సర్వసభ్య సమావేశము
“నేను మిమ్ములను స్వస్థపరచునట్లు … నా యొద్దకు తిరిగి రండి”
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


11:3

“నేను మిమ్ములను స్వస్థపరచునట్లు … నా యొద్దకు తిరిగి రండి”

తిరిగి వచ్చే వారి పట్ల పరలోకంలో ఆనందం ఉంటుంది. మీరు తిరిగి రావడానికి ఇంకా అంత ఆలస్యం కాలేదు.

మేము ఒకప్పుడు దివ్యమైన చెట్లతో చుట్టబడిన ఇంట్లో నివసించాము. ప్రవేశ ద్వారం పక్కన ఒక అందమైన విల్లో చెట్టు ఉంది. ఒక విచారకరమైన రాత్రి బలమైన తుఫానుగాలి వీచి, విల్లో చెట్టు కూలిపోయింది. దాని వేర్లు పెకిలించబడి నేలపై పడి ఉంది, అది ఒక దయనీయ దృశ్యం.

నేను రంపాన్ని సిద్ధం చేసుకొని, కట్టెల కోసం చెట్టును నరికివేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మా పక్కింటాయన నన్ను ఆపడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చనిపోయిందని నమ్మి చెట్టును వదులుకుంటున్నందుకు ఆయన నన్ను కోప్పడ్డాడు మరియు దానిని వదిలించుకోవద్దని మమ్మల్ని గట్టిగా కోరాడు. తరువాత ఇంకా భూమిలో ఉన్న ఒక వేరును చూపిస్తూ, మనం చెట్టుకు ఆసరా ఇచ్చి, దాని కొమ్మలను నరికి, దానిని పోషించినట్లయితే, వేర్లు మళ్ళీ భూమిలో స్థిరపడతాయని అతడు చెప్పాడు.

పడిపోయిన విల్లో చెట్టు.
భూమిలో మిగిలి ఉన్న ఒక చెట్టు వేరు.

సహజంగా పడిపోయి విపత్తులో ఉన్న చెట్టు మనుగడ సాగించి తిరిగి ఎలా జీవిస్తుందనే సందేహం మరియు సంశయం నాకు కలిగింది. అది మళ్ళీ పెరగడం ప్రారంభించినప్పటికీ, తదుపరి తుఫానును తట్టుకోలేదని నేను వాదించాను. కానీ ఆ చెట్టుకు ఇంకా భవిష్యత్తు ఉందని మా పక్కింటాయన నమ్ముతున్నాడని తెలుసుకుని, మేము అతడు సూచించినట్లుగా చేయడానికి ముందుకు సాగాము.

ఒట్టి చెట్టు కాండం.
చెట్టుపై పెరుగుదల సంకేతాలు.

మరి ఫలితం? కొంతకాలం తరువాత, చెట్టు వేళ్ళు పెరగడం ప్రారంభించినప్పుడు మేము జీవం ఉన్న సంకేతాలను చూశాము. ఇప్పుడు, 12 సంవత్సరాల తరువాత, ఆ చెట్టు నిగనిగలాడుతూ, బలమైన వేర్లు కలిగి జీవకళతో ఉంది మరియు మరోసారి ఇంటిముందు అందానికి దోహదపడుతోంది.

నిగనిగలాడుతున్న ఆరోగ్యకరమైన చెట్టు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుద్ధులను కలిసినప్పుడు, నాకు ఈ విల్లో చెట్టు మరియు అన్నీ కోల్పోయినట్లు అనిపించినప్పుడు కూడా నిరీక్షణ ఉంటుందని గుర్తుకు వస్తుంది. కొంతమంది, ఒకప్పటి విల్లో చెట్టులా బలమైన మరియు ప్రకాశవంతమైన సువార్త సాక్ష్యాలు కలిగియున్నారు. తరువాత, ప్రత్యేకమైన వ్యక్తిగత కారణాల వల్ల ఆ సాక్ష్యాలు బలహీనపడ్డాయి; అది విశ్వాసం కోల్పోవడానికి దారితీసింది. మరికొందరు, బలహీనమైన సాక్ష్యాలతో పోరాడుతూ, సువార్త బోధనల ద్వారా మద్దతు పొందుతున్నారు.

ఇంకా, మళ్ళీ మళ్ళీ తమ శిష్యత్వాన్ని పునరుద్ధరించుకుని, తమ సంఘ గృహానికి తిరిగి రావాలని ఎంచుకున్న చాలామంది కథల నుండి నేను ప్రేరణ పొందాను. పనికిరాని కట్టెల మాదిరిగా తమ విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని విడిచిపెట్టే బదులు, తిరిగి రావాలనే ఆధ్యాత్మిక ప్రేరేపణలకు, ప్రేమపూర్వక ఆహ్వానాలకు వారు ప్రతిస్పందించారు.

