సర్వసభ్య సమావేశము
మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నాము
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


14:27

మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నాము

మనము యేసు క్రీస్తు యొక్క అనుచరులము. మనము ఆయన వెలుగును స్వీకరించడానికి మరియు పంచుకోవడానికి ప్రయత్నిస్తాము.

పరిచయము

సుదీర్ఘ విదేశీ నియామకం ముగింపులో, నేను, నా భార్య లీసా ఇంటికి చేరుకోవడానికి —తెల్లవారుజామున—మరో విమానం కోసం సిద్ధమవుతూ విమానాశ్రయ ఆవరణ‌లోకి అడుగుపెట్టాము. మేము చాలామంది ఇతరులతో కలిసి పొడవైన వరుసలలో నిలబడి ఉన్నప్పుడు, విమానాలు ఎక్కడానికి సమయానికి రావడం, పాస్‌పోర్ట్ మరియు వీసా తనిఖీలు, భద్రతా తనిఖీలను విజయవంతంగా పూర్తిచేయడం గురించి చింతిస్తున్న తోటి ప్రయాణికుల ఆందోళన పెరుగుతున్నట్లు మేము గ్రహించగలిగాము.

చివరికి మేము కస్టమ్స్ అధికారి ఉన్న ప్రాంతానికి చేరుకున్నాము, అక్కడ గదిలో ఉన్న అధిక స్థాయి ఒత్తిడి మరియు ఆందోళన ఆమెపై ప్రభావం చూపలేదు. ఆమె దాదాపు యాంత్రికంగా, ముఖం చూడకుండా నా పత్రాలు తీసుకుంది, నా చిత్రాన్ని ధృవీకరించింది, ఒక పేజీ తర్వాత మరొక పేజీ చూసింది మరియు చివరికి నా పాస్‌పోర్ట్‌లో భారీ చప్పుడుతో ముద్ర వేసింది.

తర్వాత ఆమె లీసా ​​పత్రాల కోసం చేయి చాపింది. భావోద్వేగం లేకుండా, తల క్రిందికి వంచి తన పని మీద దృష్టి పెట్టింది, తన ముందు ఉన్న పత్రాల వివరాలపై దృష్టి సారించి, ఆమె నిపుణుల దృష్టితో పేజీలను క్రమంగా చూసింది. అకస్మాత్తుగా ఆగి, తల పైకెత్తి, ఉద్దేశపూర్వకంగా ఆమె దయతో లీసాను చూసినప్పుడు మేము కొంత ఆశ్చర్యపోయాము. మృదువైన చిరునవ్వుతో, ఆమె లీసా ​​పాస్‌పోర్ట్‌ మీద సున్నితంగా ముద్రవేసి, పత్రాలను తిరిగి ఇచ్చింది. నా భార్య కూడా నవ్వి, పత్రాలను తీసుకొని, ప్రేమగా వీడ్కోలు చెప్పింది.

ఏమైంది?” నమ్మశక్యం కాక అడిగాను నేను.

అప్పుడు ఏజెంటు చూసిన దాన్ని లీసా ​​నాకు చూపించింది—రక్షకుని చిత్రం ఉన్న ఒక చిన్న కార్డు. అది అనుకోకుండా లీసా పర్సు నుండి పాస్‌పోర్ట్ మడతల్లోకి జారిపోయింది. కస్టమ్స్ అధికారి చూసింది అదే. అది ఆమె ప్రవర్తనను పూర్తిగా మార్చివేసింది.

పాస్‌పోర్ట్‌ లోపల రక్షకుని చిత్రం.

Grace and Truth [కృప మరియు సత్యము], సైమన్ డ్యూయీ చేత, altusfineart.com సౌజన్యంతో, © 2025, అనుమతితో ఉపయోగించబడింది.

