా చూడడం కంటే ఎక్కువగా ఆనందకరమైన పునరుద్ధరణ భావనను కలిగిస్తాయి.
నిజమైన ఆరాధన అంటే దేవుణ్ణి ప్రేమించడం మరియు మన ఇష్టాన్ని ఆయనకు అప్పగించడం—అది మనం అందించగల అత్యంత విలువైన బహుమతి. ధర్మశాస్త్రమంతటిలో మొదటి ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు, యేసు ఇలా జవాబిచ్చారు, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.” దీనిని ఆయన మొదటి ఆజ్ఞ అని కూడా పిలిచారు.
ఇది యేసు తండ్రిని స్వయంగా ఆరాధించే విధానం. ఆయన జీవితం మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగం తండ్రి యొక్క మహిమకు అంకితం చేయబడ్డాయి. ఊహించలేని బాధ మరియు వేదన మధ్యలో యేసు చేసిన హృదయ విదారకమైన ఈ విన్నపాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు అది మనల్ని బాగా ప్రభావితం చేస్తుంది: “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము.”
ఈ పరిపూర్ణ ఉదాహరణను అనుకరించడానికి కృషి చేయడమే ఆరాధన. ఈ ప్రయాణంలో మనం రాత్రికి రాత్రే పరిపూర్ణతను సాధించలేము, కానీ ప్రతిరోజూ మనం “విరిగిన హృదయాన్ని మరియు నలిగిన ఆత్మను [ఆయనకు] బలిగా అర్పిస్తే,” ఆయన మళ్ళీ తన ఆత్మతో మనకు బాప్తిస్మం ఇస్తారు మరియు ఆయన కృపతో మనల్ని నింపుతారు.
మూడవది, మన ఆరాధన యొక్క ప్రత్యేకత
సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క మొదటి ప్రకరణములో, ప్రభువు లోకంపై ఈ దోషారోపణను ప్రకటిస్తున్నారు:
“వారు నా విధులనుండి తొలగిపోయి, నా నిత్య నిబంధనను అతిక్రమించిరి;
“ప్రభువు తన నీతిని నెలకొల్పవలెనని వారు కోరుట లేదు, కానీ ప్రతి మనుష్యుడు తన ఇష్టము చొప్పున, తన దేవుని ప్రతిరూపములో నడుచుకొనుచున్నాడు, ఆ ప్రతిరూపము లోకమును పోలియున్నది.”
లీహై మరియు అతని కుటుంబం యెరూషలేమును విడిచిపెట్టిన కొద్దికాలానికే బబులోనుకు బందీలుగా కొనిపోబడిన హనన్యా, మిషాయేలు మరియు అజర్యా అనే ముగ్గురు యూదు యువకుల ఉదాహరణను మనం గుర్తుంచుకోవడం మంచిది. ఒక బబులోనీయ అధికారి వారికి షద్రకు, మేషాకు మరియు అబేద్నెగో అని పేరు పెట్టాడు. తర్వాత, ఈ ముగ్గురు రాజైన నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ప్రతిమను ఆరాధించడానికి నిరాకరించినప్పుడు, అతడు వారిని మండుతున్న అగ్నిగుండంలో వేయమని ఆజ్ఞాపించి, “నా చేతిలోనుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?” అని వారితో అన్నాడు.
వారి ధైర్యమైన సమాధానం మీకు గుర్తుండే ఉంటుంది:
“మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును.
“ఒక వేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.”
ఆ కొలిమి ఎంత వేడిగా ఉందంటే, అందులో వారిని పడవేసిన వారు చనిపోయారు, కానీ షద్రకు, మేషాకు, అబేద్నెగోలు క్షేమంగా ఉన్నారు. “అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు, షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన … తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించిరి.” వారు విడుదల కోసం యెహోవాను విశ్వసించారు, “కానీ రక్షింపకపోయినా,” అంటే దేవుడు తన జ్ఞానమందు వారి మరణాన్ని నిరోధించకపోయినా, వారు ఆయనకు నమ్మకంగా ఉంటారు.
తండ్రి మరియు కుమారుని ఆరాధన కంటే ప్రాధాన్యత కలిగినది ఏదైనా విగ్రహంగా మారుతుంది. సత్యానికి మూలముగా దేవుడిని తిరస్కరించేవారు లేదా ఆయనకు జవాబుదారీగా ఉండకూడదని నిర్ణయించుకునేవారు, వాస్తవానికి తమనుతాము దేవుడిగా ఎంచుకుంటారు. దైవిక నిర్దేశానికన్నా ఎక్కువగా ఒక సమూహానికి లేదా కారణానికి విధేయతను చూపేవారు అబద్ధ దేవుడిని ఆరాధిస్తారు. దేవుడిని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను పాటించని వారు కూడా తమ స్వంత మార్గంలో నడుస్తున్నారు: “వారు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగానున్నవి.” మన ఆరాధన యొక్క లక్ష్యం ప్రత్యేకంగా “అద్వితీయ సత్యదేవుడు మరియు [ఆయన] పంపిన యేసు క్రీస్తు.”
