సర్వసభ్య సమావేశము
పరిహార దీవెనలు
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


11:19

పరిహార దీవెనలు

జీవితంలోని అనేక పరిస్థితులు మన నియంత్రణకు మించి ఉండవచ్చు, కానీ మనలో ఎవరూ ప్రభువు యొక్క అనంతమైన దీవెనలకు అతీతులు కారు.

అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కులో సేవ చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలకు మరియు సంస్కృతులకు చెందిన కడవరి దిన పరిశుద్ధులను కలుసుకునే అవకాశం నాకు లభించింది. ప్రభువైన యేసు క్రీస్తు పట్ల మీకున్న స్థిరమైన విశ్వాసం మరియు భక్తి నన్ను నిరంతరం ప్రేరేపిస్తున్నాయి. అయినప్పటికీ, మీలో చాలామంది ఎదుర్కొంటున్న విభిన్నమైన మరియు తరచూ కష్టమైన పరిస్థితులు—అనారోగ్యం, వైకల్యం, పరిమిత వనరులు, వివాహం లేదా విద్యకు తక్కువ అవకాశాలు, ఇతరులచే హింసించబడడం మరియు ఇతర పరిమితులు లేదా అడ్డంకులు వంటి సవాళ్ళ చేత నేను ప్రభావితం చేయబడ్డాను. కొన్నిసార్లు, ఈ పరీక్షలు మీ పురోగతికి ఆటంకం కలిగిస్తున్నట్లుగా మరియు సువార్తను పూర్తిగా జీవించాలనే మీ నిజమైన ప్రయత్నాలను సవాలు చేస్తున్నట్లుగా, సేవ చేయడాన్ని, ఆరాధించడాన్ని మరియు పవిత్ర విధులను నెరవేర్చడాన్ని మరింత కష్టతరం చేస్తున్నట్లుగా అనిపించవచ్చు.

నా ప్రియమైన స్నేహితులారా, మీ జీవిత పరిస్థితుల వల్ల మీరు ఎప్పుడైనా పరిమితంగా లేదా ప్రతికూలంగా భావిస్తే, మీరు ఇది తెలుసుకోవాలని నేను కోరుతున్నాను: ప్రభువు మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నారు. ఆయనకు మీ పరిస్థితులు తెలుసు మరియు మీరు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ ఆయన దీవెనల ద్వారం మీ కొరకు విశాలంగా తెరువబడి ఉంటుంది.

నేను ఈ సత్యాన్ని ఒక వ్యక్తిగత అనుభవం ద్వారా నేర్చుకున్నాను, అది అంత ప్రాముఖ్యత లేనిదిగా అనిపించినప్పటికీ, నాపై ఒక శాశ్వత ముద్ర వేసింది. 22 సంవత్సరాల వయస్సులో, పారిస్‌లో ఫ్రెంచ్ వైమానిక దళంలో పనిచేస్తున్నప్పుడు, ప్రభువు యొక్క అపొస్తలుడైన ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్, చాంప్స్-ఎలీసీస్‌లో జరిగే ఒక సమావేశంలో ప్రసంగిస్తారని తెలుసుకుని నేను చాలా సంతోషించాను. అయితే, ఈ కార్యక్రమానికి ముందు, సమావేశం జరిగే సమయానికి ఒక సీనియర్ అధికారిని విమానాశ్రయానికి తీసుకెళ్లమని నాకు ఆదేశాలు అందాయి.

నేను నిరాశ చెందాను. కానీ హాజరు కావాలని నిశ్చయించుకుని, నేను ఆ అధికారిని దింపి, సమావేశానికి పరిగెత్తాను. పార్కింగ్ స్థలాన్ని కనుగొన్న తర్వాత, నేను ఛాంప్స్-ఎలీసీస్‌లోని సమావేశ స్థలానికి పరిగెత్తాను మరియు సమావేశం ముగియడానికి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మిగిలి ఉండగా ఆయాసపడుతూ అక్కడికి చేరుకున్నాను. నేను లోపలికి ప్రవేశించగానే, ఎల్డర్ మాక్స్‌వెల్ ఇలా చెప్పడం విన్నాను, “నేనిప్పుడు మీకు ఒక అపొస్తలుని దీవెన ఇస్తాను.” ఆ క్షణంలో, నాకు ఒక అందమైన, మరపురాని ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. నేను ఆత్మచేత అధిగమించబడ్డాను మరియు ఆ దీవెన మాటలు నా కోసమే ఉద్దేశించబడినట్లుగా నా ఆత్మలోని ప్రతి కణంలోకి చొచ్చుకుపోయినట్లు అనిపించింది.

