రెండవ శోధన ఉంది జాగ్రత్త
మిమ్మల్ని ప్రేమించేవారి నుండి మరియు మద్దతునిచ్చేవారి నుండి దాగుకొనవద్దు; బదులుగా, వారి వద్దకు పరిగెత్తండి.
రెండు సంవత్సరాల క్రితం, నాకు 12 సంవత్సరాలు నిండినప్పుడు, నా మొదటి అహరోను యాజకత్వ సమూహము యొక్క రాత్రిపూట శిబిరానికి హాజరుకమ్మని నన్ను ఆహ్వానించారు. ఇది నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆహ్వానం, ఎందుకంటే మా నాన్న సమూహ నాయకుడు మరియు నేను ఇంట్లో ఉన్నప్పుడు తరచుగా వార్డులోని అబ్బాయిలతో శిబిరానికి వెళ్లేవారు.
ఆ రోజు వచ్చినప్పుడు, నేను ఉత్సాహంగా ఉన్నాను. పెద్ద అబ్బాయిలతో కలిసిపోవాలని నేను ఎంతగానో కోరుకున్నానని అంగీకరించాలి. నన్ను నేను నిరూపించుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. ఆ ప్రయత్నంలో నేను వారితో ఆడగలనో లేదో, ఆ గుంపులో భాగమవ్వగలనో లేదోనని పరీక్షించబడడానికి ఎంతో కాలం పట్టలేదు.
నాకు అప్పగించబడిన పని ఏమిటంటే, నాయకులను ఆటపట్టించడానికి మా నాన్నగారి కారు తాళపుచెవులను తీసుకురావడం. మా నాన్న గారిని ఒప్పించడానికి నేను ఏమి చెప్పానో నాకు సరిగ్గా గుర్తు లేదు, కానీ నా విజయానికి గర్వపడుతూ, చేతిలో తాళపుచెవులతో అబ్బాయిల గుంపు వద్దకు పరిగెత్తాను.
అప్పుడు తదుపరి నియామకం వచ్చింది. నేను కారు తలుపు తీసి డ్రైవర్ సీటు వెనుక భాగానికి మరియు కారు హారన్‌కు మధ్య ఒక కలప ముక్కను అమర్చాలి. సాయంత్రం వరకు హారన్ మోగేలా మరియు ఆ కలప ముక్కను తీసివేయడానికి కారులో ప్రవేశించడానికి నాయకులకు ఎటువంటి మార్గం లేకుండా నేను తలుపుకు తాళం వేయవలసివుంది.
ఇప్పుడు, ఇక్కడే కథ నాకు బాధగా ఇబ్బందికరంగా మారింది. నేను కలప ముక్కను ఆ స్థానంలో ఉంచిన తర్వాత, తలుపుకు తాళం వేసి, సమీపంలోని పొదల్లో దాక్కోవడానికి వీలైనంత వేగంగా పరిగెత్తాను. నేను నేలపై వంగి క్రింద కూర్చున్నప్పుడు, నాకు మంటగా నొప్పిగా అనిపించింది. ఆ చీకటిలో మరియు నా తొందరలో, నేను ఒక ముండ్ల జెముడు మొక్క మీద కూర్చున్నాను.
మోగుతున్న హారన్, బాధతో కూడిన నా అరుపులను అణచివేసింది మరియు నెమ్మదిగా కారు వైపు తిరిగి వెళ్లి, నా “పాపాలను” ఒప్పుకుని, ప్రాథమిక మరియు ఇబ్బందికరమైన వైద్య సహాయం కోరడం తప్ప నాకు వేరే మార్గం లేదు.
ఆ రాత్రి మిగిలిన సమయమంతా, నేను ఒక గుడారములో నాన్నగారి దగ్గర నా పొట్ట మీద బోర్లా పడుకున్నాను, ఆయన శ్రావణం ఉపయోగించి, నా … నుండి జెముడు ముళ్ళను తొలగించారు. సరే, నేను చాలా రోజులు హాయిగా కూర్చోలేదని చెప్పడం సరిపోతుంది.
నేను ఆ అనుభవం గురించి చాలాసార్లు ఆలోచించాను. కొన్ని అంతర్లీన సూత్రాలు నాకు స్పష్టంగా కనిపించినప్పటికీ, నా యవ్వనంలోని అవివేకాన్ని చూసి నేను ఇప్పుడు నవ్వుకుంటాను.
