ప్రభువు ఇచ్చే పశ్చాత్తాప బహుమానాన్ని హత్తుకోండి
దేవుని వైపు తిరిగే ముందు విషయాలు కష్టమయ్యే వరకు మనం వేచి ఉండకూడదు. నిజంగా పశ్చాత్తాపపడడానికి మన మర్త్య జీవితాలు ముగిసే వరకు మనం వేచి ఉండకూడదు.
ప్రేమగల పరలోక తండ్రి గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. 2019, ఏప్రిల్ సర్వసభ్య సమావేశములో, ప్రధాన అధికార డెబ్బదిగా నా కొత్త బాధ్యతలో ఆమోదించబడిన కొద్ది క్షణాల తర్వాత, గాయకబృందం “నేను విస్మయంతో నిలిచాను” అనే పాట పాడారు, అది నా హృదయానికి, ఆత్మకు గుచ్చుకుంది.
ఆ పదాలను వింటున్నప్పుడు, నేను ఆశ్చర్యపోయాను. నాలో కొరతలు మరియు లోపాలు ఉన్నప్పటికీ, “ఆయన శక్తియందు నేను సమస్తము చేయగలను” అని తెలుసుకునేలా ప్రభువు నన్ను ఆశీర్వదించారని నేను భావించాను.
కొరత, బలహీనత లేదా అనర్హత అనే సాధారణ భావనతో మనలో చాలామంది కొన్నిసార్లు కష్టపడతారు. నేను ఇప్పటికీ దానితో పోరాడుతున్నాను; నేను పిలువబడిన రోజు దానిని అనుభూతి చెందాను. నేను చాలాసార్లు దానిని అనుభూతి చెందాను మరియు ఇప్పటికీ మీతో మాట్లాడుతుండగా అనుభూతి చెందుతున్నాను. అయితే, ఈ భావాలతో నేను ఒంటరిగా లేనని తెలుసుకున్నాను. వాస్తవానికి, ఇలాంటి భావాలను అనుభవించిన వారి గురించి లేఖనాలలో చాలా వృత్తాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు, మనము నీఫైని ప్రభువు యొక్క నమ్మకమైన మరియు శూరుడైన సేవకునిగా గుర్తుంచుకుంటాము. కానీ కొన్నిసార్లు, అతను కూడా అనర్హత, బలహీనత మరియు కొరత వంటి భావాలతో కష్టపడ్డాడు.
“అయినను,” అతనిలా చెప్పాడు, “తన గొప్ప, అద్భుతకార్యములను నాకు చూపుటలో ప్రభువు యొక్క మహోపకారమును బట్టి నా హృదయము ఘోషించుచున్నది: అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? నా శరీరమును బట్టి నా హృదయము దుఃఖించుచున్నది; నా పాపములను బట్టి నా ఆత్మ వేదనపడుచున్నది.”
తన యౌవనంలో, తరచు “[తన] బలహీనతలు మరియు లోపముల కొరకు అపరాధిగా భావించడం” గురించి ప్రవక్త జోసెఫ్ స్మిత్ మాట్లాడారు. కానీ జోసెఫ్ యొక్క కొరత మరియు ఆందోళనా భావాలు ఆయన ధ్యానించడానికి, అధ్యయనం చేయడానికి, నేర్చుకోవడానికి మరియు ప్రార్థించడానికి దారితీసాయి. మీకు గుర్తున్నట్లుగా, ఆయన సత్యం, శాంతి మరియు క్షమాపణను కనుగొనడానికి తన ఇంటికి సమీపంలోని చెట్లపొదలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రభువు ఇలా చెప్పడాన్ని ఆయన విన్నారు: “జోసెఫ్, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి. నీ మార్గమున వెళ్ళి, నా కట్టడలలో నడుస్తూ, నా ఆజ్ఞలను పాటించు. ఇదిగో, నేను మహిమ కలిగిన ప్రభువును. నేను లోకము కొరకు, దానిలో నా నామమున విశ్వసించువారందరు నిత్యజీవితం పొందునట్లు సిలువవేయబడ్డాను.”
పశ్చాత్తాపపడి, తన ఆత్మ యొక్క రక్షణను పొందాలనే జోసెఫ్ యొక్క మనఃపూర్వకమైన కోరిక యేసు క్రీస్తు వద్దకు వచ్చి, తన పాపాలకు క్షమాపణ పొందేందుకు ఆయనకు సహాయపడింది. ఈ నిరంతర ప్రయత్నం యేసు క్రీస్తు సువార్త యొక్క నిరంతర పునఃస్థాపనకు తలుపులు తెరిచింది.
ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క ఈ విశేషమైన అనుభవం, పతనమైన మన స్వభావాన్ని గుర్తించడంలో బలహీనత మరియు కొరత యొక్క భావాలు మనకెలా సహాయపడగలవో వివరిస్తుంది. మనం వినయంగా ఉంటే, యేసు క్రీస్తుపై ఆధారపడడాన్ని గుర్తించడంలో అది మనకు సహాయపడుతుంది మరియు రక్షకుని వైపు తిరిగి, మన పాపాలకు పశ్చాత్తాపపడాలి అనే మనఃపూర్వకమైన కోరికను మన హృదయాలలో రేకెత్తిస్తుంది.
నా స్నేహితులారా, పశ్చాత్తాపము ఆనందాన్నిస్తుంది! మధురమైన పశ్చాత్తాపం అనేది రోజువారీ ప్రక్రియలో భాగం, దాని ద్వారా “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రముగా,” తన బోధనలపై కేంద్రీకృతమైన జీవితాన్ని గడపమని ప్రభువు మనకు బోధిస్తారు. జోసెఫ్ మరియు నీఫైల వలె, మనము “కనికరము కొరకు [దేవుని]కి మొరపెట్టగలము; ఏలయనగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు.” ఆయన న్యాయమైన ఏ ఆశనైనా లేదా కోరికనైనా తీర్చగలరు మరియు మన జీవితంలో ఎలాంటి గాయాన్ని అయినా నయం చేయగలరు.
మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధనలో, మనఃపూర్వకమైన పశ్చాత్తాపం ద్వారా క్రీస్తు వద్దకు ఎలా రావాలో నేర్చుకున్న వ్యక్తుల యొక్క అసంఖ్యాక వృత్తాంతాలను మీరు, నేను కనుగొనగలము.
నా ప్రియ స్వస్థలమైన పోర్టో రికో ద్వీపంలో జరిగిన ఒక అనుభవం ద్వారా ప్రభువు యొక్క మృదు కనికరములకు ఒక ఉదాహరణను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
నా స్వస్థలమైన పోన్స్‌లో సంఘములోని ఒక సహోదరి సీలియా క్రూజ్ అయాలా, తన స్నేహితురాలికి మోర్మన్ గ్రంథాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది. దానిని చుట్టి, వజ్రాలు లేదా కెంపుల కంటే ఆమెకు ఎక్కువ విలువైన ఈ బహుమతిని అందించడానికి వెళ్ళానని ఆమె చెప్పింది. ఆమె వెళ్ళే దారిలో, ఒక దొంగ ఆమె వద్దకు వచ్చి, ఆమె పర్సు లాక్కొని, లోపల ఉన్న ప్రత్యేక బహుమతితో పారిపోయాడు.
ఆమె సంఘములో ఈ కథ చెప్పినప్పుడు, ఆమె స్నేహితురాలు, “ఎవరికి తెలుసు? బహుశా ఇది సువార్తను పంచుకోవడానికి నీకొచ్చిన అవకాశం కావచ్చు!” అంది.
సరే, కొన్ని రోజుల తర్వాత, ఏం జరిగిందో మీకు తెలుసా? సీలియాకు ఒక ఉత్తరం వచ్చింది. సీలియా నాతో పంచుకున్న ఆ లేఖను ఈరోజు నేను నా చేత్తో పట్టుకున్నాను. అందులో ఇలా ఉంది:
“శ్రీమతి క్రూజ్:
“నన్ను క్షమించండి, క్షమించండి. మీపై దాడి చేసినందుకు నేనెంత విచారిస్తున్నానో మీకు ఎప్పటికీ తెలియదు. కానీ దాని వల్ల నా జీవితం మారిపోయింది మరియు మారుతూనే ఉంటుంది.
“ఆ పుస్తకం [మోర్మన్ గ్రంథము] నా జీవితంలో నాకు సహాయం చేసింది. ఆ దేవుని మనిషి కల నాపై బలమైన ప్రభావం చూపింది. … నేను మీ ఐదు [డాలర్లు] తిరిగి ఇస్తున్నాను, ఎందుకంటే నేను వాటిని ఖర్చు చేయలేను. మీలో ఏదో తేజస్సు ఉన్నట్లు అనిపించిందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఆ కాంతి నన్ను ఆపినట్లు అనిపించింది [మీకు హాని కలిగించకుండా, కాబట్టి], దానికి బదులుగా నేను పారిపోయాను.
“మీరు నన్ను మళ్ళీ చూస్తారని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను, కానీ మీరు చూసినప్పుడు, మీరు నన్ను గుర్తించలేరు, ఎందుకంటే నేను మీ సహోదరుడినవుతాను. … ఇక్కడ, నేను నివసించే చోట, నేను ప్రభువును కనుగొని, మీరు వెళ్ళే సంఘానికి వెళ్ళాలి.
