నిబంధన శిష్యత్వము ద్వారా ఆనందం
నిబంధన శిష్యులుగా వ్యవహరించడానికి మనం కట్టుబడి ఉన్నప్పుడు, తండ్రి మరియు కుమారుడితో మన సంబంధం సుసంపన్నం అవుతుంది, మన ఆనందం పెరుగుతుంది మరియు మన నిత్య దృక్పథం విస్తరిస్తుంది.
2023లో ఒక రోజు, ఉయాంగా అల్తాన్సుఖ్ ఉత్తర మంగోలియన్ నగరమైన డార్ఖాన్‌లో పని చేస్తున్నప్పుడు, మంగోలియన్ మిషను అధ్యక్షుడు ఆమె కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆమె మాటలలో:
“నేను అతన్ని చూశాను మరియు అతని ముఖంలో ఈ ప్రకాశవంతమైన కాంతి ఉందని అనుకున్నాను. అతను తన చుట్టూ ఉన్నవారిపట్ల చాలా దయతో, సరదాగా ఉండేవాడు మరియు నేను ఆహ్లాదకరంగా భావించాను. అతను వెళ్ళేముందు, నేను అతడిని కొన్ని ప్రశ్నలు అడిగాను. కొన్ని రోజుల తర్వాత, అతడు మళ్లీ నా కార్యాలయానికి వచ్చి, నన్ను అతని సంఘానికి హాజరుకమ్మని అడిగాడు. అది ఉపయోగకరంగా ఉండవచ్చని నేను అనుకున్నాను. సమాజం ఒత్తిడి మరియు అంధకారంతో నిండినట్లు కనిపించినందున, నా పిల్లల భవిష్యత్తు గురించి నేను ఆందోళన చెందాను. ఈ వ్యక్తిలా, నా పిల్లల ముఖం కూడా కాంతివంతంగా ఉండాలని మరియు వారి చుట్టూ ఉన్న ఇతరులకు ఆనందాన్ని పంచాలని నేను కోరుకున్నాను.
“ఒకరోజు సువార్తికులు మాకు దశమభాగం యొక్క చట్టం గురించి బోధించారు. నా పిల్లలు ఉత్సాహంగా, ‘అమ్మా, మనం దశమభాగం చెల్లించాలి’ అన్నారు. ఆ క్షణంలో నా పిల్లల విశ్వాసాన్ని నేను చూడగలిగాను. నేను సంఘములో చేరకమునుపు, సర్వసభ్య సమావేశాన్ని చూశాను మరియు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి ప్రసంగాన్ని విన్నాను. ప్రపంచవ్యాప్తంగా కొత్త దేవాలయాలను ప్రకటించి, మంగోలియాలోని ఉలాన్‌బాతర్‌లో కొత్త దేవాలయాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఎందుకో నాకు అర్థంకాలేదు కానీ, నేను ఆనందించాను మరియు కన్నీళ్లు పెట్టుకున్నాను. ఈ ఆనందంతో, నా విశ్వాసం మరియు సాక్ష్యం పెరుగుతున్నాయని నేను చెప్పగలను.”
లక్షలాది మంది ఇతరుల మాదిరిగానే, ఉయాంగా కూడా యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు సిద్ధపాటుగా జరిగే గొప్ప ఇశ్రాయేలు సమకూర్పులో భాగం. ఆమె నిబంధన మార్గంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి, క్రీస్తు శిష్యురాలిగా మారింది. క్రీస్తు శిష్యునిగా ఉండడం అంటే ఏమిటి? శిష్యుడు అనే పదానికి జపనీయుల పదమైన—దేశిని నేను అభినందిస్తున్నాను—దే అంటే తమ్ముడు మరియు శి అంటే పిల్లవాడు అని అర్థము.
“ఆదియందు నేను తండ్రితో నున్నాను, నేనే జ్యేష్ఠుడను” అని యేసు క్రీస్తు ప్రకటించారు. ఆయన ఎవరో మరియు ఆయన ఏమి చేశారో అనే దానిని బట్టి మనం ఆయనను ఆరాధిస్తాము, ఆయనను గౌరవిస్తాము, ఆయనను మహిమపరుస్తాము మరియు ఆయనను అనుసరిస్తాము. క్రీస్తు మనల్ని విమోచించారు మరియు ఆయన అనంతమైన, ప్రాయశ్చిత్త త్యాగానికి మనం ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాము.
