“నా యొద్దకు రండి”
యేసు క్రీస్తు మనలో ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నారు. ఆయనకు దగ్గరయ్యే అవకాశాన్ని ఆయన మనకు కల్పిస్తారు.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సర్వసభ్య సమావేశములో మీతో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఆయన సంఘము. మనం ప్రపంచవ్యాప్తంగా భవనాలు మరియు గృహాలలో ఆయన నామమందు సమావేశమయ్యాము.
నిబంధన ద్వారా మనము ఆయన రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు ఆయన నామాన్ని మనపై తీసుకుంటాము. ఆయనే పునరుత్థానము చెందిన మరియు మహిమపరచబడిన దేవుని కుమారుడు. మనం పాపానికి, మరణానికి లోబడిన మర్త్య జీవులము. అయినప్పటికీ, మనలో ప్రతి ఒక్కరి పట్ల రక్షకునికి ఉన్న ప్రేమ వలన, ఆయన మనల్ని తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నారు.
ఆయన మనకు ఇస్తున్న ఆహ్వానం ఇదిగో: “నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వచ్చెదను; శ్రద్ధతో నన్ను వెదకుడి, మీరు నన్ను కనుగొందురు; అడుగుడి, మీకు ఇవ్వబడును; తట్టుడి, మీకది తెరువబడును.”
రక్షకుడైన యేసు క్రీస్తుకు మనం సన్నిహితంగా భావించే సమయాలు ఉన్నాయి. అయినప్పటికీ, కొన్నిసార్లు మన మర్త్య శోధనల సమయంలో, మనం ఆయన నుండి కొంత దూరంగా ఉన్నట్లు భావించి, మన హృదయాల్లో ఏముందో ఆయన తెలుసుకుంటారని మరియు వ్యక్తులుగా మనల్ని ప్రేమిస్తున్నారనే హామీని కోరుకుంటాము.
రక్షకుని యొక్క ఆహ్వానంలో ఆ హామీని అనుభవించే మార్గం ఉంది. ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన యొద్దకు చేరండి. లేఖన అధ్యయనం ద్వారా ఆయనను శ్రద్ధగా వెదకండి. ఆయన ప్రియమైన కుమారునికి దగ్గరగా భావించాలని హృదయపూర్వక ప్రార్థన ద్వారా పరలోక తండ్రిని అడగండి.
దాని గురించి ఆలోచించడానికి ఒక సరళమైన విధానమున్నది. ప్రియమైన స్నేహితుల నుండి కొంతకాలం విడిపోతే మీరు చేసేది కూడా అదే. మీరు వారితో సంభాషించడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు, వారి నుండి మీరు అందుకున్న ఏ సందేశాన్ని అయినా మీరు విలువైనదిగా భావిస్తారు మరియు వారికి సహాయం చేయడానికి మీరు చేయగలిగినదంతా చేస్తారు.
అది ఎంత ఎక్కువగా జరుగుతుందో, అది ఎంత ఎక్కువ కాలం కొనసాగుతుందో, ఆప్యాయత యొక్క బంధం అంత గాఢంగా బలపడుతుంది మరియు మీరు దగ్గరవుతున్నట్లు భావిస్తారు. విలువైన సంభాషణ లేకుండా, ఒకరికొకరు సహాయం చేసుకునే అవకాశం లేకుండా ఎక్కువ సమయం గడిచిపోతే, ఆ బంధం బలహీనపడుతుంది.
యేసు క్రీస్తు మనలో ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నారు. ఆయనకు దగ్గరయ్యే అవకాశాన్ని ఆయన కల్పిస్తారు. ప్రేమగల స్నేహితుడితో వున్నట్లుగా, యేసు క్రీస్తు నామంలో పరలోక తండ్రిని ప్రార్థించి సంభాషించడం ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క ప్రియమైన మార్గదర్శకత్వం కోసం వినడం ద్వారా మరియు రక్షకుని కోసం ఇతరులకు ఉత్సాహముగా సేవ చేయడం ద్వారా మీరు కూడా దాదాపు అదే విధంగా చేస్తారు. త్వరలోనే మీరు కూడా ఆయన వద్దకు చేరే ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు.
నా యౌవనంలో, ఆజ్ఞలకు విధేయత చూపే సాధారణ చర్యల ద్వారా, నేను రక్షకునికి సన్నిహితం కావడాన్ని మరియు ఆయన నాకు సన్నిహితంగా రావడం వలన కలిగే ఆనందాన్ని నేను అనుభవించాను. నేను యౌవనుడిగా ఉన్నపుడు, సంస్కారము సాయంకాల సమావేశములో ఇవ్వబడేది. 75 సంవత్సరాల క్రితం, బయట చీకటిగా మరియు చల్లగా ఉన్న ఒక నిర్దిష్ట రాత్రిని నేను ఇప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయన కుమారుడిని ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకోవడానికి మరియు ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఆయనతో నిబంధన చేస్తూ, పరిశుద్ధులతోపాటు సంస్కారమును తీసుకోవడానికి సమకూడాలనే ఆజ్ఞను పాటించానని నేను గ్రహించినప్పుడు, ఆనందమును మరియు ప్రేమను అనుభూతి చెందడాన్ని నేను గుర్తుంచుకున్నాను.
