యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం అంతిమ రక్షణను అందిస్తుంది
లోక రక్షకుడైన యేసు క్రీస్తు వైపు మనం తిరిగినప్పుడు, ఆయన తన ప్రాయశ్చిత్తం ద్వారా జీవితంలోని కష్టాల నుండి మనల్ని రక్షిస్తారు.
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ఈ జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల నుండి అంతిమ రక్షణను అందిస్తుంది. గత సంవత్సరం చివరలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు కాస్పర్ వయోమింగ్ దేవాలయాన్ని ప్రతిష్ఠించమని నన్ను నియమించారు. అదొక గొప్ప, భావోద్వేగపరమైన, ఆధ్యాత్మిక అనుభవం. రక్షకుని ప్రాయశ్చిత్తం ద్వారా దేవుని పిల్లలను రక్షించడంలో దేవాలయాలు పోషించే పాత్రను అది స్పష్టం చేసింది.
కాస్పర్ వయోమింగ్ దేవాలయ జిల్లాలోని స్టేకులలో 1847 మరియు 1868 మధ్య కడవరి-దిన పరిశుద్ధ అగ్రగాములు ఉపయోగించిన మార్గంలో కొంత భాగం ఉంది. దేవాలయ ప్రతిష్ఠాపనకు సిద్ధమవుతున్నప్పుడు, కాస్పర్ దగ్గర ప్లాట్ నది ప్రక్కనుండి సాల్ట్ లేక్ సిటీ వరకు కొనసాగిన మార్గం యొక్క చరిత్రలో కొంతభాగం నేను మళ్ళీ చదివాను. లక్షలాది మంది పాశ్చాత్య వలసదారులకు ఈ మార్గం ఒక ప్రధాన రహదారిగా ఉండేది. నా దృష్టి ప్రధానంగా ఆ మార్గంలో ప్రయాణించిన 60,000 కంటే ఎక్కువ మంది కడవరి-దిన పరిశుద్ధ అగ్రగాములపై ఉంది.
మన అగ్రగాములలో ఎక్కువమంది పెద్దబండ్లలో వచ్చారు, కానీ 10 తోపుడుబండి సమూహాలలో భాగంగా దాదాపు 3,000 మంది ప్రయాణించారు. ఆ తోపుడుబండి సమూహాలలో ఎనిమిది సమూహాలు అద్భుతమైన విజయాలతో మరియు తక్కువ మరణాలతో స్మారక వలసను పూర్తి చేసాయి. 1856 నాటి విల్లీ మరియు మార్టిన్ తోపుడుబండి సమూహాలు దానికి మినహాయింపు.
భయంకరమైన వాతావరణ పరిస్థితులు ప్రారంభమైన సమయం నుండి విల్లీ మరియు మార్టిన్ తోపుడుబండి సమూహాల వృత్తాంతాలను నేను సమీక్షించాను. స్వీట్ వాటర్ నది, మార్టిన్స్ కోవ్, రాకీ రిడ్జ్ మరియు రాక్ క్రీక్ హాలోలను దాటేటప్పుడు వారు ఎదుర్కొనే సవాళ్ల గురించి నాకు బాగా తెలుసు.
Between Storms [తుఫానుల మధ్య], ఆల్బిన్ వెసెల్కా చేత
ప్రతిష్ఠాపనకు ముందు నేను కాస్పర్ దేవాలయం లోపలికి వెళ్ళలేదు. నేను వరండాలోకి వెళ్ళగానే, Between Storms [తుఫానుల మధ్య] అనే పేరుగల అసలు తోపుడుబండి వర్ణచిత్రం నా దృష్టిని ఆకర్షించింది. ఆ వర్ణచిత్రం స్పష్టంగా జరిగిన విషాదాలను చిత్రీకరించడానికి ఉద్దేశించబడలేదు. నేను దానిని చూస్తున్నప్పుడు, “ఈ వర్ణచిత్రం సరైనదే; తోపుడుబండి అగ్రగాములలో ఎక్కువమంది విషాదాలను అనుభవించలేదు” అని నేను అనుకున్నాను. ఇది సాధారణంగా జీవితం లాంటిదని నేను అనుకోకుండా ఉండలేకపోయాను. కొన్నిసార్లు మనం శ్రమల మధ్య, కొన్నిసార్లు కష్టసుఖాల మధ్య ఉంటాము.
