ఆనందకరమైన సంఘానికి స్వాగతం
మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క విమోచించు జీవితము, నియమితకార్యము కారణంగా, మనం భూమిపై అత్యంత ఆనందకరమైన వ్యక్తులుగా ఉండగలము—మరియు ఉండాలి!
నేను దాదాపు 37 సంవత్సరాల క్రితం, అంటే 1987 క్రిస్మస్‌కు ముందురోజు సాయంత్రం యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో సభ్యుడిగా బాప్తిస్మం పొందాను. అది నా జీవితంలో, నా నిత్య ప్రయాణంలో నిజంగా అద్భుతమైన రోజు మరియు మార్గాన్ని సిద్ధం చేసి, ఆ క్రొత్త జన్మ యొక్క జలముల వద్దకు నన్ను తీసుకువచ్చిన స్నేహితులకు నేను ప్రగాఢ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
మీ బాప్తిస్మము నిన్న లేదా సంవత్సరాల క్రితం జరిగినా, మీరు ఒక పెద్ద బహుళ-వార్డు సంఘ భవనంలో లేదా గడ్డి పందిరి క్రింద కలుసుకున్నా, రక్షకుని జ్ఞాపకార్థం మీరు సంస్కారమును థాయ్‌లో లేదా స్వాహిలిలో స్వీకరించినా, ఆనందకరమైన సంఘానికి స్వాగతం! అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆనందకరమైన సంఘానికి స్వాగతం!
ఆనందకరమైన సంఘము
ఆయన పిల్లలలో ప్రతీ ఒక్కరి కోసం మన పరలోక తండ్రి యొక్క ప్రేమపూర్వక ప్రణాళిక కారణంగా మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క విమోచించు జీవితము, నియమితకార్యము కారణంగా, మనం భూమిపై అత్యంత ఆనందకరమైన వ్యక్తులుగా ఉండగలము—మరియు ఉండాలి! తరచుగా సమస్యాత్మకమైన ప్రపంచంలో జీవితపు తుఫానులు మనపైకి వచ్చినప్పటికీ, క్రీస్తునందు మనకున్న నిరీక్షణ మరియు అందమైన సంతోష ప్రణాళికలో మన స్వంత స్థానం గురించి మనకున్న అవగాహన కారణంగా మనం పెరుగుతున్న మరియు స్థిరమైన ఆనందాన్ని, అంతర్గత శాంతిని పెంపొందించుకోవచ్చు.
ప్రభువు యొక్క సీనియర్ అపొస్తలుడైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు సంఘాధ్యక్షుడైనప్పటి నుండి దాదాపు ఆయన ఇచ్చిన ప్రతీ ప్రసంగంలో యేసు క్రీస్తుపై కేంద్రీకృతమైన జీవితం నుండి వచ్చే ఆనందం గురించి మాట్లాడారు. ఆయన దానిని చాలా సంక్షిప్తంగా సంగ్రహించారు: “ఆనందము ఆయన నుండి మరియు ఆయన వలన కలుగుతుంది. … కడవరి-దిన పరిశుద్ధులకు, యేసు క్రీస్తే ఆనందము!”
మనము యేసు క్రీస్తు సంఘము యొక్క సభ్యులము. మనము ఆనందకరమైన సంఘము యొక్క సభ్యులము! సమస్త ఆనందము యొక్క మూలమును ఆరాధించడానికి ప్రతీ ఆదివారం నాడు మన సంస్కార సమావేశాలలో మనం సమకూడినప్పటి కంటే జనులుగా మన ఆనందం ఎక్కడా మరింత స్పష్టంగా కనిపించకూడదు! ప్రభు రాత్రి భోజనం, పాపం మరియు మరణం నుండి మన విమోచన మరియు రక్షకుని యొక్క శక్తివంతమైన కృపను స్తుతించడానికి ఇక్కడ మనము మన వార్డు మరియు శాఖ కుటుంబాలతో సమావేశమవుతాము! ఆనందం, ఆశ్రయం, క్షమాపణ, కృతజ్ఞతలు మరియు యేసు క్రీస్తు ద్వారా కనుగొనబడిన చెందియున్నామనే భావనను అనుభవించడానికి మనం ఇక్కడికి వస్తాము!
