సర్వసభ్య సమావేశము
మీ హృదయములను కఠినపరచుకోకండి
2025 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


11:6

మీ హృదయములను కఠినపరచుకోకండి

మనం నిజాయితీగా పశ్చాత్తాపపడి, మనల్ని మనం తగ్గించుకుని, ప్రభువును విశ్వసించి ఆయనపై ఆధారపడితే, మన హృదయాలు మృదువుగా మారతాయి.

తండ్రియైన దేవుడు మరియు ఆయన ప్రియ కుమారుడు యువ జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమై, అతని వినయపూర్వకమైన ప్రార్థనకు సమాధానమిచ్చినప్పుడు, యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన ప్రారంభమైంది. పునఃస్థాపనలో భాగంగా, జోసెఫ్ స్మిత్ దేవుని బహుమానం మరియు శక్తి ద్వారా ఒక పురాతన వ్రాతప్రతిని అనువదించాడు. అందులో “అమెరికాలోని ప్రాచీన నివాసులతో దేవుని వ్యవహారముల వృత్తాంతమున్నది మరియు ఇది శాశ్వతమైన సువార్త యొక్క సంపూర్ణతను కలిగియున్నది.”

నా చిన్నప్పుడు, మోర్మన్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, లేమన్‌ మరియు లెముయెల్ వారికి ఇవ్వబడిన సత్యాలను ఎందుకు నమ్మలేదని, ప్రభువు యొక్క దేవదూత ప్రత్యక్షమై వారితో నేరుగా మాట్లాడినప్పటికీ వారు ఎందుకు నమ్మలేదని నేను తరచుగా ఆలోచించాను. లేమన్‌ మరియు లెముయెల్ తమ తండ్రి లీహై మరియు వారి తమ్ముడు నీఫై బోధనలకు మరింత వినయంగా మరియు విధేయులుగా ఎందుకు ఉండలేకపోయారు?

నేను ఈ ప్రశ్నకు ఒక సమాధానాన్ని 1 నీఫైలో కనుగొన్నాను, అందులో నీఫై “వారి హృదయ కాఠిన్యమును బట్టి నొచ్చుకొనెను,” అని చెప్పబడింది. నీఫై తన అన్నలను, “మీరు, మీ హృదయములయందు ఇంత కఠినముగా, మీ మనస్సులయందు ఇంత గ్రుడ్డిగా ఎలా ఉన్నారు?” అని అడిగాడు.

హృదయ కాఠిన్యత కలిగియుండడం అంటే ఏమిటి?

మోర్మన్ గ్రంథంలో “కాఠిన్యం” యొక్క కొరియన్ అనువాదం 완악 (వాన్-ఆక్: 頑惡). ఈ పదబంధంలో చైనీస్ అక్షరాలు ఉపయోగించబడ్డాయి, ఇందులో “Wan” (頑) అంటే “మొండితనం” మరియు “Aak” (惡) అంటే “దుష్టుడు” అని అర్థం. మన హృదయాలను కఠినపరచుకున్నప్పుడు, మనం అంధులమవుతాము మరియు మంచి విషయాలు మన హృదయాలలోకి లేదా మన మనస్సులలోకి రాలేవు. మనం మొండిగా మారి, లోకసంబంధమైన కోరికలపై ఎక్కువ దృష్టి పెడతాము మరియు దేవునికి విధేయులవడానికి ఇష్టపడము. ఇతరుల అభిప్రాయాలను మరియు మార్గదర్శకత్వాన్ని అంగీకరించకుండా, మనం కేవలం మన స్వంత ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించడాన్ని ఎంచుకుంటాము. దేవునికి విధేయులవడానికి ఎంచుకోము, కానీ దానికి బదులుగా లోకము చేత మరియు శత్రువు చేత ప్రభావితం చేయబడడానికి ఎంచుకుంటాము. మన హృదయాలు కఠినంగా మారినప్పుడు, మనం పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ప్రతిఘటిస్తాము. మనం “ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు వెనుకాడతాం” మరియు కాలక్రమేణా మనం ఆయన మాటలకు “ఇంద్రియజ్ఞానమును కోల్పోతాం.”

