క్రీస్తు యొక్క మాటలు మరియు పరిశుద్ధాత్మ మనల్ని సత్యానికి నడిపిస్తాయి
ఈ అపురూపమైన ప్రణాళికను తెలుసుకోవడం, మనం దేవుని పిల్లలమని మరియు మనం ఆయన వలె మారగలమని తెలుసుకోవడంలో సహాయపడుతుంది.
దేవుడు పరలోకమందున్న మన తండ్రి. మనము ఆయన ఆత్మ పిల్లలము మరియు ఆయన స్వరూపమందు మనము సృష్టించబడ్డాము. అందువల్ల, దేవుని బిడ్డగా, మనలో ప్రతీ ఒక్కరం ఆయనలా మారడానికి దైవిక సామర్థ్యాన్ని కలిగియున్నాము.
మనం ఈ భూమి మీదకు రాకముందు ఆయనతో ఆత్మలుగా జీవించాము. పరలోక తండ్రి, మన ఆత్మల తండ్రిగా, మనల్ని ప్రేమిస్తున్నారు, మన కొరకు ఉత్తమమైన వాటిని కోరుకుంటున్నారు మరియు అమర్త్యత్వము, నిత్యజీవము అనే ఆయన గొప్ప ఆశీర్వాదాలను పొందేందుకు మన కొరకు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రణాళిక ప్రకారం, ఆత్మ పిల్లలమైన మనకు ఆయన ప్రణాళికను ఎంచుకునే కర్తృత్వము ఇవ్వబడుతుంది. భూమిపైకి రావడం ద్వారా, మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టి, మన పూర్వ మర్త్య జీవితమును మరచిపోతాము, మాంసం మరియు ఎముకలతో కూడిన శరీరాలను పొందుతాము, మన స్వంత అనుభవాన్ని పొందుతాము మరియు విశ్వాసాన్ని పెంపొందించుకుంటాము. మాంసము మరియు ఎముకలతో కూడిన మన శరీరాలతో, ప్రకృతి సంబంధియైన మనుష్యులుగా మనం శోధనకు లొంగిపోతాము, అపవిత్రంగా మారతాము, దేవునికి దూరంగా ఉంటాము మరియు ఆయన పరిశుద్ధ సన్నిధికి తిరిగి చేరలేము. పరలోక తండ్రికి మనపై ఉన్న అనంతమైన ప్రేమ కారణంగా, ఆయన తన జ్యేష్ఠ పుత్రుడైన యేసు క్రీస్తును మన రక్షకునిగా పంపియున్నారు. యేసు క్రీస్తు, తన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా, మనము మన పాపముల నుండి విమోచించబడి, పునరుత్థానము చెంది, నిత్యజీవము పొందడాన్ని సాధ్యం చేసారు.
తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక, ఆయన యొక్క కనికరపు ప్రణాళిక లేదా సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక అని మనము పిలిచే ఈ మహిమాన్వితమైన సత్యానికి నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను. ఈ ప్రాముఖ్యమైన సత్యాలను నేర్చుకోవడం, నా నిజమైన గుర్తింపును మరియు దేవుడు మన ఉన్నతస్థితి మరియు నిత్యజీవము కొరకు సిద్ధం చేసిన గొప్ప ఆశీర్వాదాలను తెలుసుకోవడంలో నాకు సహాయపడింది. ప్రవక్త నీఫై మనకు మార్గాన్ని బోధించారు: “కావున, … క్రీస్తు యొక్క మాటలను విందారగించమని నేను మీతో చెప్పితిని; ఏలయనగా క్రీస్తు యొక్క మాటలు మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు తెలుపును.” ఆయన ఇంకా ఇలా చెప్పారు, “మీరు మార్గము ద్వారా ప్రవేశించి పరిశుద్ధాత్మను పొందిన యెడల, మీరు చేయవలసిన కార్యములన్నిటినీ ఆయన మీకు చూపును.” నేను యుక్తవయస్సులో ఉన్నప్పుడు శాంతిననుగ్రహించే ఈ ప్రాముఖ్యమైన సత్యాలను కనుగొనడంలో క్రీస్తు యొక్క మాటలు మరియు పరిశుద్ధాత్మ నాకు ఎలా సహాయపడ్డాయో ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను.
