మన పరలోక మార్గదర్శక వ్యవస్థ
మనం మన జీవితాలను యేసు క్రీస్తుపై కేంద్రీకరించినప్పుడు, అంతము వరకు సహిస్తూ, చివరి వరకు ఆనందిస్తూ మనం పరలోకానికి తిరిగి వెళ్ళగలుగుతాము.
26 సంవత్సరాల వయసులో నేను, చిలీలో ఉన్న నా ప్రియమైన ఫ్రూటిల్లర్‌లో బాప్తిస్మం తీసుకున్నప్పుడు యేసు క్రీస్తు నా జీవితాన్ని మార్చారు. ఆ సమయంలో, నా ఉద్యోగం నన్ను అందమైన చిలీలోని పటగోనియాలో ఉన్న సముద్రం, నదులు మరియు సరస్సుల మీదుగా ప్రయాణించేలా చేసింది. నా బాప్తిస్మం తర్వాత, నా పనిని, నా జీవితాన్ని నేను కొత్తగా మరియు భిన్నంగా చూశాను, “సమస్తమును ఒక దేవుడున్నాడని సూచించుచున్నవి” అని నిజంగా గుర్తించాను.
ప్రకృతిలో, సాల్మన్ చేపలు నదుల మూలంలో పుడతాయి. వాటి జీవితంలో ఏదో ఒక సమయంలో, అవి సముద్రాన్ని చేరుకోవడానికి నది గుండా ఈదవలసి ఉంటుంది, అక్కడ వాటి అభివృద్ధికి అవసరమైన పోషణను, పరిస్థితులను అవి కనుగొంటాయి.
కానీ సముద్రం కూడా ప్రమాదకరమైన ప్రదేశం, అక్కడ మాంసాహార జలజంతువులు దాగి ఉంటాయి మరియు జాలరులు వాటికి పోషణనివ్వని ఆహారాన్ని అనుకరించే మెరిసే గాలములతో సాల్మన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అవి ఈ ముప్పులను తట్టుకోగలిగితే, కొత్త మరియు తెలిసిన కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ నది మూలానికి, అవి జన్మించిన ప్రదేశానికి తిరిగి రావడానికి తమ శక్తివంతమైన మార్గదర్శక వ్యవస్థను ఉపయోగించడానికి అవి సిద్ధంగా ఉంటాయి. శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా వాటి వలస ప్రవర్తనను అధ్యయనం చేశారు మరియు అవి GPS లాంటి అయస్కాంత పటాన్ని ఉపయోగిస్తాయని కనుగొన్నారు, అది అద్భుతమైన ఖచ్చితత్వంతో గమ్యానికి చేరడానికి వాటికి మార్గం చూపిస్తుంది.
మనమందరం ఒక రోజు మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ పరలోక గృహానికి తిరిగి వెళ్ళగలము. సాల్మన్ చేపలాగే, మనల్ని అక్కడికి నడిపించడానికి మన స్వంత అయస్కాంత పటం—లేదా “క్రీస్తు యొక్క వెలుగు”ను మనం కలిగియున్నాము. “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు,” అని యేసు తన శిష్యులకు బోధించారు.
మనం మన జీవితాలను యేసు క్రీస్తుపై కేంద్రీకరించినప్పుడు, అంతము వరకు సహిస్తూ, చివరి వరకు ఆనందిస్తూ మనం పరలోకానికి తిరిగి వెళ్ళగలుగుతాము. “మనము అనుభవించు సంతోషము మన జీవితపు పరిస్థితులతో పెద్దగా సంబంధము కలిగిలేదు, కానీ మన జీవితాల దృష్టితో పూర్తి సంబంధము కలిగియున్నది” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు.
