దేవుని ప్రేమ
రక్షకుడైన యేసు క్రీస్తే దేవుని ప్రేమ అని నేను ఆనందంగా సాక్ష్యమిస్తున్నాను. మన పట్ల ఆయనకున్న ప్రేమ పరిపూర్ణమైనది, వ్యక్తిగతమైనది మరియు శాశ్వతమైనది.
ఒక వేసవిలో మారుమూల ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు, మా కుటుంబం మబ్బులు లేని ఆకాశం క్రింద సాయంత్రం పడుకుంది. పైన స్పష్టంగా కనిపించే అద్భుతమైన పాలపుంత లెక్కలేనన్ని నక్షత్రాలతో మరియు అప్పుడప్పుడు కనిపించే ఉల్కలతో నిండి ఉంది. దేవుని సృష్టి యొక్క మహిమను చూసి మేము ఆశ్చర్యపోతున్నప్పుడు, ఆయనతో భక్తిపూర్వక సంబంధాన్ని మేము అనుభవించాము. హాంకాంగ్‌లో పెరిగిన మా చిన్న పిల్లలు ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటిది అనుభవించలేదు. ఇంటి దగ్గర కూడా మనం ఇదే ఆకాశం క్రింద నివసిస్తున్నామా అని వారు అమాయకంగా అడిగారు. ఇది అదే ఆకాశం అని వారికి వివరించడానికి నేను ప్రయత్నించాను, కానీ ఈ నక్షత్రాలు అక్కడ ఉన్నప్పటికీ మేము నివసించే ప్రదేశంలో ఉన్న గాలి మరియు కాంతి కాలుష్యం వాటిని చూడకుండా మమ్మల్ని నిరోధించింది.
“విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది” అని లేఖనాలు మనకు బోధిస్తాయి. దిక్కుతోచని పరధ్యానాలు మరియు భూసంబంధమైన శోధనలు మన ఆధ్యాత్మిక దృష్టిని కప్పివేసినప్పటికీ, దేవునిపై మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుపై మనం విశ్వాసం ఉంచినప్పుడు, వారి వాస్తవికత మరియు మన పట్ల వారి శ్రద్ధ గురించి మనకు స్పష్టమైన హామీ లభిస్తుంది.
మోర్మన్ గ్రంథములో, ప్రవక్త లీహై “ఒక వృక్షాన్ని చూసాడు, దాని ఫలము ఒకరిని సంతోషపరచుటకు కోరదగినది” మరియు అది “అన్నింటికంటే అత్యంత మధురమైనది.” ఆ ఫలమును తినినప్పుడు, అతని ఆత్మ అత్యంత ఆనందంతో నిండిపోయింది మరియు తన కుటుంబం కూడా దానిని తినవలెనని అతను కోరుకున్నాడు. ఈ వృక్షము “దేవుని ప్రేమ”ను సూచిస్తుందని మనం నేర్చుకుంటాము మరియు లీహై వలె, మనం కూడా దేవుడిని మన జీవితాల్లోకి ఆహ్వానించినప్పుడు ఆయన గురించి ఆనందకరమైన సాక్ష్యాన్ని పొందవచ్చు.
యేసు క్రీస్తు పరలోక తండ్రికి మన పట్ల ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తారు. తన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా, ఆయన మన పాపాలను తనపై వేసుకున్నారు మరియు మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డారు. వ్యక్తిగతంగా ఆయన మన రోగములను భరించారు, మన వ్యసనములను వహించారు మరియు మన బాధలను, రోగములను తనపై తీసుకున్నారు. మనల్ని ఓదార్చడానికి ఆయన పరిశుద్ధాత్మను పంపుతారు మరియు ఆత్మ ఫలాలలో సంతోషము, సమాధానము మరియు విశ్వాసము ఉన్నాయి, అవి మనల్ని నిరీక్షణతో, ప్రేమతో నింపుతాయి.
