సర్వసభ్య సమావేశము
మర్త్యత్వము కొరకు దైవిక సహాయాలు
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


14:41

మర్త్యత్వము కొరకు దైవిక సహాయాలు

మన పరలోక తండ్రి యొక్క ప్రణాళిక మన మర్త్య ప్రయాణాల ద్వారా మార్గనిర్దేశం చేయడానికి మనకు సహాయాలను అందిస్తుంది.

I.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా ప్రభువు మన పూర్వ-మర్త్య జీవితము గురించి కొన్ని విషయాలను బయల్పరిచారు. అక్కడ, మనమందరము దేవుని యొక్క ఆత్మ పిల్లలమైయున్నాము. దేవుడు తన పిల్లలు పురోగతి సాధించడానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి, మనం శరీరాన్ని పొందగలిగేలా, అనుభవం ద్వారా నేర్చుకోగలిగేలా, దైవిక లక్షణాలను పెంపొందించుకోగలిగేలా మరియు మనం దేవుని ఆజ్ఞలను పాటిస్తామో లేదో నిరూపించబడేలా భూమిని సృష్టించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అర్హత సాధించిన “వారి శిరస్సులపై మరింత మహిమ నిరంతరము ఇవ్వబడును” (అబ్రాహాము 3:26).

ఈ దైవిక ప్రణాళిక యొక్క నియమాలను స్థాపించడానికి, దేవుడు తన అద్వితీయ కుమారుడిని మన రక్షకుడిగా ఎన్నుకున్నారు. మానవుని స్వతంత్రతను నాశనం చేసే ప్రత్యామ్నాయాన్ని సూచించిన లూసిఫరు, సాతానుగా మారి “పడద్రోయబడ్డాడు.” భూమిపై నుండి బహిష్కరించబడి, మర్త్య జీవితపు విశేషాధికారము నిరాకరించబడిన సాతానుకు “నరులను మోసపుచ్చుటకు మరియు గ్రుడ్డివారిగా చేయుటకు, [దేవుని యొక్క] స్వరము వినని వారందరిని అతని చిత్తప్రకారము చెరపట్టుటకు” (మోషే 4:4) ప్రయత్నించడానికి అనుమతి ఇవ్వబడింది.

ఆయన పిల్లల మర్త్య ఎదుగుదల కొరకు దేవుని యొక్క గొప్ప ప్రణాళికకు ఆవశ్యకమైనది ఏమిటంటే, వారు “అన్ని విషయాలలో వ్యతిరేకతను” (2 నీఫై 2:11). అనుభవించడం. గురుత్వాకర్షణ నియమానికి వ్యతిరేకంగా ఒత్తిడి లేకుండా మన శరీర కండరాలు అభివృద్ధి చెందలేవు లేదా రక్షించబడలేవు, అలాగే మర్త్య ఎదుగుదలకు మనం సాతాను ప్రలోభాలకు మరియు ఇతర మర్త్య వ్యతిరేకతలకు ప్రతికూలముగా ప్రయాసపడవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనది మంచి చెడుల మధ్య ఎంపిక చేసుకోవలసిన అవసరం. మంచిని ఎంచుకునే వారు తమ నిత్య భవితవ్యం వైపు పురోగమిస్తారు. మర్త్యత్వం యొక్క వివిధ శోధనలలో అందరూ ఎంచుకున్నట్లుగానే—చెడును ఎంచుకున్న వారికి—ప్రేమగల దేవుడు అందించడానికి రూపొందించిన రక్షణ సహాయం అవసరం.

II.

ఇప్పటివరకు, దేవుడు ఇచ్చిన అత్యంత బలమైన మర్త్యత్వ సహాయం ఏమిటంటే, పశ్చాత్తాపపడిన పాపములకు క్షమాపణ అందించడానికి మరియు మూల్యం చెల్లించడానికి బాధలను అనుభవించేలా, రక్షకుడైన యేసు క్రీస్తును అందించడం. కనికరముగల మరియు మహిమాన్వితమైన ఆ ప్రాయశ్చిత్తము, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచడమనేది ఎందుకు సువార్త యొక్క మొదటి సూత్రమవుతుందో వివరిస్తుంది. ఆయన ప్రాయశ్చిత్తము “మృతుల పునరుత్థానమును తెస్తుంది” (ఆల్మా 42:23) మరియు పశ్చాత్తాపపడిన మన పాపములన్నింటినీ తుడిచివేయడం మరియు మన మర్త్య బలహీనతలలో మనకు సహాయం చేయడానికి మన రక్షకుడికి శక్తిని ఇవ్వడంతోపాటు , “లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేస్తుంది” (ఆల్మా 34:8).

