“దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు”
దేవుని పట్ల మరియు ఆయన పిల్లల పట్ల మనకున్న ప్రేమ, ఇది నిజంగా రక్షకుని సంఘమని ప్రపంచానికి చెప్పడానికి ఒక శక్తివంతమైన సాక్ష్యం.
చాలా సంవత్సరాల క్రితం నేను, సహోదరి ఉఖ్‌డార్ఫ్ దక్షిణ జర్మనీ గుండా ప్రయాణిస్తున్నాము. అది ఈస్టరుకు కొద్దిరోజుల ముందు మరియు మేము మా ఆదివారపు ఆరాధనా సేవలో మాతో చేరమని సంఘ సభ్యురాలు కాని ఒక మంచి స్నేహితురాలిని ఆహ్వానించాము. ఈ స్నేహితురాలంటే మాకు ఎంతో ఇష్టం, కాబట్టి రక్షకుని గురించి మరియు ఆయన సంఘం గురించి మేము భావించేదానిని ఆమెతో పంచుకోవడం మరియు వచ్చి చూడమని ఆమెను ఆహ్వానించడం చాలా సహజం. ఆమె మా ఆహ్వానాన్ని మన్నించి, దగ్గరలో ఉన్న శాఖ సమావేశాలకు మాతో చేరింది.
మీరెప్పుడైనా మొదటిసారిగా ఒక స్నేహితురాలిని సంఘానికి తీసుకువచ్చినట్లయితే, ఆ ఆదివారం ఉదయం నేను ఎలా భావించానో బహుశా మీరు అర్థం చేసుకోగలరు. అంతా పరిపూర్ణంగా జరగాలని నేను కోరుకున్నాను. మా స్నేహితురాలు బాగా చదువుకున్న, ఆధ్యాత్మిక వ్యక్తి. ఈ శాఖ సమావేశాలు ఆమెపై మంచి ముద్ర వేస్తాయని మరియు సంఘాన్ని బాగా చూపిస్తాయని నేను నిజంగా ఆశించాను.
ఆ శాఖ ఒక సరుకుల దుకాణం పైనున్న రెండవ అంతస్థులోని అద్దె గదులలో కలుసుకుంది. అక్కడికి చేరుకోవడానికి, అక్కడ నిల్వ చేసిన వస్తువుల ఘాటు వాసనలను దాటుకుంటూ, భవనం వెనుకవైపు ఉన్న మెట్లు ఎక్కి వెళ్ళాలి.
సంస్కార కూడిక ప్రారంభమైనప్పుడు, నా స్నేహితురాలు మొదటిసారి దానిని అనుభవించడం గురించి నేను ఆలోచించాను మరియు నాకు అసౌకర్యాన్ని కలిగించిన విషయాలను గమనించకుండా ఉండలేకపోయాను. ఉదాహరణకు, పాడడం టాబర్నాకిల్ గాయక బృందంలాగా వినిపించలేదు. సంస్కార సమయంలో చురుకైన పిల్లల అల్లరి వినిపించింది. ప్రసంగీకులు తమ వంతు కృషి చేసారు, కానీ వారు ప్రసంగాన్ని ఇవ్వడంలో నైపుణ్యం కలిగిలేరు. బహుశా ఆదివారపు బడి మెరుగ్గా ఉంటుందని ఆశిస్తూ, నేను సమావేశంలో అసౌకర్యంగా కూర్చున్నాను.
అది కూడా బాగోలేదు.
మేము ఆమెను తీసుకువచ్చిన ఈ సంఘం గురించి మా స్నేహితురాలు ఏమనుకొని ఉంటుందోనని ఉదయమంతా నేను చింతించాను.
తర్వాత, మేము ఇంటికి తిరిగివెళ్ళేటప్పుడు, నేను మా స్నేహితురాలితో మాట్లాడడానికి ఆమె వైపు తిరిగాను. అది కేవలం ఒక చిన్న శాఖ అని, అది నిజంగా సంఘం మొత్తాన్ని సూచించదని నేను వివరించాలనుకున్నాను. కానీ నేను నోరు తెరిచేలోపే ఆమె మాట్లాడింది.