రక్షకుని యొక్క ఈ చిన్న చిత్రం సంబంధం లేని ఇద్దరు అపరిచితుల హృదయాలను అనుసంధానించింది. ఇది వ్యక్తిగతం కాని సంభాషణను వ్యక్తిగతంగా మార్చింది, యేసు క్రీస్తు వెలుగు యొక్క అందం, అద్భుతం మరియు వాస్తవికతను సంగ్రహించింది. ఆ రోజులో మిగిలిన సమయం మరియు అప్పటి నుండి తరచుగా, నేను ఆ మధురమైన, సరళమైన క్షణం గురించి ఆశ్చర్యంతో ఆలోచించాను మరియు దేవుని పిల్లలపై క్రీస్తు వెలుగు యొక్క మహిమాన్విత ప్రభావాన్ని చూసి ఆనందించాను.

మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నాము

మనము యేసు క్రీస్తు యొక్క అనుచరులము. మనము ఆయన వెలుగును స్వీకరించడానికి మరియు పంచుకోవడానికి ప్రయత్నిస్తాము. “క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి” అనే మన విశ్వాసం సంఘం పేరులోనే అంతర్లీనంగా ఉంది. ప్రాచీన మరియు సజీవ ప్రవక్తల ద్వారా, “ఆయన మాట వినండి!” మరియు “క్రీస్తు యొద్దకు రండి” అని మన పరలోక తండ్రి మనల్ని ఆజ్ఞాపించారు. “మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నాము, క్రీస్తు నందు ఆనందించుచున్నాము, క్రీస్తును గూర్చి బోధించుచున్నాము [మరియు] క్రీస్తును గూర్చి ప్రవచించుచున్నాము.”

యేసు క్రీస్తు దేవుని కుమారుడని మరియు ఆయన భూసంబంధమైన పరిచర్యలో, యేసు తన సువార్తను బోధించారని, తన సంఘాన్ని స్థాపించారని మనము బోధిస్తాము.

యేసు తన జీవితం చివరలో గెత్సేమనే తోటలో బాధలు అనుభవించినప్పుడు మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసారని, సిలువ వేయబడ్డారని, తరువాత పునరుత్థానం చెందారని మనము సాక్ష్యమిస్తాము.

రక్షకుని యొక్క ప్రాయశ్చిత్త త్యాగము వలన, మనము పశ్చాత్తాపపడినప్పుడు క్షమించబడగలమని మరియు మన పాపముల నుండి శుద్ధిచేయబడగలమని మనము ఆనందిస్తాము. ఇది మనకు శాంతిని, నిరీక్షణను తెస్తుంది మరియు దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడాన్ని, సంపూర్ణ ఆనందాన్ని పొందడాన్ని సాధ్యం చేస్తుంది.

సమాధి వద్ద క్రీస్తు మరియు మరియ

యేసు పునరుత్థానం కారణంగా, మరణము ముగింపు కాదు కానీ ముఖ్యమైన ముందడుగు అని మనం ప్రవచిస్తాము. “మరణించిన తర్వాత మనమందరం పునరుత్థానం చెందుతాము. దాని అర్థం ప్రతీ వ్యక్తి యొక్క ఆత్మ మరియు శరీరం తిరిగి ఏకమై, శాశ్వతంగా జీవిస్తారు.”

క్రీస్తు యొద్దకు రండి

మన కాలంలో జీవించి ఉన్న ప్రవక్తలు—మనకు బోధించడానికి మరియు నడిపించడానికి దేవుని నుండి బయల్పాటు పొందేవారు—మనల్ని క్రీస్తు యొద్దకు రమ్మని ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు. మన హృదయాలను, చెవులను మరియు కళ్ళను ఆయనపై మరింత పూర్తిగా కేంద్రీకరించడానికి వారు మనకు సహాయం చేస్తున్నారు. ప్రథమ అధ్యక్షత్వం ప్రకటించిన సర్దుబాట్లు మరియు అభివృద్ధి యొక్క అనేక ఉదాహరణలను మనం చెప్పవచ్చు, అవి మనం యేసు క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించడానికి రూపొందించబడ్డాయి. వాటిలో కొన్ని:

  • “మోర్మన్ సంఘము” అనే పేరును ఇకపై వాడకుండా, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము అనే సరైన పేరుతో దానిని భర్తీ చేయాలనే నిర్ణయం.

