2020–2024
మర్త్యత్వము పనిచేస్తుంది!
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:59

మర్త్యత్వము పనిచేస్తుంది!

మనమందరం సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ, మన ప్రేమగల పరలోక తండ్రి మనం విఫలమవ్వకుండా ఉండేలా సంతోష ప్రణాళికను రూపొందించారు.

చాలా సంవత్సరాలుగా మా వార్డులో ఒక వృద్ధ సహోదరి యొక్క గృహ బోధకుడిగా నాకు బాధ్యత అప్పగించబడింది. ఆమె జీవితం అంత సులభమైనదిగా లేదు. ఆమె అనేక ఆరోగ్య సమస్యలను కలిగియుంది మరియు ఆట స్థలంలో చిన్ననాటి ప్రమాదం కారణంగా జీవితాంతం శారీరక బాధను అనుభవించింది. 32 సంవత్సరాల వయస్సులో విడాకులు తీసుకుంది, అప్పుడు ఆమె పెంచి పోషించవలసిన నలుగురు చిన్న పిల్లలను కలిగియుంది, 50 ఏళ్ల వయస్సులో ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకుంది. ఆమెకు 66 సంవత్సరాలున్నప్పుడు ఆమె రెండవ భర్త మరణించాడు మరియు ఈ సహోదరి అదనంగా 26 సంవత్సరాలు వితంతువుగా జీవించింది.

జీవితాంతం ఆమె సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, అంతము వరకు ఆమె తన నిబంధనల పట్ల విశ్వాసపాత్రంగా ఉంది. ఈ సహోదరి ఆసక్తిగల ఒక వంశపారంపర్య శాస్త్రవేత్త, ఒక దేవాలయ సందర్శకురాలు మరియు కుటుంబ చరిత్రలను సేకరించి వ్రాసే ఒక రచయిత. ఆమె చాలా కష్టమైన పరీక్షలను ఎదుర్కొన్నప్పటికీ మరియు నిస్సందేహంగా కొన్నిసార్లు దుఃఖాన్ని ఒంటరితనాన్ని అనుభవించినప్పటికీ, ఆమె ఉల్లాసకరమైన ముఖవైఖరిని, దయగల మరియు ఆహ్లాదకరమైన వ్యక్తిత్వాన్ని కలిగియుంది.

ఆమె మరణించిన తొమ్మిది నెలల తర్వాత, ఆమె కుమారులలో ఒకరికి దేవాలయంలో ఒక విశేషమైన అనుభవం ఎదురైంది. అతని తల్లి అతని కొరకు ఒక సందేశాన్ని కలిగి ఉందని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అతడు తెలుసుకున్నాడు. ఆమె అతడితో సంభాషించింది, కానీ దర్శనము ద్వారా లేదా వినగల పదాల ద్వారా కాదు. ఈ క్రింది స్పష్టమైన సందేశం అతడి తల్లి నుండి కుమారుని మనస్సులోకి వచ్చింది: “మర్త్యత్వము పనిచేస్తుందని నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరియు [నా జీవితంలో] ప్రతిదీ అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పుడు అర్థమైందని నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను—మరియు అంతా బాగానే ఉంది.”

ఆమె పరిస్థితిని, ఈ సహోదరి భరించిన మరియు అధిగమించిన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ సందేశం మరింత విశేషమవుతుంది.

సహోదర సహోదరీలారా, మర్త్యత్వము పనిచేస్తుంది! ఇది పని చేయడానికే రూపొందించబడింది! మనమందరం సవాళ్లు, హృదయ వేదనలు మరియు కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, మన ప్రేమగల, తెలివైన మరియు పరిపూర్ణమైన పరలోక తండ్రి మనం విఫలమవ్వకుండా ఉండేలా సంతోష ప్రణాళికను రూపొందించారు. ఆయన ప్రణాళిక మన మర్త్య వైఫల్యాలను అధిగమించి ఎదగడానికి మనకు ఒక మార్గాన్ని అందిస్తుంది. “నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే నా కార్యమును మహిమయైయున్నది” అని ప్రభువు చెప్పారు.

ఏది ఏమైనప్పటికీ, మనం ప్రభువు యొక్క “కార్యము మరియు … మహిమ,” “అమర్త్యత్వము మరియు నిత్యజీవము” యొక్క లబ్ధిదారులుగా ఉండాలంటే, మనం ఉపదేశించబడాలని, బోధించబడాలని మరియు కొన్నిసార్లు మన పూర్తి పరిమితుల వరకు—కంసాలి అగ్ని గుండా వెళ్ళాలని తప్పక ఆశించాలి. ఈ ప్రపంచంలోని సమస్యలను, సవాళ్లను మరియు ఇబ్బందులను పూర్తిగా నివారించాలంటే, మర్త్యత్వము పనిచేయడానికి నిజంగా అవసరమైన ప్రక్రియను తప్పించుకొని పోవాలి.

