సర్వసభ్య సమావేశము
మన తల్లిదండ్రులు ఆదరించిన విశ్వాసానికి నమ్మకంగా ఉందాం
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


11:0

మన తల్లిదండ్రులు ఆదరించిన విశ్వాసానికి నమ్మకంగా ఉందాం

మీకు ముందుగా వచ్చినవారి విశ్వాసం మరియు సాక్ష్యాల నుండి నేర్చుకుని, బలాన్ని పొందండి.

దేవాలయ సమీక్ష కోసం నేను నాష్‌విల్ టెన్నెస్సీ దేవాలయాన్ని సందర్శిస్తున్నప్పుడు, ఈ నియామకంలో భాగంగా, ప్రభువు యొక్క అందమైన మందిరమును సమీక్షిస్తూ, దేవాలయం మొత్తాన్ని చూసే అవకాశం పొందాను. మాట్రన్ కార్యాలయంలో గోడపై వేలాడుతున్న Carry On [కొనసాగించు] అనబడే మేరీ వాన్లాస్ చిత్రకళ నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

ఆ చిత్రకళ వెనుక ఉన్న కథ ఇది:

“1862లో మిస్సోరిలో, 14 ఏళ్ల మేరీ వాన్‌లాస్ మరణిస్తున్న తన సవతి తల్లికి, వికలాంగుడైన తన తండ్రి [మరియు తన కన్నా చిన్న వయస్సు వారైన నలుగురు తోబుట్టువులు, అందరూ గ్రేట్ సాల్ట్ లేక్ లోయకు చేరుకునేలా చూస్తానని] ప్రమాణం చేసింది. … [మంచాన పడి ఉన్న] తన తండ్రిని, ఎద్దులు మరియు పాలు ఇచ్చే ఆవుల చేత లాగబడిన బండిని మేరీ నడిపింది మరియు ఆమె తన తోబుట్టువులను బాధ్యతగా చూసుకుంది. ప్రతిరోజూ ప్రయాణం ముగిసిన తర్వాత, ఆమె తినదగిన మొక్కలు, పువ్వులు మరియు బెర్రీ పండ్లను వెతికి తెచ్చి కుటుంబాన్ని పోషించింది. మేఘాలు పర్వతాలుగా మారే వరకు పడమటి దిశగా ప్రయాణం చేయమనే సూచన మాత్రమే ఆమెకు ఉన్న ఏకైక దిక్సూచి.

“వారు వసంత ఋతువు మరియు వేసవి కాలమంతా ప్రయాణించి, సెప్టెంబరు‌లో యూటా లోయను చేరుకున్నారు. కుటుంబం యూటా కౌంటీలో స్థిరపడిన కొద్దికాలానికే ఆమె తండ్రి మరణించారు, తరువాత, మేరీ అక్కడే వివాహం చేసుకుని తన స్వంత కుటుంబాన్ని పోషించుకుంది.”

ఇది 14 ఏళ్ల యువతి యొక్క విశ్వాసం మరియు శక్తిని ప్రతిబింబించే అద్భుతమైన కథ, ఈ రోజు ఈ కథ మనలో ప్రతి ఒక్కరూ “కొనసాగించడానికి” సహాయపడుతుంది.

“కొనసాగించు” లేదా నా మాతృభాష అయిన డచ్‌లో స్వేచ్ఛగా అనువదించితే గెవూన్ దూర్గాన్, ఇది మా అమ్మా నాన్నలు జీవితాంతం పాటించిన నినాదం కూడా.

నా తల్లిదండ్రులు మరియు అత్తమామలు మా కుటుంబంలోని మొదటి అగ్రగాములు. ప్రతి రోజు దేవుని సముదాయముగా, సంఘమునకు చేరుకుంటున్న వారందరి తరహాలోనే, వారు కూడా తమ స్వంత “మైదానాలను” దాటి వచ్చారు. వారి కథలు ఎద్దులు మరియు బండ్లతో సంబంధం కలిగియుండకపోవచ్చు, కానీ అవి భవిష్యత్తు తరాలపై అదే ప్రభావాన్ని చూపిస్తాయి.

వారు సువార్తను స్వీకరించి, తమ యౌవనంలోనే బాప్తిస్మము పొందారు. నా తల్లిదండ్రులిద్దరి బాల్యం చాలా కష్టంగా గడిచింది. నా తండ్రి ఇండోనేషియాలోని జావా ద్వీపంలో పెరిగారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, ఆయన బలవంతంగా తన కుటుంబం నుండి వేరుచేయబడి, ఒక నిర్బంధ శిబిరంలో ఉంచబడ్డారు, అక్కడ ఆయన చిన్న వయస్సులోనే చెప్పలేని కష్టాలను అనుభవించారు.

