సర్వసభ్య సమావేశము
కనికరము యొక్క ప్రణాళిక
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


11:6

కనికరము యొక్క ప్రణాళిక

ప్రభువు కరుణామయుడు మరియు మన పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక నిజంగా కనికరము యొక్క ప్రణాళిక.

ప్రవక్త యొక్క ఆహ్వానము

గత ఏప్రిల్‌లో, సంఘము కర్ట్‌లాండ్ దేవాలయాన్ని సంపాదించిందనే ఆనందకరమైన వార్త తర్వాత వెంటనే, సిద్ధాంతము మరియు నిబంధనలు లోని 109వ ప్రకరణములో నమోదు చేయబడిన కర్ట్‌లాండ్ దేవాలయం యొక్క ప్రతిష్ఠాపన ప్రార్థనను చదవమని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు మనల్ని ఆహ్వానించారు. “ప్రతిష్ఠాపన ప్రార్థన, ఈ చివరి రోజుల్లో జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి దేవాలయం మీకు మరియు నాకు ఆధ్యాత్మికంగా ఎలా శక్తినిస్తుంది అనేదానిని బోధిస్తుంది” అని అధ్యక్షులు నెల్సన్ చెప్పారు.

109వ ప్రకరణాన్ని మీరు అధ్యయనం చేయడం వల్ల మీకు ఆశీర్వాదకరమైన అంతర్దృష్టులు లభించాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ సాయంత్రం, మన ప్రవక్త యొక్క ఆహ్వానాన్ని అనుసరించినప్పుడు నేను నేర్చుకున్న కొన్ని విషయాలను పంచుకుంటాను. నా అధ్యయనం శాంతినిచ్చు మార్గానికి నడిపించింది, అది ప్రభువు కనికరము గలవాడని మరియు మన పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక నిజంగా కనికరము యొక్క ప్రణాళిక అని నాకు గుర్తు చేసింది.

దేవాలయంలో సేవ చేస్తున్న క్రొత్తగా పిలువబడిన సువార్తికులు

“క్రొత్తగా పిలువబడిన సువార్తికులు వీలైనంత త్వరగా దేవాలయ వరము పొందాలని మరియు పరిస్థితులు అనుమతించినంత తరచుగా దేవాలయానికి హాజరు కావాలని ప్రోత్సహించబడ్డారు,” అని మీకు తెలిసియుండవచ్చు. వరము పొందిన తర్వాత, వారు “సువార్త సేవను ప్రారంభించే ముందు దేవాలయ … సేవకులుగా కూడా పని చేయవచ్చు.”

దేవాలయ నిబంధనల ఆశీర్వాదాలను ప్రపంచంతో పంచుకునే ముందు ఆ నిబంధనల గురించి వారు ఎక్కువగా తెలుసుకుంటున్నప్పుడు, సువార్తికుల శిక్షణా కేంద్రము (MTC) లోకి ప్రవేశించే ముందు దేవాలయంలో గడిపే సమయం కొత్త సువార్తికులకు ఒక అద్భుతమైన ఆశీర్వాదం కాగలదు.

అయితే, 109వ ప్రకరణాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, దేవాలయంలో, దేవుడు క్రొత్త సువార్తికులను—నిజానికి, మనందరినీ—అదనపు, పవిత్రమైన మార్గంలో శక్తివంతం చేస్తారని నేను నేర్చుకున్నాను. బయల్పాటు ద్వారా ఇవ్వబడిన ప్రతిష్ఠాపన ప్రార్థనలో జోసెఫ్ ఇలా ప్రార్థించారు, “నీ నామమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నీ సేవకులు నీ మందిరమునుండి బయలు వెళ్ళునప్పుడు”, “జనులందరు”—“గొప్పవారు, బీదలందరు, అవసరతలో ఉన్నవారు, కష్టాలు అనుభవిస్తున్నవారందరి” … “హృదయములు సున్నితమగును గాక.” “వారి తొందరపాటు నిర్ణయములు సత్యమునకు మార్గమునిచ్చి, అందరి దృష్టిలో నీ జనులు అనుగ్రహమును పొందెదరు గాక; తద్వారా భూదిగంతములన్నియు నీ సేవకులమైన మేము నీ స్వరమును వింటిమనియు, నీవు మమ్ములను పంపియున్నావనియు తెలుసుకొందురు గాక,” అని ఆయన ప్రార్థించారు.