దేవుని ప్రేమ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ, చాలామంది దాని కోసం హృదయపూర్వకంగా వెదుకుతారు, ఇంకొందరు దేవుని ప్రేమను అనుభవించాలని కోరుకుంటారు కానీ వారు దానికి అర్హులని నమ్మరు. మరికొందరు ఇంకా దానిని అనుభవించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా, మనం పదే పదే పశ్చాత్తాపపడి, యథార్థముగా క్షమించి, ఆయన ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నించినప్పుడు మరియు నిస్వార్థంగా ఇతరులకు సేవ చేసినప్పుడు మనం దేవుని ప్రేమను స్థిరంగా అనుభవించగలమని లేఖనాలు మరియు ప్రభువు యొక్క ప్రవక్త మనకు బోధిస్తున్నారు. మనల్ని దేవునికి దగ్గరగా చేసే పనులు, అంటే ప్రార్థన మరియు లేఖన అధ్యయనం ద్వారా ప్రతిరోజూ ఆయనతో సంభాషించడం వంటివి మనం చేసినప్పుడు మరియు ఆయన నుండి మనల్ని దూరం చేసే పనులు, అంటే గర్వంగా, వివాదాస్పదంగా మరియు తిరుగుబాటుదారులుగా ఉండడం వంటివి చేయడాన్ని మానివేసినప్పుడు మనం దేవుని ప్రేమను అనుభవిస్తాము.
“రక్షకుడి సహాయంతో, మన జీవితాలలో పాత శిధిలాలను తొలగించమని” మరియు “పగను విడిచిపెట్టమని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని ఆహ్వానించారు. “మన జీవితాలను [రక్షకుని]పై మరియు ఆయన దేవాలయ విధులు మరియు నిబంధనలపై కేంద్రీకరించడం” ద్వారా “మన ఆధ్యాత్మిక పునాదులను బలోపేతం చేసుకోవాలని” ఆయన మనల్ని ప్రోత్సహించారు. “మనం మన దేవాలయ నిబంధనలను పాటించినప్పుడు, ప్రభువు యొక్క బలపరిచే శక్తిని మనం ఎక్కువగా పొందుతాము. … యేసు క్రీస్తు మరియు మన పరలోక తండ్రి యొక్క స్వచ్ఛమైన ప్రేమను మనం అత్యధికంగా అనుభవిస్తాము!” అని ఆయన వాగ్దానం చేసారు.
నాకొక స్నేహితుడున్నాడు, అతను అందమైన కుటుంబం మరియు మంచి ఉద్యోగంతో దీవించబడ్డాడు. అనారోగ్యం కారణంగా అతను పని చేయలేకపోయి, ఆ తర్వాత విడాకులు తీసుకున్నప్పుడు అంతా మారిపోయింది. అప్పటినుండి రోజులు కష్టంగా గడిచాయి, కానీ తన పిల్లల పట్ల అతనికి ఉన్న ప్రేమ మరియు అతను దేవునితో చేసిన నిబంధనలు అతన్ని కాపాడాయి. ఒక రోజు తన మాజీ భార్య తిరిగి వివాహం చేసుకుందని మరియు వారి దేవాలయ ముద్రను రద్దు చేయాలని కోరిందని అతను తెలుసుకున్నాడు. అతను ఇబ్బంది పడ్డాడు మరియు గందరగోళంలో ఉన్నాడు. అతను ప్రభువు యొక్క మందిరంలో శాంతి మరియు అవగాహన కోసం ప్రయత్నించాడు. అతను దేవాలయానికి వెళ్ళివచ్చిన తర్వాతి రోజు, అతని నుండి నేను ఈ క్రింది సందేశాన్ని అందుకున్నాను:
“నిన్న రాత్రి దేవాలయంలో నాకు అద్భుతమైన అనుభవం ఎదురైంది. నాలో ఇంకా కోపం పోలేదని స్పష్టంగా తెలుస్తోంది … నేను మారాలని నాకు తెలుసు మరియు దానికోసం నేను వారమంతా ప్రార్థిస్తున్నాను. … నిన్న రాత్రి దేవాలయంలో ఆత్మ నా హృదయం నుండి కోపాన్ని తొలగిస్తున్నట్లు నేను నిజంగా భావించాను. … దాని నుండి విముక్తి పొందడం చాలా ఉపశమనం కలిగించింది. … నేను మోస్తున్న భయంకరమైన భారం తొలగిపోయింది.”
