సర్వసభ్య సమావేశము
క్రీస్తు రాకడకు సిద్ధపడేందుకు పాల్గొనండి
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


11:24

క్రీస్తు రాకడకు సిద్ధపడేందుకు పాల్గొనండి

పిలుపులు మరియు ఇతర విధాలుగా దేవుని కార్యములో నిమగ్నమవ్వడం, రక్షకుడిని కలుసుకోవడానికి మనల్ని ప్రత్యేకంగా సిద్ధపరుస్తాయి.

కొన్ని నెలల క్రితం, నేను ఒక హాలులో నిలబడి ఉన్నప్పుడు, ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సెన్ లోపలికి నడిచారు. నేను అప్పుడే క్రొత్త ప్రధాన అధికారిగా పిలవబడ్డాను. నేను తగినవాడను కాను అనే నా భావాలను గ్రహించి, ఆయన చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు, “మంచిది, తానేమి చేస్తున్నాడో తెలియని వానిలా ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు.”

అప్పుడు నేనిలా అనుకున్నాను, “ఇక్కడ నిజమైన ప్రవక్త, దీర్ఘదర్శి ఉన్నారు.”

తరువాత ఎల్డర్ ఆండర్సెన్ మెల్లగా చెప్పారు, “ చింతించకండి, ఎల్డర్ షమ్‌వే. అది సులభమవుతుంది —ఐదు లేదా ఆరు సంవత్సరాలలో.”

దేవుని రాజ్యములో మనం చేయగలదాని కంటే ఎక్కువని భావించే వాటిని చేయడానికి మనం ఎందుకు అడుగబడతాము అని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? జీవితంలో అక్కరలు ఉండగా, సంఘములో మనకు పిలుపులు ఎందుకవసరం అని మీరు అడిగారా? నేను అడిగాను.

“మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడేందుకు మీకు మరియు నాకు సమయమిదే” అని అధ్యక్షులు నెల్సన్ చెప్పినప్పుడు, సర్వసభ్య సమావేశంలో నాకు జవాబు దొరికింది. అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పినప్పుడు, మనము దేవుని కార్యములో పాల్గొనుట ద్వారా, క్రీస్తు రాకడ కొరకు మనల్ని మరియు ఇతరులను మనం సిద్ధపరుస్తామని ఆత్మ నాకు బోధించింది. పిలుపులు, పరిచర్య చేయుట, దేవాలయ ఆరాధన, ప్రేరేపణలను అనుసరించడం మరియు దేవుని సేవలో నిమగ్నమవ్వడం వంటివి రక్షకుడిని కలుసుకోవడానికి ప్రత్యేకంగా మనల్ని సిద్ధపరుస్తాయనే ప్రభువు యొక్క వాగ్దానము ఆసక్తికరంగా ఉన్నది.

మనం ఆయన కార్యములో నిమగ్నమైనప్పుడు దేవుడు సంతోషిస్తారు.

మనం ఉన్న ప్రస్తుత పరిస్థితిలో, “దేవుని రాజ్యము విస్తరించబడి, భూమి మీద అనేక దేవాలయాలు కట్టబడినప్పుడు,” దేవుని కార్యములో నిమగ్నమవ్వడానికి అంగీకరించే ఆత్మల అవసరత ఇక్కడ అధికంగా ఉన్నది. నిస్వార్థంగా సేవ చేయడమే క్రీస్తువంటి శిష్యత్వానికి సారాంశం. కానీ సేవ చేయుట చాలా అరుదుగా అనుకూలమైనది. అందుకే దేవుని పిల్లలకు సేవ చేయడం ద్వారా ఆయనను సేవిస్తూ మీ కోరికలు మరియు సవాళ్లను పక్కనపెట్టి, మన ప్రియమైన సువార్తికులతో సహా, నిబంధనను పాటించే శిష్యులైన మిమ్మల్ని నేను ఆరాధిస్తాను. “నీతితో [ఆయనను సేవించినందుకు] నిన్ను ఘనపరచుటకు దేవుడు ఆనందిస్తారు”. ఆయన ఇలా వాగ్దానం చేస్తారు, “[మీ] బహుమానము గొప్పది, [మీ] మహిమ నిత్యము నిలుచును.” సేవ చేయడానికి మనము అవునని చెప్పినప్పుడు, మనం యేసు క్రీస్తుకు అవునని చెబుతున్నాము. మరియు మనము క్రీస్తుకు అవునని చెప్పినప్పుడు, మనం సాధ్యమయ్యే మిక్కిలి సమృద్ధియైన జీవితానికి అవునని చెబుతున్నాము.

కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నేను ఈ పాఠం నేర్చుకున్నాను. ఒంటరిగా ఉన్నవారి వార్డు కోసం ప్రోత్సాహకార్యక్రమాలను ప్రణాళిక చేసేవానిగా ఉండమని నన్ను అడిగారు. ఇది నాకు ఇష్టములేని పిలుపు. అయినప్పటికీ, నేను అంగీకరించాను మరియు అది మొదట విసుగు పుట్టేంచేదిగా ఉన్నది. తర్వాత, ఒక ప్రోత్సాహ కార్యక్రమంలో, నేను ఐస్‌క్రీం వడ్డించిన తీరు చూసి ఒక అందమైన అమ్మాయి ముగ్ధురాలైంది. నా దృష్టిని ఆకర్షించాలనే ఆశతో ఆమె మూడుసార్లు తిరిగి వచ్చింది. మేము ప్రేమలో పడ్డాము మరియు కేవలం రెండు వారాల తరువాత ఆమె తన ప్రేమను తెలియజేసింది. బహుశా అది అంత వేగంగా ఉండకపోవచ్చు మరియు నేనే వివాహం గురించి ప్రస్తావించాను, కానీ సత్యమేమిటంటే, ఆ పిలుపును నేను అంగీకరించకపోతే, నేను హైడీని కోల్పోయి ఉండేవాడిననే ఆలోచనను నేనూహించలేను.

మనం పాల్గొనుటయే క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుట

దేవునికి మన అవసరమున్నదని కాదు కానీ, మనకు దేవుడు మరియు ఆయన శక్తివంతమైన దీవెనలు అవసరము కనుక దేవుని కార్యములో మనం నిమగ్నమవుతాము. ఆయన ఇలా వాగ్దానమిచ్చారు, “ఏలయనగా ఇదిగో, నా ద్రాక్షతోటలో పనిచేయు వారందరిని ఒక గొప్ప దీవెనతో నేను దీవించెదను.” మనము దేవుని యొక్క పనిలో పాల్గొనుట రక్షకుడిని కలుసుకోవడానికి సిద్ధపడేందుకు ఎలా సహాయపడుతుందో మరియు దీవిస్తుందో అనేదాని గురించి మూడు సూత్రాలను నేను పంచుకుంటాను.

మొదటిది, దేవుని కార్యములో మనం పాల్గొన్నప్పుడు, క్రమంగా “[మన] సృష్టి ఉద్దేశమును నెరవేర్చుట” వైపు మనం వృద్ధి చెందుతాము.

మనము ఈ మాదిరిని సృష్టి యొక్క వృత్తాంతములో నేర్చుకుంటాము. ప్రతీరోజు పని తరువాత, “అది మంచిది,” అని చెప్పడం ద్వారా దేవుడు సాధించిన పురోగతిని గుర్తించారు. పని పూర్తయిందనిగాని లేదా అది పరిపూర్ణంగా ఉందనిగాని ఆయన చెప్పలేదు. కానీ ఆయన చెప్పినది ఏమిటంటే పురోగతి ఉంది మరియు దేవుని దృష్టిలో, అది మంచిది!

పిలుపులు ఒక వ్యక్తి యొక్క విలువను లేదా యోగ్యతను తీర్మానించవు లేదా ధృవీకరించవు. బదులుగా, దేవుడు కోరిన విధంగా ఆయనతో మనం పనిచేసినప్పుడు, మనం సృష్టించబడిన ఉద్దేశాన్ని నెరవేర్చడం ప్రారంభిస్తాము.