“ఆ పుస్తకంలో మీరు రాసిన సందేశం నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది. బుధవారం రాత్రి నుండి నేను చదవడం ఆపలేకపోయాను. నేను ప్రార్థించాను, నన్ను క్షమించమని దేవుడిని అడిగాను, [మరియు] నన్ను క్షమించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. … మీరు చుట్టిపెట్టిన బహుమతిని నేను అమ్మగలనని అనుకున్నాను. [బదులుగా,] అది నా జీవితంలో [మార్పులు] చేసుకోవాలని నేను కోరుకునేలా చేసింది. నన్ను క్షమించండి, క్షమించండి అని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.
సహోదర సహోదరీలారా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, రక్షకుని వెలుగు మనందరిని చేరుకోగలదు. “క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క అనంతమైన వెలుగు ప్రకాశించే దానికంటే క్రిందకు మునిగిపోవడం మీకు సాధ్యం కాదు” అని అధ్యక్షులు జెఫ్రీ ఆర్. హాలండ్ అన్నారు.
సీలియా బహుమతియైన మోర్మన్ గ్రంథము యొక్క ఊహించని గ్రహీత విషయానికొస్తే, ఈ సహోదరుడు ప్రభువు యొక్క కనికరానికి మరింత సాక్ష్యమిచ్చాడు. ఈ సహోదరుడు తననుతాను క్షమించుకోవడానికి సమయం పట్టినప్పటికీ, అతడు పశ్చాత్తాపంలో ఆనందాన్ని పొందాడు. ఎంత గొప్ప అద్భుతం! విశ్వాసం గల ఒక సహోదరి, ఒక మోర్మన్ గ్రంథము, మనఃపూర్వకమైన పశ్చాత్తాపం మరియు రక్షకుని శక్తి, ప్రభువు యొక్క మందిరములో సువార్త మరియు పవిత్రమైన నిబంధనల యొక్క దీవెనలను సంపూర్ణంగా ఆస్వాదించడానికి దారితీసింది. ఇతర కుటుంబ సభ్యులు అనుసరించారు మరియు పూర్తి-కాల సువార్త సేవతో సహా ప్రభువు ద్రాక్షతోటలో పవిత్రమైన బాధ్యతలను అంగీకరించారు.
మనం యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, మన మనఃపూర్వక పశ్చాత్తాపం యొక్క మార్గం చివరికి మనల్ని రక్షకుని పరిశుద్ధ దేవాలయానికి నడిపిస్తుంది.
పవిత్ర దేవాలయ నిబంధనల ద్వారా మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుని వలన సాధ్యమయ్యే సంపూర్ణ ఆశీర్వాదాలకు అర్హులుగా ఉండేందుకు—పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేయడం నీతియుక్తమైన ఉద్దేశం! ప్రభువు యొక్క మందిరంలో క్రమం తప్పకుండా సేవ చేయడం మరియు అక్కడ మనం చేసే పవిత్రమైన నిబంధనలను పాటించడానికి కృషి చేయడం ఎక్కువగా మన రక్షకునిలా మారడానికి మనకు అవసరమైన హృదయం, శక్తి, మనస్సు మరియు ఆత్మ యొక్క మార్పును అనుభవించడానికి మన కోరికను మరియు మన సామర్థ్యాన్ని రెండింటినీ పెంచుతుంది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా సాక్ష్యమిచ్చారు: “[దేవాలయంలో ఆరాధించడం కంటే] ఏదీ పరలోకాలను ఎక్కువగా తెరవదు. ఏదీ లేదు!”
నా ప్రియమైన మిత్రులారా, మీలో కొరత ఉందని భావిస్తున్నారా? మీరు అనర్హులుగా భావిస్తున్నారా? మీరు సరిగ్గా చేసారా లేదా అని ఆలోచిస్తున్నారా? బహుశా మీరు చింతిస్తూ అడగవచ్చు: నేను తగినంత మంచిగా ఉన్నానా? నాకు చాలా ఆలస్యమైందా? నేను నా ఉత్తమ ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను ఎందుకు విఫలమవుతున్నాను?