ఆ రాత్రి సమావేశం ముగింపులో మేము “నాతో ఉండండి; ఈ సాయంత్రం” అనే కీర్తనను “ఓ రక్షకుడా, ఈ రాత్రి నాతో ఉండండి” అనే చిరస్మరణీయ పదాలతో పాడాము.
నేను చిన్నవాడినైనా ఈ మాటలు నాకు ఆత్మ యొక్క మహత్తరమైన భావాన్ని తెచ్చాయి. పరిశుద్ధాత్మ యొక్క ఓదార్పు ద్వారా ఆ సాయంత్రము నేను రక్షకుని ప్రేమను మరియు సాన్నిహిత్యాన్ని అనుభవించాను.
సంవత్సరాల తరువాత, నా చిన్నతనంలో ఆ సంస్కార సమావేశమందు ప్రభువుతో నేను అనుభూతి చెందిన అదే రక్షకుని యొక్క ప్రేమను మరియు సన్నిహిత భావనలను పునరుద్ధరించాలని నేను కోరుకున్నాను. కాబట్టి నేను లేఖనాలను పరిశోధించాలనే మరో సులభమైన ఆజ్ఞను పాటించాను.
లూకా గ్రంథములో, ఆయన సిలువ శ్రమ మరియు సమాధి తరువాత మూడవ రోజు, ఆయన శరీరాన్ని అభిషేకించడానికి, రక్షకుని పట్ల ప్రేమతో, విశ్వాసులైన సేవకులు వచ్చిన విషయం గురించి నేను చదివాను. వారు వచ్చినప్పుడు, సమాధి నుండి రాయి తొలగించబడియుండుటను వారు కనుగొన్నారు మరియు అక్కడ ఆయన శరీరము లేదని చూసారు.
ఇద్దరు దేవదూతలు ప్రక్కన నిలబడి, వారు ఎందుకు భయపడుతున్నారని, అడిగి:
“సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు?
“ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండినప్పుడు ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి.
“పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి.”
ఆ సాయంత్రం సంధ్యా సమయంలో, ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మాయు అను ఒక గ్రామమునకు మార్గంలో నడిచారు మరియు పునరుత్థానం చెందిన ప్రభువు వారికి కనిపించి వారితో నడిచారు.
లూకా గ్రంథము ఆ సాయంత్రము వారితో నడవడానికి మనల్ని అనుమతిస్తుంది:
“వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకు వచ్చి వారితోకూడ నడిచెను.
“అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.
“ఆయన– మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి?
“వారిలో క్లెయొపా అనువాడు–యెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను.”
యేసు ఇశ్రాయేలీయుల విమోచకుడని నమ్మినప్పుడే ఆయన చనిపోయారని వారు తమ బాధను గూర్చి ఆయనకు చెప్పారు.
విచారంతో దుఃఖిస్తున్న ఈ ఇద్దరు శిష్యులతో ఆయన మాట్లాడేటప్పుడు పునరుత్థానం చెందిన ప్రభువు స్వరంలో అప్యాయత తప్పక ఉండి ఉండాలి.
నేను చదువుతూ ఉండగా, నేను నా చిన్నతనములో భావించినట్లే, ఈ మాటలు నా హృదయాన్ని ఉప్పొంగజేశాయి:
“ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా,
“వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతము చేసిరి. గనుక ఆయన వారితోకూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.”
ఆ రాత్రి రక్షకుడు తన శిష్యుల ఇంట్లో ప్రవేశించడానికి ఆహ్వానాన్ని అంగీకరించారు. ఆయన వారితో కలిసి భోజనం వద్ద కూర్చున్నారు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని దీవించి, దానిని విరిచి వారికి పంచి పెట్టారు. వారి కన్నులు తెరవబడినవి, వారాయనను గుర్తు పట్టారు. అంతట ఆయన వారి యెదుట నుండి అదృశ్యమయ్యారు.
ఆ దీవించబడిన శిష్యుల భావాలను లూకా మన కోసం ఇలా నమోదు చేసాడు: “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?” అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.”
ఆ ఇద్దరు శిష్యులు వెంటనే యెరూషలేముకు తిరిగి వెళ్ళి, పదునొకొండుగురు శిష్యులకు జరిగిన దానిని చెప్పిరి. వారు తమ అనుభవమును పంచుకొన్నప్పుడు, రక్షకుడు మరలా ప్రత్యక్షమయ్యారు.
“ఆయన వారి మధ్యను నిలిచి–మీకు సమాధానమవుగాకని వారితో అన్నారు.” తరువాత ఆయన తన తండ్రి యొక్క పిల్లలందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలనే మరియు మరణబంధకాలను త్రెంచాలనే తన నియమితకార్యము యొక్క ప్రవచనాలను సమీక్షించారు.
“క్రీస్తు శ్రమపడి మూడవదినమున మృతులలోనుండి లేచుననియు
“యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.