ఆ రోజు నేను అనుభవించినది చిన్నదే అయినప్పటికీ, అది ఆయన పిల్లల కొరకు దేవుని ప్రణాళికలోని ఆదరణాంశం యొక్క శక్తివంతమైన ప్రత్యక్షత: మన నియంత్రణకు మించిన పరిస్థితులు మన హృదయంలోని నీతియుక్తమైన కోరికలను నెరవేర్చుకోకుండా నిరోధించినప్పుడు, ప్రభువు తాను వాగ్దానం చేసిన దీవెనలను పొందేందుకు మనకు వీలు కల్పించే విధంగా పరిహారం ఇస్తారు.

ఈ భరోసా కలిగించే సత్యం యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తలో కనిపించే మూడు కీలక సూత్రాలపై ఆధారపడి ఉంది:

  1. దేవుడు మనలో ప్రతీఒక్కరినీ పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారు. “[మన] అందరిని తన వద్దకు రమ్మని, తన మంచితనము నందు పాలుపొందమని ఆయన ఆహ్వానించుచున్నారు.” ప్రతి ఒక్కరికీ ఒక రోజు మినహాయింపు లేకుండా, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దీవెనలను పొందే న్యాయమైన అవకాశం ఇవ్వబడుతుందని ఆయన విమోచన ప్రణాళిక నిర్ధారిస్తుంది.

  2. దేవుడు నీతిమంతుడు, కనికరముగలవాడు మరియు ఆయన ప్రణాళిక పరిపూర్ణమైనది కాబట్టి, మన నియంత్రణకు మించిన విషయాలకు ఆయన మనల్ని జవాబుదారులుగా యెంచరు. ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ ఇలా వివరించారు, “దేవుడు … మన కోరికలను మరియు మన పనితీరును మాత్రమే కాకుండా, మన విభిన్న పరిస్థితులు మనపై విధించే కష్టం యొక్క పరిమాణాలను కూడా దయతో పరిగణనలోకి తీసుకుంటారు.”

  3. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా, మనం జీవితంలోని అన్ని సవాళ్లను సహించడానికి మరియు తుదకు అధిగమించడానికి బలాన్ని పొందవచ్చు. ఆల్మా బోధించినట్లుగా, రక్షకుడు పశ్చాత్తాపపడిన వారి పాపాలను మాత్రమే కాకుండా “తన జనుల బాధలను, రోగములను” మరియు “వారి బలహీనతలను” కూడా తనపైకి తీసుకున్నారు. ఆ విధంగా, మన తప్పుల నుండి మనల్ని విమోచించడానికి మించి, ప్రభువు యొక్క దయ మరియు కృప మన మర్త్య అనుభవం విధించిన అన్యాయాలు, లోపాలు మరియు పరిమితుల నుంచి మనల్ని రక్షిస్తాయి.

ఈ పరిహార దీవెనలను పొందడం అనేది కొన్ని షరతులతో వస్తుంది. “మనం చేయగలిగినదంతా” చేయాలని మరియు “[మన] పూర్ణాత్మలను ఆయనకు అర్పణగా అర్పించాలని” ప్రభువు మనల్ని అడుగుతున్నారు. దానికి లోతైన కోరిక, నిజాయితీగల మరియు నమ్మకమైన హృదయం, ఆయన ఆజ్ఞలను పాటించడంలో మరియు మన చిత్తాన్ని ఆయన చిత్తంతో సమలేఖనం చేయడంలో మన అత్యంత శ్రద్ధ అవసరం.

మన నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా మన హృదయపూర్వక ప్రయత్నాలు మన ఆకాంక్షలకు తగినట్లుగా లేనప్పటికీ, ప్రభువు మన హృదయాల కోరికలను విలువైన కానుకగా అంగీకరిస్తారు. అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇలా బోధించారు, “కొన్ని బాహ్య పరిస్థితులు మన కోరికలను కార్యరూపంలోకి తీసుకురావడాన్ని అసాధ్యం చేసినప్పటికీ, మన హృదయాల నీతిమంతమైన కోరికల కోసం మనం దీవించబడతాము.”

