పవిత్ర విషయాలపట్ల భక్తిగల గౌరవము
పవిత్రమైన వాటి పట్ల భక్తిగల గౌరవము నిజమైన కృతజ్ఞతను పెంపొందిస్తుంది, నిజమైన ఆనందాన్ని విస్తరిస్తుంది, మన మనస్సులను బయల్పాటుకు నడిపిస్తుంది మరియు మన జీవితాలకు గొప్ప ఆనందాన్ని తెస్తుంది.
నిర్గమకాండములో, మోషే తన దైనందిన చింతల నుండి తప్పుకుని—అది మనమందరం చేయడానికి సమ్మతించవలసిన పని—కాలిపోని మండుచున్న పొదను చూడడానికి వెళ్తున్నప్పుడు అతనితో పాటు హోరేబు పర్వత వాలులకు మనం ప్రయాణిస్తాము. అతను అక్కడికి వచ్చినప్పుడు, “దేవుడు ఆ పొద నడుమనుండి–మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు–చిత్తము ప్రభువా అనెను. అందుకు [దేవుడు], … దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.” గొప్ప భక్తిగల గౌరవము, వినయము మరియు ఆశ్చర్యంతో, మోషే తన చెప్పులు విడిచి, ప్రభువు మాట వినడానికి మరియు ఆయన పరిశుద్ధ సన్నిధిని అనుభవించడానికి తననుతాను సిద్ధం చేసుకున్నాడు.
పర్వతంపై కలిగిన ఆ పవిత్రమైన, విస్మయం కలిగించే, భక్తిగల గౌరవముతో నిండిన అనుభవం మోషేను అతని దైవిక గుర్తింపుతో అనుసంధానించింది మరియు వాస్తవానికి, జీవితంలో అతడు కొత్త మార్గంలో నడవడానికి దారితీస్తూ, వినయపూర్వకమైన గొర్రెల కాపరి నుండి శక్తివంతమైన ప్రవక్తగా అతని పరివర్తనలో కీలకమైన అంశమైంది. అలాగే, మనలో ప్రతి ఒక్కరూ భక్తిగల గౌరవము అనే సుగుణాన్ని మన ఆధ్యాత్మిక స్వభావంలో పవిత్ర భాగంగా చేసుకోవడం ద్వారా మన శిష్యత్వాన్ని ఉన్నతమైన ఆధ్యాత్మిక నమూనాగా మార్చుకోవచ్చు.
భక్తిగల గౌరవము అనే పదాన్ని లాటిన్ క్రియాపదం రెవెరెరి నుండి గురుతుపట్టవచ్చు, దాని అర్థం “విస్మయంతో నిలబడడం.” సువార్త కోణంలో, ఈ నిర్వచనం లోతైన గౌరవం, ప్రేమ మరియు కృతజ్ఞత యొక్క భావన లేదా వైఖరితో కలిసిపోతుంది. నలిగిన హృదయం మరియు దేవునిపట్ల, యేసు క్రీస్తు పట్ల అత్యంత భక్తి ఉన్నవారు పవిత్రమైన వాటిపట్ల భక్తిగల గౌరవాన్ని వ్యక్తపరచడం అనేది వారు మరింత ఆనందంగా భావించడానికి సహాయపడుతుంది.
పవిత్ర విషయాలపట్ల భక్తిగల గౌరవం అనేది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక లక్షణం యొక్క గొప్ప చిహ్నము; ఇది పరిశుద్ధతతో మనకున్న సంబంధం యొక్క ఉప ఉత్పత్తి మరియు మన పరలోక తండ్రిపట్ల, మన రక్షకుడైన యేసు క్రీస్తు పట్ల మనకున్న ప్రేమను, సాన్నిహిత్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఆత్మ యొక్క అత్యంత ఉన్నతమైన అనుభవాలలో ఒకటి. అటువంటి సుగుణం మన ఆలోచనలను, హృదయాలను మరియు జీవితాలను దేవుని వైపు మళ్ళిస్తుంది. వాస్తవానికి, భక్తిగల గౌరవం అనేది ఆధ్యాత్మికత యొక్క ఒక అంశం మాత్రమే కాదు; అది దాని సారాంశం—ఆధ్యాత్మికత నిర్మించబడిన పునాది; “నేను భక్తితో ఉన్నప్పుడు, నా మనస్సుకు తెలుసు పరలోక తండ్రి మరియు యేసు సమీపంలో ఉన్నారు,” అని మన పిల్లలు పాడేటప్పుడు వారు బోధించినట్లుగా అది దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని సృష్టిస్తుంది.