సహోదర సహోదరీలారా, మన జీవిత ప్రయాణంలో మనం ఖచ్ఛితంగా తప్పులు చేస్తాం. కానీ దయచేసి గుర్తుంచుకోండి, ఎల్డర్ గెరిట్ డబ్ల్యు. గాంగ్ బోధించినట్లుగా: “మన రక్షకుని ప్రాయశ్చిత్తము అనంతమైనది మరియు నిత్యమైనది. మనలో ప్రతీ ఒక్కరు సందేహపడవచ్చు, విఫలం కావచ్చు. ఒక్కోసారి మనం దారి తప్పవచ్చు. మనం ఎక్కడున్నా, ఏం చేసినా, తిరిగి రాలేని పరిస్థితి అనేది లేదని ప్రేమగా దేవుడు హామీ ఇస్తున్నారు. మనల్ని హత్తుకొనేందుకు ఆయన సిద్ధంగా ఎదురుచూస్తున్నారు.”
నా ప్రియమైన భార్య కారీ లూ కూడా నాకు నేర్పించినట్లుగా, మనమందరం పశ్చాత్తాపపడాలి, మార్పులు చేసుకోవాలి మరియు ప్రతిరోజూ క్రొత్తగా ప్రారంభించాలి.
అడ్డంకులు వస్తాయి. దేవుని వైపు తిరిగే ముందు విషయాలు కష్టమయ్యే వరకు మనం వేచి ఉండకూడదు. నిజంగా పశ్చాత్తాపపడడానికి మన మర్త్య జీవితాలు ముగిసే వరకు మనం వేచి ఉండకూడదు. బదులుగా, మనం దేవునితో ఎన్ని నిబంధనలు చేసినప్పటికీ, యేసు క్రీస్తు యొక్క విమోచన శక్తిపై మరియు మనం ఆయన వద్దకు తిరిగి రావాలనే పరలోక తండ్రి కోరికపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరిద్దాం.
ప్రభువు యొక్క మందిరము, ఆయన పరిశుద్ధ లేఖనాలు, ఆయన పరిశుద్ధ ప్రవక్తలు మరియు అపొస్తలులు క్రీస్తు యొక్క సిద్ధాంతం ద్వారా వ్యక్తిగత పరిశుద్ధత వైపు శ్రమించడానికి మనల్ని ప్రేరేపిస్తారు.
మరియు నీఫై ఇలా చెప్పాడు: “ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, ఇదియే మార్గము; దేవుని రాజ్యమందు మనుష్యుడు రక్షింపబడుటకు పరలోకము క్రింద ఇయ్యబడిన మరే ఇతర మార్గము గాని నామముగానీ లేదు. ఇదే క్రీస్తు యొక్క సిద్థాంతమైయున్నది మరియు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఒకేఒక సత్యమైన సిద్థాంతమైయున్నది.”
దేవునితో “ఏకమయ్యే” మన ప్రక్రియ సవాలుగా అనిపించవచ్చు. కానీ మీరు, నేను ఆగి, నిశ్చలంగా ఉండగలము, రక్షకుడిని అనుసరించగలము మరియు మనం మార్చుకోవాలని ఆయన కోరిన వాటిని కనుగొని చర్య తీసుకోవడానికి ప్రయత్నించగలము. మనం పూర్ణ ఉద్దేశ్యంతో అలా చేస్తే, ఆయన స్వస్థతను మనం చూస్తాము. ప్రభువు ఇచ్చే పశ్చాత్తాప బహుమానాన్ని మనం హత్తుకున్నప్పుడు మన సంతానం ఎలా ఆశీర్వదించబడుతుందో ఆలోచించండి!
గొప్ప కుమ్మరి మనల్ని అచ్చుపోసి మెరుగుపెడతాడు, అది కష్టంగా ఉండవచ్చని మా నాన్న బోధించారు. అయినప్పటికీ, గొప్ప వైద్యుడు కూడా మనల్ని శుద్ధిచేస్తాడు. నేను ఆ స్వస్థత శక్తిని అనుభవించాను మరియు అనుభవిస్తూనే ఉన్నాను. అది యేసు క్రీస్తునందు విశ్వాసం మరియు అనుదిన పశ్చాత్తాపం ద్వారా వస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను.
దేవుని ప్రేమ గురించి మరియు ఆయన కుమారుని ప్రాయశ్చిత్తం యొక్క అనంతమైన శక్తి గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. మనం మనఃపూర్వకంగా మరియు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడినప్పుడు, దానిని ఎక్కువగా అనుభవించగలము.
నా స్నేహితులారా, ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా సువార్త యొక్క అద్భుతమైన పునఃస్థాపనకు మరియు ఆయన ప్రవక్త, ప్రతినిధి అయిన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ద్వారా రక్షకుని ప్రస్తుత దైవిక మార్గదర్శకత్వానికి నేను సాక్షిని. యేసు క్రీస్తు జీవించి ఉన్నారని మరియు ఆయన మన ఆత్మలను స్వస్థపరుస్తారని నాకు తెలుసు. ఈ విషయాలు సత్యమని నాకు తెలుసు మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.