నిరీక్షణ యొక్క గెలుపు
నిరీక్షణ అనేది ఒక సజీవ బహుమానం, మనం యేసు క్రీస్తుపై మన విశ్వాసాన్ని పెంచుకునే కొద్దీ పెరిగే బహుమానం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మనం “సర్వసభ్య సమావేశం” యొక్క ఈ అత్యంత ప్రత్యేక సమయాన్ని ప్రారంభించినప్పుడు, పరలోకపు దృష్టి ఖచ్చితంగా మనపై కేంద్రీకరించబడుతుంది. మనము ఆయన సేవకుల ద్వారా “యెహోవా స్వరమును” వింటాము; పరిశుద్ధాత్మ యొక్క “నడిపింపు, మార్గనిర్దేశం మరియు ఓదార్పునిచ్చే” ప్రభావాన్ని మనం అనుభవిస్తాము మరియు మన విశ్వాసం బలపరచబడుతుంది.
మూడు సంవత్సరాల క్రితం, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ పదాలతో సర్వసభ్య సమావేశాన్ని ప్రారంభించారు: “మీ హృదయంలోని ప్రశ్నల కొరకు ఇవ్వబడు స్వచ్ఛమైన బయల్పాటు ఈ సమావేశాన్ని ఎక్కువ ప్రతిఫలాన్నిచ్చేదిగా మరియు మరపురానిదిగా చేస్తుంది.” ఈ రెండు రోజులలో మీరు వినాలని ప్రభువు కోరుకున్న దానిని వినడానికి మీకు సహాయపడేందుకు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య కోసం మీరింకా వెదకనట్లయితే, ఇప్పడే వెదకమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఈ సమావేశాన్ని ప్రభువు నుండి ఆయన సేవకుల ద్వారా వచ్చే సందేశాలపై విందారగించే సమయంగా చేయండి.”
లేఖనాలు మూడు పదాలను శక్తివంతంగా ఒకదానితో ఒకటి అనుసంధానించాయి: విశ్వాసం, నిరీక్షణ, దాతృత్వం. నిరీక్షణ యొక్క బహుమానము దేవుని నుండి అమూల్యమైన వరము.
నిరీక్షణ అనే పదము మనం జరగాలని కోరుకునే అనేక విషయాలకు ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, “వర్షం పడదని నేను ఆశిస్తున్నాను” లేదా “మా జట్టు గెలుస్తుందని నేను ఆశిస్తున్నాను.” యేసు క్రీస్తు మరియు పునఃస్థాపించబడిన సువార్తపై కేంద్రీకృతమైయున్న మన పవిత్రమైన మరియు నిత్యమైన నిరీక్షణల గురించి మరియు “నీతి మూలముగా వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాల యొక్క మన నమ్మకమైన అపేక్షల” గురించి మాట్లాడడమే నా ఉద్దేశ్యం.
నిత్యజీవము కొరకు మన నిరీక్షణ
క్రీస్తు యొక్క కృప మరియు మన స్వంత ఎంపికల ద్వారా మన నిత్యజీవము యొక్క నిరీక్షణ నిశ్చయించబడింది, అది మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళడానికి మరియు మన పరలోక తండ్రితో, ఆయన ప్రియ కుమారునితో, మన నమ్మకమైన కుటుంబంతో, విలువైన స్నేహితులతో మరియు ప్రతి ఖండం, ప్రతి శతాబ్దం నుండి భూమిపై ఉన్న నీతిమంతులైన స్త్రీ పురుషులతో కలకాలం శాంతి, సంతోషాలతో జీవించే విశేషమైన ఆశీర్వాదానికి మనల్ని అనుమతిస్తుంది.
మనము పరీక్షించబడినప్పుడు మరియు నిరూపించబడినప్పుడు భూమిపై మనం ఆనందాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తాము. మన పాపాలు, కష్టాలు, శోధనలు, అన్యాయం మరియు ఈ మర్త్య జీవితంలోని సవాళ్లపై మనం గెలుపొందినప్పుడు, మన విజయం యేసు క్రీస్తుపై విశ్వాసం ద్వారా వస్తుంది.
