ఘనమైన జ్యేష్ఠత్వమున్న ఓ యువతా
ఆయన పిల్లలందరినీ సురక్షితంగా ఇంటికి చేర్చే తన పనిలో సహాయం చేయడానికి నిబంధన సంతానమైన మిమ్మల్ని దేవుడు విశ్వసిస్తారు.
ఎల్డర్ స్టీవెన్‌సన్, ఇది ఎన్నటికీ మరువలేని సమావేశము.
మా కుటుంబం ఎప్పుడూ Children’s Letters to God [దేవునికి పిల్లల లేఖలు] అనే ఒక చిన్న పుస్తకం చదవడాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇవి అందులో కొన్ని:
“ప్రియమైన దేవుడా, జనులు మరణించడానికి మరియు కొత్త వ్యక్తులను పుట్టించటానికి బదులుగా, ఇప్పుడున్న వారిని మరణించకుండా ఉండేలా మీరు ఎందుకు అనుమతించకూడదు?”
“మీకు కేవలం పది ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి, మరి మా పాఠశాలలో లక్షలు ఎలా ఉన్నాయి?”
“అనేక సందర్భాల్లో టాన్సిల్స్‌ను తొలగించాల్సిన అవసరం వస్తున్నప్పుడు జనులు టాన్సిల్స్‌తో ఎందుకు జన్మిస్తున్నారు?”
ఈ రోజు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడానికి సమయం లేదు, కానీ యువజనుల నుండి నేను తరచుగా వినే మరో ప్రశ్న గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. మంగోలియాలోని ఉలాన్‌బాతర్ నుండి ఐడహోలోని థామస్ వరకు ఇదే ప్రశ్న: “ఎందుకు? కడవరి దిన పరిశుద్ధులు ఇతరుల కంటే అంత భిన్నంగా ఎందుకు జీవించాలి?”
భిన్నంగా ఉండటం చాలా కష్టమని నాకు తెలుసు—ముఖ్యంగా మీరు యవ్వనంలో ఉన్నప్పుడు మరియు ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలని బలంగా కోరుకుంటున్నప్పుడు. ప్రతి ఒక్కరూ సమూహానికి సరిపోయేలా ఉండాలని కోరుకుంటున్నారు, సామాజిక మాధ్యమం మరియు సైబర్ బెదిరింపులతో నిండిన నేటి డిజిటల్ ప్రపంచంలో ఆ కోరిక మానవ శ్రేయస్సుకు హాని కలిగించే నిష్పత్తికి పెరిగిపోయింది.
అయితే, అంతటి ఒత్తిడితో, కడవరి దిన పరిశుద్ధులు భిన్నంగా ఎందుకు జీవిస్తున్నారు? చాలా మంచి సమాధానాలు ఉన్నాయి: ఎందుకంటే మీరు దేవుని బిడ్డ కాబట్టి. ఎందుకంటే మీరు అంత్య దినముల కొరకు సంరక్షించబడుతున్నారు కాబట్టి. ఎందుకంటే మీరు యేసు క్రీస్తు యొక్క శిష్యులు కాబట్టి.
కానీ ఆ సమాధానాలు ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రత్యేకపరచవు. ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డే. ప్రస్తుతం భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ కడవరి దినాల్లో ఇక్కడకు పంపబడినవారే. అయినా మీరు ప్రయత్నిస్తున్న విధంగా, ప్రతి ఒక్కరూ జ్ఞాన వాక్యమును లేదా పవిత్రత యొక్క చట్టాన్ని జీవించడం లేదు. ఈ సంఘములో సభ్యులు కాని శూరులైన క్రీస్తు శిష్యులు చాలా మంది ఉన్నారు. కానీ వారు మీలాగ సువార్తసేవ చేయరు మరియు తమ పూర్వీకుల తరఫున ప్రభువు యొక్క మందిరములలో విధులు నిర్వహించరు. చెప్పవలసినది దీనికి మించి ఉంది—మరియు ఇంకా ఉంది.
ఈ రోజు నేను నా జీవితంలో అర్థవంతమైన ఒక అదనపు కారణంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. 1988లో, రస్సెల్ ఎమ్. నెల్సన్ అనే ఒక యువ అపొస్తలుడు బ్రిగం యంగ్ విద్యాలయములో “Thanks for the Covenant [నిబంధనకు ధన్యవాదాలు]” అనే ఒక ప్రసంగమునందించారు. దానిలో, అప్పటి ఎల్డర్ నెల్సన్ దేవునితో నిబంధనలు చేయడానికి మరియు కొనసాగించడానికి మన నైతిక కర్తృత్వమును మనం ఉపయోగించినప్పుడు, ప్రతి యుగములో దేవుడు మన పూర్వీకులతో చేసిన శాశ్వతమైన నిబంధనకు మనం వారసులమవుతామని వివరించారు. మరో విధంగా, మనము “నిబంధన యొక్క సంతానం” అవుతామని చెప్పారు. అది మనల్ని ప్రత్యేకపరుస్తుంది. ఇది మన జ్యేష్ఠత్వముతో సహా మన పూర్వీకులు పొందిన అదే దీవెనలను పొందేందుకు మనకు సాధ్యతను అందిస్తుంది.
