మన కళ్ళ ముందు
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము సభ్యులు, కుటుంబాలు, మిషనులు, సువార్తికులు, సమావేశమందిరాలు మరియు దేవాలయాల సంఖ్యలో పెరుగుతోంది.
సహోదర సహోదరీలారా, మీతో ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుడిని. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము; మీ పట్ల కృతజ్ఞత కలిగియున్నాము; మీ ప్రార్థనల చేత దీవించబడినట్లు భావిస్తున్నాము.
గత సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు ఇలా అన్నారు: “మన కళ్ళ ముందు ఏం జరుగుతోందో మీరు చూస్తున్నారా? ఈ క్షణం యొక్క మహిమను మనం కోల్పోకూడదని నేను ప్రార్థిస్తున్నాను! ప్రభువు నిజంగా తన పనిని వేగవంతం చేస్తున్నారు.”
ఆయన పనిని వేగవంతం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైనది “వేగవంతం” అనే పదం. ఇది త్వరగా కదలడం, వేగవంతం చేయడం మరియు అత్యవసరతను కూడా సూచిస్తుంది. సంఘ పెరుగుదలలో మరియు క్రీస్తు ప్రణాళికలో వేగం కనిపిస్తోంది. మరియు మనమందరం దానిలో భాగమే.
1834 ఏప్రిల్‌లో, ఒహైయోలోని కర్ట్‌లాండ్‌లో, ప్రవక్త జోసెఫ్ స్మిత్ యాజకత్వం కలిగియున్న వారందరినీ 14 చదరపు అడుగుల (4.3 మీ.) విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న పాఠశాల గృహంలో సమకూర్చారు. ఈ సమావేశ కేంద్రంలో అలాంటి డజన్ల కొద్దీ పాఠశాల గృహాలను మనం అమర్చినా ఇంకా ఖాళీ ఉంటుంది. “ఈ రాత్రి మీరు ఇక్కడ యాజకత్వముగల కొద్దిమందిని మాత్రమే చూస్తున్నారు, కానీ ఈ సంఘము ఉత్తర మరియు దక్షిణ అమెరికాను నింపుతుంది—ఇది ప్రపంచాన్ని నింపుతుంది” అని జోసెఫ్ స్మిత్ చెప్పారు.
ఆ ప్రవచనం “మన కళ్ళ ముందే” నెరవేరుతోంది. యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు, కుటుంబాలు, మిషనులు, సువార్తికులు, సమావేశమందిరాలు, దేవాలయాల సంఖ్య మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సెమినరీలు, ఇన్స్టిట్యూట్‌లు మరియు విశ్వవిద్యాలయాలలో నమోదు చేసుకొనేవారి సంఖ్య పెరుగుతోంది.
సంఘము సభ్యత్వములో మరియు ప్రభావంలో పెరుగుతున్నప్పుడు, ముఖ్యంగా దాని సభ్యుల హృదయాలు మరియు జీవితాలలో పెరుగుతున్నప్పుడు మనం భూమిపై ఉన్నందుకు కృతజ్ఞులం. మనము యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా ప్రసిద్ధి చెందాము. మనం ఆయన గురించి, ఆయన సంఘము, ఆయన మార్గాలు మరియు ఆయన నిబంధన మార్గం గురించి మన సాక్ష్యాలను పంచుకుంటాము. మనం ఆయన జనులం మరియు ఆయన మన రక్షకుడు.
అధ్యక్షులు నెల్సన్ “ఈ క్షణం యొక్క మహిమ” అని పిలిచే దానిని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను మరియు ఆయన పని కొరకు ప్రభువుకు లోతైన కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ఆయన శిష్యులుగా, ప్రాచీన మరియు ఆధునిక ప్రవచన నెరవేర్పుకు ప్రత్యక్ష సాక్షులుగా మనం ధైర్యంగా నిలబడాలని నేను ప్రోత్సహిస్తున్నాను.