క్రీస్తులో సామూహిక ఆనందం యొక్క ఈ ఆత్మయేనా మీరు కనుగొనేది? మీరు తెచ్చేది ఇదేనా? దీనితో మీకు పెద్దగా సంబంధం లేదని మీరు అనుకోవచ్చు లేదా మీరు ఎల్లప్పుడూ పనులు ఎలా జరుగుతాయో దానికి అలవాటుపడి ఉండవచ్చు. కానీ మనమందరం మన వయస్సు లేదా మన పిలుపుతో సంబంధం లేకుండా, మన సంస్కార సమావేశాలను ఆనందంతో నిండిన, క్రీస్తు-కేంద్రీకృతమైన, స్వాగతించే సమయంగా చేయడానికి, ఆనందకరమైన భక్తి యొక్క ఆత్మతో సజీవంగా ఉండేలా చేయడానికి సహకరించగలము.
ఆనందకరమైన భక్తి
ఆనందకరమైన భక్తి? “ఇది నిజమా?” అని మీరు అడగవచ్చు. అవును, నిజమే! మనం మన దేవుడిని గాఢంగా ప్రేమిస్తాము, గౌరవిస్తాము, స్తుతిస్తాము మరియు క్రీస్తు యొక్క సమృద్ధిగల ప్రేమ, దయ మరియు రక్షణలో ఆనందించే ఆత్మ నుండి మన భక్తి ప్రవహిస్తుంది! ప్రభువు పట్ల ఈ ఆనందకరమైన భక్తి మన పవిత్ర సంస్కార సమావేశాలను వర్ణించాలి.
ఏమైనప్పటికీ, చాలామందికి, భక్తి అంటే కేవలం: మన ఛాతీల చుట్టూ చేతులు బిగుతుగా మడవడం, మన తలలు వంచి, కళ్ళు మూసుకోవడం మరియు నిశ్చలంగా ఉండడం—నిరవధికంగా! శక్తివంతంగా ఉండే చిన్నపిల్లలకు బోధించడానికి ఇది సహాయకరమైన మార్గం కావచ్చు, కానీ మనం ఎదుగుతున్నప్పుడు మరియు నేర్చుకునే కొద్దీ, భక్తి దీని కంటే చాలా ఎక్కువ అని చూద్దాం. రక్షకుడు మనతో ఉంటే మనం అలాగే ఉంటామా? లేదు, ఎందుకంటే “[ఆయన] సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది”!
అయితే, మనలో చాలామందికి మన సంస్కార సేవల్లో ఈ మార్పు చేయడానికి సాధన అవసరమవుతుంది.
హాజరవడం మరియు ఆరాధించడం
మనము కేవలం సంస్కార సమావేశానికి హాజరయ్యేందుకు మరియు పనుల జాబితాలో ఉన్న దానిని పూర్తి చేయడానికి ఆదివారం నాడు సమకూడము. మనము కలిసి ఆరాధించడానికి సమకూడుతాము. రెండింటి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. హాజరు కావడం అంటే అక్కడ ఉండడం అని అర్థం. కానీ ఆరాధించడం అంటే మనల్ని మార్చే విధంగా మన దేవుడిని ఉద్దేశపూర్వకంగా స్తుతించడం మరియు ఆరాధించడం!
వేదిక పైన మరియు జనసమూహములో
రక్షకుడు మరియు ఆయన సాధ్యం చేసిన విమోచన యొక్క జ్ఞాపకార్థం మనం సమకూడుతుంటే, మన ముఖాలు మన ఆనందాన్ని, కృతజ్ఞతను ప్రతిబింబించాలి! ఎల్డర్ ఎఫ్. ఎంజియో బాష్ ఒక కథ చెప్పారు, ఒకసారి ఆయన శాఖాధ్యక్షునిగా ఉన్నప్పుడు జనసమూహంలో ఉన్న ఒక చిన్న పిల్లవాడు వేదికపై ఉన్న ఆయనను చూసి బిగ్గరగా, “ఆ దారుణమైన ముఖం ఉన్న వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నాడు?” అని అడిగాడు. వేదికపై కూర్చున్న వారు—ప్రసంగీకులు, నాయకులు, గాయక బృందాలు—మరియు జనసమూహంలో సమకూడే వారు తమ ముఖాలపై చూపే వ్యక్తీకరణల ద్వారా “ఆనందకరమైన సంఘానికి స్వాగతం” అని ఒకరితో ఒకరు సంభాషించుకుంటారు!