జ్యేష్ఠత్వము! ఆ పదమును మీరు వినియుండవచ్చు. మనము దాని గురించి కీర్తనలు కూడా పాడతాము: “ఘనమైన జ్యేష్ఠత్వమున్న ఓ యువతా, కొనసాగించండి, కొనసాగించండి, కొనసాగించండి!” ఇది ఒత్తిడిపెట్టే పదము. కానీ దాని అర్థం ఏమిటి?
పాత నిబంధన కాలంలో, ఒక తండ్రి చనిపోతే, అతనికి పుట్టిన జ్యేష్ఠ పుత్రుడు తన తల్లి మరియు సోదరీమణుల సంరక్షణ బాధ్యత వహిస్తాడు. అతని తమ్ముళ్లు వారి వారసత్వాన్ని పొంది, లోకంలో తమ మార్గాన్ని ఏర్పరచుకోవడానికి వెళ్ళిపోతారు, కానీ జ్యేష్ఠ పుత్రుడు ఎక్కడికీ వెళ్ళలేడు. అతడు వివాహం చేసుకుంటాడు మరియు తన స్వంత కుటుంబాన్ని కలిగియుంటాడు, కానీ తన తండ్రి యొక్క బాధ్యతలను నిర్వర్తించడానికి తన రోజులు ముగిసే వరకు ఉంటాడు. ఈ అదనపు బాధ్యత కారణంగా, వారసత్వంలో అదనపు భాగం అతనికి ఇవ్వబడింది. ఇతరులకు నాయకత్వం వహించమని మరియు వారి పట్ల శ్రద్ధ వహించమని అడగడం చాలా ఎక్కువగా అనిపిస్తుందా? అతడికిచ్చిన అదనపు వారసత్వాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నప్పుడు అలా అనిపించదు.
ఈ రోజు మనము భూసంబంధమైన కుటుంబాలలో మీ జన్మ క్రమం లేదా పాత నిబంధనలోని లింగ పాత్రల గురించి మాట్లాడటం లేదు. క్రీస్తుతో మరియు పరలోకంలో ఉన్న మీ తండ్రితో ఆరంభించడానికి మీరు ఎంచుకున్న నిబంధన సంబంధాన్ని బట్టి క్రీస్తుతో ఉమ్మడి వారసులుగా మీరు పొందే వారసత్వం గురించి మనము మాట్లాడుతున్నాము. ఆయన యొక్క ఇతర సంతానము కంటే భిన్నంగా జీవించి, వారికి మంచి నాయకత్వం వహించి, సేవ చేయగలిగేలా మీరు జీవించాలని దేవుడు ఆశించడం చాలా ఎక్కువా? మీకు ఇవ్వబడిన—భౌతిక మరియు ఆత్మీయ—దీవెనలు రెండింటినీ మీరు పరిగణించినప్పుడు అలా అనిపించదు.
మీ జ్యేష్ఠత్వానికి అర్థము మీరు ఇతరులకన్నా గొప్పవారనా? కాదు, కానీ ఇతరులు మెరుగ్గా జీవించేలా మీరు సహాయం చేస్తారని దీని అర్థం. మీ జ్యేష్ఠత్వానికి అర్థము మీరు ఎన్నుకోబడ్డవారనా? అవును, అయితే మీరు ఇతరులను పరిపాలించడానికి ఎన్నుకోబడలేదు; వారికి సేవ చేయడానికి ఎన్నుకోబడ్డారు. మీ జ్యేష్ఠత్వము దేవుని ప్రేమకు నిదర్శనమా? అవును, కానీ మరీ ముఖ్యమైనదేమిటంటే ఇది ఆయన నమ్మకానికి నిదర్శనం.
