మీ పశ్చాత్తాపము యేసు క్రీస్తుకు భారం కాదు; అది ఆయనకు ఆనందాన్నిస్తుంది
పశ్చాత్తాపపడమనే ఆహ్వానం దేవుని ప్రేమకు ఒక వ్యక్తీకరణ. ఆ ఆహ్వానానికి అవును అని చెప్పడం మన స్వంత వ్యక్తీకరణ.
చాలా సంవత్సరాల క్రితం, ఫ్లోరిడా పర్యటనలో, నేను ఒక పుస్తకం చదువుతూ బయట కూర్చున్నాను. ఇప్పుడు మనం పరిపూర్ణంగా లేనప్పటికీ, మనం పరలోకానికి చేరుకోగలమని దాని శీర్షిక సూచించింది. ప్రక్కనుండి వెళ్తున్న ఒకామె, “ఇది సాధ్యమని నువ్వు అనుకుంటున్నావా?” అని అడిగింది.
నేను అయోమయంగా పైకి చూశాను, ఆమె నేను చదువుతున్న పుస్తకం గురించి మాట్లాడుతోందని గ్రహించాను. నేను హాస్యాస్పదంగా ఇలా అన్నాను, “నేనింకా అంతవరకు చదవలేదు, కానీ అది ఎలా ముగుస్తుందో మీకు చెప్తాను.”
అయ్యో, నేను కాలంలో వెనక్కి ప్రయాణించగలిగితే ఎంత బాగుండు! నేను ఆమెతో, “అవును, అది సాధ్యమే! ఎందుకంటే పరలోకం పరిపూర్ణంగా ఉన్నవారి కోసం కాదు; అది క్షమించబడి, మళ్ళీ మళ్ళీ క్రీస్తును ఎంచుకునే వారి కోసం” అని చెప్తాను.
“పశ్చాత్తాపం మరియు క్షమాపణ నాకు తప్ప అందరికీ పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది” అని కొన్నిసార్లు భావించే వారితో ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. “నేను అవే తప్పులు చేస్తూ ఉన్నాను కాబట్టి, బహుశా నేను ఇలాగే ఉంటానేమో” అని వ్యక్తిగతంగా ఆశ్చర్యపోయే వారితో; నాలాగే, నిబంధన మార్గంలో కొనసాగడం నిటారు కొండను ఎక్కినంత కష్టంగా అనిపించే సమయాలు గలవారితో మాట్లాడాలనుకుంటున్నాను.
ఆస్ట్రేలియాలో ఒక అద్భుతమైన సువార్తికుడు, ఫిజీకి చెందిన ఎల్డర్ గేంగా, వెళ్ళిపోయేముందు తన సాక్ష్యంలో ఇలాంటి భావనను పంచుకున్నాడు: “దేవుడు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు, కానీ నేను ఆయనను ప్రేమిస్తున్నానని దేవుడికి తెలుసా? అని కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతాను. ఎందుకంటే నేను పరిపూర్ణుడిని కాదు మరియు నేను ఇప్పటికీ తప్పులు చేస్తాను.”
ఆ సున్నితమైన, హృదయ విదారకమైన ప్రశ్నలో, నేను తరచుగా ఆందోళన చెందుతున్న దాని గురించి ఎల్డర్ గేంగా ఖచ్చితంగా సంగ్రహించాడు. మీరు కూడా ఇలా ఆలోచిస్తూ ఉండవచ్చు, “నేను చాలా కష్టపడుతున్నాను, కానీ నేను నిజంగా ప్రయత్నిస్తున్నానని దేవుడికి తెలుసా? నేను తప్పు చేస్తూనే ఉన్నప్పటికీ, నేను ఇంకా ఆయనను ప్రేమిస్తున్నానని దేవుడికి తెలుసా?”
