మన తిరుగుబాటు ఆయుధములను పాతిపెట్టుట
మన జీవితాలలో దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటుకు సంబంధించిన ఏ మూలమునైనా మనం—చాలా చాలా లోతుగా—పాతిపెట్టి, దానిని సమ్మతిగల హృదయంతో మరియు సమ్మతిగల మనస్సుతో భర్తీ చేద్దాం.
రాజైన మోషైయ కుమారులు క్రీస్తు జననానికి సుమారు 90 సంవత్సరాల ముందు, లేమనీయుల కొరకు 14-సంవత్సరాల సువార్తసేవను ప్రారంభించారని మోర్మన్ గ్రంథము నమోదు చేసింది. లేమనీయులను క్రీస్తు సిద్ధాంతముపై విశ్వాసంలోనికి తీసుకురావడానికి అనేక తరాలుగా విఫల ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఈసారి, పరిశుద్ధాత్మ యొక్క అద్భుత మధ్యవర్తిత్వాల ద్వారా, వేలాదిమంది లేమనీయులు పరివర్తన చెందారు మరియు యేసు క్రీస్తు శిష్యులుగా మారారు.
మనము ఇలా చదువుతాము, “ప్రభువు జీవించినంత నిశ్చయముగా బయల్పాటు మరియు ప్రవచనము యొక్క ఆత్మను బట్టి, వారి మధ్య అద్భుతములను జరిగించు దేవుని శక్తిని బట్టి అమ్మోన్ మరియు అతని సహోదరుల బోధన ద్వారా విశ్వసించిన వారందరు లేదా సత్యమును గూర్చి తెలియజేయబడిన వారందరు, అనగా ప్రభువు జీవించియున్నట్లుగా, వారి బోధనయందు విశ్వసించి, ప్రభువుకు పరివర్తన చెందిన లేమనీయులందరు ఎన్నడూ తొలగిపోలేదని నేను మీతో చెప్పుచున్నాను.”
ఈ జనుల శాశ్వతమైన పరివర్తనకు కీలకమైన విషయం తదుపరి వచనములో చెప్పబడింది: “ఏలయనగా వారు నీతిమంతులైన జనులైరి; వారు తమ తిరుగుబాటు ఆయుధములను విడిచిపెట్టి, దేవునికి వ్యతిరేకముగా లేదా వారి సహోదరులలో ఎవరికీ వ్యతిరేకముగా ఇక పోరాడలేదు.”
“తిరుగుబాటు ఆయుధములు” అనే ఈ సూచన యథాతథమైనది మరియు ఉపమానముగలది. ఇది వారి కత్తులు మరియు ఇతర యుద్ధ ఆయుధములను సూచిస్తుంది, అయితే ఇది దేవుడు మరియు ఆయన ఆజ్ఞలపట్ల వారి అవిధేయతను కూడా సూచిస్తుంది.
పరివర్తన చెందిన ఈ లేమనీయుల రాజు దానిని ఈ విధంగా వ్యక్తపరిచాడు: “ఇప్పుడు నా సహోదరులారా, మనము చేయగలిగినదంతయు మన సమస్త పాపములు, మనము చేసిన అనేక హత్యల విషయమై పశ్చాత్తాపపడుట మరియు వాటిని మన హృదయముల నుండి దేవుడు తీసివేయునట్లు చేయుటయే; ఏలయనగా ఆయన మన కళంకమును తీసివేయునట్లు మనము చేయగలిగినదంతయు దేవుని యెదుట తగినంతగా పశ్చాత్తాపపడుటయే.”
రాజు యొక్క మాటలను గమనించండి—వారి హృదయపూర్వక పశ్చాత్తాపం వారి పాపముల నిమిత్తము క్షమాపణకు దారితీసింది, అంతే కాకుండా దేవుడు ఆ పాపముల కళంకమును మరియు వారి హృదయముల నుండి పాపము చేయాలనే కోరికను కూడా తొలగించారు. మీకు తెలిసినట్లుగా, దేవునికి వ్యతిరేకంగా వారి పూర్వపు తిరుగుబాటు స్థితికి తిరిగి వచ్చే ప్రమాదం జరుగకుండా, వారు తమ కత్తులను పాతిపెట్టారు. మరియు పరివర్తన చెందిన హృదయములతో వారు వారి భౌతిక ఆయుధాలను మరియు పాపము చేసే స్వభావాన్ని కూడా పాతిపెట్టారు.
