సర్వసభ్య సమావేశము
రక్షకుడిని కలుసుకోవడానికి వ్యక్తిగత సిద్ధపాటు
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


14:10

రక్షకుడిని కలుసుకోవడానికి వ్యక్తిగత సిద్ధపాటు

రక్షకుని యొక్క బోధనలను అనుసరించండి. ఆయన సూచనలు మర్మమైనవి లేదా సంక్లిష్టమైనవి కావు. మనం ఆయన బోధనలను అనుసరించినప్పుడు, మనం భయపడాల్సిన అవసరం లేదు లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, గత అక్టోబరులో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు ఇలా బోధించారు, “మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడేందుకు మీకు మరియు నాకు సమయమిదే.” రెండవ రాకడ గురించి అధ్యక్షులు నెల్సన్ మాట్లాడినప్పుడల్లా అది ఆనందకరమైన ఆశావాదంతో కూడియుంటుంది. అయితే, ఇటీవల ప్రాథమికలో ఒక అమ్మాయి రెండవ రాకడ గురించి ప్రస్తావించబడినప్పుడల్లా తాను ఆందోళన చెందుతుందని నాతో చెప్పింది. “యేసు మరల తిరిగి వచ్చేముందు చెడు విషయాలు జరుగుతాయి కాబట్టి నేను భయపడుతున్నాను,” అని ఆమె చెప్పింది.

ఈ విధంగా భావించేది కేవలం పిల్లలు మాత్రమే కాదు. ఆమె కొరకు, మీ కొరకు మరియు నా కొరకు, ఉత్తమమైన సలహా ఏమిటంటే రక్షకుని యొక్క బోధనలను అనుసరించడం. ఆయన సూచనలు మర్మమైనవి లేదా సంక్లిష్టమైనవి కావు. మనం వాటిని అనుసరించినప్పుడు, మనం భయపడాల్సిన అవసరం లేదు లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఆయన మర్త్య పరిచర్య ముగిసే సమయానికి, ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తారని యేసు క్రీస్తు అడగబడ్డారు. దానికి సమాధానమిస్తూ, ఆయన రెండవ రాకడ సమయంలో లేదా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయంలో ఆయనను కలుసుకోవడానికి అవసరమైన సిద్ధపాటు గురించి ఆయన మూడు ఉపమానాలను బోధించారు—అవి మత్తయి 25లో నమోదు చేయబడ్డాయి. ఆయనను కలుసుకోవడానికి వ్యక్తిగత సిద్ధపాటు జీవిత ఉద్దేశ్యానికి కేంద్రబిందువుగా ఉన్నందున ఈ బోధనలు చాలా ముఖ్యమైనవి.

రక్షకుడు మొదటిగా పదిమంది కన్యకల ఉపమానమును చెప్పారు. ఈ ఉపమానంలో, పదిమంది కన్యకలు ఒక వివాహ విందుకు వెళ్ళారు. అయిదుగురు బుద్ధిగలవారు తమ దివిటీలను నింపుకోవడానికి నూనె తీసికొనివచ్చారు మరియు అయిదుగురు బుద్ధి లేనివారు అలా చేయలేదు. పెండ్లికుమారుడు త్వరలో వస్తాడని ప్రకటించినప్పుడు, బుద్ధిలేని కన్యకలు నూనె కొనడానికి వెళ్లిపోయారు. వారు తిరిగి వచ్చేసరికి, చాలా ఆలస్యమైంది; విందుకు వెళ్ళడానికి తలుపు మూసివేయబడింది.

ఆ ఉపమానంలో మనకు సహాయపడే మూడు అంశాలను యేసు గుర్తించారు. ఆయన ఇలా వివరించారు:

“ఆ దినమున నేను మహిమతో వచ్చునప్పుడు, పదిమంది కన్యకలను గూర్చి నేను చెప్పిన ఉపమానము నెరవేర్చబడును.