మనం యేసు క్రీస్తుపై మన విశ్వాసాన్ని బలపరచుకున్నప్పుడు, మన శ్రమలను మించి నిత్యత్వం యొక్క ఆశీర్వాదాలను, వాగ్దానాలను మనం చూస్తాము. తేజస్సు పెరిగే కాంతిలా, నిరీక్షణ చీకటిగానున్న ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుంది మరియు మన అద్భుతమైన భవిష్యత్తును మనం చూస్తాము.
నిరీక్షణ దేవుని నుండి వస్తుంది
ఆది నుండి, మన పరలోక తండ్రి మరియు ఆయన ప్రియ కుమారుడు నీతిమంతులను నిరీక్షణ అనే విలువైన బహుమానంతో ఆత్రంగా దీవించారు.
తోటను విడిచిన తర్వాత, యేసు క్రీస్తు యొక్క వాగ్దానం గురించి ఆదాము హవ్వలకు ఒక దేవదూత బోధించాడు. నిరీక్షణ యొక్క బహుమానం వారి జీవితాలను ప్రకాశవంతం చేసింది. “నా కన్నులు తెరువబడినవి మరియు ఈ జీవితములో నేను ఆనందము కలిగియుందును” అని ఆదాము ప్రకటించాడు. “[వారి] విమోచనానందమును, విధేయులందరికి దేవుడు అనుగ్రహించు నిత్యజీవమును” గురించి హవ్వ మాట్లాడింది.
పరిశుద్ధాత్మ ఆదాముకు నిరీక్షణను తెచ్చినట్లే, ప్రభువు ఆత్మ యొక్క శక్తి నేడు విశ్వాసులకు జ్ఞానవృద్ధి కలిగిస్తుంది, నిత్యజీవము యొక్క వాస్తవికతను ప్రకాశవంతం చేస్తుంది.
రక్షకుడు మన విశ్వాసానికి మరియు నిరీక్షణకు తోడుగా, పరిశుద్ధాత్మ అనే ఒక ఆదరణకర్తను పంపుతారు, శాంతిని తెస్తారు, కానీ “లోకమిచ్చునట్లుగా కాదు.”
“లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి [నిరీక్షణ యొక్క ప్రకాశాన్ని నిలుపుకోండి], నేను లోకమును జయించియున్నాను” అని రక్షకుడు చెప్పారు.
కష్ట సమయాల్లో, విశ్వాసంతో ప్రభువును నమ్మాలని మనం ఎంచుకుంటాము. “నాయిష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక” అని మనం నిశ్శబ్దంగా ప్రార్థిస్తాము.” మన సాత్వికమైన సమ్మతికి ప్రభువు ఆమోదాన్ని మనము అనుభవిస్తాము మరియు ప్రభువు తాను ఎంచుకున్న సమయంలో పంపే వాగ్దాన శాంతి కోసం మనము ఎదురుచూస్తాము.
అపొస్తలుడైన పౌలు ఇలా బోధించాడు, “మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది,” “నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై;” “విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు … ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.”
నిరీక్షణ యొక్క పాఠము
శ్రమల కాలంలో క్రీస్తు నందు నిరీక్షణ కలిగియుండడం గురించి ప్రవక్త మొరోనైకి ప్రత్యక్షంగా తెలుసు. అతను తన బాధాకరమైన పరిస్థితిని ఇలా వివరించాడు:
“నేను ఒంటరిగా ఉంటిని. … నేను వెళ్ళుటకు స్థలమేదియూ లేదు.”
“వారు నన్ను నాశనము చేయుదురేమోయని భయపడి, నేను … యెదుటకు రాలేదు.”
ఆశ్చర్యకరంగా, ఈ దుఃఖకరమైన ఒంటరి సమయంలో, మొరోనై నిరీక్షణతో కూడిన తన తండ్రి మాటలను నమోదు చేసాడు:
“అందువలన ఒక మనుష్యుడు విశ్వాసము కలిగియున్న యెడల, అతడు తప్పక నిరీక్షణ కలిగియుండవలెను; ఏలయనగా, విశ్వాసము లేకుండా నిరీక్షణ ఉండజాలదు.”
