నీవు శుద్ధుడవు కమ్ము
అనుదిన పశ్చాత్తాపం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు యొక్క మార్గనిర్దేశాన్ని గుర్తించడానికి అనుమతిస్తుంది.
నాకు దాదాపు ఐదు సంవత్సరాల వయస్సున్నప్పుడు, నేను కోట్ డి ఐవరీలో ఉన్న మా చిన్న గ్రామంలోని చర్చి వెనుక నా స్నేహితులతో ఫుట్‌బాల్ ఆడుతున్నాను. రక్షకుని రాక కోసం సిద్ధపడుతూ వారి దుస్తులను శుద్ధి చేసుకోమని తన సమూహానికి ప్రసంగీకుడు ఇచ్చిన పిలుపు నాకు స్పష్టంగా గుర్తున్నది. చిన్నవానిగా ఉండటం వలన, నేను ఈ పిలుపును ఉన్నదున్నట్లుగా తీసుకున్నాను. నా చిన్న కాళ్ళు నన్ను మోయగలిగనంత వేగంగా ఇంటికి పరిగెత్తాను మరియు నేను మచ్చ లేకుండా ఉండి మరుసటి రోజు రక్షకుని రాక కోసం సిద్ధపడియుండేలా నా దుస్తులు కొన్నిశుభ్రం చేయమని మా అమ్మను బ్రతిమాలాను. మా అమ్మ రక్షకుని తటస్థమైన రాకడ గురించి సందేహస్పదంగా ఉన్నప్పటికినీ, ఆమె నా మంచి దుస్తులను ఉతికింది.
తరువాత ఉదయం, నేను ఇంకా కాస్త తడిగా ఉన్న దుస్తులను ధరించాను మరియు రక్షకుని రాక గురించి ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూసాను. రోజు గడిచిపోయింది, ఏమీ జరగకపోవడంతో, నేను సమావేశ గృహానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. చర్చి ఖాళీగా ఉన్నది మరియు రక్షకుడు రాకపోవడం చూసి నేను చాలా నిరాశ చెందాను. నేను నెమ్మదిగా ఇంటికి నడిచి వెళుతున్నప్పుడు నా భావాలను మీరు ఊహించగలరు.
సంవత్సరాల తరువాత, కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో చేరడానికి సిద్ధపాటులో మిషనరీ పాఠాలను నేను తీసుకుంటున్నప్పుడు, నేను దీనిని చదివాను: “మరియు అపరిశుద్ధమైనదేదియు ఆయన రాజ్యములోనికి ప్రవేశించలేదు; కావున వారి విశ్వాసము, సమస్త పాపముల విషయమై వారి పశ్చాత్తాపము మరియు అంతము వరకు ఉన్న వారి విశ్వాస్యతను బట్టి నా రక్తమందు వారి వస్త్రములను కడుగుకొనిన వారు తప్ప, మరెవరూ ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించలేరు.”
ఆ సమయంలో నేను పొందిన స్పష్టీకరణ చాలా సంవత్సరాల క్రితం నా చిన్న మనస్సుకు అర్ధముకాని ముఖ్యమైన సత్యాన్ని అర్ధము చేసుకోవడానికి నాకు సహాయపడింది. బోధకుని సందేశము ఆత్మీయ పరిశుద్ధతపై కేంద్రీకరించబడింది. పశ్చాత్తాపపడమని, వారి జీవితాలలో మార్పులు చేసుకోవాలని, మరియు విమోచన కోసం రక్షకుని వైపు తిరగాలని అతడు సమూహాన్ని ప్రేరేపించాడు.
మన పరలోక తండ్రి మన మర్త్య ప్రయాణాన్ని మరియు మన జీవితాలలో పాపము యొక్క అనివార్యతను గ్రహించారు. మన అతిక్రమముల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి రక్షకుడిని ఆయన దయ చేసినందుకు నేను లోతైన కృతజ్ఞతను కలిగియున్నాను. రక్షకుని విమోచించు త్యాగము ద్వారా, మనలో ప్రతిఒక్కరం పశ్చాత్తాపపడగలము మరియు క్షమాపణను కోరి, శుద్ధులము కాగలము. పశ్చాత్తాము, సువార్త యొక్క ప్రధాన సూత్రము, మన జీవితపు కష్టాలను నిర్వహిస్తున్నప్పుడు మన ఆత్మీయ వృద్ధికి మరియు స్థిరత్వముకు ముఖ్యమైనది.
