2020–2024
ప్రభువైన యేసు క్రీస్తు మరలా వస్తారు
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


14:49

ప్రభువైన యేసు క్రీస్తు మరలా వస్తారు

సహోదర సహోదరీలారా, మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడేందుకు మీకు మరియు నాకు సమయమిదే.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మీతో మాట్లాడడానికి ప్రభువు నన్ను ఆశీర్వదించినందుకు నేను కృతజ్ఞుడిని.

ఈ సమావేశంలో, ప్రభువు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడారు. వారి సందేశాలు చదవమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. వచ్చే ఆరు నెలల్లో ఏది నిజము, ఏది కాదు అని తెలుసుకోవడానికి వాటిని లిట్మస్ పరీక్షలా ఉపయోగించండి.

సాల్ట్ లేక్ దేవాలయము మరియు టెంపుల్ స్క్వేర్‌లోని ఇతర ప్రాంతాల సంరక్షణ మరియు పునరుద్ధరణ దాదాపు ఐదు సంవత్సరాలుగా జరుగుతోంది. ఈ పని 2026 చివరి నాటికి పూర్తవుతుందని ప్రస్తుత అంచనాలు సూచిస్తున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టు‌లో పనిచేస్తున్న వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

గత ఆరు నెలల్లో, మేము ఐదు దేశాలలో తొమ్మిది దేవాలయాలను ప్రతిష్ఠించాము లేదా పునఃప్రతిష్ఠ చేసాము. ఇప్పటి నుండి సంవత్సరం ముగిసేలోపు, మేము మరో ఐదింటిని ప్రతిష్ఠిస్తాము.

ఈరోజు, మరో 17 దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. నేను ప్రాంతాలను ప్రకటిస్తున్నప్పుడు దయచేసి భక్తిపూర్వకంగా వినండి.

  • హుచిటాన్ డ జరగోజా, మెక్సికో

  • శాంటయానా, ఎల్ సాల్వడోర్

  • మెడయీన్, కొలంబియా

  • శాంటియాగో, డొమినికన్ రిపబ్లిక్

  • ప్యూయెర్టొ మాంట్, చిలి

  • డబ్లిన్, ఐర్లాండ్

  • మలాన్, ఇటలీ

  • అబూజా, నైజీరియా

  • కంపాలా, యుగాండా

  • మపూటో, మోజాంబిక్

  • కోర్ డలీన్, ఐడహో

  • క్వీన్ క్రీక్, అరిజోనా

  • ఎల్ పాసో, టెక్సాస్

  • హంట్స్‌విల్, అలబామా

  • మిల్లాకి, విస్కాన్సిన్

  • సమ్మిట్, న్యూజెర్సీ

  • ప్రైస్, యూటా

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మన కళ్ళ ముందు ఏం జరుగుతోందో మీరు చూస్తున్నారా? ఈ క్షణం యొక్క మహిమను మనం కోల్పోకూడదని నేను ప్రార్థిస్తున్నాను! ప్రభువు నిజంగా తన పనిని వేగవంతం చేస్తున్నారు.

మునుపెన్నడూ లేనంత వేగంగా మనం దేవాలయాలను ఎందుకు నిర్మిస్తున్నాము? ఎందుకు? ఎందుకంటే అలా చేయమని ప్రభువు మనకు సూచించారు. దేవాలయ దీవెనలు ఇశ్రాయేలీయుల‌ను తెరకు రెండు వైపులా సమకూర్చడానికి సహాయపడతాయి. ఈ దీవెనలు ప్రభువు యొక్క రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయడంలో సహాయపడే జనులను సిద్ధం చేయడానికి కూడా సహాయపడతాయి!

రక్షకుని రెండవ రాకడ.

ప్రవక్త యెషయా ప్రవచించినట్లుగా మరియు హాండెల్ యొక్క మెస్సీయలో సూచించబడినట్లుగా, యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, “యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు.”

ఆ రోజు, “ఆయన భుజముమీద రాజ్యభారముండును: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.”

పాత యెరూషలేము మరియు “అమెరికా ఖండములో నిర్మించబడిన” నూతన యెరూషలేము రెండింటి నుండి యేసు క్రీస్తు పరిపాలిస్తారు. ఈ రెండు కేంద్రాల నుండి, ఆయన తన సంఘ వ్యవహారాలను నిర్దేశిస్తారు.

ఆ రోజున, ప్రభువు “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు” అని పిలువబడతారు. ఆయనతో ఉన్నవారు “పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యుందురు.”

