2020–2024
మన పరలోక తండ్రియందు నమ్మకముంచుట
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:20

మన పరలోక తండ్రియందు నమ్మకముంచుట

అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో దేవుడు మనల్ని నమ్ముతారు మరియు అన్ని విషయాలలో, ఆయనయందు నమ్మకముంచమని మనల్ని అడుగుతారు.

1843 జూన్ 1న, ఆడిసన్ ప్రాట్, అతని భార్య లూయిసా బార్న్స్ ప్రాట్‌ను వారి చిన్న పిల్లలను చూసుకోవడానికి వదిలిపెట్టి, హవాయి దీవులలో సువార్త ప్రకటించడానికి ఇల్లినాయ్‌లోని నావూ నుండి బయలుదేరాడు.

నావూలో వేధింపులు తీవ్రతరం కావడంతో, పరిశుద్ధులు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు మరియు తరువాత వింటర్ క్వార్టర్స్ వద్దకు చేరిన వారు సాల్ట్ లేక్ లోయకు వలస వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు, ప్రయాణం చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని లూయిసా ఎదుర్కొంది. ఒంటరిగా ప్రయాణించడం కంటే ఆడిసన్ తిరిగి వచ్చే వరకు వేచియుండటమే ఆమెకు సులభంగా ఉండేది.

రెండు సందర్భాల్లో, ఆమె ప్రవక్త బ్రిగం యంగ్ నుండి మార్గదర్శకత్వం కోరుకుంది, ఆయన ఆమెను వెళ్ళమని ప్రోత్సహించారు. చాలా కష్టంగా ఉన్నప్పటికీ మరియు ఆమెకు వ్యక్తిగతంగా అయిష్టత ఉన్నప్పటికీ, ఆమె ప్రతిసారీ విజయవంతంగా ప్రయాణం చేసింది.

మొదట్లో, లూయిసా ప్రయాణంలో కొద్ది ఆనందాన్ని మాత్రమే పొందింది. అయినప్పటికీ, ఆమె వెంటనే విశాలమైన పచ్చికను, రంగురంగుల అడవి పూలను మరియు నది ఒడ్డునున్న ఖాళీ మైదానాలను స్వాగతించడం ప్రారంభించింది. “నా మనస్సులోని చీకటి క్రమంగా తగ్గిపోయింది మరియు మొత్తం సమూహంలో నా కంటే ఉల్లాసవంతమైన మహిళ లేదు” అని ఆమె నమోదు చేసింది.

లూయిసా కథ నన్ను బాగా ప్రేరేపించింది. తన వ్యక్తిగత ప్రాధాన్యతలను పక్కన పెట్టడానికి ఆమె చూపిన సుముఖతను, దేవునియందు నమ్మకముంచిన ఆమె సామర్థ్యాన్ని మరియు పరిస్థితిని భిన్నంగా చూసేందుకు ఆమె ప్రదర్శించిన విశ్వాసాన్ని నేను మెచ్చుకుంటున్నాను.

మనం ఎక్కడ ఉన్నా మనల్ని చూసుకునే ప్రేమగల తండ్రి మనకు పరలోకంలో ఉన్నారని మరియు మనం అందరికంటే అన్నింటికంటే ఎక్కువగా ఆయనను నమ్మవచ్చునని ఆమె నాకు గుర్తు చేసింది.

సత్యము యొక్క మూలాధారము

అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో దేవుడు మనల్ని నమ్ముతారు మరియు అన్ని విషయాలలో, ఆయనయందు నమ్మకముంచమని మనల్ని అడుగుతారు. మన తీర్పు లేదా ప్రజాభిప్రాయం, ఆయన పిల్లల పట్ల ఆయన చిత్తానికి భిన్నంగా ఉన్నప్పుడు ఇది చాలా కష్టం.

సత్యం సాపేక్షమైనదని, వాస్తవికత స్వీయ-నిర్వచనమని లేదా దేవుడు చాలా ఉదార స్వభావముగలవారు మరియు మనం చేసే పనుల గురించి ఆయన పట్టించుకోరు కాబట్టి, మనం ఏది ఒప్పు ఏది తప్పు అనే నిర్ణయం తీసుకోలేము అని కొందరు సూచిస్తారు.