యేసు క్రీస్తు శిష్యులుగా, దేవునితో మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మనఃస్ఫూర్తిగా మాట్లాడడానికి, అదే సమయంలో మన ఆధ్యాత్మిక స్వభావాన్ని బలోపేతం చేసుకోవడానికి మన జీవితాల్లో భక్తిగల గౌరవము అనే బహుమానాన్ని పెంపొందించుకోవాలని మనం ఆహ్వానించబడ్డాము. మన హృదయాల్లో అలాంటి భావాలు ఎక్కువగా ఉంటే, నిస్సందేహంగా మన జీవితాల్లో ఎక్కువ ఆనందం, సంతోషం ఉంటుంది మరియు దుఃఖానికి, విచారానికి తక్కువ అవకాశం ఉంటుంది. పవిత్ర విషయాలపట్ల భక్తిగల గౌరవాన్ని చూపడం మనం ప్రతిరోజూ చేసే పనులకు అర్థాన్ని ఇస్తుందని మరియు మన కృతజ్ఞతా భావాన్ని—ఉన్నతమైన, పరిశుద్ధమైన విషయాల పట్ల విస్మయం, గౌరవం మరియు ప్రేమ వంటి భావాలను బలపరుస్తుందని మనం గుర్తుంచుకోవాలి.
దురదృష్టవశాత్తు, పవిత్ర విషయాలపట్ల భక్తిగల గౌరవాన్ని చూపడం అసాధారణంగా మారుతున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. వాస్తవానికి, చిన్న వార్తా పత్రికను చదివినట్లు, టెలివిజన్ కార్యక్రమం లేదా ఇంటర్నెట్‌ను ధృవీకరించినట్లు, ప్రపంచం తరచుగా భక్తిహీనతను వేడుక చేసుకుంటుంది. పవిత్రమైన వాటి పట్ల గౌరవం లేకపోవడం వల్ల వైఖరిలో నిర్లక్ష్యం మరియు ప్రవర్తనలో అజాగ్రత్త పెరుగుతుంది, ఇది ఒక తరాన్ని వేగంగా ఉదాసీనతలోకి నెట్టి, తరువాతి తరాన్ని దుఃఖంలోకి నెట్టివేస్తుంది.
భక్తిహీనత దేవునితో చేసే నిబంధనలు అందించే బంధాల నుండి మనల్ని దూరంగా నడిపించివేసి, దేవుని యెదుట మన జవాబుదారీతనాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా, అదుపులేని కోరికలను తీర్చుకుంటూ మనం మన సౌకర్యం గురించి మాత్రమే శ్రద్ధ వహించే ప్రమాదం ఉంది; మరియు చివరికి పవిత్రమైన విషయాలను, దేవుడిని కూడా తృణీకరించే స్థితికి చేరుకుంటాము, తత్ఫలితంగా పరలోక తండ్రి పిల్లలుగా మన దైవిక స్వభావాన్ని కూడా తృణీకరిస్తాము. పవిత్ర విషయాలపట్ల అగౌరవం అనేది మన కాలంలో మన ఆధ్యాత్మిక మనుగడకు కీలకమైన సున్నితమైన బయల్పాటు మార్గాలను భంగపరచడం ద్వారా శత్రువు లక్ష్యాలకు మరింత తోడ్పడుతుంది.
పవిత్రమైన వాటిపట్ల భక్తిగల గౌరవం యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత లేఖనాలంతటా బాగా వివరించబడింది. మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు పట్ల భక్తిగల గౌరవం సిలెస్టియల్ రాజ్యాన్ని పొందేవారికి ఆవశ్యకమైన సుగుణం అని సిద్ధాంతము మరియు నిబంధనలులో ఒక ఉదాహరణ సూచిస్తుంది.