రక్షకుడైన యేసు క్రీస్తు

చేసిన పాపములను మహిమాన్వితంగా తుడిచివేయడానికి మరియు క్షమించడానికి మించి, ప్రేమగల పరలోక తండ్రి యొక్క ప్రణాళిక మనల్ని రక్షించడానికి అనేక ఇతర బహుమతులను అందిస్తుంది, వాటిలో పాపం చేయకుండా మనల్ని రక్షించడం మొదటి స్థానంలో ఉంది. మన మర్త్య జీవితం ఎల్లప్పుడూ ఒక తండ్రి మరియు ఒక తల్లితో ప్రారంభమవుతుంది. ఆదర్శవంతంగా, మన అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడానికి ఇద్దరూ వేర్వేరు బహుమానాలు కలిగియున్నారు. కాకపోతే, వారు లేకపోవడమనేది మనం అధిగమించాల్సిన వ్యతిరేకతలో భాగం.

III.

మన పరలోక తండ్రి ప్రణాళిక మన మర్త్య ప్రయాణాల ద్వారా మనకు మార్గనిర్దేశం చేయడానికి ఇతర సహాయాలను అందిస్తుంది. వాటిలో నాలుగింటి గురించి నేను మాట్లాడతాను. దయచేసి నా నాలుగు సంఖ్యలతో నన్ను బంధించకండి, ఎందుకంటే ఈ సహాయాలు కొన్ని ఒకదానికొకటి సంబంధించినవి. అంతేకాకుండా, వీటితో పాటు ఇతర దయగల రక్షణలు కూడా ఉన్నాయి.

మొదటిది, నేను క్రీస్తు యొక్క వెలుగు లేదా ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. మొరోనై గ్రంథములోని తన గొప్ప బోధనలో, మొరోనై తన తండ్రి గురించి చెప్పాడు, “చెడు నుండి మంచిని ఎరుగునట్లు క్రీస్తు యొక్క ఆత్మ ప్రతి మనుష్యునికి ఇవ్వబడినది” (మొరోనై 7:16). ఆధునిక బయల్పాటులలో కూడా మనం ఇదే బోధనను చదువుతాము:

“లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యునికి ఆత్మ వెలుగునిచ్చును; ఆత్మ యొక్క స్వరమును ఆలకించు లోకములోనున్న ప్రతి మనిషిని ఆత్మ వెలుగుతో నింపును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:46).

మరలా: “ఏలయనగా దీనులకు, నలిగినవారికి వెలుగునిచ్చుటకు, భక్తిహీనులను నిందించుటకు లోకములోనికి నా ఆత్మ పంపబడెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 136:33).

అధ్యక్షులు జోసెఫ్ ఫీల్డింగ్ స్మిత్ ఈ లేఖనాలను ఇలా వివరించారు: “ప్రభువు మనుష్యులను (వారు ఈ లోకంలో జన్మించినప్పుడు) నిస్సహాయులుగా, వెలుగును మరియు సత్యాన్ని కనుగొనడానికి తపనపడేలా వదిలిపెట్టలేదు, కానీ ప్రతీ మనిషి … మార్గదర్శకత్వం, ఉపదేశము, క్రీస్తు ఆత్మ యొక్క సలహా లేదా సత్యము యొక్క వెలుగును పొందే హక్కుతో జన్మించాడు.”

లేఖనాలను అధ్యయనము చేయుట

సరైనది ఎంచుకోవడానికి మనకు సహాయపడేలా ప్రభువు అందించిన రెండవ గొప్ప సహాయం రక్షణ ప్రణాళిక (సంతోష ప్రణాళిక)లో భాగంగా లేఖనాలలో సంబంధం ఉన్న దైవిక ఆదేశాల సమూహం. ఈ ఆదేశాలు ఆజ్ఞలు, విధులు మరియు నిబంధనలు.

నిత్యజీవం వైపు పురోగమించడానికి మన పరలోక తండ్రి మనకు నిర్దేశించిన మార్గాన్ని ఆజ్ఞలు నిర్వచిస్తాయి. దేవుడు ఎవరిని శిక్షించాలో నిర్ణయించే మార్గమే ఆజ్ఞలు అని ఊహించుకునే వ్యక్తులు దేవుని ప్రేమగల సంతోష ప్రణాళిక యొక్క ఈ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు. ఆ మార్గంలో, మనం క్రమంగా మన రక్షకుడితో అవసరమైన సంబంధాన్ని సాధిస్తాము మరియు దేవుడు మనందరి కొరకు కోరుకునే గమ్యస్థానానికి చేరుకోవడానికి మనకు సహాయపడే ఆయన శక్తి యొక్క వృద్ధికి అర్హులమవుతాము. మన పరలోక తండ్రి, తన పిల్లలందరూ దేవుడు మరియు మన రక్షకుడు నివసించే సిలెస్టియల్ రాజ్యానికి తిరిగి రావాలని మరియు ఆ సిలెస్టియల్ మహిమలో నివసించేవారి వంటి జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నారు.