అతనికి ఇంకా సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రభువు యొక్క మందిరంలో జరిగిన ఆ అనుభవాన్ని నా స్నేహితుడు విలువైనదిగా భావిస్తాడు, అక్కడ దేవుని ప్రేమ యొక్క విమోచనా శక్తి దేవునికి దగ్గరగా భావించడానికి, జీవితంపై మరింత ఆశతో ఉండడానికి మరియు తన భవిష్యత్తు గురించి తక్కువ ఆందోళన చెందడానికి అతనికి సహాయపడింది.
మనం దేవుని ప్రేమను అనుభవించినప్పుడు, మన భారములను సునాయాసముగా భరించగలము మరియు సంతోషముతోను సహనముతోను ఆయన చిత్తానికి లోబడగలము. దేవుడు మనతో చేసిన నిబంధనలను గుర్తుంచుకుంటారని, మన శ్రమలలో మనల్ని దర్శిస్తారని మరియు దాస్యం నుండి మనల్ని విడిపిస్తారని మనకు నమ్మకం ఉంది. మనం అనుభవించే ఆనందాన్ని మన కుటుంబంతో మరియు ప్రియమైనవారితో పంచుకోవాలని మనం కూడా కోరుకుంటాము. లీహై కుటుంబం మాదిరిగానే, ప్రతి వ్యక్తికి ఫలాన్ని తినాలా వద్దా అని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది, కానీ మనం ప్రేమించే వారు దేవుని ప్రేమను అనుభవించే విధంగా ప్రేమించడం, పంచుకోవడం మరియు ఆహ్వానించడం మనకు గల అవకాశం.
దేవుని ప్రేమను ఇతరులు అనుభూతి చెందడానికి సహాయపడేందుకు, మనం వినయము, దాతృత్వము, కనికరము మరియు సహనము వంటి క్రీస్తు లక్షణాలను మనలో పెంపొందించుకోవాలి మరియు దేవుణ్ణి ప్రేమించడం, మన పొరుగువారిని ప్రేమించడం అనే రెండు గొప్ప ఆజ్ఞలను పాటించడం ద్వారా ఇతరులను రక్షకుని వైపు మళ్లించడంలో సహాయపడాలి.
మా అబ్బాయిలలో ఒకరు తన యుక్తవయస్సులో చెందియుండడం మరియు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాలలో ఇబ్బంది పడ్డారు. నా భార్య, నేను అతనికి ఎలా సహాయం చేయాలో తెలుసుకోవడానికి ప్రార్థించాము మరియు ప్రభువు మా నుండి కోరుకున్నవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒక రోజు, మా అబ్బాయితో కలిసి నేను సందర్శించగలిగేలా అవసరంలో ఉన్న వారెవరైనా మీకు తెలుసా అని మా పెద్దల సమూహ అధ్యక్షుడిని అడగాలని నేను ప్రేరేపించబడ్డాను. కొంచెం ఆలోచించిన తర్వాత, చాలా ఆరోగ్య సమస్యలు ఉన్న ఒక స్త్రీని దర్శించమని, శాఖాధ్యక్షుని అనుమతితో ప్రతీవారం ఆమెకు సంస్కారాన్ని ఇవ్వమని ఆయన మాకు చెప్పారు. నేను సంతోషించాను, కానీ మా అబ్బాయి ఈ వారపు నిబద్ధతకు ఎలా స్పందిస్తాడో అని ఆందోళన చెందాను.