మన అభివృద్ధియందు దేవుడు ఆనందిస్తారు మరియు మనకు చేయవలసిన పని ఉన్నప్పుడు, మనం కూడా ఆవిధంగా వృద్ధి చెందాలి. కొన్నిసార్లు, ఒక పిలుపులో సేవ చేయడానికి మనకు బలము లేదా సాధనం కొదువుగా ఉండవచ్చు. అయినప్పటికీ, ప్రార్థన మరియు లేఖన అధ్యయనం వంటి అర్థవంతమైన విధానాల ద్వారా మనం పనిలో పాల్గొనవచ్చు మరియు మన సాక్ష్యాలను కాపాడుకోవచ్చు. మన ప్రేమగల పరలోక తండ్రి మనం సమ్మతించి, సేవ చేయలేకపోయినప్పుడు మనల్ని నిందించరు.

రెండవది, పిలుపులందు సేవ చేయుట మన గృహాలు మరియు సంఘాలను పవిత్ర స్థలాలుగా చేస్తుంది.

ఉదాహరణకు, క్రీస్తును జ్ఞాపకముంచుకోవడానికి మన నిబంధన వ్యక్తిగతంగా చేయబడినప్పటికీ, మనం ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు ఈ నిబంధన జీవించబడుతుంది. పిలుపులు “ఒకని భారముల నొకడు భరించడానికి … క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుటకు” మంచి అవకాశాలతో మనల్ని చుట్టుకుంటాయి. మనం దేవుడిని ప్రేమిస్తున్నాము కనుక మనం సేవ చేసి, మన నిబంధనలను జీవించడానికి కోరినప్పుడు, ఒకప్పుడు ఏదో కర్తవ్యంలా, అలసటగా అనిపించిన సేవ ఆనందదాయకంగా, పరివర్తన కలిగించేదిగా మారుతుంది.

పరలోక జాబితాలో ఉన్నదానిని పూర్తి చేసినందువలన విధులు మనల్ని రక్షించవు. బదులుగా, ఈ విధులకు సంబంధించిన నిబంధనలను మనం జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో ఉండాలని కోరే వ్యక్తిగా మనం మారతాము. ఈ అవగాహన, సేవ చేయడానికి సంకోచాలను లేదా సేవ చేయకూడదనే ప్రాధాన్యతలను జయిస్తుంది. దేవుడు దేనిని అనుమతిస్తారని అడగడం మానివేసి, దేవుడు దేనిని ఇష్టపడతారని అడగడం ప్రారంభించినప్పుడు, యేసు క్రీస్తును కలుసుకోవడానికి మన సిద్ధపాటు వేగవంతమవుతుంది.

మూడవది, దేవుని కార్యములో పాల్గొనడమనేది దేవుని యొక్క కృపావరమును పొందడానికి మరియు ఆయన గొప్ప ప్రేమను అనుభూతి చెందడానికి మనకు సహాయపడుతుంది.

సేవ చేసినందుకు మనం ఆర్థిక నష్టపరిహారాన్ని పొందము. బదులుగా, “దేవుని నుండి శక్తి మరియు అధికారముతో బోధించునట్లు, … దేవుని జ్ఞానము [కలిగియుండి] ఆత్మ యందు బలముగా [మనము] ఎదుగునట్లు మన శ్రమ నిమిత్తము [మనము] దేవుని కృపను పొందవలసియున్నదని లేఖనాలు బోధిస్తున్నాయి.” అది చాలా మంచి పని!

దేవుని కృప వలన, మన సమర్థతలు లేదా అసమర్థతలు పిలుపును ఇవ్వడానికి లేదా అంగీకరించడానికి ప్రధాన ప్రాతిపదిక కాదు. ఆయన పనిలో పాల్గొనడానికి పరిపూర్ణమైన పనితీరును లేదా అసాధారణమైన ప్రతిభను దేవుడు ఆశించడం లేదు. అలాగైతే, ఎస్తేరు రాణి తన దేశాన్ని రక్షించలేకపోయేది, పేతురు తొలి సంఘాన్ని నడిపించి ఉండేవాడు కాదు మరియు జోసెఫ్ స్మిత్ పునఃస్థాపన యొక్క ప్రవక్తగా ఉండేవాడు కాదు.

