“ఇది నా సువార్త”—“ఇది నా సంఘము”
ఇది రక్షకుని సువార్త మరియు ఇది ఆయన సంఘము (3 నీఫై 27:21; మోషైయ 26:22; 27:13 చూడండి). రెండింటి సమ్మేళనము శక్తివంతమైనది మరియు రూపాంతరం చెందగలదు.
శతాబ్దాలుగా, గంధకం అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం. అది ఫిరంగి బంతులను ప్రయోగించగలదు, కానీ చాలా గనుల త్రవ్వకాలు మరియు రోడ్డు నిర్మాణ ప్రాజెక్టుల కోసం అది ప్రభావవంతంగా లేదు. అది రాయిని పగులగొట్టడానికి చాలా బలహీనంగా ఉండేది.
1846లో, అస్కానియో సోబ్రెరో అనే ఇటాలియన్ రసాయన శాస్త్రవేత్త నైట్రోగ్లిజరిన్ అనే ఒక కొత్త పేలుడు పదార్థాన్ని సంశ్లేషణ చేశాడు. జిడ్డుగా ఉండే ఈ ద్రవం గంధకం కంటే కనీసం వెయ్యి రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. అది సులభంగా శిలలను పగులగొడుతుంది. దురదృష్టవశాత్తు, నైట్రోగ్లిజరిన్ అస్థిరంగా ఉండేది. మీరు దానిని కొంచెం ఎత్తు నుండి పడేస్తే, అది పేలుతుంది. చాలా వేడిగా ఉంటే, అది పేలుతుంది. చాలా చల్లగా ఉంటే, అది పేలుతుంది. చివరికి చల్లని, చీకటి గదిలో ఉంచి వదిలేసినా, అది పేలుతుంది. చాలా దేశాలు దాని రవాణాను నిషేధించాయి మరియు అనేకము దాని తయారీని నిషేధించాయి.
1860 లో, ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే స్వీడిష్ శాస్త్రవేత్త నైట్రోగ్లిజరిన్‌ను స్థిరీకరించడానికి ప్రయత్నించడం ప్రారంభించాడు. ఏడు సంవత్సరాల ప్రయోగాల తర్వాత, అతను నైట్రోగ్లిజరిన్‌ను డయాటోమాసియస్ ఎర్త్ లేదా కీసెల్‌గుర్ అని పిలిచే దాదాపు పనికిరాని పదార్థంగా గ్రహించడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించాడు. కీసెల్‌గుర్ అనేది సూక్ష్మరంధ్రాలు గల రాయి, దానిని సన్నని పొడిగా చేయవచ్చు. నైట్రోగ్లిజరిన్‌తో కలిపినప్పుడు, కీసెల్‌గుర్ నైట్రోగ్లిజరిన్‌ను గ్రహిస్తుంది మరియు ఫలితంగా వచ్చే ముద్దను “కడ్డీలు”గా మార్చవచ్చు. ఈ రూపంలో, నైట్రోగ్లిజరిన్ మరింత స్థిరంగా ఉంటుంది. దానిని సురక్షితంగా నిల్వ చేయవచ్చు, రవాణా చేయవచ్చు మరియు తగ్గని పేలుడు శక్తితో ఉపయోగించవచ్చు. నైట్రోగ్లిజరిన్ మరియు కీసెల్‌గుర్ సమ్మేళనానికి డైనమైట్ అని నోబెల్ పేరు పెట్టారు.
డైనమైట్ ప్రపంచాన్ని మార్చివేసింది. అది నోబెల్‌ను సంపన్నుడిని కూడా చేసింది. అస్కానియో సోబ్రెరో కనుగొన్నట్లుగా, స్థిరీకరించేది లేకుండా నైట్రోగ్లిజరిన్ వాణిజ్యపరంగా విలువైనదిగా ఉండడం చాలా ప్రమాదకరం. నేను చెప్పినట్లుగా, స్వతహాగా కీసెల్‌గుర్ తక్కువ విలువను కలిగియుంది. కానీ రెండు పదార్థాల సమ్మేళనము డైనమైట్‌ను రూపాంతరం చెందేలా మరియు విలువైనదిగా చేసింది.
