చిన్నబిడ్డ వలె
పసిపిల్లలు, పిల్లలు మరియు యౌవనులు భూమిపై దేవుని రాజ్యం యొక్క బల, సౌందర్యముల యొక్క ప్రతిరూపాలు అని నేను సాక్ష్యమిస్తున్నాను.
యేసు తన అపొస్తలుల శిక్షణను తీవ్రతరం చేయడం ద్వారా తన మర్త్య జీవితంలోని చివరి సంవత్సరాన్ని ప్రారంభించారు. ఆయన సందేశము మరియు ఆయన సంఘము కొనసాగాలంటే, కేవలం 24 నెలలుగా మాత్రమే ఆయనను ఎరిగియున్న 12 మంది అతిసాధారణ వ్యక్తులకు మరిన్ని విషయాలు బోధించబడాలి.
ఒకరోజు యేసు పన్నెండుమంది మధ్య జరిగిన వాదనను చూసి, “ మీలో మీరు దేనిని గూర్చి వాదించుచున్నారు?” అని అడిగారు. అటువంటి వాదన గురించి స్పష్టంగా సిగ్గుపడి, వారు “ఊరకుండిరి” అని గ్రంథము చెబుతోంది. కానీ అందరికంటే గొప్పవాడైన ఈ బోధకుడు వారి హృదయాలోచన ఎరిగి, అక్కడ వ్యక్తిగత గర్వం యొక్క మొదటి వ్యక్తీకరణను గ్రహించారు. కాబట్టి ఆయన “ఒక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచారు, …
“మరియు ఇట్లు చెప్పారు–మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
“కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.”
క్రీస్తు పుట్టడానికి ముందే, బెంజమిన్ రాజు యొక్క వీడ్కోలు ప్రసంగంలో కూడా పిల్లల వినయంపై ఈ లోతైన వ్యాఖ్య ఉందని గమనించాలి. అది ఇలా చెప్తుంది, “ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా పరిశుద్ధుడైయుండి, చిన్నపిల్లవాని వలె విధేయుడై, … వినయము కలిగి, … ప్రేమతో నిండి, పిల్లవాడు తన తండ్రికి [స్పందించునట్లుగా] అయితే తప్ప ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవునికి శత్రువైయున్నాడు, ఉండియుంటాడు మరియు నిరంతరము ఉండును.”
ఇప్పుడు, మనము ఎల్లప్పుడూ ప్రోత్సహించని కొన్ని అపరిపక్వమైన “అవగాహనలు” స్పష్టంగా ఉన్నాయి. ఇరవై-ఐదు సంవత్సరాల క్రితం, అప్పటి నా మూడేళ్ల మనవడు ఐదేళ్ల తన అక్క చేతిని కొరికాడు. ఆ రాత్రి పిల్లల్ని చూసుకుంటున్న నా అల్లుడు, క్షమాపణ గురించి అతను ఆలోచించగలిగే అన్ని పాఠాలను అక్కడికక్కడే ఉద్వేగంతో బోధించాడు, చేయిపై కొరికితే ఎలా ఉంటుందో చిన్న తమ్ముడికి బహుశా తెలియకపోవచ్చు అని ముగించాడు. ఆ తప్పుడు ఆలోచనతో కూడిన తండ్రి వ్యాఖ్య బహుశా ఒకటి ఒకటిన్నర నిమిషాల పాటు అందంగా పనిచేసింది, పిల్లల పడకగది నుండి కిటికీలు అదిరేటంత గట్టి కేక వినిపించేవరకు, అక్కడ నా మనవరాలు “ఇప్పుడు తెలిసింది” అని ప్రశాంతంగా చెప్పింది.
