మీ విశేషాధికారాలకు అనుగుణంగా జీవించండి
యాజకత్వ విధులు మరియు నిబంధన వాగ్దానాలు, దేవుని యొక్క శక్తిని మీ జీవితంలో ప్రవహించేలా ఎలా అనుమతిస్తాయో నేర్చుకోండి.
ఇటీవల నా భర్త గ్రెగ్‌కు ఇంటెన్సివ్ సర్జరీ మరియు నెలల పాటు కీమోథెరపీ అవసరమయ్యే వ్యాధి వుందనే నిర్ధారణ జరిగింది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న మీలో చాలామందిలాగే, మేము వెంటనే పరలోక సహాయం మరియు దేవుని యొక్క శక్తి కొరకు ప్రార్థించడం ప్రారంభించాము. గ్రెగ్ శస్త్రచికిత్స తర్వాతి ఆదివారం, సంస్కారము మా ఆసుపత్రి గదికి అందచేయబడింది.
ఈ సమయములో నేను మాత్రమే సంస్కారం తీసుకుంటున్నాను. ఒక రొట్టె ముక్క. ఒక కప్పు నీరు. సంఘములో, నా మనస్సు తరచుగా సంస్కారము నిర్వహించే విధానముపై దృష్టి పెడుతుంది—సిద్ధం చేయడం, దీవించటం మరియు అందిచటం. కానీ ఆ మధ్యాహ్నం, నేను పవిత్ర విధుల ద్వారా నాకు లభించే దేవుని శక్తి యొక్క బహుమతి గురించి మరియు ఆ రొట్టె ముక్కను, ఆ కప్పు నీటిని తీసుకున్నప్పుడు నేను చేస్తున్న నిబంధన వాగ్దానాన్ని గురించి ఆలోచించాను. నిజానికి ఇది నాకు పరలోకము నుండి శక్తి అవసరమైన సమయం. గొప్ప హృదయ వేదన, అలసట మరియు అనిశ్చితి మధ్య, నాకు ఎంతో అవసరమైన శక్తిని ఆయన నుండి పొందేలా చేయగల ఈ బహుమతి గురించి నేను ఆశ్చర్యపోయాను. సంస్కారంలో పాలుపంచుకోవడం ప్రభువు యొక్క ఆత్మతో నా సాంగత్యాన్ని పెంచుతుంది, దేవదూతల పరిచర్యమరియు రక్షకుని యొక్క జయించే శక్తితో సహా, దేవుని శక్తి యొక్క బహుమతిని పొందేందుకు నన్ను అనుమతిస్తుంది.
విధులు ఎవరు నిర్వహిస్తారనేది మాత్రమే ముఖ్యమైనది కాదు—విధులు మరియు నిబంధన వాగ్దానాలను సాధ్యం చేసేవి కూడా మన దృష్టికి అర్హత కలిగియున్నాయని మునుపెన్నడూ ఇంత స్పష్టంగా నేను గ్రహించలేదు. యాజకత్వ విధులు మరియు నిబంధన వాగ్దానాలు దేవుడు మనల్ని పవిత్రం చేయడానికి మరియు తరువాత మన జీవితాలలో అద్భుతాలు చేయడానికి అనుమతిస్తాయి. అయితే ఇది ఎలా జరుగుతుంది?
మొదటిగా, ఒక విధి దేవుని శక్తిని మన జీవితాలలో ప్రత్యక్షపరచాలంటే, అది దేవుని కుమారుని నుండి అధికారంతో చేయబడినదై ఉండాలి. నిర్వహించే విధానము ముఖ్యమైనది. తండ్రి తన యాజకత్వ విధులు నిర్వహించబడే విధానమును పర్యవేక్షించడానికి తాళపుచెవులు మరియు అధికారాన్ని యేసు క్రీస్తుకు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన యాజకత్వ క్రమములో, దేవుని కుమారుని స్థానంలో నిలబడటానికి దేవుని కుమారులు నియమింపబడ్డారు.
రెండవది, మనం నిబంధన వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు—మనం వాటిని తప్పక పాటించాలి. అనేక సువార్త విధులలో, మనం దేవునితో పవిత్రమైన నిబంధనలను చేస్తాము; మనం ఆ నిబంధనలను పాటించినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తారు. ఇది యాజకత్వ విధులు మరియు దేవుని శక్తిని పొందేందుకు మనల్ని అనుమతించే నిబంధన వాగ్దానాలను పాటించడం యొక్క సమ్మేళనం అని మనం గ్రహించామా?