అదే విధంగా, యేసు క్రీస్తు సువార్త మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క సమ్మేళనము మనకు శక్తివంతమైన మరియు రూపాంతరమైన ప్రయోజనాలను అందిస్తుంది. సువార్త పరిపూర్ణమైనది, అయితే దానిని బోధించడానికి, దాని స్వచ్ఛతను కాపాడుకోవడానికి మరియు రక్షకుని అధికారంతో దాని పవిత్ర విధులను నిర్వహించడానికి దైవికంగా నియమించబడిన సంఘము అవసరం.
రక్షకుని సువార్త మరియు మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన ఆల్మా చేత స్థాపించబడినట్లుగా ఆయన సంఘము యొక్క సమ్మేళనాన్ని పరిగణించండి. కేవలం “పశ్చాత్తాపమును మరియు తన జనులను [విమోచించు] ఆ ప్రభువుపై విశ్వాసమును” బోధించడానికి సంఘము బాధ్యత వహిస్తుంది. దేవుని అధికారాన్ని ఉపయోగించి, “ఆయనను సేవించుదురనియు ఆయన ఆజ్ఞలను పాటించుదురనియు ఆయనతో ఒక నిబంధనలోనికి [ప్రవేశించియున్నారని] … ఒక సాక్షిగా ప్రభువు నామమందు” బాప్తిస్మము యొక్క విధిని నిర్వహించడానికి సంఘము బాధ్యత వహిస్తుంది. బాప్తిస్మము పొందిన వ్యక్తులు క్రీస్తు నామమును తమపై ధరించుకున్నారు, ఆయన సంఘములో చేరారు మరియు ఆత్మ యొక్క క్రుమ్మరింపు ద్వారా గొప్ప శక్తి వాగ్దానం చేయబడ్డారు.
ఆల్మా సువార్త బోధించడాన్ని వినడానికి జనులు మోర్మన్ జలాల వద్దకు తరలివచ్చారు. వారు ఆ జలాలను మరియు చుట్టుప్రక్కల అడవులను గౌరవించినప్పటికీ, ప్రభువు యొక్క సంఘము ఒక ప్రదేశం లేదా భవనం కాదు, ఈనాడు కూడా కాదు. సంఘము అనేది కేవలం సాధారణ ప్రజలు, యేసు క్రీస్తు శిష్యులు సమకూడి, దైవికంగా నియమించబడిన నిర్మాణంగా ఏర్పాటు చేయబడింది, అది ప్రభువు తన ఉద్దేశ్యాలను సాధించడానికి సహాయపడుతుంది. సంఘము అనేది పరలోక తండ్రి ప్రణాళికలో యేసు క్రీస్తు యొక్క ప్రధాన పాత్ర గురించి మనం నేర్చుకునే సాధనం. వ్యక్తులు విధులలో పాల్గొనడానికి మరియు దేవునితో శాశ్వతమైన నిబంధనలను చేయడానికి సంఘము అధికారిక మార్గాన్ని అందిస్తుంది. ఆ నిబంధనలను పాటించడం మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది, ఆయన శక్తికి మనకు ప్రవేశం కల్పిస్తుంది మరియు మనం ఎలా కావాలని ఆయన కోరుకున్నారో అలా మనల్ని మారుస్తుంది.
నైట్రోగ్లిజరిన్ లేని డైనమైట్ ప్రత్యేకించి అసాధారణమైనది కానట్లే, రక్షకుని సంఘము ఆయన సువార్తపై నిర్మించబడితే తప్ప ప్రత్యేకమైనది కాదు. రక్షకుని సువార్త మరియు దాని విధులను నిర్వహించే అధికారం లేకుండా, సంఘము అసాధారణమైనది కాదు.
కీసెల్‌గుర్ యొక్క స్థిరీకరణ ప్రభావం లేకుండా, నైట్రోగ్లిజరిన్ పేలుడు పదార్థంగా పరిమిత విలువను కలిగియుంది. చరిత్ర చూపినట్లుగా, ప్రభువు సంఘము లేకుండా, మానవాళికి ఆయన సువార్తపై అవగాహన అస్థిరంగా ఉంది—సిద్ధాంత ప్రవాహానికి గురవుతుంది మరియు వివిధ మతాలు, సంస్కృతులు, తత్వాల ప్రభావానికి లోబడి ఉంటుంది. ఆ ప్రభావాల సమ్మేళనం ఈ చివరి యుగానికి దారితీసిన ప్రతీ యుగంలో ప్రత్యక్షపరచబడింది. ప్రారంభంలో సువార్త దాని స్వచ్ఛతతో బయల్పరచబడినప్పటికీ, దైవికంగా అధికారం పొందిన సంఘము లేనందున ఆ సువార్త యొక్క వివరణ మరియు అన్వయం క్రమంగా శక్తి లేని దైవత్వం యొక్క రూపాన్ని సంతరించుకుంది.