అందువలన, మనకు కష్ట సమయాలు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపడరాదు. మనల్ని పరీక్షించే పరిస్థితులను మరియు నిజమైన దాతృత్వాన్ని, సహనాన్ని అభ్యసించడానికి వీలు కల్పించే వ్యక్తులను మనము ఎదుర్కొంటాము. కానీ మన కష్టాలను మనం భరించాలి మరియు ప్రభువు చెప్పినట్లుగా, ఇది గుర్తుంచుకోవాలి:

“నా కార్యము కొరకు, నా నామము నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు, మరలా దానిని, అనగా నిత్యజీవమును దక్కించుకొనును.

“కాబట్టి మీ శత్రువులను గూర్చి [లేదా మీ సమస్యలు, సవాళ్లు లేదా ఈ జీవితంలోని పరీక్షలను గూర్చి] భయపడకుడి, ఏలయనగా మీరు యోగ్యులుగా కనుగొనబడునట్లు, … నా నిబంధనలో మీరు నిలుతురో లేదోనని అన్ని విషయములలో మిమ్ములను పరీక్షించెదనని … నేను శాసనమును వ్రాసియున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.”

మన సమస్యల గురించి మనం కలవరపడినప్పుడు లేదా చింతిస్తున్నప్పుడు లేదా జీవితంలో ఇతరుల కంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నామని భావించినప్పుడు, ప్రభువు ఇశ్రాయేలీయులతో చెప్పినదానిని మనం గుర్తుచేసుకోవచ్చు:

“మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము.”

లీహై తన కుమారుడైన జేకబ్‌కు బోధించినట్లు:

“నీవు బాధలను, అధిక దుఃఖమును అనుభవించితివి. … అయినప్పటికీ, … [దేవుడు] నీ బాధలను నీ ప్రయోజనము కొరకు ప్రతిష్ఠించును. … అందువలన, నీ విమోచకుని నీతిని బట్టి నీవు విమోచింపబడితివని నేనెరుగుదును.”

ఈ జీవితం ఒక పరీక్షా స్థలం మరియు “కష్టాల చీకటి మేఘాలు మనల్ని చుట్టుముట్టి, మన శాంతిని నాశనం చేసే ప్రమాదం ఉంది కాబట్టి,” జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు సంబంధించి మోషైయ 23లో ఉన్న ఈ సలహాను మరియు వాగ్దానాన్ని గుర్తుంచుకోవడం సహాయకరంగా ఉంటుంది: “అయినను—ఆయన యందు నమ్మికయుంచు వారు అంత్యదినమున పైకెత్తబడుదురు.”

నేను యువకుడిగా ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా గొప్ప మానసిక బాధను మరియు అవమానాన్ని అనుభవించాను, అది మరొకరి అన్యాయమైన చర్యల ఫలితంగా వచ్చింది, అది చాలా సంవత్సరాలపాటు నా స్వీయ-విలువను మరియు ప్రభువు ముందు నా యోగ్యతను ప్రభావితం చేసింది. అయినప్పటికీ, ఈ మర్త్య జీవితంలో మనం ఎలాంటి కష్టాలను అనుభవించవలసి వచ్చినా ప్రభువు మనల్ని బలపరచగలరని మరియు మద్దతివ్వగలరని నేను వ్యక్తిగతంగా సాక్ష్యమిస్తున్నాను.

పౌలు యొక్క అనుభవం మనకు బాగా తెలుసు:

“నాకు [కలిగిన] ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను.

“అది నా యొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.

“అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.”

పౌలు యొక్క “శరీరంలో ముల్లు” ఏమిటో మనకు తెలియదు. అది ఒక శారీరక అనారోగ్యమా, మానసిక లేదా భావోద్వేగ బలహీనతా లేదా ఒక శోధనా అనేది వివరించకూడదని అతను ఎంచుకున్నాడు. కానీ అతను ప్రయాసపడి సహాయం కోసం ప్రభువును వేడుకున్నాడు మరియు చివరికి, ప్రభువు యొక్క బలం మరియు శక్తి అతనికి సహాయం చేశాయని తెలుసుకోవడానికి మనం ఆ వివరాలను తెలుసుకోవలసిన అవసరం లేదు.