“మీ నిరీక్షణ దేని కొరకైయున్నది? … క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, ఆయన పునరుత్థాన శక్తి ద్వారా నిత్యజీవమునకు లేపబడుటకు మీరు నిరీక్షణ కలిగియుండవలెను.”
నా సహోదర సహోదరీలారా, నిరీక్షణ అనేది ఒక సజీవ బహుమానం, మనం యేసు క్రీస్తుపై మన విశ్వాసాన్ని పెంచుకునే కొద్దీ పెరిగే బహుమానం. “విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క రుజువు.” ప్రార్థన, దేవాలయ నిబంధనలు, ఆజ్ఞలను పాటించడం, లేఖనాలు మరియు ఆధునిక ప్రవక్తల మాటలపై నిరంతరం విందారగించడం, సంస్కారమును తీసుకోవడం, ఇతరులకు సేవ చేయడం మరియు మన తోటి పరిశుద్ధులతో వారానికోసారి ఆరాధించడం ద్వారా—మనం ఈ సత్యాన్ని—మన విశ్వాసానికి రుజువులను నిర్మిస్తాము.
నిరీక్షణ మందిరము
దుష్టత్వం పెరుగుతున్న కాలంలో మన నిరీక్షణను బలపరచడానికి, భూమిపై తన దేవాలయాలను నిర్మించమని ప్రభువు తన ప్రవక్తను ఆదేశించారు.
మనము ప్రభువు యొక్క మందిరములోనికి ప్రవేశించినప్పుడు, మన నిరీక్షణను ధృవీకరించే దేవుని ఆత్మను మనం అనుభవిస్తాము.
దేవాలయం ఖాళీ సమాధికి సాక్ష్యమిస్తుంది మరియు తెరకు అవతలి వైపు జీవితం అందరికీ కొనసాగుతుంది.
నిత్య సహచరుడు లేని వారికి, ప్రతి నీతిమంతుడు వాగ్దానం చేయబడిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుతాడని విధులు శక్తివంతంగా నిర్ధారిస్తాయి.
ఒక యువ జంట బలిపీఠానికి అటు ఇటు మోకరిల్లినప్పుడు, కేవలం కాలం కొరకు మాత్రమే కాకుండా నిత్యత్వం కొరకు ముద్ర వేయబడడానికి అద్భుతమైన నిరీక్షణ ఉంది.
వారి ప్రస్తుత పరిస్థితులు ఏవైనప్పటికీ మన భావితరాలకు చేసిన వాగ్దానాలలో మనకు అపారమైన నిరీక్షణ ఉంది.
మనము విశ్వసించి, ప్రభువు యొక్క మందిరములో దేవునితో చేసిన మన నిబంధనలను తప్పక పాటించినప్పుడు, మన నిరీక్షణను తక్కువ చేసే నొప్పి, అనారోగ్యం, అన్యాయం, బాధ, ఏదీ ఉండదు. ఇది వెలుగు మందిరం, నిరీక్షణ మందిరం.
నిరీక్షణ కోల్పోయినప్పుడు
క్రీస్తునందు నిరీక్షణ లేని వారిలో దుఃఖాన్ని, నిస్పృహను చూసినప్పుడు, మనం బాధతో కన్నీళ్లు పెట్టుకుంటాం.
ఒకప్పుడు క్రీస్తుపై విశ్వాసం ఉండి, ఆ తర్వాత తమ నమ్మకాన్ని విస్మరించాలని నిర్ణయించుకున్న జంటను నేను ఇటీవల దూరం నుండి గమనించాను. వారు ప్రపంచంలో విజయం సాధించారు మరియు వారి తెలివిలో, వారి విశ్వాసాన్ని తిరస్కరించడంలో వారు ఆనందాన్ని పొందారు.