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము దేవుని శక్తిని పొందేందుకు వీలు కల్పిస్తుంది, ఎందుకంటే ఇది క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని బోధించడానికి, సువార్త యొక్క రక్షణ మరియు ఉన్నతమైన విధులను అందించడానికి ఆయనచే అధికారం పొందింది. రక్షకుడు మన పాపాలను క్షమించి, ఆయన శక్తిని పొందడానికి మనకు సహాయం చేసి, మనల్ని మార్చడానికి ఆకాంక్షిస్తున్నారు. ఆయన మన పాపాల కోసం బాధపడ్డారు మరియు మనం పశ్చాత్తాపపడితే, మనం పొందవలసిన శిక్ష నుండి మనల్ని క్షమించాలని బలంగా కోరుకుంటున్నారు. మనం పరిశుద్ధులుగా మారాలని మరియు ఆయనలో పరిపూర్ణులు కావాలని ఆయన కోరుకుంటున్నారు.
దీనిని చేసే శక్తి యేసు క్రీస్తుకు ఉంది. ఆయన కేవలం మన అపరిపూర్ణతలపై సానుభూతి చూపలేదు మరియు పాపం యొక్క పర్యవసానంగా మన నిత్య శిక్ష గురించి విలపించలేదు. లేదు, ఆయన అంతకుమించి, అపరిమితంగా చేసారు మరియు ఆయన శక్తిని పొందేందుకు వీలుగా ఆయన సంఘాన్ని పునఃస్థాపించారు.
సంఘము బోధించే సువార్త యొక్క ప్రధాన అంశం ఏమిటంటే, యేసు క్రీస్తు “మన రోగములను భరించారు, మన వ్యసనములను వహించారు.” ఆయన “మనందరి దోషమును ఆయన మీద మోపుకున్నారు.” ఆయన “సిలువను సహించారు,” “మరణబంధకాలను” త్రెంచారు, “కనికరపు హక్కులను తండ్రి నుండి పొందుటకు … పరలోకములోనికి ఆరోహణుడై దేవుని కుడిచేతి ప్రక్కన కూర్చున్నారు.” రక్షకుడు ఇవన్నీ చేసారు, ఎందుకంటే ఆయన తన తండ్రిని ప్రేమిస్తున్నారు మరియు ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన ఇప్పటికే అనంతమైన మూల్యాన్ని చెల్లించారు, కాబట్టి “ఆయన యందు విశ్వాసము కలిగిన వారందరినీ ఆయన [హక్కుగా కోరతారు] మరియు వారి కొరకు—మన కొరకు [వాదిస్తారు].” మనం పశ్చాత్తాపపడి ఆయన వద్దకు రావాలని తప్ప యేసు క్రీస్తు మరేమీ కోరుకోలేదు, తద్వారా ఆయన మనలను సమర్థించగలరు మరియు పవిత్రపరచగలరు. ఈ కోరికలో, ఆయన కనికరంలేనివాడు మరియు అచంచలమైనవాడు.
దేవుని యొక్క నిబంధనాపూర్వకమైన శక్తికి మరియు నిబంధనాపూర్వకమైన ఆయన ప్రేమకు ప్రవేశము ఆయన సంఘము ద్వారా లభిస్తుంది. రక్షకుని సువార్త మరియు ఆయన సంఘము యొక్క సమ్మేళనము మన జీవితాలను మారుస్తుంది. నా తల్లి వైపు తాతమామ్మల జీవితాలను అది మార్చివేసింది. మా తాత, ఆస్కార్ ఆండర్సన్, స్టాక్‌హోమ్ ద్వీపసమూహంలోని హాగ్‌మార్సో అనే ద్వీపంలో షిప్‌యార్డ్‌లో పనిచేశారు. ఆయన భార్య అల్బెర్టినా మరియు వారి పిల్లలు స్వీడిష్ ప్రధాన భూభాగంలో నివసించారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి, ఆస్కార్ ఆదివారం సాయంత్రం హాగ్‌మార్సోకి తిరిగి రావడానికి ముందు, వారాంతంలో శనివారం తన పడవ నడుపుకుంటూ ఇంటికి వచ్చేవారు. ఒక రోజు, హాగ్‌మార్సోలో ఉన్నప్పుడు, ఇద్దరు అమెరికన్ సువార్తికులు యేసు క్రీస్తు యొక్క పునస్థాపించబడిన సువార్తను బోధించడాన్ని ఆయన విన్నారు. తాను విన్నది స్వచ్ఛమైన సత్యమని ఆస్కార్ భావించారు మరియు ఆయన చెప్పలేని ఆనందంతో నింపబడ్డారు.
ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఆస్కార్ సువార్తికుల గురించి అల్బెర్టినాకు ఉత్సాహంగా చెప్పారు. వారు బోధించిన దానిని తాను నమ్మానని ఆయన వివరించారు. సువార్తికులు ఆయనకు ఇచ్చిన కరపత్రాలను చదవమని ఆమెను అడిగారు; మరియు భవిష్యత్తులో వారి పిల్లలలో ఎవరూ శిశువులుగా బాప్తిస్మం పొందాలని తాను భావించడం లేదని ఆమెకు చెప్పారు. అల్బెర్టినా ఆవేశంతో ఆ కరపత్రాలను చెత్త కుప్పపై విసిరింది. ఆదివారం సాయంత్రం ఆస్కార్ ఉద్యోగానికి వెళ్ళే ముందు వారి మధ్య పెద్దగా మాటల్లేవు.
ఆయన వెళ్ళిపోయిన వెంటనే, అల్బెర్టినా కరపత్రాలను తిరిగి తీసుకుంది. ఆమె బాగా పాతబడిన తన బైబిల్లోని బోధనలతో వారి సిద్ధాంతాన్ని జాగ్రత్తగా పోల్చింది. తాను చదివినది నిజమేనని భావించి ఆశ్చర్యపోయింది. ఆస్కార్ ఇంటికి తిరిగి వచ్చిన తదుపరిసారి, ఆయనకు, అలాగే ఆయన వెంట తెచ్చుకున్న మోర్మన్ గ్రంథానికి కూడా ఘన స్వాగతం లభించింది. అల్బెర్టినా ఆత్రంగా చదివింది, మళ్ళీ తన బైబిల్‌లోని సిద్ధాంతంతో పోల్చింది. ఆస్కార్ లాగా, ఆమె స్వచ్ఛమైన సత్యాన్ని గుర్తించింది మరియు వర్ణించలేని ఆనందంతో నింపబడింది.
ఆస్కార్, అల్బెర్టినా మరియు వారి పిల్లలు అక్కడ ఉన్న కొద్దిమంది సంఘ సభ్యులకు దగ్గరగా ఉండేందుకు హాగ్‌మార్సోకు వెళ్ళారు. 1916లో ఆస్కార్ మరియు అల్బెర్టినా బాప్తిస్మం పొందిన ఒక వారం తర్వాత, ఆ హాగ్‌మార్సో పరిశుద్ధులకు సమూహ నాయకునిగా ఉండేందుకు ఆస్కార్ పిలువబడ్డారు. కొత్తగా మార్పుచెందిన అనేకమంది వలె, ఆస్కార్ మరియు అల్బెర్టినా వారి కొత్త విశ్వాసం కారణంగా విమర్శలను ఎదుర్కొన్నారు. స్థానిక రైతులు వారికి పాలు విక్రయించడానికి నిరాకరించారు, కాబట్టి ఆస్కార్ మరింత సహనంతో కూడిన రైతు నుండి పాలను కొనుగోలు చేయడానికి ప్రతిరోజూ సముద్ర జలభాగము మీదుగా ప్రయాణించారు.
అయినప్పటికీ తరువాతి సంవత్సరాల్లో, అల్బెర్టినా యొక్క శక్తివంతమైన సాక్ష్యం మరియు ప్రగాఢమైన మిషనరీ ఉత్సాహం కారణంగా హాగ్‌మార్సోలో సంఘ సభ్యత్వం పెరిగింది. సమూహం ఒక శాఖగా మారినప్పుడు, ఆస్కార్ శాఖాధ్యక్షుడిగా పిలువబడ్డారు.