మన సామర్థ్యాలను మించి ఏదైనా చేయాలనే విశ్వాసంతో మనం పని చేసినప్పుడు, మన బలహీనత బయటపడుతుంది. ఇది ఎన్నడూ సౌకర్యవంతమైనది కాదు, కానీ “[దేవుని యొక్క] కృప ద్వారా, … మనము ఈ విషయాలను చేయుటకు శక్తి కలిగియున్నామని తెలుసుకొనుట” ముఖ్యమైనది.

మనము దేవుని కార్యములో నిమగ్నమైనప్పుడు, అనేకసార్లు మనం విఫలం కావచ్చు. కానీ మన ప్రయత్నంలో, యేసు క్రీస్తు మనకు సహాయపడతారు. మన వైఫల్యాలనుండి, భయాలనుండి మరియు మనం ఎన్నటికీ సరిపోమనే భావననుండి రక్షణను అనుభవించడానికి ఆయన మనల్ని క్రమంగా పైకెత్తుతారు. స్వల్పమైనవి అయినప్పటికీ మన అత్యుత్తమ ప్రయత్నాలను మనం సమర్పించినప్పుడు, దేవుడు వాటిని ఘనపరుస్తారు. మనము యేసు క్రీస్తు కోసం త్యాగం చేసినప్పుడు, ఆయన మనల్ని పవిత్రపరుస్తారు. ఇది దేవుని కృప యొక్క రూపాంతరం చెందే శక్తి. మనము సేవ చేసినప్పుడు, “[యేసు క్రీస్తు] యెదుట నిలబడే వరకు తండ్రి చేత పైకెత్తబడుటకు” మనం దేవుని కృప యందు ఎదుగుతాము.

పిలుపుల యొక్క వరమును పొంది, ఆనందించడానికి ఇతరులకు సహాయపడండి

నేను ఆయన యెదుట నిలబడినప్పుడు రక్షకుడు అడిగేవన్నీ నాకు తెలియదు, కానీ బహుశా ఇది ఒక ప్రశ్న అయ్యుండవచ్చు, “మీరు ఎవరిని మీతోపాటు తీసుకువచ్చారు?” పిలుపులు అనేవి ప్రేమగల పరలోక తండ్రి ఇచ్చిన పవిత్ర బహుమానాలు, అవి ఇతరులను మనతోపాటు యేసు క్రీస్తు వద్దకు తీసుకురావడానికి సహాయపడతాయి. కాబట్టి పిలుపులు లేని వారిని మరింత ఉద్దేశ్యపూర్వకంగా వెదకమని నాయకులను మరియు మనలో ప్రతీఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని కార్యములో నిమగ్నమవ్వడానికి వారిని ప్రోత్సహించండి మరియు సహాయం చేయండి. తద్వారా, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడేందుకు వారికి సహాయపడండి.

బిషప్పు జాన్‌ను సందర్శించి, అతడు చేయడానికి ప్రభువు ఒక పనిని కలిగియున్నాడని అతడితో చెప్పినప్పుడు, అతడు సంఘంలో చురుకుగా లేడు. జాన్‌ను పొగ త్రాగటం మానమని అతడు ఆహ్వానించాడు. మానేయాలని జాన్ అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, ఈసారి కనిపించని శక్తి ఏదో అతడికి సహాయపడుతున్నట్లుగా అతడు భావించాడు.