కీర్తన పాడడం
మనం పాడేటప్పుడు, మన స్వరాల నాణ్యతతో సంబంధం లేకుండా మన దేవుణ్ణి మరియు రాజును స్తుతించడానికి మనం కలిసి చేరుతున్నామా లేదా పదాలను గొణుగుతున్నామా లేదా అసలు పాడడమే లేదా? “నీతిమంతుల కీర్తన [దేవునికి] ప్రార్థన వంటిది,” దానిలో ఆయన ఆత్మ ఆనందిస్తుంది అని లేఖనము నమోదు చేస్తుంది. కాబట్టి పాడదాం! మరియు ఆయనను స్తుతిద్దాం!
ప్రసంగములు మరియు సాక్ష్యములు
మన ప్రసంగాలు మరియు సాక్ష్యాలను పరలోక తండ్రిపై, యేసు క్రీస్తుపై మరియు వారి సువార్తను వినయంగా జీవించడం వల్ల కలిగే ఫలాలపై, “సమస్త తీపిని మించి తియ్యనైన” ఫలాలపై మనం కేంద్రీకరిస్తాము. అప్పుడు మనం నిజంగా “విందు … [మనం] ఆకలిగొనకుండునట్లు లేదా దప్పికగొనకుండునట్లు [మనం] నింపబడు వరకు … విందు చేసుకుంటాము” మరియు కుమారుని ఆనందం ద్వారా మన భారాలు తేలిక అవుతాయి.
సంస్కారము
మన సేవల యొక్క అద్భుతమైన కేంద్ర బిందువు సంస్కారపు దీవెన మరియు దాని స్వీకరణ, రొట్టె మరియు నీరు మన ప్రభువు యొక్క ప్రాయశ్చిత్త బహుమానాన్ని మరియు మన కూడిక యొక్క పూర్తి ఉద్దేశ్యాన్ని సూచిస్తాయి. మనం యేసు క్రీస్తు నామమును మనపైకి తీసుకోవడానికి మరియు ఎల్లప్పుడు రక్షకుడిని జ్ఞాపకము చేసుకుంటామని, ఆయన ఆజ్ఞలను పాటిస్తామని మళ్ళీ నిబంధన చేయడానికి సిద్ధంగా ఉన్నామని మనం కొత్తగా సాక్ష్యమిచ్చినప్పుడు, అది “ఆధ్యాత్మిక పునరుద్ధరణకు పవిత్రమైన సమయం”.
జీవితంలో కొన్ని సమయాల్లో, మనం దుఃఖ చిత్తముతో మరియు అధిక భారాలతో సంస్కారానికి రావచ్చు. ఇతర సమయాల్లో, మనము శ్రమలు మరియు ఇబ్బందుల నుండి స్వేచ్ఛగా మరియు భారం లేకుండా వస్తాము. మనం రొట్టె మరియు నీళ్ళ యొక్క దీవెనలను శ్రద్ధగా వింటూ, ఆ పవిత్ర చిహ్నాలలో పాలుపంచుకున్నప్పుడు, రక్షకుని త్యాగం, గెత్సేమనేలో ఆయన వేదనలు, సిలువపై ఆయన బాధ మరియు మన తరఫున ఆయన అనుభవించిన దుఃఖాలు, బాధలపై మనం ప్రతిబింబించాలని కోరవచ్చు. మన బాధలను ఆయన బాధలతో అనుసంధానించినప్పుడు మన ఆత్మలకు ఉపశమనాన్ని కలిగించేది అదే. ఇతర సమయాల్లో, యేసు యొక్క అద్భుతమైన బహుమానం మన జీవితాల్లో, మన నిత్యత్వాలలో సాధ్యం చేసిన “శ్రేష్టమైన మరియు మధురమైన” ఆనందం పట్ల మనం కృతజ్ఞతతో విస్మయానికి గురవుతాము. మన ప్రియమైన తండ్రితో మరియు పునరుత్థానుడైన రక్షకునితో మన ప్రతిష్టాత్మకమైన పునఃకలయిక కోసం—ఇంకా రాబోయే వాటి కోసం మనం సంతోషిస్తాం.
