ఆయన బహుమతిని స్వీకరించండి
మీరు దేవునికి ప్రియమైన కుమార్తె, మీరు దేవునికి ప్రియమైన కుమారుడు మరియు ఆయన మీకు తన పరిపూర్ణమైన, పరిశుద్ధ కుమారుడిని బహూకరించారు.
బహుమతి ఇవ్వడం
బహుమతులు ఇవ్వడం అనేది అన్ని సంస్కృతులలో, నాగరికతలలో మరియు చరిత్ర అంతటా విస్తరించి ఉన్న ఒక సామాజిక ఆచారం. కాలక్రమేణా, బంధాలను బలోపేతం చేసుకోవడానికి, ప్రేమను మరియు కృతజ్ఞతను వ్యక్తపరచడానికి, వివాహాలు, పుట్టినరోజులు మరియు సెలవులు వంటి ముఖ్యమైన సంఘటనలను గుర్తించడానికి జనులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకున్నారు. మరియు దేవుని సృష్టిలో ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకున్నది మానవులు మాత్రమే కాదు! మనం సూచించగల అనేక ఇతర ఉదాహరణలలో, పెంగ్విన్‌లు తమ కాబోయే సహచరులకు మెరిసే గులకరాళ్ళను ఇవ్వడంలో మరియు బోనోబోలు (చింపాంజీ బంధువులు) తమ స్నేహ వలయాన్ని విస్తరించడానికి ఫలాలను ఇవ్వడంలో ప్రసిద్ధి చెందాయి.
మీరు ఏ బహుతులు ఇచ్చారు? మీరు ప్రేమించే వ్యక్తి కోసం సరైన బహుమతిని కనుగొన్న—లేదా తయారు చేసిన—సమయం గురించి ఆలోచించండి. ఆ బహుమతి ఖచ్చితంగా ఈ ప్రియమైన వ్యక్తి కోరుకునేది మరియు వారికి ఎంతో విలువైనది అని మీకు తెలుసు. ఏమిటా బహుమతి? అది మీ అమ్మ కోసమా? స్నేహితుడి కోసమా? మీ బిడ్డ కోసమా? గురువు కోసమా? మీ తాత కోసమా? మీరు ఈ బహుమతిని కనుగొన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మీరు ప్రేమించే ఈ వ్యక్తి బహుమతిని తెరవడం గురించి మీరు ఆలోచించినప్పుడు ఎలా అనిపించింది? అదేవిధంగా, ఎవరైనా మీకు సరైన బహుమతిని ఎప్పుడు ఇచ్చారు మరియు దానిని స్వీకరించడం ఎలా అనిపించింది?
మా నాన్న నాకిచ్చిన బహుమతి
నేను ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, అరేబియాలో నా తల్లిదండ్రులతో నివసిస్తున్నప్పుడు, చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ అనే పిల్లల చిత్రం విడుదలైంది. ఈ చిత్రం స్వయంగా నడపగల, నీటిపై తేలగల మరియు ఎగరగల ఒక మాయా కారు గురించినది! ఇంగ్లాండులో చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ లాంటి చిన్న బొమ్మ కారును తయారు చేసారని నాకు తెలుసు మరియు నాకొకటి కావాలి! మీరు ఒక మీటను లాగితే, బొమ్మ కారు రెక్కలు బయటకు వస్తాయి! మా నాన్న ఇంగ్లాండుకు వ్యాపార పర్యటనపై వెళ్లినప్పుడు, నీ కోసం ఏదైనా తీసుకురావాలా అని అడిగారు మరియు నేను ఆ చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ కార్లలో ఒకటి నాకు కావాలని చెప్పాను.