ఆవశ్యకమైన సువార్త విధులను స్వీకరించకుండానే మరణించిన తన సోదరుడు ఆల్విన్ గురించి ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఆందోళన చెందుతుండగా, ఆయన ఈ ఆదరణకరమైన బయల్పాటు పొందారు: “ఇకనుండి [సువార్త] గూర్చిన జ్ఞానము లేకుండా మరణించువారందరూ, దానిని తమ పూర్ణ హృదయాలతో స్వీకరించియుండెడి వారందరూ [దేవుని సిలెస్టియల్ రాజ్యమునకు] వారసులవుతారు.” తరువాత ప్రభువు ఇలా జోడించారు, “ఏలయనగా ప్రభువైన నేను మనుష్యులందరికి వారి క్రియలను బట్టి, వారి హృదయ వాంఛలను బట్టి తీర్పు తీర్చెదను.”

ప్రభువుకు ముఖ్యమైనది, మనం చేయగలమా లేదా అనేది మాత్రమే కాదు, మన రక్షకునిగా ఆయనను అనుసరించడానికి మనం చేయగలిగినదంతా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది.

అతని హృదయపూర్వక ప్రార్థనలు మరియు సేవ చేయాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆరోగ్య కారణాల వల్ల త్వరగా విడుదలైన కారణంగా దుఃఖిస్తున్న ఒక యువ సువార్తికుడిని అతని స్నేహితుడు ఒకసారి ఓదార్చాడు. ఈ స్నేహితుడు ఒక లేఖనాన్ని పంచుకున్నాడు, అందులో ప్రభువు ఇలా ప్రకటించారు, తన పిల్లలు “వారికి కలిగియున్న వాటన్నిటితో వెళ్ళి” ఆయన ఆజ్ఞలను నెరవేర్చడానికి “ఆగిపోక శ్రద్ధతో పనిచేయుచున్నప్పుడు” మరియు “వారి శత్రువులు [మన జీవితాల్లోని ప్రతికూల పరిస్థితులు కూడా వాటిలో ఉండవచ్చు] ఆ పని చేయకుండా వారిని ఆటంకపరిచిన యెడల, ఇదిగో, మనుష్యకుమారుల చేతులనుండి ఇక ఎంతమాత్రము నేను ఆ పనిని కోరను, కానీ వారి అర్పణలు అంగీకరించుట నా చిత్తమైయున్నది.”

సేవ చేయాలనే పిలుపుకు సమాధానం ఇవ్వడంలో అతను తన శాయశక్తులా కృషి చేసినట్లు దేవునికి తెలుసునని నా స్నేహితుడు ఆ యువకుడికి సాక్ష్యమిచ్చాడు. ప్రభువు అతని అర్పణను అంగీకరించారని మరియు నమ్మకమైన సువార్తికులందరికీ వాగ్దానం చేయబడిన దీవెనలు నిలిపివేయబడవని అతనికి హామీ ఇచ్చాడు.

మనం స్వయంగా చేయలేని వాటిని సాధించడంలో మనకు సహాయపడే ఇతరుల దయ మరియు సేవ ద్వారా ప్రభువు యొక్క పరిహార దీవెనలు తరచుగా వస్తాయి. ఫ్రాన్స్‌లో మా కుమార్తెలలో ఒకరి నుండి దూరంగా నివసిస్తున్నప్పుడు, కష్టమైన ప్రసవం తర్వాత ఆమెకు సహాయం చేయలేక మేము నిస్సహాయంగా భావించిన సమయం నాకు గుర్తుంది. అదే వారంలో, యూటాలోని మా వార్డు, కవలలకు జన్మనిచ్చిన ఒక తల్లి కొరకు సహాయం కోరింది. నా భార్య వాలెరీ, ఈ కొత్త తల్లి కోసం మరియు అవసరంలో ఉన్న మా కుమార్తె కోసం తన హృదయంలో ప్రార్థనతో, ఆమెకు భోజనం తీసుకువెళ్ళడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. త్వరలోనే, ఫ్రాన్స్‌లోని మా కుమార్తె వార్డులోని సహోదరీలు ఆమె కుటుంబానికి భోజనం అందించడానికి ఏర్పాట్లు చేశారని మాకు తెలిసింది. మా కొరకు, దేవుడు మా ప్రార్థనలకు సమాధానం ఇచ్చారు, మేము చేయలేనప్పుడు ఓదార్పునివ్వడానికి తన దేవదూతలను పంపారు.