అవి ఏమైనప్పటికీ “[మన] తిరుగుబాటు ఆయుధములను విడిచిపెట్టడానికి” మరియు మనము ఎన్నడూ తొలగిపోకుండా, కళంకము మరియు పాపము చేయాలనే కోరిక మన హృదయముల నుండి తీసివేయబడునంతగా “ప్రభువుకు పరివర్తన చెందడానికి” ఈ పద్ధతిని అనుసరించడానికి మనం ఏమి చేయగలం అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు.
తిరుగుబాటు చురుకైనదిగా లేదా నిష్క్రియంగా ఉండవచ్చు. ఉద్దేశపూర్వక తిరుగుబాటుకు అత్యుత్తమ ఉదాహరణ లూసిఫరు, అతడు పూర్వ మర్త్య లోకములో తండ్రి యొక్క విమోచన ప్రణాళికను వ్యతిరేకించాడు మరియు దానిని వ్యతిరేకించడానికి ఇతరులను కూడగట్టాడు, “ఆ దినమందు అనేకులు అతడిని వెంబడించిరి.” మన కాలంలో అతడు కొనసాగిస్తున్న తిరుగుబాటు ప్రభావాన్ని గుర్తించడం కష్టం కాదు.
మోర్మన్ గ్రంథము క్రీస్తు విరోధులైన అపవిత్ర త్రయం—షెరేమ్, నీహోర్ మరియు కొరిహోర్—దేవునికి వ్యతిరేకంగా చేసిన చురుకైన తిరుగుబాటు గురించి ఒక ప్రామాణిక అధ్యయనాన్ని అందిస్తుంది. నీహోర్ మరియు కొరిహోర్ యొక్క విస్తృతమైన వాదము ఏమిటంటే పాపము లేదు; కాబట్టి, పశ్చాత్తాపం అవసరం లేదు మరియు రక్షకుడు లేడు. “ప్రతి మనుష్యుడు తన మేధస్సును బట్టి వర్థిల్లెను,… ప్రతి మనుష్యుడు తన బలమును బట్టి జయించెను మరియు మనుష్యుడు ఏమి [చేసినను] నేరము కాదు.” విధులు మరియు నిబంధనలను “శక్తిని, అధికారమును కలిగియుండుటకు ప్రాచీన యాజకులచేత ఏర్పరచబడిన” ప్రదర్శనలుగా వర్గీకరించి, క్రీస్తు విరోధి మతపరమైన అధికారాన్ని తిరస్కరిస్తాడు.
సంతోషకరమైన ముగింపుతో కూడిన ఉద్దేశపూర్వక తిరుగుబాటుకు విలియం డబ్ల్యు. ఫెల్ప్స్ కథ ఒక కడవరి దిన ఉదాహరణ. ఫెల్ప్స్ 1831లో సంఘ సభ్యునిగా చేరాడు మరియు సంఘములో అచ్చువేసే వ్యక్తిగా నియమించబడ్డాడు. అతను అనేక ప్రారంభ కాలపు సంఘ ప్రచురణలను సవరించాడు, అనేక కీర్తనలు వ్రాసాడు మరియు జోసెఫ్ స్మిత్‌కు లేఖకుడిగా పనిచేశాడు. దురదృష్టవశాత్తూ, అతను సంఘానికి మరియు ప్రవక్తకు వ్యతిరేకంగా మారి, మిస్సోరి న్యాయస్థానంలో జోసెఫ్ స్మిత్‌కు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం ఇచ్చే స్థాయికి కూడా చేరాడు మరియు ప్రవక్తకు జైలు శిక్షపడటానికి దోహదపడ్డాడు.
తర్వాత, ఫెల్ప్స్ క్షమాపణ కోరుతూ జోసెఫ్‌కు ఇలా లేఖ వ్రాసాడు. “నా పరిస్థితి నాకు తెలుసు, నీకు తెలుసు, దేవుడికి తెలుసు, నా స్నేహితులు నాకు సహాయపడినట్లైతే, నేను రక్షింపబడాలనుకుంటున్నాను.”