మనం దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని, అంగీకరించడానికి కోరుకున్నప్పుడు, తప్పు ఒప్పుల మధ్య సరిహద్దులు మనం నిర్వచించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవడం సహాయకరంగా ఉంటుంది. మన ప్రయోజనం మరియు ఆశీర్వాదం కోసం నిత్య సత్యాలపై ఆధారపడి, దేవుడు ఈ సరిహద్దులను స్వయంగా ఏర్పాటు చేసారు.

దేవుని నిత్య సత్యాన్ని మార్చాలనే కోరికకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది సృష్టి ప్రారంభానికి ముందే, సాతాను దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, మానవుల కర్తృత్వమును నాశనం చేయాలని స్వార్థపూరితంగా కోరుకున్నపుడే ఆరంభమైంది. ఈ పద్ధతిని అనుసరించే, షెరేమ్, నీహోర్ మరియు కొరిహోర్ వంటి వ్యక్తులు విశ్వాసం అవివేకమని, బయల్పాటు అప్రస్తుతమని మరియు మనం ఏది చేయాలనుకున్నా అది సరైనదేనని వాదించారు. దురదృష్టవశాత్తు, చాలా తరచుగా, దేవుని సత్యం నుండి ఈ అతిక్రమణలు గొప్ప దుఃఖానికి దారితీసాయి.

కొన్ని విషయాలు సందర్భం మీద ఆధారపడి ఉండవచ్చు, అయితే ప్రతిదీ కాదు. దేవుని రక్షణ సత్యాలు సంపూర్ణమైనవి, స్వతంత్రమైనవి మరియు దేవునిచే నిర్వచించబడ్డాయని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ స్థిరంగా బోధించారు.

మన ఎంపిక

మనం ఎవరిని నమ్మాలనేది జీవితం యొక్క ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. రాజైన బెంజమిన్ తన ప్రజలకు ఇలా సూచించాడు, “దేవుని యందు విశ్వసించుడి; ఆయన ఉన్నాడని … విశ్వసించుడి; ఆయన … సమస్త జ్ఞానము కలిగియున్నాడని విశ్వసించుడి; ప్రభువు గ్రహించగలిగినట్లు సమస్త విషయములను మనుష్యుడు గ్రహించలేడని విశ్వసించుడి.”

అదృష్టవశాత్తూ, దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవడంలో మనకు సహాయం చేయడానికి లేఖనాలను మరియు సజీవ ప్రవక్తల నుండి మార్గదర్శకత్వాన్ని మనం కలిగియున్నాము. మనకున్న దానికి మించిన స్పష్టత అవసరమైతే, దేవుడు తన ప్రవక్తల ద్వారా దానిని అందజేస్తారు. మరియు మనం ఇంకా పూర్తిగా గ్రహించలేని సత్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయపూర్వక ప్రార్థనలకు ప్రతిస్పందిస్తారు.

“మొదట్లో కొన్నిసార్లు [మన] వ్యక్తిగత అభిప్రాయాలు ప్రభువు యొక్క ప్రవక్తల బోధనలకు అనుగుణంగా లేకపోతే ఆశ్చర్యపడకండి అని ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సెన్ ఒకసారి బోధించారు. ఇవి మనం ప్రార్థనలో మోకరించినప్పుడు, నేర్చుకోవలసిన మరియు అణకువతో ఉండవలసిన క్షణాలు అని ఆయన చెప్పారు. విశ్వాసంతో, దేవునిపై నమ్మకంతో, కాలం గడిచేకొద్దీ మన పరలోక తండ్రి నుండి మరింత ఆత్మీయ స్పష్టతను మనం పొందుతామని తెలుసుకొని మనం ముందుకు సాగుతాం.”

అన్ని సమయాల్లో, మనం చూపే శ్రద్ధ మరియు కృషికి అనుగుణంగా దేవుడు తన వాక్యమును తెలియజేస్తారు అనే అల్మా బోధనను గుర్తుంచుకోవడం మనకు సహాయపడుతుంది. మనం దేవుని వాక్యాన్ని లక్ష్యపెడితే, మనం ఎక్కువ పొందుతాము; మనం ఆయన సలహాను విస్మరిస్తే, మనకు ఏదీ లేనంత వరకు మనం తక్కువగా మరీ తక్కువగా పొందుతాము. ఈ జ్ఞానం కోల్పోవడం అంటే, సత్యం తప్పు అని కాదు; బదులుగా, మనం దానిని అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని కోల్పోయామని అర్థం.