మనల్ని తన పిల్లలుగా ప్రేమించే పరలోక తండ్రి మనకు ఉన్నారు. మన పట్ల ఆయనకున్న ప్రేమ పరిపూర్ణమైనది. యేసు క్రీస్తు మరియు ఆయన నియమితకార్యము మన పట్ల దేవుని ప్రేమను వివరిస్తాయి. యోహాను వ్రాసినట్లుగా, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”
మనకు తెలియని వాటిని అర్థం చేసుకోవాలనే మన అన్వేషణలో, మనం కొన్నిసార్లు మనకు తెలిసిన మర్త్య అనుభవాలపై లేదా మనకు తెలిసిన విషయాలపై ఆధారపడవచ్చు. ఉదాహరణకు, మన స్వంత మాతృత్వ లేదా పితృత్వ జీవితం ద్వారా మరియు మన మర్త్య కుటుంబ సంబంధాల ద్వారా తండ్రి అయిన దేవుని గురించి మనం కొంతవరకు నేర్చుకోవచ్చు. అయితే, మన పరలోక తండ్రిని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఈ పోలికలను ఎక్కువగా అన్వయించడంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తండ్రియైన దేవుని లక్షణాలు పతనమైన మానవుని యొక్క తక్కువ పరిపూర్ణమైన లక్షణాలకన్నా ఉన్నతమైనవి. తండ్రి అయిన దేవుడు పరిపూర్ణమైన తండ్రి. ఆయన పరిపూర్ణమైన ప్రేమామయుడు, దయామయుడు, సహనశీలి, అర్థం చేసుకునేవాడు మరియు పరిపూర్ణమైన మహిమాన్వితుడు. మనం ఆయనను పరిపూర్ణంగా నమ్మవచ్చు. క్రీస్తు ప్రేమ తండ్రి అయిన దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది మరియు ఆ ప్రేమకు ఆయన ఒక ప్రతిరూపం.
యేసు క్రీస్తు ఉదాహరణ మరియు ఆధారము రెండూను. క్రీస్తులో, తండ్రి యొక్క పరిపూర్ణ లక్షణాలను మరియు ఆయన ప్రణాళికను మనం బాగా అర్థం చేసుకోగలము. క్రీస్తు ద్వారా, ప్రకృతి సంబంధులైన స్త్రీ పురుషుల వైఖరులను అధిగమించడానికి వీలుకల్పించే శక్తి మనకు ఇవ్వబడింది, తద్వారా మనం మరింతగా తండ్రిలా మారవచ్చు.
మన పరలోక తండ్రిలాగే, యేసు క్రీస్తు కూడా పరిపూర్ణమైన కనికరము గలవాడు మరియు న్యాయవంతుడు. న్యాయము మరియు కనికరము అనే ఈ దైవిక లక్షణాలు ఒకదానికొకటి విరుద్ధం కావు. అవి ఒకదానినొకటి పూర్తిచేస్తాయి. న్యాయము మరియు కనికరము రెండూ తన పిల్లల పట్ల దేవునికి గల పరిపూర్ణమైన ప్రేమను వివరిస్తాయి. తండ్రియైన దేవుడు మరియు యేసు క్రీస్తు మనందరితో న్యాయంగా మరియు సముచితముగా ఉంటారు కాబట్టి, మనం వారిని నమ్మవచ్చు.
తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ఉద్దేశ్యం మరియు ప్రేమలో పరిపూర్ణమైన సమన్వయం కలిగియున్నారు. దేవుడు మరియు యేసు క్రీస్తు మనల్ని ప్రేమిస్తారు కాబట్టి, నిజమైన శిష్యులుగా వారితో నిబంధనలు చేసుకునే అవకాశం మరియు విశేషాధికారం మనకు ఇవ్వబడింది. అలా చేయడం ద్వారా, క్రీస్తుతో మన సంబంధం విస్తరిస్తుంది: “మీరు చేసిన నిబంధన కారణముగా మీరు క్రీస్తు యొక్క సంతానమని, ఆయన కుమారులు, కుమార్తెలని పిలువబడుదురు; ఏలయనగా ఈ దినమున ఆయన మిమ్ములను ఆత్మీయముగా కనియున్నాడు; ఆయన నామమందు విశ్వాసము ద్వారా మీ హృదయములు మారినవని మీరు చెప్పుచున్నారు; కావున, మీరు ఆయన ద్వారా జన్మించియున్నారు మరియు ఆయన కుమారులు, కుమార్తెలైయున్నారు.”
శిష్యులుగా, మనం పవిత్రమైన నిబంధనలు చేసి, పాటించినప్పుడు, మనం ఆధ్యాత్మిక శక్తితో దీవించబడతాము. మనం క్రీస్తుతో మరియు తండ్రి అయిన దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధంలో అనుసంధానించబడి ఉన్నాము మరియు నిబంధనలు చేసి వాటిని పాటించిన వారి కొరకు ప్రత్యేకించబడిన పరిమాణంలో వారి ప్రేమను, ఆనందాన్ని అనుభవించగలము. దేవుని ప్రేమ యొక్క పూర్తి స్థాయిని గ్రహించగల మన సామర్థ్యం లేదా ఆయన ప్రేమయందు నిలిచియుండడం అనేది మన న్యాయమైన కోరికలు మరియు చర్యలపై ఆధారపడి ఉంటుంది.
యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనములో, మనము ఇలా చదువుతాము, “తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని.” మరియు ఆపై, “నా ప్రేమయందు నిలిచియుండుడి” అని ఒక ఆహ్వానం ఇవ్వబడింది.
తరువాతి వచనంలో, ఆయన ప్రేమలో కొనసాగేందుకు మనకు మార్గం ఇవ్వబడింది: “నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమయందు నిలిచియుందురు.”
తరువాత 11వ వచనంలో ఆజ్ఞలను పాటించడం యొక్క ఉద్దేశ్యాన్ని మనం చూస్తాము: “మీయందు నా సంతోషము నిలిచియుండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.”
నిజమైన నిబంధన శిష్యత్వం ద్వారా, దేవుని స్వభావాన్ని మరియు తన పిల్లలందరూ అనుభవించాలని ఆయన కోరుకునే ఆనందాన్ని మనం బాగా అర్థం చేసుకోవడం ప్రారంభించవచ్చు. మొదట్లో గందరగోళంగా అనిపించే కొన్ని సూత్రాలను కూడా మనం అర్థం చేసుకోవడం ప్రారంభించవచ్చు. ఉదాహరణకు, తన బిడ్డలలో కొంతమంది చాలా బాధలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు సంపూర్ణమైన ఆనందాన్ని ఎలా పొందగలరు? దీనికి సమాధానం దేవుని యొక్క పరిపూర్ణమైన దృక్పథంలో మరియు ఆయన పరిపూర్ణమైన ప్రణాళికలో ఉంది. ఆయన మనల్ని ఆది నుండి మహిమాన్వితమైన మన సంభావ్య భవిష్యత్తు వరకు చూస్తారు. ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా, ఆయన పిల్లలమైన మనందరి కొరకు, మన మర్త్యత్వపు బాధలు, శ్రమలు, పాపాలు, అపరాధభావన మరియు ఒంటరితనాన్ని అధిగమించడానికి ఒక మార్గాన్ని అందించారు. దేవుడు మనకు మార్గమును మరియు ఎంపికను అందించారు.
శిష్యత్వం ద్వారా ఆనందాన్ని అనుభవించిన వారి ఉదాహరణలు ఈ భావమును బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడవచ్చు. మనం కూడా మన అత్యంత దురదృష్టవంతుడైన బిడ్డ ఉన్నంత సంతోషంగా ఉన్నాము అనే పదబంధాన్ని మీరు బహుశా వినే ఉంటారు. ఇది అలా ఉండనవసరం లేదని నేను గమనించాను. 94 ఏళ్ల మా అమ్మకు 200 మందికి పైగా వారసులు ఉన్నారు. ఏ సమయంలోనైనా, 200 మందిలో కనీసం ఒక్కరైనా అసంతృప్తిగా ఉంటారు. ఈ ప్రకటన నిజమైతే, మా అమ్మ నిరంతరం అసంతృప్తిగా ఉండాలి, కానీ ఆమె అలా లేదు. ఆమె గురించి తెలిసిన వారికి ఆమె ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు.
ఇప్పుడు నేను మరొక అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. 2019 జనవరిలో, నా భార్య డెబ్బీ మరియు నేను అధ్యక్షులు నెల్సన్ గారి కార్యాలయానికి ఆహ్వానించబడ్డాము. ఆయన మాకు దగ్గరగా ఒక కుర్చీని పెట్టారు మరియు మేము దాదాపు ఒకరి ఎదురుగా ఒకరం మా మోకాళ్ళు తగిలేంత దగ్గరగా కూర్చున్నాము. మా ప్రస్తుత పిలుపును మాకు ఇచ్చిన తర్వాత, అధ్యక్షులు నెల్సన్ డెబ్బీ వైపు తిరిగి ఆమెపై దృష్టి పెట్టారు. ఆయన దయతో , ప్రేమతో, సౌమ్యముతో మరియు పరిపూర్ణమైన తండ్రి లేదా తాతలా ఆనందంతో నిండి ఉన్నారు. ఆయన డెబ్బీ చేయి పట్టుకుని తట్టి, అంతా బాగానే ఉంటుందని, మా కుటుంబం ఆశీర్వదించబడుతుందని ఆమెకు హామీ ఇచ్చారు. ఆ క్షణంలో మేము ఆయనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులమని మరియు ఆయన ఎటువంటి పరధ్యానం లేకుండా మాకోసం సమయం కేటాయించారని మాకు అనిపించింది. ఆ శుక్రవారం మధ్యాహ్నం మేము భరోసా, ప్రేమ మరియు ఆనందాన్ని అనుభవిస్తూ ఆయన కార్యాలయం నుండి బయలుదేరాము.