Heaven’s Portal [పరలోక ద్వారం], జిమ్ విల్కాక్స్ చేత
నేను మరొక గోడమీద Heaven’s Portal [పరలోక ప్రవేశద్వారం], అనే పేరుగల అసలు వర్ణచిత్రాన్ని చూసినప్పుడు, “డెవిల్స్ గేట్” అని పిలువబడే ఈ అందమైన వేసవి చిత్రం దాని గుండా ప్రవహించే ప్రశాంతమైన మరియు స్పష్టమైన స్వీట్ వాటర్ నదితో, ఆ భయంకరమైన చలికాలంలో అగ్రగాములు ఎదుర్కొన్న సవాళ్లను మాత్రమే కాకుండా, ప్రభువు సృష్టి యొక్క అందాన్ని ప్రదర్శిస్తోందని నేను గ్రహించాను.
తరువాత నేను సిఫారసు బల్ల వెనుకవైపు ముందువైపు చూసినప్పుడు, రక్షకుని యొక్క అందమైన వర్ణచిత్రాన్ని చూసాను. అది వెంటనే కృతజ్ఞతా భావాలను ప్రేరేపించింది. గొప్ప అందం ఉన్న ప్రపంచంలో, అపారమైన సవాళ్లు కూడా ఉన్నాయి. లోక రక్షకుడైన యేసు క్రీస్తు వైపు మనం తిరిగినప్పుడు, తండ్రి ప్రణాళిక ప్రకారం ఆయన తన ప్రాయశ్చిత్తం ద్వారా కష్టమైన శ్రమల నుండి మనల్ని రక్షిస్తారు.
నాకైతే దేవాలయ విధి గదుల కొరకు వరండా ఒక పరిపూర్ణమైన సిద్ధపాటు, అది మనం ఉన్నతిస్థితి యొక్క విధులను పొందడానికి, పవిత్ర నిబంధనలు చేయడానికి మరియు రక్షకుని ప్రాయశ్చిత్తం యొక్క ఆశీర్వాదాలను పూర్తిగా అంగీకరించడానికి, అనుభవించడానికి వీలు కల్పిస్తుంది. తండ్రి యొక్క సంతోష ప్రణాళిక రక్షకుని ప్రాయశ్చిత్త రక్షణపై ఆధారపడియుంది.
అగ్రగాముల అనుభవం కడవరి-దిన పరిశుద్ధులకు ఒక ప్రత్యేకమైన చారిత్రక సంప్రదాయాన్ని మరియు శక్తివంతమైన సామూహిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందిస్తుంది. కొందరికి, మిస్సోరి మరియు నావూ రెండింటి నుండి బలవంతంగా తరిమివేయబడిన తర్వాత వలసలు సుదీర్ఘకాలం పాటు జరిగాయి. మరికొందరికి, వలసలను మరింత సరళంగా చేయడానికి ఉద్దేశించిన తోపుడుబండి ప్రణాళికను అధ్యక్షులు బ్రిగమ్ యంగ్ ప్రకటించిన తర్వాత అది ప్రారంభమైంది. పెద్దబండ్లు మరియు ఎద్దుల కంటే తోపుడుబండ్ల ధర చాలా తక్కువ.
ఇంగ్లండులో ఒక సువార్తికుడైన మిల్లెన్ అట్వుడ్ ఇలా అన్నాడు, తోపుడుబండి ప్రణాళికను ప్రకటించినప్పుడు, “అది ఎండిన చెత్తలో నిప్పులా రేగింది, పేద పరిశుద్ధుల హృదయాలు ఆనందంతో, సంతోషంతో గంతులు వేసాయి.” చాలామంది “పర్వతాలలో తమ సహోదర సహోదరీలతో ఏకం అయ్యే భాగ్యం పొందాలని రోజుల తరబడి పగలు, రాత్రి ప్రార్థనలు చేసి ఉపవాసం ఉన్నారు.”
తోపుడుబండి పరిశుద్ధులలో ఎక్కువ మంది కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ పెద్ద ప్రతికూల సంఘటనలను తప్పించుకున్నారు. అయితే రెండు తోపుడుబండి సమూహాలు, విల్లీ సమూహము మరియు మార్టిన్ సమూహము, ఆకలి, గడ్డకట్టే వాతావరణానికి గురికావడం మరియు అనేక మరణాలను ఎదుర్కొన్నారు.
