మీ పూర్ణహృదయముతో ఆయనను వెదకుడి
యేసు క్రీస్తు దేవునితో సంభాషించుటకు మరియు ఆయన ద్వారా బలపరచబడుటకు నిశ్శబ్ద సమయాన్ని వెదకినట్లయితే, మనం కూడా అదే చేయడం తెలివైన పని.
చాలా సంవత్సరాల క్రితం, నేను మరియు నా భార్య జపాన్‌లోని టోక్యోలో మిషను నాయకులుగా పనిచేశాము. అప్పటి-ఎల్డర్ రస్సెల్ ఎమ్. నెల్సన్ మా మిషనును సందర్శించిన సమయంలో, సువార్తికులలో ఒకరు, తమ మాటలు వినేంత తీరికలేదని ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఎలా ప్రతిస్పందించాలని ఆయనను అడిగారు. కొంచెం సంకోచంగా, ఎల్డర్ నెల్సన్ ఇలా అన్నారు, “ఆ రోజు వారు మధ్యాహ్న భోజనం చేయడానికి కూడా తీరికలేకుండా ఉన్నారా అని నేను అడుగుతాను; తరువాత వారికి శరీరం మరియు ఆత్మ రెండూ ఉన్నాయని బోధిస్తాను. పోషణ లేకపోతే వారి శరీరం ఎలా మరణిస్తుందో, అలాగే దేవుని సువార్త ద్వారా పోషించబడకపోతే వారి ఆత్మ కూడా మరణిస్తుందని వారికి బోధిస్తాను.”
“తీరికలేదు” అనే పదానికి జపనీయుల పదం, ఐసోగాషి, రెండు చిహ్నాలతో (忙) రూపొందించబడిన ఒక అక్షరమని గమనించడం ఆసక్తికరంగా ఉంది. ఎడమ వైపున ఉన్న చిహ్నానికి “హృదయం” లేదా “ఆత్మ” అని అర్థం, మరియు కుడి వైపున ఉన్నదానికి “మరణం” అని అర్థం—బహుశా అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, మన ఆత్మలను పోషించేంత తీరికలేకుండా ఉండటం మనల్ని ఆత్మీయంగా మరణించేలా చేయవచ్చునని సూచిస్తుండవచ్చు.
పరధ్యానంతో మరియు సంక్షోభంతో నిండిన ఈ వేగవంతమైన ప్రపంచంలో—ఆయన కొరకు నాణ్యమైన సమయాన్ని వెచ్చించడం మన కాలంలోని ప్రధాన సవాళ్లలో ఒకటిగా ఉంటుందని—ప్రభువుకు తెలుసు. యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, ఆయన ఈ సలహాలు మరియు జాగ్రత్తలు అందించారు, వీటిని మనం జీవిస్తున్న అల్లకల్లోలమైన ఈ రోజులతో పోల్చవచ్చు:
“మీరు మరలి వచ్చి ఊరకుండుటవలన రక్షింపబడెదరు; మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును.
“అయినను మీరు సమ్మతింపక–అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు.”
మరో మాటలో చెప్పాలంటే, మన రక్షణ తరచుగా ఆయన తట్టుకు తిరిగి, ఐహికవిచారముల పట్ల ఊరకుండుటపై ఆధారపడి ఉన్నప్పటికీ, మనం అలా చేయము. మరియు మన విశ్వాసం నిశ్శబ్దమైన సమయాల్లో ప్రభువుతో ధ్యానములో మరియు ఆలోచిస్తూ కూర్చోవడం ద్వారా అభివృద్ధి చెందిన బలం నుండి వచ్చినప్పటికీ, మనం అలా చేయము. ఎందుకు చేయము? మనం వీలుపడదు అంటాము, “ఎందుకంటే ఇతర విషయాలతో తీరికలేకుండా ఉన్నాము”—మాట్లాడటానికి తీరికలేకుండా గుఱ్ఱములనెక్కి పారిపోతున్నాము. అందువలన, మనం దేవునికి ఇంకా ఇంకా దూరమవుతాము; మనము వేగంగా ఇంకా వేగంగా వెళ్లాలని పట్టుపడతాము; మరియు మనం ఎంత వేగంగా వెళ్తామో, అంత వేగంగా సాతాను వెంబడిస్తాడు.