కేవలం మూడు వారాలకు, స్టేకు అధ్యక్షుడు జాన్‌ను సందర్శించారు. ఆయన అతడిని బిషప్రిక్కులో సేవ చేయడానికి పిలిచారు. జాన్ ఆశ్చర్యపోయాడు. తాను ఇప్పుడే పొగ త్రాగడం మానేసానని అతడు స్టేకు అధ్యక్షునికి చెప్పాడు. ఆ పిలుపు వలన అతడు తన ఆదివారం ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటలకు హాజరయ్యే సంప్రదాయాన్ని వదులుకోవాల్సి వస్తే, అది అడగడం మరీ ఎక్కువగా అనిపించవచ్చు. స్టేకు అధ్యక్షుని యొక్క ప్రేరేపించబడిన జవాబు సరళమైనది: “జాన్, నేను నిన్ను అడగడం లేదు; ప్రభువు అడుగుతున్నారు.”

దానికి జాన్ ఇలా జవాబిచ్చాడు, “సరే, అలా అయితే, నేను సేవ చేస్తాను.”

సేవ చేయడానికి చేసిన ఈ త్యాగాలు అతడికి మరియు అతడి కుటుంబానికి ఆధ్యాత్మిక మలుపులని జాన్ నాతో చెప్పాడు.

మన మర్త్య దృష్టికి, అసంభవంగా లేదా అనర్హులుగా కనిపించే వ్యక్తులకు పిలుపులను అందించడంలో విఫలమయ్యే ఒక అంధత్వం మనకు ఉందా అని నేను ఆశ్చర్యపోతున్నాను. లేదా మనం పురోగతి సిద్ధాంతం కంటే పనితీరు సంస్కృతి గురించి ఎక్కువగా ఆందోళన చెందవచ్చు; రక్షకుడు అసంభవమైన మరియు నిరూపించబడని వారికి సేవచేసే అవకాశాలను ఇవ్వడం ద్వారా వారి సామర్థ్యాన్ని ఎలా పెంచుతారో చూడడాన్ని విస్మరిస్తూ ఉండవచ్చు.

“ ప్రతీ స్త్రీ మరియు పురుషుడు [తన] బాధ్యతను నేర్చుకొని, పని చేయవలెను” అనే లేఖన ఆదేశము యొక్క ప్రాముఖ్యతను ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించారు. దీనిని మనము చేస్తున్నామా? నాయకులు మరియు తల్లిదండ్రులు ఇతరులు నేర్చుకుని, తమ కోసం తాము వ్యవహరించడానికి అనుమతించినప్పుడు, వారు వికసించి, వర్ధిల్లుతారు. నమ్మకమైన సభ్యులకు రెండవ పిలుపు ఇవ్వడం సులభమైన మార్గం అయినప్పటికీ, సేవ చేయడానికి అవకాశం లేని వారిని ఆహ్వానించడం మరియు వారు నేర్చుకుని ఎదగడానికి అనుమతించడమనేది మరింత అద్భుతమైన మార్గం.

క్రీస్తు భౌతికంగా ఇక్కడ ఉన్న యెడల, ఆయన రోగులను దర్శిస్తారు, ఆదివారపు బడి తరగతిని బోధిస్తారు, బాధపడుతున్న యువతితో కూర్చుంటారు మరియు పిల్లలను దీవిస్తారు. ఆయన తన స్వంత కార్యమును చేయగలరు. కానీ ఆయన మనల్ని పనిచేయనివ్వడం మరియు నేర్చుకోనివ్వడం అనే ఈ సూత్రాన్ని జీవిస్తారు, కాబట్టి ఆయన మనల్ని తన స్థానంలోకి పంపుతారు.

దేవుని కార్యములో పాల్గొనుటతో, “ప్రభువుకు [యేసు క్రీస్తుకు] ప్రతినిధిగా ఉండే హక్కు, విశేషావకాశము మరియు బాధ్యత వస్తుంది. మనల్ని కాకుండా, క్రీస్తును ఘనపరచడానికి మనం సేవ చేసినప్పుడు, మన సేవ ఆనందదాయకంగా మారుతుంది. ఇతరులు మన తరగతిని, సమావేశాన్ని, పరిచర్య దర్శనాన్ని లేదా ప్రోత్సాహకార్యక్రమాన్ని విడిచి వెళ్తున్నప్పుడు మనకంటే ఎక్కువగా క్రీస్తును జ్ఞాపకముంచుకున్నప్పుడు, పని ఉత్తేజకరంగా ఉంటుంది.

