యేసు క్రీస్తుకు బద్ధులైయుండుట: లోకమునకు ఉప్పుగా మారుట
మనము ప్రభువుకు బద్ధులమై నిలిచియున్నప్పుడు, మన జీవితాలు సహజంగా ఆయన వెలుగును ప్రతిఫలిస్తాయి మరియు మనము “లోకమునకు ఉప్పుగా” మారతాము.
మనము “[ఆయన] నిత్య సువార్తకు పిలువబడి, నిత్యనిబంధనతో నిబంధన చేసుకొనినప్పుడు [మనము] లోకమునకు ఉప్పుగా, యెంచబడుదుము,” అని రక్షకుడు బోధించారు. ఉప్పు రెండు పదార్థాలతో కలిపి తయారు చేయబడింది. మనకై మనం ఉప్పు వలె ఉండలేము; మనము లోకమునకు ఉప్పయి ఉండాలంటే, మనం ప్రభువుకు బద్ధులై ఉండాలి మరియు ప్రపంచమంతటా సంఘ సభ్యులను కలిసినప్పుడు అదే నేను చూస్తున్నాను—ప్రభువుకు బద్ధులైయున్న సంఘము యొక్క విశ్వాసులైన సభ్యులు, ఇతరులకు సేవ చేయడంలో వారి ప్రయత్నాలందు మరియు లోకమునకు ఉప్పయి ఉండేందుకు నిబద్ధులైయున్నారు.
మీ అచంచలమైన అంకితభావన ఒక అద్భుతమైన మాదిరి. మీ సేవ ప్రశంసించబడింది మరియు ఆదరించబడింది.
మన యువత అసాధారణమైన ధైర్యాన్ని, అంకితభావాన్ని ప్రదర్శించారు. వారు ఉత్సాహంగా కుటుంబ చరిత్ర పనిని స్వీకరించారు మరియు ప్రభువు యొక్క మందిరాన్ని వారు తరచుగా దర్శించడం వారి అంకితభావానికి సాక్ష్యము. ప్రపంచమంతటా సువార్తసేవ చేయడానికి సమయాన్ని మరియు శక్తిని అంకితమివ్వడానికి వారి సమ్మతి ఒక లోతైన, స్థిరమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. వారు కేవలం పాల్గొనడం మాత్రమే కాకుండా, యేసు క్రీస్తుకు బద్ధులైన శిష్యులుగా మారడంలో దారి చూపుతున్నారు. వారి సేవ లెక్కలేనంతమంది జీవితాలను ప్రభావితం చేస్తూ, వెలుగును, నిరీక్షణను అందిస్తుంది. స్ఫూర్తిదాయకమైన మీ సేవ కొరకు, సంఘ యువత అయిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. మీరు సంఘము యొక్క భవిష్యత్తు మాత్రమే కాదు, దాని వర్తమానమైయున్నారు. వాస్తవానికి మీరు లోకమునకు ఉప్పయి యున్నారు!
నేను ప్రభువైన యేసు క్రీస్తును ప్రేమిస్తున్నాను మరియు ప్రభువు యొక్క సంఘములో మీతో పాటు సేవ చేసే అవకాశము చేత దీవించబడినట్లు భావిస్తున్నాను. పంచుకోబడిన మన విశ్వాసముపై ఆధారపడిన మన ఐక్యత మరియు బలము, ఈ ప్రయాణంలో మనము ఎన్నడూ ఒంటరిగా లేమని మనకు అభయమిస్తాయి. కలిసి మనము సేవ, ప్రేమ మరియు అంచంచలమైన విశ్వాసమందు స్థిరమైన పునాదిని కలిగియుండి దేవుని రాజ్యమును నిర్మించడాన్ని కొనసాగించగలము.
యేసు క్రీస్తు గలిలయ సముద్రము వద్ద బోధించినప్పుడు, గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేయడానికి తరచుగా ఆయన తన శ్రోతలకు బాగా తెలిసిన రోజువారీ అంశాలను ఉపయోగించారు. అటువంటి ఒక పదార్థం ఉప్పు. “[మీరు] లోకమునకు ఉప్పయి యున్నారు,” అని యేసు ప్రకటించారు, ప్రత్యేకించి ఉప్పు యొక్క బహుముఖ విలువ తెలిసిన ఆయన కాలపు జనులకు ఈ వ్యాఖ్యానము గొప్ప అర్థాన్ని, ప్రాముఖ్యతను కలిగియుంది.