బహుశా అందుకే అధ్యక్షులు నెల్సన్ మన జీవితాలలో—“ప్రతి రోజూ ప్రభువు” కోసం సమయాన్ని వెచ్చించమని పదే పదే మనకు మనవి చేస్తున్నారు. ఆయన మనకిలా గుర్తుచేస్తున్నారు, “నిశ్శబ్ద సమయం పవిత్రమైన సమయం—వ్యక్తిగత బయల్పాటును సులభతరం చేసే మరియు శాంతిని కలిగించే సమయం.” ప్రభువు యొక్క నిశ్చలమైన స్వరమును వినడానికి, “మీరు కూడా నిశ్చలంగా ఉండాలి” అని ఆయన సలహా ఇచ్చారు.
అయితే, నిశ్చలంగా ఉండాలంటే, ప్రభువు కోసం సమయం కేటాయించడానికి మించిన అవసరం ఉంది—దీనికి సందేహాస్పదమైన మరియు భయానకమైన మన ఆలోచనలను విడిచిపెట్టి, మన హృదయాలను మరియు మనస్సులను ఆయనపై కేంద్రీకరించడం అవసరం. ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు, “‘ఉరకుండుడి’ అన్న ప్రభువు యొక్క ఉపదేశం కేవలం మాట్లాడకపోవడం లేదా కదలకపోవడం కంటే చాలా ఎక్కువైనదని నేను నమ్ముతున్నాను.” “ఊరకుండుట అనేది రక్షకునిపై నిరంతరం దృష్టి కేంద్రీకరించాలని మనకు గుర్తుచేసే మార్గం కావచ్చు” అని ఆయన సూచించారు.
ఊరకుండుటకు విశ్వాసానికి సంబంధించిన చర్య మరియు కృషి అవసరం. విశ్వాసంపై ఉపన్యాసాలు ఇలా చెబుతున్నాయి, “ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా పని చేసినప్పుడు అతను మానసిక శ్రమతో పని చేస్తాడు.” అధ్యక్షులు నెల్సన్ ఇలా ప్రకటించారు: “రక్షకుని మీద మరియు ఆయన సువార్త మీద మన దృష్టి స్థిరపరచబడవలెను. మానసికంగా ప్రతి ఆలోచనలోను ఆయన వైపు చూచుటకు తీవ్రంగా శ్రమించవలసియుండును. ఈ విధంగా మనము చేసినపుడు మన సందేహములు, భయములు ఎగిరిపోవును.” మన మనస్సులను కేంద్రీకరించాల్సిన అవసరం గురించి ప్రస్తావిస్తూ, అధ్యక్షుడు డేవిడ్ ఓ. మెఖే ఇలా అన్నారు: “భక్తి సూత్రమైన ధ్యానం యొక్క విలువపై మనం చాలా తక్కువ శ్రద్ధ చూపుతామని నేను భావిస్తున్నాను. … ధ్యానం … మనం ప్రభువు యొక్క సన్నిధిలోనికి వెళ్ళే అత్యంత పవిత్ర ద్వారాలలో ఒకటి.”
జపనీయుల భాషలో ఒక పదం ఉంది, ముయి, అది నాకు, ఊరకుండుట గురించి మరింత విశ్వాసంతో నిండిన, ఆలోచనాత్మక భావాన్ని అందిస్తుంది. ఇది రెండు అక్షరాలను (無為) కలిగి ఉంటుంది. ఎడమవైపు ఉన్న అక్షరానికి “ఏమీ లేదు” లేదా “శూన్యము” అని మరియు కుడి వైపున ఉన్న అక్షరానికి “చేయడం” అని అర్థం. అవి కలిపితే “నిశ్చలత” అని అర్థం. ఉన్నదున్నట్లుగా చెప్పాలంటే, ఈ పదాన్ని “ఏమీ చేయకు” అని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, అదే విధంగా “ఊరకుండుట” అంటే “మాట్లాడకుండా ఉండటం లేదా కదలకుండా ఉండటం” అని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ, “ఊరకుండుట” అనే పదము వలె, దీనికీ ఒక ఉన్నతమైన అర్థం ఉంది; నాకైతే ఇది వేగాన్ని తగ్గించుకొని మరింత ఆధ్యాత్మిక అవగాహనతో జీవించడానికి ఒక జ్ఞాపిక.