ఇంకా యవ్వనంగా, బలంగా ఉన్న భర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై చనిపోయే వరకు అంతా బాగానే ఉంది. సూర్యగ్రహణం వలె, వారు కుమారుని కాంతిని అడ్డుకున్నారు మరియు ఫలితం నిరీక్షణ యొక్క గ్రహణం. ఆమె అపనమ్మకం మూలంగా భార్య ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది, బాధాకరంగా సిద్ధపడలేకపోయింది, తన పిల్లలను ఓదార్చలేకపోయింది. అకస్మాత్తుగా ఆమె భవిష్యత్తుపై నిరీక్షణ కోల్పోయేంత వరకు ఆమె జీవితం సరైన క్రమంలో ఉందని ఆమె తెలివి ఆమెకు చెప్పింది. ఆమె నిరాశ చీకటిని, గందరగోళాన్ని తెచ్చిపెట్టింది.
హృదయవిదారకమైన విషాదంలో నిరీక్షణ
ఆమె బాధాకరమైన నిస్పృహను హృదయ విదారక సమయంలో క్రీస్తునందు నిరీక్షణ కలిగియున్న మరొక కుటుంబంతో నేను పోలుస్తాను.
ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నా మేనల్లుడు, బెన్ ఆండర్సెన్ మరియు అతని భార్య రాబీ అప్పుడే పుట్టిన తమ కొడుకుతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఐడహోలో వారి వ్యవసాయ సమాజం నుండి సాల్ట్ లేక్ సిటీకి ప్రయాణించారు. నేను ఆసుపత్రికి చేరుకున్నాను మరియు బెన్ వారి బిడ్డ గుండెకు సంబంధించిన తీవ్రమైన, ప్రాణాంతక సమస్యలను వివరించాడు. మేము ట్రే యొక్క చిన్న తలపై మా చేతులు ఉంచాము. ప్రభువు అతని జీవితం కొనసాగేలా దీవించారు.
ట్రే తన జీవితపు మొదటి వారంలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్నాడు మరియు ఆ తర్వాత మరిన్ని శస్త్రచికిత్సలు జరిగాయి. సంవత్సరాలు గడిచేకొద్దీ, ట్రేకి గుండె మార్పిడి అవసరమని స్పష్టమైంది. అతని శారీరక కార్యకలాపాలు పరిమితం అయినప్పటికీ, అతని విశ్వాసం విస్తరించింది. అతను ఇలా వ్రాశాడు, “యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని మరియు రక్షణ ప్రణాళిక గురించి సాక్ష్యాన్ని కలిగియుండడం యొక్క ప్రాముఖ్యతను నేను ఎల్లప్పుడూ తెలుసుకున్నాను కాబట్టి, నాపై నేను ఎప్పుడూ జాలిపడలేదు.”
అధ్యక్షులు నెల్సన్ చేసిన ఈ ప్రఖ్యాత వ్యాఖ్యానాన్ని ట్రే తన ఫోనుపై పెట్టుకున్నాడు: “మనము అనుభవించు సంతోషము మన జీవితపు పరిస్థితులతో పెద్దగా సంబంధము కలిగిలేదు, కానీ మన జీవితాల దృష్టితో పూర్తి సంబంధము కలిగియున్నది.”
ట్రే ఇలా వ్రాశాడు: “నేను ఎల్లప్పుడూ పూర్తి-కాల సువార్తసేవ చేయాలని ఎదురుచూసాను, కానీ … నా గుండెమార్పిడి తర్వాత కనీసం ఒక సంవత్సరం వరకు నా వైద్యులు నన్ను సువార్తసేవ చేయనివ్వరు…. నేను యేసు క్రీస్తుపై విశ్వాసం ఉంచాను.”
ఈ సెమిస్టర్ ఆరంభంలో BYUలో అకౌంటింగ్ మేజర్‌గా అంగీకరించబడినందుకు ట్రే ఉత్సాహంగా ఉన్నాడు, అయితే జూలై చివరలో అతను తన గుండె మార్పిడి కోసం ఆసుపత్రికి రావాలని చాలాకాలంగా ఎదురుచూసిన టెలిఫోన్ పిలుపు అందుకున్నప్పుడు మరింత ఉత్సాహంగా ఉన్నాడు.