ఆయన పర్యటన నుండి తిరిగి వచ్చారు, కానీ కారు కనిపించలేదు. నేను చాలా బాధపడ్డాను, ఆయన మర్చిపోయి ఉంటారని అనుకున్నాను. కానీ దాదాపు 10 రోజుల తరువాత నా పుట్టినరోజు నాడు అందంగా చుట్టబడిన ఒక చిన్న ప్యాకెట్టు నా కోసం వేచి ఉంది. చాలా ఆశతో, అతిగా ఆశించే ధైర్యం చేయకుండా, నేను బహుమతిని తెరిచి నా కారును కనుగొన్నాను. చాలా సంతోషంతో నేను ఏడ్చాను. నేను మీటను లాగాను మరియు రెక్కలు బయటకు వచ్చాయి, సినిమాలో ఉన్న కారు లాగానే! అత్యంత విలువైన ఈ బహుమతి కోసం మా నాన్నకు నేను ఎంత కృతజ్ఞతలు చెప్పానో. నేను ఆ కారుతో చాలా సంవత్సరాలు ఆడుకున్నాను మరియు దానిని ఇంకా చాలా సంవత్సరాల వరకు ఉంచుకున్నాను. నేను దానిని పొందడానికి ఎంత ఇష్టపడ్డానో అంతే ఇష్టంతో మా నాన్న ఆ కారును నాకిచ్చారని నేను అనుకుంటున్నాను.
ఇవ్వడం, అంగీకరించడం, తెరవడం మరియు స్వీకరించడం
బహుమతి ఇవ్వడంలో మూడు భాగాలు ఉన్నాయని మనం అనుకోవచ్చు:
-
బహుమతి ఇవ్వడం అంటే, ఇచ్చే వ్యక్తి బహుమతిని ఎంచుకుని, తయారు చేసి లేదా సిద్ధం చేసి ప్రియమైన వ్యక్తికి అందజేస్తాడు. ఇందులో ఇచ్చేవారి వైపు నుండి అర్థవంతమైనది ఇవ్వాలనే ఆలోచనాత్మక ఉద్దేశం ఉంటుంది.
-
బహుమతిని అంగీకరించడం మరియు తెరవడం, గ్రహీత ఇచ్చేవారి నుండి బహుమతిని అంగీకరించినప్పుడు, దానిని తెరిచే ముందు, తరచుగా ఆశ్చర్యం, కృతజ్ఞత మరియు ఉత్సాహ భావాలతో ఉంటారు, కొన్నిసార్లు రిబ్బను విప్పి, బహుమతి ఏమిటో తెలుసుకోవడానికి ప్యాకెట్టును విప్పుతారు.
-
తర్వాత బహుశా అతి ముఖ్యమైన భాగం, బహుమతిని స్వీకరించడం. నిజాయితీగా ఇచ్చిన బహుమతిని స్వీకరించడం అంటే దానిని అంగీకరించి తెరవడం కంటే చాలా ఎక్కువ. బహుమతి విలువను గుర్తించి, ఇచ్చేవారికి కృతజ్ఞత తెలియజేయడం కంటే అది చాలా ఎక్కువ. బహుమతిని నిజంగా స్వీకరించడం అంటే, మనం దానికి విలువనిస్తాము, దానిని మన జీవితాల్లో పూర్తిగా ఉపయోగించుకుంటాము మరియు ఇచ్చేవారిని కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాము.
బహుమతిని స్వీకరించడం నిష్క్రియాత్మకం కాదు, కానీ ఉద్దేశపూర్వకమైన, అర్థవంతమైన ప్రక్రియ, అది కేవలం ఒక ప్యాకెట్టును తెరవడం కంటే చాలా ఎక్కువైనది. స్వీకరించడం అంటే ఒకవిధంగా ఇచ్చేవారికి, తీసుకునేవారికి మధ్య బంధాలను బలోపేతం చేసేలా బహుమతిని మరియు ఇచ్చేవారి హృదయాన్ని అభినందించడం మరియు జతచేయడం. ఆ బహుమతి మరియు లెక్కలేనన్ని ఇతర ఉదారమైన చర్యల ద్వారా మా నాన్న నా పట్ల చూపిన గాఢమైన ప్రేమను, శ్రద్ధను మరోసారి అనుభవిస్తున్నప్పుడు, ఆ బొమ్మ కారు గురించి ఆలోచించడం అనేక విలువైన జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.
మన పరలోక తండ్రి యొక్క బహుమతులు
మన పరలోక తండ్రి తన విలువైన పిల్లలమైన మనలో ప్రతి ఒక్కరిపై కుమ్మరించడానికి వెలుగు మరియు సత్యము యొక్క లెక్కలేనన్ని బహుమతులను సిద్ధం చేసారు. అవి ఔదార్యముగల మన దాత నుండి అరణ్యంలో ఒక నీటిఊటలాగా ఆయన దయగల హృదయం నుండి ప్రవహిస్తాయి. “శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్దనుండి వచ్చును.” తండ్రితో మన నిబంధన బంధంలో, ఆయన ఎల్లప్పుడూ ఇచ్చేవారు మరియు మనం వినయపూర్వకమైన గ్రహీతలం.