కొందరు “వారి హృదయ కాఠిన్యమును బట్టి దేవుని ఆత్మను తిరస్కరిస్తారు,” అని అమ్మోనైహాలోని ప్రజలకు ఆల్మా బోధించాడు. “తమ హృదయములను కఠినపరచుకొను వారికి ఆయన మర్మములను గూర్చి వారు ఏమియు ఎరుగకయుండునంత తక్కువగా వాక్యము ఇవ్వబడును” అని కూడా ఆయన బోధించాడు. చివరికి, ఆత్మ ఉపసంహరించబడుతుంది మరియు లేమన్‌, లెముయెల్ లాగా తమ హృదయాలను కఠినపరచుకున్న వారి నుండి ప్రభువు “[తన] వాక్యమును తీసివేస్తారు.” లేమన్ మరియు లెముయెల్ నిరంతరం తమ హృదయాలను కఠినపరచుకుంటూ, పరిశుద్ధాత్మ భావాలను ప్రతిఘటిస్తూ, వారి తండ్రి మరియు నీఫై మాటలను, బోధనలను అంగీకరించకూడదని ఎంచుకున్నందున, వారు చివరికి దేవుని నుండి నిత్య సత్యాలను తిరస్కరించారు.

లేమన్‌ మరియు లెముయెల్‌లకు భిన్నంగా, నీఫై ప్రభువు యొక్క ఆత్మ నుండి మార్గదర్శకత్వం కోరుతూ, నిరంతరం తనను తాను తగ్గించుకున్నాడు. దానికి బదులుగా, ప్రభువు నీఫై హృదయాన్ని మృదువుగా చేశారు. “నేను ప్రభువుకు మొరపెట్టగా ఆయన నన్ను దర్శించి, నా హృదయమును మృదువుగా చేసినందున నా తండ్రి చేత పలుకబడిన మాటలన్నింటిని నేను నమ్మితిని” అని నీఫై పంచుకున్నాడు. దేవుని మర్మములన్నింటినీ మరియు ఆయన మాటలను అంగీకరించడానికి, అర్థం చేసుకోవడానికి మరియు నమ్మడానికి ప్రభువు నీఫైకి సహాయం చేశారు. నీఫై పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసాన్ని పొందగలిగాడు.

మన హృదయాలను కఠినపరచుకోకుండా ఉండడానికి మనం ఏమి చేయగలం?

మొదటిది, మనం రోజువారీ పశ్చాత్తాపాన్ని సాధన చేయవచ్చు.

“పశ్చాత్తాపపడి, చిన్నబిడ్డవలే నా యొద్దకు వచ్చువానిని నేను చేర్చుకొందును” అని మన రక్షకుడు బోధించారు. మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు:

“పశ్చాత్తాపము పురోగతికి కీలకము. స్వచ్ఛమైన విశ్వాసం మనలను నిబంధన మార్గంలో ముందుకు సాగేలా చేస్తుంది.

“దయచేసి భయపడవద్దు లేదా పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేయవద్దు. సాతాను మీ కష్టాలను చూసి ఆనందిస్తాడు. … ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించడంలోని ఆనందాన్ని అనుభవించడాన్ని ఈరోజే ప్రారంభించండి. రక్షకుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తారు, ముఖ్యంగా మనం పశ్చాత్తాపపడినప్పుడు ప్రేమిస్తారు.”

మన హృదయాలను మృదువుగా చేసుకుని ప్రభువు వద్దకు రావడం వల్ల కలిగే ఆనందాన్ని మనం అనుభవించినప్పుడు, మనం “చిన్నపిల్లవాని వలె విధేయుడై, సాత్వికుడై, వినయము మరియు సహనము కలిగి ప్రేమతో నిండి, పిల్లవాడు తన తండ్రికి లోబడునట్లుగా అతనిపై విధించుటకు తగినవని ప్రభువు చూచు విషయములన్నిటికి లోబడుటకు ఇష్టపడు పిల్లవానిగా” మారుతాము.

రెండవది, మనం వినయాన్ని అలవర్చుకోవచ్చు.

రోజువారీ పశ్చాత్తాపం మనల్ని వినయంగా ఉండేలా చేస్తుంది. తండ్రికి లోబడిన చిన్న పిల్లవాడిలా, మనం ప్రభువు ఎదుట వినయంగా ఉండాలని కోరుకుంటాము. అప్పుడు పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో ఉంటారు మరియు మన హృదయాలు మృదువుగా ఉంటాయి.

