క్రీస్తును వెంబండించుట
క్రీస్తు అనుచరులుగా, మన పరిపూర్ణ మాదిరి అయిన యేసు క్రీస్తు గురించి మనం బోధిస్తాము మరియు సాక్ష్యమిస్తాము. కాబట్టి వివాదాన్ని విడిచిపెట్టడం ద్వారా మనం ఆయన్ని అనుసరిద్దాం.
“రండి, నన్ను అనుసరించండి” అనే రక్షకుని ఆహ్వానం చేత పేరొందిన సువార్త అధ్యయన ప్రణాళిక ద్వారా ఈ సంవత్సరం లక్షలాదిమంది ప్రేరణ పొందారు. క్రీస్తును అనుసరించడం అనేది సాధారణమైన లేదా అప్పుడప్పుడు చేసే అభ్యాసం కాదు. అది నిరంతర నిబద్ధత మరియు జీవన విధానం, అది అన్ని సమయాలలో మరియు అన్ని ప్రదేశాలలో మనకు మార్గనిర్దేశం చేయాలి. ఆయన బోధనలు మరియు ఆయన మాదిరి యేసు క్రీస్తు యొక్క ప్రతీ శిష్యునికి మార్గాన్ని స్పష్టం చేస్తాయి. అందరూ ఈ మార్గానికి ఆహ్వానించబడ్డారు, ఎందుకంటే ఆయన అందరినీ తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నారు, “నల్లవారైనా తెల్లవారైనా, బందీలైనా స్వతంత్రులైనా, పురుషులైనా స్త్రీలైనా; … అందరూ దేవునికి ఒకే రీతిగా ఉన్నారు.”
I.
“ధర్మశాస్త్రంలో గొప్ప ఆజ్ఞ” అని ఆయన నిర్వచించిన దానికి విధేయులైయుండడమే క్రీస్తుని అనుసరించడంలో మొదటి దశ:
“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.
“ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
“ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవి.”
దేవుని ఆజ్ఞలు మన జీవితాల్లో మార్గదర్శకమైన మరియు స్థిరమైన శక్తిని అందిస్తాయి. మర్త్యత్వంలో మన అనుభవాలు చిన్న పిల్లవాడు మరియు అతని తండ్రి గాలులతో కూడిన రోజు గాలిపటం ఎగురవేయడం లాంటివి. గాలిపటం పైకి లేచినప్పుడు, గాలులు చిన్న పిల్లవాడి చేతిలోని దారాన్ని పైకి లాగాయి. మర్త్య గాలుల శక్తితో అనుభవం లేని అతడు గాలిపటం పైకి ఎగరడానికి దారాన్ని కత్తిరించమని కోరాడు. తెలివైన అతని తండ్రి వద్దు అని సలహా ఇస్తాడు, మర్త్య గాలులకు వ్యతిరేకంగా గాలిపటాన్ని నిలిపేది దారమే అని వివరిస్తాడు. మనం దారంపై పట్టు కోల్పోతే గాలిపటం పైకి ఎగరదు. అది గాలికి కొట్టుకొనిపోతూ, అనివార్యంగా భూమిపై పడిపోతుంది.
ఆ ముఖ్యమైన దారం మనల్ని దేవునితో, మన పరలోక తండ్రితో మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో అనుసంధానించే మన నిబంధనలను సూచిస్తుంది. వారి ఆజ్ఞలను పాటించడం ద్వారా మరియు వారి విమోచన ప్రణాళికను అనుసరించడం ద్వారా మనము ఆ నిబంధనలను గౌరవిస్తున్నప్పుడు, వాగ్దానం చేయబడిన వారి దీవెనలు మనం సిలెస్టియల్ శిఖరాలకు ఎదగడానికి వీలు కల్పిస్తాయి.