ఒక సంఘముగా, తండ్రి మరియు కుమారుని చిత్రాలను మనం ఎలా చిత్రీకరిస్తామనే దానితో సహా ప్రతి అంశంలోనూ వారిని అత్యంత పవిత్రంగా మరియు గౌరవంగా ఉంచడానికి మనం కృషి చేస్తాము. ఈ చిత్రాలు తండ్రి మరియు కుమారుని పవిత్ర స్వభావం, గుణం మరియు దైవిక లక్షణాలను ఎలా ప్రతిబింబించాలో నిర్ణయించడంలో పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కీలకమైన అంశం. మన పరలోక తండ్రి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మరియు వారి బోధనలపై నుండి మన ప్రాథమిక దృష్టిని మరల్చే అంశాలను చిత్రీకరించకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాము, విషయాన్ని మరియు చిత్రాలను రూపొందించడానికి కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించడం వంటి సాంకేతికత అందించే అధునాతన సాధనాలను మనం ఎలా వర్తింపజేస్తాము అనేదానితో సహా.
సంఘము యొక్క అధికారిక సమాచార మార్గాల ద్వారా లభించే ఏ సమాచార వనరులకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. యేసు క్రీస్తు సువార్త యొక్క పవిత్రమైన సుగుణం, విలువలు మరియు ప్రమాణాలను మనం కాపాడుతున్నామని నిర్ధారించుకోవడానికి ఆత్మ యొక్క మార్గదర్శకత్వంలో ప్రతీ పాఠం, గ్రంథం, చేతిపుస్తకం మరియు సందేశం జాగ్రత్తగా అభివృద్ధి చేయబడి, ఆమోదించబడుతుంది. సంఘము యొక్క వయో జనులకు ఇచ్చిన ఇటీవలి సందేశంలో, ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు: “ఆధ్యాత్మికత మరియు సాంకేతికత యొక్క సంక్లిష్ట కలయికను నిర్దేశించడానికి, కడవరి-దిన పరిశుద్ధులు వినయంగా మరియు ప్రార్థనాపూర్వకంగా, (1) కృత్రిమ మేధస్సు యొక్క వినియోగాన్ని నిర్దేశించే సువార్త సూత్రాలను గుర్తించాలి మరియు (2) పరిశుద్ధాత్మ సహవాసం, బయల్పాటు యొక్క ఆత్మీయ బహుమానం కోసం హృదయపూర్వకంగా ప్రయత్నించాలి.”
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఆధునిక సాంకేతికత ఎంత అధునాతనంగా మారినా, అది పరిశుద్ధాత్మ ప్రభావం నుండి పుట్టిన భక్తిగల గౌరవంలో కనిపించే అద్భుతం, విస్మయం మరియు ఆశ్చర్యాన్ని అనుకరించలేదు. యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా మనం కృత్రిమ మేధస్సు సృష్టించిన విషయములను, చిత్రాలను అనుచితంగా ఉపయోగించడం ద్వారా దేవునితో మరియు ఆయన కుమారునితో మన సంబంధాన్ని బలహీనపరచుకోకుండా జాగ్రత్త వహించాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే పొందగలిగే ప్రేరణ, ఉపదేశం మరియు సాక్ష్యానికి బదులుగా ఆధునిక సాంకేతిక “శరీరబాహువు”పై ఆధారపడడం అనేది తగనిదని మరియు అగౌరవకరమైన ప్రత్యామ్నాయం అని మనం గుర్తుంచుకోవాలి. నీఫై ప్రకటించినట్లు: “ఓ ప్రభువా! నేను నీ యందు నమ్మికయుంచియున్నాను మరియు నేను శాశ్వతముగా నీ యందు నమ్మికయుంచెదను. శరీరబాహువందు నేను నమ్మికయుంచను.”