మా మొదటి సందర్శనలో, ఈ ప్రియమైన మహిళను చూసి చాలా బాధపడ్డాము, ఎందుకంటే ఆమె నిరంతరం బాధలో ఉంది. సంస్కారం కొరకు ఆమె చాలా కృతజ్ఞురాలిగా ఉంది మరియు మేము ఆమెను, ఆమె భర్తను సందర్శించడాన్ని ఆనందించాము. కొన్ని సందర్శనల తర్వాత, ఒక ఆదివారం నేను దూరంగా ఉండి, మా అబ్బాయితో పాటు వెళ్ళలేకపోయాను, కానీ మా నియామకాన్ని అతనికి గుర్తు చేసాను. నేను ఇంటికి చేరుకున్నప్పుడు, సందర్శన ఎలా జరిగిందో వినడానికి నేను ఆతృతగా ఉన్నాను. తన సహవిద్యార్థులకు ఇలాంటి మంచి పనులు చేసే అవకాశం ఉండకపోవచ్చని మా అబ్బాయి బదులిచ్చాడు. మరియు సహాయం కోసం తన సోదరుడిని తనతో తీసుకువచ్చాడని, సంస్కారం సజావుగా జరిగిందని అతను వివరించాడు, అయితే ఈ ప్రియమైన సహోదరి ఆ వారంలో విచారంగా ఉంది, ఎందుకంటే సినిమాలు చూడడానికి ఆమె తన స్నేహితులను ఇంటికి ఆహ్వానించింది, కానీ ఆమె వీడియో ప్లేయర్ పనిచేయలేదు. మా అబ్బాయి ఆన్‌లైన్‌లో శోధించి, సమస్యను కనుగొని, ఆమె కోసం వెంటనే దాన్ని పరిష్కరించానని చెప్పాడు. ఆమెను సంతోషపెట్టే పని చేయడానికి అతను ఉపయోగకరంగా, సంతోషంగా మరియు నమ్మకంగా భావించాడు. అతని పట్ల దేవుని ప్రేమను అతను అనుభవించాడు.
మీరు ఎంత ప్రయత్నించినా జీవితంలో కష్టాలు ఎదురవుతుంటే, మీ ప్రార్థనలు వినబడలేదని మీరు భావిస్తే లేదా దేవుని ప్రేమను మీరు అనుభవించలేకపోతే, దయచేసి మీ ప్రతీ ప్రయత్నం ముఖ్యమైనదని మరియు పైన ఉన్న నక్షత్రాల వలె ఖచ్చితంగా, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మిమ్మల్ని ఎరుగుదురని, వింటారని మరియు ప్రేమిస్తారని తెలుసుకోండి.
ఒక సందర్భంలో ఆయన శిష్యులు ఒక పడవలో “అలలచేత కొట్టబడుతున్నప్పుడు”, రక్షకుడు నీటిపై వారి వైపుకు నడిచి, “ధైర్యము తెచ్చుకొనుడి; నేనే; భయపడకుడి” అని వారికి హామీ ఇచ్చారు. పేతురు నీటిపై రక్షకుని వద్దకు నడిచి రావాలనుకున్నప్పుడు, యేసు “రమ్మని” అతనికి సైగ చేసారు. పేతురు తన చూపు మరల్చి మునిగిపోవడం ప్రారంభించినప్పుడు, రక్షకుడు వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, “అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివి?” అంటూ అతన్ని కాపాడారు.