మానవ ప్రవర్తనలో అనేక నమూనాలు ప్రకృతి సంబంధియైన మనుష్యునిలో సర్వసాధారణంగా కనిపిస్తాయి—సరిపోలాలనే కోరిక, తనను తాను నిరూపించుకోవాలనే కోరిక, ఏదో కోల్పోతున్నామనే భయం మరియు పరిణామాలను నివారించడానికి మనం దాచడం తప్పనిసరైన అవసరం. ఈ రోజు నేను ఈ చివరి ప్రవర్తనపై దృష్టి సారించాలనుకుంటున్నాను—అదే మనం చేయకూడని పని చేసిన తర్వాత దాక్కోవడం.
ఇప్పుడు, నా చిన్ననాటి చిలిపి పనిని ఘోరమైన పాపంతో సమానం చేయడం లేదు, కానీ మనం మన మర్త్య జీవితంలో పరీక్షించబడినప్పుడు మనకు వర్తించే మరియు ఉపయోగపడే కొన్ని సూత్రాలను ఆ చిలిపిపని నుండి నేర్చుకోవచ్చు.
ఏదెను తోటలో, ఆదాము హవ్వలకు ఒక అందమైన వాతావరణం ఉంది—సమృద్ధిగా ఆహారం, సాటిలేని అందమైన తోట—అది ఒక అందమైన తోట మాత్రమే కాదు కలుపు మొక్కలు లేదా ముళ్ల జెముడు మొక్కలు లేని తోట.
అయితే, తోట జీవితం, వారికి అవసరమైన పురోగతిని పరిమితం చేసిందని కూడా మనకు తెలుసు. ఆ తోట చివరి గమ్యస్థానం కాదు, కానీ ఒక పరీక్ష, తండ్రి మరియు కుమారుని సన్నిధికి తిరిగి వెళ్లడం అనే వారి చివరి గమ్యస్థానానికి వారిని సిద్ధం చేసి, ముందుకు సాగడానికి అనుమతించే అనేక పరీక్షలలో మొదటిది.
తోటలో వ్యతిరేకత ఉందని మీకు గుర్తుండే ఉంటుంది. ఆదాము మరియు హవ్వలను పరీక్షించడానికి లూసిఫరుకు అనుమతి ఇవ్వబడింది. అతను మొదట మంచి చెడుల జ్ఞానమునిచ్చు వృక్ష ఫలమును తినమని ఆదామును శోధించాడు. దానిని తినకూడదనే ఆజ్ఞను గుర్తుంచుకుని, ఆదాము ప్రతిఘటించాడు. తరువాత దీవించబడిన హవ్వ వచ్చింది, ఆ ఫలాన్ని తినాలని ఎంచుకొని ఆదామును కూడా అలాగే చేయమని ఆమె ఒప్పించింది.
తరువాత, పరలోక తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికి ఈ నిర్ణయం అవసరమని ఆదాము హవ్వలు ప్రకటించారు. కానీ ఆ ఫలాన్ని తినడం ద్వారా—తండ్రి నుండి వారికి నేరుగా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని వారు అతిక్రమించారు. తోటకు తాను తిరిగి వస్తున్నట్లు ప్రకటించిన తండ్రి స్వరం విన్నప్పుడు, మంచి చెడుల యొక్క ఫలితంగా కలిగిన కఠినమైన అవగాహన వారిని తీవ్ర వేదనకు గురిచేసి ఉంటుంది. వారు నగ్నంగా ఉన్నారని వారు గ్రహించారు, ఎందుకంటే వారు నిజంగా బట్టలు లేకుండా ఉన్నారు, అమాయక స్థితిలో జీవించారు. కానీ ఆ క్షణంలో వారు బట్టలు లేకుండా ఉండడం కంటే మరింత బాధాకరమైనది, బహుశా వారి అతిక్రమణను బట్టి వారు బహిర్గతమవ్వడం. వారు రక్షణ లేకుండా మరియు దుర్బలంగా ఉన్నారు. వారు అన్ని విధాలుగా నగ్నంగా ఉన్నారు.
అవకాశవాది అయిన లూసిఫరు, వారి బహిర్గత మరియు బలహీన స్థితిని తెలుసుకుని, వారిని మళ్ళీ శోధించాడు—ఈసారి దేవుని నుండి దాక్కోమని.