క్రొత్తగా పిలువబడిన సువార్తికునికి ఇది ఒక అందమైన వాగ్దానం—తొందరపాటు నిర్ణయములు “సత్యమునకు మార్గమునివ్వడం,” “అందరి దృష్టిలో అనుగ్రహం పొందడం” మరియు “వారు ప్రభువుచేత పంపబడ్డారని లోకము తెలుసుకోవడం”. మనలో ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలు అవసరం. మనం పొరుగువారితో మరియు సహోద్యోగులతో సంభాషించేటప్పుడు హృదయాలు మృదువుగా ఉండడం ఎంత ఆశీర్వాదకరం! దేవాలయంలో మనం గడిపే సమయం ఇతరుల హృదయాలను ఎలా మృదువుగా చేస్తుందో ప్రతిష్ఠాపన ప్రార్థన ఖచ్చితంగా వివరించలేదు, కానీ ప్రభువు యొక్క మందిరంలో గడిపే సమయం యేసు క్రీస్తు మరియు ఆయన కనికరంపైకి మన దృష్టిని మళ్ళించడం ద్వారా మన స్వంత హృదయాలను ఎలా మృదువుగా చేస్తుందనే దానితో ఇది ముడిపడి ఉందని నేను నమ్ముతున్నాను.

కనికరము కొరకు జోసెఫ్ స్మిత్ అభ్యర్థనకు ప్రభువు జవాబిచ్చారు

నేను కర్ట్‌లాండ్ ప్రతిష్ఠాపన ప్రార్థనను అధ్యయనం చేస్తున్నప్పుడు, జోసెఫ్ మళ్ళీ మళ్ళీ కనికరము కోసం వేడుకున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను—సంఘ సభ్యుల కోసం, సంఘము యొక్క శత్రువుల కోసం, దేశ నాయకుల కోసం, భూమిపై ఉన్న దేశాల కోసం. మరియు చాలా వ్యక్తిగతంగా, తనను జ్ఞాపకం చేసుకోవాలని మరియు తన ప్రియమైన ఎమ్మాపై, వారి పిల్లలపై కనికరము చూపాలని ఆయన ప్రభువును వేడుకున్నారు.

ఒక వారం తరువాత, 1836, ఏప్రిల్ 3, ఈస్టరు ఉదయాన కర్ట్‌లాండ్ దేవాలయంలో, రక్షకుడు ఆయనకు మరియు ఆలీవర్ కౌడరీకి కనిపించి, సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క 110వ ప్రకరణములో నమోదు చేయబడినట్లుగా, “నేను ఈ మందిరమును అంగీకరించితిని, నా నామము ఇక్కడ ఉండును; కరుణతో ఈ మందిరములో నా జనులకు నన్ను నేను ప్రత్యక్షపరచుకొందును” అని చెప్పినప్పుడు జోసెఫ్ ఎలా భావించియుండవచ్చో కదా. కనికరము యొక్క ఈ వాగ్దానం జోసెఫ్‌కు ప్రత్యేక అర్థాన్ని కలిగియుండవచ్చు. మరియు గత ఏప్రిల్‌లో అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, ఈ వాగ్దానం “నేడు ప్రతిష్ఠించబడిన ప్రతీ దేవాలయానికి వర్తిస్తుంది.”

ప్రభువు యొక్క మందిరములో కనికరమును కనుగొనుట

ప్రభువు యొక్క మందిరంలో మనలో ప్రతి ఒక్కరూ కనికరమును పొందగలిగే మార్గాలు చాలా ఉన్నాయి. ఒక గుడారాన్ని నిర్మించి, దాని మధ్యలో “కరుణాపీఠము”ను ఉంచమని ప్రభువు మొదట ఇశ్రాయేలును ఆజ్ఞాపించినప్పటి నుండి ఇది నిజమైయుంది. దేవాలయంలో, మనం చేసే నిబంధనలలో మనం కనికరమును కనుగొంటాము. బాప్తిస్మపు నిబంధనతో పాటు, ఆ నిబంధనలు మనల్ని తండ్రితో, కుమారునితో బంధిస్తాయి మరియు “హెబ్రీయ భాషలో హెసెడ్ అని పిలువబడే … ఒక ప్రత్యేక రకమైన ప్రేమ మరియు కనికరము” అని అధ్యక్షులు నెల్సన్ బోధించిన దానికి మనకు అధిక ప్రాప్తిని ఇస్తాయి.

నిత్యత్వము కొరకు మన కుటుంబాలతో ముద్రవేయబడే అవకాశంలో మనం కనికరమును కనుగొంటాము. సృష్టి, పతనము, రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగము మరియు మన పరలోక తండ్రి సన్నిధిలోకి మళ్ళీ ప్రవేశించగల మన సామర్థ్యము—రక్షణ ప్రణాళికలోని ప్రతీ భాగము—కనికరము యొక్క ప్రత్యక్షతలని కూడా మనం దేవాలయంలో మరింత స్పష్టతతో అర్థం చేసుకుంటాము. నిజానికి, రక్షణ ప్రణాళిక అనేది సంతోష ప్రణాళిక అని చెప్పవచ్చు, ఎందుకంటే అది “కనికరము యొక్క ప్రణాళిక.”

క్షమాపణను కోరుకోవడం పరిశుద్ధాత్మను పొందడానికి వీలు కల్పిస్తుంది

110వ ప్రకరణములో ప్రభువు తన దేవాలయాలలో తననుతాను కనికరముతో ప్రత్యక్షపరచుకుంటానని ఇచ్చిన అందమైన వాగ్దానానికి నేను కృతజ్ఞుడిని. జోసెఫ్ లాగా మనం కూడా కనికరము కోసం వేడుకున్నప్పుడల్లా ప్రభువు కనికరముతో తననుతాను ఎలా ప్రత్యక్షపరచుకుంటారనే దాని గురించి అది బయల్పరచిన దానికి కూడా నేను కృతజ్ఞుడిని.

