యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపై దృష్టిసారించాలి
మనము ప్రాపంచిక పరధ్యానాలను విస్మరించి, క్రీస్తు మరియు ఆయన సువార్తపై దృష్టిసారించినప్పుడు, మనము తప్పక విజయం సాధిస్తాము.
1996లో, నైజీరియన్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని అట్లాంటాలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో స్వర్ణపతకం గెలుచుకున్నది. ఫైనల్ ముగియడంతో, నైజీరియాలోని ప్రతి నగరం మరియు పట్టణ వీధుల్లో ఆనందోత్సాహాలతో కూడిన జనాలు పోటెత్తారు; 200 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశం తెల్లవారుజామున రెండు గంటలకు, తక్షణమే ఒక భారీ వేడుకగా మార్చబడింది! జనులు తింటూ, పాడుతూ, నృత్యం చేస్తున్నప్పుడు, వ్యాప్తిచెందిన ఆనందం, సంతోషం మరియు ఉత్సాహం ఉన్నాయి. ఆ క్షణంలో నైజీరియా ఐకమత్యంగా ఉన్నది మరియు ప్రతి నైజీరియన్ నైజీరియన్‌గా ఉన్నందుకు సంతృప్తి చెందాడు.
ఒలింపిక్స్‌కు ముందు, ఈ జట్టు అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. ఆటల పోటీ ప్రారంభమైనప్పుడు, వారి ఆర్ధిక సహకారము కూడా ఆగిపోయింది. సరైన వస్తు సామగ్రి, శిక్షణా వేదికలు, ఆహారం మరియు లాండ్రీ సేవలు లేకుండానే బృందం పోటీలోకి దిగింది.
జెరోమ్ ప్రీవోస్ట్/గెట్టి చిత్రాలు.
ఒక సమయంలో, వారు పోటీ నుంచి తొలగించబడటానికి నిమిషాల దూరంలో ఉన్నారు, కానీ నైజీరియా జట్టు విజయం సాధ్యం కాదనుకున్నప్పటికీ విజయం సాధించింది. ఈ కీలకమైన క్షణం వారు తమను తాము చూసే విధానాన్ని మార్చేసింది. కొత్తగా పొందుకున్న నమ్మకంతోపాటు వ్యక్తిగత మరియు జట్టు యొక్క కృషితో, ఐక్యత మరియు దృఢ సంకల్పంతో, వారందరు పరధ్యానాలను విస్మరించి విజయంపై దృష్టిసారించారు. ఈ దృష్టిసారింపు వారికి బంగారు పతకాలను సంపాదించిందిపెట్టింది, మరియు నైజీరియన్లు వారికి “డ్రీమ్ టీమ్” అని ప్రత్యేక పేరును ఇచ్చారు. 1996 ఒలింపిక్స్‌లోనున్న డ్రీమ్ టీమ్ నైజీరియన్ క్రీడలలో ప్రస్తావించబడుతూనే ఉంది.
డేవిడ్ కానన్/ఆల్స్‌పోర్ట్/గెట్టి చిత్రాలు.
ఫుట్‌బాల్ జట్టు, వారు ఎదుర్కొంటున్న అనేక పరధ్యానాలను విస్మరించి మరియు వారి లక్ష్యంపై దృష్టిసారించడం నేర్చుకున్న తర్వాత, వారు సాధ్యమని అనుకున్నదానికంటే ఎక్కువ విజయాన్ని సాధించారు మరియు గొప్ప ఆనందాన్ని అనుభవించారు. (వారి వలన నైజీరియాలో మిగిలిన మేమంతా ఆనందాన్ని అనుభవించాము).
అదేవిధంగా, మనము ఈ ప్రాపంచిక పరధ్యానాలను విస్మరించి, క్రీస్తు మరియు ఆయన సువార్తపై దృష్టిసారించినప్పుడు, మనం పూర్తిగా ఊహించగల దాని కంటే మించిన విజయాన్ని మరియు గొప్ప ఆనందాన్ని అనుభవించడానికి హామీ ఇవ్వబడ్డాము. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “మన జీవితాల యొక్క దృష్టి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక … యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త పై ఉన్నప్పుడు, మన జీవితాలలో—జరుగుచున్న దానిని లేదా జరగని దానిని లక్ష్యపెట్టకుండా మనం ఆనందాన్ని అనుభవించవచ్చును.”
యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపై మన జీవితాలను దృష్టిసారించడానికి, అధ్యక్షులు నెల్సన్ ఆహ్వానముపై లక్ష్యముంచడానికి పరిశుద్ధాత్మ మనలో ప్రతిఒక్కరికి సహాయపడుతుందని నేను ప్రార్థిస్తున్నాను, ఆవిధంగా మన జీవితాలలో ఏది జరిగినా లేదా జరగకపోయినా మనం సంతోషాన్ని అనుభవించగలము
మోర్మన్ గ్రంథములోని అనేక వృత్తాంతాలు యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా తమ జీవితాలను మలుపు తిప్పిన వ్యక్తులను గురించి వివరిస్తాయి.
చిన్నవాడగు ఆల్మాను పరిగణించండి. అతను సంఘానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, పోరాడాడు. అతని తండ్రి ఆల్మా, ప్రార్థించాడు మరియు ఉపవాసమున్నాడు. దేవదూత కనిపించి చిన్నవాడైన ఆల్మాను పశ్చాత్తాపపడమని పిలుపునిచ్చాడు. ఆ క్షణంలో, ఆల్మా “శిక్షావిధికి లోనైన ఆత్మ యొక్క బాధలతో” బాధింపబడుట ప్రారంభించాడు. అతని చీకటి ఘడియలలో, క్రీస్తు వస్తారని, లోక పాపముల కోసం ప్రాయశ్చిత్తం చేస్తారని తన తండ్రి బోధించిన దానిని అతడు జ్ఞాపకముంచుకున్నాడు. అతడి మనస్సు ఈ ఆలోచనను పట్టుకోవడంతో, అతడు కనికరము కొరకు దేవునిని వేడుకున్నాడు. ఫలితం ఆనందము, శ్రేష్ఠమైనదిగా అతడు వర్ణించిన ఆనందము! కనికరము మరియు సంతోషము ఆల్మాకి కలిగింది, ఎందుకంటే అతడు మరియు అతని తండ్రి రక్షకునిపై దృష్టిసారించారు కనుక.
తప్పిపోయిన పిల్లలుగల తల్లిదండ్రుల కొరకు, ధైర్యము కలిగియుండుము! మీ బిడ్డ పశ్చాత్తాపపడటానికి దేవదూత వచ్చి ఎందుకు సహాయపడటంలేదని ఆశ్చర్యపడటానికి బదులుగా, అతడు లేక ఆమె మార్గములో మర్త్య దేవదూతలను ప్రభువు ఉంచారని తెలుసుకోండి: బిషప్పు, ఇతర సంఘ నాయకులు లేదా పరిచర్య చేస్తున్న సోదరుడు లేదా సోదరి. మీరు ఉపవాసం చేయడం మరియు ప్రార్ధన చేయటం కొనసాగించి, మీరు దేవునికి కాలపట్టిక లేదా చివరి గడువు తేదిని ఇవ్వడానికి ప్రయత్నించకుండా ఉంటే, మరియు మీ బిడ్డకు సహాయపడటానికి ప్రభువు తన హస్తమును ముందుకు చాపుతున్నారని మీరు విశ్వసిస్తే—వెంటనే లేదా తరువాత—దేవుని ప్రభావం మీ బిడ్డ హృదయాన్ని తాకుతున్నట్లు మీరు కనుగొంటారు. ఎందుకనగా క్రీస్తు అంటే ఆనందము—క్రీస్తు అంటే నిరీక్షణ; ఆయన రాబోవుచున్న “మేలుల విషయాల యొక్క వాగ్దానము”. కనుక, మీ బిడ్డతో యేసు క్రీస్తును విశ్వసించండి, ఏలయనగా ఆయన ప్రతి తల్లి, తండ్రి యొక్క బలము. మరియు ప్రతి బిడ్డకు.