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశంలో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సంఘము యొక్క ప్రతి సభ్యుడు అనుదినం పశ్చాత్తాపపడుట వలన కలిగే ఆనందాన్ని అనుభవించమని ఆహ్వానించారు. ఆయన ఇలా చెప్పారు:
“దయచేసి భయపడవద్దు లేదా పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేయవద్దు. సాతాను మీ కష్టాలను చూసి ఆనందిస్తాడు. దానిని తక్కువ చేయండి. అతడి ప్రభావాన్ని మీ జీవితం నుండి తీసివేయండి! ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించడంలోని ఆనందాన్ని అనుభవించడాన్ని ఈరోజే ప్రారంభించండి. రక్షకుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తారు, అయతే ప్రత్యేకంగా మనం పశ్చాత్తాపపడినప్పుడు ప్రేమిస్తారు. …
నిబంధన మార్గము నుండి మీరు సుదూరములో లేదా బహుదూరములో ఉన్నారని మరియు తిరిగి రావడానికి దారిలేదని మీరు భావిస్తే, అది నిజం కాదు.”
మీరు పూర్తిగా పశ్చాత్తాపపడనిది ఏదైనా ఉన్నయెడల, మీ పశ్చాత్తాపాన్ని వాయిదా వేయవద్దన్న అధ్యక్షులు నెల్సన్ పిలుపును మీరు లక్ష్యముంచాలని నేను ప్రొత్సహిస్తున్నాను. ఈ ప్రక్రియలో నిమగ్నము కావడానికి కొంత ధైర్యము అవసరము; అయినప్పటికిని, నిజాయితీగల పశ్చాత్తాపము నుండి వచ్చే ఆనందము సమస్త జ్ఞానమును మించినది. పశ్చాత్తాపము ద్వారా, మన అపరాద భారములు తీసివేయబడతాయి మరియు శాంతి, ప్రశాంతత యొక్క భావన చేత భర్తీ చేయబడతాయి. మనం మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడినప్పుడు, రక్షకుని రక్తము చేత మనం శుద్ధి చేయబడతాము, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలు మరియు ప్రభావాలకు మన సున్నితత్వాన్ని పెంచుకుంటాము.
నా నిత్య సహవాసి వినికిడి లోపంతో జన్మించింది, మరియు ఫలితంగా, వినుటకు సహాయపడే సాధనాలు తప్పక ధరించాలి. దుమ్ము, చెమట ఈ సాధనాల పనితనాన్ని ప్రభావితం చేయవచ్చు, కనుక ఆమె ఉపకరణాలను ధరించకముందు ప్రతి ఉదయం కనెక్టింగ్ ట్యూబ్‌లను శ్రద్ధగా శుభ్రపరచడం నేను గమనించాను. ఈ సాధారణమైన మరియు స్థిరమైన క్రమంగా చేసేది ఏదైనా ధూళి, తేమ లేదా సంక్షేపణను తొలగిస్తుంది, ఆవిధంగా ఆమె వినే సామర్ధ్యం మరియు ప్రభావవంతంగా సంభాషించే సామర్ధ్యం మెరుగుపడతాయి. ఆమె రోజూ చేసేవిధంగా చేయనప్పుడు, రోజంతా ఆమె వినే సామర్ధ్యం కష్టమవుతుంది; మాట్లాడే పదాలు క్రమగా సామర్ధ్యం తగ్గి, చివరికి వినబడవు. ప్రతిరోజు తన వినే సాధనాన్ని శుభ్రపరచుట ఆమె స్పష్టంగా వినడాన్ని సాధ్యపరచినట్లుగా, అనుదిన పశ్చాత్తాపము పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు యొక్క నడిపింపును గ్రహించడానికి మనకు సాధ్యపరుస్తుంది.
ప్రభువు యొక్క మర్త్య పరిచర్య ముగింపులో, గెత్సెమనే వనముకు ఆయన వెళ్ళకముందు రాబోయే శ్రమలను ఎదుర్కోవడానికి ఆయన తన శిష్యులను సిద్ధపరిచారు. “ఆదరణ కర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును” అని చెప్తూ ఆయన వారికి అభయమిచ్చారు.
మృదువైన, అంతర్గత స్వరాన్ని వినే ప్రతి వ్యక్తిని హెచ్చరించి, నడిపించి, మరియు దారిచూపడం పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన విధులలో ఒకటి. వినే సాధనం యొక్క బ్లాక్ చేయబడిన కమ్యూనికేషన్ ట్యూబ్‌లు సరిగా పనిచేయడాన్ని ఆటంకపరచినట్లుగా, మన పరలోక తండ్రితో మనకున్న ఆత్మీయ సంబంధం కూడా బలహీనపడవచ్చు, ఇది ప్రమాదకరమైన దురభిప్రాయాలకు లేదా ఆయన సలహాను పాటించడం విఫలం కావడానికి దారితీస్తుంది. ఇంటర్నెట్ అవతరణ మునుపెన్నడూ లేనంతగా సమాచారాన్ని ఎక్కువ అందుబాటులోనికి తెచ్చింది. ఇది మనల్ని నడిపింపు కోసం దేవుని వైపు కంటే లోక ప్రభావాలను వెదకడం వైపు మళ్ళేలా చేస్తుంది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “రాబోయ దినములలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపించి, దారిచూపి, ఆదరించే నిరంతర ప్రభావము లేకుండా, ఆత్మీయంగా బ్రతికియుండుట సాధ్యము కాదు.”