“చాలా బాగుంది,” అని చెప్పిందామె.
నాకు నోట మాట రాలేదు.
ఆమె కొనసాగిస్తూ ఇలా చెప్పింది, “మీ సంఘంలో జనులు ఒకరినొకరు ఆదరించే తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. వారందరూ వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చినట్లు అనిపించింది, అయినా వారు నిజంగా ఒకరినొకరు ప్రేమిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన సంఘం ఇలానే ఉండాలని క్రీస్తు కోరుకున్నారని నేను ఊహిస్తున్నాను.”
తీర్పుతీర్చే నా వైఖరికి నేను వెంటనే పశ్చాత్తాపపడ్డాను. నా స్నేహితురాలిని ఆకట్టుకోవడానికి నేను పరిపూర్ణమైన సమావేశాలను కోరుకున్నాను. కానీ ఈ శాఖ సభ్యులు సాధించినది ప్రేమ, దయ, సహనము మరియు కనికరము యొక్క హృదయపూర్వకమైన స్ఫూర్తిని.
తద్వారా భూమిపై విశ్వాసము విస్తరించాలని
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రియమైన స్నేహితులారా, నేను యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘాన్ని ప్రేమిస్తున్నాను. ఇది రక్షకుని యొక్క నిజమైన, సజీవమైన సంఘము మరియు ఇది యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క సంపూర్ణతను బోధిస్తుంది. ఆయన యాజకత్వ శక్తి మరియు అధికారము ఇక్కడ ఉన్నాయి. ఆయన పిలిచి, అధికారమిచ్చిన సేవకుల ద్వారా మరియు సజీవ ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి ద్వారా యేసు క్రీస్తు ఈ సంఘాన్ని వ్యక్తిగతంగా నడిపిస్తారు. దేవుని పిల్లలను సమకూర్చమని మరియు రక్షకుని రెండవ రాకడ కొరకు ప్రపంచాన్ని సిద్ధం చేయమని ఆయన కడవరి-దిన పరిశుద్ధులకు ఒక ప్రత్యేక నియమితకార్యాన్ని ఇచ్చారు. ఇదంతా నిజమని నేను సాక్ష్యమిస్తున్నాను.
కానీ చాలామంది మొదటిసారి యేసు క్రీస్తు యొక్క సంఘాన్ని అనుభూతి చెందుతున్నప్పుడు, వాళ్ళు యాజకత్వ అధికారము లేదా విధులు లేదా ఇశ్రాయేలు సమకూర్పు గురించి ఆలోచించడం లేదని గుర్తుంచుకోవడం ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యంగా, వాళ్ళు గమనించేది ఏమిటంటే, వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా భావిస్తారు మరియు మనం ఒకరితో ఒకరం ఎలా ప్రవర్తిస్తాము అనేది.
“ఒకరినొకరు ప్రేమింపవలెను,” అని యేసు చెప్పారు. “దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” చాలా తరచుగా, యేసు క్రీస్తు గురించి ఒక వ్యక్తి యొక్క మొదటి సాక్ష్యము అతను లేదా ఆమె యేసు క్రీస్తు యొక్క శిష్యుల మధ్య ప్రేమను అనుభూతి చెందినప్పుడు వస్తుంది.
“భూమిపై విశ్వాసము విస్తరించాలని” ఆయన తన సంఘాన్ని పునఃస్థాపించినట్లు రక్షకుడు ప్రకటించారు. కాబట్టి, జనులు మన సంఘ సమావేశాలకు వచ్చినప్పుడు, వారు ఆయన యందు బలమైన విశ్వాసంతో తిరిగివెళ్ళాలని రక్షకుడు కోరుతున్నారు. మన స్నేహితులు మన మధ్య అనుభవించే ప్రేమ వారిని యేసు క్రీస్తుకు దగ్గరగా పైకెత్తుతుంది! మనం సమకూడిన ప్రతిసారీ అదే మన సాధారణ లక్ష్యం.