  • సమావేశమందిరాలలో ప్రదర్శన కోసం క్రొత్త, ప్రేరేపిత క్రీస్తు-నేపథ్య కళ లభ్యమవడం.

  • “క్రీస్తు యొక్క శిష్యుడు” మరియు “క్రీస్తు వైపు చూడు” వంటి యేసు క్రీస్తుపై దృష్టి సారించిన యువతీ యువకుల ఇతివృత్తాలు మరియు సంగీతం.

  • చరిత్రలో అత్యంత మహిమాన్వితమైన సంఘటనలుగా యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తానికి మరియు అద్భుతమైన పునరుత్థానానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం.

  • ఈస్టరు‌ను కేవలం సెలవుదినంగా కాకుండా ఒక రుతువులా, యేసు క్రీస్తుకు ప్రాధాన్యతనిస్తూ జరుపుకోవడం.

  • యేసు క్రీస్తు సంఘము మరియు దాని సంకేత స్వభావం యొక్క దృశ్య గుర్తింపు యొక్క పరిచయం.

వీటిలో కొన్నింటి ప్రభావాన్ని మనం నిశితంగా పరిశీలిద్దాం. ముందుగా, సంఘ చిహ్నము.

సంఘ చిహ్నము

సంఘ చిహ్నము.

2020లో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు సంఘం కొరకు కొత్త దృశ్య గుర్తింపును ప్రవేశపెట్టారు. క్రీస్తు తన సంఘానికి కేంద్రమని మరియు మన జీవితాలకు కేంద్రంగా ఉండాలనే సత్యాన్ని ఈ చిహ్నం ప్రతిబింబిస్తుంది. మనం ఇప్పుడు దేవాలయ సిఫారసుల మీద, సంఘ వెబ్‌సైట్‌లు మరియు పత్రికలమీద, సువార్త గ్రంథాలయ యాప్‌కు చిహ్నంగా మరియు సాయుధ దళాలలో పనిచేస్తున్న సంఘ సభ్యుల యొక్క సైనిక గుర్తింపు కార్డుల మీద కూడా ఈ సుపరిచితమైన చిహ్నాన్ని చూస్తున్నాము. ఈ చిహ్నంలో సంఘం పేరు ఒక మూలరాయి మీద ఉంటుంది మరియు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని గుర్తు చేస్తుంది, అది ఇక్కడ కంబోడియన్ భాషలో చూపబడింది మరియు 145 భాషలలో వాడుకలో ఉంది.

కంబోడియన్‌లో సంఘ చిహ్నము.

ఈ చిహ్నం యొక్క మధ్యభాగంలో ఆల్బర్ట్ బెర్టెల్ థార్వాల్డ్‌సెన్ పాలరాయితో చేసిన ప్రియమైన క్రైస్టస్ విగ్రహ నమూనా ఉంటుంది, ఇది సంఘముతో విస్తృతమైన సంబంధం కలిగియుంది మరియు ప్రపంచవ్యాప్తంగా సందర్శకుల కేంద్రాలలో, దేవాలయ ప్రాంగణాలలో కనిపిస్తుంది. సంఘ చిహ్నంలో దీని ప్రాముఖ్యత మనం చేసే ప్రతి పనికి క్రీస్తు కేంద్రంగా ఉండాలని సూచిస్తుంది. అదేవిధంగా, చాపబడియున్న రక్షకుని చేతులు తన వద్దకు వచ్చే వారందరినీ హత్తుకుంటానని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని సూచిస్తాయి. ఈ చిహ్నం రక్షకుడైన యేసు క్రీస్తు ప్రేమకు దృశ్య రూపం మరియు జీవముతోనున్న క్రీస్తు యొక్క స్థిరమైన జ్ఞాపకం.

సమాధిని విడిచి వెళ్తున్న యేసు.