ఈ శోధనను—నేను “రెండవ శోధన” అని పిలుస్తాను—మనం లొంగిపోతే అత్యంత తీవ్రమైన పరిణామాలను తెచ్చే శోధన అది. దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడానికి వచ్చే మొదటి శోధనలన్నింటినీ నివారించడం ఖచ్చితంగా ఉత్తమమైనది, అయితే భూమిపై అందరూ వివిధ రకాల మొదటి శోధనలకు లొంగిపోతారని మనకు తెలుసు. మన పరిపక్వత మరియు అవగాహనలో మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు, మన రక్షకుడైన యేసు క్రీస్తు వలె మారడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు మొదటి శోధనలను నివారించడానికి మన బలం నిరంతరం మెరుగుపడుతుందని మనము ఆశిస్తున్నాము.
కొందరు దేవుడి నుండి దాక్కోవడానికి ప్రయత్నించవచ్చు, ఎందుకంటే వారు కనుగొనబడడం లేదా బహిర్గతం కావడం వారికి ఇష్టం ఉండదు మరియు వారు సిగ్గు లేదా అపరాధ భావనను కలిగియుంటారు. అయితే, దేవుని నుండి దా క్కోవడం అసాధ్యమని అనేక లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. నేను కొన్నింటిని పంచుకుంటాను.
ప్రభువు యిర్మీయాకు ఈ క్రింది ప్రశ్నల ద్వారా బోధిస్తున్నారు: “యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా–నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైనకలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా?”
మరియు యోబుకు ఇలా బోధించబడింది:
“ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది, ఆయన వారి నడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు.”
“దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు.”
కీర్తనకారుడైన దావీదు ఎంతో కవితాత్మకంగా ఇలా మొరపెట్టుకున్నాడు:
“యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు.
“నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. …
“యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. …
“నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
“నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు.”
కొత్తగా పరివర్తన చెందినవారు
ఇటీవలే యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో చేరిన వారికి, ప్రత్యేకించి రెండవ శోధన చాలా కష్టంగా అనిపించవచ్చు. మీ బాప్తిస్మము ద్వారా మీరు యేసు క్రీస్తు నామాన్ని మీపైకి తీసుకోవాలని నిబంధన చేసుకున్నారు, ఇది చాలా మందికి, అవసరమైన జీవన విధాన మార్పును కలిగియుంటుంది. ఒకరి జీవన విధానాన్ని మార్చుకోవడం అంత సులభం కాదు. మీ ప్రేమగల పరలోక తండ్రి వైపు ముందుకు సాగడానికి తరచుగా మీరు మీ అలవాట్లను, అభ్యాసాలను మరియు సహవాసాలను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
మీరు అతని కుటిల దాడులకు గురయ్యే అవకాశం ఉందని శత్రువుకు తెలుసు. అనేక విధాలుగా మిమ్మల్ని అసంతృప్తికి గురిచేసిన మీ గత జీవితాన్ని ఇప్పుడు అవాస్తవికంగా ఆకర్షణీయంగా కనిపించేలా అతడు చేస్తాడు. ప్రకటన గ్రంథంలో నేరము మోపు వాడైన అపవాది అని పిలువబడే అతడు: “మీ జీవితాన్ని మార్చుకునేంత బలంగా మీరు లేరు; మీరు దీన్ని చేయలేరు; మీరు ఈ జనులకు చెందినవారు కాదు; వారు మిమ్మల్ని ఎప్పటికీ అంగీకరించరు; మీరు చాలా బలహీనంగా ఉన్నారు” అని ధ్వనించే ఆలోచనలతో మిమ్మల్ని ప్రలోభపెడతాడు.
నిబంధన మార్గంలో కొత్తగా నాటబడిన మీకు ఈ ఆలోచనలు నిజమని అనిపిస్తే, అపవాది స్వరాన్ని వినవద్దని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము; మీరు చేయగలరు; మేము మిమ్మల్ని అంగీకరిస్తాము; మరియు రక్షకునియందు సమస్తమును చేయగల శక్తిని మీరు కలిగియుంటారు. మా ప్రేమ మరియు మద్దతు మీకు అత్యంత అవసరమైన సమయంలో, మీరు మీ మునుపటి జీవన విధానంలోకి ఒక అడుగు వెనక్కి వేస్తే మేము మిమ్మల్ని తిరస్కరిస్తామనే ఆలోచనతో మోసపోకండి. యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క సాటిలేని శక్తి ద్వారా, మీరు మళ్ళీ స్వస్థత పొందవచ్చు. కానీ మీరు ఆయన నుండి దాగుకొని, కొత్తగా కనుగొన్న మీ విశ్వాస సమాజానికి దూరంగా ఉంటే, మీరు అధిగమించడానికి అవసరమైన శక్తిని ఇవ్వగల మూలం నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటారు.
