దాతృత్వము—నిజమైన శిష్యత్వానికి ఒక సంకేతం
శిష్యరికం యొక్క నిజమైన ఉద్దేశ్యం ఏమిటంటే, అక్షరాలా యేసు క్రీస్తులా మారడం.
ఇటీవల అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, “మన శిష్యత్వానికి అత్యంత ప్రాధాన్యతనిమ్మని” మనల్ని ఆహ్వానించారు. ఆ శక్తివంతమైన ఆహ్వానం, యేసు క్రీస్తునందు నా వ్యక్తిగత శిష్యత్వం గురించి లోతుగా ఆలోచించేలా నన్ను ప్రేరేపించింది.
శిష్యరికం ఉద్దేశపూర్వకమైనది
శిష్యుడు అంటే మరొకరి అనుచరుడు లేదా విద్యార్థి. శిష్యులు తమ జీవితాలను తమ గురువులాగా మారడానికి అంకితం చేసే “అభ్యాసకులు”. కాబట్టి, యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా ఉండడమంటే, ఆయన బోధనలను మరియు సిద్ధాంతాలను విశ్వసించడం కంటే ఎక్కువ. అది ఆయన దైవత్వాన్ని అంగీకరించడం మరియు ఆయనను మన రక్షకునిగా, విమోచకునిగా అంగీకరించడం కంటే మించిన దానిని సూచిస్తుంది, అది ఎంతో ముఖ్యమైనది.
అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇలా వివరించారు: “క్రీస్తును అనుసరించడం అనేది సాధారణమైన లేదా అప్పుడప్పుడు చేసే అభ్యాసం కాదు. అది నిరంతర నిబద్ధత మరియు జీవన విధానం, అది అన్ని సమయాలలో మరియు అన్ని ప్రదేశాలలో మనకు మార్గనిర్దేశం చేయాలి.” శిష్యత్వం అనేది ప్రభువు యొక్క ప్రాయశ్చిత్త త్యాగం మరియు ఆయన అతీంద్రియ శక్తి ద్వారా రూపాంతరం చెందడానికి మనం జాగ్రత్తగా చేసే ఉద్దేశపూర్వక ప్రయాణం. శిష్యరికం యొక్క నిజమైన ఉద్దేశ్యం ఏమిటంటే, అక్షరాలా యేసు క్రీస్తులా మారడం—“[మన] రూపముల యందు ఆయన స్వరూపమును” పొందే స్థాయికి కూడా.
ప్రభువు యొక్క శిష్యులుగా ఉండాలంటే, మనం ప్రతిరోజూ ఆయన ఆలోచనలను మరియు చర్యలను ఉద్దేశపూర్వకంగా అనుసరించాలి—ఉదాహరణకు, ఆయన విధేయత, వినయము మరియు సహనం. మనం ఈ లక్షణాలను క్రమంగా మన స్వంత గుర్తింపులలో చేర్చుకున్నప్పుడు, మనం “[ఆయన] దైవిక స్వభావంలో పాలివారలమవుతాము.” ఈ విధంగా రక్షకుని స్వభావాన్ని అనుసరించడం ఆయనను ఆరాధించడంలో ప్రధానమైనది. అధ్యక్షులు నెల్సన్ గారు బోధించినట్లుగా, “యేసు పట్ల మనకున్న ఆరాధనా భావం యేసును అనుసరించడం ద్వారా ఉత్తమంగా వ్యక్తమవుతుంది.”
నిజమైన శిష్యత్వం యొక్క సంకేతం
మనం అనుసరించవలసిన యేసు క్రీస్తు యొక్క అనేక దైవిక లక్షణాలలో ఒకటి ఉన్నతంగా నిలుస్తుంది మరియు మిగిలినవన్నీ ఆ ఉన్నతమైన లక్షణంలో ప్రతిబింబిస్తాయి. ఆ లక్షణం ఆయన స్వచ్ఛమైన ప్రేమ లేదా దాతృత్వం. దాతృత్వము కలిగియుండని యెడల, “[మనం] ఏమియు కాము” అని ప్రవక్త మోర్మన్ మరియు అపొస్తలుడైన పౌలు ఇద్దరూ మనకు గుర్తు చేస్తున్నారు. లేదా, ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు బయల్పరచబడినట్లుగా, “దాతృత్వము లేనియెడల, [మనం] ఏమీ చేయలేము.”