నాకు, నా భార్య సూకి గత నాలుగు సంవత్సరాలుగా ఒక అద్భుతమైన జంట తెలుసు. మేము మొదట వారిని కలిసినప్పుడు, భర్త సంఘములో కొత్త సభ్యుడు మరియు అతని భార్య సువార్తను అధ్యయనం చేయడానికి సువార్తికులతో సమావేశమవుతోంది. క్రీస్తునొద్దకు రావడానికి ఆమెకు సహాయం చేయడానికి చాలామంది సువార్తికులు ఆమెను కలిశారు. ఆమెకు సువార్త గురించి బలమైన సాక్ష్యం ఉందని మరియు సంఘము సత్యమని ఆమెకు తెలుసునని మేము భావించాము. మా సందర్శనల సమయంలో ఆమె తరచుగా పరిశుద్ధాత్మను అనుభవించింది మరియు అన్ని సమావేశాలలో చురుకుగా పాల్గొంది. వార్డులో అద్భుతమైన సభ్యులతో సంభాషించడాన్ని ఆమె ఇష్టపడేది. అయితే, బాప్తిస్మపు నీటిలోకి ప్రవేశించడానికి స్థిరనిశ్చయం పొందడం ఆమెకు కష్టమనిపించింది. ఒకరోజు ఆమె మొరోనై 7:43–44 చదువుతోంది, అందులో ఇలా ఉంది:

“మరలా నేను మీతో చెప్పునదేమనగా—అతడు సాత్వీకుడైయుండి దీనమనస్సు కలిగియుండని యెడల అతడు విశ్వాసమును, నిరీక్షణను కలిగియుండలేడు.

“అట్లయిన యెడల, [మీ] విశ్వాసము మరియు నిరీక్షణ వ్యర్థమైనవి, ఏలయనగా సాత్వీకులు మరియు దీనమనస్సు గలవారు తప్ప, ఎవరూ దేవుని యెదుట అంగీకరించబడరు.”

ఈ వాక్యాలను చదివిన తర్వాత, ఆమె ఏమి చేయాలో గ్రహించింది. సాత్వికంగా మరియు వినయంగా ఉండడం అంటే ఏమిటో అర్థం చేసుకున్నానని ఆమె అనుకుంది. అయితే, దేవుని ఆజ్ఞలను పాటించడానికి కావలసిన విశ్వాసం మరియు నిరీక్షణను కలిగియుండడానికి ఆమెకు ఉన్న అవగాహన సరిపోలేదు. ఆమె తన మొండితనాన్ని, తన స్వంత జ్ఞానాన్ని వదులుకోవలసి వచ్చింది. ఆమె హృదయపూర్వక పశ్చాత్తాపం ద్వారా తనను తాను తగ్గించుకోవడం ప్రారంభించింది. దేవుని దృష్టిలో వినయం అంటే ఏమిటో ఆమె అర్థం చేసుకోవడం ప్రారంభించింది. ఆమె పరలోక తండ్రిపై ఆధారపడింది మరియు తన స్వంత హృదయాన్ని మృదువుగా చేయమని ప్రార్థించింది. ఈ ప్రార్థనల ద్వారా, పరలోక తండ్రి ఆమె బాప్తిస్మం తీసుకోవాలని కోరుకుంటున్నారని పరిశుద్ధాత్మ ఆమెకు సాక్ష్యమిచ్చినట్లు ఆమె భావించింది.

వారు ఎంత వినయంగా మారితే, అంత ఎక్కువగా దేవుని వాక్యాలను అర్థం చేసుకోవడం సాధ్యమైందని మరియు వారి హృదయాలు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క బోధనలను అనుసరించేందుకు మరింత మృదువుగా మారాయని భార్యాభర్తలిద్దరూ పంచుకున్నారు.

మూడవది, మనం మన రక్షకుడిపై నమ్మకముంచి, ఆయనపై ఆధారపడవచ్చు.