ఆ హాగ్‌మార్సో శాఖ సభ్యులు ఆ ద్వీపాన్ని గౌరవించారు. అదే వారికి మోర్మన్ జలములు. అక్కడే వారు తమ విమోచకుని గురించి తెలుసుకున్నారు.
సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆస్కార్ మరియు అల్బెర్టినా తమ బాప్తిస్మపు నిబంధనను పాటించినప్పుడు, వారు యేసు క్రీస్తు యొక్క శక్తి చేత రూపాంతరం చెందారు. వారు ఇంకా ఎక్కువ నిబంధనలను చేయాలని, తమ దేవాలయ దీవెనలు పొందాలని తహతహలాడారు. ఆ దీవెనలు పొందడానికి, వారు 1949లో స్వీడన్‌లోని తమ ఇంటి నుండి సాల్ట్ లేక్ సిటీకి శాశ్వతంగా వలస వెళ్ళారు. ఆస్కార్ 33 సంవత్సరాల పాటు హాగ్‌మార్సోలో సభ్యులకు నాయకుడిగా పనిచేశారు.
నైట్రోగ్లిజరిన్ మరియు కీసెల్‌గుర్‌ల సమ్మేళనము డైనమైట్‌ను విలువైనదిగా చేసింది; యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు ఆయన సంఘముల సమ్మేళనము వెలకట్టలేనిది. ఆస్కార్ మరియు అల్బెర్టినా పునస్థాపించబడిన సువార్త గురించి విన్నారు, ఎందుకంటే దేవుని ప్రవక్త స్వీడన్‌కు సువార్తికులను పిలిచి, నియమించి, పంపారు. దైవిక నియామకం ద్వారా, సువార్తికులు క్రీస్తు సిద్ధాంతాన్ని బోధించారు మరియు యాజకత్వ అధికారం చేత ఆస్కార్ మరియు అల్బెర్టినాలకు బాప్తిస్మం ఇచ్చారు. సభ్యులుగా, ఆస్కార్ మరియు అల్బెర్టినా నేర్చుకోవడం, అభివృద్ధి చెందడం మరియు ఇతరులకు సేవ చేయడం కొనసాగించారు. వారు చేసిన నిబంధనలను పాటించినందున వారు కడవరి-దిన పరిశుద్ధులయ్యారు.
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘాన్ని “నా సంఘము” అని రక్షకుడు సూచిస్తారు, ఎందుకంటే ఆయన సువార్తను ప్రకటించడం, ఆయన విధులు మరియు నిబంధనలను అందించడం, ఆయన శక్తి చేత మనల్ని సమర్థించడాన్ని మరియు పవిత్రపరచడాన్ని సాధ్యమయ్యేలా చేయడం వంటి తన ఉద్దేశాలను నెరవేర్చడానికి దైవికంగా ఆయన దానిని నియమించారు. ఆయన సంఘము లేకుండా, అధికారం లేదు, ఆయన నామములో బయల్పరచబడిన సత్యాలను బోధించమనేది లేదు, విధులు లేదా నిబంధనలు లేవు, దైవత్వపు శక్తి యొక్క ప్రత్యక్షత లేదు, దేవుడు మనం ఎవరిలా కావాలని కోరుకుంటున్నారో అలా మారడమనేది లేదు మరియు ఆయన పిల్లల కోసం దేవుని ప్రణాళిక నిష్ఫలమవుతుంది. ఈ యుగంలోని సంఘము ఆయన ప్రణాళికలో అంతర్భాగము.
రక్షకుడు, ఆయన సువార్త మరియు ఆయన సంఘము పట్ల మిమ్మల్ని మీరు మరింత నిబద్ధులుగా చేసుకోమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు అలా చేస్తున్నప్పుడు, రక్షకుని సువార్త మరియు ఆయన సంఘముల సమ్మేళనము మీ జీవితంలోకి శక్తిని తీసుకువస్తుందని మీరు కనుగొంటారు. ఈ శక్తి డైనమైట్ కంటే చాలా గొప్పది. ఇది మీ మార్గంలోని రాళ్ళను పగులగొట్టి, దేవుని రాజ్యంలో మిమ్మల్ని వారసునిగా మారుస్తుంది. మరియు మీరు “చెప్పలేని సంతోషముతో, సంపూర్ణ మహిమతో నింపబడతారు.” యేసు క్రీస్తు నామములో, ఆమేన్.