రక్షకునికి ప్రాతినిధ్యం వహించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించడంలో మనం ఆయన వలె ఎక్కువగా మారతాము. మనలో ప్రతి ఒక్కరూ మోకరించి యేసే క్రీస్తు అని ఒప్పుకునే పవిత్ర క్షణం కోసం అది శ్రేష్టమైన సిద్ధపాటు, ఆయన ఉన్నారని మరియు “రాబోవుచున్న దాని గురించి సిద్ధపడుటకు” … అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు “భూదిగంతముల వరకు … ఆయన స్వరము” అని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.

వివరణలు

  1. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ప్రభువైన యేసు క్రీస్తు మరలా వస్తారు,” లియహోనా, నవ. 2024, 121.

  2. సిద్ధాంతము మరియు నిబంధనలు 4:2--4 చూడండి.

  3. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ప్రభువైన యేసు క్రీస్తు మరలా వస్తారు,” 121.

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 76:5–6.

  5. యోహాను 10:10 చూడండి.

  6. సిద్ధాంతము మరియు నిబంధనలు 21:9.

  7. సిద్ధాంతము మరియు నిబంధనలు 88:19.

  8. ఆదికాండము 1 చూడండి.

  9. రక్షకుని తలాంతుల ఉపమానములో, యజమాని ప్రతి సేవకునికి “కొన్ని విషయాలకు” బాధ్యతను ఇచ్చాడు. ప్రతి సేవకుడు “అనేక విషయాలపై” యజమానులుగా మారడంపై యజమాని ఎక్కువ దృష్టి పెట్టాడు మరియు తన వస్తువులను తిరిగి ఇవ్వడం గురించి తక్కువ శ్రద్ధ వహించాడు భయపడి, శ్రమించడానికి ఇష్టపడని ఒక సేవకుడు దోషిగా నిర్ధారించబడ్డాడు మరియు పురోగతి లేకుండా వదిలేయబడ్డాడు. (మత్తయి 25:14–28 చూడండి.)

  10. లూకా 21:19 చూడండి. Elder David A. Bednar teaches that “righteous work is a necessity for spiritual progress” (“Things as They Really Are 2.0” [worldwide devotional for young adults, Nov. 3, 2024], Gospel Library).

  11. సిద్ధాంతము మరియు నిబంధనలు 10:4 చూడండి.

  12. మోషైయ 4:24 చూడండి.

  13. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మనం ఎప్పటికీ మరచిపోలేని విషయాలు నేర్చుకుంటున్నాము, సర్వసభ్య సమావేశము, ఏప్రిల్ 2021, 79: “మనం కలిసి పనిచేసి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని దేవుడు కోరుచున్నాడు. చూడండి. అందుకే ఆయన మనల్ని కుటుంబాలుగా భూమికి పంపుతారు మరియు మనల్ని వార్డులుగా, స్టేకులుగా ఏర్పాటు చేస్తారు. అందుకే ఒకరికొకరు సేవ చేయమని, పరిచర్య చేయమని ఆయన మనల్ని కోరతారు. … మనం ఒంటరిగా చేయగలిగినదానికంటే కలిసికట్టుగా చాలా ఎక్కువ సాధించగలము. ఆయన పిల్లలు ఒకరి నుండి ఒకరు దూరంగా ఉంటే దేవుని సంతోష ప్రణాళిక వ్యర్థమవుతుంది.”

  14. ఆల్మా 6:2; ఆల్మా 18:8–9 కూడా చూడండి.

  15. అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఇలా బోధించారు: “సేవ చేయడానికి పిలవబడుట అంటే మనము సేవ చేసే యజమానిని ప్రేమించడానికి ఒక పిలుపు. ఇది మన స్వభావాలను మార్చుకోవడానికి ఒక పిలుపు” (“As a Child,” Liahona, May 2006, 17).