మరొక బయల్పాటులో, ప్రభువు గౌరవార్థం నిర్మించబడిన దేవాలయాలు ఆయనపట్ల భక్తిగల గౌరవంతో కూడిన స్థలాలుగా ఉండాలని ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఉపదేశించబడ్డారు. తన పరిచర్య అంతటా, మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు పవిత్ర దేవాలయంలో భక్తిగల గౌరవంతో మనం ఆరాధించాలని గట్టిగా నొక్కిచెప్పారు. ప్రభువు యొక్క మందిరంలో తండ్రి మరియు కుమారుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోకి ప్రవేశించడం గురించి మనకు బోధించబడింది. దేవాలయంలోకి ప్రవేశించి, పవిత్ర విధుల్లో పాల్గొనడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నప్పుడు మనం చేసే మొదటి పనులలో ఒకటి మన చెప్పులు తీసివేసి, తెల్లటి దుస్తులు ధరించడం అని నేను ఎల్లప్పుడూ బోధనాత్మకంగా మరియు స్ఫూర్తిదాయకంగా కనుగొన్నాను. మోషే మాదిరిగానే, మనం ఉద్దేశపూర్వకంగా ఉంటే, ప్రాపంచిక విషయాలపై నుండి దృష్టి మరల్చడం అనేది పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టడం మరియు ఉన్నతమైన, పరిశుద్ధమైన మార్గాల్లో రూపాంతరం చెందడం యొక్క ప్రారంభం అని మనం గుర్తించగలం.
సహోదర సహోదరీలారా, పవిత్ర విషయాలపట్ల భక్తిగల గౌరవాన్ని కనుగొనడానికి, మన శిష్యత్వాన్ని ఆధ్యాత్మికత మరియు భక్తి యొక్క తీవ్రస్థాయికి మార్చడానికి మోషే చేసినట్లుగా మనం పర్వతం పైకి ఎక్కాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, మన ఇంటి వాతావరణాన్ని ప్రాపంచిక ప్రభావాల నుండి రక్షించుకోవడానికి మనం కృషి చేస్తున్నప్పుడు మనం దానిని కనుగొనవచ్చు. మన పరలోక తండ్రి యెదుట యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకంగా మరియు మనస్ఫూర్తిగా ప్రార్థించడం ద్వారా మరియు లేఖనాలలో, మన ప్రవక్తల బోధనలలో కనిపించే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం నుండి మన రక్షకుడిని బాగా తెలుసుకోవడం ద్వారా అది సాధించబడగలదు. అదనంగా, ప్రభువు యొక్క ఆజ్ఞలకు విధేయత చూపుతూ జీవించడం ద్వారా మనం ఆయనతో చేసిన నిబంధనలను గౌరవించడానికి ప్రయత్నించినప్పుడు అటువంటి ఆధ్యాత్మిక మార్పు కలుగవచ్చు. ఈ ప్రయత్నాలు మన హృదయాలకు నిశ్చలమైన, నమ్మకమైన శాంతిని తీసుకురాగలవు. అటువంటి చర్యలపై దృష్టి పెట్టడం, మన ఇళ్లను ఆధ్యాత్మిక ఆశ్రయం యొక్క భక్తిగల ప్రదేశాలుగా—ఆత్మ నివసించే వ్యక్తిగత విశ్వాస ప్రదేశాలుగా, పర్వతంపై మోషే యొక్క అనుభవంలా మార్చడంలో ఖచ్చితంగా సహాయపడగలదు.
సంఘ ఆరాధనా సేవలో విశ్వాసంతో పాల్గొనడం ద్వారా కూడా మనం అలాంటి ఆధ్యాత్మిక మార్పును అనుభవించవచ్చు, అందులో పవిత్ర కీర్తనలను హృదయపూర్వకంగా పాడడం ద్వారా మన హృదయాలను ప్రభువు వైపు మళ్లించడం కూడా ఉంటుంది. మోషే లాగా ప్రాపంచిక పరధ్యానాల నుండి, ముఖ్యంగా మన సెల్ ఫోనుల నుండి లేదా ఆ పవిత్ర క్షణానికి అనుగుణంగా లేని దేని నుండి అయినా ప్రక్కకు తప్పుకోవడం అనేది మన స్వంత నిబంధనలతో పాటు మన మనస్సులు మరియు హృదయాలు రక్షకునిపై, ఆయన ప్రాయశ్చిత్త త్యాగంపై కేంద్రీకరించబడియుండి, మన పూర్తి దృష్టిని సంస్కారములో పాల్గొనడంపై మళ్లించడానికి వీలు కల్పిస్తుంది. సంస్కారముపై దృష్టి పెట్టడం రక్షకునితో మన సహవాసాన్ని భక్తితో పునరుద్ధరించే క్షణాన్ని పెంపొందిస్తుంది మరియు విశ్రాంతిదినమును ఆనందంగా చేసి, మన జీవితాన్ని మారుస్తుంది.