ప్రవక్త తన సమాధానంలో ఇలా చెప్పారు: “నీ ప్రవర్తన వలన మేము చాలా బాధపడ్డామన్నది సత్యం. … ఏది ఏమైనా, బాధ భరించవలసివచ్చింది, మన పరలోక తండ్రి చిత్తం నేరవేరింది మరియు మేము ఇంకా జీవించియున్నాము. … రా, ప్రియమైన సహోదరా, యుద్ధం ముగిసిపోయింది కాబట్టి, మొదట స్నేహితులైనవారము మళ్ళీ చివరకు స్నేహితులమే.”
నిష్కపటమైన పశ్చాత్తాపంతో, విలియం ఫెల్ప్స్ తన “తిరుగుబాటు ఆయుధములను” పాతిపెట్టాడు, మరోసారి పూర్తి సహవాసంలోనికి స్వీకరించబడి, మరలా ఎన్నడూ తొలగిపోలేదు.
బహుశా, మన జీవితాల్లో ఆయన చిత్తాన్ని విస్మరించడం అనేది దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటు యొక్క మరింత కపటమైన రూపం, అయితే, ఇది నిష్క్రియాత్మకమైన రకం. చురుకైన తిరుగుబాటును ఎన్నడూ పరిగణించని అనేకులు, దైవిక నిర్దేశంతో సంబంధం లేకుండా తమ సొంత మార్గాన్ని అనుసరించడం ద్వారా దేవుని చిత్తాన్ని మరియు వాక్యాన్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తుంటారు. ప్రముఖ గాయకుడు ఫ్రాంక్ సినాత్రా చాలా సంవత్సరాల క్రితం చివరి పంక్తిగా పాడిన, “నేను నా పద్ధతిలో చేశాను” అనే ప్రఖ్యాతిగల పాట నాకు గుర్తుకు వచ్చింది. ఖచ్చితంగా జీవితంలో వ్యక్తిగత ప్రాధాన్యతకు మరియు వ్యక్తిగత ఎంపికకు చాలా స్థానం ఉంది, కానీ రక్షణ మరియు నిత్యజీవానికి సంబంధించిన విషయానికి వస్తే, “నేను దానిని దేవుని పద్ధతిలో చేసాను,” అనేది మన ఇతివృత్త కీర్తనైయుండాలి, ఎందుకంటే నిజంగా మరొక మార్గం లేదు.
ఉదాహరణకు, బాప్తిస్మము విషయంలో రక్షకుని మాదిరిని తీసుకోండి. తండ్రి పట్ల విధేయత యొక్క ప్రదర్శనగా మరియు మనకు ఒక ఉదాహరణగా ఆయన బాప్తిస్మము తీసుకున్నారు:
“శరీరానుసారముగా తననుతాను తండ్రి యెదుట తగ్గించుకొనుచున్నాడని నరుల సంతానమునకు చూపుచు, తండ్రి ఆజ్ఞలను పాటించుటలో తాను ఆయనకు లోబడియుండెదనని తండ్రికి సాక్ష్యమిచ్చుచున్నాడు. .…
“మీరు నన్నుఅనుసరించుడి అని ఆయన నరుల సంతానముతో చెప్పారు. కాబట్టి, నా ప్రియమైన సహోదరులారా, తండ్రి ఆజ్ఞలను పాటించడానికి సమ్మతించకుండా మనము యేసును అనుసరించగలమా?”
మనం క్రీస్తు మాదిరిని అనుసరించాలంటే “నా పద్ధతి” అనేది ఏదీ లేదు. పరలోకమునకు మరొక మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించడం అనేది క్రీస్తును మరియు ఆయన రక్షణను అంగీకరించకుండా బాబెలు గోపురము మీద పనిచేసే వృధాప్రయాస లాంటిది.