సహోదర సహోదరీలారా, మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడేందుకు మీకు మరియు నాకు సమయమిదే. మన శిష్యత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఇదే. మనల్ని తప్పుదోవ పట్టించే విషయాలతో నిండిన ప్రపంచంలో, మనం దీన్ని ఎలా చేయగలం?

రోమ్ ఇటలీ దేవాలయము.

దేవాలయంలో క్రమమైన ఆరాధన మనకు సహాయపడుతుంది. ప్రభువు యొక్క మందిరంలో, మనం యేసు క్రీస్తుపై దృష్టిపెడతాము. ఆయన గురించి నేర్చుకుంటాము. ఆయనను అనుసరించడానికి మనం నిబంధనలు చేస్తాము. మనం ఆయన గురించి తెలుసుకుంటాము. మనం మన దేవాలయ నిబంధనలను పాటించినప్పుడు, ప్రభువు యొక్క బలపరిచే శక్తిని మనం ఎక్కువగా పొందుతాము. దేవాలయంలో, లోకము యొక్క దెబ్బల నుండి మనం రక్షణ పొందుతాము. యేసు క్రీస్తు మరియు మన పరలోక తండ్రి యొక్క స్వచ్ఛమైన ప్రేమను మనం అత్యధికంగా అనుభవిస్తాము! ప్రపంచంలోని అల్లకల్లోలానికి భిన్నంగా మనము శాంతిని, ఆధ్యాత్మిక భరోసాను అనుభవిస్తాము.

మీ కోసం ఇది నా వాగ్దానం: యేసు క్రీస్తును హృదయపూర్వకంగా వెదికే ప్రతి ఒక్కరూ దేవాలయంలో ఆయనను కనుగొంటారు. మీరు ఆయన దయను అనుభవిస్తారు. మిమ్మల్ని బాగా వేధించే ప్రశ్నలకు మీరు సమాధానాలను కనుగొంటారు. ఆయన సువార్త యొక్క ఆనందాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు.

నేను ఎవరికి లేదా దేనికి నా జీవితాన్ని ఇస్తాను? అనేది మనలో ప్రతి ఒక్కరూ సమాధానం ఇవ్వవలసిన అత్యంత కీలకమైన ప్రశ్న అని నేను తెలుసుకున్నాను.

శస్త్రవైద్యునిగా అధ్యక్షులు నెల్సన్.

యేసు క్రీస్తును అనుసరించాలనే నా నిర్ణయం నేను తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయం. వైద్య పాఠశాలలో ఉన్నప్పుడు, నేను తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క దైవత్వానికి సంబంధించిన సాక్ష్యాన్ని పొందాను. అప్పటి నుండి, మన రక్షకుడనే బండమీద నేను నా జీవితాన్ని నిర్మించుకున్నాను. ఆ ఎంపిక గొప్ప ప్రభావాన్ని చూపింది! ఆ నిర్ణయం అనేక ఇతర నిర్ణయాలను సులభతరం చేసింది. ఆ నిర్ణయం నాకు లక్ష్యాన్ని, దిశానిర్దేశాన్ని ఇచ్చింది. అది జీవితంలోని కష్టాలను సహించడానికి కూడా నాకు సహాయపడింది. నేను రెండు ఉదాహరణలను పంచుకుంటాను:

మొదటిది, నా భార్య డాంట్జెల్ అనుకోకుండా మరణించినప్పుడు, నేను మా పిల్లలలో ఎవరినీ చేరుకోలేకపోయాను. ఆ సమయంలో నేను ఒంటరిగా, ధ్వంసమై, సహాయం కోసం అర్థిస్తున్నాను. నా ప్రియమైన డాంట్జెల్ ఎందుకు చనిపోయిందో ఆయన ఆత్మ ద్వారా ప్రభువు నాకు బోధించినందుకు కృతజ్ఞుడిని. ఆ అవగాహనతోనే నాకు ఓదార్పు లభించింది. కాలక్రమేణా, నేను నా దుఃఖాన్ని బాగా తట్టుకోగలిగాను. తరువాత, నేను నా ప్రియమైన భార్య వెండీని వివాహం చేసుకున్నాను. ఆమె నా రెండవ ఉదాహరణలో ముఖ్యమైన భాగం.

వెండీ, నేను సుదూర దేశంలో నియామకం‌పై ఉన్నప్పుడు, సాయుధ దొంగలు నా తలపై తుపాకీ పెట్టి ట్రిగ్గర్‌ని లాగారు. కానీ తుపాకీ పేలలేదు. ఆ అనుభవమంతటా మా ఇద్దరి ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. అయినప్పటికీ వెండి, నేను నిశ్చయమైన శాంతిని అనుభవించాము. అది “సమస్త జ్ఞానాన్ని మించిన శాంతి.”