పౌలుకు జరిగిన విధముగా, ప్రభువు యొక్క సహాయం ద్వారా నేను మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా బలపడ్డాను, చివరికి చాలా సంవత్సరాల తర్వాత నేను నిరంతరము విలువైన వ్యక్తినని మరియు సువార్త దీవెనలకు అర్హుడినని గుర్తించాను. నా అనర్హత యొక్క భావాలను అధిగమించడానికి మరియు అపరాధికి హృదయపూర్వకంగా క్షమాపణ అందించడానికి రక్షకుడు నాకు సహాయం చేశారు. రక్షకుని ప్రాయశ్చిత్తం నాకు వ్యక్తిగత బహుమానమని, నా పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడు నన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. రక్షకుని ప్రాయశ్చిత్తము కారణంగా, మర్త్యత్వము పనిచేస్తుంది.

ఆ అనుభవాల గుండా రక్షకుడు నన్ను ఎలా రక్షించారో మరియు నాకు ఎలా అండగా నిలిచారో నేను క్రమంగా గుర్తించేలా దీవించబడినప్పుడు, నా యుక్తవయస్సులోని దురదృష్టకర పరిస్థితి నా వ్యక్తిగత ప్రయాణం మరియు అనుభవం అని, ఇతరుల అన్యాయమైన ప్రవర్తనతో బాధపడిన వారిపై మరియు బాధను కొనసాగించే వారిపై దాని తీర్మానం మరియు తుది ఫలితం అంచనా వేయబడదు అని నేను స్పష్టంగా అర్థం చేసుకున్నాను.

జీవితంలోని అనుభవాలు—మంచివి మరియు చెడ్డవి—మనకు ముఖ్యమైన పాఠాలు నేర్పుతాయని నేను గుర్తించాను. మర్త్యత్వము పనిచేస్తుంది అని ఇప్పుడు నాకు తెలుసు మరియు నేను సాక్ష్యమిస్తున్నాను! నా జీవితంలోని—మంచి మరియు చెడు—అనుభవాల మొత్తం ఫలితంగా మరొకరి చర్యల వల్ల బాధితులైన అమాయకుల పట్ల నాకు కనికరము మరియు అణగారిన వారి పట్ల సానుభూతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను.

నా జీవితంలోని—మంచి మరియు చెడు—అనుభవాల ఫలితంగా నేను ఇతరుల పట్ల దయగా ఉంటానని, ఇతరులపట్ల రక్షకుని వలె వ్యవహరించి, పాపి పట్ల ఎక్కువ అవగాహన కలిగి ఉంటానని మరియు నాకు పూర్తి చిత్తశుద్ధి ఉంటుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. మనము రక్షకుని కృపపై ఆధారపడినప్పుడు మరియు మన నిబంధనలను పాటించినప్పుడు, రక్షకుని ప్రాయశ్చిత్తము యొక్క సుదూర ప్రభావాలకు మనం ఉదాహరణగా పని చేయవచ్చు.

మర్త్యత్వము పనిచేస్తుంది అని తెలియజేసే ఒక చివరి ఉదాహరణను నేను పంచుకుంటాను.

ఎల్డర్ హేల్స్ యొక్క అత్త మరియు తల్లి.

ఎల్డర్ హేల్స్ యొక్క అత్త, లోయిస్ వాండెన్‌బోష్ మరియు అతని తల్లి, క్లియా వాండెన్‌బోష్.

మా అమ్మ మర్త్యత్వము గుండా అంత సులభమైన ప్రయాణం చేయలేదు. ఆమెకు ఎటువంటి ప్రశంసలు లేదా ప్రాపంచిక గౌరవాలు లభించలేదు మరియు ఉన్నత పాఠశాలకు మించిన విద్యావకాశాలు లేవు. ఆమె చిన్నతనంలో పోలియో బారిన పడింది, దాని ఫలితంగా జీవితాంతం ఆమె ఎడమ కాలులో నొప్పి మరియు అసౌకర్యం ఏర్పడ్డాయి. యుక్తవయస్సులో, ఆమె చాలా కష్టతరమైన మరియు సవాలుగా ఉన్న శారీరక, ఆర్థిక పరిస్థితులను అనుభవించింది, కానీ ఆమె తన నిబంధనలకు విశ్వాసపాత్రంగా ఉంది మరియు ప్రభువును ప్రేమించింది.