నా స్వదేశమైన పోర్చుగల్‌లోని దక్షిణ ప్రాంతమైన ఆల్గార్వ్‌లో ఉప్పును పండించడం అనే పురాతన వృత్తి వేల సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యపు కాలం నాటిది. విశేషమేమిటంటే, మార్నోటోస్ అని పిలువబడే ఉప్పు కార్మికులు ఉపయోగించే పద్ధతులు అప్పటి నుండి కొద్దిగా మారాయి. ఈ అంకితమైన కళాకారులు సాంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తారు, శతాబ్దాలుగా కొనసాగుతున్న వారసత్వాన్ని కొనసాగిస్తూ వారి పనిని పూర్తిగా చేతితో నిర్వహిస్తారు.
ఈ ప్రాచీన పద్ధతి “ఉప్పు పువ్వు” అని పిలువబడే దానిని పండిస్తుంది. ఉప్పు పువ్వును పండించే సంక్లిష్టమైన ప్రక్రియను పూర్తిగా తెలుసుకోవడానికి, అది ఎటువంటి వాతావరణంలో ఉత్పత్తి చేయబడిందో అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆల్గార్వ్ యొక్క తీరప్రాంతంలోని ఉప్పు చిత్తడి నేలలు ఉప్పు ఉత్పత్తికి అనువైన పరిస్థితులను అందిస్తాయి. సముద్రపు నీరు లోతులేని మడుగుల్లోకి పంపబడుతుంది, వాటిని ఉప్పు పాత్రలు అని పిలుస్తారు, అక్కడ అది తీవ్రమైన ఎండలో ఆవిరైపోతుంది. నీరు ఆవిరైనప్పుడు, ఉప్పు పువ్వు ఉప్పు పాత్రల పైభాగంలో సున్నితమైన స్ఫటికాలను ఏర్పరుస్తుంది. ఈ స్ఫటికాలు చాలా స్వచ్ఛమైనవి మరియు ప్రత్యేకమైన, పెళుసైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ మార్నోటోస్ ప్రత్యేక సాధనాలను ఉపయోగించి నీటి ఉపరితలం నుండి స్ఫటికాలను జాగ్రత్తగా తొలగిస్తారు, ఈ ప్రక్రియకు గొప్ప నైపుణ్యం మరియు ఖచ్చితత్వం అవసరమవుతుంది. పోర్చుగల్‌లో, ఈ నాణ్యమైన-ఉప్పును “సాల్ట్ క్రీమ్” అని పిలుస్తారు, ఎందుకంటే ఇది పాలపై పేరుకున్న మీగడలాగా సున్నితంగా తీయబడగలదు. ఈ సున్నితమైన ఉప్పు దాని స్వచ్ఛత మరియు అసాధారణమైన రుచి కారణంగా ఎంతో అమూల్యమైనదిగా యెంచబడి, పాకశాస్త్ర కళలో విలువైన పదార్థంగా మారింది.
వారు అత్యున్నత నాణ్యత కలిగిన ఉప్పును పండించారని నిశ్చయపరచడానికి మార్నోటోస్ గొప్ప కృషి చేసినట్లే, ప్రభువు యొక్క నిబంధన జనులుగా, మనం ఎల్లప్పుడు మనం వంతు కృషి చేయాలి, తద్వారా మన ప్రేమ మరియు మాదిరి సాధ్యమైనంత వరకు మన రక్షకుడైన యేసు క్రీస్తుకు స్వచ్ఛమైన ప్రతిరూపంగా ఉంటుంది.
ప్రాచీన కాలంలో, ఉప్పును రుచిని పెంచడానికి మాత్రమే వాడేవారు కాదు—అది ఒక ముఖ్యమైన సంరక్షణకారి మరియు శుద్ధతకు, నిబంధనకు చిహ్నము. ఉప్పు ఆహారాన్ని భద్రపరచడానికి మరియు రుచిని పెంచడానికి ముఖ్యమైనదని జనులకు తెలుసు. కలుషితమవడం లేదా పలుచన చేయబడడం ద్వారా ఉప్పు దాని సారాన్ని లేదా రుచిని కోల్పోవడం వల్ల కలిగే తీవ్రమైన ప్రభావాలను కూడా వారు అర్థం చేసుకున్నారు.
యేసు క్రీస్తుపై మనకున్న విశ్వాసం అప్రధానమైనదిగా మారితే, ఉప్పు దాని సారాన్ని కోల్పోగలిగినట్లే మనం కూడా మన ఆధ్యాత్మిక శక్తిని కోల్పోవచ్చు. మనం బయటికి ఒకేలా కనిపించవచ్చు, కానీ బలమైన అంతర్గత విశ్వాసం లేకుండా, ప్రపంచంలో మార్పును కలిగించగల మరియు మన చుట్టూ ఉన్నవారిలో ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురాగల సామర్థ్యాన్ని మనం కోల్పోతాము.