నా తల్లి ఓ విడిపోయిన కుటుంబంలో పెరిగింది మరియు ఆమె కూడా ఆకలి బాధలు, రెండవ ప్రపంచ యుద్ధం యొక్క కష్టాలను అనుభవించింది. కొన్ని సందర్భాలలో, ఆమె తులిప్ మొగ్గలను తినే పరిస్థితి వచ్చింది. ఆమె తండ్రి చేసిన చర్యల కారణంగా మరియు తరువాత ఆమె తల్లికి విడాకులు ఇచ్చినందున, పరలోక తండ్రిని ఒక ప్రేమగల తండ్రిగా చూడడం ఆమెకు కొన్నిసార్లు కష్టంగా అనిపించేది.

నా తల్లిదండ్రులు ఒక సంఘ కార్యక్రమంలో కలిశారు మరియు కొంతకాలానికే పెళ్లి చేసుకుని, బేర్న్, స్విట్జర్లాండ్ దేవాలయములో ముద్రవేయబడ్డారు. రైల్వే స్టేషన్‌లో వేచి చూస్తున్నప్పుడు, దేవాలయ యాత్ర కోసం తమ కొద్దిపాటి పొదుపును పూర్తిగా ఖర్చుచేసి, భవిష్యత్తు‌లో జీవనోపాధి ఎలా సాగించాలి అని ఆలోచించారు, కానీ చివరికి అన్నీ సక్రమంగా సాగుతాయనే నమ్మకంతో ఉన్నారు. మరియు అలాగే జరిగింది!

వారు ఆమ్స్టర్డామ్ నడిబొడ్డున ఉన్న చాలా నిరాడంబరమైన, ఒకే అటకపై ఉన్న అపార్ట్‌మెంట్ నుండి తమ కుటుంబాన్ని పోషించుకోవడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల పాటు చేతితో బట్టలు ఉతికిన తర్వాత, వారు చివరికి ఒక వాషింగ్ మెషిన్ కొనడానికి సరిపడా డబ్బు పొదుపు చేసుకున్నారు. అది కొనుగోలు చేసేందుకు వెళ్లే ముందు, బిషప్పు వారిని సందర్శించి, ఆమ్స్టర్డామ్‌లో సమావేశ మందిర నిర్మాణం కోసం విరాళం ఇవ్వాలని కోరారు. వారు వాషింగ్ మెషిన్ కోసం పొదుపు చేసిన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేందుకు నిర్ణయించుకుని, చేతులతోనే బట్టలు ఉతకడం కొనసాగించారు.

ఒక కుటుంబంగా మేము కూడా ఇతర కుటుంబాల మాదిరిగానే, కొన్ని కష్టాలను ఎదుర్కొన్నాము. ఈ అనుభవాలు మమ్మల్ని మరింత బలంగా మార్చాయి మరియు ప్రభువైన యేసు క్రీస్తుపై మా విశ్వాసాన్ని మరింతగా పెంచాయి, ఆల్మా తన కుమారుడైన హీలమన్‌తో తన కథను పంచుకుంటున్నప్పుడు, ఆయన “తన జీవితంలో ఎదురైన అన్ని పరీక్షలు మరియు కష్టాలలో” ప్రభువైన యేసు క్రీస్తుపై తన నమ్మకాన్ని ఉంచినందున ఆయన తనను రక్షించారని చెప్పినట్లుగా.

తమ యౌవనంలో అనేక పరీక్షలు ఎదుర్కొన్న ఈ ఇద్దరూ ఎలా నా జీవితంలో కోరుకున్న అత్యుత్తమ తల్లిదండ్రులుగా అయ్యారు? సమాధానం చాలా సులభమైనది: వారు సువార్తను పూర్తిగా స్వీకరించారు మరియు ఈ రోజువరకు తమ నిబంధనలను పాటిస్తూ జీవిస్తున్నారు!

65 సంవత్సరాలకుపైగా వైవాహిక జీవితానంతరం, అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న నా తల్లి ఈ ఫిబ్రవరిలో మరణించారు. 92 ఏళ్ల వయసులో ఇంట్లోనే నివసిస్తున్న, మా నాన్న, ఆమె చనిపోయే వరకు వీలైనంత తరచుగా ఆమెను సందర్శించేవారు. కొంతకాలం క్రితం, నా తండ్రి నా తోబుట్టువులతో మాట్లాడినప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇండోనేషియాలోని శిబిరంలో ఆయన అనుభవించిన భయానక కష్టాలు, ఇన్నేళ్లపాటు ఆయన భార్యను ఓర్పుతో చూసుకోవడానికి, ఆమె ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతూ బలహీనపడినప్పుడు, చివరికి ఆమె ప్రధాన సంరక్షణను ఇతరులవద్ద వదిలేయాల్సిన సమయంలో, తనతో పాటు ఉండలేకపోయినా, ఆయన ఆ కఠినమైన రోజును ఓర్పుగా ఎదుర్కొనగలగడానికి తనను సిద్ధం చేశాయని చెప్పారు. వారి నినాదం అప్పుడు మరియు ఎప్పటికీ, మహిమయందు ఆయనతో నివసించుటకు అంత్యదినమున ఆయన వారిని పైకి లేపునని క్రీస్తులో పరిపూర్ణ నిరీక్షణతో “కొనసాగండి” గానే ఉంటుంది.