నేను కొరియాలో జరిగిన ఒక స్టేకు సమావేశానికి హాజరయ్యాను, అక్కడ సంఘానికి తిరిగి వచ్చిన ఒక సభ్యుడు ఇలా పంచుకున్నాడు: “నా అవిశ్వాసాన్ని మరియు నా బలహీనతను అంగీకరించడానికి సహోదరులు చూపిన సంసిద్ధతకు, నన్ను సంప్రదించిన సహోదరులకు మరియు నా పట్ల ఎల్లప్పుడూ దయతో ఉన్న సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పటికీ నా చుట్టూ అంత చురుకుగా లేని స్నేహితులు చాలామంది ఉన్నారు. అయితే, వారు తమ విశ్వాసాన్ని తిరిగి పొందడానికి సంఘానికి తిరిగి వెళ్లమని ఒకరికొకరు చెప్పుకుంటారు, ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. బహుశా వారందరూ విశ్వాసం కోసం ఆరాటపడుతున్నారని నేను భావిస్తున్నాను.”

విశ్వాసం కోసం ఆరాటపడే వారందరిని తిరిగి రమ్మని మేము ఆహ్వానిస్తున్నాము. మళ్ళీ మీరు పరిశుద్ధులతో కలిసి ఆరాధించినప్పుడు మీ విశ్వాసం బలపడుతుందని నేను వాగ్దానం చేస్తున్నాను.

ఒక సాంస్కృతిక సంప్రదాయం గురించి అతడు బోధించిన దాని వల్ల తాను బాధపడ్డాడని, దాని ఫలితంగా అతడు సంఘాన్ని విడిచిపెట్టవలసి వచ్చిందని మన్నింపు కోరుతూ, క్షమాపణలు చెప్తూ ఆఫ్రికాకు చెందిన ఒక మాజీ సువార్తికుడు ఒక సీనియర్ సంఘ నాయకుడికి వ్రాశాడు. ఆయన వినయంగా ఇలా వ్యక్తపరిచాడు: “విచారకరంగా, 15 సంవత్సరాల క్రితం నేను కోపగించుకున్నాను అనే వాస్తవం నన్ను చాలా భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది. నేను చాలా కోల్పోయాను—నేను ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా. ఈ ప్రయాణములో కలిగిన హానిని చూసి నేను చాలా సిగ్గుపడుతున్నాను, కానీ అన్నింటికంటే మించి నేను తిరిగి వచ్చే మార్గాన్ని కనుగొన్నందుకు నేను సంతోషిస్తున్నాను.”

కోల్పోయిన వాటిని గుర్తించిన వారందరు, సువార్త యొక్క ఆనందకరమైన ఫలాన్ని మరోసారి రుచి చూడగలిగేలా తిరిగి రావాలని మేము ఆహ్వానిస్తున్నాము.

అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఒక సహోదరి చాలా సంవత్సరాలుగా సంఘానికి దూరంగా ఉంది. తిరిగి వచ్చిన ఆమె కథలో, ప్రియమైనవారు దూరమైపోతారని బాధపడే తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యులకు శక్తివంతమైన పాఠాలు ఉన్నాయి. ఆమె ఇలా వ్రాసింది:

“నేను సంఘము నుండి, సువార్త నుండి మరియు ఒక విధంగా, నా కుటుంబం నుండి ఎందుకు దూరంగా వెళ్ళిపోయాననే దానికి లెక్కలేనన్ని కారణాలను నేను జాబితా చేయగలను. కానీ అవి నిజంగా పనికిరాని విషయాలు. నేను సంఘాన్ని విడిచిపెట్టడానికి ఒక్క పెద్ద నిర్ణయం తీసుకోలేదు—బహుశా నేను వెయ్యి ఎంపికలు చేసుకున్నాను. కానీ నాకు ఎప్పుడూ తెలిసిన ఒక విషయం ఏమిటంటే, నా తల్లిదండ్రులు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు మరియు వారు దానికి కట్టుబడి ఉన్నారు. వారు నన్ను ప్రేమించాలని నిర్ణయించుకున్నారు.