ప్రవక్త జోసెఫ్ స్మిత్ కాలంలో చేసినట్లుగానే, “ఇదిగో ఇక్కడ మరియు అదిగో అక్కడ” అని అరిచే వ్యక్తులు ఉన్నారు. కానీ అంతములో వారు అతి కొద్ది ప్రభావాన్ని కలిగియుంటారు. జోసెఫ్ స్మిత్ మాటలు గుర్తుంచుకోండి: “అపవిత్రమైన ఏ చెయ్యి ఈ పని పురోగమించకుండా ఆపలేదు; హింసలు చెలరేగవచ్చు … కానీ దేవుని సత్యము ప్రతి ఖండములోనికి చొచ్చుకుపోయే వరకు, ప్రతి వాతావరణాన్ని సందర్శించే వరకు, ప్రతి దేశాన్ని తుడిచిపెట్టి, ప్రతి చెవిలో వినిపించే వరకు, దేవుని ఉద్దేశ్యాలు నెరవేరే వరకు మరియు గొప్ప యెహోవా ఆ పని పూర్తయిందని చెప్పేవరకు ధైర్యంగా, ఘనంగా, స్వతంత్రంగా ముందుకు సాగుతుంది.”
ఈ సంవత్సరం నా నియామకాలలో, ప్రభువు తన పనిని వేగవంతం చేయడాన్ని నేను ప్రత్యక్షంగా చూసాను. సంఘము అపూర్వమైన వేగంతో దేవాలయాలను నిర్మిస్తోంది, ఎక్కువ మంది సభ్యులకు ప్రభువు యొక్క మందిరంలో ఆరాధించే అవకాశాన్ని కల్పిస్తోంది. రెండవది, సువార్త పరిచర్య మంచి కాపరియైన యేసు క్రీస్తు మందలోకి అధిక సంఖ్యలో జనులను సమకూర్చుతోంది. మరియు మూడవది, “ఈ యేసును వెదకుతున్న” వారికి బోధించడంలో అనేక విధాలుగా సంఘ విద్య అనేకమందికి లభ్యమవుతోంది.
నేడు సంఘము రూపకల్పనలో, నిర్మాణంలో వివిధ దశలలో ఉన్న లేదా పనిచేస్తున్న 367 దేవాలయాలను కలిగియుంది. ఏ ఉద్దేశ్యం కోసం? సమాధానం ప్రతీ దేవాలయంపై ప్రకటించబడింది: “యెహోవా పరిశుద్ధుడు.” దేవాలయం మన పరలోక తండ్రి మనలో ప్రతీ ఒక్కరి కోసం కలిగి ఉన్న అత్యున్నత ఆశీర్వాదాలకు మార్గాన్ని తెరుస్తుంది. సహోదర సహోదరీలారా, మనం దేవాలయానికి యోగ్యులుగా జీవిస్తున్నప్పుడు, ప్రభువు యొక్క మందిరంలో ఆరాధిస్తున్నప్పుడు, మనకోసం మరియు తెరకు అవతలి వైపునున్న మన పూర్వీకుల తరఫున దేవునితో నిబంధనలు చేస్తున్నప్పుడు మనం మన పరిశుద్ధతను వేగవంతం చేస్తున్నాము.
అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు: “అపవాది యొక్క ముట్టడులు తీవ్రంగా మరియు అనేక రకాలుగా శరవేగంగా ఉధృతమవుతున్నాయి. క్రమముగా, తరచుగా దేవాలయములో ఉండుటకు మన అవసరత ఇంత గొప్పగా ఎప్పుడూ లేదు. మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.” ఆయన మందిరంలో, మనం ప్రభువు యొక్క పవిత్రమైన సాన్నిధ్యాన్ని మరియు ఉత్తమమైన శాంతిని అనుభవించవచ్చు.