క్రీస్తు యొక్క మాటలు మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు తెలుపును
1 నీఫై గ్రంథములోని ప్రారంభ వచనములో నీఫై చెప్పినట్లే, నేను కూడా “మంచి తల్లిదండ్రులకు జన్మించాను.” నేను జపాన్‌లోని నాగానోలో, నిజాయితీ, శ్రద్ధ మరియు వినయం బలంగా ప్రోత్సహించబడే ఇంట్లో మరియు పాత ఆచారాలను ఖచ్చితంగా అనుసరించే ఇంట్లో పెరిగాను. మా నాన్న చాలా దైవభక్తి గలవారు. ఆయన ప్రతి ఉదయం మరియు ప్రతి రాత్రి షింటో మరియు బౌద్ధ బలిపీఠాల ముందు ప్రార్థన చేయడం నేను చూశాను. ఆయన ఎవరిని ప్రార్థిస్తున్నారో మరియు దేని కోసం ప్రార్థిస్తున్నారో నాకు తెలియకపోయినా, ఏదో ఒక అదృశ్య శక్తిని లేదా మనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తారని మరియు “రక్షించుటకు ఆయన శక్తిమంతుడని” నేను నమ్ముతున్నాను.
ఇతర యవ్వనస్థులవలే నేను కూడా ఎన్నో కష్టాలను అనుభవించాను. జీవితం అన్యాయమైనదని, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని భావించి ప్రయాసపడ్డాను. నా జీవితంలో దిశానిర్దేశం కోల్పోయినట్లు భావించాను. జీవితం చాలా అనిశ్చయమైనదిగా అనిపించేది, ఎందుకంటే నేను చనిపోయాక అది ముగుస్తుంది. రక్షణ ప్రణాళిక గురించి తెలియని జీవితం గందరగోళంగా ఉండేది.
నేను ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు నేర్చుకోవడం ప్రారంభించిన కొద్ది కాలానికే, మా పాఠశాలలోని విద్యార్థులందరు కొత్త నిబంధన ప్రతిని అందుకున్నారు. మేము మా ఇంగ్లీషు అధ్యయనాన్ని బొటాబొటిగా ప్రారంభించినప్పటికీ, ఇంగ్లీషును చదవడం ద్వారా అధ్యయనం చేయాలని మా గురువుగారు మాతో చెప్పారు. నేను దానిని తెరిచి, దాని విషయసూచికను సమీక్షించాను. కొత్త నిబంధనలోని పదాలు నాకు చాలా కష్టంగా ఉన్నాయి. జపనీయ పదాలు కూడా అంతే కష్టంగా ఉండేవి. అయినప్పటికీ, ఈ గిడియన్ బైబిలులో బైబిలుసంబంధమైన వాక్యముల ముందు చేర్చబడిన వ్యాఖ్యానాలు మరియు ఆత్మ యొక్క ప్రశ్నల జాబితాకు నేను ఆకర్షించబడ్డాను—ఒంటరిగా భావించటం, విశ్వాసం లేకపోవడం, గందరగోళంగా ఉండటం, జీవితపు పరీక్షలను ఎదుర్కోవడం మొదలైన వాటిని గురించిన ప్రశ్నలవి. జాబితాలోని ప్రతి అంశం కొత్త నిబంధనలోని వచనములు మరియు పేజీల సూచనతో అనుసరించబడింది. ముఖ్యంగా “మీరు అలసిపోయినప్పుడు” అనే వ్యాఖ్యానానికి నేను ఆకర్షించబడ్డాను. ఈ సూచన నన్ను మత్తయి 11:28–30 తెరవడానికి దారితీసింది, అందులో యేసు తన శిష్యులతో ఇలా అన్నారు:
“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
“ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”
నేను యేసు క్రీస్తు మాటలు చదవడం ఇదే మొదటిసారి. ఆయన చెప్పిన మాటలన్నీ నాకు అర్థం కానప్పటికీ, ఆయన మాటలు నాకు ఓదార్పునిచ్చాయి, నా ఆత్మను ఉద్ధరించాయి మరియు నాకు నిరీక్షణను కలిగించాయి. ఆయన వాక్యము చదివిన కొద్దీ, ఆయన వాక్యము యొక్క ప్రభావమును మరింత ఎక్కువగా ప్రయత్నించాలని నాకు అనిపించింది. ఆ రోజు అనిపించినట్లు నాకెప్పుడూ అనిపించలేదు. నేను ప్రేమించబడినట్లు భావించాను. యేసు క్రీస్తు నాకు తెలిసిన వ్యక్తి అని నేను భావించాను.