ఈ ప్రయాణికుల్లో ఎక్కువ మంది 1856 మే నెలలో ఇంగ్లండులోని లివర్‌పూల్ నుండి రెండు నౌకల్లో ప్రయాణించారు. వారు జూన్ మరియు జూలై నెలల్లో ఐయోవా నగరంలోని తోపుడుబండ్ల తయారీ ప్రదేశానికి చేరుకున్నారు. హెచ్చరికలు ఉన్నప్పటికీ, రెండు సమూహాలు ఆ సమయంలో చాలా ఆలస్యంగా సాల్ట్ లేక్ లోయకు బయలుదేరాయి.
అధ్యక్షులు బ్రిగమ్ యంగ్ ఈ సమూహాల ప్రమాదకరమైన పరిస్థితి గురించి మొదట 1856, అక్టోబరు 4న తెలుసుకున్నారు. మరుసటి రోజు ఆయన సాల్ట్ లేక్ సిటీలోని పరిశుద్ధుల ముందు నిలబడి, “మన సహోదర సహోదరీలలో చాలామంది తోపుడుబండ్లతో మైదానాల్లో ఉన్నారు, … వారిని ఇక్కడికి తీసుకురావాలి; చలికాలం రాకముందే మనం వారికి సహాయం పంపాలి” అని అన్నారు.
ఆయన 60 కంచరగాడిదల జట్లు, 12 లేదా అంతకంటే ఎక్కువ పెద్ద బండ్లు మరియు 12 టన్నుల పిండిని (10,886 కిలోలు) అందించమని బిషప్పులను కోరారు మరియు “వెళ్లి మైదానాలలో ఉన్న ఆ జనులను తీసుకురండి” అని ప్రకటించారు.
విల్లీ మరియు మార్టిన్ తోపుడుబండి సమూహాలలో మొత్తం అగ్రగాముల సంఖ్య సుమారు 1100. ఈ విలువైన పరిశుద్ధులలో దాదాపు 200 మంది ప్రయాణంలో మరణించారు. సకాలంలో సహాయం అందకపోతే, ఇంకా చాలామంది చనిపోయి ఉండేవారు.
మొదటి సహాయకులు సాల్ట్ లేక్ సిటీని విడిచిపెట్టిన తర్వాత దాదాపు రెండు వారాలకు చలికాలపు తుఫానులు ప్రారంభమయ్యాయి. విల్లీ మరియు మార్టిన్ సమూహాల సభ్యుల వృత్తాంతాలు తుఫానులు ప్రారంభమైన తర్వాత వినాశకరమైన సవాళ్లను వివరిస్తాయి. సహాయకులు వచ్చినప్పుడు కలిగిన గొప్ప ఆనందాన్ని కూడా ఈ వృత్తాంతాలు వర్ణిస్తాయి.
ఆగమన దృశ్యాన్ని వివరిస్తూ, మేరీ హురెన్ ఇలా అన్నారు: “పురుషుల చెంపల మీదుగా కన్నీళ్లు ధారలుగా కారాయి, పిల్లలు ఆనందంతో నృత్యం చేశారు. జనులు తమ భావాలను అదుపు చేసుకోగలిగిన వెంటనే, వారందరూ మంచులో మోకరిల్లి దేవునికి కృతజ్ఞతలు తెలిపారు.”
రెండు రోజుల తరువాత, విల్లీ సమూహము కష్టతరమైన మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది, రాకీ రిడ్జ్ మీదుగా, మంచు తుఫానులో. అందులో చివరి బండి మరుసటి రోజు ఉదయం 5:00 గంటల వరకు శిబిరానికి చేరుకోలేదు. పదమూడు మంది మరణించారు మరియు ఒకే సమాధిలో పాతిపెట్టబడ్డారు.
నవంబరు 7న, విల్లీ సమూహము సాల్ట్ లేక్ లోయకు చేరుకుంది, కానీ ఆ ఉదయం, ఇంకా మూడు మరణాలు సంభవించాయి. రెండు రోజుల తరువాత, విల్లీ సమూహము చివరకు సాల్ట్ లేక్ చేరుకుంది, అక్కడ వారికి అద్భుతమైన స్వాగతం లభించింది మరియు పరిశుద్ధులు ఇళ్లలోకి ఆహ్వానించారు.