ఆ మధ్యాహ్నం, దేవుని నిబంధన కుమార్తెనైన నేను, యాజకత్వ విధుల ద్వారా దేవుని శక్తి యొక్క బహుమానాన్ని ఎలా పొందాలో నేను పూర్తిగా అర్థం చేసుకున్నానా మరియు దేవుని శక్తి నాలో ఎలా పనిచేస్తుందో నేను నిజంగా గుర్తించానా అని ఆశ్చర్యపోయాను.
రక్షకుని శక్తిని మన జీవితాల్లోకి ఎలా ఆకర్షించాలో మనకు బోధిస్తూ, 2019లో సంఘములోని మహిళలకు ఒక ప్రవచనాత్మక ఆహ్వానం అందించబడింది. పెన్సిల్వేనియాలోని హార్మొనీలో ఎమ్మా స్మిత్‌కు ఇవ్వబడిన బయల్పాటు గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 25లో చదవమని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని అంగీకరించడం నా జీవితాన్ని మార్చివేసింది.
గత నెలలో హార్మొనీని సందర్శించడానికి నాకొక అనుకోని అవకాశం వచ్చింది. అక్కడ, మేపుల్ చెట్ల క్రింద, జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు యాజకత్వం పునఃస్థాపించబడింది. ఆ చెట్లకు దగ్గరగా జోసెఫ్ మరియు ఎమ్మాల ఇంటి ముఖ ద్వారముంది. ఆ ఇంటిలో నిప్పుగూడుకి ఎదురుగా ఒక కిటికీ ఉంది. నేను ఆ కిటికీ దగ్గర నిలబడి, ఎమ్మా చెట్ల గుండా బయటికి చూసేటప్పుడు ఏమనుకునియుంటుందో అని ఆలోచించాను.
1830 జూలైలో, ఎమ్మా వయస్సు 26 సంవత్సరాలు; ఆమె చాలా చిన్నది. ఆమెకు పెళ్లై మూడున్నరేళ్లయింది. ఆమె తన మొదటి మగబిడ్డను కోల్పోయింది. అతని చిన్న సమాధి ఆమె ఇంటికి పక్కన ఉన్న వీధిలో ఉంది. నేను ఆ కిటికీ దగ్గర నిలబడినప్పుడు, ఆమె ఆలోచనల్లో ఏమేమి నిండియుండవచ్చో ఊహించడం నాకేమీ కష్టమనిపించలేదు. నిశ్చయంగా ఆమె వారి ఆర్థిక పరిస్థితి గురించి, వారి భద్రతకు ముప్పు కలిగించే పెరుగుతున్న హింసల గురించి మరియు వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందియుంటుంది. అయినప్పటికీ దేవుని పని ఆమె చుట్టూ అన్ని చోట్ల కొనసాగుతోంది. ప్రణాళికలో ఆమె స్థానం గురించి, ఆయన రాజ్యంలో ఆమె ఉద్దేశ్యం మరియు దేవుని దృష్టిలో ఆమె సామర్థ్యం గురించి కూడా ఆమె ఆశ్చర్యపడియుంటుందా?
ఆమె ఆశ్చర్యపడియుంటుందని నేను అనుకుంటున్నాను.
ఆమె ఇంటి దగ్గరలోనే, దేవుని యాజకత్వ అధికారం మరియు తాళపుచెవుల బహుమానం భూమిపై పునఃస్థాపించబడింది. నిజానికి ఇది ఎమ్మాకు పరలోకము నుండి శక్తి అవసరమైన సమయం. గొప్ప హృదయ వేదన, అలసట మరియు అనిశ్చితి మధ్య, ఎమ్మా తనకు ఎంతో అవసరమైన శక్తిని ఆయన నుండి పొందేలా చేయగల దేవుని యాజకత్వము యొక్క ఈ బహుమతి గురించి ఆశ్చర్యపడియుంటుందని నేను ఊహిస్తున్నాను.
కానీ ఎమ్మా కేవలం ఆ కిటికీ వద్ద నిలబడి ఆశ్చర్యపోలేదు.
తాళపుచెవులు, కార్యాలయాలు, విధులు మరియు యాజకత్వ సేవలో ఎలా సహాయపడాలనే విషయాల గురించి ప్రవక్త జోసెఫ్ శిక్షణ పొందుతున్నప్పుడు, ప్రభువు స్వయంగా తన ప్రవక్త ద్వారా ఎమ్మాకు ఒక బయల్పాటునిచ్చారు. ఈ బయల్పాటు నావూ-ఉపశమన-సమాజ-అధ్యక్షురాలు ఎమ్మాకు కాదు—హార్మొనీలోని 26 ఏళ్ల ఎమ్మాకు అందించబడింది. బయల్పాటు ద్వారా, ఎమ్మా తన జీవితంలో పని చేయడానికి ఆ యాజకత్వ విధుల సామర్థ్యాన్ని పెంచే అంతర్గత పవిత్రీకరణ మరియు నిబంధన సంబంధం గురించి నేర్చుకుంటుంది.