ప్రేమించబడటం ఒక విషయం మరియు పూర్తిగా విశ్వసించబడటం మరొక విషయం. యౌవనుల బలము కొరకు మార్గదర్శిలో మనమిలా చదువుతాము: “పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని విశ్వసిస్తున్నారు. మిమ్మల్ని ఆయనతో బంధించి, ఆయన శక్తిని మీ జీవితంలోకి తీసుకువచ్చే సంపూర్ణ సువార్త, పవిత్రమైన విధులు మరియు నిబంధనలతో సహా ఆయన మీకు ఎన్నో శ్రేష్ఠమైన దీవెనలనిచ్చారు. ఆ దీవెనలతో అదనపు బాధ్యత వస్తుంది. మీరు ప్రపంచంలో మార్పు తీసుకురాగలరని ఆయనకు తెలుసు మరియు అందుకు మీరు అనేక విషయములలో ప్రపంచానికి భిన్నంగా ఉండటం అవసరం.”
దేవుని పిల్లలందరు ఒక తీరం నుండి మరొక తీరానికి ప్రయాణిస్తున్నప్పుడు ఆయన వారిని పంపిన పెద్ద నౌకతో మన మర్త్య అనుభవాన్ని పోల్చవచ్చు. సముద్రయానం నేర్చుకోవడానికి, ఎదగడానికి, సంతోషంగా ఉండటానికి మరియు పురోగతిచెందడానికి అవకాశాలతో నిండి ఉంది, కానీ అది ప్రమాదాలతో కూడా నిండి ఉంది. దేవుడు తన పిల్లలందరినీ ప్రేమిస్తారు మరియు వారి సంక్షేమం గురించి శ్రద్ధ వహిస్తారు. ఆయన వారిలో ఎవ్వరినీ కోల్పోవడానికి ఇష్టపడరు, కాబట్టి ఆయన తన సిబ్బందిలో సభ్యులుగా ఉండటానికి ఇష్టపడే వారిని ఆహ్వానిస్తున్నారు—అది మీరే. నిబంధనలు చేసి, పాటించాలనే మీ ఎంపిక కారణంగా, ఆయన తన నమ్మకాన్ని మీకు అందిస్తారు. ఆయన మీకప్పగించిన ముఖ్యమైన పని కారణంగా మీరు భిన్నంగా, పరిశుద్ధంగా మరియు ప్రత్యేకముగా ఉంటారని ఆయన విశ్వసిస్తారు.
దాని గురించి ఆలోచించండి! ఆయన పిల్లలందరినీ సురక్షితంగా ఇంటికి చేర్చే తన పనిలో సహాయం చేయడానికి జనులందరిలో నిబంధన సంతానమైన మిమ్మల్ని—ఆయన సిబ్బందిని—దేవుడు విశ్వసిస్తారు. “పరలోకంలో ఉన్న దేవదూతలందరూ ఈ కొద్దిమందిని చూస్తున్నారు,” అని ఒకసారి అధ్యక్షులు బ్రిగమ్ యంగ్ అనడంలో ఆశ్చర్యం లేదు.
మీరు భూమి అని పిలువబడే ఈ పెద్ద నౌకలో చుట్టూ చూసినప్పుడు, ఇతర వ్యక్తులు విశ్రమించే కుర్చీలలో కూర్చుని తాగడం, జూదశాలలలో జూదం ఆడటం, చాలా బహిర్గతమయ్యే దుస్తులు ధరించడం, సెల్ ఫోనులలో అనంతంగా స్క్రోల్ చేయడం మరియు ఎలక్ట్రానిక్ ఆటలు ఆడుతూ ఎక్కువ సమయం వృధా చేయడాన్ని మీరు చూడవచ్చు. కానీ, “నేను ఎందుకు అలా చేయలేను?” అని ఆశ్చర్యపోయే బదులు, మీరు సాధారణ ప్రయాణీకులు కారని గుర్తుంచుకోగలరు. మీరు సిబ్బందిలో సభ్యులు. ప్రయాణికులకు లేని బాధ్యతలు మీకు ఉన్నాయి. సహోదరి అర్డెత్ కాప్ ఒకసారి చెప్పినట్లుగా, “మీరు బీచ్‌లోని ఇతర ఈతగాళ్లలా కనిపిస్తే ప్రాణము [కాపాడేవారు] కాలేరు.”