సహోదర సహోదరీలారా, ప్రభువు మిమ్మల్ని కూడా ఓదారుస్తారు! ఆయన మిమ్మల్ని బలపరుస్తారు. గందరగోళం మధ్య కూడా ఆయన మీకు శాంతిని అనుగ్రహిస్తారు.

ప్రభువైన యేసు క్రీస్తు.

దయచేసి యేసు క్రీస్తు మీకు చేసిన ఈ వాగ్దానాన్ని వినండి: “నేను మీ కుడివైపున, మీ ఎడమవైపున ఉందును, నా ఆత్మ మీ హృదయములందుండును, మిమ్ములను ఎత్తుకొనుటకు మీ చుట్టూ నా దేవదూతలు కావలియుందురు.”

మీకు సహాయం చేసే రక్షకుని సామర్థ్యానికి హద్దు లేదు. గెత్సేమనేలో మరియు కల్వరిలో ఆయన అపారమైన బాధ మీ కోసమే! ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తం మీ కోసమే!

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం గురించి మీ అవగాహనను పెంచుకోవడానికి—మీ జీవితాంతం—ప్రతీ వారం సమయాన్ని కేటాయించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. పాపంలో కూరుకుపోయి ఎలా బయటపడాలో తెలియని వారి కోసం నా హృదయం దుఃఖిస్తోంది. ఆధ్యాత్మికంగా శ్రమపడుతున్న వారు లేదా ఒంటరిగా బరువైన భారాలను మోస్తున్న వారి కోసం నేను దుఃఖిస్తున్నాను, ఎందుకంటే యేసు క్రీస్తు వారి కోసం ఏమి చేసారో వారు అర్థం చేసుకోరు.

యేసు క్రీస్తు మీ పాపాలను, మీ బాధలను, మీ వేదనలను, మీ బలహీనతలను తనపై తీసుకున్నారు. మీరు వాటిని ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు! మీరు పశ్చాత్తాపపడినప్పుడు ఆయన మిమ్మల్ని క్షమిస్తారు. మీకు కావలసిన వాటిని ఆయన మీకు అనుగ్రహిస్తారు. గాయపడిన మీ ఆత్మను ఆయన స్వస్థపరుస్తారు. మీరు ఆయన కాడిని ఎత్తుకున్నప్పుడు, మీ భారాలు తేలికవుతాయి. మీరు యేసు క్రీస్తును అనుసరించడానికి నిబంధనలు చేసి పాటించినట్లయితే, మీ జీవితంలోని బాధాకరమైన క్షణాలు తాత్కాలికమైనవని మీరు కనుగొంటారు. మీ బాధలు “క్రీస్తు యొక్క సంతోషమందు హరించివేయబడతాయి.”

మీరు యేసు క్రీస్తు యొక్క భక్తిగల శిష్యులుగా మారడానికి ఇది తొందరపాటు కాదు లేదా ఇంకా ఆలస్యం కాలేదు. మారిన తర్వాత మీరు ఆయన ప్రాయశ్చిత్తం యొక్క ఆశీర్వాదాలను పూర్తిగా అనుభవిస్తారు. ఇశ్రాయేలీయులను సమకూర్చడానికి సహాయం చేయడంలో మీరు మరింత ప్రభావవంతంగా కూడా ఉంటారు.

యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, భవిష్యత్తులో, యేసు క్రీస్తు వెయ్యేళ్ల మెస్సీయగా భూమిపైకి తిరిగి వస్తారు. కాబట్టి ఈ రోజు, మీ జీవితాలను యేసు క్రీస్తుకు తిరిగి అంకితం చేయమని నేను మీకు పిలుపునిస్తున్నాను. చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను సమకూర్చడానికి మరియు ప్రభువు యొక్క రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయడానికి సహాయపడమని నేను మీకు పిలుపునిస్తున్నాను. క్రీస్తును గూర్చి మాట్లాడమని, క్రీస్తును గూర్చి సాక్ష్యమివ్వమని, క్రీస్తును విశ్వసించమని మరియు క్రీస్తునందు ఆనందించమని నేను మీకు పిలుపునిస్తున్నాను!

క్రీస్తు యొద్దకు రండి మరియు “మీ పూర్ణ [ఆత్మ]లను ఆయనకు అర్పించండి.” ఆనందకరమైన జీవిత రహస్యం ఇదే!