మొదట, ప్రభువు ఎమ్మాకు ఆమె ఎవరు మరియు ఆమె ఎవరికి చెందినవారు అనేదానితో కలిపి—ఆయన రాజ్యంలో ఒక కుమార్తె అని ఆయన ప్రణాళికలో ఆమె స్థానాన్ని గుర్తు చేశారు. ఎమ్మా తన నిబంధనలకు కట్టుబడియుంటే, దేవుని శక్తిని పొందేలా చేయగల విధులను కలిగియున్న “సుగుణపు మార్గములలో నడవడానికి” ఆమె ఆహ్వానించబడింది.
రెండవది, లోతైన దుఃఖ కాలంలో, ప్రభువు ఆమెకు లక్ష్యాన్ని తెలియజేసారు. ఎమ్మా పునఃస్థాపనలో ముందు-వరుసలో స్థానం మాత్రమే కలిగిలేదు; జరుగుతున్న పనిలో ఆమె ఒక ముఖ్యమైన భాగస్వామి. “లేఖనములను వివరించుటకు, సంఘమునకు ఉద్భోధించుటకు” ఆమె ప్రత్యేక పరచబడియుండవచ్చు. ఆమె సమయం, “వ్రాయుటకును, అధిక అభ్యాసము కొరకును” వినియోగించబడియుండవచ్చు. పరిశుద్ధులను ఆరాధన కొరకు సిద్ధం చేయడంలో సహాయపడటానికి ఎమ్మాకు పవిత్ర స్థానం ఇవ్వబడింది; వారి కీర్తనలు ప్రభువుకు ప్రార్థనలుగా స్వీకరించబడతాయి మరియు “వారి శిరస్సులపై ఒక దీవెనతో సమాధానమివ్వబడతాయి.”
చివరగా, ఎమ్మాను ఉన్నతస్థితికి సిద్ధం చేసే అంతర్గత పవిత్రీకరణ ప్రక్రియను ప్రభువు వివరించారు. “నీవు దీనిని చేయని యెడల, నేనెక్కడ ఉన్నానో అక్కడికి నీవు రాలేవు,” అని ప్రభువు ఆమెకు వివరించారు.
మనము 25వ ప్రకరణమును జాగ్రత్తగా చదివితే, జరుగుతున్న ఒక ముఖ్యమైన పురోగతిని కనుగొంటాము. ఎమ్మా, ఆయన రాజ్యంలో ఒక కుమార్తె నుండి “ఎన్నుకోబడిన స్త్రీగా”, ఒక రాణిగా మారియుండవచ్చు. అహరోను మరియు మెల్కీసెదెకు యాజకత్వ విధులు, ఆమె నిబంధన వాగ్దానాలను నిలబెట్టుకోవడంతో కలిసి, దైవిక మార్గదర్శకత్వంతో జీవితాన్ని నడిపించటానికి ఆమెకు శక్తినిస్తూ ఆత్మతో మరియు దేవదూతలతో ఆమె సాంగత్యాన్ని పెంచుతాయి. తన దైవిక శక్తి ద్వారా, దేవుడు ఆమె హృదయాన్ని స్వస్థపరుస్తారు, ఆమె సామర్థ్యాన్ని విస్తరింపజేస్తారు మరియు ఆమె మారగలదని ఆయనకు తెలిసిన విధంగా ఆమెను రూపొందిస్తారు. మరియు మెల్కీసెదెకు యాజకత్వము యొక్క విధుల ద్వారా, ఆమె జీవితంలో “దైవత్వము యొక్క శక్తి [ప్రత్యక్షపరచబడుతుంది]” మరియు ఆమె ఆయన నుండి అవగాహన పొందేలా ప్రభువు తెరను వేరు చేస్తారు.. మనలో దేవుని శక్తి పనిచేసే విధానం ఇలా కనిపిస్తుంది.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు:
“[హార్మొనీ]లో జరిగిన ప్రతీ విషయము మీ జీవితాలలో లోతైన అంతర్భావములను కలిగియుంది. ఎమ్మాకు ప్రభువు ఇచ్చిన ఉపదేశముతో పాటు, యాజకత్వము యొక్క పునఃస్థాపన మీలో ప్రతి ఒక్కరినీ నడిపించి, దీవించగలదు. …
“… మీ జీవితములో దేవుని యొక్క శక్తిని అందుకొనుటకు ప్రభువు ఎమ్మాకు మరియు [మనలో] ప్రతి ఒక్కరికీ చేయమని చెప్పిన అవే సంగతులు అవసరమవుతాయి.”