నేను చదవడం కొనసాగిస్తుండగా, “నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు,” అని ఆయన చెప్పినప్పుడు, ఆయన నాతో సూటిగా మాట్లాడుతున్నట్లు అనిపించింది.
ఆ సమయంలో నా భావాలను సరిగ్గా వర్ణించలేకపోయినా, ఆయన మాటలు నా హృదయాన్ని నింపాయి. యేసు క్రీస్తు అనేక శతాబ్దాల క్రితం నాకు తెలియని దేశంలో నివసించినప్పటికీ, నేను ఆయన మాటలను నా పూర్ణ హృదయముతో విశ్వసించగలనని అనుకున్నాను. భవిష్యత్తులో ఏదో ఒక రోజు నేను యేసు క్రీస్తు గురించి మరింత తెలుసుకుంటానని ఆశించాను.
మీరు చేయవలసిన కార్యములన్నిటినీ పరిశుద్ధాత్మ మీకు చూపును
కొద్ది సంవత్సరాలలోనే ఆ రోజు వచ్చింది. నేను యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క మిక్కిలి అంకితభావం గల, పూర్తి-కాల యువ సువార్తికులను కలిశాను. మరియు యేసు క్రీస్తును అనుసరించడానికి శ్రమిస్తూ, దయగల మరియు సంతోషకరమైన కడవరి దిన పరిశుద్ధుల యొక్క చిన్న సమూహాన్ని నేను త్వరలోనే కలుసుకున్నాను. వారిని పూర్తిగా విశ్వసించడానికి నాకు కొంత సమయం పట్టినప్పటికీ, నేను క్రొత్త నిబంధనను అధ్యయనం చేసినప్పుడు నేను కోరుకుంటున్న వాటిని—అనగా యేసు క్రీస్తు మాటలు మరియు వాటి ద్వారా లభించే నిరీక్షణను, శాంతిని పునఃస్థాపించబడిన సువార్తలో చూడగలిగాను.
సువార్తికులు నాకు ప్రార్థన చేయడాన్ని నేర్పించడమనేది ప్రత్యేకించి నాకొక పవిత్రమైన అనుభవం. మనం దేవుడిని పేరు పెట్టి సంబోధించాలని నేను తెలుసుకున్నాను. మనము ప్రార్థించేటప్పుడు, మన హృదయాల నుండి మాట్లాడాలి, మన కృతజ్ఞతను తెలియజేయాలి మరియు మన ఆశలను, కోరికలను పంచుకోవాలి. మనం చెప్పదలచుకున్నదంతా చెప్పిన తర్వాత, “యేసు క్రీస్తు నామములో, ఆమేన్” అని చెప్పి మన ప్రార్థనను ముగిస్తాము. యేసు తన నామమున ప్రార్థించమని ఆజ్ఞాపించారు, కాబట్టి మనం ఇలా చేస్తున్నాము. పరలోక తండ్రిని ప్రార్థించడం, ఆయన ఎవరో మరియు ఆయనతో నా సంబంధం ఏమిటో తెలుసుకోవడంలో నాకు సహాయపడింది—నేను ఆయన ప్రియమైన ఆత్మ కుమారుడను. పరలోక తండ్రికి నేను తెలుసు మరియు ఆయన నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి, ఆయన నాతో వ్యక్తిగతంగా, ప్రత్యేకంగా మరియు పరిశుద్ధాత్మ ద్వారా నేను అర్థం చేసుకునే విధంగా మాట్లాడతారని నేను తెలుసుకున్నాను.
నేను నిజంగా పరిశుద్ధాత్మను గుర్తించలేని సమయం కూడా ఉంది. నేను చేయవలసినది కేవలం ప్రార్థన యొక్క దశలను అనుసరించడం మరియు ఏదో ఒకటి నాటకీయంగా జరుగుతుందని భావించడం మాత్రమే అని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఒక రోజు, సువార్తికుల పాఠం వింటున్నప్పుడు, నేను విరామం తీసుకోవడానికి బయటికి వచ్చాను. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త నిజంగా సత్యమైతే నా జీవితంలో నేను ఏమి చేయాలనే దాని గురించి ఇంకా గందరగోళంలో ఉన్నాను.