రక్షకుడు ఇలా ప్రకటించినప్పుడు ఆయన స్వయంగా ప్రేమను ఒక గుర్తుగా లేదా సంకేతంగా గుర్తించారు, దాని ద్వారా ఆయన నిజమైన శిష్యులు గుర్తించబడతారు:
“మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.
“మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”
దాతృత్వం అనేది ఒక సంపూర్ణమైన భావన, దానిని నిర్వచించడం కష్టం, కానీ దాని ద్వారా ప్రభావితం చెందినవారందరూ సులభంగా గ్రహిస్తారు. “విశ్వాసం వలె దాతృత్వం కూడా చర్యకు దారితీస్తుంది” అని నా సువార్తను ప్రకటించండి బోధిస్తుంది. నిజానికి, దాతృత్వాన్ని “క్రియాత్మక ప్రేమ” అని వర్ణించవచ్చు. ఈ వివరణ—ఆయన “మేలుచేయుచు సంచరించుచుండెను” అనే రక్షకుని జీవిత సారాంశ ప్రకటనకు గొప్ప అంతర్దృష్టిని అందిస్తుంది.
యేసు క్రీస్తు యొక్క అనుచరులుగా, మన బోధకుడు ఇతరుల పట్ల తనకున్న స్వచ్ఛమైన ప్రేమను ప్రదర్శించిన విధానాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి. రక్షకుడు అనేక విధాలుగా దాతృత్వాన్ని వ్యక్తపరచినప్పటికీ, ఆయన నిజమైన శిష్యులలో సులభంగా కనిపించే ఆయన దాతృత్వం యొక్క మూడు ప్రత్యేక నమూనాలపై నేను దృష్టిపెట్టాలనుకుంటున్నాను.
దాతృత్వమంటే కనికరము చూపడం
మొదట, రక్షకుడు కనికరం చూపుట ద్వారా దాతృత్వాన్ని ప్రదర్శించారు. మోర్మన్ గ్రంథములో నమోదు చేయబడినట్లుగా, నీఫైయుల మధ్య తన పరిచర్య సమయంలో, ప్రభువు ప్రజలను ఇళ్ళకు వెళ్ళి, తాను బోధించిన విషయాలను ధ్యానించమని మరియు మరుసటి రోజు తన రాక కోసం సిద్ధపడమని ఆహ్వానించారు. తరువాత ఆ గ్రంథము ఇలా చెబుతుంది:
“వారు కన్నీళ్ళతో ఉండి, మరికొంతసేపు వారితో నిలిచియుండమని ఆయనను అడుగుచున్నట్లు ఆయనవైపు తదేకముగా చూచుచుండిరి.”
“ఆయన వారితో ఇట్లు చెప్పెను: ఇదిగో, నా హృదయాంతరములు మీ యెడల కనికరముతో నిండియున్నవి.”
కనికరమనేది బాధలను తగ్గించడానికి ప్రయత్నించే దాతృత్వంలో భాగం. కనికరముగల ప్రభువు, ప్రజల మధ్య గల రోగులను మరియు బాధింపబడిన వారిని స్వస్థపరిచారు. తరువాత, దేవదూతలు పరలోకం నుండి దిగివచ్చి వారిని చుట్టుముట్టగా ఆయన వారి పిల్లలను దీవించారు. ఆయన “కనికరపడినందున” ఈ మృదువైన, ప్రేమపూర్వకమైన క్రియలను మరియు మరెన్నింటినో చేసారు.