“ఒక సంవత్సరం తర్వాత, నేను నా సువార్తసేవలో ఉంటాను” అని ట్రే చెప్పాడు.
అతను ఆపరేషన్ గదిలోకి ప్రవేశించినప్పుడు గొప్ప అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ, శస్త్రచికిత్స సమయంలో వినాశకరమైన సమస్యలు వచ్చాయి మరియు ట్రేకి ఎప్పటికీ స్పృహ రాలేదు.
అతని తల్లి, రాబీ ఇలా చెప్పింది: “శుక్రవారం అత్యంత హృదయ విదారకమైన రోజు … గదిలోపల ఏం జరుగుతున్నదో అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. … నేను ప్రతిదీ క్రమపరచడానికి ప్రయత్నిస్తూ చాలాసేపు మేల్కొని ఉన్నాను. … కానీ శనివారం, నేను సంపూర్ణ ఆనందంతో మేల్కొన్నాను. అది కేవలం శాంతి కాదు; అది తిరస్కరణ కాదు. నేను నా కొడుకు పట్ల ఆనందాన్ని అనుభవించాను మరియు అతని తల్లిగా నేను ఆనందాన్ని అనుభవించాను. … బెన్ నా కంటే చాలా ముందుగానే లేచాడు, చివరకు మాకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు, బెన్ సరిగ్గా అదే అనుభూతితో మేల్కొన్నాడు.”
బెన్ ఇలా వివరించాడు: “దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నాకు బోధించినట్లుగా నా ఆత్మకు స్పష్టత వచ్చింది. నేను ఉదయం 4:00 గంటలకు మేల్కొన్నాను మరియు వర్ణించలేని శాంతితో, ఆనందంతో నింపబడ్డాను. ఇది ఎలా సాధ్యము? … ట్రే యొక్క మరణం చాలా బాధాకరమైనది, నేను అతనిని కోల్పోయినందుకు చాలా చింతిస్తున్నాను. కానీ ప్రభువు మనల్ని అనాథలుగా విడువరు. … నేను ఆనందకరమైన పునఃకలయిక కోసం ఎదురు చూస్తున్నాను.”
నిరీక్షణ యొక్క వాగ్దానం
అధ్యక్షులు నెల్సన్ గారి సర్వసభ్య సమావేశ ప్రసంగంలోని ఈ మాటలను ట్రే తన దినచర్య పుస్తకంలో వ్రాసుకున్నాడు: “మీ బిడ్డ నయం చేయలేని అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు లేదా మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు లేదా మీ జీవిత భాగస్వామి మీకు ద్రోహం చేసినప్పుడు సంతోషాన్ని అనుభవించడం సాధ్యం కాదు. అయినప్పటికీ అది ఖచ్చితంగా రక్షకుడు అందించే ఆనందం. ఆయన ఆనందం స్థిరమైనది, మన ‘కష్టములు కొంతకాలమే ఉండును’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 121:7] మరియు మన ప్రయోజనము కొరకు ప్రతిష్ఠించబడును అని మనకు అభయమిస్తుంది.”
సహోదర సహోదరీలారా, మీరు కోరుకునే శాంతి మీరు కోరుకున్నంత త్వరగా రాకపోవచ్చు, కానీ మీరు ప్రభువునందు నమ్మకముంచినప్పుడు, ఆయన శాంతి వస్తుందని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను.
పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణతో ముందుకు సాగుతూ, మనం మన విలువైన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. మన రక్షకుడైన యేసు క్రీస్తే మన నిరీక్షణ అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన ద్వారా, నీతివంతమైన మన కలలన్నీ నిజమవుతాయి. ఆయన నిరీక్షణకర్తయగు దేవుడు—నిరీక్షణ యొక్క గెలుపు. ఆయన జీవిస్తున్నారు మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.