మీరు అన్ని అదనపు బాధ్యతల వల్ల నిరుత్సాహపడకముందే, సిబ్బంది ఇతర ప్రయాణీకులు పొందలేని పరిహారాన్ని పొందుతారని దయచేసి గుర్తుంచుకోండి. ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సెన్ ఇలా చెప్పారు, “నీతిమంతుల కొరకు ఆధ్యాత్మిక శక్తి అనే పరిహారముంది,” అందులో “గొప్ప హామీ, గొప్ప నిర్ధారణ మరియు గొప్ప విశ్వాసం” ఉన్నాయి. వృద్ధుడైన అబ్రాహాము వలె, మీరు గొప్ప సంతోషాన్ని మరియు శాంతిని, గొప్ప నీతిని మరియు గొప్ప జ్ఞానాన్ని పొందుతారు. మీ పరిహారం పరలోకములో నివాసము మరియు బంగారంతో వేసినట్లుండే వీధులు మాత్రమే కాదు. పరలోక తండ్రికి తనకున్నదంతా మీకు ఇవ్వడం చాలా సులభం. మీరు ఆయనలా మారేందుకు మీకు సహాయం చేయాలనేదే ఆయన కోరిక. ఆ విధంగా, మీ నిబద్ధతలు మీ నుండి ఎక్కువగా కోరుకుంటాయి, ఎందుకంటే మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి దేవుడు సహాయపడే విధానమదే.
“ఎవరినైనా అడిగేందుకు అది చాలా ఎక్కువ, కానీ మీరు కేవలం ఎవరో ఒకరు కాదు”! మీరు ఘనమైన జ్యేష్ఠత్వమున్న యౌవనులు. దేవుడు మరియు యేసు క్రీస్తుతో మీ నిబంధన సంబంధము, ప్రేమ మరియు నమ్మకం యొక్క సంబంధము, దానిలో మీరు వారి కృప—వారి దైవిక సహాయం, బలము మరియు జయించే శక్తి యొక్క వరము కొరకు అత్యధిక ప్రాప్యతను కలిగియుంటారు. ఆ శక్తి కేవలం కోరికతో కూడిన ఆలోచన, అదృష్టము లేదా స్వీయ-సఫల ప్రవచనం కాదు. అది వాస్తవమైనది.
మీరు మీ జ్యేష్ఠత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు, మీరు ఎప్పటికీ ఒంటరి వారు కారు. ఒలీవతోట యజమాని మీతో పాటు శ్రమిస్తారు. మీరు యేసు క్రీస్తుతో చేయి చేయి కలిపి పని చేస్తున్నారు. ప్రతీ కొత్త నిబంధనతో—మరియు ఆయనతో మీ సంబంధం మరింతగా బలపడుతుండగా—మీరు గట్టిగా చుట్టుకొనే వరకు మీరు ఒకరినొకరు మరింత గట్టిగా పట్టుకొనియుంటారు. ఆయన కృప యొక్క ఆ పవిత్ర సంకేతంలో, ప్రపంచం నుండి భిన్నంగా—రక్షకుడు ఎలా జీవించారో ఖచ్చితంగా అలా జీవించాలనే కోరిక మరియు బలం రెండింటినీ మీరు కనుగొంటారు. యేసు క్రీస్తు మీకు సహకరిస్తున్నందున మీరు దేనినైనా ఎదుర్కోగలరు!
2 నీఫై 2:6 లో మనము ఇలా చదువుతాము, “అందువలన, పరిశుద్ధ మెస్సీయ యందు మరియు ఆయన ద్వారానే విమోచన వచ్చును. ఏలయనగా, ఆయన కృపాసత్యసంపూర్ణుడైయున్నాడు.” ఆయన సత్యసంపూర్ణుడైయున్నాడు కాబట్టి—లోపాలు, బలహీనతలు, విచారం మరియు అన్నింటితో మిమ్మల్ని ఉన్నదున్నట్లుగా ఆయన చూస్తారు. ఆయన సత్యసంపూర్ణుడైయున్నాడు కాబట్టి, మీరు నిజంగా ఏమి కాగలరనే దానిని, మీ సామర్థ్యాన్ని ఆయన చూస్తారు. మీరు ఉన్న స్థితిలోనే ఆయన మిమ్మల్ని అంగీకరిస్తారు మరియు మీరు పశ్చాత్తాపపడడానికి, అభివృద్ధిచెందడానికి, అధిగమించడానికి మరియు సమర్థులుగా మారడానికి మీకు సహాయం చేస్తారు.
“ఘనమైన జ్యేష్ఠత్వమున్న ఓ యువతా, కొనసాగించండి, కొనసాగించండి, కొనసాగించండి!” నేడు, మరో 20 సంవత్సరాలలో మరియు ఎప్పటికీ మీరు ప్రేమించబడతారని—మరియు మీరు విశ్వసించబడతారని—నేను సాక్ష్యమిస్తున్నాను. మీ జ్యేష్ఠత్వమును స్వల్ప లాభం కొరకు అమ్ముకోవద్దు. విలువలేనిదాని కొరకు విలువైనదానితో వ్యాపారం చేయవద్దు. ప్రపంచాన్ని మార్చడానికి మీరు జన్మించినప్పుడు ప్రపంచం మిమ్మల్ని మార్చేలా చేసుకోవద్దు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.