విధులు మరియు నిబంధనలు నిత్యజీవ మార్గాన్ని నిర్వచించే ధర్మశాస్త్రంలో భాగం. విధులు మరియు వాటి ద్వారా దేవునితో మనం చేసే పవిత్ర నిబంధనలు, ఆ మార్గములో అవసరమైన మెట్లు మరియు ముఖ్యమైన కాపలాదారులు. దేవుని ప్రణాళిక ప్రకారం, కొన్ని ఆజ్ఞలను పాటించడానికి ముందుగానే వాగ్దానం చేసేవారికి మరియు ఆ వాగ్దానాలను పాటించేవారికి ఆయన అత్యున్నత దీవెనలు ఇవ్వబడ్డాయని నిరూపించే నిబంధనల పాత్ర గురించి నేను ఆలోచించాలనుకుంటున్నాను.

సరైన ఎంపికలు చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఇతర సహాయాలు, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలు. పరిశుద్ధాత్మ దైవసమూహములో మూడవ సభ్యుడు. లేఖనాల్లో నిర్వచించబడినట్లుగా ఆయన ధర్మము, తండ్రీ కుమారులను గూర్చి సాక్ష్యమివ్వడం, మనకు బోధించడం, అన్ని విషయాలను మనకు జ్ఞాపకం చేయడం మరియు మనల్ని సర్వసత్యంలోకి నడిపించడం. మోర్మన్ గ్రంథము యొక్క సత్యం గురించిన విచారణకు ప్రతిస్పందనగా ఆధ్యాత్మిక సాక్ష్యం వంటి పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతల గురించి అనేక వివరణలు లేఖనాలలో ఉన్నాయి. బాప్తిస్మము తర్వాత ఇవ్వబడే పరిశుద్ధాత్మ వరమును ప్రత్యక్షతగా భావించి తికమక పడకూడదు.

దేవుడు విశ్వాసులైన తన పిల్లలకు చేసే సహాయాలలో అత్యంత ముఖ్యమైనది పరిశుద్ధాత్మ వరము. పశ్చాత్తాపము మరియు నీటి ద్వారా బాప్తిస్మము తర్వాత అధికారికంగా ఇవ్వబడుతుందనే వాస్తవంలో ఈ బహుమానం యొక్క ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుంది “మరియు [లేఖనాలు వివరిస్తున్నాయి] తరువాత అగ్ని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీకు పాప పరిహారము కలుగును” (2 నీఫై 31:17). ఈ పాప క్షమాపణ పొందిన వ్యక్తులు—ఆపై రోజువారీ పశ్చాత్తాపం ద్వారా మరియు సంస్కార విధి ద్వారా వారు చేసే నిబంధనల ప్రకారం జీవించడం ద్వారా వారి శుద్ధిని క్రమం తప్పకుండా పునరుద్ధరించుకునే వ్యక్తులు—పరిశుద్ధాత్మను, ప్రభువు యొక్క ఆత్మను “వారు ఎల్లప్పుడు … వారితో కలిగియుండెదరు గాక” (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77) అనే వాగ్దానానికి అర్హులు.

అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్

ఆ విధముగా, పరిశుద్ధాత్మ “దేవుని విషయాలకు సంబంధించి జనుల మనస్సులను ప్రకాశవంతం చేస్తారు, వారు పరివర్తన చెందినప్పుడు వారు తండ్రి చిత్తాన్ని చేశారని వారిని నమ్మిస్తారు మరియు జీవితాంతం సహచరుడిగా వారిలో నిత్య సాక్షిగా ఉంటారు, అన్ని సత్యాలలోకి నిశ్చయమైన మరియు సురక్షితమైన మార్గదర్శిగా వ్యవహరిస్తారు మరియు వారిని ప్రతిరోజూ సంతోషంతో, ఆనందంతో నింపి, అందరికీ మంచి చేయాలనే వైఖరితో, తప్పు చేయడానికి బదులుగా తప్పును సహించి, దయ మరియు కనికరము, దీర్ఘశాంతము మరియు దాతృత్వం కలిగియుండేలా చేస్తారు. ఈ దివ్యమైన బహుమతిని, ఈ అమూల్యమైన ముత్యాన్ని కలిగియున్న వారందరు నీతి కొరకు నిరంతర దాహం కలిగియుంటారు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఏ మానవుడు కూడా సంకుచితమైన మరియు ఇరుకైన మార్గంలో నడవలేడు” అని అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ బోధించారు.