దీన్ని ఒప్పకోవడం నాకు బాధగా ఉంది, కానీ నేను కూడా రక్షకుడితో నా సంబంధాన్ని నేనెంత పరిపూర్ణంగా జీవిస్తున్నానో అనేదాని ద్వారా కొలవడానికి అలవాటు పడ్డాను. విధేయతగల జీవితం అంటే నేను ఎప్పటికీ పశ్చాత్తాపపడవలసిన అవసరం లేదని నేను అనుకున్నాను. నేను తప్పులు చేసినప్పుడు, అంటే ప్రతిరోజూ, “ఆయన నా విషయంలో చాలా నిరాశ చెందియుండవచ్చు” అనుకుంటూ దేవుని నుండి నన్ను నేను దూరం చేసుకున్నాను.
అది నిజం కాదు.
మీరు రక్షకుని వద్దకు వెళ్ళడానికి తగినంత శుద్ధిగా లేదా పరిపూర్ణంగా అయ్యే వరకు వేచి ఉంటే, మీరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారని నేను నేర్చుకున్నాను.
ఆజ్ఞలు మరియు విధేయత గురించి మనం వేరే విధంగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది?
దేవుడు మన తప్పుల గురించి శ్రద్ధ వహించినప్పటికీ, మనం తప్పు చేసిన తర్వాత ఏమి జరుగుతుందో అనేదానిపై ఆయన ఎక్కువగా శ్రద్ధ వహిస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను. మనం మళ్ళీ మళ్ళీ ఆయన వైపు తిరుగుతామా? మనం ఈ నిబంధన సంబంధంలో నిలిచియుంటామా?
“[మీరు] నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు” అనే ప్రభువు మాటలను విని, బహుశా మీరు అన్ని ఆజ్ఞలను పాటించనందుకు నిరాశ చెందియుండవచ్చు. ఇది పశ్చాత్తాపపడమనే ఒక ఆజ్ఞ కూడా అని నేను మీకు గుర్తు చేస్తున్నాను! నిజానికి, ఇది లేఖనాలలో చాలాసార్లు పునరావృతమయ్యే ఆజ్ఞ కావచ్చు.
“ఓ, నేను ఒక దేవదూతనైయుండి … పశ్చాత్తాపమును ప్రకటించుచూ … [నా] హృదయ నివేదనను నెరవేర్చుకొనగలిగిన ఎంత మేలు,” అనే ఆల్మా స్వగతంలో, అతను మన తప్పులను ఎత్తి చూపడం ద్వారా మనల్ని అవమానించడానికి ప్రయత్నించడం లేదు. మీరు మరియు నేను లోకంలోని బాధలను తప్పించుకోగలిగేలా అతను పశ్చాత్తాపమును ప్రకటించాలని కోరుకున్నాడు. ఆల్మా పాపాన్ని ద్వేషించడానికి ఒక కారణం అది మనల్ని బాధించడం.
ఆజ్ఞలు బాధను తొలగించే మార్గమని కొన్నిసార్లు నేను గుర్తుంచుకోవాలి, నిరంతర జ్ఞాపికలా. పశ్చాత్తాపం కూడా అంతే. “రక్షకుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తారు, ముఖ్యంగా మనం పశ్చాత్తాపపడినప్పుడు ప్రేమిస్తారు” అని మన ప్రవక్త చెప్పారు.
కాబట్టి, “పశ్చాత్తాపపడుడి, మీరు పశ్చాత్తాపపడుడి” అని ప్రభువు చెప్పినప్పుడు, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని ఆయన చెప్తున్నట్లు మీరు ఊహించుకుంటే ఎలా ఉంటుంది? మీకు బాధ కలిగించే ప్రవర్తనను వదిలేయమని ఆయన మిమ్మల్ని వేడుకుంటున్నట్లు, చీకటి నుండి బయటపడి ఆయన వెలుగు వైపు తిరగమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లు ఊహించుకోండి.
నా కూతురు కార్లీ వార్డులో, ఒక కొత్త యాజకుడు సంస్కారాన్ని దీవించడానికి మోకరిల్లి, “తద్వారా మీ కుమారుని రక్తము యొక్క జ్ఞాపకార్థము వారు దానిని చేసి” అని చెప్పే బదులు, అనుకోకుండా, “తద్వారా మీ కుమారుని ప్రేమ యొక్క జ్ఞాపకార్థము వారు దానిని చేసి” అన్నాడు. ఆ మాటల సత్యాన్ని గ్రహించగానే కార్లీ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి.