ప్రభువునందు నమ్మకం ఉంచడం ద్వారా తన హృదయం మృదువుగా మరడానికి అనుమతించడంలో నీఫై ఒక గొప్ప ఉదాహరణ. ఆయన ఇలా బోధించాడు, “ఓ ప్రభువా, నీ యందు నమ్మికయుంచియున్నాను, నేను శాశ్వతంగా నీ యందు నమ్మికయుంచెదను. శరీరబాహువందు నేను నమ్మికయుంచను.” అదేవిధంగా, ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు ఇవ్వబడిన ఒక బయల్పాటులో “మంచిని చేయుటకు—అవును, న్యాయము చేయుటకు, వినయముగా నడుచుకొనుటకు, నీతిగా తీర్పు తీర్చుటకు నడిపించు ఆత్మయందు నమ్మకముంచుము” అని ప్రభువు చెప్పారు. మనం ప్రభువుపై నమ్మకం ఉంచి ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయన మన హృదయాలను మృదువుగా చేస్తారు మరియు మన శోధనలందు, కష్టములందు, శ్రమలందు మనకు సహాయము లభిస్తుంది.

మనం నిజాయితీగా పశ్చాత్తాపపడి, మనల్ని మనం తగ్గించుకుని, ప్రభువును విశ్వసించి ఆయనపై ఆధారపడితే, మన హృదయాలు మృదువుగా మారతాయి. అప్పుడు ఆయన తన ఆత్మను కుమ్మరించి, పరలోక మర్మములను మనకు చూపిస్తారు. ఆయన బోధించిన మాటలన్నింటినీ మనం నమ్ముతాము మరియు మన అవగాహన మరింత ఎక్కువ అవుతుంది.

మన రక్షకుడైన యేసు క్రీస్తు సాత్వికతకు అంతిమ ఉదాహరణ. 2 నీఫై 31:7 లో, “కానీ ఆయన పరిశుద్ధుడైయున్నప్పటికీ, శరీరానుసారముగా తననుతాను తండ్రి యెదుట తగ్గించుకొనుచున్నాడని నరుల సంతానమునకు చూపుచు, తండ్రి ఆజ్ఞలను పాటించుటలో తాను ఆయనకు లోబడియుండెదనని తండ్రికి సాక్ష్యమిచ్చుచున్నాడు” అని మనం చదువుతాము. ఆయన పరిశుద్ధుడు మరియు పరిపూర్ణుడు అయినప్పటికీ, ఆయన తండ్రి యెదుట తనను తాను తగ్గించుకొని బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఆయనకు విధేయుడయ్యాడు.

తన మర్త్య జీవితం ముగింపులో, యేసు క్రీస్తు ఆ చేదు గిన్నెనుండి త్రాగడం ద్వారా, తన స్వంత చిత్తాన్ని తన తండ్రికి సమర్పించుకున్నారు. ఆ శ్రమ ఆయనను “బాధ వలన వణకి, ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారి, శరీరము మరియు ఆత్మ శ్రమపడునట్లు చేసెను.” రక్షకుడు “ఆ చేదు గిన్నెనుండి త్రాగకుండా వెనుదిరగాలని” అడిగారు. అయినప్పటికీ, “తండ్రికి మహిమ కలుగును గాక అని చెప్పి, [ఆయన] త్రాగి, నరుల సంతానము కొరకైన [ఆయన] సిద్ధపాటులను ముగించారు.”

సహోదర సహోదరీలారా, మనకు నైతిక కర్తృత్వము ఇవ్వబడింది. మనం మన హృదయాలను కఠినపరచుకోవడాన్ని ఎంచుకోవచ్చు లేదా మన హృదయాలను మృదువుగా చేసుకోవడాన్ని ఎంచుకోవచ్చు. మన రోజువారీ జీవితంలో, ప్రభువు యొక్క ఆత్మ మన హృదయాలలోకి వచ్చి నివసించడానికి ఆహ్వానించే పనులను చేయాలని మనం ఎంచుకోవచ్చు. ఈ ఎంపికలలో శాంతి మరియు ఆనందం ఉన్నాయని నాకు తెలుసు.

తండ్రి చిత్తాన్ని అనుసరించిన మన రక్షకుడైన యేసు క్రీస్తు మాదిరిని మనం కూడా అనుసరిద్దాం. మనం అలా చేసినప్పుడు, “ఇదిగో, వారు తమ హృదయాలను కఠినపరచుకొనని యెడల, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకొనునో అలాగే నేనును వారిని చేర్చుకొందును,” అని ప్రభువు మనకు వాగ్దానం చేసారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.