“నా తరఫున ఎన్ని కన్నీళ్లు చిందాయో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిచాయో, ఎన్ని హృదయపూర్వకమైన ప్రార్థనలు జరిగాయో నాకు తెలిసి ఉండకపోవచ్చు. వారు నా పాపాల గురించి నన్ను విమర్శించలేదు; బదులుగా, నేను పాపాలు చేస్తున్నప్పుడు కూడా వారు నాపై ప్రేమ చూపారు. వాళ్ళు నాకు వాళ్ళ ఇంట్లోనూ, కుటుంబ కూడికల్లోనూ అప్రియమైన భావన కలిగించలేదు; ఆ భావాలు ఏవైనా నా స్వంత పనుల వల్ల కలిగినవే. బదులుగా, వారు నన్ను స్వాగతించడం కొనసాగించారు. కాలక్రమేణా నా ఉత్సాహం క్షీణించడం వారు చూసియుంటారు. కానీ ఆ సమయంలో నేను ఎలా ఉన్నాను అనేది భవిష్యత్తులో నేను కాబోయే దానికి అసంపూర్ణమైన ప్రతిబింబం మాత్రమే అని వారికి తెలుసు.

“సంఘము నుండి దూరంగా వెళ్ళే నా మార్గం సంక్లిష్టంగా ఉన్నట్లే, నేను తిరిగి వచ్చే మార్గం కూడా సంక్లిష్టంగా ఉంది. కానీ తిరిగి రావడంలో కష్టంగా అనిపించని ఒక విషయం ఏమిటంటే, నాకు చెందియున్న గృహానికి నేను తిరిగి వచ్చిన అనుభూతి.”

ఈరోజు నా సందేశం, ముఖ్యముగా ఒకప్పుడు ఆత్మను అనుభవించి, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘానికి తిరిగి వెళ్ళడానికి నాకు మార్గం లేదా చోటు ఉందా అని ప్రశ్నించుకొనే వారందరి కొరకైనది. ఇది సువార్త సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడాన్ని కష్టంగా భావించేవారు లేదా సంఘాన్ని విడిచిపెట్టడానికి ప్రలోభపడే వారి కొరకైనది కూడా.

ఈ సందేశం ఒక సవాలు కాదు మరియు ఇది ఒక దండన కూడా కాదు. ఇది ప్రేమతో మరియు మీ ఆధ్యాత్మిక గృహానికి తిరిగి స్వాగతం పలకాలనే హృదయపూర్వక కోరికతో అందించబడిన ఆహ్వానం.

ఇప్పుడు మీరు మన రక్షకుడైన యేసు క్రీస్తు నుండి ఈ ప్రేమపూర్వక ఆహ్వానం మరియు అద్భుతమైన వాగ్దానం వింటున్నప్పుడు, పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని అనుభవించాలని నేను ప్రార్థించాను:

“నేను మిమ్ములను స్వస్థపరచునట్లు ఇప్పుడు నా యొద్దకు తిరిగివచ్చి, మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి, పరివర్తన నొందరా?”

ప్రతి వారం చాలామంది రక్షకుని ఆహ్వానానికి ప్రతిస్పందిస్తూ శిష్యత్వానికి మరియు సంఘ కార్యకలాపాలకు తిరిగి వస్తున్నారు, నిశ్శబ్దంగా మరియు వినయంగా యేసు వాగ్దానం చేసిన స్వస్థతను కోరుతున్నారు. మరియు కొన్నిసార్లు ప్రచారంలో ఉన్న కథనాలకు విరుద్ధంగా, రికార్డు సంఖ్యలో మన యువ జనులు బలంగా నిలిచియుండడానికి మరియు యేసు క్రీస్తుపై తమ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఎంచుకుంటున్నారు.

కపెర్నహూములో యేసు అనుచరులలో కొందరు ఆయన బోధలను కఠినంగా భావించి, విడిచివెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయన తన అపొస్తలుల వైపు తిరిగి, “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” అని అడిగారు.

మనం వ్యక్తిగత పరీక్షా సమయాలను ఎదుర్కొంటున్నప్పుడు, ఇది మనలో ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. యేసుకు పేతురు ఇచ్చిన జవాబు కాలాతీతమైనది మరియు ప్రతిధ్వనించేది: “యెవని యొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.”

కాబట్టి ఆయన వద్దకు తిరిగి రమ్మనే రక్షకుని ఆహ్వానాన్ని మీరు పరిగణించినప్పుడు, విల్లో చెట్టు కథ నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

  1. తిరుగు ప్రయాణం తరచుగా సులభంగా లేదా సౌకర్యవంతంగా ఉండదు, అయినను అది విలువైనదే. మా విల్లో చెట్టు తిరిగి నిలబెట్టబడినప్పుడు, దాని కొమ్మలన్నీ నరికివేయబడ్డాయి. అది అందంగా లేదు. మనం కూడా మన పాత పద్ధతులను విడిచిపెట్టి, గర్వం కోల్పోతున్నప్పుడు దుర్బలంగా భావించవచ్చు. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపై—కాండం మరియు వేర్లపై—మీ విశ్వాసాన్ని కేంద్రీకరించడం వలన తిరిగిరావడంలో ఆ మొదటి అడుగు వేయడానికి మీకు నిరీక్షణ మరియు ధైర్యం లభిస్తుంది.