మన జీవితాల్లో కష్టాలు ఎదురైనప్పుడు, మనం సంతోషంగా మరియు ధైర్యంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామా? రక్షకుడు మనల్ని విడిచిపెట్టరని మరియు బహుశా మనం ఇంకా గుర్తించని మార్గాల్లో ఆయన మనకు దగ్గరగా ఉన్నారని మనం ఎలా గుర్తుంచుకోగలము? ముఖ్యంగా మన ముందున్న మార్గం అసాధ్యంగా అనిపించినప్పుడు మనం విశ్వాసంతో ఆయన వద్దకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామా? శ్రమలను, సవాళ్ళను జయించడానికి ఆయన మనకు ఏ విధాలుగా సహాయపడతారు? “సందేహించకుండా, భయపడకుండా, మనం విశ్వాసంతో ప్రతి ఆలోచనలో ఆయన వైపు ఎలా చూడగలము?
మీ జీవితంలో దేవుని ప్రేమను మరింత సమృద్ధిగా అనుభవించాలనుకుంటే, ఈ క్రింది వాటిని పరిగణించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను:
-
మొదటిది, మీరు దేవుని బిడ్డ అని గుర్తుచేసుకోవడానికి తరచుగా విరామం తీసుకోండి మరియు మీరు కృతజ్ఞతతో ఉన్న విషయాల గురించి ఆలోచించండి.
-
రెండవది, మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు ఆయన ప్రేమను అనుభవించాల్సిన అవసరం ఉందో తెలుసుకోవడానికి పరలోక తండ్రిని సహాయం చేయమని అడగుతూ ప్రతిరోజూ ప్రార్థించండి.
-
మూడవది, ఆ వ్యక్తి దేవుని ప్రేమను అనుభవించేందుకు సహాయం చేయడానికి మీరు ఏమి చేయగలరో హృదయపూర్వకంగా అడగండి.
-
మరియు నాల్గవది, మీరు అందుకున్న ప్రేరేపణపై వెంటనే చర్య తీసుకోండి.
మనం నిరంతరం ఇతరుల తరఫున ప్రార్థిస్తూ, అడుగుతూ ఉంటే, మనం సహాయం చేయగల వ్యక్తులను దేవుడు మనకు చూపిస్తారు. మనం వెంటనే చర్య తీసుకుంటే, ఆయన వారి ప్రార్థనలకు సమాధానం ఇచ్చే మార్గంగా మనం మారగలం. అలా చేయడం ద్వారా, కాలక్రమేణా, మన ప్రార్థనలకు మనం సమాధానాలు పొందుతాము మరియు మన స్వంత జీవితాల్లో దేవుని ప్రేమను అనుభవిస్తాము.
కొన్ని నెలల క్రితం వియత్నాంలో ప్రయాణిస్తున్నప్పుడు, నేను, నా భార్య ఒక భారీ తుఫానులో బయలుదేరిన విమానంలో ఉన్నాము. కుదుపులు తీవ్రంగా ఉన్నాయి మరియు మా కిటికీ నుండి నల్లని మేఘాలు, భారీ వర్షం మరియు మెరుపులు కనిపించాయి. సుదీర్ఘమైన మరియు అస్థిరమైన ఆరోహణ తర్వాత, మా విమానం చివరకు తుఫాను మేఘాలను దాటి వెళ్ళి అద్భుతమైన దృశ్యానికి తెరతీసింది. మన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గురించి మాకు మరోసారి గుర్తుకు వచ్చింది మరియు వారి గొప్ప ప్రేమను మేము అనుభవించాము.
ప్రియమైన స్నేహితులారా, దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తిగా నేను, రక్షకుడైన యేసు క్రీస్తే దేవుని ప్రేమ అని ఆనందంగా సాక్ష్యమిస్తున్నాను. మన పట్ల ఆయనకున్న ప్రేమ పరిపూర్ణమైనది, వ్యక్తిగతమైనది మరియు శాశ్వతమైనది. మనం విశ్వాసంతో ఆయనను అనుసరిస్తున్నప్పుడు, మనం ఆయన ప్రేమతో నింపబడదాం మరియు ఇతరులను ఆయన ప్రేమ వైపు నడిపించే దీపస్తంభంగా ఉందాం. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.