మన దైవిక స్వభావం మరియు భవితవ్యం
కుటుంబ ప్రకటనలో మనమిలా చదువుతాము, “[మనలో] ప్రతీ ఒక్కరు పరలోక తల్లిదండ్రులకు ప్రియమైన ఆత్మ కుమారుడు లేదా కుమార్తె అయ్యున్నారు మరియు అటులనే ప్రతీ ఒక్కరు దైవిక స్వభావమును, గమ్యమును కలిగియున్నారు. పూర్వమర్త్య జీవితములో ఆత్మ కుమారులు మరియు కుమార్తెలు దేవుడిని వారి నిత్యుడగు తండ్రిగా ఎరిగి, ఆరాధించారు మరియు ఆయన ప్రణాళికను అంగీకరించారు, తద్వారా ఆయన పిల్లలు భౌతిక శరీరమును పొందగలరు, పరిపూర్ణత వైపు సాగిపోవు భూలోక అనుభవమును గడించగలరు మరియు చివరకు నిత్య జీవపు వారసులుగా వారి దైవిక గమ్యమును చేరుకోగలరు.”
యేసు క్రీస్తు మర్త్యత్వంలో పుట్టకముందే మోషేకు కనిపించి, తండ్రి తరఫున అతనితో మాట్లాడారు. మోషే చేయడానికి గొప్ప కార్యమును ఆయన కలిగియున్నారని చెప్పారు. ఆ సమావేశంలో, ప్రభువు అతన్ని “నా కుమారుడా” అని చాలాసార్లు పిలిచారు.
ఆ అనుభవం తర్వాత, సాతాను అతడిని శోధించడానికి వచ్చి ఇలా అన్నాడు: “మనుష్య కుమారుడవైన మోషే, నన్ను ఆరాధించుము.”
మోషే ఆ శోధనకు ప్రతిస్పందనగా తన దైవిక స్వభావాన్ని గుర్తుచేసుకొని, ఇలా అన్నాడు: “నీవెవడవు? ఏలయనగా ఇదిగో, నేను దేవుని కుమారుడను.” సత్యము శత్రువు యొక్క ముట్టడి నుండి మోషేను విడిపించింది.
సహోదర సహోదరీలారా, మర్త్యత్వపు గాలములు నిజమైనవి. అవి తరచుగా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ అవి తండ్రి వద్దకు మరియు నిత్యజీవానికి నడిపించే జీవజలాల మార్గం నుండి మనల్ని బయటకు లాగడమనే ఒకే ఒక లక్ష్యాన్ని కలిగియుంటాయి.
మర్త్యత్వపు గాలములు ఎంత వాస్తవమైనవి కాగలవో నాకు తెలుసు. కొత్తగా పరివర్తన చెందిన వ్యక్తిగా, ఒక ఆదివారం నేను యాజకత్వ తరగతికి బోధిస్తున్నప్పుడు కలతపెట్టే ఒక సంభాషణ తలెత్తింది. నా పాఠాన్ని పూర్తి చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను అవమానంగా భావించి, నేనే బాధితుడిని అనుకున్నాను. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కొంతకాలం సంఘానికి తిరిగి రాకూడదనే ఆలోచనతో బయటకు వెళ్ళబోయాను.
ఆ సమయంలోనే యాజకత్వం కలిగియున్న ఒకతను చింతిస్తూ నా ముందు నిలబడ్డాడు. తరగతిలో మేము ఎదుర్కొన్న పరిస్థితిపై కాకుండా, క్రీస్తుపై దృష్టి పెట్టమని అతను ప్రేమగా నన్ను ఆహ్వానించాడు. అతనితో నాకు కలిగిన అనుభవాన్ని నేను గుర్తుచేసుకున్నప్పుడు, “అతని వెంట వెళ్ళు; అతను నాకు ముఖ్యమైనవాడు” అని ఒక స్వరం తనతో చెప్పడం విన్నాడని అతను నాతో పంచుకున్నాడు.
నా ప్రియమైన స్నేహితులారా, మనం అందరం ఆయనకు ముఖ్యమైన వాళ్ళం. “దేవునితో మన నిబంధన కారణంగా, మనకు సహాయం చేయడానికి ఆయన చేసే ప్రయత్నాలలో ఆయన ఎప్పటికీ అలసిపోరు మరియు మనపై కరుణతో కూడిన ఆయన సహనాన్ని మనం ఎప్పటికీ పోగొట్టుకోము” అని అధ్యక్షులు నెల్సన్ బోధించారు. మన దైవిక స్వభావం మరియు దేవునితో నిబంధన సంబంధం దైవిక సహాయం పొందేందుకు మనకు అర్హతను ఇస్తాయి.