క్రీస్తుపై అధిక విశ్వాసం లేదా పరలోక తండ్రితో దగ్గరి సంబంధం కోరుకునే వారెవరైనా, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నట్లు భావించాలి. వారిని మన సమావేశాలకు ఆహ్వానించడం వారిని మన ఇంటికి ఆహ్వానించినంత సహజంగా ఉండవచ్చు.
ఆదర్శం మరియు నిజం
ఇప్పుడు, నేను ఆదర్శవంతమైన దానిని వర్ణిస్తున్నట్లు గ్రహించాను. ఈ మర్త్య జీవితంలో, మనం ఆదర్శవంతమైన దానిని అనుభవించడం చాలా అరుదు. “పరిపూర్ణులయ్యేవరకు” ఆదర్శం మరియు నిజం మధ్య ఎల్లప్పుడూ దూరం ఉంటుంది. కాబట్టి, సంఘము పరిపూర్ణమైనదిగా అనిపించనప్పుడు మనం ఏమి చేయాలి? ఏ కారణం చేతనైనా, మన వార్డు ఇంకా పరిపూర్ణ విశ్వాసాన్ని లేదా ప్రేమను పెంపొందించుకోనప్పుడు? లేదా మనం చెందియుండనట్లు భావించినప్పుడు మనం ఏమి చేయాలి?
మనం చేయకూడని ఒక విషయం ఏమిటంటే ఆదర్శాన్ని వదులుకోవడం!
మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ ఈ ముఖ్యమైన హెచ్చరికను కలిగియుంది: “ఇప్పుడు, లోపములున్న యెడల అవి మనుష్యుల యొక్క పొరపాటులైయున్నవి; అందువల్ల, దేవుని యొక్క క్రియలను ఖండించకుడి,” అని అది చెప్తుంది.
ఒక పుస్తకం—లేదా ఒక సంఘం లేదా ఒక వ్యక్తి—“లోపాలు” మరియు “పొరపాటులు” ఉన్నప్పటికీ దేవుని కార్యము కాగలదా?
నా సమాధానం ఖచ్చితంగా అవును!
కాబట్టి, మనం ప్రభువు యొక్క ఉన్నత ప్రమాణాలను జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఒకరితో ఒకరు ఓపికగా కూడా ఉందాం. మనలో ప్రతీ ఒక్కరం నేర్చుకుంటున్నాము మరియు మనం సాధించే ఏ పురోగతి కోసమైనా మనమందరం రక్షకునిపై ఆధారపడతాము. వ్యక్తులుగా మన విషయంలో అది నిజం మరియు భూమిపై దేవుని రాజ్యం విషయంలో కూడా అది నిజం.
ప్రభువు మనల్ని ఆయన రాజ్యంలో చేరమని మాత్రమే కాకుండా, దానిని నిర్మించడంలో ఆతృతతో నిమగ్నమవ్వమని కూడా ఆహ్వానిస్తున్నారు. దేవుడు “ఏక హృదయము, ఏక మనస్సు” గల జనులను ఊహించుకుంటారు. ఏక హృదయము కలిగియుండాలంటే, మనం తప్పక స్వచ్ఛమైన హృదయాలు కలిగియుండాలి మరియు దానికి హృదయం యొక్క గొప్ప మార్పు అవసరమవుతుంది.
కానీ దాని అర్థం మీ హృదయంతో అనుసంధానించడానికి నా హృదయాన్ని మార్చుకోవడం కాదు. లేదా నా హృదయంతో అనుసంధానించడానికి మీ హృదయాన్ని మార్చుకోవడం కాదు. దాని అర్థం మనమందరం రక్షకునితో అనుసంధానించడానికి మన హృదయాలను మార్చుకుంటాము.
మనం ఇంకా సిద్ధంగా లేకపోతే, గుర్తుంచుకోండి, ప్రభువు సహాయంతో, ఏదీ అసాధ్యం కాదు.