వారి విశ్వాసం మరియు సాక్ష్యాలు, వారి తర్వాతి తరాలకు ఒక ప్రేరణాత్మక శక్తిగా ఉన్నాయి.

నా భార్య పెరిగిన గ్రామంలో, సంఘానికి వెళ్ళే మంచి వ్యక్తులు అయిన ఆమె తల్లిదండ్రులు, ఒక యువ వైవాహిక జంటగా సువార్తను స్వీకరించారు, అప్పుడు నా భార్య వయస్సు రెండు సంవత్సరాలు మరియు ఆమె వారి ఏకైక సంతానం. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా మారాలని వారు తీసుకున్న నిర్ణయం వారి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపించింది, ఎందుకంటే దానివలన గ్రామస్థులు మరియు కుటుంబ సభ్యులు వారిని దూరం పెట్టారు. ఎన్నో సంవత్సరాలు, కుటుంబ సభ్యులకు ప్రేమపూర్వక సందేశాలు రాస్తూ, సమాజానికి సేవ చేసిన తరువాత వారు అంగీకరించబడ్డారు.

ఒక సందర్భంలో నా భార్య తండ్రి బిషప్పుగా సేవలందిస్తున్నప్పుడు, ఆయనపై ఏవో తప్పుడు ఆరోపణలు మోపి అతన్ని వెంటనే విడుదల చేసారు. మా అత్తగారు చాలా బాధపడి, ఆమె భర్తను సంఘానికి వెళ్లడం కొనసాగించాలా వద్దా అని అడిగారు. దానికి ఆయన, ఇది మనుషుల సంఘం కాదు, ఇది యేసు క్రీస్తు యొక్క సంఘం కాబట్టి మనం సంఘానికి వెళ్లడం కొనసాగించాలి అని సమాధానం ఇచ్చారు.

నిజం వెలుగులోకి రావడానికి మరియు క్షమాపణలు చెప్పడానికి కొంత సమయం పట్టింది. వారి జీవితంలో విరిగి పోవడానికి ఏది కారణమై ఉండవచ్చో అది వారికి బలాన్ని మరియు దృఢనిశ్చయాన్ని ఇచ్చింది.

మనలో కొందరు, తమ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ నమ్మకంగా నిలిచిన మన తల్లిదండ్రుల విశ్వాసాన్ని మరియు సాక్ష్యాన్ని ఎందుకు తేలికగా తీసుకుంటారు? వారికి విషయాల గురించి స్పష్టమైన అవగాహన లేదని మనం అనుకుంటున్నామా? వారు మోసపోలేదు మరియు మోసపోరు! వారు పరిశుద్ధాత్మతో చాలా అనుభవాలను కలిగి ఉన్నారు మరియు ప్రవక్త జోసెఫ్ చెప్పినట్లుగా, “దానిని నేనెరుగుదును, … మరియు దానిని నేను తృణీకరించలేను” అని వారు కూడా చెప్పగలరు.

హీలమన్ యొక్క సైన్యం గురించి పిల్లల పాటల పుస్తకంలో ఉన్న ఆ అద్భుతమైన పాట అంటే మీకు కూడా ఇష్టమేనా?

మనం పురాతన కాలం నాటి నీఫైలా జన్మించాము,

ప్రభువును ప్రేమించే మంచి తల్లిదండ్రులకు.

మనకు బోధించబడింది మరియు మనం అర్థం చేసుకున్నాము,

ప్రభువు ఆజ్ఞాపించినట్లు మనం చేయాలని.

కొన్నిసార్లు పరిస్థితి అది కాకపోయినా, మా అమ్మ చిన్నప్పుడు అనుభవించినట్లుగా, మీరు “ప్రభువును ప్రేమించే శ్రేష్ఠమైన తల్లిదండ్రులలో” ఒకరిగా మారవచ్చు మరియు ఇతరులకు నీతివంతమైన ఉదాహరణను అందించవచ్చు.