చివరగా, తండ్రి మరియు కుమారుడిని అనుకరించాల్సిన అవసరం
అంతిమంగా, మనం ఎలా జీవిస్తున్నామో అనేది ఉత్తమమైన, అత్యంత నిజమైన ఆరాధన కావచ్చు. మన భక్తిని చూపించడం అంటే తండ్రిని మరియు కుమారుడిని అనుకరించడం—వారి లక్షణాలను మరియు స్వభావాన్ని మనలో పెంపొందించుకోవడం. అనుకరణ అనేది నిజాయితీగా ప్రశంసించే మార్గం అయితే, దేవుడికి సంబంధించిన అనుకరణ అనేది అత్యంత నిజాయితీగల ఆరాధనా విధానం అని మనం చెప్పవచ్చు. ఇది పరిశుద్ధతను కోరుకోవడంలో మన వంతు చురుకైన, నిరంతర ప్రయత్నాన్ని సూచిస్తుంది. కానీ మరింతగా క్రీస్తులా మారడం కూడా మన ఆరాధనా చర్యల యొక్క సహజ ఫలితం. “మనల్ని మార్చే విధంగా” ఆరాధించడం గురించి ముందుగా ఉదహరించబడిన ఎల్డర్ కీరన్ వాక్యభాగం ముఖ్యమైనది. నిజమైన ఆరాధన పరివర్తన కలిగించేదైయుంటుంది.
నిబంధన మార్గం అద్భుతమైనది—ఎందుకంటే అది దేవుని పట్ల ఆరాధన, ప్రేమ మరియు విధేయత యొక్క మార్గం. మనం బాప్తిస్మం ద్వారా ఆ మార్గంలోకి ప్రవేశిస్తాము, క్రీస్తు నామాన్ని మనపైకి తీసుకుంటామని మరియు ఆయన ఆజ్ఞలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తాము. మనం పశ్చాత్తాపపడినప్పుడు పాపం నుండి మనల్ని విమోచించి, శుద్ధి చేసే రక్షకుని కృప యొక్క దూత అయిన పరిశుద్ధాత్మ బహుమతిని మనం పొందుతాము. పశ్చాత్తాపపడడం ద్వారా మనం ఆయనను ఆరాధిస్తున్నామని కూడా మనం చెప్పవచ్చు.
తరువాత ప్రభువు యొక్క మందిరంలో చేయబడిన అదనపు యాజకత్వ విధులు మరియు నిబంధనలు మనల్ని మరింత పవిత్రం చేస్తాయి. దేవాలయ వేడుకలు మరియు విధులు ఉన్నతమైన ఆరాధనా రూపాన్ని ఏర్పరుస్తాయి.
“యాజకత్వ విధులలో పాల్గొని, దేవునితో నిబంధనలను చేసి, పాటించే ప్రతి పురుషుడు మరియు ప్రతి స్త్రీ దేవుని శక్తిని ప్రత్యక్షంగా పొందగలరు,” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు నొక్కిచెప్పారు. ఇది మనం సేవ చేయడానికి మరియు ఆశీర్వదించడానికి ఉపయోగించే శక్తి మాత్రమే కాదు. ఇది మనల్ని శుద్ధి చేయడానికి మరియు పవిత్రపరచడానికి మనలో పనిచేసే దైవిక శక్తి కూడా. మనం నిబంధన మార్గంలో నడిచినప్పుడు, “దైవత్వము యొక్క పవిత్రపరచు శక్తి మనలో ప్రత్యక్షపరచబడుతుంది.”
ప్రాచీన నీఫైయులు మరియు లేమనీయుల వలె మనం “యేసు పాదముల యొద్ద సాష్టాంగపడి, … ఆయనను ఆరాధిద్దాం.” యేసు చేత ఆజ్ఞాపించబడినట్లుగా, మనం “సాగిలపడి [కుమారుని] నామమున తండ్రిని ఆరాధిద్దాం.” ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకుండా, మన హృదయాలను దేవునికి సమర్పించి ఆయన మహిమను వెదకుదాం మరియు యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా మన స్వంత జీవితాల్లో ఆయన స్వభావాన్ని అనుకరిద్దాం. మనం అలా చేసినప్పుడు, ఆరాధన యొక్క ఆనందాన్ని అనుభవిస్తామని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.