పరివర్తన చెందిన లేమనీయులు పాతిపెట్టిన కత్తులు మరియు ఇతర అస్త్రములు తిరుగుబాటు యొక్క ఆయుధములు, ఎందుకంటే వారు వాటిని ఉపయోగించిన విధానము అట్టిది. వారి కుమారుల చేతుల్లో ఉన్న అదే రకమైన ఆయుధాలు, కుటుంబ రక్షణ మరియు స్వేచ్ఛ కొరకు ఉపయోగించబడుతున్నాయి, అవి దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేసే ఆయుధములు కావు. నీఫైయుల చేతుల్లో ఉన్న అలాంటి ఆయుధాల విషయంలో కూడా అదే నిజం: “వారు రాజరికము లేదా అధికారము నిమిత్తము పోరాడుట లేదు, … కానీ వారి గృహములు, స్వేచ్ఛ, వారి భార్యాపిల్లలు, వారు కలిగియున్న సమస్తము కొరకు, ముఖ్యముగా వారి ఆరాధన హక్కులు మరియు వారి సంఘము కొరకు పోరాడుచున్నారు.”
అదే విధంగా, మన జీవితాలలో కొన్ని విషయాలు తటస్థంగా ఉండవచ్చు లేదా అంతర్గతంగా మంచివి కావచ్చు, కానీ తప్పుడు మార్గంలో ఉపయోగించబడేవి “తిరుగుబాటు ఆయుధాలుగా” మారతాయి. ఉదాహరణకు, మన మాట జ్ఞానాభివృద్ధి కలిగించవచ్చు లేదా కించపరచవచ్చు. యాకోబు చెప్పినట్లుగా:
“’యే నరుడును నాలుకను సాధుచేయనేరడు [అనిపిస్తుంది], అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.
“దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.
“’ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును. నా సహోదరులారా, యీలాగుండకూడదు.”
ఈ రోజుల్లో బహిరంగంగా మరియు వ్యక్తిగతంగా చాలా హానికరమైన మరియు నీచమైన ప్రసంగాలున్నాయి. యువతలో కూడా అసభ్యంగా మరియు అపవిత్రంగా చాలా సంభాషణలు ఉన్నాయి. ఈ విధమైన ప్రసంగం దేవునికి వ్యతిరేకమైన “తిరుగుబాటు ఆయుధములతో” మరియు “మరణకరమైన విషముతో నిండినది.”
మంచిదే అయినా దైవిక నిర్దేశాలకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు దారితీసే మరో ఉదాహరణను పరిశీలించండి—ఒక వ్యక్తి యొక్క వృత్తి. ఒక వ్యక్తి ఉద్యోగము, వ్యాపారము లేదా సేవలో నిజమైన సంతృప్తిని పొందవచ్చు మరియు అనేక క్షేత్రాలలో అంకితభావంగల, ప్రతిభావంతులైన వ్యక్తులు సాధించిన మరియు సృష్టించిన వాటి ద్వారా మనమందరం ప్రయోజనం పొందుతాము.
అయినప్పటికీ, వృత్తి పట్ల భక్తి అనేది ఒకరి జీవితంలో ప్రధానమైన దృష్టిగా మారే అవకాశం ఉంది. అప్పుడు ఒకరి సమయం మరియు ప్రతిభపై రక్షకునికున్న హక్కుతో సహా మిగతావన్నీ ద్వితీయంగా మారతాయి. పురుషులకు మరియు స్త్రీలకు కూడా, వివాహానికి సంబంధించిన చట్టబద్ధమైన అవకాశాలను వదులుకోవడం, జీవిత భాగస్వామిని హత్తుకొనియుండి, ఉద్ధరించడంలో విఫలమవడం, పిల్లలను పోషించడంలో విఫలమవడం లేదా కేవలం వృత్తిలో పురోగతి కోసం పిల్లల పెంపకం యొక్క దీవెనను మరియు బాధ్యతను ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవడం కూడా ప్రశంసనీయమైన విజయాన్ని తిరుగుబాటు రూపంగా మార్చగలవు.
మరొక ఉదాహరణ మన భౌతిక దేహమునకు సంబంధించినది. మనము దేహము మరియు ఆత్మ రెండింటితోనూ దేవుని మహిమపరచాలని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు, దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నది, “దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది మరియు మీరు మీ సొత్తు కారు.” అందువల్ల, మన దేహములను మనకు సాధ్యమైనంత ఉత్తమంగా చూసుకోవడానికి సమయాన్ని వెచ్చించడంలో మనకు న్యాయమైన ఆసక్తి ఉంది. మనం ఇటీవల చూసినట్లు ఒలింపిక్ మరియు పారాలింపిక్ క్రీడాకారుల విజయాలలో మనలో కొద్దిమంది మాత్రమే అత్యుత్తమ ప్రదర్శనను అందుకుంటారు మరియు కొందరు వయస్సు యొక్క ప్రభావాలను ఎదుర్కొంటున్నారు లేదా అధ్యక్షుడు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ చెప్పినట్లు “వృద్ధాప్య ప్రభావాలతో అస్థిరంగా మారుతున్నారు.”