కనికరము కోసం ఆయన చేసిన విజ్ఞప్తులలో, 109వ ప్రకరణములో జోసెఫ్ స్మిత్ కనికరము కోసం చేసిన విజ్ఞప్తి బయల్పాటుకు పురికొల్పడం ఇదే మొదటిసారి కాదు. పరిశుద్ధ వనము‌లో, యౌవనుడైన జోసెఫ్ ఏ సంఘము నిజమైనదో తెలుసుకోవడానికి మాత్రమే ప్రార్థించలేదు, కానీ అతడు “కనికరము కోసం ప్రభువును ప్రార్థించాడు, ఎందుకంటే నేను కనికరము పొందడానికి మరెవరి దగ్గరకు వెళ్ళలేను” అని కూడా అతడు చెప్పాడు. ఏదో ఒక విధంగా, ప్రభువు మాత్రమే అందించగల కనికరము తనకు అవసరమని అతను గుర్తించడం పరలోకపు వాకిండ్లను తెరవడానికి సహాయపడింది. మూడు సంవత్సరాల తరువాత, దేవదూత మొరోనై కనిపించాడు, ఆ తర్వాత జోసెఫ్ “తన పాపములు, దోషములన్నింటికి సర్వశక్తిమంతుడగు దేవుడిని క్షమాపణ కోరుటకు ప్రార్థించాడు.”

కనికరము కోసం విజ్ఞప్తి చేసిన తర్వాత వచ్చిన బయల్పాటు యొక్క ఈ నమూనా లేఖనాల్లో సుపరిచితమైనది. క్షమాపణ కోసం ప్రార్థించిన తర్వాతే ఈనస్ ప్రభువు యొక్క స్వరాన్ని విన్నాడు. రాజైన లమోనై తండ్రి యొక్క పరివర్తన, “నిన్ను తెలుసుకొనుటకు నా పాపములన్నిటినీ నేను వదిలివేసెదను” అనే అతని ప్రార్థనతో ప్రారంభమవుతుంది. మనం ఇలాంటి నాటకీయ అనుభవాలతో ఆశీర్వదించబడకపోవచ్చు, కానీ కొన్నిసార్లు ప్రార్థనకు జవాబులు పొందడానికి ఇబ్బంది పడేవారికి, ప్రభువు యొక్క కనికరమును కోరుకోవడం అనేది పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని అనుభవించడానికి గల అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి.

దేవుని యొక్క కనికరమును ధ్యానించడం మోర్మన్ గ్రంథము గురించి సాక్ష్యాన్ని పొందడానికి అవకాశం కల్పిస్తుంది

మొరోనై 10:3–5లో ఇలాంటి సూత్రమే అందంగా బోధించబడింది. నిజాయితీగల ప్రార్థన ద్వారా, మోర్మన్ గ్రంథము నిజమైనదో కాదో మనం తెలుసుకోవచ్చని బోధించడానికి మనం తరచుగా ఈ వచనాలను సంక్షిప్తీకరిస్తాము. కానీ ఈ సంక్షిప్తీకరణ కనికరము యొక్క ముఖ్యమైన పాత్రను విస్మరించవచ్చు. మొరోనై తన ఉద్బోధను ఎలా ప్రారంభిస్తాడో వినండి: “మీరు ఈ సంగతులను చదివినప్పుడు, … ఆదాము యొక్క సృష్టి నుండి మీరు ఈ సంగతులను అందుకొను సమయము వరకు నరుల సంతానముపట్ల ప్రభువు ఎంత కనికరముతోనుండెనో మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని, దానిని మీ హృదయములలో ధ్యానించవలెనని నేను మీకు ఉద్బోధించుచున్నాను.”

మొరోనై ఈ విషయాలను—తాను ముద్రవేయబోయే గ్రంథాలను—చదవమని మాత్రమే మనల్ని కోరడం లేదు, కానీ “నరుల సంతానముపట్ల ప్రభువు ఎంత కనికరముతోనుండెనో” అనే దాని గురించి మోర్మన్ గ్రంథము బయల్పరిచే దానిని మన హృదయాలలో ధ్యానించమని కూడా కోరుతున్నాడు. అంటే, “ఇవి సత్యమా కాదా అని నిత్యుడగు తండ్రియైన దేవుడిని క్రీస్తు యొక్క నామమందు అడగడానికి” మనల్ని సిద్ధం చేసే ప్రభువు యొక్క కనికరము గురించి ధ్యానించడం.