“ఏలయనగా జ్ఞానము కలిగి, సత్యమును స్వీకరించి, పరిశుద్ధాత్మను తమ మార్గదర్శిగా పొందినవారు మోసగించబడలేదు— … కానీ వారు ఆ దినమున నిలిచియుందురని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

మరో మాటలో చెప్పాలంటే, వారు భయపడాల్సిన అవసరం లేదు లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు మనుగడ సాగించి అభివృద్ధి చెందుతారు. వారు విజయం సాధిస్తారు.

మనం బుద్ధిగలవారమైతే, యాజకత్వ విధులు మరియు నిబంధనల ద్వారా యేసు క్రీస్తు సువార్తను అంగీకరించడం ద్వారా మనం సత్యాన్ని స్వీకరిస్తాము. తరువాత, పరిశుద్ధాత్మను నిరంతరం మనతో కలిగియుండేందుకు యోగ్యులుగా ఉండడానికి మనం కృషి చేస్తాము. ఈ సామర్థ్యాన్ని వ్యక్తిగతంగా మరియు స్వయంగా, కొంచెము కొంచెముగా సంపాదించుకోవాలి. స్థిరమైన, వ్యక్తిగతమైన మరియు ఏకాంతమైన భక్తి కార్యాలు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాయి.

యేసు నొక్కి చెప్పిన మూడవ అంశం మోసాన్ని నివారించడం. రక్షకుడు ఇలా హెచ్చరించారు:

“ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.

“అనేకులు నా పేరట వచ్చి–నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు.”

వేషధారులు ఎన్నుకోబడిన వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తారని మరియు చాలా మంది శిష్యులు మోసపోతారని రక్షకుడికి తెలుసు. దైవిక అనుమతి ఉందని తప్పుగా చెప్పుకునే వారిని మనం నమ్మకూడదు లేదా వంచకులచే బోధించబడే నమ్మదగని లేదా మోసపూరిత మూలాల నుండి జ్ఞానాన్ని కోరుకోకూడదు.

శిష్యుల నుండి మోసగాళ్లను మనం వేరు చేయడమెలాగో మోర్మన్ గ్రంథము మనకు బోధిస్తుంది. శిష్యులు ఎల్లప్పుడూ దేవుణ్ణి విశ్వసించడం, ఆయనను సేవించడం మరియు మంచి చేయడం వంటి వాటిని ప్రోత్సహిస్తారు. రక్షకుని యొక్క నమ్మకమైన శిష్యులైన విశ్వసనీయ వ్యక్తుల నుండి సలహా కోరినప్పుడు మరియు తీసుకున్నప్పుడు మనం మోసపోము.

దేవాలయంలో క్రమం తప్పకుండా ఆరాధించడం ద్వారా కూడా మనం మోసాన్ని నివారించవచ్చు. ఇది మనం నిత్య దృక్పథాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది మరియు నిబంధన మార్గం నుండి మన దృష్టిని మరల్చే లేదా మళ్లించే ప్రభావాల నుండి మనల్ని కాపాడుతుంది.

ఈ పదిమంది కన్యకల ఉపమానం యొక్క ముఖ్యమైన ఉపదేశము ఏమిటంటే, మనం సువార్తను అంగీకరించి, పరిశుద్ధాత్మను మనతో కలిగియుండడానికి ప్రయత్నించినప్పుడు మరియు మోసాన్ని నివారించినప్పుడే మనం బుద్ధిగలవారము. అయిదుగురు బుద్ధిగల కన్యకలు నూనె లేని వారికి సహాయం చేయలేకపోయారు; ఎవరూ మన తరఫున సువార్తను అంగీకరించలేరు, పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని పొందలేరు మరియు మోసాన్ని నివారించలేరు. ఇది మనకై మనం చేసుకోవాలి.