సువార్తికులు వేచియున్న గదికి నేను తిరిగి వెళ్లబోతున్నప్పుడు, సువార్తికులలో ఒకరి స్వరం నాకు వినిపించింది. నేను నా పేరు విన్నాను. నేను తలుపు తెరవకుండా, తలుపుకు అవతలి వైపు ఉన్న స్వరం విన్నాను. నేను ఆశ్చర్యపోయాను. వారు పరలోక తండ్రిని ప్రార్థిస్తున్నారు. ప్రార్థన చేసే వ్యక్తి, దేవుడు నా ప్రార్థన వినాలని వేడుకుంటున్నాడు. అతని జపనీసు భాష అనర్గళంగా లేకపోయినప్పటికీ, అతని హృదయపూర్వక ప్రార్థన వినడం నా హృదయాన్ని మృదువుగా చేసింది. నా గురించి వాళ్ళు ఎందుకంత శ్రద్ధ తీసుకుంటున్నారని నేను ఆశ్చర్యపోయాను. నా తరఫున వారి ప్రార్థన నా పట్ల పరలోక తండ్రి మరియు రక్షకుని ప్రేమకు ప్రతిబింబమని అప్పుడు నేను గ్రహించాను. ఆ ప్రేమ నాకు నిరీక్షణను ఇచ్చింది, ఆ తరువాత నేను విశ్వాసంతో మరియు నిజమైన ఉద్దేశ్యంతో దేవుణ్ణి అడిగాను. నేను అలా చేసినప్పుడు, నిజంగా నేను దేవుని బిడ్డనని మరియు నాకు దైవిక సామర్థ్యము, గమ్యము ఉన్నాయనే సంతోషకరమైన మరియు శాంతియుత అనుభూతిని నేను పొందాను. రక్షణ ప్రణాళిక నా హృదయంలో లోతుగా నాటుకుంది.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు, “మీరు ఎవరు అనే దాని గురించి మీరు ఆలోచించే విధానం … మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది.” ఈ ప్రకటన నాకు చాలా సరైనది. బాప్తిస్మము తీసుకోవటం ద్వారా మరియు పరిశుద్ధాత్మ వరమును పొందడం ద్వారా రక్షకుడైన యేసు క్రీస్తును అనుసరించాలనే నిర్ణయం నేను ఊహించిన దానికంటే ఎక్కువగా నా జీవితాన్ని ఆశీర్వదించింది. మనము దేవునితో బాప్తిస్మపు నిబంధనలోకి ప్రవేశించినప్పుడు, మనము యేసు క్రీస్తు నామమును మనపై తీసుకొనుటకు, ఎల్లప్పుడు దేవుని ఆజ్ఞలను పాటించుటకు మరియు మన జీవితాంతం ఆయనను సేవించుటకు సిద్ధంగా ఉన్నామని వాగ్దానం చేస్తున్నాము. . దానికి ప్రతిగా, మన పరలోక తండ్రి, ఆయన ఆత్మను—పరిశుద్ధాత్మ నుండి నిరంతర మార్గదర్శకత్వాన్ని మనము ఎల్లప్పుడూ కలిగియుంటామని మనకు వాగ్దానం చేస్తున్నారు.
క్రీస్తు యొక్క మాటలు మరియు పరిశుద్ధాత్మ “[మీరు] చేయవలసిన కార్యములన్నిటినీ” మీకు నిర్దేశించునని—నీఫై మనకు బోధించిన సందేశం పట్ల విశ్వాసముంచమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతిదీ! ఇది దేవుడిచ్చిన అపురూపమైన బహుమతి.
సహోదర సహోదరీలారా, మన పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక పట్ల నేను కృతజ్ఞత కలిగియున్నాను. ఆయన మనల్ని ప్రేమిస్తున్నందున, తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన సన్నిధికి తిరిగి రావడానికి మనకు మార్గాన్ని సిద్ధం చేశారు. ఈ అపురూపమైన ప్రణాళికను తెలుసుకోవడం, మనం దేవుని పిల్లలమని మరియు మనం ఆయన వలె మారగలమని తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఈ ముఖ్యమైన సత్యానికి నేను కృతజ్ఞత కలిగియున్నాను. యేసు క్రీస్తు యొక్క మాటలు మరియు పరిశుద్ధాత్మ మనల్ని నిత్యజీవము పొందేందుకు నడిపిస్తాయని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. ఈ విషయములు నిజమని నాకు తెలుసు. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.