మనం మోర్మన్ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు, మనం ఇలా అడగవచ్చు: ఆల్మా బోధించినట్లుగా, ఈ భూమిపై నివసించిన ప్రతీ వ్యక్తి పునరుత్థానం చెందుతారని మరియు “వారి పరిపూర్ణ రూపమునకు పునఃస్థాపించబడతారని” దేవుని కనికరము యొక్క ప్రణాళిక హామీ ఇస్తుంది అనేది నిజంగా నిజమేనా? అమ్యులెక్ చెప్పినది నిజమేనా—రక్షకుని కనికరము నిజంగా మనం చెల్లించాల్సిన న్యాయము యొక్క అన్ని కఠినమైన, నిజమైన అక్కరలను సంతృప్తిపరచగలదా మరియు దానికి బదులుగా “మనల్ని భద్రత యొక్క బాహువులందు [చుట్టుగలదా]?”

ఆల్మా సాక్ష్యమిచ్చినట్లుగా, క్రీస్తు మన పాపాల కోసం మాత్రమే కాకుండా మన “బాధలు మరియు శ్రమల” కోసం బాధపడ్డారు, తద్వారా “వారి బలహీనతలను బట్టి తన జనులను ఎట్లు ఆదరించవలెనో … ఆయన ఎరుగును” అనేది నిజమేనా? రాజైన బెంజమిన్ బోధించినట్లుగా, ప్రభువు నిజంగా అంత కనికరముగలవాడా, ఉచిత బహుమానంగా, “దేవుని చిత్తము తెలియకనే మరణించియున్నవారు లేదా అజ్ఞానము వలన పాపము చేసియున్న వారి పాపముల కొరకు కూడా ఆయన ప్రాయశ్చిత్తము చేసారా”?

లీహై చెప్పినట్లుగా, “మనుష్యులు ఉనికిలోనికి వచ్చునట్లు, వారు సంతోషమును కలిగియుండునట్లు ఆదాము పతనమాయెను” అనేది నిజమేనా? యెషయాను వ్యాఖ్యానిస్తూ, అబినడై సాక్ష్యమిచ్చినట్లుగా, యేసు క్రీస్తు “మన అతిక్రమక్రియలనుబట్టి గాయపరచబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను; మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను; అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” అనేది నిజంగా నిజమేనా?

మొత్తం మీద, మోర్మన్ గ్రంథములో బోధించబడినట్లు తండ్రి యొక్క ప్రణాళిక నిజంగా అంత కనికరము గలదా? అది నిజమేనని మరియు మోర్మన్ గ్రంథములో కనికరము యొక్క శాంతినిచ్చే ఆశాజనకమైన బోధనలు నిజమని నేను సాక్ష్యమిస్తున్నాను.

మీరు విశ్వాసంతో చదివి ప్రార్థించినప్పటికీ, పరలోక తండ్రి “వాటి సత్యమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ప్రత్యక్షపరచును” అనే మొరోనై వాగ్దానాన్ని గ్రహించడానికి ఇంకా కొందరు ఇబ్బంది పడుతున్నారని నేను అనుకుంటున్నాను. చాలా సంవత్సరాల క్రితం, నేను మోర్మన్ గ్రంథాన్ని చదివిన మొదటి రెండుసార్లు నా ప్రార్థనలకు తక్షణమే స్పష్టమైన సమాధానం లభించనప్పుడు నేను దానిని అనుభవించాను కాబట్టి, నాకు ఈ పోరాటం తెలుసు.

మీరు ఇబ్బంది పడుతుంటే, “నరుల సంతానముపట్ల ప్రభువు ఎంత కనికరముతోనుండెనో” అని మోర్మన్ గ్రంథము బోధించే అనేక విధాలను ధ్యానించమనే మొరోనై సలహాను అనుసరించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నా అనుభవం ఆధారంగా, మీరు అలా చేసినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క శాంతి మీ హృదయంలోకి ప్రవేశించగలదని, మోర్మన్ గ్రంథము మరియు అది బోధించే కనికరము యొక్క ప్రణాళిక నిజమని మీరు తెలుసుకోగలరని, నమ్మగలరని మరియు అనుభూతి చెందగలరని నేను ఆశిస్తున్నాను.

తండ్రి యొక్క కనికరము యొక్క గొప్ప ప్రణాళికకు మరియు దానిని అమలు చేయడానికి రక్షకుని సంసిద్ధతకు నేను నా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. మనం ఆయనను వెదికితే ఆయన తన పరిశుద్ధ దేవాలయంలో మరియు మన జీవితంలోని ప్రతీ భాగంలో కనికరముతో తననుతాను ప్రత్యక్షపరచుకుంటారని నాకు తెలుసు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. రస్సెల్ ఎమ్. నెల్సన్, “యాజకత్వ తాళపుచెవుల బహుమానమందు ఆనందించండి,” లియహోనా, మే 2024, 121.

  2. రస్సెల్ ఎమ్. నెల్సన్, “యాజకత్వ తాళపుచెవుల బహుమానమందు ఆనందించండి,” 121.

  3. ప్రధాన చేతిపుస్తకము: యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘంలో సేవ చేయుట, 24.5.1 సువార్త గ్రంథాలయము.