అయితే, పిల్లల జీవితంలోని ప్రాథమిక స్థాయిలో ఉన్న సుగుణాలలో మనం ఏమి చూడాలి? మోర్మన్ గ్రంథమంతటిలోనూ అత్యంత సున్నితమైన సన్నివేశంలో క్రీస్తును కన్నీళ్లు పెట్టించినది ఏమిటి? ఆ పిల్లలను చుట్టుముట్టడానికి పరలోకము నుండి అగ్నిని మరియు కాపాడే దేవదూతలను పిలిచి, “[వారి] చిన్నపిల్లలను చూడమని” పెద్దలను ఆజ్ఞాపించినప్పుడు యేసు ఏమి బోధిస్తున్నారు?
వీటన్నింటికీ కారణమేమిటో మనకు తెలియదు, కానీ అది వారి స్వచ్ఛత, అమాయకత్వం, వారి సహజ వినయంతో మరియు వారి నుండి మనం నేర్చుకోగలిగే దానితో సంబంధం కలిగి ఉందని నేను అనుకుంటున్నాను.
నిరాశాజనకమైన మన రోజులను ఒకరు “వ్యర్థము; సమస్తము వ్యర్థమే” అని ఎందుకు పిలిచారు? లీహై దర్శనంలో ఆధ్యాత్మికంగా నిర్జీవంగా ఉన్న పెద్ద విశాలమైన భవనాన్ని “మనుష్య సంతానపు వ్యర్థమైన ఊహలు మరియు గర్వము” అనే పదాలు ఎలా వర్ణిస్తాయి? మరియు గర్వంతో ప్రార్థించిన ఆ జోరమీయుల గుంపు? వారి గురించి ఆల్మా ఇలా అన్నాడు, “ఓ దేవా, తమ నోళ్ళతో వారు నీకు [మొరపెట్టుచున్నారు], కానీ లోకము యొక్క వ్యర్థమైన సంగతులతో బహుగా వారు తమను హెచ్చించుకొనుచున్నారు.”
దానికి విరుద్ధంగా, ప్రార్థన చేస్తున్న పిల్లవాడి కంటే మధురమైనది, స్వచ్ఛమైనది లేదా వినయపూర్వకమైనది ఏదైనా ఉందా? స్వర్గం ఆ గదిలో ఉన్నట్లుగా ఉంటుంది. దేవుడు మరియు క్రీస్తు వారికి నిజమైన వ్యక్తులు, కానీ తర్వాత ఇతరులకు ఆ ప్రార్థన అంత ముఖ్యమైనది కాకపోవచ్చు.
60 ఏళ్ళ క్రితం ఎల్డర్ రిఛర్డ్ ఎల్. ఎవాన్స్ వ్యాఖ్యానించినట్లుగా: “మనలో చాలా మంది క్రైస్తవులమని చెప్పుకుంటారు, అయినప్పటికీ మనం… ఆయనను తీవ్రంగా పరిగణించము. … మనం ఆయనను గౌరవిస్తాము, కానీ మనం ఆయనను అనుసరించము. … మనం ఆయన మాటలను వ్యాఖ్యానిస్తాము, కానీ మనం వాటి ప్రకారం జీవించము.” “మనం ఆయనను మెచ్చుకుంటాము, కానీ మనం ఆయనను ఆరాధించము.”
ఎప్పటికప్పుడు లోకం యేసును గౌరవించి, ఆయన పేరును కేవలం ఒక ఊతపదంగా ఉపయోగించకుండా ఉంటే జీవితం చాలా భిన్నంగా ఉండేది.
కానీ పిల్లలు నిజంగా ఆయనను ప్రేమిస్తారు మరియు ఆ ప్రేమ జీవితమనే ఆట స్థలంలో వారి ఇతర సంబంధాలలోకి కూడా వ్యాపిస్తుంది. సాధారణంగా, పిల్లలు వారి చిన్నతనంలో కూడా చాలా తేలికగా ప్రేమిస్తారు, చాలా సులభంగా క్షమిస్తారు, చాలా ఆనందంగా నవ్వుతారు, దానివల్ల ఉదాసీనమైన, కఠినమైన హృదయం కూడా కరిగిపోతుంది.