క్రీస్తు “లోకమునకు వెలుగైయున్నారు” అని మోర్మన్ గ్రంథము తరచు ప్రకటిస్తుంది. ఆయన నీఫైయులకు కనిపించిన సమయంలో, పునరుత్థానుడైన ప్రభువు ఇలా చెప్పడం ద్వారా వారికి ఆ బోధనను వివరించారు: “నేను మీ కొరకు ఒక మాదిరిని ఉంచియున్నాను.” “ఇదిగో, నేను చేయగా మీరు చూచిన నా మాదిరిని మీరు అనుసరించుడి.” ఆయనే మనకు ఆదర్శం. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని చేయమని ప్రోత్సహించినట్లు లేఖనాలను అధ్యయనం చేయడం మరియు ప్రవచనాత్మక బోధనలను అనుసరించడం ద్వారా ఆయన చెప్పినదానిని మరియు చేసినదానిని మనం నేర్చుకుంటాము. సంస్కారపు విధిలో, మనం ప్రతీ విశ్రాంతి దినమున “ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకుంటామని, ఆయన ఆజ్ఞలను పాటిస్తామని” నిబంధన చేస్తాము.
II.
మోర్మన్ గ్రంథములో, “క్రీస్తు యొక్క సిద్ధాంతం” అని ఆయన పిలిచిన దానిలో ప్రభువు మనకు మూలాధారాలను ఇచ్చారు. అవి ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరమును పొందడం, అంతము వరకు సహించడం మరియు చిన్న పిల్లవాడిగా మారడం, అంటే ప్రభువును విశ్వసించడం మరియు ఆయన మన నుండి కోరినదంతా సమర్పించడం.
ప్రభువు ఆజ్ఞలు రెండు రకాలు: క్రీస్తు యొక్క సిద్ధాంతం వలె శాశ్వతమైనవి మరియు తాత్కాలికమైనవి. తాత్కాలిక ఆజ్ఞలు ప్రభువు సంఘము యొక్క అవసరాలకు లేదా తాత్కాలిక పరిస్థితులలో విశ్వాసులకు అవసరమైనవి, కానీ అవసరం తీరినప్పుడు పక్కన పెట్టబడతాయి. పరిశుద్ధులను న్యూయార్క్ నుండి ఒహైయోకు, మిస్సోరికి, ఇల్లినాయ్‌కు తరలించి, చివరకు ఇంటర్‌మౌంటెయిన్ వెస్ట్‌కు అగ్రగాముల ప్రయాణాన్ని నడిపించమని సంఘము యొక్క ప్రారంభ నాయకత్వానికి ప్రభువు ఇచ్చిన ఆదేశాలు తాత్కాలిక ఆజ్ఞలకు ఉదాహరణ. తాత్కాలికమే అయినప్పటికీ, ఇప్పటికీ అమలులో ఉన్నప్పుడు ఈ ఆజ్ఞలు పాటించడానికి ఇవ్వబడ్డాయి.
కొన్ని శాశ్వతమైన ఆజ్ఞలు సాధారణంగా పాటించడానికి గణనీయమైన సమయం పట్టింది. ఉదాహరణకు, దశమభాగ చట్టంపై అధ్యక్షులు లోరెంజో స్నో చేసిన ప్రసిద్ధ ఉపన్యాసం ఇంతకు ముందు ఇచ్చిన ఆజ్ఞను నొక్కిచెప్పింది, కానీ సంఘ సభ్యుల చేత ఇంకా అది సాధారణంగా పాటించబడలేదు. సంఘము మరియు దాని సభ్యులు అప్పట్లో ఎదుర్కొన్న పరిస్థితులలో దానిని పునరుద్ఘాటించడం అవసరమైంది. కడవరి-దిన పరిశుద్ధులు లేదా సంఘము ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇటీవలి ఉదాహరణలు కూడా పునరుద్ఘాటించవలసిన అవసరం ఉంది. వీటిలో ఒక తరం క్రితం అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి గారు కుటుంబంపై జారీ చేసిన ప్రకటన మరియు సంఘము అది బయల్పరచబడిన పేరుతో అనగా యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము అని పిలువబడాలని అధ్యక్షుడు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇటీవల ఇచ్చిన పిలుపు ఉన్నాయి.
III.
మన రక్షకుని బోధనలలో మరొకటి మన కాలపు పరిస్థితులలో పునరుద్ఘాటించబడవలసిన అవసరం ఉన్నట్లు అనిపిస్తోంది.