తగినట్లుగా మరియు చెందియున్నట్లుగా
మీరు ఎప్పుడైనా సరిగ్గా సరిపోరని మీకు అనిపిస్తే, దయచేసి మీరు ఒంటరిగా లేరని తెలుసుకోండి. మనమందరం జీవితంలో అందరి మధ్య అపరిచితుడిలా భావించిన పరిస్థితులను ఎదుర్కోలేదా? నేను దాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు అనుభవించాను. నేను 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, మా కుటుంబం మా ఇంటిని విడిచిపెట్టి తెలియని ప్రాంతానికి వెళ్లవలసి వచ్చింది. ప్రతిదీ నేను అలవాటుపడిన దానికి భిన్నంగా ఉంది. వారు అలవాటుపడిన దానికి భిన్నంగా నేను ఉన్నానని నా యాస ఇతర పిల్లలకు స్పష్టం చేసింది. నాకు స్నేహం, అనుబంధం చాలా అవసరమైన సమయంలో నేను ఒంటరిగా, స్థానభ్రంశం చెందినట్లుగా భావించాను.
ఇక్కడ భూమిపై, మనం గమనించే చాలా తేడాలు—కొంతమంది ఒకరినొకరు వర్గీకరించడానికి ఉపయోగించే తేడాలు—భూసంబంధమైన విషయాలకు సంబంధించినవి: భౌతిక రూపం, జాతీయత, భాష, దుస్తులు, ఆచారాలు మరియు మొదలైనవి. కానీ “మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”
ఆయన దృక్కోణంలో, అన్నింటికంటే ముందు ఒక వర్గం ఉంది: దేవుని బిడ్డ. మరియు మనమందరం దానిలో సరిగ్గా సరిపోతాము.
మనలాగే కనిపించే, మాట్లాడే, ప్రవర్తించే మరియు ఆలోచించే వ్యక్తుల చుట్టూ ఉండాలని కోరుకోవడం సహజం. దానికి ఒక ప్రదేశం ఉంది.
కానీ రక్షకుని సంఘంలో, సమకూడడానికి ఇష్టపడి ఉన్న, సత్యాన్ని వెదుకుతున్న దేవుని పిల్లలందరినీ మనం సమకూరుస్తాము. మనల్ని కలిపి ఉంచేవి మన భౌతిక రూపం, రాజకీయ అభిప్రాయాలు, సంస్కృతి లేదా జాతి కాదు. మన ఉమ్మడి నేపథ్యం మనల్ని ఏకం చేయదు. మన ఉమ్మడి లక్ష్యం, దేవుని పట్ల మరియు పొరుగువారి పట్ల మన ప్రేమ, యేసు క్రీస్తు పట్ల మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్త పట్ల మన నిబద్ధతే మనల్ని ఏకం చేస్తుంది. మనం “క్రీస్తునందు ఏకముగా ఉన్నాము.”
మనం కోరుకునే ఐక్యత ఏమిటంటే అందరూ ఒకే అభిప్రాయాన్ని కలిగియుండడం కాదు; అందరూ—యేసు క్రీస్తు వైపు చూస్తూ, ఒకే లక్ష్యాన్ని కలిగియుండడం. మనం ఏకమైయున్నాము, మనం ఎక్కడ ఉన్నామో అనేదాని వల్ల కాదు, కానీ మనం ఎక్కడికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నామో దాని వల్ల, మనం ఎవరమో అనేదాని వల్ల కాదు, కానీ మనం ఎవరిగా మారాలని కోరుకుంటున్నామో దాని వల్ల.
క్రీస్తు యొక్క నిజమైన సంఘం యొక్క ఉద్దేశ్యమిదే.
ఒక్క శరీరము
మీరు దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన కుమారుడిని అనుసరించడం ద్వారా ఆయనను బాగా తెలుసుకోవాలనుకుంటే, మీరు ఈ సంఘానికి చెందియున్నారు. మీరు రక్షకుని ఆజ్ఞలను పాటించాలని హృదయపూర్వకంగా ప్రయత్నిస్తుంటే—మీరు ఇంకా దానిలో పరిపూర్ణంగా లేనప్పటికీ—మీరు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘానికి సరిగ్గా సరిపోతారు.