సరే, సుగుణాల జాబితా ఇంకా ఇంకా కొనసాగుతుంది. స్వచ్ఛత? నమ్మకము? ధైర్యము? నిజాయితీ?
నా యువ స్నేహితుడు దేవుని ముందు ప్రదర్శించిన వినయాన్ని చూడడానికి నాతో రండి.
2025, జనవరి 5న—91 రోజుల క్రితం—ఈస్టన్ డేరిన్ జాలీకి అహరోను యాజకత్వం అనుగ్రహించబడింది మరియు అతడు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో పరిచారకునిగా నియమించబడ్డాడు.
తనకు గుర్తున్నంత వరకు ఈస్టన్ ప్రభురాత్రి భోజనం అనే సంస్కారమును అందించాలని బలంగా కోరుకున్నాడు. కానీ ఈ పవిత్ర అవకాశంతో పాటు తాను విఫలమవుతాడేమో, పడిపోతాడేమో, తనను ఆటపట్టిస్తారేమో లేదా తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెడతారేమో అని కడుపులో తిప్పేటంత భయం కూడా ఉంది.
చూడండి, ఈస్టన్‌కు అరుదైన, చాలా వినాశకరమైన వ్యాధి ఉంది, అది పుట్టుకతో వచ్చే కండరాల బలహీనత. అది భవిష్యత్తుపై అతని ఆశలను, కలలను చిన్నాభిన్నం చేస్తూ, అతని యవ్వనాన్ని క్రమంగా భయంకరమైన సవాళ్లతో నింపింది. త్వరలో అతను శాశ్వతంగా చక్రాలకుర్చీకే అంకితమైపోతాడు. ఆ తర్వాత అతనికి ఏమి జరుగుతుందనే దాని గురించి అతని కుటుంబం మాట్లాడదు.
అతని నియామకం తర్వాతి ఆదివారం, ఈస్టన్ మొదటిసారిగా సంస్కారాన్ని అందజేయవలసి ఉంది. అతని వ్యక్తిగత ప్రేరణ ఏమిటంటే, అతడు తనను మరియు ఈ పవిత్ర చిహ్నాలను వార్డు బిషప్పు అయిన తన తండ్రికి సమర్పించగలడు. ఆ పనిని ఊహించి, ఎవ్వరూ, ఎవ్వరూ తనకు సహాయం చేయడానికి ప్రయత్నించరనే హామీని పొందడానికి, అతను అర్థించాడు, విజ్ఞప్తి చేసాడు, ఏడ్చాడు మరియు వేడుకున్నాడు. చాలా వ్యక్తిగత కారణాల వల్ల, అతను దాన్ని ఒంటరిగా మరియు సహాయం లేకుండా చేయాల్సి వచ్చింది.
యాజకుడు క్రీస్తు యొక్క విరిగిన శరీరానికి చిహ్నంగా ఉన్న—రొట్టెను విరిచి—దానిని ఆశీర్వదించిన తర్వాత, ఈస్టన్, తన విరిగిన శరీరంతో తన పళ్ళెమును అందుకోవడానికి ముందుకు వచ్చాడు. అయితే, సమావేశ మందిరపు నేల నుండి ఎత్తైన వేదిక వరకు మూడు పెద్ద మెట్లు ఉన్నాయి. కాబట్టి, తన పళ్ళెమును అందుకున్న తర్వాత, అతను వీలైనంత ఎత్తుకు చేయి చాపి, దానిని హ్యాండ్‌రైల్ పైన పెట్టాడు. అప్పుడు, ఎత్తైన మెట్లలో ఒకదానిపై కూర్చుని, రెండు చేతులతో తన కుడి కాలును మొదటి మెట్టుపైకి లాగాడు. తరువాత అతను తన ఎడమ కాలును అదే మెట్టుపైకి లాగి, అలా పైకి లేచి, ఎంతో కష్టమైన తన వ్యక్తిగత మూడు మెట్ల ఎవరెస్ట్ పర్వత శిఖరానికి చేరుకున్నాడు.