దక్షిణ అమెరికాలో యువ సువార్తికునిగా సేవ చేస్తున్నప్పుడు, నేను కూడా ఒక ప్రియమైన స్నేహితుడి కనికరము చేత ప్రయోజనం పొందాను. ఒక సాయంత్రం నేను నా సహచరుడితో కలిసి మా మిషను అధ్యక్షుడి ఇంటికి కారులో వెళుతుండగా, సైకిలుపై ఉన్న ఒక యువకుడు అకస్మాత్తుగా నా వాహనం ముందువైపుకు తిరిగాడు. అది ఎంత త్వరగా జరిగిపోయిందంటే, నేను ఢీకొట్టకుండా ఉండలేకపోయాను. విషాదకరంగా, ఆ దెబ్బకు ఆ యువకుడు మరణించాడు. అతను చనిపోవడం చూసి నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. జరిగిన దాని యొక్క భయంకరమైన నిజాన్ని చూసి నేను భయభ్రాంతులకు గురయ్యాను, నన్ను జైలుకు తీసుకెళ్లి నిర్బంధించారు. నేను ఎప్పుడూ అంతగా భయపడి, ఒంటరిగా భావించలేదు. మిగిలిన జీవితమంతా నేను జైలులో ఉంచబడతానేమో అనే నిరాశ, భయం నాలో నిండిపోయాయి.
తోటి సువార్తికుడు, ఎల్డర్ బ్రయాన్ కోచెవర్, ప్రమాదం గురించి తెలుసుకుని, కనికరముతో కదిలించబడ్డాడు. అతను జైలుకు వచ్చి, నేను ఒంటరిగా ఉండకుండా అతన్ని కూడా నాతో పాటు జైలులో ఉండడానికి అనుమతించమని అధికారులను వేడుకున్నాడు. ఆశ్చర్యకరంగా, వారు అంగీకరించారు. నా జీవితంలో అత్యంత కష్ట సమయంలో నన్ను ప్రశాంతపరిచిన, ఆదరించిన మరియు ఓదార్చిన ఈ శిష్యుడి యొక్క క్రీస్తువంటి ప్రేమకు ఈ రోజు వరకు కూడా నేను లోతైన కృతజ్ఞతను కలిగియున్నాను. అతని దాతృత్వపు కరుణ అతని శిష్యత్వానికి ఒక చిహ్నము. అధ్యక్షులు నెల్సన్ గారు గమనించినట్లుగా, “ఒక వ్యక్తి ఇతరులను ఎంత ప్రేమగా ఆదరిస్తాడనే దానిని బట్టి, ఆ వ్యక్తి యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరుడు అవునో కాదో సులువుగా గుర్తించవచ్చు.”
దాతృత్వమంటే చెప్పబడని అవసరాలను తీర్చడానికి చేసే పరిచర్య
రక్షకుడు తన ప్రేమను ప్రదర్శించే మరొక మార్గం ఏమిటంటే, ఇతరుల యొక్క చెప్పబడని అవసరాలను గమనించి, పరిచర్య చేయడం. 38 సంవత్సరాలుగా సహాయం చేయడానికి ఎవరూ లేక కుంటివాడిగా పడియున్న వ్యక్తిని ప్రభువు స్వస్థపరచి, నీతిగా జీవించమని ప్రోత్సహించారు. వ్యభిచారములో పట్టుబడిన స్త్రీకి, శిక్షకు బదులుగా ఆయన నిరీక్షణను మరియు ఓదార్పును అందించారు. పైకప్పు నుండి క్రిందికి దింపబడిన పక్షవాతం ఉన్న వ్యక్తికి, ప్రభువు శారీరక స్వస్థతను మాత్రమే కాకుండా, పాప క్షమాపణను కూడా అందించారు.