పోషణ యొక్క అవసరము
సాల్మన్ చేపలు పెరగడానికి సముద్రంలో పోషణ అవసరమైనట్లే, ఆధ్యాత్మిక పోషకాహార లోపంతో చనిపోకుండా ఉండడానికి మనం కూడా ఆధ్యాత్మికంగా మనల్ని మనం పోషించుకోవాలి. ప్రార్థన, లేఖనాలు, దేవాలయం మరియు ఆదివారం సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావడం మన ఆధ్యాత్మిక భోజనసూచికలో చాలా ముఖ్యమైనవి.
1956 నవంబరులో, రికార్డో గార్సియా చిలీలో బాప్తిస్మము పొంది, నా దేశంలోని సంఘంలో మొదటి సభ్యుడయ్యాడు. అతను చనిపోవడానికి ఒక రోజు ముందు, అతను తన కుటుంబం మరియు స్నేహితుల ముందు ఇలా ప్రకటించాడు, “చాలా సంవత్సరాల క్రితం సువార్తికులు నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండమని నన్ను ఆహ్వానించారు. నేను సంతోషంగా ఉన్నాను. సువార్త అంటే సంతోషమని చిలీలో ఉన్న ప్రతీఒక్కరికి చెప్పండి.”
యేసు క్రీస్తు యొక్క సువార్తతో పోషించబడిన తర్వాత, రికార్డో తన పూర్తి జీవితాన్ని దేవునికి మరియు తన పొరుగువారికి ప్రేమతో సేవ చేయడానికి అంకితం చేశాడు. అతని శిష్యత్వం యొక్క ఉదాహరణ నాతో సహా తరతరాలను ఆశీర్వదించింది. “దేవుని ప్రేమతో నిండిన మనిషి, తన కుటుంబాన్ని మాత్రమే ఆశీర్వదించడంతో సంతృప్తి చెందడు, కానీ మొత్తం మానవ జాతిని ఆశీర్వదించాలనే ఆత్రుతతో ప్రపంచం అంతటా తిరుగుతాడు” అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు.
మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళండి
మనలో ప్రతీ ఒక్కరిలో మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళాలనే లోతైన కోరిక ఉంది మరియు యేసు క్రీస్తే మన పరలోక మార్గదర్శక వ్యవస్థ. ఆయనే మార్గము. ఆయన ప్రాయశ్చిత్త త్యాగం దేవునితో పవిత్ర నిబంధనలు చేయడాన్ని మనకు సాధ్యం చేస్తుంది. మనం నిబంధనలు చేసుకున్న తర్వాత, కొన్నిసార్లు దేవుని నుండి మనల్ని దూరం చేసే ప్రభావాల వలన మనం ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదుతున్నట్లు అనిపిస్తుంది. ప్రమాదం, నిరాశ, శోధన మరియు బాధలు మన విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని పరీక్షిస్తాయి. సహాయం కోసం అడగండి. యేసు క్రీస్తు అర్థం చేసుకుంటారు మరియు మన భారాలను పంచుకోవడానికి ఎల్లప్పుడూ ఆతృతగా ఉంటారు.
ఆయన “వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి ననుభవించినవాడు గాను ఉండెను” అని గుర్తుంచుకోండి. “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను” అని రక్షకుడు బోధించారు. ఆయన ప్రాయశ్చిత్త త్యాగం మన పాపాలను క్షమించడానికి వీలు కల్పిస్తుంది మరియు ఆయన వాటిని ఇకపై గుర్తుంచుకోరు.