గత సంవత్సరం, మెండోజా అర్జెంటీనా దేవాలయ ప్రతిష్ఠాపనకు అధ్యక్షత్వం వహించే అదృష్టం నాకు లభించింది. “ఒక సింధూర వృక్షం విత్తనం నుండి నెమ్మదిగా పెరిగినట్లే,” దక్షిణ అమెరికాలో సంఘము కొంతకాలం నెమ్మదిగా ఎదుగుతుందని 1926లో ఎల్డర్ మెల్విన్ జె. బాల్లర్డ్ చేసిన ప్రవచనాన్ని నా సందేశంలో నేను ప్రస్తావించాను. ఇది ఒక్క రోజులో పెరగదు, కానీ వేలాదిమంది సంఘములో చేరుతారు మరియు దక్షిణ అమెరికా దేశాలు “సంఘమును బలపరిచేవిగా” అవుతాయి. ఆ ప్రవచనం నా కళ్ళ ముందే నెరవేరడం నేను చూశాను.
ఒకప్పుడు చిన్న సింధూర విత్తనం లాంటి మెండోజా, ఇప్పుడు ఒక గొప్ప వృక్షంలా మారింది. ఆ ఎదుగుదల ఖండాలు మరియు సముద్ర ద్వీపాలలో పునరావృతమవుతోంది.
మిషనులలో ప్రభువు నిజంగా తన పనిని వేగవంతం చేయడాన్ని మనం చూస్తున్నాము. 2024లో, 80,000 మంది సువార్తికులు 450 మిషనులలో సేవ చేస్తున్నారు. వాటిలో ముప్పై ఆరు కొత్త మిషనులు. గత సంవత్సరం, సువార్త పరిచర్య 3,08,000 మందికి పైగా కొత్త సభ్యులను సంఘంలోకి తీసుకువచ్చింది. సంఖ్యల కంటే ఎక్కువగా, సమకూర్పు యొక్క ఉద్దేశము ఆత్మలను యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త వైపుకు తీసుకువస్తోంది.
1839లో బ్రిటిష్ దీవులకు సువార్తికులుగా బయలుదేరిన అపొస్తలులైన బ్రిగమ్ యంగ్ మరియు హీబర్ సి. కింబల్‌ల గురించి నేను ఆలోచిస్తున్నాను. వారు అనారోగ్యంతో ఉన్నారు; అనారోగ్యంతో మరియు నిరాశ్రయులుగా ఉన్న వారి కుటుంబాలను విడిచివెళ్ళారు. అయినప్పటికీ, ఇద్దరూ ఒక బండిలో ఎక్కారు మరియు వారి ప్రియమైన వారు చూస్తుండగా, “లేచి వారిని ఉత్సాహపరుద్దాం” అని హీబర్ అన్నారు. ఇద్దరూ అతికష్టం మీద నిలబడి, “జయము, ఇశ్రాయేలుకు జయము” అని అరిచారు.
పెరూలోని లిమాలో, సువార్తికుల శిక్షణా కేంద్రం మరియు లిమాలోని మిషనుల నుండి సువార్తికులను కలిసినప్పుడు, ప్రభువు కార్యము పట్ల అదే ఉత్సాహాన్ని నేను చూశాను. ఎంత అద్భుతమైన దృశ్యం! వేగవంతం కావడాన్ని నేను ప్రత్యక్షంగా చూసాను. ఇప్పుడు కేవలం లిమా పట్టణంలోనే ఏడు మిషనులున్నాయి.