తండ్రి ఇచ్చిన బహుమతులన్నింటిలోకెల్లా గొప్పది, దాని ద్వారానే మిగతావన్నీ వస్తాయి
కానీ తండ్రి ఇచ్చిన బహుమతులన్నింటిలోకెల్లా గొప్పది, ఆయన ప్రియమైన గొర్రెపిల్ల, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు లేకుండా మనం ఏమీ పొందలేము. మన తండ్రి ఇచ్చిన బహుమతులన్నీ గెత్సేమనేలో మరియు సిలువపై రక్షకుడు ఇష్టపూర్వకంగా అర్పించిన అర్పణ ద్వారా మరియు విజయవంతమైన ఆయన పునరుత్థానం ద్వారా వస్తాయి మరియు క్రియాత్మకం చేయబడతాయి. మన దయగల విమోచకుడైన యేసు క్రీస్తు, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్దనుండి వచ్చిన అత్యున్నతమైన బహుమతి. “ఆయన కుమారుని యొక్క బహుమానమందు దేవుడు [మన కొరకు] అధిక శ్రేష్ఠమైన మార్గమును సిద్ధపరచియున్నారు.”
నిత్య సత్యం యొక్క సర్వవ్యాప్త బహుమతి
మన తండ్రి మనకు ప్రసాదించాలని కోరుకునే వాటన్నిటినీ స్వీకరించే మన సామర్థ్యానికి ఆధారం అయ్యే నిత్య సత్యం యొక్క సర్వవ్యాప్త బహుమతి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను—అది ఒక ముఖ్యమైన బహుమతి, అది పూర్తిగా అంగీకరించబడి ఆత్మలో లోతుగా స్వీకరించబడినప్పుడు, జీవితంలోని ఆనందాలను, కష్టాలను మరియు జవాబివ్వబడని మన ప్రశ్నలను సందర్భోచితంగా చూపుతుంది: అది మనం నిజంగా దేవుని పిల్లలమని చూపుతుంది. ఆ సత్యం ఉత్కంఠభరితమైనది! అద్భుతమైనది! మరియు అది ఉపమానముగా చెప్పినది కాదు.
మీరు దీన్ని మొదటిసారి వింటున్నారని ఊహించుకోండి! మీరు నిజంగా ఆయన ప్రియమైన కుమార్తె. మీరు నిజంగా ఆయన అమూల్యమైన కుమారుడు. మరియు మీరు ఉన్న మార్గం ఆయన సంతోష ప్రణాళిక. సర్వజ్ఞుడైన ఆయన ప్రేమ మూలంగా, మీరు భూమిపైకి పంపబడడానికి ముందు మీరు ఎవరో, మీ మర్త్య జీవితంలో ఇప్పటివరకు మీరు ఏమి అనుభవించారో ఆయనకు ఖచ్చితంగా తెలుసు మరియు మీ భవిష్యత్తులో అన్నింటి కొరకు ఆయన ప్రణాళిక చేసారు. అందమైన ఆయన బహుమతులన్నిటి యొక్క అత్యున్నత ఉద్దేశ్యాన్ని, ఆయనతో నిత్య జీవితాన్ని పొందడానికి, ఒక రోజు మీరు ఆయన వద్దకు తిరిగి రావాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నారు.
సత్యము యొక్క ఈ బహుమతి నిజమైనదా కాదా అనేది కాదు, మనం దానిని కనుగొని స్వీకరిస్తామా అనేది ప్రశ్న. ఈ బహుమతిని తండ్రి ఇప్పటికే మనకు అనుగ్రహించారు. ఈ బహుమతి యొక్క అంతిమ ప్రయోజనం కోసం రక్షకుడు ఇప్పటికే మూల్యం చెల్లించారు. కానీ సంవత్సరాలుగా మీకు ఈ సత్యం బోధించబడి, చెప్పబడి, పాడబడినట్లయితే, బహుశా దాని యొక్క అద్భుతం చాలా కాలం క్రితం మసకబారిపోయి ఉండవచ్చు మరియు ఇకపై మీరు దాని శక్తిని, శాంతిని అనుభవించకపోవచ్చు.