రక్షకుని వైపు చూడండి

కపెర్నహూములో, రక్షకుడు తన గుర్తింపు మరియు సువార్తసేవ గురించి బోధించారు. చాలామంది ఆయన వాక్యమును వినడాన్ని కష్టంగా భావించారు, అది వారిని వెనుదిరిగి వెళ్ళేలా చేసింది మరియు “ఎన్నడును వారు ఆయనను [వెంబడింపలేదు].”

వారు ఎందుకు వెళ్ళిపోయారు?

ఎందుకంటే ఆయన చెప్పింది వారికి నచ్చలేదు. కాబట్టి, వారి స్వంత తీర్పును విశ్వసించి, వారు నిలిచియుంటే వచ్చే ఆశీర్వాదాలను తిరస్కరిస్తూ వారు వెళ్ళిపోయారు.

మన అహంకారం మనకు మరియు నిత్య సత్యానికి మధ్య రావడం సులభం. మనకు అర్థం కానప్పుడు, మనం కొంత విరామం తీసుకోవచ్చు, మన భావాలను స్థిరపడనిచ్చి, ఆపై ఎలా స్పందించాలో ఎంచుకోవచ్చు. “ప్రతి ఆలోచనలో [ఆయన] వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు,” అని యేసు మనకు బోధించారు. మనం రక్షకునిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు, మన విశ్వాసం మన ఆందోళనలను అధిగమించడం ప్రారంభించగలదు.

అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ మనల్ని చేయమని ప్రోత్సహించినట్లుగా: “దయచేసి, మీరు మీ విశ్వాసాన్ని సందేహించే ముందు మీ సందేహాలను సందేహించండి. మనల్ని ఖైదీలుగా ఉంచి, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా వచ్చే దైవిక ప్రేమ, శాంతి మరియు బహుమతుల నుండి మనలను దూరంగా ఉంచే సందేహాన్ని ఎన్నటికీ అనుమతించకూడదు.”

నిలిచియుండే వారికి దీవెనలు వస్తాయి

ఆ రోజు శిష్యులు రక్షకుని నుండి దూరంగా వెళ్ళిపోతుండగా, ఆయన పండ్రెండుమందిని ఇలా అడిగారు, “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?”

పేతురు ఇలా సమాధానమిచ్చాడు:

“ప్రభువా, యెవని యొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.

“నీవే జీవముగల దేవుని కుమారుడవని, క్రీస్తువని మేము విశ్వసించి యెరిగియున్నాము.”

ఇప్పుడు, అపొస్తలులు అదే ప్రపంచంలో జీవించారు మరియు దూరంగా వెళ్లిన శిష్యుల వలె వారు కూడా అదే సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, ఈ క్షణంలో, వారు తమ విశ్వాసాన్ని ఎన్నుకున్నారు మరియు దేవుణ్ణి నమ్మారు, తద్వారా నిలిచియుండు వారికి దేవుడిచ్చు దీవెనలను కాపాడుకున్నారు.

బహుశా మీరూ, నాలాగే, కొన్నిసార్లు ఈ నిర్ణయం యొక్క ఇరువైపులా మిమ్మల్ని కనుగొంటారు. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం లేదా స్వీకరించడం మనకు కష్టంగా అనిపించినప్పుడు, మనం ఎక్కడ ఉన్నా, మనల్ని మనలాగే ఆయన ప్రేమిస్తున్నారని గుర్తుంచుకోవడం ఓదార్పునిస్తుంది. మరియు ఆయన మన కొరకు మెరుగైనదే కలిగియున్నారు. మనము ఆయనను వేడుకుంటే, ఆయన మనకు సహాయం చేస్తారు.

ఆయనను చేరుకోవడం కష్టమే అయినప్పటికీ, తన కుమారునికి స్వస్థత కోరిన తండ్రికి రక్షకుని ద్వారా చెప్పబడినట్లు, “నమ్ముట నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే.” మన పోరాట క్షణాలలో మనం కూడా “[మాకు] అపనమ్మకముండకుండ సహాయము చేయుమని” బిగ్గరగా కేకలు వేయవచ్చు.