ఆసక్తితో, నేను సంఘ చిహ్నం యొక్క ఒక ముఖ్యమైన అంశం గురించి చాలా కుటుంబాలను మరియు స్నేహితులను విచారించాను. ఆశ్చర్యకరంగా, చాలామందికి అది కలిగి ఉన్న పవిత్రమైన లక్షణం గురించి తెలియదు. యేసు క్రీస్తు వంపు క్రింద నిలబడి ఉన్నారు. ఇది సమాధి నుండి బయటకు వస్తున్న పునరుత్థానుడైన రక్షకుడిని సూచిస్తుంది. సంఘ చిహ్నం యొక్క వాడకంలో కూడా మనం నిజంగా పునరుత్థానుడైన, జీవముతోనున్న క్రీస్తును స్తుతిస్తాము.

ఉన్నతమైన, పరిశుద్ధమైన ఈస్టరు

ఇప్పుడు ఈస్టరు యొక్క ప్రాముఖ్యతను ఆలోచిద్దాం. ఈస్టరు గురించి ఇటీవలి ప్రథమ అధ్యక్షత్వ సందేశాలలో, “జీవముతోనున్న రక్షకుని బోధనలను అధ్యయనం చేయడం ద్వారా మరియు మన సమాజంలో, ముఖ్యంగా మన స్వంత కుటుంబాలలో ఈస్టరు సంప్రదాయాలను స్థాపించడంలో సహాయపడడం ద్వారా ఆయన పునరుత్థానమును జరుపుకోవాలి” అని మనం సవాలు చేయబడ్డాము. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈస్టరు‌ను ఉన్నతమైన, పరిశుద్ధమైన వేడుకలా జరుపుకోవాలని మనం ప్రోత్సహించబడ్డాము.

ఈస్టరు గురించి నిరంతర బయల్పాటు నాకు చాలా ఇష్టం మరియు ఈస్టరు‌ను పవిత్రమైన, పరిశుద్ధమైన సందర్భంగా చేయడానికి మీరు చేసిన అనేక ప్రయత్నాలను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈస్టరు ఆదివారం నాడు ఒక గంట పాటు జరిగే సంస్కార కూడికను నిర్వహించడంతో పాటు, మట్టల ఆదివారం నాడు అలాగే పవిత్ర వారంలో కూడా జరిపే వార్డు మరియు స్టేకు భక్తిసమావేశాలు మరియు ప్రోత్సాహకార్యక్రమాలు ఇతర యోగ్యమైన కార్యకలాపాలకు ఉదాహరణలు. ఈ జ్ఞాపకాలలో పిల్లలు మరియు యౌవనుల ప్రోత్సాహకార్యక్రమాలు ఉంటాయి మరియు తరచుగా మతాంతర గాయకబృందాలను అవి కలిగి ఉంటాయి. సభ్యులు మరియు స్నేహితుల కోసం కొందరు లివింగ్ క్రైస్ట్ ఓపెన్ హౌస్‌లను నిర్వహించారు మరియు బహుళజాతి సంఘాల ఈస్టరు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఇటువంటి కార్యక్రమాలు యెరూషలేము పట్టణంలోని అనేకమందిని ప్రతిబింబిస్తాయి, వారి స్వరాలు రక్షకుని విజయోత్సవ ప్రవేశంలో ఆయనను స్తుతించడానికి ఒక్కచోట చేరాయి. ఈ అతి ముఖ్యమైన సెలవుదినాన్ని స్మరించుకోవడానికి కుటుంబాలుగా ఇంట్లో ఆరాధించమని ప్రథమ అధ్యక్షత్వము ఇచ్చిన ఆహ్వానానికి మీ ప్రతిస్పందనల నివేదికలు కూడా అంతే ఆకట్టుకుంటాయి.

ఈస్టరు సమయంలో కుటుంబ ఆరాధన గణనీయంగా పెరిగిందని నేను నమ్ముతున్నాను. రెండు సంవత్సరాల క్రితం, ఈస్టరు‌ను మేము గౌరవించే విధానాన్ని మెరుగుపరచాలనే మా కుటుంబం యొక్క దృఢ సంకల్పం గురించి నేను మాట్లాడాను. అది ఇప్పటికీ పురోగతిలో ఉన్న పని అని ఒప్పుకోవాలి. మేము ఎల్లప్పుడూ ప్రత్యేక ఈస్టరు ఆదివార భోజనం, ఈస్టరు బుట్టలు మరియు ఈస్టరు గుడ్డు వేటను ఆస్వాదించాము మరియు ఇప్పటికీ ఆనందిస్తాము. అయితే, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తంపై దృష్టి సారించే ఉద్దేశపూర్వక ఆధ్యాత్మిక కోణాన్ని మా వేడుకకు జోడించడం వలన ఈ అత్యంత పరిశుద్ధ సంఘటనలను స్తుతించడంలో ఒక మధురమైన సమతుల్యత ఏర్పడింది.