తరువాత రక్షకుడు తలాంతుల ఉపమానమును చెప్పారు. ఈ ఉపమానంలో, ఒక వ్యక్తి ముగ్గురు దాసులకు వేర్వేరు మొత్తాలలో తలాంతులుగా సూచించబడిన ఆస్తిని ఇచ్చాడు. ఒక దాసునికి ఐదు తలాంతులు, మరొక దాసునికి రెండు, మూడవ దాసునికి ఒకటి ఇచ్చాడు. కాలక్రమేణా, మొదటి ఇద్దరు దాసులు తాము పొందిన దానిని రెట్టింపు చేసుకున్నారు. కానీ మూడవ దాసుడు మాత్రం తన ఒక్క తలాంతును పాతిపెట్టాడు. తమ తలాంతులను రెట్టింపు చేసుకున్న ఇద్దరు దాసులతో, ఆ వ్యక్తి ఇలా అన్నాడు, “భళా, … నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిమీద నియమించెదను, నీ యాజమానుని సంతోషములో పాలుపొందుము.”

ఆ వ్యక్తి తన తలాంతును పాతిపెట్టిన దాసుడిని “సోమరివైన చెడ్డ దాసుడా” అని మందలించాడు. ఈ దాసుని యొక్క తలాంతు తీసివేయబడి, అతను వెళ్ళగొట్టబడ్డాడు. అయినా, ఈ దాసుడు తన తలాంతును రెట్టింపు చేసియుంటే, అతను కూడా ఇతర దాసుల మాదిరిగానే ప్రశంసలు మరియు ప్రతిఫలాన్ని పొందేవాడు.

ఈ ఉపమానం యొక్క ఒక సందేశం ఏమిటంటే, మనకు ఇవ్వబడిన సామర్థ్యాలను మనం వృద్ధి చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు, కానీ మన సామర్థ్యాలను ఇతరుల సామర్థ్యాలతో పోల్చాలని ఆయన కోరుకోరు. అనిపోల్‌కు చెందిన 18వ శతాబ్దపు హసిడిక్ పండితుడు జుస్యా అందించిన ఈ అంతర్దృష్టిని పరిగణించండి. జుస్యా ఒక ప్రఖ్యాత ఉపాధ్యాయుడు, మరణాన్ని సమీపిస్తున్న కొద్దీ అతడు భయపడడం ప్రారంభించాడు. “బోధకుడా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు మంచి జీవితాన్ని గడిపారు; తప్పకుండా దేవుడు మీకు గొప్ప ప్రతిఫలం ఇస్తారు,” అని ఆయన శిష్యులు అన్నారు.

జుస్యా ఇలా అన్నాడు: “దేవుడు నాతో, ‘జుస్యా, నువ్వు మరో మోషే ఎందుకు కాలేదు?’ అని అడిగితే? ‘ఎందుకంటే నువ్వు మోషేకు ఇచ్చినంత గొప్ప ఆత్మను నాకు ఇవ్వలేదు కాబట్టి,’ అని అంటాను. మరియు నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన, ‘జుస్యా, నువ్వు మరొక సొలొమోను ఎందుకు కాలేదు?’ అని అడిగితే? ‘ఎందుకంటే నువ్వు సొలొమోనుకు ఇచ్చినంత జ్ఞానాన్ని నాకు ఇవ్వలేదు కాబట్టి,’ అని అంటాను. కానీ, అయ్యో నేను నా సృష్టికర్త ఎదుట నిలబడినప్పుడు ఆయన, ‘జుస్యా, నువ్వు మరొక జుస్యా ఎందుకు కాలేదు అని అడిగితే‘ నేను ఏమి చెప్పగలను? నేను నీకిచ్చిన సామర్థ్యానికి తగిన వ్యక్తిగా నువ్వు ఎందుకు కాలేదు?’ అని అడిగితే? అయ్యో, అందుకే నేను భయపడుతున్నాను.”

నిజానికి, దేవుని ద్వారా మనం పొందిన సామర్థ్యాలను వృద్ధి చేసుకోవడానికి రక్షకుని యోగ్యతలు, దయ మరియు కృపపై మనం ఆధారపడకపోతే దేవుడు నిరాశ చెందుతారు. ఆయన ప్రేమపూర్వక సహాయంతో, మనల్ని మనం ఉత్తమమైన వ్యక్తులుగా మార్చుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. మనం మన జీవితాలను విభిన్న సామర్థ్యాలతో ప్రారంభించవచ్చు అనేది ఆయనకు సంబంధించినది కాదు. అది మనకు సంబంధించినది.