ముందు వారంలో మనం గందరగోళానికి గురైన అన్ని విధానాల గురించి మాత్రమే ఆలోచిస్తూ పీఠంలో కూర్చోవడమే సంస్కారం యొక్క ఉద్దేశ్యం అని అనుకోవడానికి మనం అలవాటుపడి ఉండవచ్చు. అయితే దానికి పూర్తి విరుద్ధంగా చేద్దాం. నిశ్శబ్ద సమయంలో, ప్రభువు తన అద్భుతమైన ప్రేమతో ఆ వారం మనల్ని తీవ్రంగా వెంబడించడాన్ని మనం చూసిన అనేక మార్గాల గురించి మనం ధ్యానించవచ్చు! “రోజువారీ పశ్చాత్తాపం యొక్క ఆనందాన్ని కనుగొనడం” అంటే అర్థం ఏమిటనే దానిపై మనం ప్రతిబింబించవచ్చు. రక్షకుడు మన పోరాటాలలోకి మరియు మన విజయాలలోకి ప్రవేశించిన సమయాల కొరకు, మన కష్టాలను అధిగమించడానికి మరియు మన భారాలను సహనంతోను, సంతోషముతోను భరించడానికి మనకు బలమును ఇస్తున్న ఆయన కృప, క్షమాపణ మరియు శక్తిని మనం అనుభవించిన సందర్భాల కొరకు మనం కృతజ్ఞతలు చెప్పవచ్చు.
అవును, మన పాపం వలన మన విమోచకుడికి కలిగే బాధలు మరియు అన్యాయాల గురించి మనం ధ్యానిస్తాము మరియు అది లోతుగా ఆలోచించేలా చేస్తుంది. కానీ మనము కొన్నిసార్లు—తోటలో, శిలువ వద్ద, సమాధి లోపల బాధలపై ఎక్కువగా దృష్టిపెడతాము. సమాధి విరిగిపోవడం, మరణం యొక్క ఓటమి మరియు శాంతిని పొందకుండా, మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళకుండా మనల్ని నిరోధించగల వాటన్నిటిపై క్రీస్తు విజయం యొక్క ఆనందం వైపు పైకి వెళ్ళడంలో మనము విఫలమవుతాము. సంస్కార సమయంలో మనం దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నా లేదా కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకున్నా, తండ్రి బహుమానంగా ఇచ్చిన ఆయన కుమారునికి సంబంధించిన శుభవార్తపట్ల అది విస్మయపరిచే అద్భుతంగా ఉండనివ్వండి!
చిన్నపిల్లలు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల గల తల్లిదండ్రులు
ఇప్పుడు, చిన్నపిల్లలు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు గల తల్లిదండ్రుల కోసం, సంస్కార సమయంలో నిశ్చలంగా మరియు నిశ్శబ్దంగా ప్రతిబింబించే సమయం తరచుగా ఉండదు. కానీ వారమంతా చిన్న క్షణాలలో, ఆయన చిన్న పిల్లల పట్ల మీరు నిరంతరం శ్రద్ధ వహిస్తున్నప్పుడు, రక్షకుని కొరకు మరియు ఆయన నుండి మీరు అనుభవించే ప్రేమ, కృతజ్ఞత మరియు ఆనందాన్ని ఉదాహరణ ద్వారా మీరు బోధించవచ్చు. ఈ పనిలో ఏ ప్రయత్నం వృధా కాదు. దేవునికి మీ గురించి చాలా తెలుసు.
కుటుంబం, వార్డు మరియు శాఖ సలహాసభలు
అలాగే ఇంటివద్ద, సంఘములో మన సమయం కోసం మన ఆశలు మరియు అంచనాలను పెంచుకోవడం మనం ప్రారంభించవచ్చు. కుటుంబ సలహాసభలలో, అందరినీ ఆనందకరమైన సంఘానికి స్వాగతించడానికి ప్రతీ వ్యక్తి అర్థవంతమైన మార్గాల్లో ఎలా దోహదపడగలరో మనం చర్చించవచ్చు! మనము సంఘములో ఆనందకరమైన అనుభవాన్ని పొందాలని ప్రణాళిక చేయవచ్చు మరియు ఆశించవచ్చు.