ఎల్డర్ టాకాషి వాడాతో కలిసి ఉత్తర ఆసియా ప్రాంతీయ అధ్యక్షత్వములో సేవ చేస్తున్నప్పుడు, ఆయన భార్య సహోదరి నయోమి వాడా జపనీసు నగీషీ వ్రాతలు వ్రాయగల నిష్ణాతురాలని నేను తెలుసుకున్నాను. నా కోసం ముయి అనే పదానికి జపనీసు అక్షరాలను వ్రాస్తారా అని నేను సహోదరి వాడాను అడిగాను. ఊరకుండుటకు మరియు రక్షకునిపై దృష్టి కేంద్రీకరించుటకు జ్ఞాపికగా నా గోడపై నగీషీ వ్రాతలను వ్రేలాడదీయాలనుకున్నాను. ఈ సాధారణ అభ్యర్థనను ఆమె తక్షణమే అంగీకరించనప్పుడు నేను ఆశ్చర్యపోయాను.
మరుసటి రోజు, నేను ఆమె సంకోచాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని తెలిసి, ఎల్డర్ వాడా ఆ అక్షరములను వ్రాయడానికి గణనీయమైన కృషి అవసరమని వివరించారు. అర్థాన్ని తన ఆత్మలో లోతుగా అర్థం చేసుకునే వరకు మరియు ఆమె కుంచె యొక్క ప్రతి గీతతో ఈ హృదయపూర్వక ముద్రలను వ్యక్తీకరించే వరకు దాని భావము మరియు అక్షరముల గురించి ఆమె ఆలోచించడం మరియు ధ్యానం చేయడం ఎంతో అవసరం. చాలా మామూలుగా దానిని చేయమని ఆమెను అడిగినందుకు నేను సిగ్గుపడ్డాను. నా అజ్ఞానానికి ఆమెకు క్షమాపణలు తెలియజేయమని మరియు నేను నా అభ్యర్థనను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమెకు చెప్పమని ఆయన్ని అడిగాను.
నేను జపాన్‌ను విడిచిపెట్టేటప్పుడు, సహోదరి వాడా, అయాచితంగా, ముయి అనే పదానికి జపనీసు అక్షరాలతో కూడిన ఈ అందమైన నగీషీ వ్రాతని నాకు బహుమతిగా ఇచ్చినప్పుడు మీరు నా ఆశ్చర్యాన్ని మరియు కృతజ్ఞతను ఊహించవచ్చు. అది ఇప్పుడు నా కార్యాలయం గోడపై ప్రముఖంగా వ్రేలాడదీయబడింది, ఊరకుండి ప్రతిరోజూ ప్రభువును వెతకాలని మరియు నా పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో ఆయనను సేవించాలని నాకు గుర్తుచేస్తుంది. ఆమె ఈ నిస్వార్థ చర్యలో, ముయి లేదా ఊరకుండుట యొక్క అర్థాన్ని ఇతర పదాల కంటే మెరుగ్గా సంగ్రహించింది. అశ్రద్ధతోనో, ఉద్యోగ విధిగానో ఆ అక్షరాలను వ్రాయడానికి బదులుగా, ఆమె పూర్తి ఉద్దేశ్యంతో మరియు నిజమైన ఏకాగ్రతతో తన నగీషీ వ్రాతలను వ్రాసింది.
అదేవిధంగా, మనం దేవునితో గడిపే సమయంలో అదే రకమైన హృదయపూర్వక భక్తితో సమీపించాలని ఆయన కోరుకుంటున్నారు. మనం ఆవిధముగా చేసినప్పుడు, మన ఆరాధన ఆయన పట్ల మనకున్న ప్రేమకు నిదర్శనం అవుతుంది.