మన రక్షకుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, ఆయన తన ప్రాయశ్చిత్తము యొక్క బాధను అనుభవించడానికి ఇష్టపడ్డారు. నిజానికి, ఆయన బాధపడుతుండగా మీరు “ఆయన యెదుట ఉంచబడిన ఆనందం” అయ్యున్నారు.
పశ్చాత్తాపపడమనే ఆహ్వానం దేవుని ప్రేమకు ఒక వ్యక్తీకరణ.
ఆ ఆహ్వానానికి అవును అని చెప్పడం మన స్వంత వ్యక్తీకరణ.
మీకు ఇష్టమైన క్రీస్తు ప్రతిరూపాన్ని ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఆయన బహుమతిని ఉపయోగించిన ప్రతిసారీ ఆయన ఆనందంతో ప్రకాశవంతంగా నవ్వుతున్నట్లు ఊహించుకోండి, ఎందుకంటే ఆయనే “పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ.”
అవును, మీ పశ్చాత్తాపము యేసు క్రీస్తుకు భారం కాదు; అది ఆయన ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
దానిని బోధిద్దాం!
ఎందుకంటే పశ్చాత్తాపం మనం పంచుకోగల అత్యుత్తమ వార్త!
మనం ఎప్పుడూ తప్పు చేయకుండా ఉండడం వలన నిబంధన మార్గంలో ఉండము. ప్రతిరోజూ పశ్చాత్తాపపడడం ద్వారా మనం ఆ మార్గంలో నిలుస్తాము.
మరియు మనం పశ్చాత్తాపపడుతున్నప్పుడు, దేవుడు మనల్ని అవమానించకుండా, మరెవరితోనూ పోల్చకుండా లేదా గత వారం మనం పశ్చాత్తాపపడిన విషయం ఇదేనని చెప్పి మనల్ని తిట్టకుండా క్షమిస్తారు.
మనం మోకరించడాన్ని చూసిన ప్రతిసారీ ఆయన ఉత్సాహంగా ఉంటారు. మనం ఆయనకు ఇష్టమైనవారం కాబట్టి ఆయన మనల్ని క్షమించడంలో ఆనందిస్తారు!
అది నిజమని మీరు అనుకోవడంలేదా?
అయితే దాన్ని నమ్మడం మనకెందుకు అంత కష్టం?!
అపవాది మరియు మోసగాడు అయిన సాతాను, దేవుని నుండి మనల్ని దూరంగా ఉంచడానికి అవమానాన్ని ఉపయోగిస్తాడు. అవమానం అనేది చాలా భారమైన, అంధకార భావన, మీరు దానిని మీ నుండి వేరుచేసినప్పుడు భౌతికంగా నిజమైన బరువుగా అనుభూతి చెందవచ్చు.
అవమానం అనేది, “ఏమి ఆలోచిస్తున్నావు?” “నువ్వు ఎప్పుడైనా ఏదైనా సరిగ్గా చేసావా?” అని మిమ్మల్ని బాధించే ఆలోచన.
అవమానం అనేది మనం తప్పు చేసామని చెప్పదు; మనమే తప్పు అని చెబుతుంది. “దాగుకో” అని కూడా మీరు వినవచ్చు. భారాన్ని లోపలే ఉంచడానికి శత్రువు తన శక్తి మేరకు ప్రతిదీ చేస్తాడు, దాని మూల్యం చాలా ఎక్కువని, నిరీక్షణనంతా తీసివేసి, ఎవరకీ తెలియకుండా ఉంటే మంచిదని మనకు చెబుతాడు.
సాతాను మాట వినడం నిరీక్షణ లేకుండా చేస్తుంది.