చివరగా, రక్షకుడు గొఱ్ఱెలు మరియు మేకల ఉపమానాన్ని చెప్పారు. ఆయన తన మహిమతో తిరిగి వచ్చినప్పుడు, “సమస్త జనములు ఆయన యెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.”

ఆయన కుడి వైపున ఉన్నవారు ఆయన రాజ్యంలో వారసులయ్యారు మరియు ఆయన ఎడమ వైపున ఉన్నవారు వారసత్వాన్ని పొందలేకపోయారు. వారి విశిష్టమైన లక్షణం ఏమిటంటే, వారు ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆయనకు భోజనము పెట్టారు, దప్పిగొనినప్పుడు దాహమిచ్చారు, ఆయన పరదేశియైయున్నప్పుడు ఆయనను ఇంట చేర్చుకొన్నారు, ఆయన దిగంబరియైయున్నప్పుడు ఆయనకు బట్టలు ఇచ్చారు, ఆయన రోగియైయున్నప్పుడు లేదా చెరసాలలో ఉన్నప్పుడు ఆయనను సందర్శించారు.

కుడి చేయి వైపున ఉన్నవారూ, ఎడమ చేయి వైపున ఉన్నవారూ అందరూ కలవరపడ్డారు. ఆయనకు ఆహారం, పానీయం, దుస్తులు వారు ఎప్పుడు ఇచ్చారో, ఎప్పుడు ఇవ్వలేదో అడిగారు లేక ఆయన దుర్బలంగా ఉన్నప్పుడు ఆయనకు సహాయం చేశామా లేదా అని అడిగారు. ప్రతిస్పందనగా, రక్షకుడు ఇలా అన్నారు, “మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”

ఈ ఉపమానం యొక్క సందేశం స్పష్టంగా ఉంది: మనం ఇతరులకు సేవ చేసినప్పుడు, మనం దేవుణ్ణి సేవిస్తాము; మనం అలా చేయనప్పుడు, మనం నిరాశపరుస్తాము. మన వరములు, తలాంతులు మరియు సామర్థ్యాలను పరలోక తండ్రి పిల్లల జీవితాలను ఆశీర్వదించడానికి ఉపయోగించాలని ఆయన ఆశిస్తున్నారు. 19వ శతాబ్దంలో జోహన్ లుడ్విగ్ రూన్‌బర్గ్ అనే ఫిన్నిష్ కవి రాసిన ఒక కవితలో, ఇతరులకు సేవ చేయాలనే దైవిక ప్రేరణ గురించి వివరించబడింది. నేను మరియు నా తోబుట్టువులు మా చిన్నతనంలో “పావో రైతు” అనే కవితను పదే పదే విన్నాము. ఈ కవితలో, పావో అనే ఒక పేద రైతు, తన భార్యా పిల్లలతో మధ్య ఫిన్లాండ్‌లోని సరస్సు ప్రాంతంలో నివసించేవాడు. వరుసగా అనేక సంవత్సరాలు, అతని పంటలు చాలా వరకు నాశనమయ్యాయి, అది వసంతకాలంలో మంచు కరగడం వల్ల వచ్చే ప్రవాహం వల్ల కావచ్చు, వేసవి వడగళ్ల తుఫాను వల్ల కావచ్చు లేదా శరదృతువు ప్రారంభంలో వచ్చే మంచు వల్ల కావచ్చు. పంట తక్కువగా వచ్చిన ప్రతిసారీ , రైతు భార్య, “పావో, పావో, దురదృష్టవంతుడైన వృద్ధుడా, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు” అని విలపించేది. బదులుగా, పావో, “పిల్లలకు ఆకలి వేయకుండా ఉండడానికి బెరడును కాయధాన్యం పిండితో కలిపి రొట్టె తయారు చేయి. చిత్తడి నేలలను ఎండబెట్టడానికి నేను మరింత కష్టపడి పనిచేస్తాను. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నారు, కానీ ఆయన సమకూరుస్తారు,” అని ధైర్యంగా చెప్పేవాడు.