ఇటీవల పరివర్తన చెందిన నా ప్రియమైన స్నేహితుడు ఒకరు, ఒంటరిగా విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో పంచుకున్నాడు. సహాయక సమాజంలో భాగం కావడం మరియు దానిలో నిలిచియుండడంలో గొప్ప బలం ఉంది—అందరూ తప్పులు చేస్తారు కానీ యేసు క్రీస్తు ప్రేమచేత దీవించబడి అభివృద్ధి చెందుతూనే ఉంటారు.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు “లోకాన్ని జయించడమనేది ఒకటి, రెండు రోజుల్లో జరిగే సంఘటన కాదు. మనం క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని పదేపదే హత్తుకున్నప్పుడు జీవితకాలంలో అది జరుగుతుంది. అనుదినము పశ్చాత్తాపపడడం మరియు మనకు శక్తిని ప్రసాదించే నిబంధనలను పాటించడం ద్వారా మనం యేసు క్రీస్తునందు విశ్వాసాన్ని వృద్ధిచేస్తాము. మనం నిబంధన బాటపై నిలుస్తాము మరియు ఆత్మీయ బలము, వ్యక్తిగత బయల్పాటు, హెచ్చైన విశ్వాసము మరియు దేవదూతల పరిచర్యతో దీవించబడతాము.”
మీరు శారీరకంగా గాయపడితే, మీ పరిస్థితి క్షీణించిపోతుంది మరియు మీరు సరైన వైద్య సహాయం తీసుకోనట్లైతే అది ప్రాణాంతకం కావచ్చు. ఆధ్యాత్మిక గాయాల విషయంలో కూడా అది నిజం. చికిత్స పొందని ఆధ్యాత్మిక గాయాలు మాత్రమే మీ నిత్య రక్షణకు ముప్పు కలిగిస్తాయి. మిమ్మల్ని ప్రేమించేవారి నుండి మరియు మద్దతునిచ్చేవారి నుండి దాగుకొనవద్దు; బదులుగా, వారి వద్దకు పరిగెత్తండి. మంచి బిషప్పులు, శాఖాధ్యక్షులు మరియు నాయకులు యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క స్వస్థపరిచే శక్తిని పొందడానికి మీకు సహాయపడగలరు.
అజ్ఞాతంలో ఉన్నవారందరిని తిరిగి రమ్మని మేము వేడుకుంటున్నాము. యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు ఆయన ప్రాయశ్చిత్తము అందించేవి మీకు అవసరం మరియు మీరు అందించేవి మాకు అవసరం. దేవునికి మీ పాపములు తెలుసు; మీరు ఆయన నుండి దాచలేరు. ఆయన యెదుట మిమ్మల్ని మీరు సమాధానపరచుకోండి.
ఆయన పరిశుద్ధులుగా మనం, ఆయన మార్గంలో ముందుకు సాగాలని కోరుకునే వారందరినీ ప్రేమించి, అంగీకరించి, ప్రోత్సహించే సంఘానికి చెందియున్నామనే సంస్కృతిని మనలో ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలి.
రెండవ శోధన ఉంది జాగ్రత్త! ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తల సలహాలను అనుసరించండి మరియు ప్రేమగల తండ్రి నుండి మీరు దాగియుండలేరని తెలుసుకోండి.
బదులుగా, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క అద్భుతమైన స్వస్థపరిచే శక్తిని పొందండి. మన ఉనికి యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఇదే—“అన్ని విధములైన బలహీనతలకు లోనయ్యేటటువంటి” బలహీనమైన మరియు మర్త్యమైన శరీరాన్ని పొందడం మరియు విచారకరంగా, అనేక మొదటి శోధనలకు లొంగిపోవడం; ఈ శోధనలకు లొంగిపోయినప్పుడు కూడా మనం పురోగతి సాధించడం; మరియు అలా చేసిన తర్వాత దైవిక సహాయం కోరడం, తద్వారా మనం మన రక్షకునిలా మరియు పరలోక తండ్రిలా మారడం. ఇది ఆయన మార్గము. కేవలము ఇది ఒక్కటే మార్గము. ఈ సత్యాలను గురించి యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.