మీరు దీన్ని వినాలి, కాబట్టి నేను ఈ మాటలు బిగ్గరగా చెబుతాను: ఈ హానికరమైన ఆలోచనలు మీ లోపలి నుండి రావు మరియు మీ తప్పుల ద్వారా మాత్రమే మిమ్మల్ని నిర్వచించలేము. మీరు కూడా దానిని బిగ్గరగా చెప్పాల్సి రావచ్చు. సాతానుతో, “ఈ రోజు కాదు” అని చెప్పండి. అతన్ని మీ వెనుకకు నెట్టండి.
ఆ ఆకర్షణను, మిమ్మల్ని మీ రక్షకుని వైపు మళ్లించే దైవచిత్తానుసారమైన దుఃఖాన్ని అనుభూతి చెందండి మరియు ఆయన కృప మీ జీవితంలోకి, మీరు ప్రేమించే వారి జీవితాల్లోకి ప్రవేశించడాన్ని చూడండి. మనం విరిగిన హృదయాన్ని ధైర్యంగా ఆయన వైపుకు తీసుకువచ్చిన క్షణంలో, ఆయన వెంటనే అక్కడ ఉంటారని నేను వాగ్దానం చేస్తున్నాను.
ఎవరైనా మునిగిపోతున్నట్లు చూసినప్పుడు, మీరు మీ చేతిని చాచి వారిని రక్షించరా? మీరు చాచిన చేతిని మీ రక్షకుడు తిరస్కరించడాన్ని మీరు ఊహించగలరా? ఆయన నీటిలోకి దూకుతున్నట్లు, మనం తాజా శ్వాస తీసుకోవడానికి మనల్ని పైకి లేపడానికి అన్నిటికంటే క్రిందికి దిగుతున్నట్లు నేను ఊహించుకుంటాను! క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశించే దానికంటే లోతుగా ఎవరూ మునిగిపోలేరు.
క్రీస్తు ఎల్లప్పుడూ అవమానం అనే చీకటి కంటే ప్రకాశవంతంగా ఉంటారు. ఆయన మీ విలువను ఎన్నటికీ తగ్గించరు. కాబట్టి నిశితంగా గమనించండి.
-
ఈ చేయి విలువను సూచిస్తుందని ఊహించుకోండి.
-
ఈ చేయి విధేయతను సూచిస్తుంది. మీరు ఈ ఉదయం మేల్కొని, అర్థవంతమైన ప్రార్థన చేసి, దేవుని స్వరాన్ని వినడానికి లేఖనాలను శోధించి ఉండవచ్చు. మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నారు మరియు మీ చుట్టూ ఉన్న వారిని క్రీస్తులాగా చూసుకుంటున్నారు. మీరు సర్వసభ్య సమావేశాన్ని వింటున్నారు! ఇక్కడ మీ విధేయత ఉంది!
-
లేదా బహుశా పరిస్థితులు అంత బాగా లేకపోవచ్చు. పరలోకంతో జతచేరడానికి మీరు ఇటీవల ఆ చిన్న, సరళమైన పనులను చేయడానికి చాలా కష్టపడ్డారు. మీరు గర్వించలేని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
-
మీ విలువ ఎక్కడ? ఈ చేయి ఏమైనా కదిలిందా?
మీ విలువ విధేయతతో ముడిపడి ఉండదు. మీ విలువ స్థిరంగా ఉంటుంది; అది ఎప్పటికీ మారదు. అది మీకు దేవుడు ఇచ్చినది మరియు మీరు లేదా మరెవరూ దానిని మార్చడానికి ఏమీ చేయలేరు. విధేయత ఆశీర్వాదాలను తెస్తుంది; అది నిజం. కానీ విలువ వాటిలో ఒకటి కాదు. మీ నిర్ణయాల ఫలితాలు ఏవైనప్పటికీ, మీ విలువ ఎల్లప్పుడూ “దేవుని దృష్టిలో గొప్పది.”
నేను తప్పులు చేస్తున్నప్పుడు, నేను క్రీస్తుతో నిబంధన సంబంధంలో ఉండాలనుకుంటున్నాను మరియు ఎందుకో నేను మీకు చెబుతాను.