మనం ఆయనతో సంభాషించాలని ఆయన ఆశ కలిగియున్నారు. ఒక సందర్భంలో, ప్రథమ అధ్యక్షత్వముతో ఒక సమావేశంలో నేను ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత, అధ్యక్షులు నెల్సన్ నా వైపు తిరిగి ఇలా అన్నారు, “మీరు ప్రార్థిస్తున్నప్పుడు, మన తీరికలేని కార్యక్రమ జాబితాల నుండి ఆయనను గుర్తించడానికి మనం సమయాన్ని వెచ్చించినప్పుడు దేవుడు ఎంతగానో మెచ్చుకుంటారని నేను అనుకున్నాను.” మనం పరలోక తండ్రితో సంభాషించడానికి విరామం ఇచ్చినప్పుడు అది ఆయనకు ఎంత ముఖ్యమైనది అవుతుందో చెప్పడానికి ఇది ఒక సరళమైన మరియు శక్తివంతమైన జ్ఞాపిక.
ఆయన మన దృష్టిని కోరుకున్నంతగా, ఆయన వద్దకు రావాలని మనల్ని బలవంతం చేయరు. పునరుత్థానుడైన ప్రభువు నీఫైయులకు ఇలా చెప్పారు, “కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును మిమ్ములను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.” ఈ ఆశాజనక ఆహ్వానంతో ఆయన ఈ మాట కూడా చెప్పారు, అది ఈ రోజు మనకు కూడా వర్తిస్తుంది: “మీరు పశ్చాత్తాపపడి హృదయము యొక్క సంపూర్ణ ఉద్దేశ్యముతో నా యొద్దకు తిరిగి వచ్చిన యెడల, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును మిమ్ములను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని.”
యేసు క్రీస్తు సువార్త ఆయన వద్దకు తిరిగి రావడానికి మనకు తరచుగా అవకాశాలను కల్పిస్తుంది. ఈ అవకాశాలలో రోజువారీ ప్రార్థనలు, లేఖన అధ్యయనం, సంస్కార విధి, విశ్రాంతిదినము మరియు దేవాలయ ఆరాధన ఉన్నాయి. మనం ఈ పవిత్రమైన అవకాశాలను మనం “చేయవలసిన” పనుల జాబితా నుండి తీసివేసి—సహోదరి వాడా తన నగీషీ వ్రాతలను వ్రాసిన అదే బుద్ధి మరియు దృష్టితో చేయడానికి వాటిని మనం “చేసే” పనుల జాబితాలో చేర్చడానికి ఏమి చేయాలి?
“అందుకు నాకు సమయం లేదు” అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. నేను తరచుగా అలాగే ఆలోచించాను. అయితే దేవుని కోసం మరీ ఎక్కువ సమయం అవసరం లేదు గానీ, మనం ఇదివరకే కేటాయించిన సమయాల్లో దేవుని పట్ల మరింత అవగాహన మరియు దృష్టి కేంద్రీకరించడం అవసరం అని నేను సూచిస్తాను.
ఉదాహరణకు, ప్రార్థిస్తున్నప్పుడు, మనం మాట్లాడే సమయాన్ని తక్కువ చేసి ఎక్కువ సమయం దేవునితో గడపడం; మరియు మనం మాట్లాడేటప్పుడు, కృతజ్ఞత మరియు ప్రేమ యొక్క మరింత హృదయపూర్వక నిర్దిష్ట వ్యక్తీకరణలను అర్పించడం చేస్తే ఎలా ఉంటుంది?
లేఖనాలను కేవలం చదవడం మాత్రమే కాకుండా మనం వాటిని ఆస్వాదించాలని అధ్యక్షులు నెల్సన్ సలహా ఇచ్చారు. మనం తక్కువ చదవడం మరియు ఎక్కువ ఆస్వాదించడం చేస్తున్నట్లయితే అది ఎలాంటి వ్యత్యాసాన్ని చూపుతుంది?
సంస్కారములో పాల్గొనడానికి మరింత ఎక్కువగా మన మనస్సులను సిద్ధం చేయడానికి మరియు ఈ పవిత్రమైన విధి సమయంలో యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త దీవెనలను ఆనందంగా ధ్యానించడానికి మనం ఏమి చేయాలి?