  2. మా విల్లో చెట్టు దాని పూర్వ బలాన్ని మరియు రూపాన్ని తిరిగి పొందడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అది మునుపటి కంటే మరింత బలంగా మరియు అందంగా ఉంది. మీ విశ్వాసము మరియు సాక్ష్యం పెరుగుతున్నప్పుడు ఓపిక పట్టండి. “ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు?” వంటి ఆలోచనారహిత వ్యాఖ్యలకు కోపం తెచ్చుకోకపోవడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

  3. నిరంతర సంరక్షణ మరియు పోషణ లేకుండా విల్లో చెట్టు ఎప్పటికీ మనుగడ సాగించియుండేది కాదు. ప్రతి వారం మీరు సంస్కార బల్ల వద్ద విందారగిస్తున్నప్పుడు, ప్రభువు యొక్క మందిరములో ఆరాధిస్తున్నప్పుడు మీ విశ్వాసాన్ని మరియు మీ సాక్ష్యాన్ని మీరు పెంచుకుంటారు.

  4. విల్లో చెట్టు కొమ్మలు మరియు ఆకులు మళ్ళీ పెరగడానికి సూర్యరశ్మి అవసరమైనట్లే, ఆత్మ యొక్క భావాలు మరియు సాక్ష్యం పట్ల మీరు సున్నితంగా ఉన్నప్పుడు మీ సాక్ష్యం పెరుగుతుంది. “అనేక పర్యాయములు పిలువబడినప్పటికీ నేను వినకుంటిని” అని చెప్పడం ద్వారా, తన జీవితంలో ఎంతో కాలాన్ని తక్కువ చురుకైన సభ్యుడిగా గడిపినట్లు వర్ణించిన అమ్యులెక్ నుండి నేర్చుకోండి.

  5. ఆ విల్లో చెట్టు మళ్ళీ ఏమి కాగలదో మా పక్కింటాయనకు తెలుసు. అలాగే మీ దైవిక సామర్థ్యం, మీ విశ్వాసం మరియు మీ సాక్ష్యం ఎలా మారగలవో ప్రభువుకు కూడా తెలుసు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోరు. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా, విరిగినవన్నీ స్వస్థపరచబడతాయి.

తిరిగి వచ్చే వారి పట్ల పరలోకంలో ఆనందం ఉంటుందని నేను సాక్ష్యమిస్తున్నాను. మీరు అవసరం మరియు మీరు ప్రేమించబడతారు. యేసు క్రీస్తు మన రక్షకుడని మరియు ఆయన వద్దకు తిరిగి వచ్చే వారందరినీ ఆయన గొప్ప శాంతితో, గొప్ప ఆనందంతో దీవిస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన కరుణా బాహువులు ముడుచుకోబడలేదు కానీ మీ కొరకు విస్తారముగా చాపబడియున్నాయి. మీరు తిరిగి రావడానికి ఇంకా అంత ఆలస్యం కాలేదు. మా హృదయాలలోని ప్రేమ అంతటితో, మేము మిమ్మల్ని ఇంటికి స్వాగతిస్తున్నాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. ఇది వాషింగ్టన్ స్పోకేన్ మిషనుకు నిలయంగా ఉంది మరియు ఇప్పటికీ ఉంది. ఆ విల్లో చెట్టు ఫోటోలను నా భార్య జాక్వీ తీసింది.

  2. 3 నీఫై 9:13. పశ్చాత్తాపపడమనే ఆహ్వానం మనందరికీ వర్తిస్తుందని గమనించండి. 1 యోహాను 1:8 (“మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము”) మరియు ప్రతిరోజూ పశ్చాత్తాపపడమని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇచ్చిన ఆహ్వానం: “ఆత్మీయ వేగము యొక్క శక్తి,” సర్వసభ్య సమావేశము, ఏప్రిల్ 2022, చూడండి.