మా సమావేశం ముగింపులో, సువార్తికులు నన్ను ఆశ్చర్యపరిచారు. వారు లేచి నిలబడి, “ఇశ్రాయేలుకు జయము” అని అరిచారు. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను; మీరందరూ అక్కడ ఉండి ఉంటే బాగుండేదని అనుకున్నాను. ప్రభువును సేవించడానికి మరియు ఆయన రాకడను వేగవంతం చేయడానికి “ఈ లోక విషయాలను” పక్కన పెట్టిన సువార్తికులు నా కళ్ళ ముందే ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మన సభ్యులకు, సభ్యులు కానివారికి కూడా ప్రభువు విద్యా అవకాశాలను వేగవంతం చేయడాన్ని మనం చూస్తున్నాము. ఒక సంఘముగా మనల్ని ప్రత్యేకపరిచే విషయాలలో ఒకటి, విద్యకు మనమిచ్చే ప్రాధాన్యత. “అధ్యయనము ద్వారా, విశ్వాసము ద్వారా కూడా నేర్చుకొనుటకు” ప్రయత్నించమని పునఃస్థాపన యొక్క ప్రారంభ దినాలలో ప్రభువు ఆజ్ఞాపించారు. అది ఈ రోజు జరుగుతోంది మరియు “జయము” అనే నినాదానికి యోగ్యమైనది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 8,00,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు సెమినరీ మరియు ఇన్స్టిట్యూట్‌లలో చేరారు, ఇది సంఘ చరిత్రలో అత్యధిక నమోదు. మన యువత తెల్లవారుజామున, పగటిపూట మరియు సాయంత్రం తరగతుల నుండి ఆన్‌లైన్ మరియు ఇంటిలో అధ్యయనం వరకు వివిధ మార్గాల్లో సమకూడుతారు. వారు ఒక శక్తివంతమైన మరియు నీతివంతమైన పటాలము, వారు యేసు క్రీస్తు గురించి నేర్చుకునేటప్పుడు, అనుసరించేటప్పుడు మరియు దేవుని కుమారునిగా ఆయన గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు ఒకరి నుండి ఒకరు బలాన్ని పొందుతారు.
గత శరదృతువులో నేను యూటా విశ్వవిద్యాలయంలో సెమినరీ మరియు ఇన్స్టిట్యూట్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో నిండిన ఒక ప్రదేశంలోని భక్తిసమావేశంలో మాట్లాడాను. వారి హాజరు యేసు క్రీస్తును తెలుసుకోవాలనే మరియు అనుసరించాలనే వారి కోరిక గురించి చాలా చెప్పింది. ఆ విద్యార్థులకు నా సందేశం స్పష్టంగా ఉంది: మిగిలిన వాటితో సమానంగా ప్రభువుకు సమయం ఇవ్వండి. వారి విద్యను, “సజీవుడగు దేవుని కుమారుని” గురించిన నిజమైన, పరిశుద్ధమైన అధ్యయనంతో సమతుల్యం చేసుకోవాలని నేను వారికి సలహా ఇచ్చాను.
ఈరోజు నేను అందరినీ అదే అడుగుతున్నాను: మీరు చేయవలసిన జాబితాలో ఏది ఉన్నా, వ్యక్తిగత లేఖన అధ్యయనం, రండి, నన్ను అనుసరించండి యొక్క కుటుంబ అధ్యయనం, ప్రార్థన, సంఘ పిలుపులు, పరిచర్య చేయడం, సంస్కారంలో పాల్గొనడం, దేవాలయంలో ఆరాధించడం మరియు దేవుని విషయాలను ధ్యానించడంలో ప్రభువుకు ఖాళీ సమయం కాకుండా సమాన సమయం ఇవ్వండి. “నా యొద్ద నేర్చుకొనుడి; … అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును” అని మన ప్రభువైన రక్షకుడు చెప్పారు. ఆయన మాట నమ్మండి. మరియు ఆయనకు కూడా సమానమైన సమయం ఇవ్వండి.
అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు: “మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ సమయములో ఆయనకు న్యాయమైన వాటా ఇవ్వండి. మీరు ఆవిధంగా చేస్తున్నప్పుడు, మీ సానుకూల ఆత్మీయ వేగానికి ఏమి జరుగుతుందో గమనించండి.”
సెమినరీలు, ఇన్స్టిట్యూట్‌లు మరియు సంఘ విశ్వవిద్యాలయాలలో ఆ వేగం పెరగడాన్ని మనం చూస్తున్నాము. ఈ పరిసరాలలో, ప్రభువుకే ప్రాధాన్యత. అలాగే ప్రతీ ఒక్కరి జీవితంలో ఆయనకే ప్రాధాన్యత ఉండాలి.