ఏది ఏమైనప్పటికీ, మన సృష్టికర్త యొక్క అపురూప బహుమతియైన భౌతిక దేహమును చూసుకోవడానికి మనం మన వంతు కృషి చేసినప్పుడు అది ఆయనకు సంతోషాన్నిస్తుందని నేను నమ్ముతున్నాను. ఒకరి శరీరాన్ని వికృతం చేయడం, అపవిత్రం చేయడం, హింసించడం లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి ఒకరు చేయగలిగినది చేయడంలో విఫలమవడం తిరుగుబాటుకు ఒక చిహ్నమవుతుంది. అదే సమయంలో, ఆడంబరము మరియు శరీరాకృతి, రూపురేఖలు లేదా వస్త్రధారణలో నిమగ్నమైపోవటం అనేది మరొక తీవ్రమైన తిరుగుబాటు రూపంగా ఉంటుంది, ఇది దేవునికి బదులుగా దేవుని బహుమతిని ఆరాధించడానికి కారణమవుతుంది.
చివరిగా, దేవునికి విరుద్ధముగానున్న మన తిరుగుబాటు ఆయుధములను పాతిపెట్టడం అంటే అర్థము, “పరిశుద్ధాత్మ ప్రేరేపణలకు లోబడి ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించి, ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా పరిశుద్ధులవ్వడం.” అంటే మన జీవితాలలో మొదటి ఆజ్ఞకు మొదటి స్థానం ఇవ్వడం. అంటే దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడం. దేవునిపై మనకున్న ప్రేమ మరియు మన పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతో ఆయనను సేవించాలనే మన దృఢ సంకల్పం అన్ని విషయాలపై తీర్పునిచ్చి, మన నిర్ణయాలన్నింటికి గీటురాయిగా మారినట్లయితే, మనం మన తిరుగుబాటు ఆయుధములను పాతిపెట్టినట్లే. క్రీస్తు యొక్క కృపతో, దేవుడు మన పాపములను మరియు గతంలో చేసిన తిరుగుబాటులను క్షమించి, మన హృదయముల నుండి ఆ పాపములు మరియు తిరుగుబాట్ల యొక్క కళంకమును తీసివేస్తారు. కాలక్రమేణా, ఆయన గతంలో పరివర్తన చెందిన లేమనీయుల విషయంలో చేసినట్లుగా మనలోనున్న చెడు కోరికను కూడా తీసివేస్తారు. ఆ తర్వాత, మనం కూడా “ఎన్నడూ తొలగిపోము.”
మన తిరుగుబాటు ఆయుధాలను పాతిపెట్టడం ఒక ప్రత్యేకమైన ఆనందానికి దారి తీస్తుంది. ప్రభువు తట్టుకు మారిన వారందరితో కలసి “విమోచించు ప్రేమ [గీతము]ను కీర్తించుటకు మనం తేబడియున్నాము.” మన పరలోక తండ్రి మరియు మన విమోచకుడైన ఆయన కుమారుడు, అత్యంత ప్రగాఢమైన ప్రేమ మరియు త్యాగం ద్వారా మన అంతిమ ఆనందం కోసం వారి అంతులేని నిబద్ధతను ధృవీకరించారు. మనము ప్రతి రోజూ వారి ప్రేమను అనుభవిస్తున్నాము. నిశ్చయముగా మనం మన స్వంత ప్రేమ మరియు విధేయతతో ప్రతిస్పందించవచ్చు. మన జీవితాలలో దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటుకు సంబంధించిన ఏ మూలమునైనా మనం—చాలా చాలా లోతుగా—పాతిపెట్టి, దానిని సమ్మతిగల హృదయంతో మరియు సమ్మతిగల మనస్సుతో భర్తీ చేద్దాం. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.