పంటలు నాశనమైన ప్రతిసారీ, ఆకలిని నివారించడానికి పిండిలో కలిపే బెరడును రెట్టింపు చేయమని పావో తన భార్యను ఆదేశించేవాడు. అతను కూడా మరింత కష్టపడి పనిచేసేవాడు, నేలను ఎండబెట్టడానికి కందకాలు త్రవ్వేవాడు, వసంతకాలంలో వచ్చే నీటి ప్రవాహం వలన మరియు శరదృతువు ప్రారంభంలో వచ్చే మంచు వలన తన పొలాలు ముంపుకు గురయ్యే అవకాశాన్ని తగ్గించేవాడు.

సంవత్సరాల తరబడి కష్టపడిన తర్వాత, చివరకు పావో చాలా సమృద్ధిగా పంటను పండించాడు. అతని భార్య ఉప్పొంగి, “పావో, పావో, ఇవి సంతోషకరమైన సమయాలు! బెరడును పారవేసి, కాయధాన్యం పిండితో మాత్రమే చేసిన రొట్టెలు కాల్చే సమయం ఇది,” అని అన్నది. కానీ పావో యథావిధిగా తన భార్య చేతిని పట్టుకుని, “మన పొరుగువారి పొలాలు మంచుతో నిండిపోయాయి కాబట్టి సగం పిండిని బెరడుతో కలపమని అన్నాడు.” పావో తన మరియు తన కుటుంబ సభ్యుల బహుమానాన్ని త్యాగం చేసి, నిరాశ్రయులైన తన పొరుగువారికి సహాయం చేశాడు.

రక్షకుని గొఱ్ఱెలు మరియు మేకల ఉపమానం యొక్క ఉపదేశము ఏమిటంటే, మనకు ఇవ్వబడిన వరములు—సమయం, తలాంతులు మరియు దీవెనలను—పరలోక తండ్రి పిల్లలకు, ముఖ్యంగా అత్యంత దుర్బలమైన మరియు అవసరంలో ఉన్నవారికి సేవ చేయడానికి ఉపయోగించాలి.

నేను ముందుగా చెప్పిన ఆందోళనతో ఉన్న ప్రాథమిక బాలికకు మరియు మీలో ప్రతి ఒక్కరికీ నా ఆహ్వానం ఏమిటంటే, మీరు యేసు క్రీస్తును అనుసరించండి మరియు ఒక ప్రియమైన స్నేహితుడిలా పరిశుద్ధాత్మను విశ్వసించండి. మిమ్మల్ని ప్రేమించే వారిపై మరియు రక్షకుడిని ప్రేమించే వారిపై ఆధారపడండి. మీ ప్రత్యేక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి దేవుని మార్గదర్శకత్వాన్ని వెదకండి మరియు సులభం కానప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయండి. మీరు రక్షకుడిని కలుసుకోవడానికి సిద్ధంగా ఉంటారు మరియు ఆనందంగా ఆశావాదంతో ఉండడంలో మీరు అధ్యక్షులు నెల్సన్‌ గారితో చేరగలరు. అలా చేయడం ద్వారా, యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ప్రపంచాన్ని సిద్ధం చేయడంలో మీరు సహాయపడతారు; ఇప్పుడు మరియు భవిష్యత్తులో ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి, ఆనందంలోనికి ప్రవేశించడానికి తగినంత నిరీక్షణతో మీరు దీవించబడతారు.

మన కొత్త కీర్తనలలో ఒకదానిలో మనం పాడుతున్నట్లు:

ఆనందించండి! మరియు ఆ దినము కొరకు సిద్ధపడండి! …

ఆయన మరలా వచ్చే దినమేదో, ఘడియేదో ఎవరికీ తెలియదు,

కానీ లేఖనాలు చెప్పినట్లుగా ఆయన తిరిగి వస్తారు; మన ప్రియమైన రక్షకుడు మరలా వచ్చినప్పుడు,

అది ఆనందకరమైన దినమవుతుంది.

యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ప్రభువైన యేసు క్రీస్తు మరలా వస్తారు,” సర్వసభ్య సమావేశము, అక్టోబరు. 2024.