మన ఇష్టాన్ని ఆయన చిత్తానికి సమర్పించడం

ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ ఒకసారి ఇలా బోధించారు, “ఒకరి ఇష్టాన్ని సమర్పించడం నిజంగా దేవుని బలిపీఠం మీద మనం ఉంచవలసిన ఏకైక వ్యక్తిగత విషయం.” తన జనులు “చిన్నపిల్లవాని వలె విధేయుడై, సాత్వికుడై, వినయము మరియు సహనము కలిగి ప్రేమతో నిండి, పిల్లవాడు తన తండ్రికి లోబడునట్లుగా అతనిపై విధించుటకు తగినవని ప్రభువు చూచు విషయములన్నిటికి లోబడుటకు ఇష్టపడు పిల్లవాని వలె” మారాలని రాజైన బెంజమిన్ ఆత్రుతగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.

ఎప్పటిలాగే, రక్షకుడు మనకు పరిపూర్ణమైన ఉదాహరణగా ఉన్నారు. బరువెక్కిన హృదయంతో, ఆయన చేయవలసిన బాధాకరమైన పని గురించి తెలిసి కూడా, మెస్సీయగా తన నియమితకార్యమును నెరవేర్చి, మీకు మరియు నాకు నిత్యత్వము యొక్క వాగ్దానాన్ని అందించడం కోసం ఆయన తన తండ్రి చిత్తానికి లోబడ్డారు.

మన చిత్తాన్ని దేవునికి సమర్పించాలనే ఎంపిక మన శిష్యరికం యొక్క హృదయంలో ఉన్న విశ్వాసపు చర్య. ఆ ఎంపిక చేయడంలో, మన కర్తృత్వము తగ్గించబడలేదని మనం కనుగొంటాము; బదులుగా, మనం మరెక్కడా కనుగొనలేని ఉద్దేశ్యం, ఆనందం, శాంతి మరియు నిరీక్షణను తీసుకువచ్చే పరిశుద్ధాత్మ ఉనికి ద్వారా ఆ ఎంపిక వృద్ధిచేయబడింది మరియు ప్రతిఫలమివ్వబడింది.

చాలా నెలల క్రితం, ఒక స్టేకు అధ్యక్షుడు మరియు నేను అతని స్టేకులో ఉన్న ఒక సహోదరిని మరియు ఆమె యౌవన కుమారుడిని సందర్శించాము. సంఘానికి దూరంగా చాలా సంవత్సరాలున్న తర్వాత, కష్టమైన మరియు ప్రతికూలమైన మార్గాల్లో తిరుగులాడుతూ, ఆమె తిరిగి వచ్చింది. మా సందర్శన సమయంలో, ఆమె ఎందుకు తిరిగి వచ్చిందని మేము ఆమెను అడిగాము.

“నేను నా జీవితాన్ని గందరగోళానికి గురిచేశాను మరియు నేను ఎక్కడ ఉండాలో నేను తెలుసుకున్నాను” అని ఆమె చెప్పింది.

అప్పుడు నేను, ఆ ప్రయాణంలో ఏమి నేర్చుకున్నారని ఆమెను అడిగాను.

కొంత భావోద్వేగంతో, సంఘానికి రాకూడదనే అలవాటును మానుకోవడానికి చాలా కాలం పాటు సంఘానికి హాజరు కావాలని మరియు తను ఎక్కడ ఉండాలనుకుంటుందో అక్కడ ఉండాల్సిన అవసరం ఉందని తాను తెలుసుకున్నట్లు ఆమె పంచుకుంది. ఆమె తిరిగి రావడం అనేది అంత సులభతరం కాదు, కానీ తండ్రి యొక్క ప్రణాళికపై విశ్వాసాన్ని ఆమె సాధన చేసినప్పుడు, ఆత్మ తిరిగి వచ్చినట్లు ఆమె భావించింది.

మరియు అప్పుడు ఆమె, “దేవుడు మంచివాడని, ఆయన మార్గాలు నాకంటే మంచివని నాకు నేనుగా నేర్చుకున్నాను” అని చెప్పింది.

మనల్ని ప్రేమించే మన నిత్య తండ్రి అయిన దేవుని గురించి మరియు మనల్ని రక్షించిన ఆయన కుమారుడైన యేసు క్రీస్తు గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. మన బాధలు, సవాళ్లు వారికి తెలుసు. వారు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టరు మరియు మనకు ఎలా సహాయం చేయాలో వారికి సంపూర్ణముగా తెలుసు. మనం అందరికంటే, అన్నింటికంటే ఎక్కువగా వారిని నమ్మినప్పుడు మనం ధైర్యం తెచ్చుకోగలము. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.