అప్పుడు అతను నిలబడడానికి వీలుగా ఒక నిర్మాణాత్మక స్తంభానికి ఆనుకున్నాడు. మళ్ళీ పళ్ళెమును తీసుకున్నాడు. మరికొన్ని అడుగులు వేసి, అతను బిషప్పు ముందు నిలబడ్డాడు, ఆయన కళ్ళు చెమర్చి, ముఖం మీద కన్నీళ్లు కారుతుండగా, ఈ పరిపూర్ణ ధైర్యవంతుడు మరియు నమ్మకమైన కొడుకును హత్తుకోకుండా ఆయన తనను తాను నిగ్రహించుకోవలసి వచ్చింది. మరియు ఈస్టన్, తన ముఖంలో ఉపశమనంతో కూడిన విశాలమైన చిరునవ్వుతో, “నేను [నా తండ్రిని] మహిమపరిచాను మరియు [ఆయన] నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసాను” అని చెప్పి ఉండవచ్చు.
విశ్వాసం, విధేయత, స్వచ్ఛత, నమ్మకం, గౌరవం మరియు చివరికి, అతను సంతోషపెట్టాలనుకున్న ఆ తండ్రి పట్ల ప్రేమ. ఇవి మరియు ఒక డజను ఇతర లక్షణాలు, “ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు” అని మనం కూడా చెప్పేలా చేస్తాయి.
సహోదరీ, సహోదరులారా మరియు స్నేహితులారా, నాకు తెలిసిన అత్యంత అందమైన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారు శిశువులు, పిల్లలు మరియు యువత, వారు ఈ రోజు మనం ప్రస్తావించిన వారిలాగే మనస్సాక్షి గలవారు మరియు అమూల్యమైనవారు. వారు భూమిపై దేవుని రాజ్యం యొక్క బల, సౌందర్యములతో వర్థిల్లుతున్న ప్రతిరూపాలు అని నేను సాక్ష్యమిస్తున్నాను.
అదే సాక్ష్యం యొక్క స్ఫూర్తితో, జోసెఫ్ స్మిత్ తన యవ్వనంలో తాను చూసానని చెప్పిన వాటిని చూశాడని మరియు తాను మాట్లాడానని చెప్పిన వారితో సంభాషించాడని నేను సాక్ష్యమిస్తున్నాను. వినయముగల మరియు స్వచ్ఛమైన రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు దేవునిచేత నియమించబడిన మరియు ప్రతిభావంతుడైన ప్రవక్త మరియు దీర్ఘదర్శి అని నేను సాక్ష్యమిస్తున్నాను. జీవితాంతం నిరంతరం చదివిన తర్వాత, మోర్మన్ గ్రంథము నేను ఇప్పటివరకు చదివిన అత్యంత ప్రతిఫలదాయకమైన గ్రంథము అని మరియు అనేక నివాసములు గల రాజ్యంలో నా చిన్న నివాసానికి కీలకమైనదని నేను సాక్ష్యమిస్తున్నాను. యాజకత్వము మరియు ప్రార్థన—క్రీస్తు యొక్క యాజకత్వము మరియు మీ ప్రార్థనలు నా జీవితాన్ని పునఃస్థాపిస్తున్నాయని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇదంతా నిజమని నాకు తెలుసు మరియు విధేయులైన కుమారులందరిలో గొప్పవాడైన—అల్ఫాయు ఓమెగయు, ఘనమైన ఉన్నవాడును, సిలువ వేయబడినవాడును, నమ్మకమైన సాక్షియు—ప్రభువైన యేసు క్రీస్తు నామములో దీని గురించి నేను మీకు సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.