  2. మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసు క్రీస్తు మనల్ని మారుస్తారు, తద్వారా మనం ఆయనను కలుసుకోవడానికి సిద్ధంగా ఉంటాము. మనం మన నిబంధనలను నిరంతరం గౌరవించి, ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు, ఆయన కృప మరియు ఆశీర్వాదాల ద్వారా మనం క్రమంగా రక్షకునిలాగా మార్పుచెందుతాము. మరియు మనం అలా చేసినప్పుడు, మనం ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడియుంటాము. 1 యోహాను 3:2–3 లో చెప్పబడినట్లుగా:

    “ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.

    “ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.”

  3. ప్రభువు యొక్క రెండవ రాకడ వెయ్యేళ్ళ యుగం ప్రారంభంలో జరుగుతుంది, ఆయన మహిమతో తిరిగి వస్తారు మరియు వాగ్దానం చేయబడిన మెస్సీయ ఆయనే అని అందరూ అంగీకరిస్తారు (యెషయా 45:23; జెకర్యా 12:10; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:104 చూడండి).

  4. రస్సెల్ ఎమ్. నెల్సన్, “స్వాగత సందేశం,” లియహోనా, మే 2020, 6.

  5. జోసెఫ్ స్మిత్ అనువాదము, మత్తయి 25:1 (మత్తయి 25:1లో, footnote a); మత్తయి 25:1–4, 6–13 చూడండి.

  6. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:56–57.

  7. See David A. Bednar, “Converted unto the Lord,” Liahona, Nov. 2012, 109.

  8. 2 నీఫై 32:5 చూడండి.

  9. మత్తయి 24:4–5.

  10. జోసెఫ్ స్మిత్—మత్తయి 1:5–6, 8–9, 21–22, 25–26 చూడండి.

  11. మొరోనై 7:13, 15–17 చూడండి. మోర్మన్ గ్రంథంలోని బోధనలు “అసత్య బోధనలను ఖండించి” బైబిలు బోధనలతో కలిసిపోయి వాటిని స్పష్టం చేస్తాయి (2 నీఫై 3:12). రెండవ రాకడ కొరకు ప్రపంచాన్ని సిద్ధం చేయడానికి మోర్మన్ గ్రంథం దేవుని యొక్క సాధనం అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించడానికి బహుశా ఇది ఒక కారణం కావచ్చు”(see “The Book of Mormon, the Gathering of Israel, and the Second Coming,” Liahona, July 2014, 27).

  12. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సిలెస్టియల్‌గా ఆలోచించండి!,” సర్వసభ్య సమావేశము, అక్టోబరు 2023 చూడండి. అధ్యక్షులు నెల్సన్ ఇలా కూడా బోధించారు: “అవిశ్వాసులైన పురుషులు మరియు స్త్రీల తప్పుడు సిద్ధాంతాలతో [మీ సాక్ష్యాన్ని] కలుషితం చేసుకోవద్దు” (“లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” సర్వసభ్య సమావేశము, అక్టోబరు 2022). “మీ ప్రశ్నలను ప్రభువు యొద్దకు మరియు ఇతర విశ్వసనీయ మూలాధారాల యొద్దకు తీసుకువెళ్ళండి. … ఇతర సందేహకారులతో వాటిని పునరావృతం చేయడం ద్వారా మీ సందేహాలను పెంచుకోవడం ఆపండి” (“క్రీస్తు లేచియున్నాడు; ఆయన యందు విశ్వాసం కొండలను కదిలిస్తుంది,” సర్వసభ్య సమావేశము, ఏప్రిల్ 2021). మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన పెద్దవాడగు ఆల్మా సలహా ఇచ్చినట్లుగా, “ఒకడు దైవజనుడైయుండి దేవుని మార్గములందు నడుచుచు ఆయన ఆజ్ఞలను పాటించితే తప్ప, ఎవనిని మీ ఉపదేశకునిగాను లేదా మీ సేవకునిగాను కూడా నమ్మవద్దు” (మోషైయ 23:14). ఈ యుగంలో, “ఎవరైతే నలిగిన ఆత్మకలిగి, సాత్వికముతో, ఆత్మీయాభివృద్ధిని కలుగజేయు భాషతో మాట్లాడునో, … [ఎవరు] నా శక్తివలన భయముతో వణకునో … మరియు … నేను మీకు అనుగ్రహించిన సత్యములు, బయల్పాటులను బట్టి స్తుతి, జ్ఞానఫలములను తెచ్చునో” (సిద్ధాంతము మరియు నిబంధనలు 52:14–19 చూడండి) వారిపై మాత్రమే ఆధారపడాలని రక్షకుడు మనకు బోధించారు.