ఈస్టరు రోజున స్టీవెన్‌సన్ కుటుంబ నాటకం.

ఈస్టరును మరింత క్రీస్తు-కేంద్రీకృతంగా చేయడానికి ఈ సంవత్సరం చేసేది మా మూడవ ప్రయత్నం అవుతుంది. క్రిస్మస్ జననోత్సవం మాదిరిగానే, మా కుటుంబ ఈస్టరు దినోత్సవ నాటకంలో మౌలిక దుస్తులు, కొత్త నిబంధన మరియు మోర్మన్ గ్రంథము నుండి లేఖనాలను చదవడం, సంగీతం, ఈస్టర్ చిత్రాలు, తాటి మట్టలు మరియు నిజాయితీగా చెప్పాలంటే, కొంచెం గందరగోళం ఉంటాయి. పిల్లలు మరియు మనవరాళ్ళు, “హోసన్నా … ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక; సర్వోన్నతమైన స్థలములలో జయము” అని మట్టల ఆదివారం స్తుతులను చదువుతూ, పఠిస్తారు మరియు “ఈయన గలిలయలోని … యేసు” అనేది “మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక” అని క్రిస్మస్ సమయంలో ఉన్నంత సందర్భోచితంగా అనిపిస్తుంది.

ఇప్పుడు మనం రకరకాల అలంకరణలను ఆస్వాదిస్తున్నాము. ఒకప్పుడు కుందేళ్ళ చిత్రాలు మరియు ఈస్టరు గుడ్లతో మాత్రమే ఇళ్ళను అలంకరించేవారు, ఇప్పుడది క్రీస్తు మరియు ఖాళీ సమాధి, సమాధి వెలుపల తోటలో పునరుత్థానం చెందిన రక్షకుడు కనిపించడం మరియు నీఫైయులకు రక్షకుని ప్రత్యక్షత వంటి చిత్రాలతో సమతుల్యం చేయబడింది. మనము కూడా ఈస్టరును కేవలం ఒక రోజుగా కాకుండా ఒక రుతువుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాము. మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే మరియు పరిశుద్ధ వారం అంతటా జరిగిన పవిత్ర సంఘటనల గురించి మరింత సంభాషణాత్మకంగా, ఆలోచనాత్మకంగా మరియు ఉల్లాసంగా ఉండడానికి మనము ప్రయత్నిస్తున్నాము.

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగాన్ని మరియు ఆయన యొక్క అద్భుతమైన, ఆనందకరమైన పునరుత్థానాన్ని గౌరవించడానికి ఈస్టరు మనల్ని అనుమతిస్తుంది. తోటలో మరియు కల్వరిపై రక్షకుడి బాధను మనం ఊహించుకున్నప్పుడు మన హృదయాలు బరువెక్కుతాయి, కానీ ఖాళీ సమాధిని మరియు “ఆయన లేచియున్నాడు!” అనే పరలోక ఆజ్ఞను మనం ఊహించుకున్నప్పుడు మన హృదయాలు ఆనందిస్తాయి.