మనము ఈ పాటను పాడుతున్నప్పుడు, ఇది పూర్తిగా నిజమని మనము భావిస్తున్నామా? మీరు “హీలమన్ సైన్యంలా” ఉన్నారని మరియు “ప్రపంచానికి ఆయన సత్యాన్ని తీసుకురావడానికి మీరు ప్రభువు యొక్క సువార్తికులుగా ఉంటారని” మీరు భావిస్తున్నారా? అనేక ఎఫ్‌ఎస్‌వై [FSY] అమరిక‌లలో మరియు ఇతర యువజన సమావేశాలలో ఈ పాటను పాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో నేను దీనిని అనుభవించాను.

లేదా “True to the Faith” అనే కీర్తన పాడినప్పుడు మనకు ఏమి అనిపిస్తుంది?

సీయోను యువత తడబడుతుందా

సత్యాన్ని మరియు సరైనదాన్ని సమర్థించడంలో?

శత్రువు దాడి చేస్తున్నప్పుడు,

మనం పోరాటాన్ని కుదించుదామా లేక విస్మరిద్దామా? లేదు!

మన తల్లిదండ్రులు ఆదరించిన విశ్వాసానికి నమ్మకంగా ఉందాం.

కొత్తతరానికి చెందిన మీరందరూ ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మీకు ముందుగా వచ్చినవారి విశ్వాసం మరియు సాక్ష్యాల నుండి నేర్చుకుని, బలాన్ని పొందండి. ఒక సాక్ష్యాన్ని పొందడానికి లేదా దాన్ని పెంచడానికి త్యాగాలు చేయాల్సి ఉంటుందని మరియు ఆ “త్యాగము మనకు పరలోకము యొక్క దీవెనలను తెస్తుందని” అర్థం చేసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.

మీ జీవితాన్ని నిజంగా ఆశీర్వదించగల త్యాగం గురించి ఆలోచిస్తూ, మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్.నెల్సన్ గారిచ్చిన ఆహ్వానాన్ని పరిగణించండి మరియు ప్రార్థించండి; ఆయన “యోగ్యుడైన, సమర్థుడైన ప్రతీ యువకుడు సువార్తసేవ కోసం సిద్ధపడి, సేవ చేయాలని” కోరారు. కడవరి-దిన పరిశుద్ధ యువకులకు, సువార్త సేవ అనేది ఒక యాజకత్వ బాధ్యత. …

…యౌవనులు మరియు సమర్థులైన సహోదరీలారా, మీకు సువార్తసేవ అనేది శక్తివంతమైనదే, కానీ ఐచ్ఛికమైన అవకాశం.”

మీరు సేవా సువార్తికులుగా లేదా బోధనా సువార్తికులుగా పిలువబడవచ్చు. రెండు రకాల సువార్తికులూ, తమతమ విభిన్నమైన మరియు శక్తివంతమైన విధానాల్లో, ఆత్మలను క్రీస్తు వద్దకు తీసుకురావాలనే ఒకే లక్ష్యానికి దోహదం చేస్తారు.

ఈ రెండు సేవా మార్గాల్లోనూ, మీరు ప్రభువును ప్రేమిస్తున్నారని మరియు ఆయనను ఇంకా బాగా తెలుసుకోవాలని ఆశిస్తున్నారని చూపిస్తారు. “ఏలయనగా అతడు సేవించియుండని వానిని, అతనికి పరదేశియై అతని హృదయపు ఆలోచనలు, తలంపుల నుండి దూరముగా ఉన్న యజమానిని ఒక మనుష్యుడు ఎట్లు ఎరుగగలడు?” అని గుర్తుంచుకోండి.

మనమందరం, సువార్తలో ప్రథమ తరం అయినా లేదా ఐదవ తరం అయినా, మనం మన తదుపరి తరానికి విశ్వాసం, శక్తి మరియు సిలెస్టియల్ నిబద్ధత యొక్క ఏ కథలను అందించబోతున్నాము? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

మన రక్షకుడైన యేసు క్రీస్తును మరింతగా తెలుసుకోవడానికి మరియు ఆయనను మన జీవితాలకు కేంద్రంగా ఉంచడానికి మన ప్రయత్నాలను కొనసాగిద్దాం. కష్టకాలం వచ్చినప్పుడు మనం దృఢంగా నిలబడగలగడానికి, మనం నిర్మించాల్సిన బండ ఆయనే.

మనం “మన తల్లిదండ్రులు ఆదరించిన విశ్వాసానికి నమ్మకంగా ఉందాం, సత్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులపట్ల నమ్మకంగా ఉందాం, దేవుని ఆజ్ఞలకు, మన ప్రాణం, హృదయం, చేతులతో పాటు అంకితభావంతో ఉందాం, నమ్మకంగా మరియు నిజాయితీగా ఎప్పటికీ నిలిచి ఉందాం.” యేసు క్రీస్తు నామములో, ఆమేన్.