  13. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ప్రభువైన యేసు క్రీస్తు మరలా వస్తారు,” 121 చూడండి.

  14. మరణించిన పూర్వీకుల తరఫున ప్రత్యామ్నాయ విధులు నిర్వహించబడినప్పుడు, ఆ పూర్వీకులు సువార్తను అంగీకరించి నమ్మకంగా ఉండాలా వద్దా అని స్వయంగా నిర్ణయించుకుంటారు. ఆ పరిస్థితుల్లో కూడా, ఎవరూ మరొకరి కోసం నిర్ణయాలు తీసుకోరు.

  15. మత్తయి 25:14–30 చూడండి.

  16. See Guide to the Scriptures, “Talent.” గ్రీకు మరియు రోమనుల కాలంలో తలాంతు అనేది బరువు మరియు ద్రవ్య విలువ యొక్క పురాతన కొలమానం. ఒక తలాంతు విలువ దాదాపు 6,000 దేనారములు ఉంటుందని అంచనా వేయబడింది మరియు ఒక దేనారం ఒక కార్మికునికి దాదాపు ఒక రోజు కూలి కాబట్టి, ఒక తలాంతు సగటు కార్మికునికి దాదాపు 20 సంవత్సరాల జీతానికి సమానం.

  17. మత్తయి 25:21; 23వ వచనము కూడా చూడండి.

  18. మత్తయి 25:24-26 చూడండి.

  19. ఈ ఉపమానాన్ని విస్తరిస్తూ, శాశ్వతమైన విషయాల పథకంలో, ప్రతి దాసుడు తన ప్రభువు యొక్క ఆనందంలోకి ప్రవేశించి, ప్రభువుకు ఉన్నదానికంతా వారసుడిగా మారిన తర్వాత, ప్రతి దాసుడికి ప్రారంభంలో ఉన్న దానిలో కనిపించే చిన్న తేడాలు చాలా తక్కువగా ఉంటాయి.

  20. అదనంగా, ఈ ఉపమానంలో ప్రస్తావించబడిన తలాంతును ప్రభువు జీవితం మరియు సువార్త యొక్క వివిధ అంశాలతో పోల్చారు, వాటిలో జ్ఞానం మరియు సాక్ష్యం (ఈథర్ 12:35; సిద్ధాంతము మరియు నిబంధనలు 60:2, 13 చూడండి) అలాగే సంపద మరియు గృహనిర్వాహకత్వము (సిద్ధాంతము మరియు నిబంధనలు 82:18 చూడండి) ఉన్నాయి.

  21. See Harold S. Kushner, Overcoming Life’s Disappointments (2006), 26.

  22. నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023), 48లో పేర్కొన్న విధంగా, “జీవితంలో అన్యాయమైనవన్నీ యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా సరిచేయబడతాయి.”

  23. మత్తయి 25:31–46 చూడండి.

  24. మత్తయి 25:32–33.

  25. మత్తయి 25:37–39, 44 చూడండి.

  26. మత్తయి 25:40; 45వ వచనము కూడా చూడండి.

  27. మోషైయ 2:17 చూడండి. ఆయన సువార్తను పంచుకున్నప్పుడు, నలిగిన హృదయముగలవారిని స్వస్థపరచడంలో సహాయపడినప్పుడు (యెషయా 61:1–3 లూకా 4:16–21 చూడండి), బలహీనులను పోషించినప్పుడు, వడలిన చేతులను పైకెత్తి, సడలిన మోకాళ్ళను బలోపేతం చేసినప్పుడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 81:5 చూడండి) మనం రక్షకుని యొక్క సువార్తసేవలో పాల్గొంటాము.