  16. See Henry B. Eyring, “Should a Latter-day Saint Sell a Product When Its Use Violates the Word of Wisdom?,” Ensign, Apr. 1977, 30.

  17. మోషైయ 18:26; మోషైయ 27:5 కూడా చూడండి.

  18. 2 నీఫై 3:13, 24 చూడండి.

  19. జేకబ్ 4:7.

  20. యెషయా 40:29–31; 2 కొరింథీయులకు 12:9 కూడా చూడండి.

  21. మత్తయి 14:15–21 చూడండి. భారీ జనసమూహపు ప్రజలకు ఆహారం ఇవ్వడానికి కేవలం ఐదు రొట్టెలు మరియు రెండు చేపలు అందించబడినప్పటికీ, రక్షకుడు కృతజ్ఞతతో ఆ అర్పణను స్వీకరించాడు మరియు దానిని అవసరమైన దానికంటే ఎక్కువ పెంచాడు. ఈ అద్భుతము యొక్క గొప్ప పాఠాలలో ఒకటి రక్షకుడు మనకు ఇచ్చేది ఎల్లప్పుడు తగిన దానికంటే ఎక్కువ ఉంటుంది.

  22. త్యాగం అనే పదానికి లాటిన్ మూలం సాసర్, అంటే పవిత్రమైనది లేదా పరిశుద్ధమైనది, మరియు ఫసేర్, అంటే తయారు చేయడం. మనము దేవుని కోసం త్యాగం చేసినప్పుడు, ఆయన మనల్ని పవిత్రపరుస్తారు (హీలమన్ 3:35; సిద్ధాంతము మరియు నిబంధనలు 132:50 చూడండి).

  23. 3 నీఫై 27:14.

  24. సిద్ధాంతము మరియు నిబంధనలు 15:6; 16:6; 88:10–16 చూడండి.

  25. మొరోనై 7:2; ప్రధాన చేతిపుస్తకం: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘలో సేవ చేయుట, 4.1, సువార్త గ్రంథాలయం చూడండి.

  26. “Let Us All Press On,” Hymns, no. 243 చూడండి.

  27. వ్యక్తిగత అనుభవము మరియు ఉత్తరప్రత్యుత్తరాలు సంభాషణ, జన. 4, 2025; పేరు మార్చబడింది.

  28. మత్తయి 10:5–8; లూకా 10:1–9; ప్రధాన చేతిపుస్తకం, 4.2.6 చూడండి.

  29. సిద్ధాంతము మరియు నిబంధనలు 107:99 వివరణ చేర్చబడింది; డిసెంబరు 2024లో ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్‌తో జరిగిన సంభాషణ నుండి.

  30. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:20 చూడండి. మన యువత సంఘములోని భవిష్యత్తు నాయకులు మాత్రమే కాదు. ఇప్పుడు వారు గణనీయమైన మార్గాల్లో నాయకత్వము వహించగలరు. I saw this truth serving with 744 of the most remarkable disciples of Jesus Christ in the Illinois Chicago Mission from 2019–2022. During COVID, these young but powerful disciples of Christ led God’s work forward to unseen heights in remarkable and innovative ways.

  31. 2 నీఫై 27:20-21 చూడండి.

  32. Preach My Gospel: A Guide to Sharing the Gospel of Jesus Christ (2023), 3.

  33. జేకబ్ 1:17, 19 లో, ప్రభువు కార్యము జేకబ్ యొక్క కార్యము. అతడు తన కార్యాలయాన్ని తన కోసం గొప్పగా చేసుకోలేదు, కానీ ప్రభువు కోసం, తద్వారా అతడు దేవుని వాక్యాన్ని బోధించగలిగాడు మరియు ఆ విధంగా “చివరి దినంలో నిర్దోషిగా కనిపిస్తాడు.”

  34. 3 నీఫై 27:27 చూడండి.

  35. సిద్ధాంతము మరియు నిబంధనలు 1:11–12.