సంఘములో విద్య యొక్క పెరుగుతున్న పరిధిని చూపించే మరో ప్రాంతం ప్రపంచవ్యాప్త బివైయు–పాత్‌వే. ప్రపంచవ్యాప్తంగా, నమోదు సుమారు 75,000 దాటింది మరియు వేగంగా పెరుగుతూనే ఉంది. వారిలో చాలామంది సభ్యులు మరియు మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఆఫ్రికాలో ఉన్నారు. పాత్‌వే అంతా విద్యకు ప్రాప్యత గురించినది. కోర్సులను పూర్తి చేయడం అంటే ఉపాధిని పొందడం మరియు ఉపాధిని పొందడం అంటే కుటుంబాలకు మెరుగైన జీవితం మరియు ప్రభువును సేవించడానికి మరిన్ని అవకాశాలు.
నేను యుగాండాలో స్టేకు నాయకులతో సమావేశమైనప్పుడు, మొత్తం స్టేకు అధ్యక్షత్వము బివైయు–పాత్‌వేలో నమోదు చేయబడ్డారని తెలుసుకున్నాను. మనం భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంత ఎక్కువగా సిద్ధపడియుంటే అంత ఎక్కువగా శత్రువు యొక్క మోసపూరిత దాడులను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటాము. పేతురు మాటలను గుర్తుంచుకోండి: “మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలే ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.”
సువార్త యొక్క మంచి వార్తల మధ్య, పోరాడుతున్నవారు, విశ్వాసపు సవాళ్లు, సందేహాలు మరియు జవాబులు లేని ప్రశ్నలు ఉన్నవారు ఉన్నారని నేను గుర్తించాను. సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తే జవాబు. ఆయనపై దృష్టి పెట్టండి. మీ జీవితంలో ఆయన ప్రభావం కొరకు చూడండి. ఆయన మాట వినండి. “మీ హృదయమును కలవరపడనియ్యకుడి” అని తన చివరి గడియలలో గెత్సేమనే ముందు తన శిష్యులతో, యెరూషలేము వీధుల గుండా తన సిలువను మోసే ముందు, గొల్గొతా ముందు, దేవుని అద్వితీయ కుమారుడైన ఆయన మాత్రమే చేయగలిగిన తన ప్రాయశ్చిత్త త్యాగాన్ని పూర్తి చేసిన చోట ఆయన అన్నారు.
ఆయన అర్థం చేసుకుంటారని తెలుసుకోండి. నిత్యత్వంలో మనం మళ్ళీ మన పరలోక తండ్రితో కలిసి జీవించేలా ఆయన మన పాపాలను, అపరాధాలను, కష్టాలను, శోధనలను తనపై తీసుకున్నారు. “ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు” అని ఆయన అన్నారు. యేసు క్రీస్తుపై విశ్వాసం మిమ్మల్ని పైకి లేపగలదు మరియు గాయపడిన మీ ఆత్మను స్వస్థపరచగలదు. ఆయనను నమ్మండి మరియు మీరు “ఆయన ప్రేమ యొక్క బాహువుల” యొద్దకు తిరిగి వెళ్ళడాన్ని వేగవంతం చేస్తారు.
జీవించియున్న మన ప్రవక్త యొక్క మాటలను నేను మళ్ళీ నొక్కి చెబుతున్నాను: “మన కళ్ళ ముందు ఏం జరుగుతోందో మీరు చూస్తున్నారా? ఈ క్షణం యొక్క మహిమను మనం కోల్పోకూడదని నేను ప్రార్థిస్తున్నాను! ప్రభువు నిజంగా తన పనిని వేగవంతం చేస్తున్నారు.” మన ప్రభువు మరియు రక్షకుని రాకడకు సిద్ధమవుతూ, మన కాలపు శిష్యులుగా, మనం “ఇశ్రాయేలుకు జయము” అని కేకవేద్దాం. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.