ఆయన ప్రియమైన శిష్యుల వలె, బాప్తిస్మపు ద్వారము ద్వారా ప్రవేశించడానికి ఎంచుకున్న ప్రతి పరలోక తండ్రి బిడ్డ, రక్షకుని యొక్క సాక్షిగా ఉండడానికి మరియు మన మర్త్య జీవితమంతా అవసరంలో ఉన్నవారి పట్ల శ్రద్ధ వహించడానికి నిబంధన క్రింద ఉన్నారు. ఈ నిబద్ధతను శతాబ్దాల క్రితం మోర్మన్ జలముల వద్ద గొప్ప మోర్మన్ గ్రంథ ప్రవక్త ఆల్మా మన కోసం స్పష్టం చేసారు:
“మీరు దేవుని సముదాయములోనికి వచ్చుటకు, ఆయన జనులని పిలువబడుటకు కోరిక కలిగియున్నారు మరియు అవి తేలికగునట్లు ఒకరి భారములు ఒకరు భరించుటకు ఇష్టపడుచున్నారు;
“దుఃఖించు వారితో దుఃఖపడుటకు, ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరించుటకు మరియు దేవుని ద్వారా విమోచింపబడి, మొదట పునరుత్థానము చెందువారితో లెక్కింపబడి మీరు నిత్యజీవము కలిగియుండునట్లు మరణము వరకు … , అన్ని సమయములలో, అన్ని విషయములలో, మీరు ఉండు అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలబడుటకు ఇష్టపడుచున్నారు.”
ఈ వాగ్దానాలకు మీరు విశ్వసనీయంగా ఉన్నప్పుడు, మీ భారములను తేలికగా చేస్తూ, మీ సేవలో మీతో కలసి ఉంటాననే తన వాగ్దానమును ప్రభువు నిలుపుకోవడాన్ని మీరు కనుగొంటారు. మీరు రక్షకుడిని తెలుసుకుంటారు, కాలక్రమేణా మీరు ఆయన వలె మారతారు మరియు “ఆయనలో పరిపూర్ణులుగా ఉంటారు.” రక్షకుని కొరకు ఇతరులకు సహాయపడుట ద్వారా, ఆయనకు దగ్గర కావడాన్ని మీరు కనుగొంటారు.
మీలో అనేకులు నిత్యజీవ మార్గమునుండి తప్పిపోయిన ప్రియమైన వారిని కలిగియున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి మీరు ఇంకా ఏమి చేయవచ్చునని మీరు ఆశ్చర్యపడవచ్చు. మీరు ఆయనను విశ్వాసంతో సేవిస్తున్నప్పుడు, ఆయన వద్దకు చేరడానికి ప్రభువుపై మీరు ఆధారపడగలరు.
జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్ తమ పనులపై వారి కుటుంబాలకు దూరంగా ఉన్నప్పుడు ప్రభువు ఇచ్చిన వాగ్దానం మీకు గుర్తుండవచ్చు: “నా స్నేహితులైన సిడ్నీ మరియు జోసెఫ్, మీ కుటుంబములు కుశలముగానున్నవి; వారు నా చేతులలోనున్నారు, నా దృష్టికి ఏది మంచిదో వారికది చేయుదును; ఏలయనగా నా యందు సర్వశక్తి ఉన్నది.”
అవసరంలో ఉన్న వారి గాయములను మీరు కట్టినప్పుడు, ప్రభువు యొక్క శక్తి మిమ్మల్ని బలపరుస్తుంది. మన పరలోక తండ్రి యొక్క పిల్లలకు సహాయం చేయడానికి మరియు దీవించడానికి మీ చేతులతో పాటు ఆయన చేతులు కూడా చాపబడతాయి.
యేసు క్రీస్తు యొక్క ప్రతి నిబంధన సేవకుడు ఆయన కొరకు ఇతరులను దీవించి సేవ చేసినప్పుడు ఆత్మ నుండి ఆయన నడిపింపును పొందుతారు. అప్పుడు వారు రక్షకుని యొక్క ప్రేమను అనుభవిస్తారు మరియు ఆయనకు దగ్గర కావడంలో సంతోషాన్ని కనుగొంటారు.
ఎమ్మాయుకు పోవు మార్గములోని ఇంటిలో ఇద్దరు శిష్యులతో నేను ఉన్నట్లుగా, ప్రభువు యొక్క పునరుత్థానమును గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన జీవిస్తున్నారని నాకు తెలుసు.
ఇది ఆయన నిజమైన సంఘము—యేసు క్రీస్తు యొక్క సంఘము. తీర్పు దినమున, మనం రక్షకుని యెదుట ముఖాముఖిగా నిలబడతాము. ఈ జీవితంలో, ఆయన సేవలో ఆయనకు దగ్గరగా వచ్చి, “భళా, నమ్మకమైన మంచి దాసుడా” అనే ఆయన మాటలు వినడానికి ఆసక్తిగా ఎదురుచూసే వారికి ఇది చాలా ఆనందకరమైన సమయం అవుతుంది.
పునరుత్థానుడైన రక్షకుడు మరియు విమోచకుని గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.