  4. అన్ని దేవాలయ ఆశీర్వాదాల మాదిరిగానే, దేవుడు ఈ ఆశీర్వాదాలను అనుగ్రహించడం అనేది మనం దేవాలయంలో చేసే నిబంధనలను పాటించడంపై ఆధారపడి ఉంటుంది. రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” లియహోనా, నవ. 2022, 96 చూడండి: “దేవాలయాలలో … నిబంధనలు చేసి—మరియు వాటిని పాటించే—ప్రతీవ్యక్తి యేసు క్రీస్తు యొక్క శక్తిని అధికంగా పొందుతారు.”

    మరొక ఉదాహరణగా, దేవాలయ వస్త్రాలను ధరించడంపై ప్రథమ అధ్యక్షత్వ ప్రకటనను పరిగణించండి: “ఆరంభ విధులలో సూచించబడినట్లుగా వస్త్రమును ధరించడానికి గల పరిశుద్ధ విశేషాధికారముతో పాటు మీరు మీ నిబంధనలను పాటించినప్పుడు, రక్షకుని యొక్క కనికరము, భద్రత, బలము మరియు శక్తికి మీరు అధిక ప్రవేశాన్ని కలిగియుంటారు” (ప్రధాన చేతిపుస్తకము, 26.3.3.2; వివరణ చేర్చబడినది).

  5. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:55–57.

  6. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ప్రభువైన యేసు క్రీస్తు మరలా వస్తారు,” లియహోనా, నవ. 2024, 121–22 చూడండి: “మీ కోసం ఇది నా వాగ్దానం: యేసు క్రీస్తును హృదయపూర్వకంగా వెదికే ప్రతి ఒక్కరూ దేవాలయంలో ఆయనను కనుగొంటారు. మీరు ఆయన దయను అనుభవిస్తారు.”

  7. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:34 చూడండి: “ఈ జనుల యెడల కరుణ కలిగియుండుము, నరులందరు అపరాధము చేసిరి గనుక, నీ జనుల పాపములను క్షమించి, అవి ఎప్పటికీ తుడిచివేయబడనియ్యుము.”

  8. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:50 చూడండి.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:54 చూడండి. “యాకోబు కుమారులపైన కరుణ కలిగియుండుము, తద్వారా ఈ గడియ నుండి యెరూషలేము విమోచింపబడును; దావీదు గృహము నుండి దాస్యపు కాడి విరుగుట మొదలుపెట్టును; యూదా కుమారులు వారి తండ్రియైన అబ్రాహామునకు నీవిచ్చిన దేశములకు తిరిగివచ్చుట మొదలుపెట్టుదురు గాక” (సిద్ధాంతము మరియు నిబంధనలు 109:62–64) అని కూడా జోసెఫ్ ప్రభువును అడిగారు.

  10. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:68 చూడండి.

  11. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:69 చూడండి. Oxford English Dictionary కనికరమును “శక్తిహీన స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల చూపించే దయ మరియు కనికరము” అని నిర్వచిస్తుంది (“mercy,” oed.com). కృప వలెనే, కనికరము కూడా దేవుని ప్రేమ మరియు దయ యొక్క వ్యక్తీకరణ—ఆయన హెసెడ్. కనికరము అనేది మనం పొందవలసిన శిక్షను నిలిపివేయడంపై దృష్టి పెడుతుంది, అయితే కృప సాధారణంగా దేవుడు మనకు అర్హత లేని ఆశీర్వాదాలను అర్హతను పరిగణనలోకి తీసుకోకుండా మనకు ఇవ్వడాన్ని సూచిస్తుంది.

  12. సిద్ధాంతము మరియు నిబంధనలు 110:7.

  13. వ్యక్తిగతీకరించిన కనికరము యొక్క ప్రత్యక్షతలో జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు ఇలా చెప్పబడింది, “ఇదిగో, మీ పాపములు క్షమించబడియున్నవి; మీరు నా యెదుట పరిశుద్ధముగానున్నారు; కాబట్టి, మీ తలలెత్తుకొని సంతోషించుడి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:5).

  14. రస్సెల్ ఎమ్. నెల్సన్, “యాజకత్వ తాళపుచెవుల బహుమానమందు ఆనందించండి,” 119. “ప్రభువు వాగ్దానం వ్యక్తిగతంగా మీకు ఏ అర్థాన్నిస్తుందో ఆలోచించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను” అని అధ్యక్షులు నెల్సన్ చెప్పారు.

  15. Bible Dictionary, “గుడారము” చూడండి: “అతి పరిశుద్ధ స్థలంలో ఒకే ఒక వస్తువు మాత్రమే ఉంది: నిబంధన మందసము. … మందసము మరియు మూతపై కరుణాపీఠం ఉంది. ఇది మందసము క్రింద, యూదుల ధర్మశాస్త్రానికి తెలిసిన అత్యున్నత ప్రాయశ్చిత్తం జరిగే బలిపీఠంగా పనిచేసింది. ప్రాయశ్చిత్త దినమున పాపపరిహారార్థ బలి రక్తాన్ని దానిపై చల్లారు (లేవీ. 16:14–15). కరుణాపీఠం దేవుని మహిమ ప్రత్యక్షమయ్యే ప్రదేశం (నిర్గ. 25:22).”