ఈ అమూల్యమైన అవగాహన బహుమతి—మరియు దాని నుండి వచ్చే మంచితనం, శాంతి మరియు నిరీక్షణ—అంగీకరించబడకుండా, తెరవబడకుండా మరియు స్వీకరించబడకుండా వదిలివేయబడితే, మనకు ఎంత భయంకరమైన నష్టం! ఇచ్చేవారికి ఎంత విచారం! “ఒక మనుష్యునిపై ఒక బహమానము ప్రోక్షించబడి, అతడు ఆ బహుమానము పొందనియెడల వానికేమి ప్రయోజనము? ఇదిగో, అతనికి ఇవ్వబడిన దానియందు గాని, ఆ బహుమానము ఇచ్చిన వానియందు గాని అతడు సంతోషించడు.”
మీరు నిజంగా దేవుని యొక్క ప్రియమైన బిడ్డ అనే అద్భుతమైన అవగాహనను మొదటిసారిగా లేదా ఇంతకు ముందు కంటే ఎక్కువ స్థాయిలో స్వీకరించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు రిబ్బను విప్పాలి, చుట్టిన కాగితాన్ని చింపివేయాలి, పెట్టెను తెరవాలి మరియు ఈ మూల సత్యం యొక్క నిజమైన, స్వచ్ఛమైన అవగాహనను కృతజ్ఞతతో వినయంతో చురుకుగా స్వీకరించాలి. మీరు నిజంగా సర్వోన్నతుని బిడ్డ అని పరిశుద్ధాత్మ మీ హృదయానికి సాక్ష్యమివ్వగలడు.
ఈ మహోన్నతమైన వాస్తవికతను మీరు అంగీకరించి, అర్థం చేసుకున్నప్పుడు మరియు దాని యొక్క ఓదార్పును, పులకరింతను రెండింటినీ అనుభవించినప్పుడు, మీ ధృక్పథం మొత్తం మారుతుంది! మీ జీవితంలో ఏమి జరుగుతున్నా, ఏమి జరగకపోయినా, మీరు ఆయన ప్రేమను అనుభవించవచ్చు, ఆయన స్వరాన్ని వినవచ్చు మరియు ఆయన ప్రభావాన్ని గుర్తించవచ్చు. మీరు మిమ్మల్ని మరియు ఇతరులను ఎలా చూస్తారో మీరు పునర్నిర్వచించగలరు. మీ రక్షకుడితో మీ నిబంధన బంధం మరింత బలపడుతుంది మరియు ఈ మధురమైన బహుమతి యొక్క దృష్టి ద్వారా, జీవితం కొత్త ప్రకాశాన్ని, అందాన్ని మరియు ఆశను సంతరించుకుంటుంది.
నిజంగా మార్పు కలిగించే ఈ జ్ఞానాన్ని మీ ఆత్మ లోతుల్లో పొందుతున్నారో లేదో అర్థం చేసుకోవడానికి దయచేసి మీరు ప్రార్థిస్తారా? దయచేసి మీరు బహుమతిని అంగీకరిస్తారా? మీరు ఇంతకు ముందు కంటే మరింత తీవ్రంగా, మరింత స్వేచ్ఛగా, మరింత సమృద్ధిగా అలా చేస్తారా—మరియు అలా చేయడం ద్వారా దానితో వచ్చే ఇతర బహుమతులన్నింటినీ పొందుతారా?
నిత్య సత్యం యొక్క ఈ బహుమతిని స్వీకరించడం
“దేవుని నుండి ఈ బహుమతిని పొందడానికి నేను ఏమి చేయాలి?” అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. నిజానికి, ఏమీ చేయనక్కరలేదు. అది దాత నుండి వచ్చిన బహుమతి. అది కేవలం ఒక వాస్తవం. దాన్ని రానివ్వండి. మీరు ఆయన బిడ్డ. మీరు ఆయనకు ప్రియమైనవారు. దానిని క్లిష్టతరం చేయవద్దు. మీరు ఏదో ఒక విధంగా అనర్హులు అనే ఆలోచనలతో ఈ బహుమతిని స్వీకరించకుండా ఉండవద్దు. వాస్తవం ఏమిటంటే మనలో ఎవరూ “అర్హులు” కాదు— తండ్రి యొక్క బహుమతులన్నీ పరిశుద్ధ మెస్సీయ యొక్క యోగ్యతలు, దయ మరియు కృప ద్వారా మాత్రమే పొందబడతాయి, కానీ ఆయన ఉదార హృదయం తన పిల్లలలో ప్రతి ఒక్కరూ వాటిని పొందాలని ఎంతగానో కోరుకుంటుంది! అప్పుడు, మీ కొత్త లేదా పునరుద్ధరించబడిన అవగాహన ప్రారంభమైనప్పుడు, ఈ బహుమతిని ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పడంలో ఆనందించండి.