మన నిర్ధారణ సమయమందు పరిశుద్ధాత్మ వరమును మనలో ప్రతిఒక్కరం పొందగలరని నేను కృతజ్ఞత కలిగియున్నాను. అయినప్పటికీ అధ్యక్షుడు డాలిన్ హెచ్. ఓక్స్ ఇలా హెచ్చరించారు “పరిశుద్ధాత్మ యొక్క వరము ద్వారా లభ్యమయ్యే దీవెనలు యోగ్యతపై ఆధారపడి ఉంటాయి [మరియు] ‘ప్రభువు యొక్క ఆత్మ అపరిశుద్ధమైన ఆలయములలో నివసించదు’ [హీలమన్ 4:24].”
ప్రవక్తలు మరియు అపొస్తులుల యొక్క నడిపింపును అనుసరించడానికి తెలివిగా ఎంపిక చేసినప్పుడు, పరిశుద్ధాత్మను ఒక స్థిరమైన సహవాసిగా కలిగియుండటానికి మన సామర్ధ్యము వృద్ధి చెందుతుంది. మన పరలోక తండ్రి చిత్తానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంలో ఆలోచనలు, భావనలను ప్రేరేపిస్తూ, పరిశుద్ధాత్మ స్పష్టతను ఇస్తుంది. పరిశుద్ధాత్మను ఒక స్థిరమైన సహవాసిగా కలిగియుండుట మన ఆత్మీయ అభివృద్ధికి ముఖ్యమైనది.
యూటాలో సాల్ట్‌లేక్ గ్రాంగర్ పశ్చిమ స్టేకులో స్టేకు సమావేశంలో అధ్యక్షత్వం వహించడానికి నేను ఈ మధ్య నియమించబడ్డాను. ఆ సంఘటన సమయంలో, నీతిగా జీవించుట మరియు ప్రతిరోజు పశ్చాత్తాపము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలను గ్రహించే తన సామర్ధ్యాన్ని శ్రద్ధగా పెంపొందించిన ఒక స్టేకు అధ్యక్షుడిని నేను కలిసాను. మా పరిచర్య ప్రయత్నాలలో భాగంగా, మేము మూడు కుటుంబాలను దర్శించడాన్ని సమన్వయపరిచాము. మా చివరి సందర్శనాన్ని పూర్తి చేసిన తరువాత, మా తదుపరి నియామకానికి ముందు దాదాపు 30 నిముషాలు మిగిలి ఉన్నాయని మేము కనుగొన్నాము. మేము స్టేకు కేంద్రానికి తిరిగి ప్రయాణించినప్పుడు, అధ్యక్షులు చెస్‌నట్ మరొక కుటుంబాన్ని దర్శించాలనే ప్రేరణను పొందారు. ఈ ప్రేరణను అనుసరించాలని మేము ఇరువురం అంగీకరించాము.
మేము జోన్స్ కుటుంబాన్ని దర్శించడానికి ముందుకు సాగాము, అక్కడ సహోదరి జోన్స్ వ్యాధితో మంచం పట్టి ఉండటాన్ని మేము కనుగొన్నాము. ఆమెకు ఒక యాజకత్వ దీవెన అవసరమని స్పష్టమయ్యింది. ఆమె అనుమతితో, మేము ఆమెకు దీవెన ఇచ్చాము. మేము వెళ్ళడానికి సిద్ధపడుతుండగా, తనకు దీవెన తక్షణమే అవసరమని మాకు ఎలా తెలుసని సహోదరి జోన్స్ అడిగింది. సత్యమేదనగా, మాకు తెలియదు. అయినప్పటికినీ, ఆమె అవసరతలను ఎరిగిన మన పరలోక తండ్రికి తెలుసు మరియు ఆమె ఇంటిని దర్శించమని అధ్యక్షులు చెస్‌నట్‌ను ప్రేరేపించారు. మిక్కిలి నిమ్మళమైన స్వరము యొక్క నడిపింపును మనం గ్రహించినప్పుడు, అవసరతలో ఉన్నవారికి ఎక్కువ ప్రభావవంతంగా పరిచర్య చేయడానికి మనము మంచిగా సన్నద్ధమై ఉంటాము.
దయ మరియు ప్రేమగల పరలోక తండ్రి గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు మానవాళి రక్షకుడు మరియు విమోచకుడు. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము వాస్తవమని, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అనుసరించడం మనం నేర్చుకున్నప్పుడు, ఆయన మనల్ని పశ్చాత్తాపపడటానికి మరియు మన జీవితాలలో రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము యొక్క శక్తిని ఉపయోగించడానికి నడిపిస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను. నేడు భూమి మీద సమస్త యాజకత్వ తాళపుచెవులతో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రభువు యొక్క జీవిస్తున్న, నిజమైన ప్రవక్త. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.