IV.

మన మర్త్య ప్రయాణాలలో మనల్ని నడిపించడానికి ఇంత శక్తివంతమైన సహాయాలు ఉన్నప్పటికీ, మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసు క్రీస్తుతో వారి నియమిత సమావేశానికి చాలా మంది సిద్ధంగా లేకపోవడం నిరాశపరుస్తుంది. ఈ సమావేశంలో తరచుగా ప్రస్తావించబడిన పది మంది కన్యకల ఉపమానం, ఆయనను కలవడానికి ఆహ్వానించబడిన వారిలో సగం మంది మాత్రమే సిద్ధంగా ఉంటారని సూచిస్తుంది.

పదిమంది కన్యకలు

సిద్ధంగా లేని వారి ఉదాహరణలు మనందరికీ తెలుసు: నిష్క్రియాత్మక కాల వ్యవధుల ద్వారా వారి ఆధ్యాత్మిక వృద్ధికి అంతరాయం కలిగించిన తిరిగివచ్చిన సువార్తికులు, సంఘ బోధన మరియు కార్యకలాపాల నుండి తమను తాము వేరు చేసుకోవడం ద్వారా వారి ఆధ్యాత్మిక వృద్ధిని ప్రమాదంలో పడేసిన యువత, మెల్కీసెదెకు యాజకత్వానికి తమ నియామకాన్ని వాయిదా వేసుకున్న పురుషులు, పరిశుద్ధ దేవాలయంలో నిబంధనలు చేసి, పాటించకుండా నిబంధన మార్గాన్ని విడిచిపెట్టిన—పురుషులు మరియు స్త్రీలు—కొన్నిసార్లు ఘనమైన అగ్రగాములు లేదా యోగ్యులైన తల్లిదండ్రుల వారసులు కూడా.

వ్యక్తిగత ప్రార్థన

వ్యక్తిగత ప్రార్థన, క్రమం తప్పకుండా లేఖన అధ్యయనం మరియు తరచుగా పశ్చాత్తాపం అనే ప్రాథమిక ఆధ్యాత్మిక నిర్వహణ ప్రణాళికను అనుసరించడంలో సభ్యులు విఫలమైనప్పుడు ఇటువంటి అతిక్రమములు అనేకం సంభవిస్తాయి. దీనికి విరుద్ధంగా, కొందరు సంస్కారములో పాల్గొనకుండా వారానికొకసారి చేయవలసిన నిబంధనల పునరుద్ధరణను నిర్లక్ష్యం చేస్తారు. కొందరు, ప్రభువు అందించిన అనేక బోధనలకంటే మరియు మన అవసరం ఉన్న ఇతరులకు సేవచేసే అవకాశాలకంటే ముందు వారి భవిష్యత్తు అవసరాలుగా భావించే వాటిని ప్రత్యామ్నాయంగా చేసుకొని, సంఘము వారి అవసరాలను తీర్చడం లేదని అంటారు.

వినయం మరియు ప్రభువుపై నమ్మకం అలాంటి అతిక్రమములకు నివారణలు. మోర్మన్ గ్రంథము బోధించినట్లుగా, “ఆయనయందు తమ నమ్మికయుంచువారిని ప్రభువు ఆశీర్వదించి, వర్థిల్లజేయును” (హీలమన్ 12:1). దేవుని ఆజ్ఞలను మరియు ఆయన ప్రవక్తల బోధనలను, మానవుని తాజా పరిశోధనలతో మరియు జ్ఞానంతో తప్పుగా పోల్చి చూసే వారందరికీ, ప్రభువునందు నమ్మికయుంచడం ప్రత్యేకంగా అవసరం.

ఆయన పిల్లలకు సహాయం చేయడానికి మన ప్రేమగల పరలోక తండ్రి ఇచ్చిన అనేక మర్త్య సహాయముల గురించి నేను మాట్లాడాను. ఈ దైవిక ప్రణాళికలో మన పాత్ర ఏమిటంటే, దేవునియందు నమ్మికయుంచి, ఈ దైవిక సహాయాలను, ముఖ్యంగా ఆయన ప్రియమైన కుమారుడు, మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును వెదకడం మరియు ఉపయోగించడం. ఈ సూత్రాలను మనం బోధించి, జీవించాలని యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.