ఇది మన బహిరంగ సంభాషణలలో మరియు కొన్నిసార్లు మన కుటుంబాలలో కూడా చాలా కఠినమైన మరియు బాధ కలిగించే పదాలు ఉపయోగించబడుతున్న సమయం. ప్రజా విధానం యొక్క సమస్యలపై తీవ్రమైన వ్యత్యాసాలు తరచుగా ప్రజా సంబంధాలు మరియు వ్యక్తిగత సంబంధాలలో శత్రుత్వం—ద్వేషం వంటి చర్యలకు కారణమవుతాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలామంది పౌరులు కోరుకున్నప్పటికీ, ఈ శత్రుత్వం యొక్క వాతావరణం కొన్నిసార్లు ముఖ్యమైన విషయాలపై చట్టాన్ని రూపొందించే సామర్థ్యాలను కూడా స్తంభింపజేస్తుంది.
ఈ విషపూరిత సంభాషణల సమయంలో క్రీస్తు అనుచరులు ఏమి బోధించాలి మరియు ఏమి చేయాలి? ఆయన బోధనలు మరియు మాదిరులు ఏవి?
యేసు నీఫైయులకు కనిపించినప్పుడు బోధించిన మొదటి సూత్రాలలో ముఖ్యమైనది వివాదానికి దూరంగా ఉండడమే. మతపరమైన సిద్ధాంతంపై వివాదాల సందర్భంలో ఆయన దీనిని బోధించినప్పటికీ, ఆయన ఇచ్చిన కారణాలు రాజకీయాలలో, ప్రజా విధానంలో మరియు కుటుంబ సంబంధాలలో సంభాషణలు మరియు సంబంధాలకు స్పష్టంగా వర్తిస్తాయి. యేసు ఇలా బోధించారు:
“వివాదము యొక్క ఆత్మను కలిగియున్నవాడు నా సంబంధి కాడు, కానీ వివాదము యొక్క తండ్రియైన అపవాది సంబంధియై యున్నాడు; మరియు వారు ఒకరితోనొకరు కోపముతో పోరాడునట్లు మనుష్యుల హృదయాలను అతడు పురిగొల్పును.
“ఇదిగో, ఒకరికి వ్యతిరేకముగా మరొకరు కోపముతోనుండునట్లు మనుష్యుల హృదయాలను పురిగొల్పుట నా సిద్ధాంతము కాదు; కానీ, అట్టి క్రియలు ఆపివేయవలెను అనునదే నా సిద్ధాంతమైయున్నది.”
నీఫైయుల మధ్య మిగిలి ఉన్న తన పరిచర్యలో, యేసు తన వివాద నిషేధంతో దగ్గరి సంబంధం ఉన్న ఇతర ఆజ్ఞలను బోధించారు. ఆయన అంతకుముందు కొండమీది తన గొప్ప ప్రసంగంలో వీటిలో ప్రతీ ఒక్కటి బోధించారని మనకు బైబిలు నుండి తెలుసు, తరువాత ఆయన నీఫైయులతో సరిగ్గా అదే భాషను ఉపయోగించారు. నేను బాగా తెలిసిన బైబిలు భాషను వ్యాఖ్యానిస్తాను.
“మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను శపించువారిని దీవించుడి, మిమ్ములను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్ములను దౌర్జన్యముగా ఉపయోగించి, మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి.”
ఇది క్రీస్తు యొక్క అత్యంత ప్రసిద్ధమైన ఆజ్ఞలలో ఒకటి—అత్యంత విప్లవాత్మకమైనది మరియు అనుసరించడానికి చాలా కష్టమైనది. అయినప్పటికీ అందరూ ఆయనను అనుసరించాలని ఆయన ఇచ్చిన ఆహ్వానంలో ఇది చాలా ప్రధానమైన భాగం. అధ్యక్షులు డేవిడ్ ఓ. మెఖే బోధించినట్లుగా, “దేవునిపట్ల ప్రేమను కనబరచడానికి తోటి మనుషుల పట్ల నిస్వార్థమైన ప్రేమను చూపించడం కంటే మెరుగైన మార్గం మరొకటి లేదు.”
మన మాదిరి అయిన ఆయన యొక్క మరొక ప్రాథమిక బోధన ఇక్కడ ఉంది: “సమాధానపరచువారు ధన్యులు: వారు దేవుని కుమారులనబడుదురు.”
సమాధానపరచువారు! క్రీస్తు యొక్క అనుచరులు తమ సంభాషణలన్నింటిలో కఠినమైన మరియు హానికరమైన పదాలను విడిచిపెడితే అది వ్యక్తిగత సంబంధాలను ఎంతగానో మారుస్తుంది.