సుమారు 25 ఏళ్ల ప్రాయంలో నేను నా విశ్వాసాన్ని కనుగొన్నప్పటి నుండి, నేను నిజంగా దేవుని కుమారుడిని అని క్రమంగా అర్థం చేసుకున్నాను. నేను ఈ బహుమతిని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటానో, అంత ఎక్కువగా నేను ఎవరో మరియు నేను ఎంతగా ప్రేమించబడుతున్నానో నాకు తెలుస్తుంది. లేఖన పదాలు, నా గోత్రజనక దీవెన, దేవాలయ ఆరాధన, ఇతరులకు సేవ చేయడం, కృతజ్ఞత తెలపడం మరియు నా తండ్రికి చేసే పవిత్ర ప్రార్థన అనేవి అవగాహన పెంచుకోవడానికి నాకు సహాయపడిన కొన్ని విషయాలు. ఈ అందమైన సత్యాన్ని నేను తెలుసుకుని ఉంటే నా జీవితంలో మునుపటి దుఃఖం, బాధ మరియు విచారం ఎలా మారియుండేవో, ఉపశమనం పొందియుండేవో మరియు వాటిలో అధిక భాగాన్ని నేను ఎలా అధిగమించియుండేవాడినో అని నేను ఆశ్చర్యపోతున్నాను.
క్రీస్తు యొద్దకు రండి మరియు స్వీకరించండి
“దేవుని బహుమానములను నిరాకరించవద్దు” కానీ “క్రీస్తు యొద్దకు రండి, ప్రతి మంచి బహుమానమును పట్టుకోండి” అని మొరోనై మనకు ఉద్బోధిస్తున్నాడు. మీరు ఆయన ప్రేమపూర్వక దయపై నమ్మకంతో క్రీస్తు వద్దకు రావచ్చు మరియు ఆయన బహుమానములైన ఆనందం, శాంతి, నిరీక్షణ, వెలుగు, సత్యం, బయల్పాటు, తెలివి మరియు జ్ఞానాన్ని స్వీకరించవచ్చు—మీ తల పైకెత్తి, చేతులు చాచి, నమ్మకంతో స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఈ బహుమతులను స్వీకరించవచ్చు, ఎందుకంటే మీరు దేవుని ప్రియమైన కుమార్తె అని, మీరు దేవుని ప్రియమైన కుమారుడని మరియు మిమ్మల్ని విమోచించడానికి, మిమ్మల్ని సమర్థించడానికి మరియు శుద్ధి చేయడానికి ఆయన తన పరిపూర్ణమైన, పరిశుద్ధ కుమారుడిని మీకు బహుమతిగా ఇచ్చారనే జ్ఞానం మీలో సురక్షితంగా పాతుకుపోయింది.
మీరు దేవుని బిడ్డ. ఇది మనం పాడుకునే మంచి పాట మాత్రమే కాదు. మీరు దయచేసి ఆయన నుండి ఈ జ్ఞానం మరియు అవగాహన యొక్క బహుమతిని అంగీకరించి, తెరిచి, స్వీకరిస్తారా? మీరు దానిని విలువైన నిధిగా మీ దగ్గర ఉంచుకుంటారా? ఈ బహుమతిని తిరిగి స్వీకరించండి లేదా బహుశా మొదటిసారిగా నిజంగా స్వీకరించండి మరియు ఇది మీ జీవితంలోని ప్రతి అంశాన్ని మార్చనివ్వండి. ఆయన కుమారుని యొక్క బహుమానము ద్వారా దేవుడు మీ కొరకు సిద్ధపరచిన అధిక శ్రేష్ఠమైన మార్గమిది. మీరు సంతోషమును కలిగియుండునట్లు ఉన్నారు! యేసు క్రీస్తు నామములో, ఆమేన్.