పరిమితులు మరియు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు, మన స్వంత దీవెనలు—మన బహుమతులు, వనరులు మరియు సమయాన్ని—గుర్తించి, అవసరంలో ఉన్నవారికి సేవ చేయడానికి వాటిని ఉపయోగించుకుందాం. అలా చేయడం ద్వారా, మనం ఇతరులను దీవించడమే కాకుండా, మన స్వంత జీవితాల్లోకి స్వస్థతను మరియు పరిహారాన్ని ఆహ్వానిస్తాము.

దేవుని పరిహార దీవెనలకు మనం దోహదపడే అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి, ప్రభువు యొక్క దేవాలయములో మన పూర్వీకుల కోసం మనం చేసే ప్రత్యామ్నాయ పని. వారి తరఫున మనం విధులను నిర్వర్తించినప్పుడు, వారి మర్త్య జీవితాల్లో వాటిని పొందే అవకాశం లేని వారికి దీవెనలను అందించడానికి మన బహుమానాలను మరియు సామర్థ్యాలను ఉపయోగించి, ప్రభువు యొక్క గొప్ప రక్షణ కార్యంలో మనం చురుకుగా పాల్గొంటాము.

పరిశుద్ధ దేవాలయాలలో మనం అందించే ప్రేమపూర్వక సేవ, రక్షకుని యొక్క కృప ఈ జీవితానికి మించి విస్తరించిందని మనకు గుర్తు చేస్తుంది. ఈ మర్త్య జీవితంలో మనం చేయలేని వాటిని సాధించడానికి రాబోయే జీవితంలో మనకు కొత్త అవకాశాలు ఇవ్వబడవచ్చు. నిత్య సహచరుడిని ఇంకా కనుగొనని సహోదరీలతో మాట్లాడుతూ, అధ్యక్షులు లోరెంజో స్నో ప్రేమపూర్వకంగా ఇలా బోధించారు: “అతనికి లేదా ఆమెకు అవకాశాలు లేనప్పుడు కొన్ని పనులు చేయడంలో విఫలమైనంత మాత్రాన నమ్మకమైన జీవితాన్ని గడిపి మరణించిన ఏ కడవరి-దిన పరిశుద్ధుడు దేనిని కోల్పోడు. … ఈ అవకాశం పొందిన పురుషుడు లేదా స్త్రీకి లభించే అన్ని దీవెనలు, ఉన్నత స్థితి మరియు మహిమ వారికి లభిస్తాయి.”

ఈ నిరీక్షణ మరియు ఆదరణ యొక్క సందేశం దేవుని పిల్లలమైన మనందరి కొరకైనది. మనలో ఎవరూ మర్త్యత్వం యొక్క సవాళ్లు మరియు పరిమితుల నుండి తప్పించుకోలేరు. ఎందుకంటే, మనమందరం మనల్ని మనం రక్షించుకోలేని అంతర్లీన అసమర్థతతో జన్మించాము. అయినప్పటికీ, మనకు ప్రేమగల రక్షకుడు ఉన్నారు మరియు “మనము సమస్తము చేసిన తర్వాత కూడా మనము [ఆయన] కృప చేతనే రక్షింపబడియున్నామని మనము ఎరుగుదుము.”

జీవితంలోని అనేక పరిస్థితులు మన నియంత్రణకు మించి ఉండవచ్చు, కానీ మనలో ఎవరూ ప్రభువు యొక్క అనంతమైన దీవెనలకు అతీతులుకారని నేను సాక్ష్యమిస్తున్నాను. మన పూర్ణ ఆత్మలను ఆయనకు అర్పిస్తే, రక్షకుడు తన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా ప్రతి అసమర్థతకు మరియు అన్యాయానికి పరిహారం చెల్లిస్తారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.