గత సంవత్సరం సర్వసభ్య సమావేశంలో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు ఈ సవాళ్ళను ఇచ్చారు:
“ఒక వ్యక్తి ఇతరులను ఎంత ప్రేమగా ఆదరిస్తాడనే దానిని బట్టి, ఆ వ్యక్తి యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరుడు అవునో కాదో సులువుగా గుర్తించవచ్చు. …
“… యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు సమాధానపరచువారు.
“… రక్షకుడిని మనం గౌరవించగల ఉత్తమ విధానాలలో ఒకటి సమాధానపరచువారిగా కావడం.”
ఆయన బోధనలను ముగించడం: “వివాదం ఒక ఎంపిక. సమాధానపరచడం ఒక ఎంపిక. వివాదం లేదా సయోధ్యను ఎంచుకోవడానికి మీకు కర్తృత్వం ఉంది. ఇప్పుడు మరియు ఎల్లప్పుడు, సమాధానపరచువారిగా ఉండేందుకు ఎంచుకోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.”
అందరూ అంగీకరించే ఉమ్మడి విలువలను గుర్తించడం ద్వారా సంభావ్య ప్రత్యర్థులు వారి చర్చలను ప్రారంభించాలి.
మన పరిపూర్ణమైన మాదిరిని మరియు ఆయన ప్రవక్తను అనుసరించడానికి, మనం ఉత్తమమైన సూత్రము అని ప్రసిద్ధి చెందిన దానిని ఆచరించాల్సిన అవసరం ఉంది: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది.” మనం అందరినీ ప్రేమించి, మంచి చేయాలి. మనము వివాదాలకు దూరంగా ఉండాలి మరియు మన సంభాషణలన్నింటిలో సమాధానపరచువారిగా ఉండాలి. దీని అర్థం మన నియమాలు మరియు ప్రాధాన్యతలతో రాజీపడడం కాదు, కానీ ఇతరుల ప్రాధాన్యతలను బట్టి వారిపై కఠినంగా దాడి చేయడం మానేయాలి. ఆయన పరిచర్యలో మన పరిపూర్ణ మాదిరి చేసింది అదే. ఆయనను అనుసరించమని ఆయన మనల్ని ఆహ్వానించినప్పుడు ఆయన మనకు ఉంచిన మాదిరి అదే.
నాలుగు సంవత్సరాల క్రితం ఈ సమావేశంలో, అధ్యక్షులు నెల్సన్ గారు మన కాలం కొరకు మనకొక ప్రవచనాత్మక సవాలు ఇచ్చారు:
“మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా? దేవుడిని మీ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ప్రభావంగా ఉండనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా? ప్రతిరోజూ మీరు చేసే దానిని ప్రభావితం చేయడానికి ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు మరియు ఆయన నిబంధనలను మీరు అనుమతిస్తారా? ఇతర వాటికి పైగా ఆయన స్వరము ప్రాధాన్యత సంతరించుకొనేలా మీరు అనుమతిస్తారా?”
క్రీస్తు అనుచరులుగా, మన పరిపూర్ణ మాదిరి అయిన యేసు క్రీస్తు గురించి మనం బోధిస్తాము మరియు సాక్ష్యమిస్తాము. కాబట్టి వివాదాన్ని విడిచిపెట్టడం ద్వారా మనం ఆయన్ని అనుసరిద్దాం. బహిరంగ చర్యలలో మనకు ఇష్టమైన విధానాలను అనుసరిస్తున్నప్పుడు, సమాధానపరచువారి భాషను మరియు పద్ధతులను ఉపయోగించడం ద్వారా మనం ఆయన ఆశీర్వాదాలకు అర్హత పొందుదాం. మన కుటుంబాలలో మరియు ఇతర వ్యక్తిగత సంబంధాలలో కఠినమైన మరియు ద్వేషపూరితమైన వాటికి దూరంగా ఉందాం. మన రక్షకుని వలె పరిశుద్ధంగా ఉండాలని మనం కోరుకుందాం, ఆయన పరిశుద్ధ నామంలో నేను సాక్ష్యమిస్తున్నాను మరియు పరిశుద్ధులుగా ఉండేందుకు మనకు సహాయం చేయడానికి ఆయన ఆశీర్వాదం కోరుతున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.