మరి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మీరు భిన్నంగా ఉంటే ఏమి చేయాలి? అది మిమ్మల్ని సరిపోని వ్యక్తిగా చేయదు—అది మిమ్మల్ని క్రీస్తు యొక్క శరీరంలో అవసరమైన భాగంగా చేస్తుంది. క్రీస్తు యొక్క శరీరంలో అందరూ అవసరమే. కళ్ళు ఎన్నడూ గ్రహించలేని వాటిని చెవులు గ్రహిస్తాయి. చేతులు చేయలేని పనులను పాదాలు చేస్తాయి.
దానర్థం మీ పని ప్రతి ఒక్కరినీ మీలాగా మార్చడం కాదు. కానీ మీరు దోహదపడడానికి ముఖ్యమైనది ఏదో ఉందని—మరియు మీరు నేర్చుకోవడానికి ముఖ్యమైనది ఏదో ఉందని దాని అర్థం!
ఒకే స్వరము
ప్రతీ సర్వసభ్య సమావేశ సభలో, ప్రతిభావంతులైన గాయక బృందాల నుండి స్ఫూర్తిదాయకమైన సంగీతంతో మనం ఆశీర్వదించబడ్డాము. మీరు వింటున్నప్పుడు, గాయకులందరూ ఒకే స్వరాలను పాడరని మీరు గమనించవచ్చు. కొన్నిసార్లు ఒక విభాగం శ్రావ్యతను కలిగి ఉంటుంది, కొన్నిసార్లు మరొక విభాగం. కానీ వారందరూ అందమైన ధ్వనికి దోహదం చేస్తారు మరియు వారు పూర్తిగా ఏకమైయుంటారు. గాయకబృందంలో ప్రతీ సభ్యునికి ఒకే ప్రధాన లక్ష్యం ఉంది: దేవుణ్ణి స్తుతించడం మరియు మన హృదయాలను ఆయన వైపుకు త్రిప్పడం. ప్రతి ఒక్కరూ తమ మనస్సు మరియు హృదయాన్ని ఒకే దైవిక ఉద్దేశ్యంపై కేంద్రీకరించాలి. మరియు అలా జరిగినప్పుడు, వారు నిజంగా ఒకే స్వరం అవుతారు.
మీరు ఇంకా యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో సభ్యులు కాకపోతే, రక్షకుని యొక్క “విమోచించు ప్రేమ గీతం”లో మేము ఆనందిస్తున్నప్పుడు మాతో చేరమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మాకు మీరు కావాలి. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. ప్రభువును, ఆయన పిల్లలను సేవించడానికి మీరు చేసే ప్రయత్నాలతో సంఘం మెరుగ్గా ఉంటుంది.
బాప్తిస్మం ద్వారా, దేవునితో నిబంధనలు చేయడం ద్వారా, “మీరు దేవుని సముదాయములోనికి వచ్చుటకు, ఆయన జనులని పిలువబడుటకు” మీ కోరికను ఇప్పటికే చూపించినట్లయితే, ఈ గొప్ప, దైవిక కార్యములో భాగమైనందుకు మరియు రక్షకుడు కోరుకున్న విధంగా యేసు క్రీస్తు సంఘాన్ని తయారు చేయడంలో సహాయపడినందుకు ధన్యవాదాలు.
జర్మనీలోని నా స్నేహితురాలి నుండి నేను నేర్చుకున్నట్లుగా, దేవుని పట్ల మరియు ఆయన పిల్లల పట్ల మనకున్న ప్రేమ, ఇది నిజంగా రక్షకుని సంఘమని ప్రపంచానికి చెప్పడానికి ఒక శక్తివంతమైన సాక్ష్యం.
మన రక్షకుడు, విమోచకుడు మరియు బోధకుడు మన కోసం ఏర్పాటుచేసిన ఆదర్శాలకు అనుగుణంగా జీవించడానికి ఓపికగా, శ్రద్ధగా వెదకడానికి—తద్వారా మనం ఆయన శిష్యులమని అందరూ తెలుసుకోవడానికి దేవుడు మనల్ని దీవించునుగాక. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.