నేను బిషప్పుగా సేవ చేయడానికి పిలువబడినప్పుడు, మా ఆరుగురు చిన్న పిల్లలు నా భార్య క్రిస్టిన్‌కు సంస్కార కూడికలను సవాలుగా మార్చారు, నేను వేదికపైన కూర్చున్నప్పుడు ఆమె ఒంటరిగా వారిని చూసుకోవలసి వచ్చింది. మీరు ఊహించినట్లుగా, మా పిల్లలు తరచు చాలా అల్లరి చేసేవారు. ఆమె పరిస్థితిని గమనించి, మా వార్డులోని ఇద్దరు సభ్యులు, జాన్ మరియు డెబ్బీ బెనిచ్, ప్రతి ఆదివారం ఆమెతో కూర్చుని సహాయం చేయడం ప్రారంభించారు. వారి వాత్సల్యము సంవత్సరాలు కొనసాగింది మరియు వారు మా కుటుంబానికి ప్రత్యామ్నాయ అవ్వతాతలు అయ్యారు. ప్రభువు వలె, ఈ శిష్యులు చెప్పబడని అవసరాన్ని గమనించారు మరియు ప్రేమతో వ్యవహరించారు—ఇది వారి శిష్యత్వానికి ఒక ఉన్నతమైన సంకేతం.
దాతృత్వమంటే నిబంధన మార్గం వెంబడి ఇతరులకు సహాయపడడం
చివరగా, రక్షకుని యొక్క పరిపూర్ణ ప్రేమ దేవుని పిల్లలందరూ తమ దైవిక సామర్థ్యాన్ని నెరవేర్చడానికి వీలు కల్పించడంపై దృష్టి సారించింది, తద్వారా మనం “ఆయన రక్షణ యందు, ఆయన విమోచన శక్తి యందు పాలుపొందవచ్చు.” మనము మరింతగా మన బోధకునివలె మారినప్పుడు, నిబంధన మార్గం వెంబడి మన సహోదర సహోదరీలకు సహాయం చేయాలనే మన కోరిక సహజంగా పెరుగుతుంది.
ఉదాహరణకు, మనస్తాపం చెందిన లేదా మరచిపోబడిన వారిని మనం ఉద్ధరించవచ్చు మరియు వారితో స్నేహం చేయవచ్చు, మన సంఘానికి కొత్తగా వచ్చిన వారు స్వాగతించబడినట్లు భావించేలా సహాయపడవచ్చు లేదా సంస్కార కూడికలలో—బహుశా ఈ రాబోయే ఈస్టరుకు మనతో కలిసి ఆరాధించడానికి స్నేహితులను ఆహ్వానించవచ్చు. యేసు క్రీస్తు వారిని ఎలా చూస్తారో అలా చూడగలిగిన కన్నులు మరియు వారి పట్ల ఎలా భావిస్తున్నారో అలా అనుభూతి చెందగలిగిన హృదయం కలిగియుండాలని మనం ఉద్దేశపూర్వకంగా మరియు ప్రార్థనాపూర్వకంగా పరలోక సహాయం కోరితే, ఇతరులను ప్రోత్సహించడానికి మరియు వారి పురోగతిలో సహాయపడడానికి లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి.
వారి నిబంధన మార్గం వెంబడి ఇతరులకు సహాయం చేయడం అనేది అసాధారణమైన సేవా చర్య రూపంలో ఉండవచ్చు. ఉదాహరణకు, ఫిలిప్పీన్స్‌లో నా ప్రస్తుత నియామకంలో ఉన్నప్పుడు, నేను అగామాటా కుటుంబం గురించి తెలుసుకున్నాను. 2023లో వారు బాప్తిస్మము పొందారు, ఆపై వారు సమీపంలోని ఉర్దానేటా ఫిలిప్పీన్స్ దేవాలయంలో కుటుంబ సమేతంగా ముద్రవేయబడడానికి ఆసక్తిగా ఒక తేదీని నిర్ణయించుకున్నారు. అయితే, కుటుంబం నిర్ణయించుకున్న సమయానికి ముందు అనేక తుఫానులు ఆ ప్రాంతాన్ని తాకాయి. వరి పండించే రైతు అయిన సహోదరుడు అగామాటా, తీవ్రమైన తుఫానుల సమయంలో తన పంటలను నాటలేకపోయాడు. చివరికి తుఫానులు తగ్గినప్పుడు, నేల నీటితో తడిసి ఉండగానే అతను త్వరగా వరి నాటవలసివచ్చింది—అవి నాటడానికి అనువైన పరిస్థితులు. విచారకరంగా, దేవాలయ ప్రయాణం వాయిదా వేయవలసివచ్చింది.