సోమవారం మేము ఒక వార్త చూశాము. అధ్యక్షులు నెల్సన్ గారు మాతో గడిపిన అదే రోజున, ఆయన కుమార్తెలలో ఒకరు క్యాన్సర్‌తో మరణించారు. మేము నిర్ఘాంతపోయాము. మేము ఆయన కోసం మరియు ఆయన కుటుంబం కోసం దుఃఖిస్తున్నప్పుడు మా హృదయాలు తీవ్ర భావోద్వేగంతో నిండిపోయాయి. బాధపడుతున్న తన కుమార్తె కోసం దుఃఖిస్తున్నప్పుడు, ఆయన మా పట్ల క్రీస్తులాంటి శ్రద్ధ చూపినందుకు మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి.
ఈ అనుభవం గురించి మేము ఆలోచించినప్పుడు, “అంత కష్ట సమయంలో ఆయన ఎలా అంత దయగా, ప్రేమగా, ఆనందంగా ఉండగలిగారు?” అని మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నాము. సమాధానం ఏమిటంటే, ఆయనకు తెలుసు కాబట్టి. క్రీస్తు విజయం సాధించారని ఆయనకు తెలుసు. ఆయన మళ్ళీ తన కుమార్తెతో ఉంటారని మరియు ఆమెతో నిత్యత్వములో జీవిస్తారని ఆయనకు తెలుసు. నిబంధనలు చేసి, పాటించడం ద్వారా మరియు క్రీస్తు వంటి శిష్యత్వం ద్వారా రక్షకునికి కట్టుబడి జీవించడం నుండి ఆనందం మరియు నిత్య దృక్పథం లభిస్తాయి.
అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు: “రక్షకుడు ‘సమస్త జ్ఞానమునకు మించిన’ [ఫిలిప్పీయులకు 4:7] శాంతిని అందించినట్లే, ఆయన మానవ తర్కాన్ని లేదా మర్త్య గ్రహణశక్తిని ధిక్కరించే గాఢమైన, లోతైన ఆనందాన్ని కూడా అందిస్తారు. ఉదాహరణకు, మీ బిడ్డ నయం చేయలేని అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు లేదా మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు లేదా మీ జీవిత భాగస్వామి మీకు ద్రోహం చేసినప్పుడు ఆనందాన్ని అనుభవించడం సాధ్యం కాదు. అయినప్పటికీ అది ఖచ్చితంగా రక్షకుడు అందించే ఆనందం.”
మనం నిబంధనలు చేసి, పాటించినప్పుడు, మన దృష్టి సహజంగానే ఇతరులతట్టు తిరుగుతుంది మరియు మన నిబంధన సంబంధాలలో మనం అనుభవించే ఆనందం మరియు ప్రేమ యొక్క పరిమాణాన్ని ఇతరులు అనుభవించడానికి సహాయపడాలనే కోరికను మనం కలిగియుంటాము. నేడు భూమిపై ఉన్న గొప్ప హేతువైన ఇశ్రాయేలు సమకూర్పులో మనం భాగం కావచ్చు. దేవుని పిల్లలను క్రీస్తు నొద్దకు తీసుకురావడానికి మనం సహాయపడగలము. ప్రవక్త జేకబ్ బోధించినట్లుగా, “మీరు ధన్యులు, ఏలయనగా మీరు నా ఒలీవతోట యందు నాతోపాటు పని చేయుటలో శ్రద్ధ కలిగియున్నారు, నా ఆజ్ఞలను పాటించియున్నారు మరియు నాకు తిరిగి ప్రకృతి సిద్ధమైన ఫలమును తెచ్చియున్నారు, … నా ఒలీవతోట యొక్క ఫలమును బట్టి మీరు నాతోపాటు సంతోషము కలిగియుందురు.”
నిబంధన శిష్యులుగా వ్యవహరించడానికి మనం కట్టుబడి ఉన్నప్పుడు, మన సామర్థ్యం ఏ స్థాయిలో ఉన్నా, తండ్రి మరియు కుమారుడితో మన సంబంధం సుసంపన్నం అవుతుంది, మన ఆనందం పెరుగుతుంది మరియు మన నిత్య దృక్పథం విస్తరిస్తుంది. అప్పుడు మనం శక్తితో వరమివ్వబడి, దేవుని యొక్క నిజమైన నిబంధన శిష్యుల కొరకు ప్రత్యేకించబడిన పరిమాణంలో ఆనందాన్ని అనుభవించగలము. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.