అద్భుతమైన పునరుత్థానం

“ఈస్టరు మరియు యేసు క్రీస్తు పునరుత్థానం కోసం ఎదురుచూడండి—మానవాళికి ఇవ్వబడిన అన్ని సందేశాలలో ఇది అత్యంత మహిమాన్వితమైనది” అనే ప్రథమ అధ్యక్షత్వము యొక్క ప్రోత్సాహము ఈ రుతువు యొక్క గొప్పతనాన్ని ఎత్తిచూపుతుంది. వివిధ క్రైస్తవ వేదాంతులు పునరుత్థానాన్ని అలంకారప్రాయంగా మరియు ప్రతీకాత్మకంగా చూసే ధోరణి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, “పునరుత్థానం అంటే ఇప్పటివరకు జీవించిన వారందరూ పునరుత్థానం చెందుతారు మరియు పునరుత్థానం అద్భుతంగా ఉంటుంది” అనే మన సిద్ధాంతాన్ని మనము ధృవీకరిస్తున్నాము. “ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.” యేసు క్రీస్తు ప్రతి జీవి కోసం మరణ బంధకములను త్రెంచారు.

యేసు మనకు అందించే కృపను చూసి మనమందరం నిజంగా ఆశ్చర్యపోతున్నాము. “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు” అనే ఆయన మాటలను మనం హత్తుకుంటాము.

సి.ఎస్. లూయిస్ ఇలా అన్నాడు, “[అపొస్తలులకు] క్రైస్తవ మతాన్ని ప్రకటించడం అంటే ప్రధానంగా పునరుత్థానాన్ని ప్రకటించడం అని అర్థం. … అపొస్తలుల కార్యములలో నివేదించబడిన ప్రతి క్రైస్తవ ప్రసంగంలో పునరుత్థానం ప్రధాన ఇతివృత్తం. పునరుత్థానం మరియు దాని పరిణామాలు అనేవి క్రైస్తవులు తీసుకువచ్చిన ‘సువార్త’ లేదా శుభవార్తలు.”

“ఒక పునరుత్థానమున్నది మరియు మరణము యొక్క ముల్లు క్రీస్తు నందు మ్రింగి వేయబడినది; కావున సమాధికి విజయము లేదు” అని నేను ప్రకటిస్తున్నాను.

ముగింపు మరియు సాక్ష్యము

ముగింపులో, ఈస్టరు సూచించే పరిశుద్ధ సంఘటనలను మరింత ఉద్దేశపూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలని మన సజీవ ప్రవక్త మరియు ఆయన సలహాదారుల నుండి ఆహ్వానాలను అంగీకరించే వారందరూ యేసు క్రీస్తుతో వారి బంధం మరింత బలపడడాన్ని చూస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను.

కొన్ని రోజుల క్రితం, సమాధి, సమాధిని కప్పిన రాయి, యేసు, మరియ, శిష్యులు మరియు దేవదూత యొక్క సాధారణ ప్రతిరూపాలను ఉపయోగించి ఒక నానమ్మ తన నాలుగేళ్ల మనవడికి ఈస్టరు కథను చెప్పినట్లు నేను తెలుసుకున్నాను. సమాధి చేయడం, సమాధిని మూసివేయడం, తెరవడం మరియు పునరుత్థానం యొక్క తోట దృశ్యాన్ని వాళ్ళ నానమ్మ చెప్తున్నప్పుడు ఆ చిన్న పిల్లవాడు శ్రద్ధగా గమనించాడు మరియు విన్నాడు. ఆ తరువాత అతను తనకుతానుగా బొమ్మలను కదిలిస్తూ ఆశ్చర్యకరమైన వివరాలతో తన తల్లిదండ్రులకు జాగ్రత్తగా కథను తిరిగి చెప్పాడు. ఈ మధురమైన క్షణం తర్వాత, మనం ఈస్టరు‌ను ఎందుకు జరుపుకుంటామో తెలుసా అని అతన్ని అడిగారు. ఆ బాలుడు పైకి చూసి చిన్నపిల్లల తర్కంతో, “ఎందుకంటే అతను జీవించాడు” అని సమాధానం ఇచ్చాడు.

ఈస్టరు కథ చెప్తున్న చిన్న బాలుడు.

ఆయన లేచియున్నారని, ఆయన జీవిస్తున్నారని ఆయన సాక్ష్యానికి—మీ సాక్ష్యానికి, దేవదూతలు మరియు ప్రవక్తల సాక్ష్యానికి—నా సాక్ష్యాన్ని జోడిస్తున్నాను, దాని గురించి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.