ప్రభువు పిలిచిన ఎన్నుకోబడిన స్త్రీకి ఇచ్చిన బయల్పాటు—దేవుని కుమార్తెయైన ఎమ్మా స్మిత్‌ను బలపరచి, ప్రోత్సహించి, బోధించే బయల్పాటుతో సహా, హార్మొనీలోని ఆ కిటికీకి ఇరువైపులా ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి.
మా మనవరాలు ఇసబెల్‌కు పేరు పెట్టి దీవించినప్పుడు, ఆమె తండ్రి ఆమెను యాజకత్వం గురించి అవగాహనతో ఆశీర్వదించారు; ఆమె పెరుగుతుండగా ఆమె జీవితంలో అది అందించే దీవెన గురించి తెలుసుకుంటుందని మరియు ఆమె అవగాహన పెరగడం వల్ల యాజకత్వంపై ఆమె విశ్వాసం పెరుగుతుందని దీవించారు.
ఒక చిన్న అమ్మాయి, యాజకత్వమును అర్థం చేసుకునేలా మరియు యాజకత్వ విధులు, నిబంధన వాగ్దానాలు దేవుని శక్తిని పొందేందుకు ఆమెకు ఎలా సహాయపడతాయో తెలుసుకునేలా తరచు దీవించబడదు. కానీ నేను ఎమ్మాను గుర్తు చేసుకున్నాను మరియు నాలో నేను ఇలా అనుకున్నాను, అలా ఎందుకు జరగదు? ఈ చిన్న కుమార్తెకు ఆయన రాజ్యంలో ఎన్నుకోబడిన స్త్రీగా మరియు తుదకు ఒక రాణిగా మారే అవకాశం ఉంది. ఆయన యాజకత్వ విధుల ద్వారా మరియు ఆమె తన నిబంధన వాగ్దానాలను నిలబెట్టుకోవడం ద్వారా, జీవితంలో ఎదురయ్యే వాటన్నిటిని అధిగమించడానికి మరియు ఆమె మారగలదని దేవునికి తెలిసిన స్త్రీగా మారడానికి దేవుని శక్తి ఆమెలో మరియు ఆమెతో పని చేస్తుంది. ఇది దేవుని రాజ్యంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.
“మీ విశేషాధికారాలకు అనుగుణంగా జీవించండి.”
యాజకత్వ విధులు మరియు నిబంధన వాగ్దానాలు, మీలో మరియు మీ ద్వారా పని చేస్తూ, మీ పూర్తి ఉద్దేశ్యం మరియు సామర్థ్యాన్ని చేరుకోవడానికి మిమ్మల్ని శక్తివంతంగా మరియు సమర్థవంతంగా మారుస్తూ, దేవుని శక్తి మీ జీవితంలో మరింత సమర్థవంతంగా ప్రవహించేలా ఎలా అనుమతిస్తాయో నేర్చుకోండి.
అహరోను మరియు మెల్కీసెదెకు యాజకత్వ విధులను, ప్రతి ఒక్కరితో మనం చేసే నిబంధన వాగ్దానాలను మరియు ఆ విధుల ద్వారా మనం పొందే దేవుని శక్తిని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు ఆలోచించండి.
విధులు ఎవరు నిర్వహిస్తారనేది మాత్రమే ముఖ్యమైనది కాదు—విధులు మరియు మీ నిబంధన వాగ్దానాలను సాధ్యం చేసేవి కూడా మీ దృష్టికి అర్హత కలిగియున్నాయని గుర్తుంచుకోండి.
రొట్టె మరియు నీళ్లలో పాలుపంచుకోవడం అనేది మీరు అధిగమించడంలో సహాయపడటానికి మీలో పని చేస్తున్న ఆయన శక్తిని వారానికొకసారి గుర్తు చేస్తుంది. పరిశుద్ధ యాజకత్వ వస్త్రాన్ని ధరించడం అనేది మీరు మారడానికి మీలో పని చేస్తున్న ఆయన శక్తి యొక్క బహుమతికి ఒక అనుదిన జ్ఞాపిక.
మనమందరం దేవుని శక్తి యొక్క బహుమానానికి ప్రాప్యత కలిగియున్నాము.
మనము సంస్కారములో పాలుపొందిన ప్రతిసారీ.
మనము దేవాలయ ద్వారాన్ని దాటిన ప్రతిసారీ.
ఇది నా విశ్రాంతిదినము యొక్క ప్రధానాంశం. అందుకే నేను నా దేవాలయ సిఫారసును ఎంతో గౌరవిస్తాను.
“ఆ విధులలో, దైవత్వము యొక్క శక్తి ప్రత్యక్షపరచబడుతుంది.”
ఈ బహుమతిని గూర్చి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.