అదే రోజు, మార్టిన్ సమూహము ఇంకా 325 మైళ్ల (523 కి.మీ.) దూరంలో ఉన్నారు, చలితో మరియు తగినంత ఆహారం లేకుండా బాధపడుతూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం, వారు స్వీట్ వాటర్ నదిని దాటి ఇప్పుడు మార్టిన్స్ కోవ్ అని పిలువబడే ప్రదేశానికి చేరుకున్నారు, అక్కడ వారు ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ పొందాలని ఆశించారు. “ఇది ప్రయాణంలో అత్యంత చెత్త నదిని దాటడం,” అని అగ్రగాములలో ఒకరు అన్నారు. కేవలం 17 సంవత్సరాల వయస్సు గల నా ముత్తాత డేవిడ్ ప్యాటన్ కింబల్ వంటి కొంతమంది సహాయకులు, తన యువ స్నేహితులైన “జార్జ్ డబ్ల్యు. గ్రాంట్, అలెన్ హంటింగ్టన్, స్టీఫెన్ టేలర్ మరియు ఐరా నెబెకర్‌లతో కలిసి” స్వీట్ వాటర్ నదిని దాటడానికి సమూహానికి వీరోచితంగా సహాయం చేస్తూ గంటల తరబడి గడ్డకట్టే నీటిలో గడిపారు.
ఈ సంఘటన చాలామంది దృష్టిని ఆకర్షించినప్పటికీ, సహాయకుల గురించి నేను మరింత తెలుసుకున్నప్పుడు, వారందరూ ప్రవక్తను అనుసరిస్తున్నారని మరియు చిక్కుకున్న పరిశుద్ధులను కాపాడడంలో కీలక పాత్ర పోషించారని నేను గ్రహించాను. వలస వచ్చిన వారిలాగే సహాయకులందరూ వీరోచితంగా వ్యవహరించారు.
వారి కథను అధ్యయనం చేస్తూ, వలస వచ్చిన వారిలో ఉన్న విలువైన సంబంధాలను మరియు దీర్ఘకాలిక నిత్య దృష్టిని నేను అభినందించాను. జాన్, మరియా లిన్‌ఫోర్డ్ మరియు వారి ముగ్గురు కుమారులు విల్లీ సమూహంలో సభ్యులు. మొదటి సహాయకులు రావడానికి కొన్ని గంటల ముందు జాన్ మరణించాడు. వారు ప్రయాణం చేసినందుకు తాను సంతోషంగా ఉన్నానని అతను మరియాతో చెప్పాడు. “సాల్ట్ లేక్ చేరుకునే వరకు నేను బ్రతకను, కానీ నువ్వు, పిల్లలు బ్రతకాలి, మన అబ్బాయిలు పెరిగి పెద్దవారై సీయోనులో వారి కుటుంబాలను పెంచుకోగలిగితే చాలు, మనం పడ్డ కష్టాల గురించి నాకు చింత లేదు” అని అన్నాడతను.
అధ్యక్షులు జేమ్స్ ఇ. ఫౌస్ట్ ఈ అద్భుతమైన సారాంశాన్ని అందించారు: “తోపుడుబండి అగ్రగాముల వీరోచిత ప్రయత్నంలో, మనం ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకుంటాము. అందరూ కంసాలి అగ్ని గుండా వెళ్ళాలి మరియు మన జీవితాల్లో అల్పమైనవి, అప్రధానమైనవి మడ్డిలా కరిగిపోయి మన విశ్వాసాన్ని ప్రకాశవంతంగా, చెక్కుచెదరకుండా, బలంగా చేస్తాయి. సరైనది చేయడానికి మరియు విశ్వాసంగా ఉండడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించే వారితో సహా ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయిలో వేదన, దుఃఖం మరియు తరచుగా హృదయ విదారకం ఉన్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ ఇది దేవునిలా మారడానికి జరిగే సరియైన ప్రక్షాళనలో భాగం.”
ఆయన నిత్యత్వాన్ని రూపొందించే ప్రాయశ్చిత్తం మరియు పునరుత్థానంలో, రక్షకుడు ప్రతీ ఒక్కరి కోసం “మరణంపై విజయం సాధించి, మరణ బంధకాలను” తెంచారు. పాపాల కొరకు పశ్చాత్తాపపడిన వారి కోసం, ఆయన “వారి దోషములు, అతిక్రమములు తనపై వేసుకొని వారిని విమోచించి, న్యాయపు అక్కరలను తృప్తిపరిచారు.”
ప్రాయశ్చిత్తం లేకుండా, పాపం మరియు మరణం నుండి మనల్ని మనం రక్షించుకోలేము. మన కష్టాలలో పాపం ముఖ్యమైన పాత్ర పోషించగలిగినప్పటికీ, తప్పులు, చెడు నిర్ణయాలు, ఇతరుల చెడు చర్యలు మరియు మన నియంత్రణలో లేని అనేక విషయాల ద్వారా జీవితపు ప్రతికూలతలు మరింత తీవ్రమవుతాయి.