నేను డైవింగ్ పాఠాలు తీసుకుంటూ పెరిగాను మరియు దూకినప్పుడు, ఎలా దూకామనే దానిని బట్టి మార్కులు వేస్తారని తెలుసుకున్నాను. నీటిలో దూకినప్పుడు నిలువుగా, కాలివ్రేళ్ళు నిటారుగా ఉండి, కొన్ని నీళ్ళు చిమ్మేలా ఉందా? అయితే వాళ్ళు దానిని అసాధారణంగా లెక్కిస్తారు. వాళ్ళు కష్టం యొక్క స్థాయిని అంచనా వేస్తారు.
ప్రతి ఒక్కరూ తమ స్వంత స్థాయిలో దూకుతున్నారు. మీరు దూకుతున్న కష్టం యొక్క స్థాయి గురించి నిజంగా తెలిసిన ఏకైక వ్యక్తి మీ రక్షకుడు. నన్ను అర్థం చేసుకొనే వ్యక్తితో, నా మనస్సు మరియు నేను పడుతున్న కష్టం తెలిసిన వ్యక్తితో నాకు అనుబంధం కావాలి!
ప్రయాణీకులమైన మనందరిపై అంధకారపు పొగమంచు అలుముకుంటుందని, మన ప్రయాణం మురికి నీటి ఊట గుండా వెళుతుందని ఆయనకు తెలుసు—కాబట్టి మనం ఇనుప దండమును పట్టుకున్నప్పుడు కూడా, చుట్టూ ఉన్న చెడు చేత ప్రభావితం చేయబడతాము.
క్రీస్తు నొద్దకు రావడం అంటే ఆశతో, ఆయన ఎల్లప్పుడూ మీకు సహాయపడతారని బయల్పరచబడిన హామీతో, “మీరు నాకు సహాయం చేస్తారా?” అని అనడం. పశ్చాత్తాపం యొక్క ఈ కొత్త దృక్పథం అంటే మనకు ఇంకా పరిపూర్ణ విధేయత లేకపోయినా, మనం ఇప్పుడు ప్రేమతో కూడిన విధేయతను ప్రయత్నిస్తాము, మనం ఆయనను ప్రేమిస్తున్నాము కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆయనతోనే ఉండాలని ఎంచుకుంటాము అని నేను నమ్ముతున్నాను.
చెడు చేయుటకు ఇక ఏ మాత్రము కోరుకొనక నిరంతరము మంచి చేయుటకు కోరిక కలిగియున్న బెంజమిన్ రాజు యొక్క జనులు గుర్తున్నారా? వారు తమ గుడారాలను సర్దుకుని, ఇంటికి వెళ్లి, ఇంకెప్పుడూ తప్పు చేయలేదని మీరు అనుకుంటున్నారా? అస్సలు కాదు! తేడా ఏమిటంటే వారు ఇకపై పాపం చేయాలనుకోలేదు, వారికి ప్రేమపూర్వక విధేయత ఉంది! వారు పోరాడుతున్నప్పుడు వారి హృదయాలు దేవుని వైపు తిరిగి, ఆయనపై ఆధారపడ్డాయి!
ఒకసారి సముద్రతీరంలో, ఒక పక్షి గాలికి ఎగురుతూ తన రెక్కలను బలంగా ఆడించింది, కానీ అదే స్థలంలో ఉండిపోయింది. అప్పుడు నేను పైన ఉన్న మరొక పక్షిని గమనించాను. అది పైకి ఎగిరిన గాలిని ఆధారంగా చేసుకొని, ఇబ్బంది పడకుండా గాలిలో సులభంగా ఎగురుతూ ఉంది. మనం స్వయంగా చేయడానికి ప్రయత్నించడం మరియు మన రక్షకుని వైపు తిరిగి, “ఆయన రెక్కలలో ఆరోగ్యము”తో మనల్ని పైకి లేపడానికి ఆయనను అనుమతించడం మధ్య తేడా అదే.