అతడు క్రీస్తునందు ఆనందాన్ని అనుభవించిన తరువాత, చిన్నవాడైన ఆల్మా ఆ ఆనందంతో జీవించాడు. కష్టము మరియు శ్రమ గుండా అటువంటి ఆనందాన్ని అతడు ఎలా కాపాడుకున్నాడు? అతడు ఇలా వ్యాఖ్యానించాడు:
“ఆ సమయము నుండి ఇప్పటి వరకు, నేను ఆత్మలను పశ్చాత్తాపపడునట్లు చేయుటకు, నేను అనుభవించిన అధిక సంతోషమును వారు కూడా అనుభవించగలుగునట్లు చేయుటకు ఎడతెగక శ్రమపడియుంటిని. …
“ … మరియు … నా శ్రమల యొక్క ఫలమందు ప్రభువు నాకు మహదానందమును ఇచ్చియుండెను. …
“ప్రతివిధమైన శోధనలలో, కష్టములలో, అన్నివిధములైన శ్రమలలో నాకు సహకారమివ్వబడినది”
ఆల్మా క్రీస్తునందు విశ్వాసమును సాధన చేసినప్పుడు, కనికరము కొరకు వేడుకొన్నప్పుడు ఆయనయందు ఆనందము అతడికి ప్రారంభమైంది. తరువాత, అదే ఆనందాన్ని రుచి చూడటానికి ఇతరులకు సహాయపడుట మానకుండా శ్రమించుట ద్వారా క్రీస్తునందు అతని విశ్వాసమును సాధన చేసాడు. ఈ నిరంతర శ్రమలు ప్రతివిధమైన కష్టాలు మరియు పరీక్షలలో కూడ ఆల్మాకు గొప్ప ఆనందాన్ని కలిగించాయి. మీరు చూడండి, “ప్రభువు ప్రయత్నాన్ని ప్రేమిస్తారు,” మరియు ఆయనపై దృష్టిసారించిన ప్రయత్నము దీవెనలను తెస్తుంది. అయినను, తీవ్రమైన శ్రమలు “క్రీస్తు యొక్క ఆనందములో మ్రింగివేయబడగలవు”
మోర్మన్ గ్రంథములోని మరొక గుంపు యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తను వారి జీవితాల యొక్క దృష్టిసారింపుగా చేసుకొన్నారు మరియు ఆనందాన్ని కనుగొన్నారు, వారు హీలమ్ నగరాన్ని నిర్మించారు—అది వారు తమ పిల్లలను పెంచడానికి మరియు వారి మతాన్ని స్వేచ్ఛగా సాధన చేయడాన్ని ఆనందించగల ప్రదేశము. మంచి జీవితాలను గడుపుతున్న ఈ నీతిమంతులు ఒక దోపిడీ గుంపుచే బానిసలుగా మార్చబడ్డారు మరియు మతాన్ని ఉపయోగించుకునే ప్రాథమిక మానవ హక్కును తీసివేయబడ్డారు. కొన్నిసార్లు మంచి జనులకు చెడు విషయాలు జరుగుతాయి.
“అయినప్పటికీ ప్రభువు తన జనులను గద్దించుట సరియని చూచును; ఆయన వారి సహనమును, వారి విశ్వాసమును పరీక్షించును.
“అయినను—ఆయన యందు నమ్మికయుంచు వారు అంత్యదినమున పైకెత్తబడుదురు. ఈ జనుల యెడల కూడా అలాగే జరిగెను.”