మా అమ్మకు 55 ఏళ్ళున్నప్పుడు మా అక్క చనిపోయింది, ఎనిమిది నెలల పాప అయిన నా మేనకోడలిని తల్లిలేని బిడ్డగా విడిచిపెట్టింది. వివిధ కారణాల వల్ల, తరచు చాలా కష్టమైన పరిస్థితులలో, మా అమ్మ నా మేనకోడలిని తరువాతి 17 సంవత్సరాలు పెంచింది. అయినప్పటికీ, ఈ అనుభవాలు ఉన్నప్పటికీ, ఆమె సంతోషంగా మరియు ఇష్టపూర్వకంగా తన కుటుంబానికి, పొరుగువారికి, వార్డు సభ్యులకు సేవ చేసింది మరియు చాలా సంవత్సరాలు దేవాలయములో విధి సేవకురాలిగా పనిచేసింది. ఆమె జీవితంలోని చివరి కొన్ని సంవత్సరాలలో, అమ్మ ఒక రకమైన మానసిక వైకల్యంతో బాధపడుతూ, తరచుగా గందరగోళానికి గురైంది మరియు స్వతంత్రంగా జీవించలేని స్థితికి పరిమితమైంది. అనుకోకుండా ఆమె మరణించినప్పుడు, దురదృష్టవశాత్తూ ఆమె ఒంటరిగా ఉంది.

ఆమె మరణించిన చాలా నెలల తర్వాత, నేను ఎన్నటికీ మరచిపోలేని ఒక కలగన్నాను. నా కలలో, నేను సంఘ నిర్వహణ భవనంలోని నా కార్యాలయంలో కూర్చున్నాను. అమ్మ కార్యాలయంలోకి ప్రవేశించింది. ఆమె ఆత్మలోకం నుండి వచ్చిందని నాకు తెలుసు. నాకు కలిగిన అనుభూతులను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆమె ఏమీ మాట్లాడలేదు, కానీ నేను ఇంతకు ముందెన్నడూ అనుభూతిచెందని ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఆమె ప్రసరింపజేసింది మరియు దానిని వివరించడం నాకు కష్టంగా ఉంది.

ఆమె ముఖవైఖరి మరియు ఉనికి నిజంగా అద్భుతంగా ఉన్నాయి! ఆమె ఆధ్యాత్మిక శక్తిని మరియు అందాన్ని సూచిస్తూ నేను ఆమెతో, “అమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు!,” అని చెప్పడం నాకు గుర్తుంది. ఆమె మళ్ళీ మాట్లాడకుండా నన్ను అంగీకరించింది. నా పట్ల ఆమెకున్న ప్రేమను నేను అనుభూతిచెందాను మరియు ఆమె తన ప్రాపంచిక చింతల నుండి, సవాళ్ల నుండి సంతోషంగా స్వస్థత పొందిందని మరియు “ఒక మహిమకరమైన పునరుత్థానం” కోసం ఆత్రంగా ఎదురుచూస్తుందని అప్పుడు నాకు తెలుసు. అమ్మ కోసం, మర్త్యత్వము పనిచేసిందని నాకు తెలుసు—మరియు అది మన కోసం కూడా పని చేస్తుంది.

నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే దేవుని కార్యమును మహిమయైయున్నది. మర్త్యత్వం యొక్క అనుభవాలు ఆ అమర్త్యత్వము మరియు నిత్యజీవము వైపు ఎదగడానికి మరియు పురోగమించడానికి మనల్ని అనుమతించే ప్రయాణంలో భాగమైయున్నాయి. మనము విఫలమవడానికి ఇక్కడకు పంపబడలేదు, కానీ మన కొరకైన దేవుని ప్రణాళికలో విజయం సాధించడానికి పంపబడ్డాము.

రాజైన బెంజమిన్‌ బోధించినట్లుగా: “అంతేకాక, దేవుని ఆజ్ఞలను గైకొను వారి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన స్థితిని మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను. ఏలయనగా వారు ఐహికమైన మరియు ఆత్మ సంబంధమైన విషయములన్నిటి యందు ఆశీర్వదింపబడియున్నారు; వారు అంతము వరకు విశ్వాసముతో స్థిరముగా ఉన్న యెడల, వారు పరలోకములోనికి చేర్చుకొనబడి దేవునితో ఎన్నడూ అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు.” మరో మాటలో చెప్పాలంటే, మర్త్యత్వము పనిచేస్తుంది!

మనం సువార్త యొక్క విధులను పొంది, దేవునితో నిబంధనలలోకి ప్రవేశించి, ఆ నిబంధనలను పాటించి, పశ్చాత్తాపపడి, ఇతరులకు సేవ చేసి, అంతము వరకు సహించినప్పుడు, మనం కూడా మర్త్యత్వము పనిచేస్తుందని ప్రభువునందు నమ్మకమును మరియు పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండగలమని నేను సాక్ష్యమిస్తున్నాను! నేను యేసు క్రీస్తు గురించి మరియు మన పరలోక తండ్రితో మన మహిమగల భవిష్యత్తు రక్షకుని దయ మరియు ప్రాయశ్చిత్తం ద్వారా సాధ్యమైందని సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.