హెబ్రీ భాషలో “విశ్రాంతి” అని అర్థం వచ్చే విశ్రాంతిదినము నాడు, మనం ఐహికవిచారముల నుండి విశ్రాంతి తీసుకుని దేవునికి మన భక్తిని చూపుటకు ఆయనతో నిశ్శబ్దంగా కూర్చోవడానికి సమయం తీసుకోవాలంటే ఏమి చేయాలి?
మన దేవాలయ ఆరాధన సమయంలో, మనం మరింత క్రమశిక్షణతో శ్రద్ధ వహించడానికి ప్రయత్నిస్తే లేదా సిలెస్టియల్ గదిలో నిశ్శబ్దంగా ప్రతిబింబించడానికి మరికొంత సమయం గడిపితే ఎలా ఉంటుంది?
మనం పనిపై తక్కువ దృష్టి పెట్టి, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో మన నిబంధన సంబంధాన్ని బలోపేతం చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టినప్పుడు, ఈ పవిత్ర క్షణాలలో ప్రతీ ఒక్కటి సుసంపన్నం అవుతుందని మరియు మన వ్యక్తిగత జీవితాల్లో అవసరమైన మార్గదర్శకత్వాన్ని మనం పొందుతామని నేను సాక్ష్యమిస్తున్నాను. లూకా వృత్తాంతంలోని మార్తాలాగే మనం కూడా “ఇతర విషయాల గురించి చాలా విచారముగలిగి తొందరపడుతున్నాం.” అయినప్పటికీ, మనం ప్రతిరోజూ ప్రభువుతో సంభాషించేటప్పుడు, ఏది అత్యంత అవసరమైనదో తెలుసుకోవడానికి ఆయన మనకు సహాయం చేస్తారు.
రక్షకుడు కూడా తన పరిచర్య నుండి ఊరకుండుటకు సమయాన్ని తీసుకున్నారు. ప్రభువు ఒక ఏకాంత ప్రదేశానికి—ఒక పర్వతానికి, అరణ్యానికి, ఒక ఎడారి ప్రదేశానికి వెనుదిరిగి వెళ్లడం లేదా —తండ్రిని ప్రార్థించడానికి “కొంత దూరముగా” వెళ్ళడం వంటి ఉదాహరణలతో లేఖనములు నిండి ఉన్నాయి. యేసు క్రీస్తు దేవునితో సంభాషించుటకు మరియు ఆయన ద్వారా బలపరచబడుటకు నిశ్శబ్ద సమయాన్ని వెదకినట్లయితే, మనం కూడా అదే చేయడం తెలివైన పని.
మనము మన హృదయాలను, మనస్సులను పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై కేంద్రీకరించి, పరిశుద్ధాత్మ యొక్క మిక్కిలి నిమ్మళమైన స్వరాన్ని వింటున్నప్పుడు, మనకు అత్యంత అవసరమైన దాని గురించి మరింత స్పష్టత ఉంటుంది, మనం అధిక కనికరమును పెంపొందించుకుంటాము మరియు ఆయనలో విశ్రాంతిని, బలాన్ని కనుగొంటాము. దానికి విరుద్ధంగా, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దేవుని కార్యమును వేగవంతం చేయడంలో ఆయనకు సహాయపడటానికి మనం నెమ్మదించడం అవసరం కావచ్చు. ఎల్లప్పుడూ కదలికలో ఉండడం వల్ల మన జీవితాల్లో కల్లోలం పెరిగి మనం కోరుకునే శాంతిని నిరోధించవచ్చు.
హృదయపూర్వకమైన పూర్తి ఉద్దేశ్యంతో మనం తరచుగా ప్రభువు వద్దకు తిరిగి వెళుతున్నప్పుడు, మనం నిశ్శబ్దంగా మరియు విశ్వాసంతో ఆయనను తెలుసుకుంటాము మరియు మన పట్ల ఆయనకున్న అనంతమైన నిబంధన ప్రేమను అనుభవిస్తాము అని నేను సాక్ష్యమిస్తున్నాను.
ప్రభువు ఇలా వాగ్దానం చేశారు:
“నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వచ్చెదను; శ్రద్ధతో నన్ను వెదకుడి, మీరు నన్ను కనుగొందురు.”
“మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు.”
ఈ వాగ్దానం నిజమని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.