ఈ జనులు వారి శ్రమలు మరియు బాధ ద్వారా ఎలా భరించారు? క్రీస్తు మరియు ఆయన సువార్తపై దృష్టిసారించుట ద్వారా. వారి కష్టాలు వారిని నిర్వచించవు; బదులుగా, వారిలో ప్రతిఒక్కరు దేవునివైపు తిరిగారు వారు దేవుని యొక్క బిడ్డగా, నిబంధన యొక్క బిడ్డగా, మరియు యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా తమను తాము నిర్వచించుకున్నారు. వారు ఎవరో గుర్తుంచుకొని, దేవునికి ప్రార్థించినప్పుడు, వారు శాంతిని, బలాన్ని, మరియు చివరికి క్రీస్తునందు ఆనందాన్ని పొందారు.
“ఆల్మా మరియు అతని జనులు … [దేవుని] యెదుట తమ హృదయములను క్రుమ్మరించిరి; మరియు వారి హృదయ తలంపులను ఆయన యెరిగియుండెను.
“మరియు ప్రభువు యొక్క స్వరము వారి శ్రమలయందు వారికి ఇట్లు చెప్పెను: మీ తలలు పైకెత్తి ధైర్యము తెచ్చుకొనుము, ఏలయనగా మీరు నాతో చేసిన నిబంధనను నేనెరుగుదును; నేను నా జనులతో నిబంధన చేయుదును; మరియు వారిని దాస్యము నుండి విడిపించెదను”
జవాబుగా, ప్రభువు [వారి] భుజములపై మోపబడిన … భారములను సడలించెను. … అవును, వారు తమ భారములను సునాయాసముగా భరించునట్లు ప్రభువు వారిని బలపరిచెను, మరియు వారు సంతోషముతోను సహనముతోను ప్రభువు యొక్క చిత్తమంతటికి లోబడిరి” ఈ పరిశుద్ధులు వారి కష్టాలు, బాధలు, మరియు శ్రమలను క్రీస్తు యొక్క ఆనందములో మింగివేయబడినట్లు చేసుకున్నారని గమనించండి! తరువాత, సకాలంలో ఆయన, తప్పించుకునే మార్గాన్ని ఆల్మాకు చూపించాడు, మరియు దేవుని ప్రవక్తయైన ఆల్మా—వారిని భద్రతకు నడిపించాడు.
మనం క్రీస్తుపై దృష్టిసారించి, ఆయన ప్రవక్తను అనుసరించినప్పుడు, మనం కూడా క్రీస్తు మరియు ఆయన సువార్త యొక్క ఆనందానికి నడిపించబడతాము. అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా: “ఆనందం శక్తివంతమైనది, మరియు ఆనందంపై దృష్టి పెట్టడం మన జీవితాల్లోకి దేవుని శక్తిని తెస్తుంది. “అన్ని సంగతులలో వలె, యేసు క్రీస్తు మన శ్రేష్టమైన మాదిరి, ‘ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువను సహించెను’ [హెబ్రీయులకు 12:2].”
మా అమ్మ ఈ మధ్యనే చనిపోయింది; అది నాకు దిగ్భ్రాంతి కలిగించింది. నేను నా తల్లిని ప్రేమిస్తున్నాను మరియు చాలా చిన్న వయస్సులో ఆమెను కోల్పోతానని నేను ఊహించలేదు. కానీ ఆమె చనిపోయిన అనుభవం ద్వారా, నేను మరియు నా కుటుంబం క్రీస్తునందు దుఃఖమును మరియు ఆనందాన్ని రెండింటినీ అనుభవించాము. ఆయన వలన ఆమె మరణము శాశ్వతం కాదని నాకు తెలుసు—ఆమె జీవించి ఉంది! క్రీస్తు మూలముగా మరియు ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపించబడిన యాజకత్వ తాళపుచెవుల వలన, ఒకరోజు మరలా నేను ఆమెతో ఉంటానని నాకు తెలుసు. మా అమ్మను కోల్పోయిన విచారము క్రీస్తు యొక్క ఆనందములో మింగివేయబడింది! “సిలెస్టియల్‌గా ఆలోచించడం” మరియు “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడం” క్రీస్తునందు లభ్యమయ్యే ఆనందంపై దృష్టిసారించుటను కలిగియున్నదని నేను నేర్చుకుంటున్నాను.
“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును,” అని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.