యెహోవాతో మాట్లాడిన మనిషి
జోసెఫ్ స్మిత్ “ఈ చివరి యుగాన్ని ప్రారంభించేందుకు దీవించబడ్డాడు,” మరియు అతను అలా చేసినందుకు మనం దీవించబడ్డాము.
ఈ రోజు మరియు ఎల్లప్పుడూ యేసు క్రీస్తు గురించి సాక్ష్యమివ్వడమే నా ఉద్దేశ్యం, ఆయన దేవుని కుమారుడు, సృష్టికర్త మరియు లోక రక్షకుడు, మనల్ని విడిపించువాడు మరియు మన విమోచకుడు. “యేసు క్రీస్తు గురించి అపొస్తలులు మరియు ప్రవక్తల యొక్క సాక్ష్యములు మన మతము యొక్క ప్రధాన సూత్రములు” కాబట్టి, ఈ రోజు నేను రక్షకుని గురించిన నా జ్ఞానం మరియు సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను, ఎందుకంటే ఈ సాక్ష్యము ఒక ముఖ్య అపొస్తలుడు మరియు ప్రవక్త యొక్క జీవితం మరియు బోధనల ద్వారా బలోపేతం చేయబడి, హెచ్చించబడింది.
జ్ఞానం యొక్క ప్రారంభం
1820 వసంతకాలం ప్రారంభంలో ఒక అందమైన నిర్మలమైన ఉదయాన, 14 ఏళ్ల జోసెఫ్ స్మిత్ తన పాపముల గురించి ప్రార్థించడానికి మరియు ఏ సంఘములో చేరాలో అడగడానికి తన కుటుంబానికి సమీపంలో ఉన్న చెట్ల వనములోకి ప్రవేశించాడు. అచంచలమైన విశ్వాసంతో చేసిన అతని హృదయపూర్వక ప్రార్థన తండ్రి మరియు కుమారునితో సహా విశ్వంలోని అత్యంత బలమైన శక్తుల దృష్టిని ఆకర్షించింది. మరియు అపవాదిని కూడా. వీరిలో ప్రతి ఒక్కరికీ ఆ ప్రార్థన పట్ల మరియు ఆ బాలుని పట్ల తీవ్రమైన ఆసక్తి ఉంది.
మనం ఇప్పుడు మొదటి దర్శనము అని పిలుస్తున్న ఈ దర్శనం, ఈ చివరి యుగములో అన్ని విషయాల పునఃస్థాపనకు నాంది పలికింది. కానీ జోసెఫ్ కొరకు, ఈ అనుభవం వ్యక్తిగతమైనది మరియు సన్నాహకమైనది కూడా. అతను కోరుకొనేది క్షమాపణ మరియు దిశా నిర్దేశం మాత్రమే. ప్రభువు అతనికి రెండింటిని ఇచ్చారు. “ఏ [ సంఘములోనూ] చేరవద్దు” అనే సూచన నిర్దేశించబడింది. “నీ పాపములు క్షమింపబడినవి” అనే మాటలు విమోచన కలిగించే మాటలు.
ఆ మొదటి దర్శనం నుండి మనం నేర్చుకోగల సుందరమైన సత్యాలలో, బహుశా జోసెఫ్ చెప్పిన ఈ మాట ప్రధానంగా తీసుకొనవలసిన అంశం, “జ్ఞానము కొదువగా ఉన్నవాడు దేవుని అడిగి, గద్దింపబడక పొందవచ్చునని యాకోబు చెప్పిన సాక్ష్యము యథార్థమని నేను తెలుసుకొంటిని.”
ఒక విద్యావంతుడు ఇలా పేర్కొన్నాడు: “ఈ రోజు మొదటి దర్శనం యొక్క నిజమైన ప్రతిధ్వని ఏమిటంటే, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇవ్వడం దేవుని స్వభావం అని తెలుసుకోవడం. … పరిశుద్ధ వనములో జోసెఫ్ స్మిత్‌కు తనను తాను కనబరచుకున్న దేవుడు కష్టకాలంలోనున్న యౌవనస్థులకు సమాధానం ఇచ్చే దేవుడు.”
వనములో జోసెఫ్ యొక్క అనుభవం అతనికి జీవితాంతం క్షమాపణ మరియు దిశానిర్దేశం కోసం అడిగే విశ్వాసాన్ని ఇచ్చింది. అతని అనుభవం నా జీవితాంతం కూడా క్షమాపణ మరియు దిశానిర్దేశం కోరడానికి నాకు విశ్వాసాన్ని ఇచ్చింది.
క్రమమైన పశ్చాత్తాపము
1823 సెప్టెంబరు 21న, జోసెఫ్ క్షమాపణ కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాడు, మూడు సంవత్సరాల క్రితం వనములో తన అనుభవం ద్వారా, పరలోకం మళ్లీ ప్రతిస్పందిస్తుందని నమ్మకంగా ఉన్నాడు. మరియు అలా జరిగింది. జోసెఫ్‌కు బోధించడానికి మరియు అతను దేవుని వరము మరియు శక్తిచేత అనువదించబోయే పురాతన గ్రంథము—మోర్మన్ గ్రంథము గురించి అతనికి తెలియజేయడానికి, ప్రభువు మొరోనై అనే ఒక దేవదూతను పంపారు.