  3. See Quentin L. Cook, “Facing Life and Faith Challenges” (worldwide devotional for young adults, Nov. 14, 2023), Gospel Library: “మీ సమాచారం కోసం, విస్తృతంగా ప్రచారం చేయబడుతున్నట్లుగా యౌవనులు మరియు వయో జనులు గతంలో కంటే తక్కువ చురుకుగా ఉండడంలేదు లేదా ఎక్కువ సంఖ్యలో సంఘాన్ని విడిచిపెట్టడంలేదు. సేవ చేయడానికి పిలువబడే మిషనరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. భావితరం వారు సంఘములో పాల్గొనే శాతం నిరంతర పెరుగుదలను చూపుతోంది. అంతేకాకుండా, ఇన్‌స్టిట్యూట్‌కు హాజరయ్యే వయో జనుల సంఖ్య కూడా పెరుగుతోంది.”

    See also D. Todd Christofferson and Clark G. Gilbert, “Video: Elder Christofferson Challenges Narrative, Says Spirit Working in Youth,” Church News, Dec. 13, 2024, newsroom.ChurchofJesusChrist.org.

  4. యోహాను 6:67.

  5. యోహాను 6:68.

  6. ఆల్మా 5:28 చూడండి.

  7. డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, “మూలాలను పోషించండి, కొమ్మలు పెరుగుతాయి,” సర్వసభ్య సమావేశము, అక్టో. 2024 చూడండి: “యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము మన సాక్ష్యము యొక్క మూలాలు. మిగతావన్నీ కొమ్మలు. … యేసు క్రీస్తు గురించి మన సాక్ష్యాలను పోషించే విషయానికి వస్తే, మనం కొన్నిసార్లు కొమ్మలను చూసి మూలాలు అనుకుంటామేమో అని నేను ఆశ్చర్యపోతాను. … మూలాలను పోషించండి, కొమ్మలు పెరుగుతాయి.”

  8. ఆల్మా 32:41 చూడండి.

  9. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సిలెస్టియల్‌గా ఆలోచించండి,” లియహోనా, నవ. 2023, 119 చూడండి: “దేవాలయములో ఎక్కువ సమయాన్ని గడపడం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దేవాలయంలో మీ సేవ మరియు ఆరాధన మీరు సిలెస్టియల్‌గా ఆలోచించడానికి సహాయపడుతుంది.”

    రస్సెల్ ఎమ్. నెల్సన్, “యాజకత్వ తాళపుచెవుల బహుమానమందు ఆనందించండి,” లియహోనా, మే 2024, 122 కూడా చూడండి: “ఇదిగో నా వాగ్దానం. ఇనుపదండాన్ని గట్టిగా పట్టుకోవడానికి … క్రమంగా దేవాలయంలో ఆరాధించడం కంటే ఎక్కువగా మీకు ఏదీ సహాయం చేయదు. ప్రభువైన యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం గురించిన మీ సాక్ష్యాన్ని ఏదీ బలపరచదు లేదా దేవుని అద్భుతమైన ప్రణాళికను ఎక్కువగా అర్థం చేసుకోవడంలో ఏదీ మీకు సహాయం చేయదు.”

  10. ఆల్మా 32:28 చూడండి.

  11. ఆల్మా 10:6.

  12. ప్యాట్రిక్ కీరన్, “మిమ్మల్ని గృహానికి తీసుకురావడమే దేవుని ఉద్దేశం,” లియహోనా, మే 2024, 87 చూడండి: “దేవుడు నిరంతరం మీతో అనుబంధాన్ని కోరుతూనే ఉన్నాడు.”

  13. See Jeffrey R. Holland, “Broken Things to Mend,” Liahona, May 2006, 69–71.

  14. లూకా 15:11–32; సిద్ధాంతము మరియు నిబంధనలు 18:13 చూడండి.

  15. యోహాను 15:9 చూడండి.

  16. ఆల్మా 5:33 చూడండి.

  17. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ప్రభువైన యేసు క్రీస్తు మరలా వస్తారు,” లియహోనా, నవ. 2024, 122 చూడండి: “మీరు యేసు క్రీస్తు యొక్క భక్తిగల శిష్యులుగా మారడానికి ఇది తొందరపాటు కాదు లేదా ఇంకా ఆలస్యం కాలేదు. మారిన తర్వాత మీరు ఆయన ప్రాయశ్చిత్తం యొక్క ఆశీర్వాదాలను పూర్తిగా అనుభవిస్తారు.”

    రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆత్మీయ వేగము యొక్క శక్తి,” 99 కూడా చూడండి: “నిబంధన మార్గము నుండి మీరు సుదూరములో లేదా బహుదూరములో ఉన్నారని మరియు తిరిగి రావడానికి దారిలేదని మీరు భావిస్తే, అది నిజం కాదు.”