అయితే, నేడు ప్రపంచానికి అవసరమైన మార్పుగా ఉండడానికి, వైవిధ్యాన్ని తేవడానికి మన శక్తిని, ప్రయత్నాలను మనం ఎలా ఉపయోగించగలము? శిష్యత్వాన్ని కాపాడుకుంటూ, సానుకూల ప్రభావంగా ఉండడాన్ని మనం ఎలా కొనసాగించగలము?
మన ప్రియమైన ప్రవక్త యొక్క మాటలు నా మనస్సులో ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి: “మనం కలిసి పనిచేయాలని, ఒకరికొకరం సహాయం చేసుకోవాలని దేవుడు మనల్ని కోరుతున్నారు. అందుకే ఆయన మనల్ని కుటుంబాలుగా భూమికి పంపుతారు మరియు మనల్ని వార్డులుగా, స్టేకులుగా ఏర్పాటు చేస్తారు. అందుకే ఒకరికొకరు సేవ చేయమని, పరిచర్య చేయమని ఆయన మనల్ని కోరతారు. అందుకే ఆయన మనలను లోకము లో నివసించండి, కానీ లోకమునకు చెందవద్దని కోరతారు.”
మన జీవితాలు ఉద్దేశము మరియు సేవతో నింపబడినప్పుడు, మనము ఆత్మీయ ఉదాసీనతను తప్పించుకుంటాము; దానికి విరుద్ధంగా, మన జీవితాలు దైవిక ఉద్దేశాన్ని, ఇతరులకు అర్థవంతమైన సేవ చేయడాన్ని, ధ్యానించడానికి మరియు పర్యాలోచన చేయడానికి పవిత్ర అవకాశాలను కోల్పోయినప్పుడు, మనం క్రమంగా, మన స్వంత పనులు మరియు స్వప్రయోజనాల చేత ఉక్కిరిబిక్కిరి అవుతూ మన సారాన్ని కోల్పోయే ప్రమాదముంది. దీనికి విరుగుడు సేవలో నిమగ్నమై ఉండడాన్ని కొనసాగించడమే—ఆత్రుతతో మంచి కార్యములలో మరియు మనము, మనం జీవిస్తున్న సమాజం బాగుపడడంలో నిమగ్నమైయుండడమే.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనమందరం యేసు క్రీస్తు సంఘానికి చెందినవారమైయుండి, ఆయన సంఘములో సేవచేసే అవకాశాన్ని కలిగియుండడం ఎంత గొప్ప ఆశీర్వాదం. మన పరిస్థితులు వేరుగా ఉండవచ్చు, కానీ మనమందరం మార్పు తీసుకురాగలము.
మార్నోటోస్ గుర్తుందా, ఉప్పు కార్మికులు; వారు శ్రేష్ఠమైన స్పటికాలను, శ్రేష్ఠమైన ఉప్పును పండించడానికి సాధారణమైన పనిముట్లను ఉపయోగిస్తారు. మనం కూడా చిన్న మరియు అర్థవంతమైన చర్యలలో స్థిరమైన ప్రయత్నాలతో, మన శిష్యత్వాన్ని మరియు యేసు క్రీస్తు పట్ల నిబద్ధతను మరింతగా పెంపొందించుకునే సులభమైన పనులను చేయవచ్చు. “లోకమునకు ఉప్పయి ఉండడానికి” మనం ప్రయత్నించగల నాలుగు సరళమైన మరియు గంభీరమైన మార్గాలు ఇవి:
-
ప్రభువు యొక్క మందిరాన్ని మన భక్తికి కేంద్రంగా ఉంచుకోవడం. ఇప్పుడు దేవాలయాలు మునుపెన్నడూ లేనంత దగ్గరగా ఉన్నాయి కనుక, ప్రభువు యొక్క మందిరంలో క్రమంగా ఆరాధించడానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది అత్యంత ముఖ్యమైన దానిపై దృష్టిసారించడానికి మరియు మన జీవితాలను క్రీస్తుపై కేంద్రీకరించడానికి మనకు సహాయపడుతుంది. దేవాలయంలో, మనం యేసు క్రీస్తునందు మన విశ్వాసం యొక్క ముఖ్య భాగాన్ని మరియు ఆయనపట్ల మన భక్తి యొక్క నిజమైన సారాన్ని కనుగొంటాము.