అది జరిగిన దాదాపు 13 సంవత్సరాల తర్వాత, జోసెఫ్ మరియు ఆలీవర్ కౌడరీలు కొత్తగా ప్రతిష్ఠాపించబడిన కర్ట్‌లాండ్ దేవాలయములో గంభీరమైన, నిశ్శబ్ద ప్రార్థనలో మోకరిల్లారు. వారు దేని కొరకు ప్రార్థించారో మనకు తెలియదు, కానీ వారి ప్రార్థనలు క్షమాపణ కొరకు ఒక అభ్యర్థనను కలిగియుండవచ్చు, ఎందుకంటే వారు లేచినప్పుడు, రక్షకుడు ప్రత్యక్షమై, “ఇదిగో, మీ పాపములు క్షమించబడియున్నవి; మీరు నా యెదుట పరిశుద్ధముగానున్నారు” అని ప్రకటించారు.
ఈ అనుభవమైన కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత, జోసెఫ్ మరియు ఆలీవర్ మళ్లీ పాపం చేయవచ్చు. మళ్లీ మళ్లీ చేయవచ్చు. కానీ ఆ క్షణంలో, ఆ క్షణం కోసం, వారి విన్నపానికి ప్రతిస్పందనగా మరియు జరగబోయే యాజకత్వ తాళపుచెవుల మహిమాన్విత పునరుద్ధరణకు సిద్ధపాటుగా, యేసు వారిని పాపరహితులుగా చేశారు.
జోసెఫ్ యొక్క క్రమమైన పశ్చాత్తాప జీవితం “[నేను] కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరే” నమ్మకాన్ని నాకు ఇచ్చింది. యేసు క్రీస్తు నిజంగా “క్షమించే స్వభావం” గలవారని నేను తెలుసుకున్నాను. ఖండించడం ఆయన ఉద్దేశం లేదా స్వభావం కాదు. ఆయన రక్షించటానికి వచ్చారు.
ప్రభువును అడిగి తెలుసుకొనుట
“అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని” దేవుడు చేసిన వాగ్దానంలో భాగంగా ప్రభువు, జోసెఫ్ స్మిత్ ద్వారా, మోర్మన్ గ్రంథమును మరియు ఇతర బయల్పాటులను కలిగియున్న ఆయన సంపూర్ణ సువార్తను ముందుకు తెచ్చారు. జోసెఫ్ పదే పదే ప్రభువును అడిగి మార్గనిర్దేశం కోరడం వలన ముఖ్యమైన సత్యాలకు స్పష్టత మరియు సంపూర్ణత లభించాయి. వీటిని పరిగణించండి:
-
“స్పర్శించగలుగు మనుష్య శరీరమువలె” మాంసము, ఎముకలు గల శరీరమును తండ్రి మరియు కుమారుడు కలిగియుండెను.
-
యేసు మన పాపములను మాత్రమే కాకుండా మన రోగములను, శ్రమలను మరియు బలహీనతలను కూడా తనపై తీసుకున్నారు.
-
ఆయన ప్రాయశ్చిత్తం చాలా బాధాకరమైనది, అది ఆయన యొక్క ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారేలా చేసింది.
-
“మనము చేయగలిగినది చేసిన తర్వాత” కూడా మనము ఆయన కృప చేతనే రక్షింపబడియున్నాము.
-
మనం క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, ఆయన మన పాపములను క్షమించడమే కాకుండా, మన స్వభావాన్ని కూడా మారుస్తారు, తద్వారా “మనము చెడు చేయుటకు ఇక ఏ మాత్రము కోరుకొనము.”
-
క్రీస్తు ఎల్లప్పుడూ దేవాలయాలను నిర్మించమని తన జనులను ఆజ్ఞాపిస్తారు, అక్కడ ఆయన తనకుతానుగా ప్రత్యక్షమవుతారు మరియు మహోన్నత స్థలమునుండి శక్తిని ప్రసాదిస్తారు.
ఈ విషయములన్నీ నిజమైనవి మరియు అవసరమైనవని నేను సాక్ష్యమిస్తున్నాను. దిశానిర్దేశం కోసం జోసెఫ్ యొక్క పునరావృత అభ్యర్థనలకు ప్రతిస్పందనగా జోసెఫ్ స్మిత్ ద్వారా యేసు క్రీస్తు పునఃస్థాపించిన సంపూర్ణతలో కొంత భాగాన్ని మాత్రమే అవి సూచిస్తాయి.