నా సువార్తను ప్రకటించండి ఇలా బోధిస్తుంది: “మనం యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం మీద ఆధారపడినప్పుడు, మన కష్టాలు, అనారోగ్యాలు మరియు బాధలను భరించడంలో ఆయన మనకు సహాయపడగలరు. మనం ఆనందం, శాంతి మరియు ఓదార్పుతో నింపబడగలము. జీవితంలో అన్యాయమైనవిగా ఉన్నవన్నీ యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా సరిచేయబడతాయి.”
ఈ ఈస్టరు సమయంలో, మన దృష్టి రక్షకునిపై మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగంపై ఉంది. చాలామందికి చీకటిగా మరియు నిరుత్సాహంగా అనిపించే సమయంలో ప్రాయశ్చిత్తం నిరీక్షణను, వెలుగును అందిస్తుంది. అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి ఇలా ప్రకటించారు, “చరిత్ర మొత్తాన్ని పరిశీలించినప్పుడు, … ఈ కృపగల చర్య కంటే అద్భుతమైనది, గంభీరమైనది, అపారమైనది మరొకటి లేదు.”
మన కాలానికి సంబంధించినవి అని నేను భావిస్తున్న మూడు సిఫార్సులను నేను పంచుకుంటాను.
మొదటిది, భౌతిక మరియు ముఖ్యంగా ఆధ్యాత్మిక సవాళ్ల నుండి ఇతరులను కాపాడడానికి మనం చేయగలిగినదంతా చేయడం యొక్క ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయకండి.
రెండవది, రక్షకుని ప్రాయశ్చిత్తాన్ని కృతజ్ఞతతో అంగీకరించండి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, మనమందరం ఆనందాన్ని, సంతోషాన్ని ప్రదర్శించడానికి కృషి చేయాలి. అన్ని పరిస్థితుల్లో ఆశావాదిగా జీవించడమే మన లక్ష్యం. నా అమూల్యమైన సహచరి మేరీ తన జీవితాంతం ఇలా చేయడం నేను గమనించాను. సంవత్సరాలుగా మేము సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, ఆశాజనకమైన, ఉత్తేజకరమైన ఆమె విధానాన్ని నేను అభినందించాను.
నా మూడవ సలహా ఏమిటంటే, రక్షకుని ప్రాయశ్చిత్తాన్ని విశ్వాసంతో ధ్యానించడానికి స్థిరమైన సమయాన్ని కేటాయించడం. మన వ్యక్తిగత మతపరమైన ఆచారంలో దీన్ని చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే, సంస్కార కూడికకు హాజరు కావడం మరియు సంస్కారంలో పాలుపంచుకోవడం చాలా ముఖ్యమైనది.
సాధ్యమైనంతవరకు దేవాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావడం కూడా అంతే ముఖ్యం. రక్షకుని ప్రాయశ్చిత్తాన్ని మరియు అది జయించిన దానిని దేవాలయం నిరంతరం జ్ఞాపకం చేస్తుంది. మరీ ముఖ్యంగా, దేవాలయ హాజరు మరణించిన మన ప్రియమైనవారికి మరియు దూరపు పూర్వీకులకు ఆధ్యాత్మిక రక్షణను అందించడానికి మనల్ని అనుమతిస్తుంది.
మన గత సమావేశంలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు ఈ సూత్రాన్ని నొక్కిచెప్పారు మరియు ఇలా అన్నారు, “[దేవాలయ] దీవెనలు ప్రభువు యొక్క రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయడంలో సహాయపడే జనులను సిద్ధం చేయడానికి … సహాయపడతాయి!”
గత తరాల త్యాగాలను, మాదిరులను మనం ఎప్పటికీ మరచిపోకూడదు, కానీ మన స్తుతి, ప్రశంస, ఆరాధన లోక రక్షకునిపై మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగంపై కేంద్రీకృతమై ఉండాలి. తండ్రి యొక్క సంతోష ప్రణాళికకు కీలకం మన రక్షకుడైన యేసు క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తమని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన జీవిస్తున్నారు మరియు తన సంఘాన్ని నడిపిస్తున్నారు. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ఈ జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల నుండి అంతిమ రక్షణను అందిస్తుంది. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.