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఉత్తమమైనది ఇంకా రావలసి ఉంది, ఎందుకంటే రక్షకుడు మళ్ళీ వస్తున్నారు! ప్రభువు తన పనిని వేగవంతం చేస్తున్నందున ఉత్తమమైనది ఇంకా రావలసి ఉంది. మన హృదయాలను మరియు మన జీవితాలను పూర్తిగా యేసు క్రీస్తు వైపుకు మళ్ళించినప్పుడు, ఉత్తమమైనది ఇంకా రావలసి ఉంది.

యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడని నేను సవినయముగా సాక్ష్యమిస్తున్నాను. నేను ఆయన శిష్యుడిని. ఆయన సేవకునిగా ఉండడాన్ని నేను గౌరవప్రదంగా భావిస్తున్నాను. ఆయన రెండవ రాకడ సమయంలో, “యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు.” నీతిమంతులకు ఆ రోజు ఆనందంతో నిండి ఉంటుంది!

నేను కలిగియున్న పవిత్రమైన యాజకత్వ తాళపుచెవుల శక్తి ద్వారా, నేను మీకు మరియు ప్రపంచమంతటికీ ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నాను! యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. మాంటై యూటా దేవాలయ పునఃప్రతిష్ఠాపన (అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, ఏప్రిల్ 21); అర్దానేటా ఫిలిప్పీన్స్ దేవాలయము (అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్, ఏప్రిల్ 28); ప్యూబ్లా మెక్సికో దేవాలయము (ఎల్డర్ గెరిట్ డబ్ల్యు. గాంగ్, మే 19); టేలర్స్‌విల్ యూటా దేవాలయము (ఎల్డర్ గెరిట్ డబ్ల్యు. గాంగ్, జూన్ 2); కోబన్ గ్వాటెమాల దేవాలయము (ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్, జూన్ 9); సాల్టా అర్జెంటీనా దేవాలయము (ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్, జూన్ 16); లేటన్ యూటా దేవాలయము (ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్, జూన్ 16); పిట్స్‌బర్గ్ పెన్సిల్వేనియా దేవాలయము (ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, సెప్టెంబరు 15); మెండోజా అర్జెంటీనా దేవాలయము (ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్‌బాండ్, సెప్టెంబరు 22).

  2. శాన్ పెడ్రో సులా హాండురస్ దేవాలయము (అక్టోబరు 13); సాల్వడార్ బ్రెజిల్ దేవాలయము (అక్టోబరు 20); డెసెరెట్ పీక్ యూటా దేవాలయము (నవంబరు 10); కాస్పర్ వయోమింగ్ దేవాలయము (నవంబరు 24); టాలహాసీ ఫ్లోరిడా దేవాలయము (డిసెంబరు 8).

  3. సిద్ధాంతము మరియు నిబంధనలు 88:73 చూడండి.

  4. యెషయా 40:5; see also George Frideric Handel, “And the Glory of the Lord,” The Messiah, ed. T. Tertius Noble (1912), 16–18.

  5. యెషయా 9:6.

  6. జెకర్యా 14:4–7; సిద్ధాంతము మరియు నిబంధనలు 45:48–66; 133:19–21 చూడండి; మీకా 4:2 కూడా చూడండి: “సీయోనులోనుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములోనుండి యెహోవా వాక్కును బయలు వెళ్లును.”

  7. విశ్వాస ప్రమాణాలు 1:10; ఈథర్ 13:3–10; సిద్ధాంతము మరియు నిబంధనలు 84:2–4 కూడా చూడండి.

  8. ప్రకటన 19:16; ప్రకటన 17:14.

  9. ఆల్మా 34:32 చూడండి.

  10. మీరు కూడా అమ్మోన్ వలె చెప్పాలని భావించవచ్చు, “ఇదిగో ప్రభువు నందు ఎవరు ఎక్కువగా అతిశయించెదరు? … ఇదిగో, … నేననుభవించుచున్న దానిలో అతి చిన్నభాగమును కూడా చెప్పలేను” (ఆల్మా 26:16).

  11. హీలమన్ 5:12 చూడండి.

  12. ఫిలిప్పీయులకు 4:7.

  13. సిద్ధాంతము మరియు నిబంధనలు 84:88.

  14. ఆల్మా 7:11–12 చూడండి; లూకా 4:18 కూడా చూడండి.

  15. ఆల్మా 7:12 చూడండి.

  16. కీర్తనలు 147:3; జేకబ్ 2:8 చూడండి.

  17. మోషైయ 24:14 చూడండి.

  18. ఆల్మా 31:38.

  19. 2 నీఫై 25:26 చూడండి.

  20. ఓంనై 1:26.