  16. రస్సెల్ ఎమ్. నెల్సన్, “నిత్య నిబంధన,” లియహోనా, అక్టో. 2022, 5. అధ్యక్షులు నెల్సన్ పేర్కొన్నట్లుగా, హెసెడ్ అనే పదానికి ఖచ్చితమైన ఆంగ్ల సమానార్థకం లేదు, కానీ పాత నిబంధనలో దాని అత్యంత సాధారణ అనువాదం కనికరము. పాత నిబంధన యొక్క కింగ్ జేమ్స్ భాషాంతరము‌లో హెసెడ్ అనే పదం 248 సార్లు కనిపిస్తుంది, అందులో కనికరము 149 సార్లు, దయ 40 సార్లు మరియు మహా కనికరము 30 సార్లు ఉపయోగించబడింది (see Blue Letter Bible, blueletterbible.org/lexicon/h2617/kjv/wlc/0-1/).

  17. ప్రధాన చేతిపుస్తకము, 27.2 చూడండి. ఆయన ద్వారా తప్ప మనలో ఎవరూ తండ్రి వద్దకు రాలేరని రక్షకుడు మనకు బోధిస్తున్నారు (యోహాను 14:6 చూడండి). సిద్ధాంతము మరియు నిబంధనలులో, మన తరఫున కనికరము కొరకు ఆయన అభ్యర్థన యొక్క ఈ అందమైన వర్ణనను రక్షకుడు అందించారు.

    “ఇలా చెప్పుచూ తండ్రితో మీ న్యాయవాదిగానుండి, ఆయన యెదుట మిమ్ములను గూర్చి బ్రతిమాలుచున్న వానిని ఆలకించుము—

    “తండ్రీ, ఏ పాపము చేయని వాని శ్రమలను, మరణమును చూడుము, వానియందు నీవు అధికముగా ఆనందించితివి; చిందించబడిన నీ కుమారుని రక్తమును, నీవు మహిమపరచబడునట్లు నీవిచ్చిన అతని రక్తమును చూడుము;

    “కాబట్టి తండ్రీ, వారు నా యొద్దకు వచ్చి, నిత్య జీవమును పొందునట్లు నా నామమందు విశ్వాసముంచు ఈ నా సహోదరులను కాపాడుము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 45:3–5).

  18. అధ్యక్షులు జెఫ్రీ ఆర్. హాలెండ్ ఒకసారి ఇలా అన్నారు: “దేవునిగా ఉండడంలో దేవుడు ఎక్కువగా ఆనందించే విషయం ఏమిటంటే కనికరము చూపడంలో, ముఖ్యంగా దానిని ఆశించని మరియు తరచుగా తాము దానికి అర్హులు కాదని భావించే వారిపట్ల కనికరము చూపడంలో కలిగే పులకరింత” (“The Laborers in the Vineyard,” Liahona, May 2012, 33). సిద్ధాంతము మరియు నిబంధనలు 128:19 కూడా చూడండి: “ఇప్పుడు, మనము పొందిన సువార్తలో మనము ఏమి విందుము? సంతోషకరమైన స్వరము! పరలోకమునుండి కరుణగల స్వరము; భూమినుండి సత్య స్వరము; మృతుల కొరకు సువర్తమానము; సజీవులు, మృతుల కొరకు సంతోషకరమైన స్వరము; మహా సంతోషకరమైన సువర్తమానము.”

  19. ఆల్మా 42:15. కనికరము ఎల్లప్పుడూ రక్షణ ప్రణాళికలో కేంద్ర బిందువుగా ఉంది. క్రీస్తు పరిచర్య గురించిన మూడు లేఖనాలు ఉదాహరణలుగా ఉన్నాయి. మోర్మన్ గ్రంథములోని మొదటి అధ్యాయాన్ని నీఫై ఇలా ముగించాడు, “వారి విశ్వాసమును బట్టి విడుదల యొక్క శక్తిని పొందునట్లు, వారిని బలపరచుటకు ప్రభువు యొక్క మృదు కనికరములు ఆయన ఏర్పరచుకొనిన వారందరి మీద ఉండునని నీఫై అను నేను మీకు చూపెదను” (1 నీఫై 1:20).

    నిర్గమకాండము 34:6 లో, “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా” అని ప్రభువు తన నామాన్ని మోషేకు ప్రకటిస్తారు. పాత నిబంధనలోని ఇతర వచనాల కంటే ఎక్కువగా పాత నిబంధన ప్రవక్తలు ఈ వచనాన్ని ప్రస్తావించవచ్చని కొంతమంది సూచించారు (see, for example, Bible Project, “The Most Quoted Verse in the Bible,” bibleproject.com/podcast/most-quoted-verse-bible/).