మన మర్త్య అభ్యాసంలో భాగంగా మన పాపాలను మనం పూర్తిగా మరచిపోకపోవచ్చు, కాబట్టి వాటిని మళ్ళీ చేయకూడదని మనం గుర్తుంచుకుంటాము. బదులుగా, ప్రతీ ఆదివారం సంఘంలో మనం సంస్కారం తీసుకుంటున్నప్పుడు ఆయనను గుర్తుంచుకుంటాము. ఈ విధి, ఆరాధన మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిలో ముఖ్యమైన భాగం. ఇది కేవలం మరొక రోజు కాదని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆనందం వస్తుంది. ప్రపంచం నుండి మనకు విశ్రాంతినివ్వాలి మరియు మన శరీరాన్ని, ఆత్మను పునరుద్ధరించాలనే ఉద్దేశ్యంతో “విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడింది.”
మనం దేవాలయానికి—ప్రభువు యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనను గుర్తుంచుకుంటాము. దేవుని బహుమానములలోకెల్లా అత్యంత ఘనమైన నిత్యజీవానికి మనల్ని నడిపించే నిబంధనకు కేంద్రంగా యేసు క్రీస్తు గురించి దేవాలయాలు మనకు గొప్ప జ్ఞానాన్ని ఇస్తాయి.
దేవాలయానికి హాజరు కావడం నాకు మన నిత్య భవితవ్యం గురించి ఓదార్పును, గొప్ప నిరీక్షణను ఇచ్చింది. తెరకు ఇరువైపులా ఉన్న వ్యక్తులతో నేను పరలోక సంబంధాలను అనుభవించాను. నా చిన్న పిల్లల జీవితాల్లో స్వస్థపరిచే అద్భుతాలను నేను చూశాను, వారిలో ఇద్దరు జీవితాంతం రోజువారీ సంరక్షణ అవసరమయ్యే కనిపించని అనారోగ్యాలతో జీవిస్తున్నారు.
సంతోష ప్రణాళిక గురించి మేము పంచుకున్నప్పుడు మా కుటుంబం ఆనందిస్తుంది. యేసు క్రీస్తు మూలముగా, వారి “కష్టములు కొంతకాలమే ఉండును” అని విన్నప్పుడు నా పిల్లల ముఖాలు వెలిగిపోతాయి. మేము మా పిల్లలను గాఢంగా ప్రేమిస్తాము మరియు అధ్యక్షులు జెఫ్రీ ఆర్. హాలండ్ బోధించినట్లుగా, ఒకరోజు వారు “మా ముందు మహిమాన్వితంగా మరియు గొప్పగా, శరీరం మరియు మనస్సులో అద్భుతంగా పరిపూర్ణంగా నిలబడతారు” అని మాకు తెలుసు. మన నిబంధనలు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే స్థాయికి మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి, నిరాశ మరియు సందేహాలు కలిగినప్పుడల్లా వెలుగుతో, శాంతితో నింపుతాయి.
యేసు క్రీస్తు మూలంగా నిరీక్షణ ఉంది మరియు ప్రేమించడం, ప్రార్థించడం, మనం శ్రద్ధ వహించే వారికి మద్దతునివ్వడం కొనసాగించడానికి తగిన కారణాలు ఉన్నాయి.
ఆయన జీవిస్తున్నారని నాకు తెలుసు. ఆయన మనల్ని ఎరుగుదురు మరియు ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన లోకమునకు మార్గమును, సత్యమును, జీవమునైయున్నాడు.
యేసు క్రీస్తు మరియు ఆయన బోధనలపై మన జీవితాలను కేంద్రీకరించమని ఈ రోజు మనందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. అలా చేయడం శోధన, అవమానం మరియు దుఃఖం అనే గాలాలను నివారించడానికి మనకు సహాయపడుతుంది. మనం దేవాలయాలవలె పరిశుద్ధంగా, దృఢంగా మరియు స్థిరంగా నిలుస్తాము. మనం కష్టాలను తట్టుకుంటాము మరియు అంతము వరకు సహిస్తూ, చివరి వరకు ఆనందిస్తూ, విజయవంతంగా పరలోకానికి తిరిగివెళ్తాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.