ఆస్ట్రేలియాలో మిషను నాయకులుగా, ప్రతి సువార్తికుడిని చివరిసారి కలిసినప్పుడు, మేము 3 నీఫై 17 గురించి మాట్లాడాము, అందులో జనులు రక్షకుడికి దగ్గరగా ఉండి, ఆయన వారి కోసం ప్రార్థించడాన్ని వినగలిగారు. “రక్షకుడు మీ కోసం ప్రార్థించడాన్ని మీరు వినగలిగితే, ఆయన ఏమి చెబుతారని మీరు అనుకుంటున్నారు?” అని మేము అడిగాము.
వారి సమాధానాలను వినడం నా జీవితంలోని అత్యంత ఆధ్యాత్మిక అనుభవాలలో ఒకటి. “మీరు ఎదుర్కొంటున్న కష్టాల స్థాయి మీ రక్షకునికి తెలుసు. ఆయన దానిని అనుభవించారు!” అని మేము వారికి గుర్తు చేస్తున్నప్పుడు ఆ సువార్తికులలో ప్రతి ఒక్కరూ ఆగారు మరియు వారి కళ్ళలో నీళ్లు నిండాయి.
ఆ సువార్తికులు నిశ్శబ్దంగా మరియు ఆప్యాయంగా పంచుకున్నది ఇదే: “ఆమె తన శక్తి మేరకు చేస్తోంది. ఆమె ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు’ అని యేసు తండ్రికి చెప్పేవారు,” అని ఒక సహోదరి చెప్పింది. “అతని జీవితంలో జరిగిన ప్రతిదానిని బట్టి, నేను అతన్ని చూసి చాలా గర్వపడుతున్నాను” అని ఒక ఎల్డర్ అన్నారు.
దీన్ని ప్రయత్నిద్దాం. ఈ రాత్రి, మీరు ప్రార్థించే ముందు, యేసు క్రీస్తు మీ పక్కన ఉన్నట్లు ఊహించుకోండి. ఆయన తండ్రితో మీ న్యాయవాది. “నా రక్షకుడు నా గురించి తండ్రితో ఏమి చెబుతారు?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
ఆపై మౌనంగా ఉండండి.
మీ గురించి మంచి విషయాలు చెప్పే ఆ స్వరాన్ని—రక్షకుడు, మీ ఉత్తమ స్నేహితుడు మరియు నిజంగా అక్కడ ఉన్న మీ పరలోక తండ్రి స్వరాన్ని వినండి. ఏదేమైనా సరే, వారి ప్రేమ మరియు మీ విలువ ఎల్లప్పుడూ గొప్పవని గుర్తుంచుకోండి.
చీకటిలో కూర్చున్న వారికి యేసు క్రీస్తు వెలుగు ఇస్తారని సాక్ష్యమివ్వడానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. కాబట్టి, ఆ స్వరం మిమ్మల్ని దాక్కోమని, మీరు ఒంటరిగా చీకటి గదిలో దాక్కోవాలని చెబుతున్న రోజుల్లో, ధైర్యంగా ఉండి క్రీస్తును విశ్వసించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను! చీకటిని పారద్రోలి—మన పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణను వెలిగించండి.
ఆయన వెలుగు చేత ప్రభావితం చేయబడి, మీరు మీ చుట్టూ ఒంటరిగా ఉన్నట్లు భావిస్తున్న వ్యక్తులను చూస్తారు, కానీ ఈ కొత్త దృక్పథంతో, మీరు మరియు వారు ఇలా ఆశ్చర్యపోతారు, “మనం చీకటిలో ఎందుకు అంత భయపడ్డాము? మనం అక్కడ ఎందుకు అంతసేపు ఉన్నాము?”
“వెలుగునిచ్చే ప్రభువు మిమ్మల్ని తన చేతుల్లో చుట్టి, ఓదార్చి, నిరంతరం ప్రేమిస్తూ ఉండుగాక.” మనం ఆయనను ప్రేమిస్తూ, ఆయనను మళ్ళీ మళ్ళీ ఎన్నుకుందాం. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.