    కొత్త నిబంధనలో, లూకా గ్రంథములో, ఎలీసబెతు వృద్ధాప్యంలో ఒక కుమారుడిని కంటుందని, అతను బాప్తిస్మమిచ్చు యోహాను అవుతాడని దేవదూత ఇచ్చిన వాగ్దానాన్ని జెకర్యా సందేహించినప్పుడు అతను “మూగవానిగా, మాట్లాడలేనివానిగా” అయ్యాడని గుర్తుంచుకోండి (లూకా 1:20). చివరకు జెకర్యా మాట్లాడగలిగినప్పుడు, అతను “పరిశుద్ధాత్మ పూర్ణుడై,” మెస్సీయ కోసం సమయం ఆసన్నమైందని మొదటిసారి బహిరంగంగా ప్రకటించినప్పుడు, ప్రభువు “మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును” వస్తారని అతను “ప్రవచించాడు” (లూకా 1:67, 72–73; వివరణ చేర్చబడింది).

  20. Gospel Topics Essays, “First Vision Accounts,” Gospel Library; see especially the 1832 account.

  21. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:29. ఈ రెండు శక్తివంతమైన దర్శనాలలో పశ్చాత్తాపం యొక్క పాత్ర గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 20:5–6 మరొక వివరణను అందిస్తుంది. “నేను గొప్ప లేదా హానికరమైన పాపాలకు పాల్పడినట్లు ఎవరూ భావించాల్సిన అవసరం లేదు” అని జోసెఫ్ అన్నాడు, కానీ అతను “[తన] బలహీనతలు మరియు లోపముల కొరకు అపరాధిగా భావించాడు” మరియు అతనికి క్షమాపణ అవసరం (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:28, 29).

  22. ఈనస్ 1:1–8 చూడండి.

  23. ఆల్మా 22:18. “ఓ యేసూ, దేవుని కుమారుడవైన నీవు, నాపై కనికరము చూపుము” అనే ఆల్మా ప్రార్థన అధిక బయల్పాటుకు మరియు బాధ నుండి ఉపశమనానికి దారితీసింది (ఆల్మా 36:17–20 చూడండి). అధ్యక్షులు జెఫ్రీ ఆర్. హాలెండ్ ఒకసారి ఆల్మా విజ్ఞప్తి గురించి ఇలా అన్నారు: “బహుశా అలాంటి ప్రార్థన, క్లుప్తంగా ఉన్నప్పటికీ, పతనమైన ప్రపంచంలో చేయగలిగే అత్యంత ముఖ్యమైనది కావచ్చు. మనం ఏ ఇతర ప్రార్థనలు చేసినా, మనకు ఏవైనా ఇతర అవసరాలు ఉన్నా, అన్నీ ఆ విజ్ఞప్తికి తిరిగి వస్తాయి: ‘ఓ యేసూ, దేవుని కుమారుడవైన నీవు, నాపై కనికరము చూపుము’” (Our Day Star Rising: Exploring the New Testament with Jeffrey R. Holland [2022], 170–71).

  24. “జోసెఫ్ యొక్క క్రమమైన పశ్చాత్తాప జీవితం ‘[నేను] కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరే’ నమ్మకాన్ని నాకు ఇచ్చింది” (“యెహోవాతో మాట్లాడిన మనిషి,” లియహోనా, నవ. 2024, 61) అని కైల్ ఎస్.మెఖే అందంగా బోధించారు.

  25. మొరోనై 10:3.

  26. మోర్మన్ గ్రంథము ప్రారంభంలోనే నీఫై చేసిన ప్రకటనకు మొరోని విజ్ఞప్తి ముగింపుగా ఉంది, అక్కడ అతను పలకలపై రాయడంలో తన స్వంత ఉద్దేశ్యాన్ని పేర్కొన్నాడు: “వారి విశ్వాసమును బట్టి విడుదల యొక్క శక్తిని పొందునట్లు, వారిని బలపరచుటకు ప్రభువు యొక్క మృదు కనికరములు ఆయన ఏర్పరచుకొనిన వారందరి మీద ఉండునని నీఫై అను నేను మీకు చూపెదను” (1 నీఫై 1:20).

  27. మొరోనై 10:4.

  28. మోర్మన్ 9:13 చూడండి.

  29. ఆల్మా 40:23 చూడండి: “ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకు పునఃస్థాపించబడును; ప్రతి అవయవము మరియు కీలు దాని శరీరమునకు పునఃస్థాపించబడును; కనీసము ఒక్క తల వెంట్రుక కూడా నశించిపోదు, కానీ సమస్తము వాటి సరియైన, పరిపూర్ణ రూపమునకు పునఃస్థాపించబడును.”