సహాయం చేయడానికి ఆచరణాత్మక దశలను మరియు దృశ్య సూచనలను గుర్తిస్తూ, వార్డు మరియు శాఖ సలహాసభ మన సంస్కార సమయం కోసం ఆనందకరమైన భక్తి సంస్కృతిని ఊహించగలదు మరియు సృష్టించగలదు.
ఆనందము
ఆనందాన్ని వేర్వేరు వ్యక్తులు వేర్వేరుగా అనుభవిస్తారు. కొందరికి, అది తలుపు వద్ద ఉల్లాసమైన శుభాకాంక్షలు కావచ్చు. మరికొందరికి, అది నవ్వడం మరియు దయతో, హృదయపూర్వకంగా వారి పక్కన కూర్చోవడం ద్వారా సౌకర్యంగా భావించడానికి నిశ్శబ్దంగా జనులకు సహాయపడడం కావచ్చు. వదిలివేయబడినట్లు లేదా అంచులలో ఉన్నట్లు భావించే వారికి, ఈ స్వాగతం యొక్క ఉత్తేజం చాలా కీలకం. అంతిమంగా, రక్షకుడు మన సంస్కార సమయం ఎలా ఉండాలని కోరుకుంటున్నారని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. ఆయన పిల్లలలో ప్రతి ఒక్కరూ స్వాగతించబడాలని, శ్రద్ధ చూపబడాలని, పోషించబడాలని మరియు ప్రేమించబడాలని ఆయన ఎంతగా కోరుకుంటారు? ఆయనను జ్ఞాపకముంచుకోవడం మరియు ఆరాధించడం ద్వారా మనం పునరుద్ధరించబడినప్పుడు మనం ఎలా భావించాలని ఆయన కోరుకుంటారు?
ముగింపు
నా విశ్వాస ప్రయాణం ప్రారంభంలో, యేసు క్రీస్తులో ఆనందం నా మొదటి గొప్ప ఆవిష్కరణ మరియు అది నా ప్రపంచాన్ని మార్చింది. మీరు ఇంకా ఈ ఆనందాన్ని కనుగొనవలసియుంటే, దాని అన్వేషణను ప్రారంభించండి. ప్రతి విశ్రాంతిదినమున రక్షకుని బహుమానంగా శాంతి, వెలుగు మరియు ఆనందాన్ని పొందడానికి—దానిలో సంతోషించడానికి, దాని గురించి ఆశ్చర్యపోవడానికి మరియు దానిలో ఆనందించడానికి ఇదొక ఆహ్వానం.
మోర్మన్ గ్రంథములోని అమ్మోన్ ఇలా చెప్పినప్పుడు అతడు నా మనోభావాలను వ్యక్తపరిచాడు:
“ఇప్పుడు మనము సంతోషించుటకు హేతువు కలిగిలేమా? నేను మీతో చెప్పుచున్నాను, లోకారంభము నుండి మనవలే సంతోషించుటకు ఇంత గొప్ప హేతువు కలిగిన మనుష్యులు ఎన్నడూ లేరు; నా సంతోషము నా దేవునియందు అతిశయించునంత అధికమైనది; ఏలయనగా ఆయన సమస్త శక్తి, వివేకము, గ్రహింపును కలిగియున్నాడు; ఆయన అన్ని సంగతులను గ్రహించును మరియు పశ్చాత్తాపపడి ఆయన నామమందు విశ్వసించు వారి రక్షణ కొరకు ఆయన కనికరము కలిగియున్నాడు.
“ఇప్పుడు ఇది అతిశయించుట అయిన యెడల, అట్లు కూడా నేను అతిశయించెదను; ఏలయనగా ఇదే నా జీవము, నా వెలుగు, … నా సంతోషము మరియు నా గొప్ప కృతజ్ఞతాస్తోత్రము.”
ఆనందకరమైన సంఘానికి స్వాగతం! యేసు క్రీస్తు నామములో, ఆమేన్.