-
కలిసి సువార్తను జీవించడం ద్వారా ఇతరులను బలపరిచే మన ప్రయత్నాలలో ఉద్దేశపూర్వకంగా ఉండడం. మన జీవితాలలోనికి, మన గృహాలలోనికి సువార్త సూత్రాలను తీసుకురావడానికి స్థిరమైన మరియు ఉద్దేశ్యపూర్వకమైన ప్రయత్నాల ద్వారా మన కుటుంబాలను మనం బలపరచుకోగలము.
-
సంఘంలో ఒక పిలుపును అంగీకరించి, సేవ చేయడానికి సమ్మతించడం. మన స్థానిక సమూహాలలో సేవ చేయడం ఒకరికొకరు మద్దతునివ్వడానికి మరియు కలిసి ఎదగడానికి మనల్ని అనుమతిస్తుంది. సేవ చేయడం ఎల్లప్పుడు అనుకూలమైనది కానప్పటికీ, అది ఎల్లప్పుడు ఫలవంతమైనది.
-
చివరిగా, ఒక ఉద్దేశ్యముతో డిజిటల్ సంభాషణా సాధనాలను ఉపయోగించడం. ఈరోజు, డిజిటల్ సంభాషణా సాధనాలు ఇదివరకెన్నడూ లేనివిధంగా జతచేరడానికి మనల్ని అనుమతిస్తాయి. మీలో చాలామందిలాగే, నేను సంఘములోని సహోదర సహోదరీలతో మరియు నా కుటుంబంతో, స్నేహితులతో జతచేరడానికి ఈ సాధనాలను ఉపయోగిస్తాను. నేను వారితో జతచేరినప్పుడు, వారికి దగ్గరగా ఉన్నట్లు భావిస్తాను; మనం భౌతికంగా అక్కడ ఉండలేనప్పుడు అవసరమైన సమయాల్లో ఒకరికొకరు పరిచర్య చేసుకోగలము. ఈ సాధనాలు నిస్సందేహంగా ఒక ఆశీర్వాదం, అయినప్పటికీ ఇవే సాధనాలు లోతైన అర్థవంతమైన పరస్పర సంభాషణల నుండి మనలను దూరం చేయగలవు మరియు చివరికి మన సమయాన్ని తక్కువ ఉద్దేశ్యపూర్వక కార్యకలాపాలలో వృధా చేసే అలవాట్లను మనం చేసుకొనేలా చేయవచ్చు. లోకమునకు ఉప్పుగా ఉండటానికి ప్రయాసపడడం ఆరు అంగుళాల (15 సెం.మీ) తెరపై అంతులేని చిన్న వీడియోలను చూడడాన్ని మించినది.
ప్రభువు యొక్క మందిరాన్ని మన జీవితాలలో ముఖ్యమైన భాగంగా ఉంచి, సువార్తను జీవించడం ద్వారా ఇతరులను ఉద్దేశ్యపూర్వకంగా బలపరచి, సేవ చేయడానికి పిలుపులను అంగీకరించి, ఒక ఉద్దేశ్యంతో డిజిటల్ సాధనాలను ఉపయోగించినప్పుడు, మనం మన ఆధ్యాత్మిక శక్తిని కాపాడుకోగలము. దాని స్వచ్ఛమైన రూపంలో ఉన్న ఉప్పుకు మెరుగుపరచి, సంరక్షించే శక్తి ఉన్నట్లుగా, క్రీస్తు వంటి సేవ మరియు ప్రేమపట్ల మన భక్తి చేత అది పోషించబడి, కాపాడబడినప్పుడు యేసు క్రీస్తుపై మన విశ్వాసము కూడా అలాగే ఉంటుంది.
మనము ప్రభువుకు బద్ధులమై నిలిచియున్నప్పుడు, మన జీవితాలు సహజంగా ఆయన వెలుగును ప్రతిఫలిస్తాయి మరియు మనము “లోకమునకు ఉప్పుగా” మారతాము. ఈ ప్రయత్నంలో, మనం మన స్వంత జీవితాలను సుసంపన్నం చేసుకోవడమే కాకుండా మన కుటుంబాలను మరియు మన సంఘాలను కూడా బలపరుస్తాము. ప్రభువుతో ఈ బంధాన్ని కాపాడుకోవడానికి, ఎప్పటికీ మన సారాన్ని కోల్పోకుండా ఉండడానికి మరియు మనం ఎలా ఉండాలని ప్రభువు కోరుకున్నారో అలా ఉప్పు యొక్క చిన్న చిన్న స్ఫటికాలుగా ఉండడానికి మనం ప్రయాసపడదాం. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.