చివరికి, మనం యెహోవా మందిరపర్వతంపై—మన పరిశుద్ధ దేవాలయాలలో—క్రమం తప్పకుండా ఆరాధించినప్పుడు మరియు ప్రత్యేకించి మర్త్య జీవితంలో పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు నిబంధన విశ్వాసంతో జీవించడానికి కృషి చేసినప్పుడు, మన శిష్యత్వంలో ఈ ఆధ్యాత్మిక మార్పును మనం అనుభవించగలము.
మా జీవితంలో ఈ సూత్రాలను అన్వయించుకోవడానికి మేము కృషి చేస్తున్నప్పుడు నేను, నా భార్య వ్యక్తిగతంగా అటువంటి కొన్ని పవిత్ర క్షణాలను భక్తిగల గౌరవంతో అనుభవించాము, అది మా శిష్యత్వంలో అర్థవంతమైన మార్పును కలిగించింది. నా భార్య ఇంకా ఆసుపత్రిలో కోలుకుంటున్నప్పుడు, నెలలు నిండకుండా జన్మించి చనిపోయిన మా రెండవ బిడ్డను పాతిపెట్టడానికి ముందు స్మశానవాటికలో నడవడం నాకింకా స్పష్టంగా గుర్తుంది. ఆ సవాలును ఎదుర్కోవడానికి సహాయం కోసం దేవుడిని మనఃపూర్వకంగా, భక్తిగల గౌరవంతో ప్రార్థించడం నాకు గుర్తుంది. ఆ క్షణంలో, నా హృదయంలో నేను ఈ స్పష్టమైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక హామీ పొందాను: నేను, నా భార్య యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించడం వల్ల వచ్చే ఆనందాన్ని హత్తుకొని, సహిస్తే మా జీవితాల్లో ప్రతిదీ బాగుంటుంది. ఆ సమయంలో అధిగమించలేని, దుఃఖకరమైన సవాలుగా అనిపించినది పవిత్రమైన, భక్తిపూర్వక అనుభవంగా మారింది, అది మా విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి సహాయపడింది మరియు ప్రభువుతో మేము చేసిన నిబంధనలలో మరియు నాకు, నా కుటుంబానికి ఆయనిచ్చిన వాగ్దానాలలో మాకు నమ్మకాన్ని ఇచ్చింది.
నా సహోదర సహోదరీలారా, పవిత్రమైన వాటి పట్ల భక్తిగల గౌరవము నిజమైన కృతజ్ఞతను పెంపొందిస్తుంది, నిజమైన ఆనందాన్ని విస్తరిస్తుంది, మన మనస్సులను బయల్పాటుకు నడిపిస్తుంది మరియు మన జీవితాలకు గొప్ప ఆనందాన్ని తెస్తుంది. ఇది మనం పరిశుద్ధ మార్గంలో జీవించడానికి, దేవునిపై దృష్టిపెట్టడానికి సహాయపడుతుంది.
మన దైనందిన జీవితాల్లో అలాంటి సుగుణాన్ని చేర్చుకోవడానికి మనం కృషి చేస్తున్నప్పుడు, మన వినయాన్ని మనం పెంచుకోగలుగుతాము, మన కొరకు దేవుని చిత్తాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాము మరియు ప్రభువుతో మనం చేసిన నిబంధనల వాగ్దానాలపై మన విశ్వాసాన్ని బలోపేతం చేసుకోగలుగుతాము అని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. ప్రభువు మందిరపర్వతంలో అయినా, సమావేశమందిరంలో అయినా లేదా మన స్వంత ఇంట్లో అయినా—పవిత్ర విషయాలపట్ల భక్తిగల గౌరవము అనే ఈ బహుమానాన్ని మనం హత్తుకున్నప్పుడు, మన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ ప్రేమకు మనం అనుసంధానించబడినప్పుడు మనం అత్యంత ఆశ్చర్యంతో మరియు విస్మయంతో నింపబడతామని నేను సాక్ష్యమిస్తున్నాను. మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను భక్తిపూర్వకంగా ఈ సత్యాలకు సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.