అగామాటా కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాల గురించి విని, వ్యవసాయ అనుభవం లేకపోయినా ఇద్దరు శిష్యులు, ఎల్డర్ మరియు సహోదరి కాలవాన్, ముగ్గురు యువ సేవా సువార్తికులతో కలిసి వారికి సహాయం అందించారు. మండుటెండలో పనిచేస్తూ, మొక్కలు నాటడానికి వారు సహాయం చేసారు; అగామాటాలు తమ పనిని పూర్తి చేయడానికి మరియు నిర్ణీత సమయం ప్రకారం దేవాలయంలో ముద్రవేయబడడానికి హాజరయ్యేలా వీలుకల్పించారు. ఎల్డర్ కాలవాన్ ఇలా అన్నారు, “[అగామాటాలు] ప్రభువు యొక్క మందిరంలో తెల్లటి దుస్తులు ధరించియుండడం చూసినప్పుడు వారి ముఖాలు ప్రకాశించడాన్ని మేము గమనించాము. ఆ ఒక్కరికి పరిచర్య చేయడంలో మేము అనుభవించిన ఆనందం వర్ణించలేని ఆనందం!”
శిష్యత్వానికి చిహ్నంగా దాతృత్వంతో నిండిన కొంతమంది తోటి శిష్యులు, వారి సహోదర సహోదరీలకు తమ నిబంధన మార్గం వెంబడి ముందుకు సాగడానికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నందున, అగామాటాలు ఇప్పుడు ఒక నిత్య కుటుంబంగా ముద్రవేయబడడం వలన వచ్చే గొప్ప దీవెనలను ఆస్వాదిస్తున్నారు.
సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు యొక్క శిష్యత్వమే శాశ్వతమైన సంతోషానికి గల ఏకైక మార్గం. అది ఇతరుల పట్ల ఆలోచనపూర్వకమైన మరియు ఉద్దేశపూర్వకమైన ప్రేమ చర్యలతో నిండిన మార్గం. శిష్యత్వ మార్గం కష్టంగా మరియు సవాలుతో కూడుకున్నది కావచ్చు, కొన్నిసార్లు మనం కష్టపడవచ్చు మరియు విఫలం కావచ్చు, అయినప్పటికీ దేవుడు మనల్ని గుర్తుంచుకుంటారని మరియు మనం ప్రయత్నించిన ప్రతిసారీ మనకు సహాయం చేయడానికి ఆరాటపడతారని తెలుసుకోవడం ద్వారా మనం ఆదరణ పొందవచ్చు. “ భయపడకుము; నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు దేవుడు [మన] చేతిని పట్టుకుంటారు,” అని యెషయా మనకు గుర్తు చేస్తున్నాడు.
మన పరలోక తండ్రి ఇచ్చిన ఈ హామీని దృష్టిలో ఉంచుకుని, మన శిష్యత్వానికి ప్రాధాన్యత ఇవ్వమని అధ్యక్షులు నెల్సన్ గారిచ్చిన ఆహ్వానాన్ని మనం అనుసరించాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. “ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులందరికి ఆయన అనుగ్రహించిన ఈ ప్రేమతో మనం నింపబడవలెనని; … ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలియుండవలెనని,” మనము “హృదయము యొక్క పూర్ణ శక్తితో తండ్రికి ప్రార్థన చేద్దాం,” ఎందుకంటే మనం నిజమైన శిష్యత్వానికి సంకేతాన్ని కలిగియున్నాము, అదే “దాతృత్వము … క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ.”
యేసు క్రీస్తు మన సజీవ, మహిమాన్విత రక్షకుడు, విమోచకుడు, మాదిరి మరియు స్నేహితుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.