  30. ఆల్మా 34:16. ప్రభువు ఎంత కరుణామయుడు అనేదానిని మనం పరిగణించినప్పుడు, న్యాయము నుండి కనికరమును వేరు చేయడానికి—కేవలం మన పరలోక తండ్రి యొక్క ప్రేమాకనికరము న్యాయాన్ని అధిగమించగలదని అనుకోవడానికి మనం శోధింపబడవచ్చు. కానీ ఆల్మా బోధించినట్లుగా, “ఇప్పుడు ప్రాయశ్చిత్తము చేయబడితే తప్ప కనికరము యొక్క ప్రణాళిక ప్రభావము చూపలేదు; కావున కనికరము యొక్క ప్రణాళిక ప్రభావము చూపుటకు, న్యాయము యొక్క అక్కరలను సంతృప్తిపరచుటకు, దేవుడు పరిపూర్ణమైన, న్యాయవంతుడైన మరియు కనికరము గల దేవునిగా ఉండునట్లు దేవుడు తానే లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయును” (ఆల్మా 42:15; వివరణ చేర్చబడినది).

    మన కొరకు రక్షకుడు కలిగియున్న ప్రేమాకనికరమంతా మనల్ని రక్షించలేకపోయింది. బదులుగా, మనల్ని రక్షించేది ఆయన అనుభవించిన నిజమైన మరియు బాధాకరమైన న్యాయపు అక్కరలు. ఇది ఆయన ప్రేమ యొక్క ప్రాముఖ్యతను ఖచ్చితంగా తగ్గించదు. ఖచ్చితంగా, మన పట్ల ఆయన ప్రేమ—మరియు మనల్ని ప్రేమించే తండ్రి చిత్తాన్ని చేయాలనే ఆయన కోరిక—ఆయన బాధపడడానికి ఇష్టపడేలా చేసింది (యోహాను 3:16; సిద్ధాంతము మరియు నిబంధనలు 34:3 చూడండి). కానీ ప్రేమ మాత్రమే పనిచేయలేదు.

    కొన్నిసార్లు, మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటూ మన పట్ల ఆయన ప్రేమపై ఎక్కువగా దృష్టి పెడుతూ—ఆజ్ఞలను పాటించడంలో అనివార్యంగా విఫలమైన ప్రకృతి సంబంధమైన పురుషులు మరియు స్త్రీలుగా—న్యాయపు అక్కరలను సంతృప్తిపరచాలనే వాస్తవాన్ని మనం మర్చిపోతాము. మనం తప్పుగా అర్థం చేసుకుని, ఆయన ప్రేమ న్యాయపు అక్కరలను తొలగిస్తున్నట్లుగా భావిస్తే, ఆయన ప్రాయశ్చిత్త త్యాగం యొక్క బహుమతిని మరియు న్యాయం యొక్క భయంకరమైన వెలను చెల్లించడానికి ఆయన పడిన బాధను మనం తగ్గిస్తాము. మన పట్ల ఆయనకున్న ప్రేమ ఆయన ప్రాయశ్చిత్త త్యాగాన్ని అనవసరం చేస్తుందని అనుకుంటే అది నిరుత్సాహపరిచే పరిహాసంగా ఉంటుంది. న్యాయము యొక్క అక్కరలను నిశితంగా పరిశీలించి, మన తరఫున ఆ నిజమైన అక్కరలను భరించేంతగా ఆయన మనల్ని ప్రేమించినందుకు కృతజ్ఞతతో ఉండడం ఎంతో మంచిది.

  31. ఆల్మా 7:11–12.

  32. మోషైయ 3:11.

  33. 2 నీఫై 2:25.

  34. మోషైయ 14:5.

  35. మొరోనై 10:4.

  36. మొరోనై 10:3.

  37. “మీకు తెలిసినవి, మీరు నమ్మేవి మరియు మీరు భావించే” వాటి గురించి సాక్ష్యమివ్వండి (“అతి ముఖ్యమైన దానిని జ్ఞాపకముంచుకోండి,” లియహోనా, మే 2023, 107; అసలులో ఉద్ఘాటన) అని అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ మనల్ని ప్రోత్సహించారు.

  38. ఈ సూచనను అందించడంలో, మోర్మన్ గ్రంథము లేదా సువార్త యొక్క యథార్థత గురించిన సాక్ష్యానికి ప్రత్యామ్నాయ “సూత్రాన్ని” అందించాలనేది నా ఉద్దేశము కాదు. ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించినట్లుగా, బయల్పాటు అనేది “చీకటి గదిలో వెలిగించిన వెలుగు” లాగా రావచ్చు, అక్కడ బయల్పాటు “త్వరగా, పూర్తిగా మరియు ఒకేసారి” పొందబడుతుంది. అది “ఉదయించే సూర్యుడి నుండి ప్రసరించే కాంతి క్రమంగా పెరిగినట్లుగా, … ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము (2 నీఫై 28:30) లాగా కూడా రావచ్చు. … పరలోక తండ్రి నుండి వచ్చే అలాంటి సంభాషణలు క్రమంగా మరియు సున్నితంగా ‘ఆకాశమునుండి కురియు మంచుబిందువుల వలే [మన ఆత్మల] మీదకు దిగివస్తాయి’ (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:45). బయల్పాటు యొక్క ఈ నమూనా అరుదైన దానికంటే చాలా సాధారణం” (“The Spirit of Revelation,” Liahona, May 2011, 88).