దేవుని రాజ్యం యొక్క నిరంతర పురోగతి
1842లో, జోసెఫ్ ఈ చివరి యుగములో జరుగబోయే అద్భుతమైన విషయాల గురించి వ్రాసాడు. మన కాలంలో, “పరలోక యాజకత్వం భూసంబంధమైన వారితో ఐక్యమై, ఆ గొప్ప ఉద్దేశాలను నెరవేరుస్తుంది; మరియు దేవుని రాజ్యము యొక్క పురోగతి కొరకు మనం ఒక ఉమ్మడి కారణంతో ఐక్యంగా ఉన్నప్పుడు, పరలోక యాజకులు నిష్క్రియా ప్రేక్షకులుగా వుండరు” అని అతడు ప్రకటించాడు.
అతని స్నేహితుడైన బెంజమిన్ జాన్సన్‌కు జోసెఫ్ ఇలా చెప్పాడు, “బెంజమిన్, [నేను మరణిస్తే] నేను నీకు దూరంగా ఉండను మరియు తెరకు అవతలి వైపున ఉంటే, అప్పటికీ దేవుని రాజ్యం యొక్క నిరంతర పురోగతి కొరకు అధికమైన శక్తితో నేను నీతో కలిసి పనిచేస్తాను.”
1844 జూన్ 27న, జోసెఫ్ స్మిత్ మరియు అతని సహోదరుడు హైరమ్ హత్య చేయబడ్డారు. జోసెఫ్ యొక్క శరీరం విశ్రాంతి తీసుకుంది, కానీ అతని సాక్ష్యం ప్రపంచమంతటా మరియు నా ఆత్మలో ప్రతిధ్వనిస్తూనే ఉంది:
“నేనొక దర్శనమును చూచితిని; దానిని నేనెరుగుదును, దేవుడు దానిని యెరిగియున్నాడని నేనెరుగుదును, దానిని నేను తృణీకరించలేను.”
“నేను పరిపూర్ణుడనని నేను మీకు ఎప్పుడూ చెప్పలేదు; కాని నేను బోధించిన బయల్పాటులలో ఎలాంటి లోపం లేదు.”
“ఆయన చనిపోయాడని, సమాధి చేయబడి, మూడవ రోజు మరలా తిరిగి లేచాడని మరియు పరలోకానికి అధిరోహించాడని యేసు క్రీస్తు గురించి అపొస్తలులు మరియు ప్రవక్తల యొక్క సాక్ష్యములు మన మతము యొక్క ప్రధాన సూత్రములు; మన మతమునకు సంబంధించిన మిగిలిన విషయాలన్నీ ఈ సత్యముకు అనుబంధములు మాత్రమే.”
బాప్తిస్మమిచ్చు యోహాను గురించి చెప్పబడిన దానిని జోసెఫ్ స్మిత్ గురించి కూడా చెప్పవచ్చు: “దేవుని నుండి పంపబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు [జోసెఫ్]. … అతడు ఆ వెలుగైయుండలేదు గాని “అతని మూలముగా అందరు విశ్వసించునట్లు” ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను.”
నేను నమ్ముతున్నాను. యేసే క్రీస్తు, సజీవుడగు దేవుని కుమారుడని నేను నిశ్చయముగా నమ్ముతున్నాను. జీవముగల దేవుడు మన ప్రేమగల తండ్రి అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇది నాకు తెలుసు ఎందుకంటే ప్రభువు స్వరం నాతో మాట్లాడింది, అలాగే జోసెఫ్ స్మిత్‌తో సహా అతని సేవకులు, అపొస్తలులు మరియు ప్రవక్తల స్వరం కూడా.
జోసెఫ్ స్మిత్ దేవుని ప్రవక్త అని, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సాక్షి మరియు సేవకుడని నేను సాక్ష్యమిస్తున్నాను. అతను “ఈ చివరి యుగాన్ని ప్రారంభించేందుకు దీవించబడ్డాడు” మరియు అతను అలా చేసినందుకు మనం దీవించబడ్డాము.
“నా సేవకుడైన జోసెఫ్ ప్రక్కన నమ్మకముగా నిలువుము” అని ప్రభువు ఆలీవర్‌ను మరియు మనందరినీ ఆజ్ఞాపించారు. ప్రభువు తన సేవకుడైన జోసెఫ్‌కు మరియు అతని ద్వారా జరిగిన పునరుద్ధరణకు అండగా నిలిచారని నేను సాక్ష్యమిస్తున్నాను.
అతను చెప్పిన ఆ పరలోక యాజకత్వంలో జోసెఫ్ స్మిత్ ఇప్పుడు భాగమయ్యాడు. అతని స్నేహితునికి వాగ్దానం చేసినట్లుగా, దేవుని రాజ్యం యొక్క నిరంతర పురోగతి కొరకు అధికమైన శక్తితో తెరకు మరొక వైపున అతను ఇప్పటికీ మనతో కలిసి పని చేస్తున్నాడు. ఆనందంతో, కృతజ్ఞతాపూర్వకంగా, “యెహోవాతో మాట్లాడిన మనిషిని స్తుతిస్తూ నేను నా స్వరం ఎత్తుతాను.” మరియు అన్నిటికంటే ముఖ్యంగా, ఆ మనిషితో మాట్లాడిన యెహోవాకు స్తోత్రం! యేసు క్రీస్తు నామములో, ఆమేన్.