  28. కొండరావిచెట్టువంటి చెట్టు బెరడు లోపలి పొరలో కొంత పిండిపదార్థాలు మరియు పీచు ఉంటాయి. తినడానికి ఏమి దొరకనప్పుడు దీనిని తినవచ్చు.

  29. See Johan Ludvig Runeberg, “Högt Bland Saarijärvis Moar,” Idyll och epigram Dikter (1830), nummer 25; Suomen kansalliskirjallisuus (Helsinki, 1941), 9:50–52; sv.wikisource.org/wiki/Högt_bland_Saarijärvis_moar. స్వీడిష్ నుండి అనువాదం నాది.

  30. ఇది దేవుడు ప్రాచీన ఇశ్రాయేలును ఏమి చేయాలని నిర్దేశించారో సూచిస్తుంది: “బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను–నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకాజ్ఞాపించుచున్నాను” (ద్వితీయోపదేశకాండము 15:11).

  31. See Dallin H. Oaks, “Preparation for the Second Coming,” Liahona, May 2004, 7–10, for a wonderful discourse about the Second Coming and ways to prepare for it.

  32. రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” 95–98 చూడండి. అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు, “ఈ సమకూర్పులో ఒక కీలకమైన అంశం ఏమిటంటే, ప్రభువు మళ్ళీ వచ్చినప్పుడు, ఆయనను స్వీకరించడానికి సమర్థులుగా, సిద్ధంగా ఉండి మరియు అర్హులైన ప్రజలను, ఈ పడిపోయిన ప్రపంచానికి పైగా ఇప్పటికే యేసు క్రీస్తును ఎన్నుకున్న ప్రజలను, యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన, పవిత్రమైన చట్టాలను జీవించడానికి వారి కర్తృత్వము బట్టి సంతోషించే ప్రజలను సిద్ధం చేయడం” (“లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” 98).

  33. మొరోనై 7:3 చూడండి. అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ ఇలా బోధించారు: “సూచించబడిన విశ్రాంతి శారీరక విశ్రాంతి కాదు. … [ఇది] సత్యం పట్ల స్థిరమైన నమ్మకం నుండి వచ్చే ఆధ్యాత్మిక విశ్రాంతి మరియు శాంతి. … ఈ విధంగా మనం ఈ రోజు సువార్త సత్యాలను అర్థం చేసుకోవడం ద్వారా ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించవచ్చు. … [ఈ విశ్రాంతిలోకి ప్రవేశించిన వారు] వారి మనస్సులు సంతృప్తి చెందాయి మరియు సత్యంలో స్థిరంగా ఉండడానికి వారి హృదయాలలో అజేయమైన దృఢ సంకల్పంతో వారి ఉన్నత పిలుపు యొక్క గుర్తుపై తమ దృష్టిని నిలిపాయి మరియు వారు యేసు క్రీస్తు అనుచరుల కోసం నిర్దేశించబడిన మార్గాన్ని వినయంతో మరియు నీతితో నడుపుతున్నారు. కానీ ఈ దృఢ నిశ్చయ స్థాయికి చేరుకోకుండానే, సిద్ధాంతాల గాలికి కొట్టుకొనిపోయి, అనారోగ్యంతో, అస్థిరంగా, అశాంతితో ఉన్నవారు చాలామంది ఉన్నారు. సంఘములో, దేశంలో, మనుషుల గందరగోళంలో జరిగే సంఘటనల వల్ల నిరుత్సాహపడిన వారు వీరే. … వారు అనుమానం, అశాంతి, అనిశ్చితి భావనను కలిగి ఉంటారు. వారి ఆలోచనలు చెదిరిపోతాయి మరియు సముద్రంలో తన దిక్కు‌లను కోల్పోయిన వ్యక్తిలాగా, అతి తక్కువ మార్పుతో కూడా వారు ఉత్సాహంగా ఉంటారు” (Gospel Doctrine, 5th ed. [1939], 126).

  34. “When the Savior Comes Again,” Hymns—For Home and Church, Gospel Library.